
వేసవి తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య
పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం
మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరాకూ అంతరాయం
జలాశయాలు, చెరువుల్లో నీటిమట్టాలు తగ్గడమే కారణం
పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజల ఇక్కట్లు
క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన
సాక్షి, హైదరాబాద్ / సాక్షి న్యూస్ నెట్‌వర్క్: రాష్ట్రంలో వేసవి ఎండలు మండిపోతుండటంతో తాగునీటి ఎద్దడి మొదలయ్యింది. వివిధ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటాయి. రాబోయే నెల రోజుల్లో వేసవి తీవ్రత పెరిగితే ఆ మేరకు తాగునీటి సమస్యలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరా జరుగుతున్న ప్రాంతాల్లో కూడా ప్రజలు మంచినీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు జిల్లాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
జలశయాలు, చెరువులు లేనిచోట్ల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్ల ద్వారా భగీరథ ఓవర్‌హెడ్ ట్యాంకులకు మంచినీటిని సరఫరా చేస్తారు. అయితే జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గడం, చాలాచోట్ల చెరువులు ఎండిపోవడం, భూగర్భ జలాలు ఎండిపోవడంతో సమస్య తలెత్తుతోంది. ప్రస్తు తం ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లోని కొన్ని మారుమూల ప్రాంతాలు, గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణాలు, గ్రామాల్లో నెలకొన్న తాగునీటి కష్టాలను ‘సాక్షి’పరిశీలించింది.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఇక్కట్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ నీరు సరిగా సరఫరా కాక ముఖ్యంగా ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఇంద్రవెల్లి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్ యూ మండలాల్లో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల బోర్లు, ట్యాంకులతో సరఫరా చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారంలో బోర్ మోటార్ చెడిపోయి నెలలు గడుస్తున్నా మరమ్మతు చేయకపోవడంతో వాటర్ ట్యాంక్‌తో నీటిని సరఫరా చేస్తున్నారు.
అరకొరగానే భగీరథ నీళ్లు
నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం, మోపాల్ మండలాల్లో నీటి సమస్య ఉంది. దీంతో గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. మోపాల్ మండలంలోని పలు తండాలు ముంపు గ్రామాలు కావడంతో ఇక్కడ మిషన్ భగీరథ పైపులైన్లు వేయలేదు. బిచ్కుంద మండలంలోని పలు గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. పలు గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. గాంధారి, తాడ్వాయి, లింగంపేట, రామారెడ్డి మండలాల్లోనూ తాగునీటి ఎద్దడి నెలకొంది. మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు.
సూర్యాపేట మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి
ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో దాదాపు 17 వేల మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంలో రోజు విడిచి రోజు గంట సేపు నీటి సరఫరా చేస్తున్నారు. అవి గృహ అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదని స్థానికులు చెబుతున్నారు. శివారు ప్రాంతాలైన భాషా నాయక్ తండా, పిల్లలమర్రి బీబీ గూడెం, కాసింపేట, రామకోటి తండా, అంజనాçపురి కాలనీల్లోనూ నీటి కొరత ఉంది. కొన్నిచోట్ల భగీరథ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బోర్లు ఎండిపోయాయి..
సూర్యాపేట పట్టణంలోని అంజనాçపురి కాలనీ దగ్గర వజ్ర టౌన్‌షి ప్‌కు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఒట్టిపోయాయి. కాలనీ మొత్తం మంచినీటి సమస్య ఎదుర్కొంటోంది. అధికారులు స్పందించి మా కష్టాలు తీర్చాలి. – గుగులోతు మంగమ్మ, వజ్ర టౌన్‌షిప్
వాగునీళ్లే శరణ్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతెలబోరు గ్రామ పంచాయతీ ఎర్రబోరు గ్రామంలో మిషన్ భగీరథ పైపు లైన్ ద్వారా నీళ్లు రావడం లేదు. ఉన్న చేతిపంపు పనిచేయడం లేదు. దూరంలో ఉన్న వాగు నుంచి మంచినీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని అగ్రహారం తండాలో గత వారం రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. గ్రామపంచాయతీకి సంబంధించిన బోర్లు సైతం రిపేర్ లో ఉండడంతో వ్యవసాయ పొలాల్లోని బోరు బావుల నీటిని ప్రజలు వినియోగిస్తున్నారు.
కొత్త గ్రామాలకే కొద్దిగా ఇబ్బంది
ప్రస్తుతం మిషన్ భగీరథ నీటి సరఫరాలో పెద్దగా ఇబ్బందులేవీ ఎదురుకావడం లేదు. రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలున్నందున (మూడునెలలకు సరిపడేలా) మా పథకానికి ఎలాంటి సమస్యలు లేవు. కొత్తగా ఏర్పడిన గ్రామాలకు తప్ప దాదాపుగా అన్నింటికీ బల్క్ సప్లయ్ జరుగుతోంది. ఇటీవల ఆయా ప్రాంతాల్లో పిడుగులు పడడం, పవర్ పోవడం వల్ల మోటార్లను ఆపేయడంతో స్వల్పంగా అంతరాయం ఏర్పడుతోంది. ప్రతిరోజూ 98 శాతం గ్రామాలకు కుటుంబానికి 100 లీటర్ల చొప్పున సరఫరా అవుతోంది.
మిషన్ భగీరథకు సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా నీటి సరఫరాలో సమస్యలుంటే వెంటనే మాకు సమాచారం వస్తుంది. ఉదయం పూట గంట పాటు తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్షిస్తాం. సమస్యలున్న ప్రాంతాలను గుర్తించి నీటి సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. – జి.కృపాకర్‌రెడ్డి, ఈఎన్‌సీ, మిషన్ భగీరథ