Primary health centers
-
జీవో 85ను రద్దు చేయండి
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ఇన్‌సర్వీస్ కోటా కుదింపునకు సంబంధించిన జీవో నంబర్ 85ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీల) వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వానికి ఏపీ పీహెచ్సీ వైద్యుల సంఘం లేఖ రాసింది. ‘నిర్దేశిత పరీక్షకు కేవలం 20 రోజుల ముందు ప్రభుత్వం ఇన్‌సరీ్వస్ కోటాను కుదిస్తూ నిర్ణయం తీసుకుని జీవో 85ను జారీ చేసింది.దీంతో మాకు న్యాయపరమైన మార్గం చూసుకునే అవకాశం లేకుండాపోయింది. జీవో 85పై మేము జూలై 23న వైద్య శాఖ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమరి్పంచాం. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లకు వినతిపత్రాలు సమర్పించాం. గత 50 రోజులుగా మా బాధను చెబుతూనే ఉన్నాం. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఇక దిక్కుతోచని స్థితిలో ఆందోళన బాటపట్టాం. జీవో 85 రద్దు చేసి.. ఇప్పటికే గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు మరిన్ని పీజీ సీట్లు ఇవ్వడం వల్ల మొత్తం ఆరోగ్య వ్యవస్థ బలోపేతం అవుతుంది. మా డిమాండ్లు అన్నింటినీ వెంటనే పరిష్కరించండి’ అని ప్రభుత్వాన్ని పీహెచ్సీ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు శనివారం కూడా తమ నిరసన కొనసాగించారు. పీజీలో ఇన్ సర్వీస్ కోటాను కుదించడాన్ని ఖండిస్తూ జీవో నంబర్ 85ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట వైద్యులు తమ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. -
వంద రోజుల్లో వైద్యులను రోడ్డుపై నిలబెట్టారు
సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం వైద్యులను రోడ్ల మీదకు లాగిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు మండిపడ్డారు. వంద రోజుల్లో గొప్ప కార్యక్రమాలు చేశామని ప్రకటనలు చేసుకుంటున్న ఈ ప్రభుత్వం కోవిడ్‌లో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వైద్యులను అవమానాలకు గురిచేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో పెద్దఎత్తున వైద్యులను నియమించి, పీహెచ్‌సీలను బలోపేతం చేస్తే ఈ ప్రభుత్వం వైద్యులపై వేధింపులకు దిగుతోందన్నారు. వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటా కుదింపునకు సంబంధించిన జీవో 85కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా డీఎంహెచ్‌వో కార్యాలయాల ముందు వైద్యులు శుక్రవారం శాంతియుత నిరసనలు చేపట్టారు. విజయవాడలో నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో వైద్యులందరు తమ జిల్లాలకు గురువారం వెళ్లిపోయినట్లు పీహెచ్సీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ యూనస్‌మీర్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే సోమవారం ఛలో విజయవాడ 2.0 కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు చర్చలు నిర్వహించిన్పటికీ తమ డిమాండ్లు నెరవేరలేదని, మళ్లీ చర్చలకు పిలిచి, డిమాండ్లను నెరవేర్చే వరకూ విజయవాడలో నిరసన తెలుపుతామన్నారు. శుక్రవారం ఉదయం నుంచి డీఎంహెచ్‌వో కార్యాలయాల ముందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులపై కేసులు పెడతామని డీఎంహెచ్వోలు బెదిరించారని చెప్పారు. అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా శనివారం కూడా డీఎంహెచ్‌వోల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులందరూ కలిసి వేధింపులకు పాల్పడిన డీఎంహెచ్‌వోల కార్యాలయాల ముందు పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని తేల్చి చెప్పారు.సమస్యలు పరిష్కరించే వరకు నిరసనప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చత్రప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద డాక్టర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కారంఅయ్యే వరకు శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామన్నారు. -
Fact Check: కళ్లు తెరిచి చూడు రామోజీ..
సాక్షి, అమరావతి: చింతకాయను ఎంత చితక్కొట్టినా.. ఉల్లిపాయను ఎంత ఉడకబెట్టినా వాటి సహజ లక్షణం కోల్పోవు. ఈనాడు రామోజీరావు తీరు కూడా అంతే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పైనా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా ఆయన నిత్యం వెళ్లగక్కుతున్న అక్కసు, చేస్తున్న విషప్రచారంపై ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా ఆయనలో మార్పులేదు.. రాదు. ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై ఆయన పనిగట్టుకుని.. కళ్లు మూసుకుని చెప్పిన అబద్ధాలే చెప్పి రాసిన అబద్ధాలే రాస్తున్నారు కాబట్టి. తాజాగా.. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ఆయన గుండెలు బాదుకున్న తీరు జగన్‌పై రామోజీకున్న అక్కసును మరోసారి చాటిచెప్పింది. రాష్ట్రంలో వంద శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) 24/7 పనిచేస్తున్నాయని స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశంసలు కురిపించినా రామోజీకి వినిపించదు. నాడు–నేడు కార్యక్రమంలో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా పీహెచ్‌సీలు రూపాంతరం చెందాయి. ఈ క్రమంలో దేశంలోనే అత్యధిక పీహెచ్‌సీలకు నేషనల్ క్వాలిటీ అసూ్యరెన్స్ సర్టిఫికేషన్‌తో ఏపీ అగ్రస్థానంలో ఉంది. అయినా, ఆయన విషపుత్రిక ఈనాడుకు అది కనిపించదు. ఎందుకంటే ఆయన లెక్కలు, ఎక్కాలు వేరే. సీఎం జగన్ ప్రభుత్వం మీద విషం చిమ్మడమే ఆయన జెండా.. ఎజెండా. అందుకే ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య రంగం ఎంత మెరుగుపడినా ఆయనకు పట్టదు. నిజానికి.. గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో పీహెచ్సీలంటే నరకానికి నకళ్లు అన్నట్లుగా ఉండేవి. ఒక్క పీహెచ్‌సీలే కాదు.. బోధనాస్పత్రుల వరకూ అన్ని ఆస్పత్రులది అదే దుస్థితి. అయినా, అప్పట్లో రామోజీరావుకు, ఈనాడుకు అంతా పచ్చగా కనిపించేది. ఆ తర్వాత సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టాక.. ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధితో ఆయన ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం అమలు, 53 వేలకు పైగా పోస్టుల భర్తీ, ఇతర విప్లవాత్మక చర్యలతో ప్రభుత్వ వైద్య రంగం రూపురేఖలను సమూలంగా మార్చినప్పటికీ ‘పచ్చ’కామెర్లతో రామోజీరావు కంటికి ఇవేమీ కనిపించడంలేదు. అందుకే ‘వైద్య రంగం బలోపేతమా.. ఎక్కడ?’ అంటూ ఈనాడులో మంగళవారం చేతికొచ్చింది రాసిపారేశారు. పీహెచ్‌సీల్లో అరకొర సేవలతో రోగుల వెతలు అంటూ ప్రభుత్వంపై ఇష్టానుసారం బురదజల్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైద్యరంగంపై అసలు వాస్తవాలు ఏమిటంటే.. సిబ్బంది, వనరులు ఉండటం బలోపేతం కాదా? టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పీహెచ్‌సీల్లో ఒకేఒక్క వైద్యుడు ఉండేవాడు. అతను సెలవుపై వెళ్తే ఇక వైద్యసేవల సంగతి దేవుడెరుగు. మందులు, వైద్య పరీక్షల గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. పీహెచ్‌సీల్లో వైద్య పరీక్షల పేరిట ప్రజాధనాన్ని టీడీపీ పెద్దలు లూటీచేసిన విషయం జగమెరిగిన సత్యం. అప్పట్లో పీహెచ్సీ భవనాలు బూత్‌బంగ్లాలను తలపించేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామీణ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలకు పెద్దపీట వేసింది. ఈ క్రమంలో.. రాష్ట్రంలోని 1,145 పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్‌లతో కలిపి ప్రతిచోట 14 మందిని నియమించారు. వీటిల్లో రూ.664.96 కోట్లతో నాడు–నేడు పనులను చేపట్టారు. 922 పీహెచ్‌సీలకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఇక మరికొన్ని పీహెచ్‌సీలకు కొత్త భవనాల నిర్మాణం వచ్చే నవంబర్ నెలాఖరు నాటికి పూర్తికానున్నాయి. అంతేకాక.. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు లేదా ఒక పీహెచ్సీ/ఒక సీహెచ్‌సీ ఉండేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నూతనంగా 88 పీహెచ్‌సీలు, 63 కో–లోకేటేడ్ పీహెచ్‌సీలు ప్రారంభించారు. నూతన పీహెచ్‌సీలకు ప్రభుత్వం కొత్త భవనాలను నిర్మిస్తోంది. నాడు–నేడులో భాగంగా అన్ని వసతులతో పీహెచ్సీ భవనాలను తీర్చిదిద్దారు. అంతేకాక.. మానవ వనరుల కొరతకు తావులేకుండా ఎప్పటి ఖాళీలను అప్పుడే ప్రభుత్వం భర్తీచేస్తోంది. ప్రతి పీహెచ్సీలో 172 రకాల మందులు, 67 పరీక్షలు నిర్వహించడానికి వీలుగా వైద్య పరికరాలను సమకూర్చడంతో పాటు, పరీక్షలు చేయడానికి అవసరమయ్యే రసాయనాలను ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నారు. ఈ చర్యలన్నీ గమనించినా, పీహెచ్‌సీల్లో వచ్చిన మార్పులు చూసినా రాష్ట్రంలో ప్రాథమిక వైద్యం బలోపేతం అయిందని ఎవరైనా అంగీకరిస్తారు ఒక్క రామోజీ తప్ప. ఎందుకంటే జగన్ అన్నా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్నా ఆయన ఉదరం నిత్యాగ్నిహోత్రంలా ఎప్పుడూ రగిలిపోతూ ఉంటుంది కాబట్టి. 24/7 సేవలపై దిగజారుడు రాతలు.. వంద శాతం పీహెచ్‌సీలను 24/7 నడుపుతున్న కొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని కేంద్ర ఆరోగ్య శాఖ పలుమార్లు తన నివేదికల్లో కొనియాడింది. అయినాసరే.. ఇవేమీ తనకు పట్టవనుకున్న రామోజీ 24 గంటల సేవలు అంతంత మాత్రమేనని దిగజారుడు రాతలు రాశారు. పీహెచ్‌సీలు 24/7 పనిచేసేలా వైద్య, ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. రాత్రి సమయంలో స్టాఫ్ నర్సు సహాయంగా, ఒక లాస్ట్ గ్రేడ్ కేడర్ సిబ్బందిని/ఎఫ్ఎన్ఓను ఉంచడం ద్వారా సేవలు అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే.. ► కర్నూల్ జిల్లా ఆస్పిరి పీహెచ్సీలో 15 రకాల పరీక్షలు మాత్రమే చేస్తున్నారని ఈనాడులో ఆరోపించారు. అయితే, ఈ పీహెచ్సీలో నిర్ధేశించిన అన్ని రకాల మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షల సదుపాయాలున్నాయి. ► విజయనగరం జిల్లా రామభద్రపురం పీహెచ్సీలో ఓపీ, ఇతర సేవలు పడిపోయాయి. ప్రజలు ఇతర ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్నట్టు ఆరోపించారు. అయితే, ఈ పీహెచ్సీలో నెలనెలా సుమారుగా 1,500–1,800 ఓపీలు నమోదవుతున్నాయి. పీహెచ్సీ పరిధిలోని గ్రామాలకు ఫ్యామిలీ డాక్టర్లు నెలలో రెండుసార్లు సందర్శించి అక్కడే ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. 10–20కి.మీ పరిధిలో మూడు సామాజిక ఆసుపత్రులు అందుబాటులో ఉండటంతో ప్రజలు అత్యవసర సేవల కోసం ఆయా ఆస్పత్రులకు వెళ్తున్నారు. 2019 నుంచి వైద్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. ► నాలుగేళ్లలో దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు. ► రూ.16,800 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం. ► గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు.. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్యసేవలు. ► దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ► టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇలా ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం. ► 108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్యసేవలు బలోపేతం. మరో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో కలిపి మొత్తం 2,204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్యసేవలు. ఈ విధంగా మరే ప్రభుత్వంలోనూ లేవు. టీడీపీ హయాంలో కేవలం 108 అంబులెన్స్‌లు 531 మాత్రమే ఉండగా ఇందులో 336 మాత్రమే మనుగడలో ఉండేవి. ► ప్రభుత్వాస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు. -
ముంగిటకే వైద్యం
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పసర్లపూడిలంక గ్రామానికి చెందిన పెదమల్లు సత్య రామానందం పక్షవాతం బాధితుడు. నెలకు ఒకసారి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలతోపాటు మందులు కొనాల్సి రావడం, వ్యయ ప్రయాసలు ఆ నిరుపేద కుటుంబానికి పెనుభారంగా పరిణమించాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ ప్రారంభమయ్యాక వైద్యుడితోపాటు సిబ్బంది తమ ఇంటికే వచ్చి పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారని ఆయన భార్య సత్యవతి తెలిపింది. పేదలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం గ్రామీణ ప్రాంతాలకు ఎంతో ఉప యోగపడుతోందని కృతజ్ఞతలు వ్యక్తం చేసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ రికార్డులు సృష్టిస్తోంది. మూడు నెలల వ్యవధిలో 27 లక్షల మందికి పైగా గ్రామీణ ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్ ఉచితంగా వైద్య సేవలు అందచేయడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. 104 వాహనంతో పాటు డాక్టర్, వైద్య సిబ్బంది విలేజ్ క్లినిక్స్‌ను సందర్శించి గ్రామాల్లోనే సేవలందిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉచితంగా గ్రామాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా అందచేస్తుండటంపై హర్షం వ్యక్తమవుతోంది. పక్షవాతం, నరాల బలహీనతతో నడవలేని వారి ఇళ్లకు స్వయంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్న వారిని కలుసుకుని ఆరోగ్య వివరాలను వాకబు చేస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో మందులు, ర్యాపిడ్ కిట్లు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లను ప్రభుత్వం నియమించింది. 67 రకాల మందులతో పాటు 14 రకాల ర్యాపిడ్ కిట్లను వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో అందుబాటులో ఉంచారు. ప్రత్యేక యాప్ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ అమలవుతున్న విధానాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 12.70 లక్షల మందికి పరీక్షలు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. జీవనశైలి జబ్బులతో పాటు ఇతర వ్యాధులను గుర్తించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 30 సంవత్సరాలు పైబడిన 92 శాతం మందికి స్క్రీనింగ్ పూర్తైంది. మిగతా 8 శాతం మందికి కూడా స్క్రీనింగ్ నిర్వహించేలా ఏఎన్ఎంలు, మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు అదనపు డయాగ్నస్టిక్ కిట్లు సమకూరుస్తున్నారు. -
వైద్య పథకాల అమలుపై కేంద్ర బృందం సంతృప్తి
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో కేంద్ర వైద్యబృందం ఆదివారం పర్యటించింది. ఐదు రోజులపాటు జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆస్పత్రులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ఈ బృందంలోని సభ్యులు సందర్శించనున్నారు. మచిలీపట్నంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని సందర్శించిన బృందం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు, ఆరోగ్యశ్రీ అమలు, రోగులకు కల్పించిన సౌకర్యాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా మంజూరైన నిధులతో అమలు చేస్తున్న పథకాలు రోగులకు ఎలా అందుతున్నాయనేది తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఇందిరాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్ కేంద్ర వైద్యబృందానికి ఇక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలపై వివరించారు. అంతకుముందు మచిలీపట్నంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కేంద్ర బృందానికి డీఎంహెచ్‌వో డాక్టర్ గీతాబాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ బృందంలో డాక్టర్ త్రిపాఠి షిండే, డాక్టర్ ఆసీమా భట్నాగర్, డాక్టర్ రష్మీ వాద్వా, డాక్టర్ అనికేట్ చౌదరి, శ్రీ శుభోధ్ జైస్వాల్, ప్రీతీ ఉపాధ్యాయ, అభిషేక్ దదిచ్ ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర కమిషనరేట్ నుంచి డాక్టర్ దేవి, డాక్టర్ శిరీష, డాక్టర్ రమాదేవి, డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ
వికారాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ (పీహెచ్‌సీలు) ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రజారోగ్య శాఖ డైరెక్ట ర్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 53 రకాల సేవ లు అందించేలా ఏర్పాట్లు చేస్తోందన్నారు. శుక్రవా రం వికారాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ముందుగా ధారూరు, రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. తర్వాత మద్గు ల్ చిట్టెంపల్లి డీపీఆర్సీ భవనంలో వైద్యులు, వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ అధికారులతో సమావేశమై ఆస్పత్రుల పనితీరుపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ చేరే ప్రతి రోగి తరఫున పీహెచ్‌సీకి ప్రభుత్వం రూ.2,100 చెల్లిస్తుం దన్నారు. ఇందులో 35 శాతం డబ్బును పీహెచ్సీలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇస్తుందని, మిగిలిన 65 శాతం నిధులను ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని చెప్పారు. దీంతో పీహెచ్‌సీలు నిధుల కొరతను అధిగమించి బలోపేతం అవుతాయన్నారు. వైద్యుల వాహనాలకు జీపీఆర్ఎస్: క్షేత్రస్థాయి లో పీహెచ్‌సీలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీనివాసరావు చెప్పారు. 750 ఎం బీబీఎస్ వైద్యుల నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుందని తెలిపారు. పీహెచ్‌సీల్లో చేసే ప్రతి సాధారణ కాన్పుకు ప్రభుత్వం రూ.3 వేలు అందజేస్తుందని, ఈ మొత్తం వైద్యులు, సిబ్బందికి ఇన్సెంటివ్ రూపంలో చెల్లిస్తుందన్నారు. దీంతో వైద్యుల్లో ఉత్సాహం పెరిగి నాణ్యమైన సేవలు అం దుతాయన్నారు. వైద్యులు స్థానికంగా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తామన్నారు. స్థానికంగా ఉంటున్నారా..? లేదా నగరానికి వెళ్లి వస్తున్నారా..? అనే వివరాలు తెలుసుకునేందుకు వైద్యుల వాహనాలకు జీపీఆర్ఎస్ అమరుస్తామని చెప్పారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు వైద్యులు, సిబ్బంది పని తీరును పర్యవేక్షించేలా ప్రతి పీహెచ్సీలో 3 సీసీ కెమెరాలు అమరుస్తామని తెలిపారు. ఏడాదిలో ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు మెడికల్ ఆఫీసర్లకు వెహికల్ అలవెన్స్ ఇవ్వనున్నట్టు చెప్పారు. గడిచిన మూడు నెలలుగా రాష్ట్రంలో కోవిడ్ బాగా తగ్గిందని శ్రీనివాసరావు తెలిపారు. రోజుకు 40 లోపు కేసులే నమోదవుతున్నాయని చెప్పారు. -
దేశంలో వైద్య ‘అవ్యవస్థ’
న్యూఢిల్లీ: దేశ జనాభాలో 70 శాతానికి నేటికీ మౌలిక వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చాలా ఊళ్లలో డాక్టర్లుండరు. వాళ్లుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రముండదు. రెండూ ఉంటే సరైన సదుపాయాలుండవు. ఇదీ మన దేశంలో ఆరోగ్య సేవల పరిస్థితి!’’ అన్నారు. సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించారు. ‘‘వైద్య సదుపాయాలను పెంపొందించాలి. పరిశోధనలకు ఊతమివ్వాలి. అవసరమైతే స్వచ్ఛంద సంస్థలతో పాటు కార్పొరేట్లను కూడా భాగస్వాములను చేయాలి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద గ్రామీణ ప్రాంతాల్లో అవి వైద్య సదుపాయాలు అందించేలా చూడాలి. వైద్య వ్యవస్థ మెరుగుకు ఓ రోడ్ మ్యాప్ తప్పనిసరి’’ అన్నారు. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతోందంటూ పలు గణాంకాలు వివరించారు. కుటుంబ, సమాజ, దేశ సంక్షేమంలో కీలక పాత్ర పోషించే మహిళలు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమన్నారు. ‘‘భార్య విలువైనా, తల్లి విలువైనా వారు లేకుండా పోయాకే అనుభవానికి వస్తుంది. మా అమ్మ 80 ఏట కన్నుమూసింది. అయినా ఈనాటికీ అమ్మను మర్చిపోలేకపోతున్నా’’ అన్నారు. ఇల్లాలి ప్రాధాన్యతను ప్రతి కుటుంబమూ గుర్తించాలని సూచించారు. శనివారం ఇక్కడ డాక్టర్ కల్నల్ సీఎస్‌పంత్; డాక్టర్ వనితా కపూర్ రాసిన పుస్తక విడుదల కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు. నిజాయితీగా కష్టపడి పని చేసే డాక్టర్లపై హింస, దాడులు పెరుగుతున్నాయన్నారు. వారిపై తప్పుడు కేసులు పెట్టే ధోరణి ప్రబలుతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. తన కూతురూ డాక్టరే కావడంతో వైద్యుల సమస్యలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ‘‘రోగుల క్షేమం కోసం నిరంతరాయంగా చెమటోడ్చే వైద్యుల స్ఫూర్తిని అభినందిస్తున్నా. వైద్యులంటే మన మిత్రులు, కౌన్సెలర్లు, దిశానిర్దేశకులు. సమాజంలో, ప్రజల సమస్యల పరిష్కారంలో వారిది చురుకైన పాత్ర కావాలి. వారు పని చేసేందుకు మరింత మెరుగైన, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరముంది’’ అని ఆయన అన్నారు. -
వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో 12 రకాల సేవలు
సాక్షి, అమరావతి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు గ్రామంలోనే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రతి 2,500 జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో చిన్న చిన్న జబ్బులకు కూడా 10 కిలోమీటర్ల దూరంలో ఉండే పీహెచ్‌సీకి వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,032 విలేజ్ క్లినిక్‌లు ఉన్నాయి. వీటిలో పని చేయడానికి బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమిస్తున్నారు. ఈ క్లినిక్‌లో 12 రకాల వైద్య సేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్ మెడికిల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంటుంది. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా విలేజ్ క్లినిక్‌లకు పక్కా భవనాల నిర్మాణం, ఉన్న భవనాల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1,692 కోట్లు ఖర్చు చేస్తోంది. విలేజ్ క్లినిక్ నుంచి టెలీ మెడిసిన్ సేవలు సైతం అందుబాటులో ఉంటాయి. సేవలు ఇవీ.. ► గర్భిణులు, చిన్నారుల సంరక్షణకు అవసరమైన వైద్య సేవలు ► నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ సేవలు ► బాల్యం, కౌమార దశ ఆరోగ్య సంరక్షణ సేవలు ► కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధక సేవలు, ఇతర పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సేవలు ► అంటు వ్యాధుల నిర్వహణ.. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ► తీవ్రమైన సాధారణ అనారోగ్యాలు, చిన్న జబ్బులకు జనరల్ అవుట్ పేషెంట్ కేర్ ► అసాంక్రమిక వ్యాధుల స్క్రీనింగ్, నివారణ, నియంత్రణ, నిర్వహణ ► సాధారణ ఆఫ్తాల్మిక్ (కంటి సమస్యలు), ఈఎన్టీ సమస్యల కోసం జాగ్రత్తలు ► ప్రాథమిక నోటి ఆరోగ్య సంరక్షణ ► వృద్ధాప్య వ్యాధులకు చికిత్స, ఉపశమన ఆరోగ్య సంరక్షణ సేవలు ► కాలిన గాయాలకు, ప్రమాదాల్లో గాయపడిన (ట్రామా) వారికి అత్యవసర వైద్య సేవలు ► మానసిక ఆరోగ్య వ్యాధుల స్క్రీనింగ్, ప్రాథమిక నిర్వహణ, అనారోగ్య సమస్యలను జయించడం, మానసిక ప్రశాంతత కోసం రోగులకు యోగాపై అవగాహన కల్పిస్తారు. -
‘సాక్షి’ పరిశీలన: డాక్టర్ సారు.. ఉంటలేడు!
తన కూతురికి తానే వైద్యం చేసుకుంటున్న పరిస్థితి నిర్మల్ జిల్లా పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనిది. ఉదయం 9.30గంటలైనా అక్కడ వైద్య సిబ్బంది లేకపోవడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన కూతురికి తండ్రే డ్రెస్సింగ్ చేసుకున్నారు. 9.45 గంటలకు ల్యాబ్ టెక్నీషియన్ రాగా, పది గంటలకు ఫార్మసిస్టు వచ్చారు. వైద్యుడు, స్టాఫ్‌నర్సు శిక్షణకు వెళ్లడంతో రోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఇదే మండలం పస్పుల గ్రామానికి చెందిన బాలిక రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం రాగా, సిబ్బంది లేకపోవడంతో తండ్రే మందు పూసి కట్టుకట్టాడు. ►కోయిలకొండ మండలానికి చెందిన అంబటిదాస్చౌహన్ భార్య ఊట్కూర్ మండలం రాంరెడ్డిగూడెంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం మధ్యాహ్నం భార్యాబిడ్డలను చూసి మహబూబ్‌నగర్‌కు వస్తున్న క్రమంలో గోప్లాపూర్ సమీపంలోని రహదారిపై అంబటిదాస్ బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం దేవరకద్ర పీహెచ్‌సీకి తెచ్చారు. అక్కడ డాక్టర్ సెలవులో ఉండటంతో సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. పది నిమిషాలపాటు బాధితుడిని ఆటోలో ఎండలోనే ఉంచారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భగవంత్ రెడ్డి బాధితుడిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి పంపించారు. గాయాలపాలైన అతడిని అంబులెన్స్‌లో ఎక్కించే సమయంలో సిబ్బంది కనీసం ప్రథమ చికిత్స కూడా చేయకుండా కేవలం రెండు ఇంజెక్షన్లు ఇచ్చి పంపించారు. అంబటిదాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ►పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన పేరు మహ్మద్ అలీ. ఈ నెల 20న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తీవ్రమైన రక్తస్రావంతో కరీంనగర్‌లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అక్కడున్న నర్సులు రక్తం తుడిచి కుట్లు కుట్టి సూదిమందు ఇచ్చారు. వారే మందులు ఇచ్చారే కానీ డాక్టర్ ఎవరూ రాలేదు. ఉదయం 11 గంటల తర్వాత గానీ డాక్టర్ వచ్చిన పాపాన పోలేదని ఆయన కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. సాక్షి, నెట్వర్క్/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) మొదలు ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల వరకు ఇదే తంతు. డాక్టర్లు హాజరుకాకపోవడం, వచ్చినా సకాలంలో రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని రోగులు వాపోతున్నారు. కొందరు వైద్యులు సొంతంగా ప్రైవేట్ క్లినిక్‌లు పెట్టుకోగా, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తూ ప్రభుత్వ వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుస్తీ చేసిందని వస్తే బాగుచేసే వారే ఉండ టం లేదంటున్నారు. కొందరు డాక్టర్లయితే హైదరాబాద్‌లోనే ఉంటూ నిజామాబాద్, మెదక్, మహ బూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు వెళ్లి వస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో వైద్యులు విధులకు హాజరయ్యే తీరుపై ‘సాక్షి’మంగళవారం జరిపిన పరిశీలనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వారానికి ఒకట్రెండు రోజులు వైద్య ఆరోగ్యశాఖ వర్గాల లెక్కల ప్రకారం వారానికి రెండ్రోజులు మాత్రమే విధులకు హాజరయ్యే డాక్టర్లు దాదాపు 50% మంది ఉంటారు. మరీ ముఖ్యంగా పీహెచ్‌సీలకు వెళ్లే డాక్టర్లయితే వారానికి ఒకసారి వెళ్లేవారే ఎక్కువ. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు గగనమయ్యాయని బాధితులు వాపోతున్నారు. సర్కారు వైద్యంపై నమ్మకం లేకుండా పోతోందని అంటున్నారు. వైద్యులు ఎప్పుడొస్తారో... ఎప్పుడు వెళ్తారో తెలియక చాలామంది సర్కారు ఆసుపత్రులకు రావడానికి జంకుతున్నారు. వైద్యాధికారుల హాజరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరాలు చాలాచోట్ల పనిచేయడంలేదు. కొన్నిచోట్ల వైద్య సిబ్బందే వాటిని పనిచేయకుండా చేసినట్లు సమాచారం. వీరి విధులను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ఇటీవల ఆస్పత్రులను విజిట్ చేసిన దాఖలాల్లేవు. అదీగాక విధులకు ఎగనామం పెడుతున్న వైద్యులపై కనీస చర్యల్లేవని అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో... కరీంనగర్ జిల్లా ఆçస్పత్రితోపాటు హుజూరాబాద్, జమ్మికుంట ఏరియా ఆస్పత్రులు, 18 పీహెచ్‌సీలు, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడా కూడా వైద్యులు సకాలంలో రావట్లేదు. వైద్యులు 11 గంటలకు వచ్చి ఒంటి గంటకే వెళ్లిపోతున్నారు. ►కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ గదుల్లో కూర్చొని రోగులను చూడాల్సి ఉన్నా అమలుకావడం లేదు. సీనియర్ డాక్టర్లు కేవలం ఇన్‌పేషంట్‌గా చేరిన వారినే పరీక్షించి వెళ్లడం పరిపాటిగా మారింది. కొందరు వైద్యులైతే వారంలో రెండు మూడు రోజులు మాత్రమే హాజరై. రిజిస్టరులో వారం రోజులు హాజరైనట్లు సంతకాలు చేస్తున్నారు. ►పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలోని పీహెచ్సీలో ఉదయం 9 గంటల నుంచే వైద్యసేవలు అందించాల్సి ఉండగా, వైద్యులు 10.30 గంటలకు చేరుకున్నారు. ఉదయం 9.30 గంటలకు కేవలం ఫార్మసిస్టు, ఎన్సీడీ, ఒక్క స్టాఫ్ నర్స్ మాత్రమే ఉన్నారు. జిల్లాలో ఉన్న దాదాపు అన్ని పీహెచ్‌సీల్లో ఇదే దుస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో... ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు సామాజిక ఆసుపత్రుల్లో వైద్యులు కొరత ఉంది. పని చేస్తున్న వారు సైతం సమయానికి రావడం లేదు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో గిరిజన ప్రాంతాల్లో పని చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉన్నవారితోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా... సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం 93 ప్రభుత్వాస్పత్రులు ఉన్నాయి. ఇందులో 3 జిల్లా కేంద్ర ఆస్పత్రులు, మిగతావి పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, అర్బన్ పీహెచ్సీ, సీహెచ్‌సీలున్నాయి. ‘సాక్షి’ బృందం 66 ఆస్పత్రులను విజిట్ చేసింది. వైద్యులు సమయానికి విధులకు రాకపోవడంతో పేదలకు వైద్యం అందట్లేదు. నర్సులు, కింది స్థాయి సిబ్బంది మందుబిళ్లలు ఇచ్చి పంపుతున్నారు. ►సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియాస్పత్రిలో బయోమెట్రిక్ ఏళ్లుగా పనిచేయడంలేదు. దీంతో పనిచేసే వారు ఎప్పుడు వస్తున్నారో... ఎప్పుడు వెళ్తున్నారో అడిగే నాథుడే లేరు. ►సంగారెడ్డి జిల్లాలోని మారుమూల మండలం పుల్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉదయం 11 దాటినా వైద్యులెవరూ రాకపోవడంతో రోగులు తీవ్ర నిరాశతో తిరిగి వెనుదిరిగారు. ఒక్క నర్సే విధులకు హాజరయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా... వరంగల్ జిల్లా నెక్కొండ పీహెచ్‌సీకి వైద్యాధికారితోపాటు ఇతర సిబ్బంది వరంగల్ నుంచి రోజూ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి వెళ్తుంటారు. వీరు 9 గంటలకు రావాల్సి ఉండగా రైలు రాకపోకలతో వారు వచ్చే సమయం 10 దాటుతుంది. అందుకే రోగులూ పది దాటాకే వస్తున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విధులకు వచ్చారు. ►వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే రోగులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ చికిత్స అందిస్తుంటారు. మంగళవారం ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యులు అర్ధగంట ఆలస్యంగా వచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ విధులకు హాజరు కాలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా... మహబూబ్‌నగర్ జిల్లాలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆస్పత్రుల్లో మినహాయిస్తే ఇతరచోట్ల ఎక్కడా వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. జనరల్ ఆస్పత్రిలో సీనియర్లు ఆలస్యంగా వచ్చి.. త్వరగా వెళ్లిపోతున్నారు. దీంతో హౌస్సర్జన్లపైనే భారం పడుతోంది. ►వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో పలు పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్ పనిచేయడం లేదు. ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిలో న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలకు చెందిన డాక్టర్లు ఉదయం 11 గంటల వరకు కూడా రాలేదు. దీంతో చాలామంది రోగులు గంటల తరబడి వేచిచూసి వెనుదిరిగారు. మధ్యాహ్నం 12కు కూడా తాళం వేసి ఉన్న కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పీహెచ్సీ ఇన్ పేషెంట్ వార్డు ►సత్తుపల్లి ఏరియా ప్రభుత్వాస్పత్రిలో 21 మంది వైద్యులకు 9 మంది విధుల్లో ఉన్నారు. మిగతా 12 మంది చాలాకాలంగా గైర్హాజరవుతున్నారు. వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్ మిషన్‌ను వాడట్లేదు. జాతీయ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాల్లో గాయపడే వారు చికిత్స కోసం వస్తే అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ ఉండడంలేదు. ఆయన దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్ప త్రిలో కొందరు ఆలస్యంగా వస్తున్నారు. మెడికల్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్లు, అసోసి యేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో కొందరు ఆలస్యంగా వస్తున్నారు. రామన్న పేటలో ఉదయం 10:30కు కూడా సిబ్బంది లేక ఖాళీగా గైనకాలజీ క్లినిక్ ►తుంగతుర్తిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 10:30 గంటల వరకు కూడా ఎక్స్‌రే గదికి తాళం తీయలేదు. సూర్యా పేట జనరల్ ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ విభాగం, జనరల్ మెడిసిన్ వైద్యులు ఉదయం 8 గంటలకు రావాల్సి ఉండగా 10.30 గంటల తర్వాత వచ్చారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని గైనకాలజిస్టు వైద్యులు ఏ ఒక్కరూ ఉదయం 11 వరకు అందుబాటులో లేరు. దీంతో గర్భిణులు గంటల తరబడి ఎదురు చూశారు. ►సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పీహెచ్సీలో డాక్టర్ మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. ఆస్పత్రిలో బయోమెట్రిక్ పనిచేయడంలేదు. డాక్టర్లు ఆలస్యంగా వస్తున్నారు నేను ఉదయం 9 గంటలకు పెద్దాసుపత్రికి వచ్చాను. జ్వరం బాగా వచ్చింది. తొందరగా చూపించుకొని వెళ్దామంటే డాక్టర్ 11.30కు వచ్చారు. టెస్టులు రాసిస్తే, చేసుకొని వచ్చే సరికి డాక్టర్ వెళ్లిపోయాడు. 1.30 గంటలకు కొత్త డాక్టర్ పరీక్షల చిట్టి చూసి మందులు రాశారు. – లక్ష్మీ, కరీంనగర్ ఎప్పుడొచ్చినా సారు ఉంటలేడు నేను గర్భవతిని. కడుపులో నొప్పి అనిపిస్తే ఉదయం 9.30 గంటలకు పిట్టబొంగరంలోని దావఖానకు అచ్చిన. అచ్చినప్పటి నుంచి డాక్టర్ సారు లేడు. పది దాటినంక ఒక్కొక్కరు వచ్చారు. అయినా సారు రాలేదు. నొప్పి భరించలేక లోపలికి వెళ్లి సిస్టరమ్మకు చెబితే మందులిచ్చింది. ఇక్కడికి ఎప్పుడు వచ్చిన డాక్టర్ కనిపించడు. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. – కినక శశిక, పిట్టబొంగరం, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా -
19 రాష్ట్రాలకు రూ. 8 వేల కోట్ల నిధులు విడుదల
న్యూఢిల్లీ: ఆరోగ్య విభాగం 19 రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు నిధులను విడుదల చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు నిధులు వినియోగించనున్నారు. వీటికి సంబంధించి మొత్తం రూ.8,453.92 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ. 488 కోట్లు విడుదల చేశారు. తెలంగాణ సహా 9 రాష్ట్రాల నుంచి ఇంకా ప్రతిపాదనలు అందలేదు. అయితే ప్రతిపాదనలు అందిన తర్వాత ఆ రాష్ట్రాలకు కూడా నిధుల విడుదల చేయనున్నారు. చదవండి: (సజ్జనార్ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో..) -
ఆరోగ్యసేవల అనుసంధానం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆరోగ్యశాఖలో సమగ్ర ఆరోగ్య వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిస్టం) రూపుదిద్దుకుంటోంది. వైద్యసేవల్ని అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల రోగికి సంబంధించిన సమాచారం పక్కాగా ఒకే చోట లభిస్తుంది. తద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. తొలిదశలో ఈనెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 104 సర్వీసులను అనుసంధానం చేయనున్నారు. ఈ మూడు సర్వీసుల్లో ఎక్కడకు వెళ్లినా రోగి పూర్తి సమాచారం ఉంటుంది. 104 వాహనాల్లో రక్తనమూనాలు పరిశీలించిన వివరాలు సైతం దీన్లో నమోదు చేస్తారు. ఉదాహరణకు 104 వాహనంలో సేవలు పొందాక ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుంది. అప్పుడు రోగికి ఇచ్చిన ప్రత్యేక కోడ్‌ను క్లిక్ చేయగానే, నెట్వర్క్ ఆస్పత్రిలో సైతం గతంలో బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏ తేదీల్లో చూపించుకున్నారు.. ఇలా మొత్తం సమాచారం వెల్లడవుతుంది. ప్రస్తుతం దేశంలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. 1,149 పీహెచ్‌సీలు, 104 వాహనాలు 676 ప్రస్తుతం రాష్ట్రంలో 1,149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. 104 వాహనాలు 676 సేవలందిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పరిధిలో 800కు పైగా నెట్వర్క్ ఆస్పత్రులున్నాయి. ఈ మూడు సర్వీసులను కలిపి రోగుల డేటాను ఒకే వేదికపై ఉంచుతారు. ఇప్పటికే క్యూ ఆర్ కోడ్‌తో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులో గానీ, లేదా ప్రత్యేక కోడ్ నంబరు ఇవ్వడం ద్వారా గానీ సమాచారం తెలుసుకోవచ్చు. వాహనంలో చికిత్సలు పొందినా, పీహెచ్సీలో వైద్యం పొందినా.. ఈరెండూ కాకుండా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లినా రోగి గతంలో తీసుకున్న చికిత్సల వివరాలన్నీ వస్తాయి. దీనివల్ల రోగి పూర్వాపరాలు తెలుసుకోవడంతో పాటు తక్షణమే చికిత్స చేయడానికి వీలుంటుంది. బ్లడ్‌గ్రూపు వివరాలు కూడా ఉంటాయి కాబట్టి అత్యవసర సమయాల్లో ఆలస్యం జరగకుండా ఉంటుంది. ఈ మూడు సర్వీసులను అనుసంధానించే ప్రక్రియను ఈనెలాఖరు నాటికి పూర్తి చేయాలని కుటుంబ సంక్షేమశాఖ భావిస్తోంది. తర్వాత మిగిలినవన్నీ.. ఈ మూడు సర్వీసులు అనుసంధానం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,051 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 195 సామాజిక ఆరోగ్య కేంద్రాలను వీటికి లింక్ చేస్తారు. తరువాత ఏరియా ఆస్పత్రుల వరకు అనుసంధానం చేస్తారు. దీంతో రాష్ట్రంలో ఒక పేషెంటు ఏ ఆస్పత్రికి వెళ్లినా అతడి సమస్త సమాచారం ఒక కోడ్ నంబరు క్లిక్ చేస్తే వస్తుంది. ఇలా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల రోగికి తక్షణమే వైద్యం అందించడంతో పాటు సరైన వైద్యం అందించే వెసులుబాటు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ సేవలు ఈనెలాఖరుకల్లా ఆరోగ్యశ్రీ, పీహెచ్‌సీలు, 104 సర్వీసుల అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. క్రమంగా మిగతా ఆస్పత్రులనూ ఒకే గొడుగు కిందకు తెస్తాం. దీనివల్ల రోగులకు ఉపయోగమే కాదు, వైద్యులకు కూడా చికిత్సలు సులభతరమవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చికిత్స అనంతరం ఇంటివద్దకే వెళ్లి మందులు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సేవలను ఉన్నతీకరిస్తున్నాం. – కాటమనేని భాస్కర్,కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ -
రాష్ట్రానికి 20 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
సాక్షి అమరావతి: థర్డ్ వేవ్ వచ్చినా దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది. పీహెచ్‌సీల స్థాయి నుంచే ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 20 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు చేరుకున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల వాటి పనితీరును పర్యవేక్షించారు కూడా. వీటితో పాటు కీలక పాత్ర పోషించే డి టైప్ సిలిండర్లను కొనుగోలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 27,311 డి టైప్ సిలిండర్లు చేరుకున్నాయి. మెడికల్ గ్యాస్ పైప్లైన్ల ఏర్పాట్లు సాగుతున్నాయి.146 ఆస్పత్రులకు 6,151 ఆక్సిజన్ బెడ్లకు అవసరమైన పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మూడు ఆస్పత్రులకు సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్) కింద ప్రైవేటు సంస్థలు చేయూతనిస్తుండగా, 143 ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. ఇవి కాకుండా ఆక్సిజన్ సరఫరాకు శాశ్వత ప్రాతిపదికన పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవి పూర్తయితే భవిష్యత్తులో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లతో అవసరం ఉండదు. -
థర్డ్‌వేవ్‌కు ఇలా సిద్ధం కండి!
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే ముగుస్తున్న తరుణంలో.. మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలకు మరోసారి సూచనలిచ్చింది. రాష్ట్రాల్లో జిల్లా స్థాయి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకూ అవసరమయ్యే మౌలిక వసతులను, వాటికయ్యే వ్యయం వంటి వాటిని సూచించింది. మొత్తంగా రూ. 8,261.45 కోట్లను కోవిడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ కింద విడుదల చేస్తున్నట్టు చెప్పింది. రాష్ట్రాలు తమ వాటాగా 40 శాతం, కేంద్రం 60 శాతం వ్యయం భరిస్తుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా టెలీ కన్సల్టెన్సీ సేవలను భారీగా పెంచాలని, రోజుకు 5 లక్షల మందికి సేవలను అందించాలని సూచించింది. ఏర్పాట్లపై కేంద్రం ఏం చెప్పిందంటే..? ► దేశవ్యాప్తంగా 8,800 ఏఎల్ఎస్ (అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్) అంబులెన్సులు ఏర్పాటు చేసుకోవాలి. వీటికి నెలకు రూ.2 లక్షల వరకూ చెల్లించాలి. 9 నెలల వరకు ఈ వాహనాలకు అయ్యే వ్యయం కేంద్రం చెల్లిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రాలు చెల్లించాలి. కోవిడ్ పేషెంట్లకే ఈ వాహనాలు ఉపయోగించాలి. ► అన్ని రాష్ట్రాల్లో కలిపి 1,050 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంక్‌లకు అనుమతి ఇచ్చాం. ఒక్కో యూనిట్ వ్యయం రూ. 20 లక్షలు అవుతుంది. దీంతో పాటు ఎంజీపీఎస్ (మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ సిస్టం) కూడా రూ.60 లక్షల వ్యయంతో ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ► రోజుకు దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి ఇ–సంజీవని కింద ఔట్‌పేషెంటు సేవలు అందించాలి. మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైతే చికిత్సకు వసతులు లేవో వారికి ఈ సేవలు అందించాలి. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో ఇ–సంజీవని సేవలు జరుగుతున్నాయి. ► 540 జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ఒక్కో యూనిట్లో 42 పడకలు ఉంటాయి. ఇందులో 12 పడకల ఐసీయూ యూనిట్ కూడా ఉంటుంది. మరో 196 జిల్లాల్లో 32 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఉంటాయి. ఇక్కడ 8 పడకల ఐసీయూ వార్డు ఉంటుంది. ► దేశవ్యాప్తంగా 10 లక్షల కోవిడ్ ఐసొలేషన్ పడకలు ఏర్పాటవుతున్నాయి. వీటిలో 20 % కేవలం పీడియాట్రిక్ పడకలే ఉండాలి. ► ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6 పడకలు, సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో 20 పడకలు ఏర్పాటు చేయాలి. దీంతో పాటు నిర్ధారణ పరీక్షలు కూడా చేయాలి. ఈ కేంద్రాల్లో టెలీ కన్సల్టేషన్ సర్వీసులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. సన్నద్ధతలో ఏపీ ముందంజ.. కోవిడ్ థర్డ్ వేవ్ వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లనూ చేసుకోవడం మొదలుపెట్టింది. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. థర్డ్ వేవ్ కోసం కోవిడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్‌లో భాగంగా ఏపీకి రూ. 696 కోట్ల మేర కేంద్రం అంచనా వేసింది. అందులో 60 శాతం కేంద్రం, 40 % రాష్ట్రం భరించనున్నాయి. రూ. 101.14 కోట్ల వ్యయంతో 14 జిల్లా ఆస్పత్రులు, 11 బోధనాస్పత్రుల్లో పీడియాట్రిక్ కేర్ యూనిట్లను ప్రారంభించనున్నారు. అలాగే రూ. 188.72 కోట్ల వ్యయంతో మరో 28 ఏరియా ఆస్పత్రుల్లో 40 లెక్కన 1,120 ఐసీయూ పడకలు శరవేగంగా ఏర్పాటవుతున్నాయి. రూ. 5 కోట్లతో గుంటూరు లేదా విజయవాడలో చిన్నపిల్లలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ప్రారంభిస్తారు. రూ. 185 కోట్ల ఖర్చుతో 1,145 పీహెచ్‌సీల్లో, 208 సీహెచ్‌సీల్లో పడకలు ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్ మేనేజ్మెంట్ నిర్వహణలో భాగంగా 14 చోట్ల 50 పడకలు లేదా 100 పడకల ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తారు. 100 పడకల ఆస్పత్రికి రూ. 7.5 కోట్లు, 50 పడకల ఆస్పత్రికి రూ. 3.5 కోట్లు ఖర్చవుతుంది. రూ. 8.38 కోట్ల వ్యయంతో టెలీమెడిసిన్‌ను బలోపేతం చేస్తారు. ప్రతి ఆస్పత్రిలో అత్యవసర మందుల బఫర్ స్టాకు కోసం జిల్లాకు రూ.కోటి ఖర్చు చేయనుంది. కోటి ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం రూ.50 కోట్లు కేటాయిస్తారు. కోవిడ్ సేవలకు గానూ 2,089 మంది పీజీ వైద్య విద్యార్థులు, 2,890 మంది ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారు, 1,750 మంది ఎంబీబీఎస్ చదువుతున్న వారు, 2వేల మంది నర్సింగ్ విద్యార్థులను 4 నెలల ప్రతిపాదికన నియమిస్తారు. వీరికి వేతనాల కింద రూ.80.12 కోట్లు ఖర్చవుతుందని అంచనా. -
డాక్టర్లపై నిఘా..
సాక్షి, హైదరాబాద్: వైద్య సిబ్బందిపై నిఘా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది సకాలంలో ఆసుపత్రులకు వెళ్లేలా, రోగు లకు వైద్యం చేసేలా పర్యవేక్షణ చేయాలని భావిస్తోంది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీ హెచ్‌సీ) సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. తద్వారా హైదరాబాద్ నుంచే సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించ డానికి మార్గం ఏర్పడనుంది. వైద్య సిబ్బంది సకాలంలో ఆసుపత్రికి వస్తు న్నారా లేదా అని పర్యవేక్షించి, అవసరమైతే అప్ర మత్తం చేయడానికి వీలు కలగనుంది. ఇవే కీలకం.. రాష్ట్రంలో వెయ్యి పీహెచ్‌సీలు, యూపీ హెచ్సీలున్నాయి. ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లు వేయడానికి, ఇతర సాధారణ వైద్యం అందజేయడానికి ఇవి ఎంతో కీలకం. దాదాపు ప్రతీ మండలానికో పీహెచ్సీ ఉంటుంది. పెద్ద మండలాలైతే 2 పీహెచ్‌సీలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీహెచ్‌సీల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. సీజనల్ వ్యాధుల కాలంలో పీహెచ్‌సీలు కీలకపాత్ర పోషిస్తాయి. అంటువ్యాధులు తీవ్రమైన సందర్భంలో తక్షణ మే స్పందించేలా పీహెచ్‌సీలు వ్యవహరిస్తాయి. ఒక్కో పీహెచ్‌సీల్లో ఒకరు లేదా ఇద్దరు డాక్టర్లుం టారు. నర్సులు, ఇతర సిబ్బంది ఉంటారు. వైద్యుల గైర్హాజరు.. పీహెచ్‌సీల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు స్థానికం గా ఉండటం లేదన్న విమర్శలున్నాయి. సమీప పట్టణాల్లో నివాసముంటూ పీహెచ్‌సీలకు వస్తూ పోతూ ఉంటారు. వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే వచ్చేవారు ఎక్కువగా ఉంటా రని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కొందరు డాక్ట ర్లయితే దాదాపు రోజుకు వంద కిలోమీటర్లకు పైగా వెళ్లే వారుంటున్నారు. హైదరాబాద్‌లో ఉం టూ నిజామాబాద్ జిల్లాలోని పీహెచ్‌సీలకు వెళ్లే వైద్యులూ ఉన్నారని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల సమాచారం. వీరు పట్టణాల్లో ప్రైవేట్ ప్రాక్టీసు చేస్తుండటంతో పీహెచ్‌సీలకు రావడంలేదన్న విమర్శలున్నాయి. ఒకవేళ వచ్చినా ఉద యం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకే వెళ్లిపో తున్నారన్న ఫిర్యాదులు గ్రామాల నుంచి ప్రభు త్వానికి అందాయి. అందుకే వారి కదలికలపైనా ఎప్పటికప్పుడు నిఘా పెట్టేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు.. ఇక హైదరాబాద్ కోఠిలోని ప్రజారోగ్య కార్యాల యంలో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచే అన్ని పీహెచ్‌సీలకు అను సంధానం చేశారు. కంట్రోల్ రూంలో భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఒకేసారి అన్ని పీహెచ్ సీల వైద్యులతో నేరుగా మాట్లాడి అవసరమైన ఆదేశాలివ్వొచ్చు. ఎక్కడైనా అంటు వ్యాధుల వం టివి తీవ్రంగా విజృంభిస్తే ఇక్కడి నుంచే వైద్యు లకు సూచనలిస్తారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎం లతోనూ మాట్లాడే వీలు కల్పించారు. అవసర మైతే జూమ్ మీటింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయి కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పా టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రజారోగ్య కార్యాలయాన్ని అన్ని రకాల హైటెక్ హంగులతో సిద్ధం చేశారు. నిత్యం వచ్చే విజిట ర్లను డైరెక్టర్ నేరుగా కలవకుండానే బయట నుంచే వీడియోకాల్ ద్వారా మాట్లాడే సదుపా యం ఏర్పాటు చేశారు. కరోనా కాలంలో కార్యా లయం లోపలికి వచ్చి జనం గుమిగూడకుండా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజారోగ్య కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద లాకింగ్ సిస్ట మ్ను ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఆదేశాల మేరకే ఎవరినైనా పంపడానికి వీలుంది. -
ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యాన్ని మరింత చేరువ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పెంచి నాణ్యమైన వైద్య సేవలను పల్లె ముంగిటకే తెచ్చేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ఆరోగ్య ఉపకేంద్రాలను బలోపేతం చేయడం, గ్రామ సచివాలయాల్లో ఏఎన్ఎంల నియామకం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటే దూరం భారం కాకూడదని, నడిచి వెళ్లేంత సమీపంలోనే ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీహెచ్‌సీల సంఖ్య పెంచితే గ్రామీణులకు మరింత సులువుగా వైద్యసేవలు లభిస్తాయని భావిస్తోంది. ఒక్కో పీహెచ్‌సీకి రూ.4 కోట్లు వ్యయం ► రాష్ట్రంలో 671 మండలాలు ఉన్నాయి. ► ప్రస్తుతం రాష్ట్రంలో 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ► కొత్తగా మరో 142 పీహెచ్‌సీలు వస్తాయని అంచనా. ► గిరిజన ప్రాంతాల్లో మండలంలో ఇప్పటికే రెండు పీహెచ్‌సీలున్నా అవసరాన్ని బట్టి మరింతగా పెంచేందుకు వెసులుబాటు ► తాజా అంచనాల ప్రకారం.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరు పీహెచ్‌సీలు అందుబాటులోకి వస్తాయి. ► ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సుమారు రూ.4 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ► వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు రూపొందించి ఆర్థిక శాఖకు పంపాక వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలు ఉంటాయి. వైద్యులు 24 గంటలూ అందుబాటులో.. ► ఇప్పటికే ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు నర్సులు విధిగా ఉండాలని సర్కార్ నిర్ణయించింది. ► ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు ఒకరు, 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒకరు ఓపీ చూస్తారు. ► రాత్రి 8 గంటల తర్వాత అత్యవసర సేవల్లో భాగంగా ఫోన్ చేస్తే ఆస్పత్రికి వచ్చి వైద్యం అందించాలి. ► ఒక ఫార్మసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటారు. ► 104 వాహనం నెలలో ప్రతి పల్లెకూ వెళ్లి ఆ గ్రామాల్లో ఉన్నవారి వైద్యంపై వాకబు చేస్తుంది. -
పీహెచ్‌సీలు 24 గంటలూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం కోసం ఇప్పటికే పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యానికి వెన్నుదన్నుగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నిటినీ ఇకపై 24 గంటలూ పనిచేయించాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల వారు అనారోగ్యంతో ఏ సమయంలో వచ్చినా 24 గంటలూ వైద్యులను అందుబాటులో ఉంచనుంది. ఇప్పటివరకు 24 గంటలూ పనిచేసే పీహెచ్‌సీలు 520 మాత్రమే ఉండగా.. ఇప్పుడు మరో 625 పీహెచ్‌సీలను కలిపి మొత్తం 1,145ను 24 గంటలూ పనిచేసేలా మార్చనుంది. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. సేవలు నిరంతరం అందుబాటులో.. –ప్రస్తుతం చాలా పీహెచ్‌సీలకు ఒకే డాక్టర్ ఉండగా ఇకపై ప్రతి పీహెచ్‌సీకి షిప్టులవారీగా ఇద్దరు డాక్టర్లు ఉంటారు. –రోజుకు 12 గంటలపాటు ఔట్‌పేషెంట్ సేవలు అందుబాటులో ఉంటాయి. –రాత్రి 8 గంటల తర్వాత ఎవరైనా బాధితుడు పీహెచ్‌సీకి వచ్చి ఫోన్ చేస్తే డాక్టర్ రావాల్సి ఉంటుంది. దీన్నే ఆన్ కాల్ అంటారు. –ప్రతి పీహెచ్‌సీకి ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉంటారు. వీళ్లు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు. –పాముకాటు లేదా కుక్కకాటు వల్ల ఎవరైనా అర్ధరాత్రో, అపరాత్రో ఆస్పత్రికి వచ్చి ఫోన్ చేసినా 10 నిమిషాల్లోనే వైద్యులు రావాల్సి ఉంటుంది. –170 రకాల మందులను ప్రతి పీహెచ్సీలో అందుబాటులో ఉంచుతారు. –దీనివల్ల పేద రోగులకు మందుల ఖర్చులు బాగా తగ్గిపోతాయి. –మండలానికొక అంబులెన్స్ ఉండటం వల్ల రవాణా సౌకర్యం కూడా 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. –ప్రతి పీహెచ్‌సీకి 104 వాహనం అనుసంధానం చేసి ఉంటుంది. ప్రతి గ్రామానికి ఈ వాహనం వెళ్లి ఉచితంగా మందులు ఇస్తుంది. -
ర్యాపిడ్‌లో రిపోర్టుల సమస్య
సాక్షి, హైదరాబాద్: ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ), బస్తీ దవాఖానాల్లో మొత్తం 300 చోట్ల ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. రోజుకు 10 వేల వరకు యాంటిజెన్ టెస్టులు చేసేలా ఏర్పాట్లు చేయడంతో కరోనా నిర్ధారణ మరింత అందుబాటులోకి వచ్చింది. అరగంటలోపే ఫలితం వస్తుండటంతో వాటివైపే జనం మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఐసీఎంఆర్ నిర్దేశిత లేబొరేటరీల్లో నిర్వహించే ఆర్టీ–పీసీఆర్ పరీక్షల పట్ల బాధితులు విముఖత చూపుతున్నారు. ఆర్టీ–పీసీఆర్ పరీక్ష కోసం ప్రభుత్వ, ప్రైవేటు లేబరేటరీలకు వెళ్లడం, వేచి చూడటం ప్రయాసగా మారింది. నాలుగైదు రోజుల నుంచి వారం వరకు ఫలితం కోసం ఎదురుచూడటం ఇబ్బందిగా మారింది. లక్షణాలు అధికం గా ఉన్నవారికి అన్ని రోజులు వేచిచూడడం వల్ల వైరస్ ముదిరే ప్రమాదముంది. యాంటిజెన్ టెస్టు లు ఇప్పటికే దాదాపు 30 వేల వరకు చేసినట్లు అంచనా. ఈ పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల యాంటిజెన్ కిట్లను తెప్పించిన సంగతి తెలిసిందే. తక్షణం రిపోర్టులు ఇవ్వకపోవడంపై ఫిర్యాదులు యాంటిజెన్ టెస్టులు చేసి తక్షణమే పాజిటివ్ లేదా నెగెటివ్ వచ్చినట్లు చెప్పేస్తున్నారు. కానీ, వెంటనే ఎలాంటి రిపోర్టులు ఇవ్వడంలేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు నారాయణ అనే ఒక ప్రైవేట్ ఉద్యోగికి తీవ్రమైన కరోనా లక్షణాలున్నాయి. దీంతో సమీపంలోని బస్తీ దవాఖానాలో యాంటిజెన్ టెస్ట్ చేయించుకున్నాడు. అరగంటలోపే ఆయనకు పాజిటివ్ అని చెప్పారు. రిపోర్టు ఇవ్వండని అడిగితే తర్వాత ఫోన్ చేస్తామని, అప్పటికప్పుడు రిపోర్టు ఇవ్వడం కుదరదని చెప్పేశారు. కానీ ఆయనకు తీవ్రమైన లక్షణాలు ఉండటంతో తక్షణం ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంది. రిపోర్ట్ లేకుంటే ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రులు చేర్చుకునే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో వైద్యాధికారులకు ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి. రిపోర్ట్ ఇచ్చేలా కసరత్తు... బస్తీ దవాఖానాలు, యూపీహెచ్‌సీల్లో పరీక్షలు చేస్తుండటంతో తక్షణమే రిపోర్టు ఇవ్వాలంటే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఒక ఫార్మాట్ రూపొందించి ప్రింట్ రూపంలో రిపోర్ట్ ఇవ్వాలి. అయితే ఎలా చేయాలన్న దానిపై వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. కాగా, మంగళవారం నుంచే కొన్నిచోట్ల రిపోర్టులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించామని, మిగిలిన చోట్ల త్వరలోనే దీనిని మొదలుపెడతామని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య'మస్తు'
ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 5,222 మంది వైద్యులున్నారు. కొత్త నోటిఫికేషన్ ద్వారా 2,153 వైద్య పోస్టులు భర్తీ చేయనున్నారు. తద్వారా 41 శాతం మందికిపైగా వైద్యులు అదనంగా రానున్నారు. దీంతో పాటు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లను కూడా నియమిస్తారు. తాజా నోటిఫికేషన్‌కు జూన్ 28వతేదీ నాటికి 6 వేల మందికిపైగా వైద్యులు దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. యువ వైద్యులకు మంచి అవకాశం.. ‘నేను ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేశా. కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నా. కొత్త నోటిఫికేషన్లో సివిల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నా. నాలాంటి యువ వైద్యులకు ఇది మంచి అవకాశం’ –డా.నమ్రత అన్నపురెడ్డి, గుంటూరు సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి వైద్య పోస్టుల నియామకాలు చేపట్టకపోవడంతో అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వాసుపత్రుల దుస్థితి ఇక తొలగిపోనుంది. ఒకే ఒక్క నోటిఫికేషన్ ద్వారా తొమ్మిది వేలకుపైగా వైద్య పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో ఆరోగ్యశాఖకు అదనపు బలం చేకూరనుంది. గత ప్రభుత్వాలు నియామకాలను భారంగా భావించడంతో ప్రభుత్వాస్పత్రులు నిర్వీర్యమయ్యాయి. గాయమై వెళితే కనీసం దూది, సూది ఉంటాయో లేదో కూడా తెలియని దురవస్థ దాపురించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యానికి డబ్బుల్లేక, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందక సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎక్కడ చూసినా వైద్యులు, మందుల కొరతతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దయనీయంగా కనిపించేవి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడంతో ఇదంతా ఇక గతంగా మిగలనుంది. రాష్ట్రంలోని 1,175 పీహెచ్‌సీలు ఇకపై 24 గంటలూ పనిచేయనున్నాయి. ఇద్దరు డాక్టర్లతో పాటు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్‌లు వీటిల్లో అందుబాటులో ఉంటారు. ఒకే ఒక్క నియామకం ద్వారా 9,712 వైద్య పోస్టులు భర్తీ చేస్తుండటం నలభై ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ఆస్పత్రుల్లో మానవ వనరుల అభివృద్ధి, రోగుల భరోసాకు సూచికగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిద్వారా గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు వైద్యుల కొరత తీరనుంది. యువ వైద్యులు, అనుభవజ్ఞులతో రెండు నెలల్లో ప్రభుత్వాసుపత్రులు కొత్తకళ సంతరించుకోనున్నాయి. ఇక 24 గంటలూ ‘ఆరోగ్యం’ రాష్ట్రంలో 1,175 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలుండగా ప్రస్తుతం సగం పీహెచ్‌సీల్లో ఒకే ఒక డాక్టరు ఉన్నారు. వైద్యుడు సెలవుపై వెళితే ఇక స్టాఫ్ నర్సే దిక్కు. అర్ధరాత్రి వేళ పాముకాటుతోనే, గాయాలపాలై పీహెచ్‌సీకి వెళితే తాళాలు వేసి కనిపించేవి. ఇకపై ఇలా ఉండదు. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లు ఉంటారు. రాష్ట్రంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ 24 గంటలు పనిచేస్తాయి. ఒక్కో పీహెచ్‌సీకి రోజుకు సగటున 100 మంది ఔట్ పేషెంటు సేవల కోసం వస్తుంటారు. అంటే రోజుకు లక్ష మందికిపైగా పీహెచ్‌సీలకు వస్తారు. కొత్తగా డాక్టర్లు, ఫార్మసిస్ట్‌లు, స్టాఫ్ నర్సులను నియమిస్తే 24 గంటలూ ఆస్పత్రులు పనిచేయడంతో సామాన్యులకు ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఇబ్బంది ఉండదు. 70 సీహెచ్‌సీలకు నలుగురు చొప్పున.. రాష్ట్రవ్యాప్తంగా 192 సీహెచ్‌సీ (సామాజిక ఆరోగ్యకేంద్రాలు)లు ఉన్నాయి. వీటిలో గైనకాలజిస్ట్, అనస్థీషియా పీడియాట్రిక్స్ వైద్యులు బృందం ఉంటుంది. ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్న 70 సీహెచ్‌సీలను గుర్తించి ఒక్కో కేంద్రానికి నలుగురు గైనకాలజిస్ట్‌లను నియమిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా కాన్పు గదులను తీర్చిదిద్దుతున్నారు. మిగతా సీహెచ్సీలలో సైతం గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్ వైద్యుల బృందం ఉండేలా చర్యలు తీసుకుంటారు. స్పెషాలిటీ సేవలు విస్తృతం.. ప్రస్తుతం 11 బోధనాసుపత్రులు, అనుబంధ వైద్యకళాశాలలున్నాయి. ఈ ఆస్పత్రుల్లో ప్రధానంగా రెసిడెంట్ పీజీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. తాజాగా చేపడుతున్న నియామకాల్లో 737 మంది వీరే ఉన్నారు. 32 స్పెషాలిటీలకు సంబంధించి వైద్యులు కొత్తగా చేరతారు. దీంతో లక్షలాదిమంది రోగులకు స్పెషాలిటీ సేవలు మరింత చేరువవుతాయి. గ్రామాల నుంచే మెరుగైన వైద్యం పీహెచ్‌సీల స్థాయిలోనే వ్యాధిని గుర్తించడం, వైద్యం చేయడం వల్ల జబ్బులను త్వరగా గుర్తించవచ్చు. బాధితులకు కూడా ఆర్థికంగా, శారీరకంగా ఉపశమనం లభిస్తుంది. గ్రామీణ వైద్యం బలోపేతం అయ్యేందుకు వైద్యుల భర్తీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ ప్రక్రియ. –డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ ఇన్ని పోస్టులంటే నమ్మలేకున్నాం.. ఒకే నోటిఫికేషన్ ద్వారా ఇన్ని పోస్టులంటే నమ్మలేకపోతున్నాం. డీ ఫార్మసీ పూర్తిచేసి ఐదేళ్లయింది. మెడికల్ షాప్ పెట్టుకున్నా. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలో చేరాలనుకుంటున్నా. ప్రభుత్వ సర్వీసులో పనిచేయాలన్నది నా కల. – సునీల్ కుమార్‌రెడ్డి, ఫార్మసిస్ట్, కమలాపురం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాం.. నాలాంటి వారు ఎన్నో రోజుల నుంచి డాక్టర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ సర్వీసులో చేసి పని చేసేందుకు ఎంతోమంది ఉవ్విళ్లూరుతున్నారు. నేను ఇప్పటికే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేశా. – డా.ఎం.మోహన్‌కుమార్, తిరుపతి మూడు రకాలుగా మేలు వైద్య నియామకాలు చేపట్టడం వల్ల మూడు ప్రధాన ఉపయోగాలు ఉంటాయి. పేషెంట్ కేర్ గణనీయంగా పెరుగుతుంది. వైద్య విద్య మెరుగుపడుతుంది. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిర్ణయించిన మేరకు డెఫిషియన్సీ (లోపాలు) తగ్గించుకోవచ్చు. –డా.కె.బాబ్జీ, ప్రిన్సిపల్, రంగరాయ ప్రభుత్వ వైద్యకళాశాల, కాకినాడ -
ప్రజారోగ్య రంగంలో సమూల మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్య రంగం పూర్తిస్థాయిలో బలోపేతం కానుంది. సబ్ సెంటర్ల నుంచి మెడికల్ కాలేజీల వరకూ నాడు –నేడు కార్యక్రమాలు, కొత్తవాటి నిర్మాణం కోసం ఏకంగా రూ. 16,200 కోట్లు ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం జూన్ 15లోగా స్థలాల గుర్తింపు పూర్తి చేయాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించి అధికారులతో సమీక్ష చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. (రైతులకు రూ. 33 కోట్ల చెక్కు అందజేసిన చీఫ్ విప్) వైఎస్సార్ హెల్త్ క్లినిక్(సబ్ సెంటర్లు) ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక విలేజ్ క్లినిక్ ఉండాలని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకుంది. కోవిడ్ లాంటి విపత్తులను ఎదుర్కోవాలంటే గ్రామ స్థాయి నుంచి కూడా సబ్ సెంటర్ల రూపంలో 24 గంటల పాటు సేవలందించే వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే దాదాపు 10 వేల వైఎస్సార్ క్లినిక్స్‌ల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. వీటి కోసం సుమారు రూ.2026 కోట్లు ఖర్చు చేయనుంది. ఇవి కాకుండా ఇప్పటికే 1086 సబ్ సెంటర్లలో నాడు–నేడు ద్వారా అవసరమైన సదుపాయాలను కల్పిస్తుంది. ఇక సబ్ సెంటర్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకూ 4 వేల స్థలాలను గుర్తించారు. మరో 6 వేల సబ్‌సెంటర్లకు స్థలాలను గుర్తించాల్సి ఉంది. జూన్ 15లోగా స్థలాల గుర్తింపు పూర్తి చేయాలని సీఎం జగన్ జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా సబ్ సెంటర్ల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. (‘రైతు భరోసా’ను ప్రారంభించిన సీఎం జగన్) కొత్త మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు కాగా రాష్ట్రంలో పాత మెడికల్ కాలేజీలు 11 ఉన్నాయి. వీటితోపాటు అటాచ్డ్ ఇనిస్టిట్యూషన్స్ టు మెడికల్ కాలేజీలు –6. ఇక గిరిజన ప్రాంతాల్లో 7 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు కొత్తగా రానున్నాయి. వీటన్నింటి కోసం రూ.6100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇవిగాక 15 కొత్త మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, కడపలో 3 వైద్య సంస్థలు....సూపర్ స్పెషాల్టీ, క్యాన్సర్, ఇన్సిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ కోసం మొత్తంగా రూ. 6,170 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. ఈ క్రమంలో ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఉండాలని అధికారులను సీఎం జగన్ అధికారులను దేశించారు. కొత్తగా నిర్మించదలచిన మెడికల్ కాలేజీల నిర్మాణ రీతులపై నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. అదే విధంగా.. నాడు – నేడు కార్యక్రమాల్లో నాణ్యతలో రాజీ పడొద్దని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. నిర్మాణాలు పటిష్టంగా, నాణ్యంగా ఉండాలని ఆదేశించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు రాష్ట్రవ్యాప్తంగా 1,138 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో 149 కొత్త పీహెచ్‌సీల నిర్మాణం కోసం రూ. 256.99 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరో 989 పీహెచ్‌సీల్లో అభివృద్ధి పనులకోసం రూ. 413.01 కోట్లు ఖర్చుచేయనున్నారు. మొత్తంగా రూ. 671 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రులు 52 ఏరియా ఆస్పత్రుల్లో నాడు నేడు కింద రూ.695 కోట్ల ఖర్చు చేయనున్నారు. 169 కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో రూ.541 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా రూ.1,236 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. -
పల్లెటూళ్ల నుంచి పట్నానికి స్పెషలిస్ట్ వైద్యులు
సాక్షి, అమరావతి: పీజీ స్పెషలిస్ట్ సర్టిఫికెట్ ఉండి.. ఇప్పటి వరకు పల్లెటూళ్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే పరిమితమైన స్పెషలిస్ట్ వైద్యులను పట్టణాలు, నగరాల్లోని కోవిడ్ ఆస్పత్రులకు రప్పించేందుకు అధికార వర్గాలు చర్యలు తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్‌సీల్లో పని చేస్తున్న సుమారు 52 మంది స్పెషలిస్ట్ వైద్యులను గుర్తించి కోవిడ్ ఆస్పత్రుల్లో సేవలందించాలని ఆదేశించారు. వీరందరూ తక్షణమే స్టేట్ కోవిడ్ ఆస్పత్రుల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఆదేశించారు. మైక్రోబయాలజిస్ట్‌లు మాత్రం వైరాలజీ ల్యాబొరేటరీల్లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చికిత్సకు జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్ వైద్యుల అవసరం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వీరంతా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే పని చేస్తున్నారు. జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, అనస్థీషియా, మైక్రోబయాలజీ వంటి ఎంతోమంది వైద్యులు సీనియర్ మెడికల్ ఆఫీసర్లుగానే ఉన్నారు. తాజా నిర్ణయంతో వీరందరికీ స్పెషాలిటీ సేవలందించే అవకాశం లభించింది. -
నేడు పల్స్ పోలియో
సాక్షి, అమరావతి/ఏలూరు టౌన్: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు ఆదివారం పల్స్ పోలియో చుక్కలు వేయనున్నారు. దీనికోసం కుటుంబ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం తన నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పోలియో చుక్కల మందు కార్యక్రమాన్ని కుటుంబ సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ, పురపాలక, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, రవాణా, విద్యాశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. రాష్ట్రంలో ఐదేళ్ల వయసులోపు చిన్నారులు 52.27 లక్షల మంది ఉన్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ గుర్తించింది. వీళ్లందరికీ విధిగా పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచే పోలియో చుక్కల మందు బూత్‌లలో అందుబాటులో ఉంటుంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం చిన్నారులకు పోలియో చుక్కలు అందేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకవేళ ఆదివారం ఎవరైనా చిన్నారులకు వేయించలేని పరిస్థితి ఉంటే ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే 65.75 లక్షల డోస్‌ల పోలియో చుక్కల మందు రాష్ట్రానికి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో 2008 జూలైలో పశ్చిమగోదావరి జిల్లాలో పోలియో కేసు నమోదైందని, తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కుటుంబ సంక్షేమ శాఖ ధృవీకరించింది. ప్రతి కాలనీలో, ప్రతి గ్రామంలోనూ పల్స్ పోలియో బూత్ ఉంటుందని, తల్లిదండ్రులు తమ బిడ్డలకు చుక్కలు వేయించడం మరచిపోవద్దని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా కోరారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని, ఆరోగ్యవంతమైన, పోలియోరహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. -
జ్వరం మింగిన మాత్రలు 93కోట్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో గత 8 నెలల్లో వివిధ రకాల జ్వరాల బాధితులు ఏకంగా 93 కోట్లకు పైగా పారాసెటిమాల్ మాత్రలను వినియోగించారని తేలింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని బోధనాస్పత్రుల వరకూ మందుల వినియోగంలో పారాసెటిమాల్ మాత్రలే మొదటి స్థానంలో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.35 కోట్లని ఈ–ఔషధి గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి ఈ–ఔషధి సాఫ్ట్‌వేర్‌కు వివరాలు అప్లోడ్ కాలేదని, అవి కూడా అందితే పారాసెటిమాల్ మాత్రల వినియోగం సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పెయిన్ ‘కిల్లర్స్’ నొప్పి నివారిణి (పెయిన్ కిల్లర్) మాత్రలు తరచూ వాడితే పెను ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా చాలామంది రోగులు పెడచెవిన పెడుతున్నారు. గత 8 నెలల్లో.. 76.26 కోట్ల డైక్లోఫినాక్ 50ఎంజీ మాత్రలను రోగులు వాడారు. మాత్రల వినియోగంలో పారాసెటిమాల్ తర్వాత వీటిది రెండో స్థానం. నెలకు సగటున 9.53 కోట్ల డైక్లోఫినాక్ 50ఎంజీ మాత్రలు వాడుతున్నారని వెల్లడైంది. చిన్న చిన్న నొప్పులకు కూడా ఎక్కువ మంది రోగులు పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం మాత్రల సంఖ్య 60.38 కోట్లు రాష్ట్రంలో అత్యధికంగా వినియోగించే మందుల్లో రక్తపోటు (బీపీ) మందులు కూడా ఉంటున్నాయి. అస్తవ్యస్త జీవనశైలిలో భాగంగా రక్తపోటు (బీపీ) పెరుగుతున్న నేపథ్యంలో మందుల వాడకం ఎక్కువవుతోంది. గత 8 నెలల్లో 40.28 కోట్ల అటెన్‌లాల్ 50 ఎంజీ మాత్రలను బీపీ వ్యాధిగ్రస్తులు వాడారు. అదేవిధంగా మధుమేహం (షుగర్)తో బాధపడుతున్నవారు 60.38 కోట్ల మెట్ఫార్మిన్ 500 ఎంజీ మాత్రలను వినియోగించారు. -
ఆస్పత్రి సొసైటీలకు మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మొదలుకుని.. బోధనాస్పత్రుల వరకూ ఆస్పత్రి అభివృద్ధి సొసైటీల నిర్వహణపై ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదలచేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నిధుల వినియోగం, నిర్వహణ, మెరుగైన వైద్యసేవలందేలా పర్యవేక్షణ తదితర వాటిని దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకాలను జారీచేసినట్టు పేర్కొన్నారు. గతంలో ఇష్టారాజ్యంగా ఈ సొసైటీలకు సభ్యులను నియమించడంతో సకాలంలో సమావేశాలు నిర్వహించలేకపోవడం, సమీక్షలు లేకపోవడం, నిధులు వినియోగం కాకపోవడం వంటివి జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని సొసైటీలకు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆయుష్ ఆస్పత్రులకూ సంబంధిత అధికారులతో కార్యవర్గాలను ఏర్పాటు చేశారు. విధులు.. - రోజూ ఆస్పత్రుల పనితీరుపై పర్యవేక్షణ - నిబంధనల మేరకు రోగులకు వైద్య పరీక్షలు అందుతున్నాయో లేదో పరిశీలన - సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు - పీహెచ్సీ స్థాయిలో 3 నెలలకోసారి పనితీరు అంచనా - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలుపై పర్యవేక్షణ - ఆస్పత్రి అభివృద్ధి సొసైటీలో ఉన్న నిధుల వినియోగం, వైద్య పరికరాల అవసరాలు తదితరాల పర్యవేక్షణ - సిటిజన్ చార్టర్ (రోజువారీ అందాల్సిన సేవల జాబితా) అందుబాటులో ఉండేలా చూడటం - ఆస్పత్రులకు విరాళాలిచ్చే దాతలను గుర్తించి ఆస్పత్రులను అభివృద్ధి చేయడం - వివిధ పథకాల నుంచి వచ్చే గ్రాంట్లను సకాలంలో సద్వినియోగమయ్యేలా చూడటం - ఆస్పత్రుల స్థాయిని బట్టి చైర్పర్సన్లకు నిధుల వ్యయం అధికారాలివ్వడం ఆయా ఆస్పత్రుల కార్యవర్గాలు ఇలా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.. చైర్‌పర్సన్‌గా: ఎంపీపీ కన్వీనర్‌గా: మెడికల్ ఆఫీసర్. మరో నలుగురు సభ్యులు సీహెచ్‌సీ.. చైర్‌పర్సన్‌గా: ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కన్వీనర్‌గా: ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్. నలుగురు సభ్యులు ఏరియా ఆస్పత్రి చైర్పర్సన్: ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కన్వీనర్: ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రత్యేక ఆహ్వానితులు: మున్సిపల్ కమిషనర్. ఏడుగురు సభ్యులు జిల్లా ఆస్పత్రి చైర్పర్సన్: ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కన్వీనర్: సూపరింటెండెంట్. డీఎంహెచ్‌వోతో పాటు.. మరో ఏడుగురు సభ్యులు బోధనాస్పత్రి చైర్పర్సన్: కలెక్టర్ కో–చైర్పర్సన్: ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కన్వీనర్: సూపరింటెండెంట్. 9 మంది సభ్యులు మెడికల్ కాలేజీలు చైర్పర్సన్: డీఎంఈ లేదా అకడమిక్ డీఎంఈ కన్వీనర్: సూపరింటెండెంట్. ఇద్దరు సభ్యులు -
మౌలిక వసతులు.. కార్పొరేట్ సొబగులు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు వీలైనన్ని మార్గాల్లో నిధులు సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రైవేట్ కంపెనీలు – కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్సార్)లో భాగంగా సామాజిక మౌలిక వసతుల కల్పనకు నిధులను సులభతరంగా సమకూర్చేందుకు వీలుగా ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోంది. ‘మీ గ్రామాలకు ఏటా ఒకట్రెండుసార్లయినా రండి. మీ ఊళ్లోని పాఠశాల, ఆసుపత్రి అభివృద్ధికి సహకరించండి. మీ ద్వారా జరిగిన పనికి మీ పేర్లే పెడతాం’ అని సీఎం వైఎస్ జగన్ ఇటీవల అమెరికా పర్యటనలో ప్రవాసాంధ్రులకు పిలుపునిచి్చన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వచ్చే నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రత్యేక విధానం కార్యరూపం దాలుస్తోంది. సీఎస్సార్ కింద సమకూర్చిన నిధులను ఖర్చు చేసే తీరు, మౌలిక ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందిస్తున్నారు. దాతలు ఇచ్చే నిధులను నవరత్నాలకు ఉపయోగించడంతో పాటు.. ఆయా కంపెనీలు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఈ కొత్త విధానం ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విధానం ద్వారా ప్రైవేట్ కంపెనీలు, దాతలే మొత్తం ప్రాజెక్టును చేపట్టాల్సిన అవసరం ఉండదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య తదితర సామాజిక మౌలిక వసతులు ఎక్కడెక్కడ కొరత ఉన్నాయో ప్రభుత్వమే గుర్తించనుంది. ప్రభుత్వం ప్రాధాన్యతగా గుర్తించిన పనుల నుంచి ఏ పనులను చేపట్టాలో ప్రైవేట్ కంపెనీలు, దాతలే నిర్ణయించుకుని అవసరమైన నిధులను అందజేయవచ్చు. ప్రాధాన్యతల మేరకు ప్రభుత్వం గుర్తించిన పనులు – పాఠశాలల్లో తరగతి నిర్మాణం (వ్యయం సుమారు రూ.10 లక్షలు) – తరగతి గదిలో అవసరమైన ఫర్నిచర్‌ను సమకూర్చడం (వ్యయం సుమారు రూ.లక్ష) – పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగ్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ నిర్మాణం (వ్యయం సుమారు రూ.1.5 లక్షలు) – ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో లేబర్ రూమ్ నిర్మాణం – ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఆపరేషన్ థియేటర్ నిర్మాణం – కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో పనిచేసే ఎక్స్‌రే మిషన్ – కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో అప్పుడే పుట్టిన పిల్లల కోసం స్టెబిలైజేషన్ యూనిట్ ఏర్పాటు – కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కోసం క్వార్టర్స్ నిర్మాణం – అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్స్ గదుల నిర్మాణం అంతటా పారదర్శకం మౌలిక వసతుల కల్పనకు ప్రైవేట్ కంపెనీలు లేదా దాతలు పూర్తి పారదర్శకంగా వెబ్ బేస్డ్ సింగిల్ ప్లాట్ ఫాంలో పనులు చేపట్టవచ్చు. వ్యక్తిగత స్థాయిలో కూడా దాతలు ఈ ప్రాజెక్టులను చేపట్టవచ్చు. ప్రైవేట్ కంపెనీలు, దాతలు చేపట్టే పనులు వెబ్సైట్ డ్యాష్ బోర్డులో కనిపిస్తాయి. ప్రాజెక్టుల పనుల పురోగతిని కూడా చూడవచ్చు. నిధుల వినియోగం ఏ విధంగా జరుగుతుందో దాతలు తెలుసుకునేందుకు, వారిలో విశ్వాసం కలిగించేందుకు 13 జిల్లాల కలెక్టర్లు 13 ఎస్క్రో అకౌంట్లను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా నిధులు ఏ మేరకే వినియోగించారు.. ఇంకా ఎన్ని నిధులు మిగిలాయన్నది తెలుసుకోవచ్చు. పనులు జరిగే తీరును జిల్లా కలెక్టర్లు సమన్వయం చేస్తారు. ఈ పనుల కోసం ప్రత్యేకంగా నిష్ణాతులతో కూడిన విభాగాన్ని ప్రణాళికా శాఖలో ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాల బ్రాండ్‌ను ఈ విభాగం మార్కెట్ చేస్తుంది. దాతలు ఇచ్చిన విరాళాలు సద్వినియోగమయ్యేలా ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. అన్ని విధాలా దాతలకు సహకారం అందిస్తుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రైవేట్ కంపెనీలు లేదా దాతలు చేపట్టిన పనులు పూర్తయ్యాక ప్రభుత్వానికి బదిలీ చేస్తారు. ఆ పనులకు ఆయా కంపెనీలు లేదా దాతల పేర్లను పెడతారు. అనంతరం వాటి నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ప్రభుత్వమే స్వీకరిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. వెబ్ బేస్ట్ ప్రాసెస్ ఇలా.. – ప్రభుత్వమే సామాజిక మౌలిక వసతులను గుర్తించి భౌగోళిక, రంగాల వారీగా ప్రాజెక్టులను డ్యాష్ బోర్డులో డిస్ప్లే చేస్తుంది. – డిస్ప్లే అయిన ప్రాజెక్టుల నుంచి ప్రైవేట్ కంపెనీలు, దాతలు ఏదో ప్రాజెక్టును ఎంపిక చేసుకుని విరాళాలు ఇవ్వొచ్చు. – ఆ విరాళాలు ఎస్క్రో అకౌంట్లకు వెళ్తాయి. పనులు సంబంధిత శాఖకు వెళ్తాయి. – జిల్లా కలెక్టర్ ఆ పనుల పురోగతిని నెల/మూడు నెలలకోసారి సమీక్షిస్తూ అవసరమైన నిధులను విడుదల చేస్తారు. పనుల పురోగతి ఫొటోలను వెబ్సైట్లో ఉంచుతారు. – పనులు పూర్తి కాగానే జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ వెంటనే అవి పూర్తయిన పనుల ప్రాజెక్టుల జాబితాలోకి వెళ్తాయి. ఈ కంపెనీలకు కార్పొరేట్ సామాజిక బాధ్యత.. – 2013 కంపెనీల చట్టం సెక్షన్ 135 కింద ఉన్న కంపెనీలు – రూ.500 కోట్లు లేదా ఆ పై విలువగల కంపెనీలు – రూ.1000 కోట్లు లేదా ఆపై టర్నోవర్ ఉన్న కంపెనీలు – ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్లు ఆ పైన నికర లాభం కలిగిన కంపెనీలు ఈ కంపెనీలు లాభాల్లో కనీసం రెండు శాతం మేర నిధులను కార్పొరేట్ సామాజిక బాధ్యతకు వెచ్చించాలి. ప్రధానంగా పేదరిక నిర్మూలన, విద్యను ప్రోత్సహించడం, లింగ సమానత్వం, మహిళా సాధికారిత, మాతా శిశు మరణాలు తగ్గించడం, హెచ్ఐవీ.. ఏయిడ్స్ నిర్మూలన, మలేరియా, పర్యావరణ పరిరక్షణ, వృత్తి విద్యా శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాల పెంపు, సామాజిక ప్రాజెక్టులు, సామాజిక ఆర్థికాభివృద్ధి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళల అభివృద్ధికి నిధులు వెచ్చించాలి . -
మండలాల వారీగా ఆస్పత్రులకు మ్యాపింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో భారీ ఎత్తున సంస్కరణలు చేపట్టిన నేపథ్యంలో మండలాల వారీగా ఆస్పత్రులకు మ్యాపింగ్ నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు కసరత్తు మొదలెట్టారు. ప్రతి మండలం పరిధిలో ఎన్ని ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి, ఎన్ని ప్రాథమిక ఆస్పత్రులున్నాయి, ఏరియా ఆస్పత్రులెన్ని, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రులు ఇలా ప్రతి ఆరోగ్య సంస్థను గుర్తించి, వాటికి మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. దీనివల్ల ప్రతి ప్రాంతంలోనూ ఆస్పత్రుల స్థితిగతులు తెలుసుకునే వీలుంటుంది. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 40 వేల మంది ఉంటున్నారు. కొన్ని చోట్ల 20 వేల మందికే ఒక పీహెచ్సీ ఉంది. కొన్ని పీహెచ్‌సీల్లో రోగుల తాకిడి లేకపోయినా ఇద్దరు చొప్పున మెడికల్ ఆఫీసర్లున్నారు. మరికొన్నింటికి రోగులు వస్తున్నా డాక్టర్లు లేరు. ప్రధానంగా ప్రతి చిన్న ఆస్పత్రి నుంచి పెద్దాస్పత్రి వరకూ సిబ్బంది వివరాలు ఈ మ్యాపింగ్ ప్రక్రియలో వెల్లడి కానున్నాయి. ఇక సంస్కరణలు వేగవంతం రాష్ట్రంలో ఉన్న అన్ని ఆరోగ్య సంస్థల వివరాలు, వాటి పరిధిలో జనాభా, ఆస్పత్రి ఉన్న ప్రాంతం, సిబ్బంది ఇలా అన్నింటినీ కలిపి మ్యాపింగ్ ప్రక్రియలోకి తెస్తారు. త్వరలోనే ఇ–హెల్త్ రికార్డులను రూపొందించనున్న నేపథ్యంలో ఇలా మ్యాపింగ్ చేపడితే ఏ ప్రాంతంలో ఏ జబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఎక్కడ ఏ ఆస్పత్రి ఉందో, ఆ జిల్లాలో ఎవరు పనిచేస్తున్నారో ఆ జిల్లాలో అధికారులను అడిగి తెలుసుకోవడం, లేదా స్థానికంగా వచ్చిన సమాచారం మేరకే తెలిసేది. ఇకపై అలా కాకుండా మండలాల వారీగా వీటన్నిటినీ మ్యాపింగ్ పేరుతో ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వీలవుతుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈ నెల 30లోగా నివేదిక ఇవ్వనుంది. ఈలోగా మ్యాపింగ్ పూర్తి చేస్తే సంస్కరణలకు సులువుగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆస్పత్రుల్లో పరిస్థితులన్నిటినీ మ్యాపింగ్ ప్రక్రియ కిందకు తీసుకొస్తే సంస్కరణలు వేగవంతమవుతాయని అంటున్నారు.