
ప్రతి వ్యక్తికీ వైద్యం
- ఏజెన్సీలో మందుల కొరత లేకుండా చూడాలి
- మాత, శిశు మరణాలు అరికట్టాలి
- ముంపు గ్రామాలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలి
- ఏజెన్సీలో సర్కారు వైద్యం విస్తరించాలి
- అధికారులకు డిప్యూటీ సీఎం రాజయ్య ఆదేశం
- ఐటీడీఏలోని వైద్య, ఆరోగ్యశాఖ, జీసీసీపై సమీక్ష
- సివిల్ ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తనిఖీ
ఏటూరునాగారం : ఏజెన్సీలోని ప్రతి వ్యక్తికీ సర్కారు వైద్యం అందాలని, అటవీ గ్రామాల్లోని ప్రతి వ్యక్తికి వైద్య సేవలు అందించే విధంగా వైద్య, ఆరోగ్యశాఖ సేవలు విస్తరించాలని డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య అధికారులను ఆదేశించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) కార్యాలయంలో సోమవారం గిరిజన సంక్షేమం, వైద్య, ఆరోగ్యశాఖల అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీలో మాత, శిశు మరణాలు అరికట్టేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గోడలపై వైద్యులు, సిబ్బంది పేర్లు, సెల్ నంబర్లు తప్పకుండా రాయాలన్నారు. స్థానికంగా ఉండని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
53 ముంపు గ్రామాలకు ముందస్తుగా మందులు
వర్షకాలంలో 53 గ్రామాల ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముందస్తుగానే మందులను నిల్వ ఉంచాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులను విడివిడిగా సమస్యలు, సౌకర్యాలు, అందించిన సేవల విషయాలను అడిగి తెలుసుకున్నారు. క్లోరినేషన్, శానిటేషన్, జ్వరాల నిర్మూల కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని డీఎంహెచ్‌ఓ పిల్లి సాంబశివరావు డిప్యూటీ సీఎంకు తెలిపారు.
గత ఏడాదిలో జిల్లాలో 10520 పైలేరియా కేసులు నమోదయ్యూనని చెప్పారు. జవహర్ ఆరోగ్య రక్ష పథకంలో భాగంగా 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. ములుగులో బ్లడ్ బ్యాంక్, ట్రామా కేర్ సెంటర్, ఇంకా 15 సబ్‌సెంటర్‌లు, 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యేవిధంగా చూడాలని ఉప ముఖ్యమంత్రికి విన్నవించారు. తాడ్వాయి మండలం మేడారంలో 30 పడకాల ఆస్పత్రి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.
జీసీసీ ద్వారా మరింత సేవలు
గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా ముంపు గ్రామాలకు మూడు నెలల పాటు సరిపడే నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని జీసీసీ డీఎం జోగేశ్వర్‌రావును డిప్యూటీ సీఎం ఆదేశించారు. జీసీసీ ద్వారా పెట్రోల్ బంక్‌లు, తేనెశుద్ధి, సబ్బు కర్మాగారం, గిరిజన సూపర్ బజార్‌లు, జనరిక్ మందులు, ఎల్‌పీజీ గ్యాస్‌ల గోదాం, మిర్చి కోల్డ్ స్టోరేజ్‌లను నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని జోగేశ్వర్‌రావు వివరించారు.
ఐటీడీఏ సెక్టార్ అధికారులతో రివ్యూ
గిరిజన సంక్షేమం ఇంజినీరింగ్ విభాగంలో ఇప్పటి వరకు ఎన్ని భవనాలు పూర్తయ్యాయి, ఇంకా పూర్తి కావాల్సిన పనులపై ఈఈ వసంత డిప్యూటీ సీఎంకు వివరించారు. ఇంజనీరింగ్ విభాగం నుంచి 29 పథకాల ద్వారా 876 పనులకు గాను 496 పనులు పూర్తి కాగా, 225 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈజీఎస్ కింద మారుమూల అటవీ గ్రామాలకు అనుసంధానం చేస్తూ 101 మెటల్ రోడ్లు నిర్మాణాలు పూర్తయ్యాయని, ఐఏపీ కింద 64 సీసీ రోడ్లు పూర్తి చేసినట్లు వసంత పేర్కొన్నారు. మైనర్ ఇరిగేషన్ ద్వారా 68 పనులు చేపట్టగా.. 24 పూర్తి చేశామని, 44 పురోగతిలో ఉన్నాయని మైనర్ ఇరిగేషన్ ఈఈ సుధీర్ వివరించారు.
రోడ్డు విస్తరణ ఎప్పుడు?
ఏటూరునాగారం నుంచి పస్రా వరకు ఉన్న సింగిలేన్ ఎందుకు విస్తరణ జరగడం లేదని ఎన్‌హెచ్ ఈఈ సత్యనారాయణను రాజయ్య ప్రశ్నించారు. సమీక్ష సమావేశంలో ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే చందూలాల్, కలెక్టర్ కిషన్, ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు, డిపూటీ డీఎంహెచ్‌ఓ దయానందస్వామి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్‌కుమార్, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ కృష్ణజ్యోతి, డీఎఫ్‌ఓ లింగారావు, ములుగు ఆర్డీఓ మోతీలాల్, డిప్యూటీ డెరైక్టర్ సావిత్రి, ఎంపీడీఓ, తహసీల్దార్‌లు, సీడీపీఓలు, ఐటీడీఏ మేనేజర్ సురేందర్, డీఎస్‌ఓ సురేష్‌బాబు పాల్గొన్నారు.
ఆస్పత్రుల తనిఖీ
అంతకుముందు మంత్రి రాజయ్య ములుగు సివిల్ ఆస్పత్రి, తాడ్వారుు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా కొందరు రోగులను పరీక్షించారు. ఆస్పత్రులలో మాజీ ముఖ్యమంత్రి ఫొటోలు ఉండడం చూసిన రాజయ్య..అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.