
కొత్త శనగ వంగడానికి వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని పేరు పెట్టడంపై హర్షం
ఎక్కువ దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలు కనుక్కుంటానమ్మా అనేది అంటూ అశ్విని తల్లి భావోద్వేగం
కారేపల్లి/ గార్ల: అతిచిన్న వయసులోనే వ్యవసాయ పరిశోధనలో అద్భుత ప్రతిభ కనబరిచి, అకాల మరణం చెందిన తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) కొత్తగా ఆవిష్కరించిన ‘పూస శనగ–4037’అనే వంగడానికి ‘అశ్విని’పేరు పెట్టింది. ఈ నెల 14న ఢిల్లీలో ఐఏఆర్‌ఐ ఈ కొత్త రకాన్ని విడుదల చేసింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సరిహద్దు గ్రామమైన గంగారం తండాకు చెందిన నూనావత్ అశ్విని, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసి గోల్డ్ మెడల్స్ సాధించారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. గతేడాది సెప్టెంబర్ 1వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లో ఓ సెమినార్‌లో పాల్గొనేందుకు తండ్రి మోతీలాల్‌తో కలిసి స్వగ్రామం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ సమీపంలో ఆకేరు వాగు వరద ప్రవాహంలో వారు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో మోతీలాల్‌తోపాటు అశ్విని కూడా దుర్మరణం చెందారు. ఆ సెమినార్‌లోనే అశ్విని అవార్డు అందుకోవాల్సి ఉంది.
అవార్డు అందుకోకుండానే అకాల మరణం చెందిన ఆమెకు గుర్తింపుగా కొత్త శనగ వంగడానికి అశ్విని పేరు పెట్టారు. అశ్వినికి గొప్ప గౌరవం లభించటంపై ఆమె కుటుంబ సభ్యులు, తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అశ్విని తల్లి నేజా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కొత్త వంగడానికి తన బిడ్డ పేరు పెట్టడంతో ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పింది.‘తక్కువ పెట్టుబడితో అత్యధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలను కనుక్కుంటానమ్మా.. నా ఉద్యోగం అదే.. నన్ను వ్యవసాయ శాస్త్రవేత్త అంటారమ్మా అని నా బిడ్డ చెప్పింది’ అని నేజా భావోద్వేగానికి గురైంది.
చదువుల తల్లి
అశ్విని చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉండేది. ఆమె 10వ తరగతి వరకు కారేపల్లిలో, ఇంటర్ విజయవాడలో పూర్తిచేసింది. అగ్రికల్చర్ బీఎస్సీ అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో చదివి బంగారు పతకం సాధించింది. ఆ తర్వాత ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసింది. రాయ్‌పూర్‌లో శాస్త్రవేత్తగా పనిచేసిన ఆమె.. గత ఏడాది సోదరుడి వివాహ నిశ్చితార్థం ఉండడంతో స్వగ్రామానికి వచ్చింది. అనంతరం తిరుగు ప్రయాణంలో ఆకేరు ప్రవాహంలో చిక్కుకుని తండ్రీకుమార్తె మృతి చెందారు.