వేసవిలో ఆదివాసీలకు ఉపాధి నందిస్తున్న తునికాకు సేకరణ
ఏజెన్సీలో ప్రత్యామ్నాయఆదాయ వనరుగా తోడ్పాటు
రెండు నెలలపాటు ఆర్థికభరోసా
గూడూరు: రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు అటవీ ప్రాంతాల్లో లభించే తునికాకును ప్రకృతి సంపద (పంట)గా భావిస్తారు. ప్రతీ వేసవిలో రెండు నెలల పాటు తునికాకే వారికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరు. ఏటా ఆదివాసీలు ఏప్రిల్‌లో తునికాకు సేకరణ ప్రారంభిస్తారు. అయితే ఎక్కువగా మే నెలలో సేకరించడం పూర్తి చేస్తారు. తద్వారా రెండు నెలల పాటు ఆదాయం సమకూరుతుంది.
విరివిగా లభ్యం..
మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తునికాకు విరివిగా లభిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల గిరిజన కుటుంబాలు ఎండాకాలం రాగానే తునికాకు సేకరణలో నిమగ్నమవుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మహబూబాబాద్, గూడూరు అటవీశాఖ డివిజన్‌తో పాటు ములుగు, ఏటూరునాగారం, భద్రాద్రి కొత్తగూడెం, గుండాల, బయ్యారం మండలాల్లో ఏప్రిల్, మేలలో తునికాకు సేకరణ జోరందుకుంటుంది.
ఒక్కో సంవత్సరం తునికాకు సేకరణ ఎక్కువగా జరిగి ప్రభుత్వ సూచన ప్రకారం ఫారెస్టు అధికారులు ప్రతీ డివిజన్‌లో టార్గెట్ ఎక్కువగా పెట్టుకుంటున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు వేసవిలో తునికాకు సేకరణను ఉపాధి మార్గంగా ఎంచుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏటా కూలీల ద్వారా ఆకు సేకరించి కట్టలను కొనుగోలు చేస్తోంది. గతేడాది 50 ఆకుల తునికాకు కట్టకు రూ.3 చెల్లించారు. ఈ సంవత్సరం కట్ట ధర పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తొలి కోడి కూతతో అడవికి పయనం..
తునికాకు సేకరణకు గిరిజనులు తొలికోడి కూతతో మేల్కొని వంటలు చేసుకుంటారు. అంబలి, గంజి తీసుకొని అడవులకు పయనమవుతారు. అడవిలో చెట్టు చెట్టుకు తిరిగి తునికాకు కోసి బస్తాల్లో నింపుకుని ఎత్తుకొస్తారు. కొందరు బస్తాల్లో తీసుకొచ్చిన ఆకులను ఇంటి వద్ద కట్టలు కట్టగా, మరికొందరు అడవిలోనే చెట్ల కింద కూర్చొని 50 ఆకుల చొప్పున కట్ట కడతారు. సాయంత్రం ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన కల్లాల వద్ద వాటిని విక్రయిస్తారు. ప్రతీరోజు ఒక్కో కూలీ రూ.450 నుంచి రూ.500 వరకు సంపాదిస్తారు.
గూడూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో..
మహబూబాబాద్ జిల్లా గూడూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో మట్టెవాడ, కొంగరగిద్ద, గోపాలపురం గ్రామాలతో పాటు మరికొన్ని చోట్ల దాదాపు 10 కల్లాలను ఏర్పాటు చేస్తారు. గతేడాది గూడూరు రేంజ్ పరిధిలో 2 వేల స్టాండర్ట్ బ్యాగులు (20 లక్షల) తునికాకు కట్టల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆన్‌లైన్‌లో చెల్లింపులు..
జిల్లా వ్యాప్తంగా చేపట్టిన తునికాకు సేకరణపై నిఘా పెడతాం. ఆకుల కట్టలు విక్రయించిన కూలీలకు ఆన్‌లైన్‌లో వారి వివరాలు నమోదు చేసి డబ్బులు చెల్లిస్తాం. ఆకులు సేకరించే వారి నుంచి ఆధార్ కార్డు, ఫొటో, బ్యాంకు ఖాతా జిరాక్స్‌లను సేకరిస్తాం. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో ఆకు సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – బత్తుల విశాల్, డీఎఫ్‌ఓ, మహబూబాబాద్
రెండు నెలలు ఉపాధి
వేసవిలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న మాకు తునికాకు సేకరణ ఉపాధినిస్తుంది. రెండు నెలల పాటు పని దొరుకుతుంది. ప్రతీరోజు తెల్లవారు జామునే అడవికి వెళ్తాం. బస్తాల నిండా ఆకు సేకరించి, ఎండ ముదరకముందే ఇంటికి చేరుకుంటాం. మధ్యాహ్నం కుటుంబం అంతా కలిసి కూర్చొని 50 ఆకులతో కట్టలు కడుతాం. సాయంత్రం కల్లం వద్దకు తీసుకెళ్లి విక్రయిస్తాం. – మేడ సమ్మయ్య, మట్టెవాడ, గూడూరు
తునికాకు ఉపాధి కల్పిపస్తుంది
మండుటెండా కాలంలో కూలీ పనులు దొరకవు. దీంతో ప్రతీ సంవత్సరం తునికాకు సేకరణ ఉపాధినిస్తుంది. రోజు పొద్దున్నే అడవికి వెళ్లి ఆకు కోసుకొస్తాం. మధ్యాహ్నం కట్టలు కట్టి కల్లంలో అమ్ముతాం. రోజు రూ.450 నుంచి రూ.500 వరకు డబ్బులు వస్తాయి. – ప్రవళిక, మర్రిమిట్ట, గూడూరు
వృద్ధులకు సైతం ఆదాయం
తునికాకు సేకరణతో విద్యార్థులు, వృద్ధులకు డబ్బులు వస్తాయి. విద్యార్థులు బడులు మొదలయ్యే ముందు కొత్త దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు కొనేందుకు వాడుకుంటారు. వృద్ధులు తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు. – రమ్య, మర్రిమిట్ట, గూడూరు
Comments
Please login to add a commentAdd a comment