Agricultural scientists
-
నాస్ ఫెలోగా NIN సైంటిస్ట్ భానుప్రకాష్
జాతీయ వ్యవసాయ అకాడమీ(National Academy of Agricultural Sciences) ఫెలోగా జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) సీనియర్ శాస్త్రవేత్త, బయోకెమిస్ట్రీ విభాగం సారథి డాక్టర్ భానుప్రకాష్ రెడ్డి ఎంపికయ్యారు. పోషకాహార రంగంలో భానుప్రకాష్ చేసిన విస్తృతపరిశోధనలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవకాశం దక్కిందని ఎన్ఐఎన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.మనిషికి ఎంత పోషకాహారం కావాలి? పోషకాహార లోపాలు, నిత్యం ఉపయోగించే వంట దినుసులతో అనేక వ్యాధులను ఎలా దరిచేరకుండా చూసుకోవచ్చనే అంశాలపై భానుప్రకాష్ దశాబ్దాలుగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వంట దినుసులతో మధుమేహాన్ని(Diabetes) ఎలా దరిచేరకుండా చూసుకోవచ్చనే దానిపై విజయవంతంగా పరిశోధనలు నిర్వహించారు. అంతేకాదు.. జాతీయ, అంతర్జాతీయంగా 250 పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు. ఐసీఎంఆర్-బసంతి దేవి అవార్డుతో పాటు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను భానుప్రకాష్ అందుకున్నారు. -
నూతన వంగడాలను ఆవిష్కరించిన మోదీ
న్యూఢిల్లీ: కరువు కాటకాలను, నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకుంటూనే అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. వీటిలో 61 పంటలకు సంబంధించిన 109 రకాల విత్తనాలున్నాయి. వీటిలో 34 ఆహార, వాణిజ్య పంటల వంగడాలు కాగా 27 ఉద్యాన పంటలకు చెందినవి. పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, చెరకు, పత్తి, మొక్కజొన్న, పూలు, పండ్లు, కూరగాయలు, దినుసులు, ఔషధ గుణాల మొక్కల విత్తనాలు ఇలా పలురకాల నూతన వంగడాలను ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో ప్రధాని వీటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో మోదీ ముచ్చటించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్) ఈ నూతన వంగడాలను అభివృద్ధిచేసింది. ఏటా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయానికి అదనపు విలువ జోడింపు ప్రస్తుతం తక్షణ అవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు. కొత్త వంగడాల విశిష్టతపై అక్కడి రైతులతో కలిసి చర్చించారు. తక్కువ నిర్వహణ వ్యయం కారణంగా నూతన వంగడాలతో తమకు మరింత లబ్ధి చేకూరనుందని అక్కడి రైతులు చెప్పారు. ‘‘ తృణధాన్యాల గొప్పదనం, వాటిలోని పోషకవిలువ గురించి తెలిశాక ప్రజలు వాటి వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. సేంద్రియ వ్యవసాయం ఎంతో మేలు. ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. సేంద్రీయ ఆహారం కావాలని జనం అడిగి మరీ కొనుగోలుచేస్తున్నారు. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన వంగడాలపై దేశవ్యాప్తంగా కృషి విజ్ఞాన్ కేంద్రాలు రైతులకు అవగాహన పెంచాలి. కొత్త రకాలను సృష్టిస్తున్న శాస్త్రవేత్తలకు నా అభినందనలు’’ అని మోదీ అన్నారు. సహజసిద్ధ సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పట్ల తమలో సానుకూలత పెరిగిందని, కృషి విజ్ఞాన్ కేంద్రాల పాత్ర ఇందులో కీలకమని రైతులు చెప్పారని ప్రభుత్వం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వంగడాల్లో పోషక విలువలు మెండుగా ఉంటాయని తర్వాత ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. -
పీవీ, చరణ్ సింగ్ సహా నలుగురికి భారతరత్న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్లకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రదానం చేశారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌదరి, ఎంఎస్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ తరఫున కుమారుడు రాంనాథ్ ఠాకూర్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సేవలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీజేపీ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఆదివారం ఆయన నివాసంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. -
Sagubadi: చౌడు సాగుకు చేదోడు కొత్త బ్యాక్టీరియా!
'సాధారణ వరి వంగడాల పంటకు ఉప్పు నీరు తగిలితే ఆకులు పసుపు రంగులోకి మారిపోయి, ఎదుగుదల లోపించి, దిగుబడి తగ్గిపోతుంది. అయితే, కేరళ తీరప్రాంతంలో లోతట్టు మాగాణుల్లో ఉప్పు నీటిలోనూ పొక్కలి వరి వంగడం చక్కగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. ఇందుకు దోహదపడుతున్న మట్టి మర్మమేమిటి? అని అల్లాపుఝలోని సనాతన ధర్మ కాలేజీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేసి ఓ సరికొత్త బ్యాక్టీరియాను కనుగొన్నారు. పొక్కలి రకం వరి సాగయ్యే సేంద్రియ పొలాల్లోని మట్టిలో ఉండే సూడోమోనాస్ తైవానెన్సిస్ (పికె7) వల్లనే ఉప్పు నీటిని ఆ పంట తట్టుకోగలుగుతోందని వారు తేల్చారు.' కుట్టనాడ్ ప్రాంతంలో విస్తారంగా సాగయ్యే యుఎంఎ అనే రకం వరికి ఉప్పునీటి బెడద ఎక్కువైన నేపథ్యంలో ఈ అధ్యయనం జరిగింది. పికె7తో పాటు పంట పెరుగుదలకు దోహదం చేసే రైజోబ్యాక్టీరియా (ఎస్.టి.–పిజిపిఆర్లు) కూడా వాడి యుఎంఎ రకం వరిని ప్రయోగాత్మకంగా సాగు చేసి చూశారు. ఈ బ్యాక్టీరియాలు వాడి సాగు చేస్తే హెక్టారుకు 7,595 కిలోల ధాన్యం దిగుబడి వస్తే.. వాడకుండా సాగు చేస్తే హెక్టారుకు 7,344 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. అంటే.. పికె7 బ్యాక్టీరియా ఉప్పు వల్ల కలిగే ప్రతికూలతను తట్టుకొని వరి పంట నిలబడే వ్యవస్థను సృష్టిస్తోందని అర్థమవుతోందని పరిశోధకులు నిర్థారణకు వచ్చారు. 2022 డిసెంబర్ – ఏప్రిల్ 2023 మధ్య కాలంలో జరిగిన ఈ అధ్యయన వివరాలతో కూడిన వ్యాసం జర్నల్ ఆఫ్ అగ్రానమీ అండ్ క్రాప్ సైన్స్‌లో ప్రచురితమైంది. మన చౌడు భూముల్లోనూ వరి, తదితర పంటల సాగుకు ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందేమో మన శాస్త్రవేత్తలు పరిశోధించాలి. 'పొక్కలి’ పొలంలో మట్టి సేకరణ 67.3 లక్షల హెక్టార్లలో చౌడు సమస్య.. మన దేశంలో చౌడు బారుతున్న నేలల (సాల్ట్–ఎఫెక్టెడ్ సాయిల్స్) విస్తీర్ణం ఇటీవల కాలంలో వేగంగా పెరుగుతోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్)కు చెందిన కేంద్రీయ చౌడు నేలల పరిశోధనా సంస్థ (సిఎస్ఎస్ఆర్ఐ) ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం మన దేశంలో 67 లక్షల 30 వేల హెక్టార్ల సాగు భూమి చౌడుబారింది. 2050 నాటికి ఇది రెట్టింపవుతుందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. భూములు చౌడుబారటం వల్ల మన దేశంలో ఏటా 1.68 కోట్ల టన్నుల పంట దిగుబడిని నష్టపోతున్నాం. ఈ పంట విలువ రూ. 23 వేల కోట్లు (2015 నాటి ధరల ప్రకారం). చౌడు భూముల్లో పంటలు బతకవు. బతికినా పెద్దగా పెరిగి దిగుబడినివ్వవు. వ్యవసాయోత్పత్తిని దెబ్బతీయటమే కాదు సాంఘిక–ఆర్థిక స్థితిగతులను సైతం చౌడు సమస్య అతలాకుతలం చేస్తుంది. మురుగునీటి పారుదల సదుపాయం సమర్థవంతంగా లేకపోవటం, భూముల్లో అతిగా నీరు నిల్వ ఉండిపోవటం ఇందుకు ప్రధాన కారణాలు. రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులు, పంటలకు అందించే భూగర్భ జలాల నాణ్యత నాసికరంగా ఉండటం కూడా తోడవుతున్నాయి. చౌడు సమస్య మన దేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధి దెబ్బతింటోంది. ఏటా వీరికి కలుగుతున్న నష్టం 630 కోట్ల డాలర్లని అంచనా. వంద దేశాల్లో 83.5 కోట్ల హెక్టార్ల భూమి చౌడుబారిన పడింది. ఇందులో మనుషుల పనుల వల్ల చౌడువారిన భూములు 7.6 కోట్ల హెక్టార్లు ఈ నేపధ్యంలో కేరళలో కనుగొన్న కొత్త సూక్ష్మజీవి చౌడు భూముల సాగులో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆశిద్దాం..! 13న బయోచార్ సొసైటీ ఆవిర్భావం! కట్టె పులల్ల నుంచి పర్యావరణ హితమైన బయోచార్ (బొగ్గుపొడి) ఉత్పత్తిని, వాడకాన్ని పెంపొందించే సదుద్దేశంతో భారతీయ బయోచార్ సొసైటీ ఆవిర్భవిస్తోంది. బొగ్గుపొడి సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుంది. దీంతో పాటు నీటి శుద్ధి, పారిశుద్ధ్యం తదితర అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బయోచార్‌కు కార్బన్ క్రెడిట్స్ చేకూర్చే పరిస్థితులు ఉండటంతో జీవనోపాధులను పెంపొందించడానికి కూడా ఇది దోహదపడనుంది. ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5–7 గంటల మధ్య హైదరాబాద్ యూసఫ్‌గూడలోని ఎన్.ఐ.–ఎం.ఎస్.ఎం.ఇ. కార్యాలయ ఆవరణలో బయోచార్ సొసైటీ ఆవిర్భావ సభ జరగనుంది. ఆర్.కె. మెహతా చైర్మన్‌గా, డా. నక్కా సాయిభాస్కర్రెడ్డి ప్రెసిడెంట్‌గా, ఎస్.కె. గు΄్తా కార్యదర్శిగా భారతీయ బయోచార్ సొసైటీ ఆవిర్భవిస్తోంది. వివరాలకు.. 6305 171 362. 1 నుంచి పల్లెసృజన శోధా యాత్ర.. గ్రామీణుల్లో నిగూఢంగా దాగి ఉన్న తరతరాల జ్ఞానాన్ని శోధించడానికి, ప్రకృతితో మమేకమైన వారి జీవన విధానం గురించి తెలుసుకోవడానికి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి గ్రామం నుంచి గన్నారం గ్రామం వరకు చిన్న శోధాయాత్ర నిర్వహించనున్నట్లు పల్లెసృజన సంస్థ అధ్యక్షులు బ్రిగేడియర్ పోగుల గణేశం తెలిపారు. మార్చి 1 నుంచి 3 వరకు జరిగే ఈ యాత్రలో రూ.500 రుసుము చెల్లించి ఆసక్తిగల వారెవరైనా ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 98660 01678, 99666 46276. నిర్వహణ: – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Sagubadi: ఎక్కడి నుంచైనా.. మోటర్ ఆన్, ఆఫ్! -
ఎన్జీ రంగా వర్సిటీలో పరిశోధనలు భేష్
ల్లూరు(సెంట్రల్): నెల్లూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలోని పరిశోధనలు చాలా బాగున్నాయని, అమెరికాలోని టెన్నెసీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్స్ దిలీప్ నందు వాణి, ప్రొఫెసర్ జాన్ రికార్డ్స్ ప్రశంసించారు. నెల్లూరు నగరంలోని పరిశోధనా క్షేత్రాన్ని బుధవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానాలను తాము పరిశీలించామని, అన్నిచోట్ల చాలా బాగున్నాయని కొనియాడారు. అదేవిధంగా నెల్లూరులో ఉన్న ఎన్జీ రంగా పరిశోధనా క్షేత్రంలో పరిశోధనలు తమకు ఎంతో సంతృప్తినిచ్చాయని వివరించారు. తమ ప్రాంతంలో ఉన్న విద్యార్థులను కూడా నెల్లూరులోని పరిశోధనా క్షేత్రానికి పంపి ఇక్కడి స్థితిగతులను తెలుసుకునేలా చేస్తామన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కోదండరామిరెడ్డి, డాక్టర్ గురవారెడ్డి, డాక్టర్ సి.రమణ, ప్రధాన శాస్త్రవేత్త వినీత ఈ బృందానికి క్షేత్రంలో చేస్తున్న పరిశోధనలను వివరించారు. ప్రధానంగా కొత్త వంగడాలు, తెగుళ్ల నివారణపై కూలంకషంగా వివరించారు. -
ఆర్బీకేల హేతుబద్ధీకరణ
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకేలను) వైఎస్ జగన్ ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన ఉన్న ఆర్బీకేలను పంటల విస్తీర్ణం ప్రాతిపదికన హేతుబద్దీకరణ (రేషనలైజేషన్)కు నిర్ణయించింది. అవసరానికి మించి ఉన్న మండలాల్లోని ఆర్బీకేల సిబ్బందిని తక్కువ ఉన్న మండలాలకు సర్దుబాటు చేయనుంది. అక్టోబర్ కల్లా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసి, ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాత నవంబర్‌లో తాజా పోస్టింగుల ఉత్తర్వులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల గుమ్మం వద్దకు పౌర సేవలందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాలకు అనుబంధంగా రైతు సేవల కోసం ప్రత్యేకంగా 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్వపు జిల్లా ప్రాతిపదికన జరిగిన నియామకాల ద్వారా వీటిలో 6,218 మంది వ్యవసాయ, 2,352 మంది ఉద్యాన, 374 మంది పట్టు సహాయకులతో పాటు 4,652 మంది పశుసంవర్ధక, 731 మంది మత్స్య సహాయకులు ఆర్బీకేల్లో సేవలందిస్తున్నారు. వీరికి అదనంగా 904 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో), 1,396 మంది వ్యవసాయ మలీ్టపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (ఎంపీఈవో), 77 మంది ఉద్యాన ఎంపీఈవోలు పని చేస్తున్నారు. ఆర్బీకేలను పంటల విస్తీర్ణం ప్రాతిపదికన కాకుండా జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఒక్కో ఆర్బీకేకు స్థానికంగా సాగయ్యే పంటలనుబట్టి గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులను ఇన్చార్జిలుగా నియమించారు. సిబ్బందిపై పనిఒత్తిడి తగ్గించడమే లక్ష్యం కొన్ని మండలాల్లో ఒక సచివాలయం పరిధిలో రెండు, అంతకు మించి ఆర్బీకేలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా ఒకే మండలంలో కొన్ని ఆర్బీకేల పరిధిలో సాగు విస్తీర్ణం పదుల ఎకరాల్లో ఉంటే, కొన్నింటిలో వందల ఎకరాలు, మరికొన్నింటిలో 7 వేలు, 8 వేల ఎకరాల్లో ఉంది. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఆర్బీకేల్లో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. సర్టీఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ, పంటల వివరాలను ఈ క్రాప్ యాప్‌లో నమోదు చేయడం, పొలాలకు వెళ్లి ఫొటోలతో పాటు రైతుల ఈ కేవైసీ నమోదు చేయడం, వైపరీత్యాల వేళ నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేయడం, పంట కోత ప్రయోగాలు, పంటల బీమా అమలు.. ఇలా రైతుల కోసం ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములవ్వాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్బీకే వ్యవస్థలో హేతుబద్ధీకరణకు ప్రభుత్వం సంకల్పించింది. విస్తీర్ణం ప్రాతిపదికన సిబ్బంది సర్దుబాటు హేతుబద్ధీకరణలో భాగంగా పంటల విస్తీర్ణం ప్రాతిపదికన మండలం యూనిట్‌గా సిబ్బందిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో 600 నుంచి 800 ఎకరాలకు, మైదాన ప్రాంతాల్లో 1000 నుంచి 1500 ఎకరాలకు ఒకరు చొప్పున సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేస్తోంది. అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర మండలాల్లో సర్దుబాటు చేస్తారు. స్థానికంగా సాగయ్యే ఉద్యాన, పట్టు పంటలను బట్టి వీఎస్ఏ, వీహెచ్ఎలకు తొలి ప్రాధాన్యతనిస్తారు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న చోట ఉద్యాన ఎంపీఈవోలను సర్దుబాటు చేస్తారు. వ్యవసాయ పంటలు సాగు ఎక్కువగా ఉంటే ఏఈవో, వ్యవసాయ ఎంపీఈవోలను సర్దుబాటు చేస్తారు. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఏఈవో, ఏంపీఈవోలను నియమిస్తారు. ఏఈవోలను జిల్లా పరిధిలో సర్దుబాటు చేస్తుండగా, ఎంపీఈవోలను అవసరాన్ని బట్టి ఇతర జిల్లాల పరిధిలో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించారు. ఖరీఫ్ తర్వాతే రిపోర్టింగ్ ప్రస్తుతం ఖరీఫ్–2023 సీజన్ ఈ క్రాప్ బుకింగ్ జోరుగా సాగుతోంది. మరో వైపు కోతలు ప్రారంభమైన తర్వాత ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాతే సర్దుబాటు చేసిన సిబ్బంది వారికి కేటాయించిన స్థానాల్లో రిపోర్టింగ్ చేయాలి. జిల్లాల పరిధిలో స్థానిక అవసరాలనుబట్టి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ -
Father of Green Revolution: ఎం.ఎస్. స్వామినాథన్ కన్నుమూత
సాక్షి, చెన్నై: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్(98) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. దేశంలో ఆకలితో అలమటించే అభాగ్యులు ఉండకూడదన్న లక్ష్యంతో జీవితాంతం పోరాటం సాగించిన మహా మనిషి తమిళనాడు రాజధాని చెన్నైలోని తన స్వగృహంలో గురువారం ఉదయం 11.15 గంటలకు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు డాక్టర్ సౌమ్యా స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యా రాయ్ ఉన్నారు. భార్య మీనా స్వామినాథన్ గతంలోనే మృతిచెందారు. భారత్‌లో 1960వ దశకం నుంచి హరిత విప్లవానికి బాటలు వేసి, ఆహారం, పౌష్టికాహార భద్రత కోసం అలుపెరుగని కృషి చేసిన స్వామినాథన్‌ను ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్, రామన్ మెగసెసే, మొట్టమొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సహా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. స్వామినాథన్ పారీ్థవదేహాన్ని చెన్నై తేనాంపేట రత్నానగర్‌లో ఉన్న నివాసం నుంచి గురువారం రాత్రి తరమణిలోని ఎం.ఎస్.స్వామినాథన్ ఫౌండేషన్‌కు తరలించారు. శుక్రవారం అప్తులు, ప్రముఖుల సందర్శనార్థం పారీ్థవ దేహాన్ని ఇక్కడే ఉంచుతారు. విదేశాల్లో ఉన్న కుమార్తె చెన్నైకి రావాల్సి ఉండడంతో శనివారం స్వామినాథన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు చెప్పారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి ఎం.ఎస్.స్వామినాథన్ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. మానవాళి కోసం భద్రమైన, ఆకలికి తావులేని భవిష్యత్తును అందించే దిశగా ప్రపంచాన్ని నడిపించడానికి మార్గదర్శిగా పనిచేశారని స్వామినాథన్‌పై రాష్ట్రపతి ముర్ము ప్రశంసల వర్షం కురిపించారు. ఘనమైన వారసత్వాన్ని మనకు వదిలి వెళ్లారని చెప్పారు. స్వామినాథన్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన హరిత విప్లవానికి నాంది పలికారని, కోట్లాది మంది ఆకలి తీర్చారని, దేశంలో ఆహార భద్రతకు పునాది వేశారని కొనియాడారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కృషితో కోట్లాది మంది జీవితాలు మారాయని మోదీ గుర్తుచేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గురువారం స్వామినాథన్ పారీ్థవదేహానికి అంజలి ఘటించారు. ఆయన మరణం దేశానికి, రైతు ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. స్వామినాథన్ మరణం పట్ల తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాం«దీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
శిఖర సమానుడైన శాస్త్రవేత్త
భారతదేశ వ్యవసాయ రంగాన్ని తలుచుకోగానే స్ఫురించే మొదటిపేరు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్. వ్యవసాయంలో ఆధునిక విధానాలను ప్రవేశ పెట్టడం ద్వారా ఆహార భద్రతను పెంచి దేశానికి ఆయన హరిత విప్లవ పితామహులయ్యారు. ‘ఓడ నుంచి నోటికి’ అన్నట్టుగా ఉన్న కరువు పరిస్థితుల నుంచి, దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి వెలగట్టలేనిది. అందుకు అనుగుణంగా ఎన్నో సంస్థల ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. రైతుల జీవితాలను మెరుగు పరచడానికి చివరిదాకా పనిచేస్తూనే ఉన్నారు. అదే సమయంలో హరిత విప్లవ అనంతర దుష్ఫలితాలకు కూడా ఆయన బాధ్యత వహించాలన్న విమర్శలూ వచ్చాయి. ఏమైనా ఆయన లేకుండా భారతదేశ వ్యవసాయ రంగ మంచిచెడ్డలు లేవు. 1947 ఆగస్ట్ 16న అన్ని పత్రికల మొదటి పేజీలూ ప్రధాని నెహ్రూ ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగాన్ని కవర్ చేశాయి. రెండో పేజీలో రానున్న ఆహార సంక్షోభం గురించి ఎం.ఎస్. స్వామినాథన్ చేసిన హెచ్చరిక ఉంది. ఆహార భద్రత విషయంలో ఆయన దేశానికి మార్గదర్శనం చేశారు. – ప్రణవ్ ప్రతాప్ సింగ్, పొలిటికల్ కన్సల్టంట్ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎం.ఎస్. స్వామినాథన్ గారు 98 సంవత్సరాల సంపూర్ణ జీవితం గడిపిన తర్వాత ఈ రోజు (సెప్టెంబర్ 28) చని పోయారు. భారత వ్యవసాయ రంగంలో అనేక కీలకమైన మలుపుల వెనుక అయన నిర్ణయాలు, ఆలోచనలు ఉన్నాయి. హరిత విప్లవం పేరుతో అధిక దిగుబడినిచ్చే వంగడాలు, రసాయనాలు, నీరు, మెషీన్లు వాడటం వంటివి తేవటంతో పాటు, వీటికి సహకారం అందించటానికి జాతీయ స్థాయిలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, విస్తరణ వ్యవస్థ, రుణాలు అందించటానికి బ్యాంకుల జాతీయీకరణ, మద్దతు ధరలు, సేకరణ కోసం భారతీయ ఆహార సంస్థ, ఆహార భద్రత కోసం జాతీయ పంపిణీ వ్యవస్థ లాంటివి ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్, అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ డైరెక్టర్ వరకు అనేక కీలకమైన పదవులు కూడా అయన నిర్వహించారు. రైతుల హక్కుల కోసం... తర్వాతి కాలంలో జాతీయ రైతు కమిషన్ చైర్ పర్సన్‌గా – భారత వ్యవసాయ రంగం అభివృద్ధిని ఎంత దిగుబడులు పెంచాము అని కాకుండా, రైతుల ఆదాయం ఎంత పెంచాము అని ఆలోచించాలి అనీ, రైతులకు వచ్చే ధరలు ఉత్పత్తి ఖర్చులపై కనీసం యాభై శాతం ఉండాలి అనీ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో వ్యవసాయ రంగంలో మహిళల ప్రాధాన్యం గుర్తించి, దానికి అనుగుణంగా విధానాలు ఉండాలి అని మహిళా రైతుల హక్కుల చట్టం ముసాయిదా తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. గ్రామాల్లోని ప్రజలు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వచ్చినప్పుడే వ్యవసాయంలో మార్పులు వస్తాయన్న ఆలోచనతో గ్రామాల్లో క్లైమేట్ స్కూల్స్ లాంటివి స్థాపించడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావం వ్యవసాయ రంగం మీద ఎలా ఉంటుంది, ఆ మార్పులను ఎదుర్కోవడానికి రైతులు ఏం చేయాల్సి ఉంటుంది, ప్రభుత్వ విధా నాలు ఎలా మారాల్సి ఉంటుంది అనే అంశాలపై పరిశోధన చేయడమే గాకుండా ఆ దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తేగలిగారు. అయితే, వ్యవసాయ రంగంలో ఉన్న విభిన్న పరిస్థితులు, విభిన్న అవసరాలు, విభిన్న దృక్కోణాల మధ్యలో నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎదురయ్యే అనేక వివాదాలు కూడా అయన చుట్టూ ఉన్నాయి. హరిత విప్లవం ద్వారా వచ్చిన దుష్ఫలితాలకు ఆయనే భాద్యులు అనీ, జాతీయ జీవ వైవిధ్యం కోల్పోవటం, విదేశాలకు తరలి పోవటంలో అయన పాత్ర ఉందనీ, అనేక ఆరోపణలు ఉన్నాయి. కానీ అయన జీవన ప్రయాణాన్ని దగ్గరగా చూసిన వాళ్ళు కాని, ఆయనతో ఒక్కసారి మాట్లాడిన వాళ్ళు కాని చెప్పే అనుభవాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. తను కలిసిన ప్రతి వ్యక్తినీ పేరుతో గుర్తు పెట్టుకొని పలకరించే అలవాటు ఆయనకు ఉండేది. జాతీయ పరి శోధనా సంస్థలో ఆయన పని చేసినప్పుడు పొలంలో పనిచేసిన కూలీ లను... ఆ తర్వాత ఆయన జాతీయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ అయినప్పుడు కూడా పేరుతో పలకరించేవాడని చెప్పేవారు. నేను భారతీయ పరిశోధనా సంస్థలో పీహెచ్డీ చేస్తున్న సమయంలో ఒక విద్యార్థి తన పరిశోధనా పత్రం కోసం ఆయనని ఇంటర్వ్యూ చేస్తూ – ‘నాయకత్వ లక్షణాలు ఎలా వుండాలి?’ అని అడిగితే, ‘ఎట్టి పరిస్థితులలో నైనా కోపం తెచ్చుకోకుండా ఉండటమే నాయకత్వ లక్షణం’ అని చెప్పారు. 2005లో జాతీయ నాలెడ్జ్ కమిషన్ ఉప కమిటిలో సభ్యునిగా ఆయనని కలవటం, చర్చించటం... ఆ తర్వాతి కాలంలో మేము సుస్థిర వ్యవసాయంపై చేసిన ప్రయోగాలు, ఫలితాలు, రైతులకు ఆదాయ భద్రత కల్పించాలి అనే విషయం మీద చేసిన సూచనల విషయంలోనూ అయన స్పందించి, తన ఆలోచనలు పంచుకోవటమే కాకుండా, వాటి గురించి రాసి సహకరించారు. విధానాలను మార్చేలా... జీవవైవిధ్యాన్ని కాపాడటం కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేసిన ప్రయత్నాల వెనుక స్వామినాథన్ ప్రయత్నాలు ఉన్నాయి. జీవవైవిధ్య చట్టం, బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ స్థాపనలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. మన హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ సంస్థ ఏర్పాటు కూడా ఆయన ప్రయత్నాలతో జరిగినదే. భారత దేశంలో ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయాల మేరకు మేధా సంపత్తి హక్కుల గురించి చర్చలు జరిగి చట్టం చేసినప్పుడు,అందులో రైతులకు హక్కులు ఉండాలని పోరాడి, వాటిని కూడా చట్టంలోకి చేర్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రైతులు కాపాడుతూ వస్తున్న జీవ వైవిధ్యాన్ని డాక్యుమెంట్ చేసి, దానికి చట్టబద్ధమైన హక్కులు కల్పించే దిశగా తన స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా కృషి చేశారు. వ్యవసాయ సమస్యలపై, పరిష్కారాలపై ఆయన మాట్లాడినంత, రాసినంత ఏ ఇతర వ్యవసాయ శాస్త్రవేత్త కూడా ఈ రోజు వరకు చేయలేదు. ప్రభుత్వాలు చెప్పిందే చేయటం కాకుండా, ప్రభుత్వాలు ఏమి చేయాలో చెప్పి వారి చేత ఒప్పించి అనేక మార్పులు చేయటం అయన చేయగలిగారు. 1972లో జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్‌గా నియమించబడిన ఆయన, 1979లో ప్రిన్సిపాల్ సెక్రటరీగా కూడా నియమించబడ్డారు. బహుశా అలాంటి గుర్తింపు పొందిన ఏకైక శాస్త్రవేత్త డా‘‘ స్వామినాథన్. ఇండియన్ పోలీస్ సర్వీస్‌కి ఎంపిక అయినా, వ్యవసాయ సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ రంగంలోకి రావటమే కాకుండా, జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక సంస్థలను స్థాపించారు. సొంతంగా ఎం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టారు. తన సొంత ఆస్తిలో చాలా భాగం భూదాన ఉద్యమంలో ఇచ్చివేసిన మనిషి కూడా. ఆయన జీవితం ఎందరికో ప్రేరణ, స్ఫూర్తి. రైతుల తరఫున, వ్యవసాయ విద్యార్థులు, శాస్త్రవేత్తల తరఫునా ఆయనకు ఘన నివాళి. డా‘‘ జి.వి.రామాంజనేయులు వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ, సుస్థిర వ్యవసాయ కేంద్రం -
అధిక వర్షాలతో పత్తికి విపత్తు
సాక్షి, హైదరాబాద్: వారం క్రితం వరకు వర్షాలు లేక ఇబ్బందులు పడగా, ఇప్పుడు ఎడతెరపి లేని వర్షాలతో పంటలను ఎలా కాపాడుకోవాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక చోట్ల పత్తి పంటకు చేటు కలుగుతోంది. పత్తితోపాటు ఇతర ఆరుతడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్న, కంది వంటి పంటలకు కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల విత్తనాలు చల్లినచోట అధిక వర్షాలతో మునిగిపోయి ఆయా విత్తనాలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొలక వచ్చినచోట కలుపు సమస్య, వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లు వస్తున్నాయి. వీటికి తోడు నిరంతర వర్షాల కారణంగా బ్యాక్టీరియా తెగుళ్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాలు మొలకెత్తని చేలల్లో ఎక్కువ నీరు నిలిచిపోయే పరిస్థితి వస్తే పత్తి, సోయా, కంది వంటివి చేతికి రావనీ, వాటిని మరోసారి విత్తుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం మాజీ సంచాలకులు ప్రొఫెసర్ జగదీశ్వర్ అంటున్నారు. 38 లక్షల ఎకరాల్లో పత్తి సాగు... రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 57.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, 46.06 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇటీవల వర్షాలు పుంజుకోవడంతో వ్యవసాయ పంటల సాగు ఊపు మీద ఉంది. కాగా, పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37.98 లక్షల ఎకరాల్లో (75.07%) సాగైంది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.94 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.05 లక్షల ఎకరాల్లో (98.21%) సాగైంది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల్లో సాగైంది. వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో ఆయా పంటలను కాపాడుకోవడం ఇప్పుడు రైతులకు కీలకమైన అంశంగా జగదీశ్వర్ చెబుతున్నారు. రైతులు ఏం చేయాలంటే? ఆరుతడి పంటలైన పత్తి, కంది, పెసర, సోయాచిక్కుడు, మొక్కజొన్న పంటల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమ పొలాల్లో నిలిచిన మురుగునీరు పోయేందుకు కాల్వలు ఏర్పరచాలి. వర్షాలు ఆగిన వెంటనే తమ పొలాల్లో కలుపు ఏమాత్రం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రై తులు పంటల వారీగా కలుపు మందులను ఎంచుకొని సరైన మోతాదులో పిచికారీ చేయాలి. సాధ్యమైనంతవరకు గుంటకతో కానీ, దంతెలతో గానీ కలుపు తీసివేయాలి. పత్తిలో అధిక వర్షాలకు వేరుకుళ్లు, కాండం కుళ్లు, కాయ కుళ్లు ఆశించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కల మొదళ్లను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని లేదా కార్బండాజిమ్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలుపుకొని మొక్కల అడుగు భాగంలో పిచికారీ చేయాలి. ప్రస్తుతం భూమిలో తేమను ఆధారం చేసుకొని ఆరుతడి పంటల్లో పైపాటుగా ఎరువులను యూరియా 30 కేజీలు, పొటాష్ 15 నుంచి 20 కేజీలు కలుపుతీసిన తర్వాత మొక్కలకు బెత్తెడు దూరంలో మట్టిలో లోతుగా వేయాలి. మే జూన్లలో వేసిన పత్తిలో వర్షాలు ఆగిన వెంటనే పేనుబంక, పచ్చదోమ ఆశించేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం ఎస్పేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. వర్షాలకు వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు లేదా అగ్గితెగులు సోకేందుకు చాలా అనుకూల వాతావరణం ఉంది. దీంతో వర్షాలు ఆగిన వెంటనే ప్రైసైక్లోజల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని అగ్గి తెగులు నివారణకు చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం బ్యాక్టీరియా తెగులు గమనించినట్లయితే తాత్కాలికంగా నత్రజని ఎరువులను వేయడం, వారం పది రోజుల వరకు ఆగి ముందస్తు చర్యగా కాపర్ఆజిక్లోరైడ్ 30 గ్రాములు, స్ట్రెప్లోమైసిన్ సల్ఫేట్ రెండు గ్రామలు పది లీటర్ల నీటికి కలుపుకొని ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వరిలో ప్రస్తుతం వర్షాలను ఉపయోగించుకొని జూలై మాసాంతం వరకు స్వల్పకాలిక రకాలు (125 రోజులు) నారు పోసుకోవడానికి అనుకూలం. ఆ తర్వాత ఆగస్టు 15–20 తేదీల వరకు నాట్లు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మధ్యకాలిక రకాలు (135 రోజులు) లేదా స్వల్పకాలిక రకాలు కూడా నేరుగా దమ్ము చేసిన పొలంలో డ్రమ్ సీడర్ ద్వారా గానీ, వెదజల్లుకు నే పద్ధతిలో గానీ వరిని విత్తుకున్నట్లయితే దాదా పుగా 15–20 రోజుల సమయం కలిసి వచ్చి మంచి దిగుబడులు రావడానికి అవకాశముంది. వెదజల్లే పద్ధతిలో విత్తుకునేప్పుడు నేల బాగా చదును చేసి ఉండాలి. ఆ తర్వాత వరి విత్తిన మూడు నుంచి ఐదు రోజుల లోపుల సిఫారసు చేసిన కలుపుమందులు తప్పనిసరిగా వాడాలి. -
వెన్ను విరగని వరి!
నీళ్లు అందుబాటులో ఉండటంతో వరి ఏపుగా పెరిగింది.. నిండా గింజలతో కళకళలాడుతోంది.. కానీ ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగళ్లు, భారీ వర్షం.. అయినా వరి పెద్దగా దెబ్బతినలేదు. గింజలు నేల రాలలేదు.. నేలవాలిన మొక్కలు కూడా రెండు, మూడు రోజుల్లోనే తిరిగి నిలబడ్డాయి. మామూలుగా అయితే వరి నేలకొరిగి, ధాన్యం రాలిపోయి రైతు నిండా మునిగిపోయేవాడే. కానీ ఇది దేశీ రకాల వంగడం కావడంతో ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకుని నిలబడింది. అకాల వర్షాలు–పంట నష్టం సమస్యపై చర్చ జరుగుతున్న క్రమంలో.. వ్యవసాయ యూనివర్సిటీ దీనికి పరిష్కారంగా అభివృద్ధి చేసిన వరి వంగడాలు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు నెల రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈదురుగాలులు, వడగళ్ల ధాటికి లక్షల ఎకరాల్లో వరి నేల వాలింది. గింజలు రాలిపోయాయి. దీనిపై సమీక్ష చేసిన సీఎం కేసీఆర్.. వ్యవసాయ సీజన్లను ముందుకు జరిపే అంశాన్ని పరిశీలించాలని, అకాల వర్షాలు మొదలయ్యే లోపే పంట కోతలు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కానీ రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కో జిల్లాలో, ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయని.. సీజన్లను ముందుకు జరపడం కన్నా ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని వ్యవసాయ నిపుణులు సూచించారు. ఈ క్రమంలోనే అకాల వర్షాలను, వడగళ్లను తట్టుకుని నిలిచే వరి వంగడాల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న జేజీఎల్–24423 రకంతోపాటు.. త్వరలో అందుబాటులోకి రానున్న మరో ఏడు రకాల వంగడాల వివరాలను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వెల్లడించారు. తట్టుకుని నిలిచిన.. జేజీఎల్–24423.. వడగళ్లు, ఈదురుగాలులను తట్టుకునే వరి వంగడంగా జేజీఎల్–24423 ఇప్పటికే గుర్తింపు పొందింది. వ్యవసాయ వర్సిటీ పరిధిలోని జగిత్యాల పొలాస పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు 2019లో దీనిని విడుదల చేశారు. దీనిని 2022–23 వానాకాలం సీజన్లో 5–7 లక్షల ఎకరాల్లో, యాసంగిలో ఆరు లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇటీవలి ఈదురుగాలులు, వడగళ్ల వానలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వరి పడిపోయినా, గింజలు నేలరాలినా.. జీజీఎల్–24423 రకం వరి మాత్రం 90శాతం వరకు తట్టుకుని నిలిచినట్టు వ్యవసాయ వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఎత్తు తక్కువ.. చలిని తట్టుకుంటుంది.. జేజీఎల్–24423 వరి వెరైటీ రకాన్ని జగిత్యాల రైస్–1 అని కూడా అంటారు. ఎంటీయూ 1010, ఎన్‌ఎల్‌ఆర్–34449 రకాలని సంకరం చేసి దీనిని అభివృద్ధి చేశారు. ఇది వానాకాలం, యాసంగి రెండు సీజన్లకూ అనుకూలమైన సల్పకాలిక రకం. వానాకాలంలో దీని పంట కాలం 125 రోజులు, యాసంగిలో 135–140 రోజులు ఉంటుందని వర్సిటీ తెలిపింది. యాసంగిలో మార్చిలోగానే చేతికి వస్తుంది. ఈ వరి ఎత్తు తక్కువగా, కాండం ధృఢంగా ఉండటం వల్ల ఈదురుగాలులు, వడగళ్లకు పంట నేలకొరగదు. గింజ సులువుగా రాలిపోని గుణాన్ని కలిగి, బరువు అధికంగా ఉంటుంది. యాసంగిలో చలిని సమర్థవంతంగా తట్టుకోవడం వల్ల నారు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. దోమను కొంతవరకు తట్టుకొంటుంది. దమ్ము చేసిన మడిలో నేరుగా వెదజల్లే పద్ధతికి కూడా అనుకూలం. ఈ ధాన్యానికి మార్కెట్లో గ్రేడ్–ఎ కింద మద్దతు ధర లభిస్తుంది. వానాకాలంలో జూలై చివరివరకు, యాసంగిలో నవంబర్ 15 నుండి డిసెంబర్ మొదటి వారం వరకు నారు పోసుకోవచ్చు. దిగుబడీ ఎక్కువే.. జేజీఎల్–24423 వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు బియ్యం రికవరీ 58–61 శాతం మధ్య ఉంటుంది.. సాధారణంగా మిగతా వెరైటీలు 52–54 శాతమే బియ్యం వస్తాయి. కర్ణాటక, ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ రకాన్ని పండిస్తున్నారు. దిగుబడి ఎకరాకు 40–45 బస్తాల (25–28 క్వింటాళ్లు) వస్తుంది. పరిశోధన దశలోని ఏడు వంగడాలివీ.. 1) ఆర్ఎన్ఆర్–31479: ఇది 125 రోజుల్లో కోతకు వచ్చే రకం. బీపీటీ సాంబమసూరితో సమానంగా ఉండే సన్నగింజ రకం. హైదరాబాద్ రాజేంద్రనగర్ వర్సిటీలోనే పరిశోధన పూర్తయింది. రైతుల పొలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోంది. 2)కేపీఎస్–2874: మిర్యాలగూడ కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానంలో దీనిపై పరిశోధన పూర్తయింది. రైతుల పొలాల్లో పరిశీలన జరుగుతోంది. ఇది 125 రోజుల్లో దిగుబడి వస్తుంది. సన్నగింజ రకం. దోమను, చౌడును తట్టుకుంటుంది. 3) ఆర్ఎన్ఆర్–28361: రాజేంద్రనగర్ పరిశోధన కేంద్రంలో అభివృద్ధి చేశారు. ఇది దొడ్డుగింజ రకం. 130 రోజుల్లో చేతికి వస్తుంది. వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో వేయొచ్చు. దోమ, చౌడును తట్టుకుంటుంది. 4) జేజీఎల్–28639: జగిత్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంలో అభివృద్ధి చేశారు. ఇది దొడ్డుగింజ రకం. 125 రోజుల్లో చేతికి వస్తుంది. రెండు సీజన్లలోనూ వేయొచ్చు. దోమను, వడగళ్లను తట్టుకుంటుంది. – పై నాలుగు రకాల వరి దిగుబడి 42 నుంచి 46 బస్తాల మధ్య ఉంటుంది. క్షేత్రస్థాయిలో పొలాల్లో పరిశీలన పూర్తయి.. వచ్చే ఏడాది రైతులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ రకాలకు వానాకాలం సీజన్లో జూన్ చివరి నుంచి జూలై మూడో వారం వరకు నాట్లు వేసుకోవచ్చు. అక్టోబర్‌లో పంట చేతికి వస్తుంది. యాసంగి సీజన్‌కు అయితే నవంబర్ 15 తేదీ నుంచి నాట్లు వేసుకోవచ్చు. డిసెంబర్ 15నాటికి నాట్లు పూర్తిచేసుకోవాలి. మార్చి 15 నాటికి పంట చేతికి వస్తుంది. సీజన్ నెల రోజులు ముందే పూర్తయినట్టు అవుతుంది. ఈ రకాలకు పెట్టుబడి ఎకరానికి సాధారణం కంటే రూ. 2–3 వేలు తక్కువగా ఉంటుంది. 5, 6, 7) కేఎన్ఎం–12368, కేఎన్ఎం–12510, కేఎన్ఎం–7715: ఈ మూడు 130 నుంచి 135 రోజుల్లో కోతకు వచ్చే వరి రకాలు. వానాకాలానికి మాత్రమే అనుకూలమైనవి. జూన్ తొలకరి వర్షాలతోనే వేసుకోవచ్చు. అక్టోబర్ నాటికే కోతకు వస్తాయి. వీటిపై పరిశోధన పూర్తయి 2025లో అందుబాటులోకి వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మూడు కూడా వడగళ్లు, ఈదురుగాలులు, భారీ వర్షాలను దీటుగా తట్టుకునే రకాలని వివరించారు. పెట్టుబడి సాధారణం కంటే రూ. 2–3 వేలు తక్కువ అవుతుందని.. నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేయాలని పేర్కొన్నారు. -
వరి వంగడాల పంట
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు వరి పరిశోధన కేంద్రంలో 1948 నుంచి వివిధ రకాల వరి వంగడాలపై పరిశోధనలు చేస్తున్నారు. అనేక మంది శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు దాదాపుగా 29 కొత్త వంగడాలను రైతులకు అందించారు. ఇక్కడ పరిశోధన చేసిన వివిధ వంగడాలు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాచుర్యంలో ఉంటున్నాయి. 1948లో బీసీపీ–1, బీసీపీ–2 అనే రెండు రకాల వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించారు. 1950లో బీసీపీ–3, 4, 1951లో 5ని, 1965లో 6తో పాటు బల్క్‌హెచ్ 9ని సృష్టించారు. అనంతరం మొలగొలుకులు –72 అనే రకాన్ని 1977లో మార్కెట్లోకి తెచ్చారు. తర్వాత కొత్త మొలగొలుకులు–74 పేరుతో మరో రకాన్నీ తెచ్చారు. అనంతరం పినాకిని, తిక్కన, సింహపురి, శ్రీరంగ, స్వర్ణముఖి, భరణి, శ్రావణి, స్వాతి, పెన్నా, సోమశిల, వేదగిరి, అపూర్వ, మసూరి, స్వేత, ధన్యరాశి, సిరి, సుగంథ రకాలనూ తయారు చేశారు. ఒక్కో వంగడం తయారీకి దాదాపు రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతోంది. కొన్ని వంగడాలైతే ఐదేళ్ల సమయం కూడా తీసుకుంటున్నాయి. తాజాగా ఎన్‌ఎల్‌ఆర్–3238ను వ్యవసాయ శాస్త్రవేత్తలు సృష్టించారు. ఇది తెగుళ్లను తట్టుకునే శక్తి కలది. ఇందులో జింక్ పుష్కలంగా ఉండటంతో రబీలో పండించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. బీపీటీ 5204తో సమానంగా దిగుబడి ఎంటీయూ 1010, బీపీటీ 5204 సంకరంతో ఎన్‌ఎల్‌ఆర్ 3238ను సృష్టించినట్టు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్వల్పకాలంలో అధిక దిగుబడినిచ్చే వంగడాల సృష్టిలో భాగంగా ఈ రకాన్ని వృద్ధి చేశారు. అనేక ప్రయోగాలు, క్షేత్రస్థాయి ప్రదర్శనల అనంతరం ఐదేళ్ల తర్వాత ఈ వంగడం బయటకొచ్చింది. బీపీటీ 5204తో సమానంగా ఈ వంగడం దిగుబడినిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్వల్ప కాలంలో అధిక దిగుబడులిచ్చేలా.. రైతులకు అవసరమయ్యేలా వంగడాల సృష్టిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఒక వంగడం పూర్తి స్థాయిలో బయటకు రావాలంటే చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు అనేక విధాలుగా పరిశీలన చేస్తుంటాం. తాజాగా ఎన్‌ఎల్‌ఆర్ 3238ను రూపొందించాం. ఇది స్వల్ప కాలంలో అధిక దిగుబడులిచ్చి రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – వినీత, ప్రధాన శాస్త్రవేత్త ఇతర ప్రాంతాల్లోనూ వినియోగం తాము పరిశోధన చేసి సృష్టించిన వరి వంగడాలలో చాలా వరకు మంచి ఫలితాలిస్తున్నాయి. జిల్లా నుంచి తయారు చేసిన సీడ్స్‌ను ఇతర ప్రాంతాల్లోనూ ఎక్కువగా వినియోగిస్తున్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని వంగడాలను రైతులకు అందించేలా అన్ని విధాలుగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. – సీహెచ్ శ్రీలక్ష్మి, సీనియర్ శాస్త్రవేత్త -
ఈ పుట్టగొడుగులతో జాగ్రత్త సుమా!
సాక్షి, అమరావతి బ్యూరో: ఔషధ గుణాలు, పోషక విలువలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను లొట్టలేసుకుని తిననివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పుట్టగొడుగులపై శాకహారులతోపాటు మాంసాహారులు కూడా మోజు పడుతున్నారు. హోటళ్లలోనే కాదు.. ఇంట్లో వంటకాల్లోనూ ఇదో స్పెషల్ డిష్‌గా ప్రత్యేకతను చాటుకుంటోంది. కోవిడ్ సమయంలోనూ ప్రజలు మాంసాహారానికి దీటుగా పుట్టగొడుగులను అధికంగా తీసుకున్నారు. ఈ తరుణంలో కొన్ని రకాల పుట్టగొడుగులు ప్రాణాంతకమవుతున్నాయన్న వార్తలు జనంలో కలవరాన్ని రేపుతున్నాయి. తాజాగా అసోంలో పుట్టగొడుగులు తిని పది రోజుల వ్యవధిలో 13 మంది మృత్యువాత పడటం, పదుల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకు గురి కావడం అందరిలోనూ అలజడికి కారణమవుతోంది. ఈ పుట్టగొడుగులే ప్రాణాంతకం.. సాధారణంగా పంట పొలాలు, కొండ కోనలు, కాలువ గట్లు, అరణ్య ప్రాంతాలతోపాటు తడి కలిగిన ప్రదేశాల్లో పుట్టగొడుగులు సహజసిద్ధంగా పెరుగుతుంటాయి. ఇలాంటి పుట్టగొడుగులు ఎక్కువ శాతం విషతుల్యమని.. అందువల్ల వీటిని తినడం ప్రాణాంతకమని వ్యవసాయ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పుట్టగొడుగులను తింటే కాలేయం, మూత్రపిండాలను స్వల్ప వ్యవధిలోనే దెబ్బతీసి మృత్యువాత పడేలా చేస్తాయని చెబుతున్నారు. అయితే నిపుణుల పర్యవేక్షణలో శాస్త్రీయంగా కృత్రిమ వాతావరణంలో పెంచే పుట్టగొడుగులు విషపూరితం కావని పేర్కొంటున్నారు. తినే రకాలు నాలుగే.. ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా.. దేశంలో 283 పుట్టగొడుగుల జాతులున్నాయి. క్యాన్సర్, హైపర్‌టెన్షన్ వంటి జబ్బులకు పుట్టగొడుగులు ఔషధాలుగా పనిచేస్తాయి. ఇలా ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన, ప్రమాదకరం కాని నాలుగు రకాల జాతులనే పెంపకానికి అనువైనవిగా ఎంపిక చేశారు. వీటిలో వైట్ బటన్ మష్రూమ్, ముత్యపు చిప్ప లేక అయిస్టర్ మష్రూమ్, వరిగడ్డి లేదా చైనీస్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్ రకాలను తినడానికి అనువైనవిగా గుర్తించారు. దీంతో కొన్నేళ్లుగా అటు దేశంలోనూ, ఇటు మన రాష్ట్రంలోనూ ఈ 4 రకాల పుట్టగొడుగులనే పెంచుతున్నారు. విషపూరిత మష్రూమ్‌లు.. పుట్టగొడుగుల్లో ఏడు రకాలను విషపూరితమైనవిగా గుర్తించారు. వాటిలో డెడ్ కాప్, కనోసీ బెట్టిలారిస్, వెబ్ కాప్స్, ఆటం స్కల్కాప్, డెస్ట్రాయింగ్ ఏంజెల్స్, పొడిస్టాన్ అకార్నడెమె, డెడ్లీ డాపర్లెరీలు ఉన్నాయి. తిన్నవారిపై 6 నుంచి 24 గంటల్లో ప్రభావం విషపూరిత పుట్టగొడుగులను తిన్నవారిపై ఆ ప్రభావం 6 నుంచి 24 గంటల్లో కనిపిస్తుంది. కళ్లు తిరగడం, వాంతులు, నీరసం, కడుపులో నొప్పి, మగతగా ఉండడం, విరేచనాలు, తలనొప్పి, స్పృహ తప్పడం వంటి లక్షణాలతోపాటు గ్యాస్ సంబంధిత ఇబ్బందులు కనిపిస్తాయి. బయట ప్రాంతాల్లో పెరిగే పుట్టగొడుగుల్లో ప్రమాదకర ముస్కోరిన్, ఇబోటెనిక్ అనే విష పదార్థాలుంటాయి. వాటిని తినడం ప్రమాదకరం, ప్రాణాంతకం. శాస్త్రీయంగా పెంచే పుట్టగొడుగులు ఆరోగ్యకరం. – వి.ప్రసన్న, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణా జిల్లా విషపూరిత పుట్టగొడుగులను ఎలా గుర్తించాలంటే.. సామాన్య ప్రజలు విషపూరిత పుట్టగొడుగులను ఎలా గుర్తించాలో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాగా విచ్చుకున్నవి, పచ్చ రంగు, ఫంగస్‌తో ఉన్నవి, నల్ల మచ్చలతో ఉన్నవి తినడానికి పనికిరావని, ఒకవేళ వాటిని తింటే ప్రాణాంతకమవుతుందని వివరిస్తున్నారు. అందువల్ల ఇలాంటి పుట్టగొడుగుల విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. శాస్త్రీయంగా ప్రమాణాలు పాటించి పెంచే పుట్టగొడుగులే శ్రేయస్కరమని స్పష్టం చేస్తున్నారు. విషపూరిత పుట్టగొడుగులను అటవీ ప్రాంతాల ప్రజలు, శాస్త్రవేత్తలు తమ అనుభవంతో తేలిగ్గా గుర్తించగలుగుతారని చెబుతున్నారు. -
చెరువు మట్టి.. భూమికి బలం
ఎల్.ఎన్.పేట: పంట దిగుబడి కోసం రైతులు విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తుంటారు. దీని వలన భూసారం క్షీణిస్తోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూసారం పెంచాలంటే కొత్తమట్టిని వేయడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. చెరువుల్లోని పూడిక మట్టి వేస్తే పొలం సారవంతంగా మారుతుందని సూచిస్తున్నారు. ఈ మట్టి వేయడం ద్వారా భూసారంతో పాటు పోషక విలువలు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. పురుగు మందులు, ఎరువులు ఎక్కువగా వాడటం వలన భూమి పొరల్లో ఉండే మిత్ర పురుగులు నశించడం వలన రైతుకు నష్టం ఉంటుందంటున్నారు. పూడిక మట్టిలో పోషకాలు చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వంటి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరుతాయి. వేసవలి సమయంలో చెరువులు అడుగంటుతాయి. ఈ సమయంలో చెరువు పూడిక మట్టిలో తగినంత పాళ్లలో నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియకార్భన్ పదార్థాలు, మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే సూక్ష జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు వృద్ధి చెందుతాయి. భూమి పొరల్లో తేమను ఎక్కువ రోజుల పాటు ఉండేలా చేసే గుణం ఈ మట్టికి ఉంది. కిలో పూడిక మట్టిలో నత్రజని 720 మి.గ్రా, భాస్వరం 320 మి.గ్రా, పోటాషియం 810 మి.గ్రా, సేంద్రియకార్భనం 308 మి.గ్రాలతో పాటు మైక్రోబియల్ బయోమాన్ కార్బన్లు ఉంటాయి. ఎరువుల ఖర్చు తక్కువ ఎకరా పొలంలో వరి పండించాలంటే తక్కువగా అనుకున్నా ఒక బస్తా డీఏపీ, రెండు బస్తాల యూరియా, బస్తా పోటాష్, బస్తా జింక్ తప్పనిసరి అవుతుంది. వీటితో పాటు పంటను ఆశించే తెగుళ్లను నివారించేందుకు పురుగు మందుల పిచికారీ తప్పటం లేదు. ఎరువులు, పురుగు మందుల కోసం సుమారు రూ. 6 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చెరువు మట్టి వేసుకోవటం వలన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. రైతులకు పెట్టుబడి తగ్గటంతో పాటు భూమి సారవంతం అవుతుంది. ఎరువులు, పురుగుల మందుల్లేని పంటను సాధించవచ్చు. చెరువు మట్టి వేసే వాళ్లం గతంలో చెరువుల్లో లభ్యమయ్యే పూడిక మట్టిని పొలాలకు వేసేవాళ్లం. దీంతో భూసారం పెరిగి పంటదిగుబడి బాగా వచ్చేది. వేసవిలో చెరువు మట్టిని నాటుబళ్ల పెరిగి పొలంలో వేసేవాళ్లం. వర్షాల తరువాత పొలంలో వేసిన మట్టి నేలలో కలిసేలా దుక్కి దున్నేవాళ్లం. ఎరువులు వేయకుండానే పంట ఏపుగా పెరిగేది. ఇప్పుడు రైతులెవ్వరూ చెరువు మట్టి వేయటం లేదు. ఎరువుల వినియోగంతో పెట్టుబడి పెరిగిపోతుంది. భూసారం తగ్గిపోతుంది. లావేటి నర్సింహులు, రైతు, కృష్ణాపురం భూసారం పెరుగుతుంది చెరువు మట్టి వేసుకోవటం వలన భూమి సారవంతంగా మారుతుంది. చౌడు భూముల్లో కూడా పచ్చని పంటలు పండించవచ్చు. చెరువు మట్టిలో తేమ ఎక్కువగా ఉండటం వలన పంటకు నీటినిల్వలు బాగా ఉంటాయి. సేంద్రియ శాతం ఎక్కువగా ఉండటంతో ఎరువులా ఉపయోగపడుతుంది. ఒక సంవత్సరం చెరువు మట్టి వేయటం వలన మూడేళ్ల వరకు భూమి సారవంతంగా ఉంటుంది. పంటకు మేలు చేస్తుంది. పైడి లతశ్రీ, ఏఓ, ఎల్.ఎన్.పేట -
కలర్ 'రైస్'.. పోషకాలు 'నైస్'
చింతలూరి సన్నాలు.. తెల్లని బియ్యం రకాలు. సైజు చిన్నగా ఉండే వాటిని చిట్టిముత్యాలు అంటున్నారు. నలుపు రంగులో ఉంటే బ్లాక్ బర్మా.. డెహ్రడూన్ బ్లాక్, కాలాభట్టి అని పిలుస్తున్నారు. ఎర్ర రంగులో ఉంటే రక్తశాలి అని పిలుచుకుంటున్నారు. ఇంకా నారాయణ కామిని.. కూజీ పటాలియా.. ఇంద్రాణి.. రత్నచోడి అనే దేశీయ వరి రకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రంగుల బియ్యాలు సంపూర్ణ పోషకాలనిస్తూ యాంటీ యాక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంటాయని చెబుతున్నారు. క్యాన్సర్‌ను నిరోధించే గుణం వీటికి ఉందని కూడా ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం: బ్లాక్ బర్మా.. డెహ్రాడూన్ బ్లాక్.. కాలాభట్టి.. రక్తశాలి.. నారాయణ కామిని.. కూజీ పటాలియా.. ఇంద్రాణి.. రత్నచోడి.. చిట్టిముత్యాలు. ఈ పేర్లు ఇప్పుడు తారకమంత్రంగా మారాయి. దేశీయ వరి రకాలుగా పండిస్తున్న ఈ రంగుల బియ్యం తింటే వైద్యుని అవసరం ఉండదట. మనిషిని నిలువునా కుంగదీసే మధుమేహానికి ఈ బియ్యంతో చెక్ పెట్టవచ్చు. మోకాళ్లు, కీళ్ల నొప్పులకు చరమగీతం పాడవచ్చు. ఐరన్, జింక్, కాల్షియం, కాపర్ వంటివి శరీరానికి అందడంతోపాటు, రక్తపుష్టికి ఈ బియ్యమే రాచమార్గంగా చెబుతున్నారు. జీరో ఫార్మింగ్ (పెట్టుబడిలేని వ్యవసాయం)ను రైతులు అందిపుచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం దేశీయ వరి రకాలను పండించే దిశగా రైతులను కార్యోన్ముఖులను చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ సంఘ నిర్వాహక ప్రకృతి విభాగం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పైన పేర్కొన్న రకాల వరిని పండించే విస్తీర్ణం 300 ఎకరాలకు పైగా చేరింది. కలర్ రైస్ లాభాలు అదుర్స్.. పోషకాలు బోనస్ అన్నట్టుగా సాగుతున్న ఈ సేద్యం వైపు పలువురు ఆకర్షితులవుతున్నారు. పంటను బియ్యంగా మార్చి మార్కెట్‌ను అందిపుచ్చుకుంటున్నారు. పురాతన రకాలివి వరిలో పురాతన కాలం నాటి దేశీయ రకాలు దాదాపుగా మూలనపడ్డాయి. అధిక దిగుబడులనిచ్చే ఆధునిక వంగడాల వైపు రైతులు మళ్లడంతో దేశీయ రకాలు కనుమరుగయ్యాయి. ప్రకృతి వ్యవసాయం పుణ్యమా అని కొందరు అభ్యుదయ రైతుల కృషితో పురాతన వరి రకాలు ఊపిరి పోసుకుంటున్నాయి. వినియోగదారులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతూ.. రైతులను రారాజుగా మారుస్తున్నాయి. సుఖవంతమైన జీవితం, తగ్గిన వ్యాయామం నేపథ్యంలో శరీరం రోగాలకు ఆలవాలంగా మారింది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడితో పనిలేని ప్రకృతి వ్యవసాయం (జీరో ఫార్మింగ్) పేరిట తిరిగి దేశీయ వరి రకాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇవన్నీ పోషకాలను అందిస్తూ యాంటీ యాక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ కారకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ రకాలను తింటే జీర్ణవ్యవస్థకు ఇబ్బంది ఉండదని ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రకాలు మేలు జీరో ఫార్మింగ్‌తో దేశీయ వరి రకాలను రైతులు పండిస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ రకాల్లో పిండి పదార్థం తక్కువగా, పీచుపదార్థం అధికంగా ఉండటంతో జీర్ణం బాగుంటుంది. ఈ రకాల్లో గ్లైసమిక్ యాసిడ్ ఇండెక్స్ ఎక్కువ. యాంథోసైనిన్ అమినో ఆమ్లాల కారణంగా బియ్యంపై రంగుల పొరలు ఏర్పడతాయి. నల్ల బియ్యం రకంలో వరి కంకులు కూడా నల్లగా ఉంటాయి. ఈ రకం బియ్యం తినడం వల్ల ఐరన్, జింక్, కాల్షియం, కాపర్ అందుతాయి. పోషకాలు ఎక్కువ. మ«ధుమేహ రోగులకు ఈ రకం మేలు చేస్తుంది. యాంటీ యాక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ కారకాలుగా కూడా ఈ బియ్యం ఉపయోగపడతాయి. రక్తపుష్టికి రక్తశాలి రకం, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నివారణకు నారాయణ కామిని రకాల బియ్యం వినియోగిస్తే మేలు. జిల్లాలో 300 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ రకాలు సాగవుతున్నాయి. – నూకరాజు, జిల్లా అధికారి, ప్రకృతి వ్యవసాయ విభాగం ఎకరాకు రూ.90 వేల ఆదాయం జీరో ఫార్మింగ్‌తో దేశీయ వరి రకాలను పండించడం వల్ల ఎకరాకు రూ.90 వేల వరకు ఆదాయం వస్తోంది. ఎకరాకు అన్నిరకాల ఖర్చులు కలిసి రూ.18 వేలు అవుతుంది. ఎకరాకు 18 బస్తాల దిగుబడి వస్తుంది. బస్తా ధర రూ.6 వేల వరకు ఉంది. మొత్తం వచ్చే ఆదాయం రూ.1.08లక్షలు కాగా ఖర్చులు పోను రూ.90 వేలు మిగులుతుంది. ఆన్లైన్ మార్కెట్‌ను అందిపుచ్చుకుంటే మరింతగా ఆదాయం పొందవచ్చు. 120 రోజుల్లో కోతకు వచ్చే దేశీయ రకాలు పండించడానికి ఘన జీవామృతం, జీవామృతం, వేపపిండి, ఆముదం పిండి, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, పంచగవ్య వాడతాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి, పొగాకు, శీతాఫలం ఆకులు, కానుగ, జిల్లేడు, వేప, ఆవు పేడ, ఆవు నెయ్యి, అరటి పండ్లు, ఆవు పెరుగు, కల్లు వంటివి ఈ పంట కోసం వినియోగిస్తాం. ఏడాదిగా సాగు చేస్తున్నాం. ఆదాయం బాగుంది. మండలంలో కొన్నిచోట్ల ఈ దేశీయ వరి రకాలను కొందరు సాగు చేస్తున్నారు. ఈ రకాల బియ్యం కిలో మార్కెట్ డిమాండ్ ఆధారంగా రూ.120 నుంచి రూ.200 ధర పలుకుతున్నాయి. – మరిడి నాగకృష్ణ, రైతు, వెంకట్రామన్నగూడెం -
చిరుధాన్యాలు, నూనె గింజలను సాగు చేయండి
సాక్షి, అమరావతి: వరికి మించిన ఆదాయం రావడమే కాకుండా తక్కువ నీటి వసతితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు చిరుధాన్యాలు, నూనె గింజల పంటల్ని సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అధికారికంగా ప్రారంభమైన రబీ సీజన్లో సాగు చేసే దాళ్వా వరికి బదులు పలు రకాల వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మొక్కజొన్న.. మొక్కజొన్న పంటను కోస్తా జిల్లాల్లో జనవరి 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 8 కిలోల విత్తనం వాడాలి. మొక్క తొలి దశలో ఆశించే పురుగులను నివారించటానికి సయాట్రినిప్రోల్, థయోమిథాక్సామ్ మందును 4 మి.లీ. కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి ఎకరానికి 26,666 నుండి 33,333 మొక్కల సాంద్రత ఉండేలా చూడాలి. రబీ జొన్న రబీకి అనువైన సూటి రకాలు: ఎన్టీజే 4, ఎన్టీజే 5, ఎన్ 15, సీఎస్వీ 216, ఆర్సీఎస్వీ 14, ఆర్ఎం 35–1, సీఎస్వీ 18, సీఎస్వీ 22 అనుకూలమైన హైబ్రిడ్ రకాలు: సీఎస్హెచ్ 15, ఆర్సీఎస్హెచ్ 16, సీఎస్హెచ్ 19, సీఎస్హెచ్ 31 ఆర్. ఈ వారంలో విత్తుకోవచ్చు. ఎకరాకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తేటప్పుడు వరుసల మధ్య 45 సెం.మీ. దూరం, మొక్కల మధ్య 12–15 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. వేరుశనగ.. రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ వేస్తుంటారు. అందుకు అనువైన రకాలు. కదిరి లేపాక్షి (కె. 1812), పంట కాలం 122 రోజులు. ఎకరానికి 20–25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. 57% నూనెను, 70% గింజ దిగుబడిని ఇస్తుంది. ఎకరానికి 30–35 కిలోల గింజలు కావాలి. బెట్టను, తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. కదిరి అమరావతి (2016), కదిరి చిత్రావతి, కదిరి 7 బోల్ట్, కదిరి 6, కదిరి 9, కదిరి హరితాంద్ర, ధరణి ఒకవేళ ఈ రబీ సీజన్లో దాళ్వా సాగు చేయాలనుకునే రైతులు ఎంటీయూ 1010 (కాటన్ దొర సన్నాలు), ఎంటీయూ 1153 (చంద్ర), ఎంటీయూ 1156 (తరంగిణి), ఎంటీయూ 1121 (శ్రీధృతి), ఎంటీయూ 1210 (సుజాత), ఎంటీయూ 3626 (ప్రభాత్), ఐఆర్ 64, ఎన్.ఎల్.ఆర్. 34449 (నెల్లూరు మసూరీ), ఎన్.ఎల్.ఆర్. 3354 (నెల్లూరు ధాన్యరాశి)వినియోగించినట్లయితే మెరుగైన దిగుబడి సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ లేదా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్‌ను సంప్రదించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విస్తరణ సంచాలకులు డాక్టర్ పి.రాంబాబు తెలిపారు. -
పూల సాగు.. గిరిజన రైతులకు వరం
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: గిరిజన ప్రాంతాల్లో పూల సాగును చేపట్టేలా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంత వాతావరణ పరిస్థితులు, భూమి ఇందుకు అనువుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతిన పూలు, కూరగాయల సాగు చేపడితే హార్టీకల్చర్ విభాగంతో పాటు.. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇతోధికంగా తోడ్పడుతుందని వీసీ డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు. విశాఖ ఏజెన్సీ రైతులు తరతరాలుగా వరి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, రాజ్మా, చిక్కుళ్లు, వలిశలు వంటి ఆహార పంటలను, అల్లం, మిరియాలు, కాఫీ వంటి ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. అధిక వర్షాలతో ఈ పంటలు ఆశించిన ఆదాయాన్ని ఇవ్వలేకపోతుండడంతో కొంతమంది రైతులు చట్ట విరుద్ధమైన పంటల్ని సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలను నిషేధించినా అటువైపే మొగ్గు చూపుతుండటంతో.. రైతులను పూల సాగు వంటి వాణిజ్య పంటల వైపు మరల్చేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యాచరణను తయారు చేసినట్టు విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. పూలసాగుతో లంబసింగి, అరకు మరింత ఆకర్షణీయం ఇందులో భాగంగా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్నే ఓ ప్రయోగ క్షేత్రంగా మార్చాలని, పెద్ద ఎత్తున పూలసాగు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంత వాతావరణం పూల సాగుకు అనువైన స్థలంగా అభివర్ణించారు. రైతులకు ఈ మేరకు అవగాహన కల్పించేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 5 రకాల గ్లాడియోలస్, 3 రకాల ట్యూబారస్, రెండు రకాల చైనా ఆస్టర్, బంతి, చామంతి, తులిప్ వంటి పూల సాగును ప్రయోగాత్మకంగా చేపట్టినట్టు వివరించారు. ఈ పూల సాగును విజయవంతం చేసి.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఆర్గానిక్ ఫార్మింగ్‌కు మారుపేరుగా నిలపాలని సూచించారు. పూల తోటల్ని విరివిగా పెంచితే లంబసింగితో పాటు, ఏపీ ఊటీ అయిన అరకు.. పర్యాటకుల్ని మరింత ఆకర్షిస్తాయని అభిప్రాయపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు పాలీహౌస్‌ల అవసరం లేకుండానే పూలను సాగు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూల సాగును ఇప్పటికిప్పుడు చేపడితే ఐదేళ్లలో గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో పూల సాగు.. వివిధ రకాల పూలు, కూరగాయల పంటల సాగుపై శిక్షణ పొందుతున్న చింతపల్లి సేంద్రియ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రయోగాత్మకంగా ఈ పంటల్ని సాగు చేసేందుకు నడుంకట్టారు. గ్లాడియోలస్, తులిప్, నేల సంపంగి, చైనా ఆస్టర్, బంతి, చేమంతి సాగు చేపట్టారు. వీటితో పాటు సేంద్రియ పద్ధతిన కూరగాయల పెంపకాన్ని కూడా చేపట్టి చదువుతో పాటు రోజు వారీ ఖర్చులకు డబ్బును సమకూర్చుకుంటున్నారని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రామారావు వివరించారు. -
తెల్లదోమ నియంత్రణకు జాతీయ స్థాయి పరిశోధనలు అవసరం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కొబ్బరి, ఆయిల్‌పామ్, మామిడి, అరటి, బొప్పాయి, సీతాఫలం, కోకో పంటలను దెబ్బతీస్తున్న సర్పలాకార తెల్లదోమ (రుగోస్ స్పైరల్లింగ్ వైట్ఫ్లై) నియంత్రణకు విస్తృత పరిశోధనలు నిర్వహించేలా బాధిత రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. తెల్లదోమ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న తమిళనాడు రాష్ట్రంలో తీసుకుంటున్న నియంత్రణ చర్యలను పరిశీలించేందుకు నాగిరెడ్డి నేతృత్వంలోని బృందం కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆ రాష్ట్ర శాస్త్రవేత్తలతో బుధవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. తెల్లదోమ ప్రభావంతో మన రాష్ట్రంలో 2019–20లో 21,966 హెక్టార్లు, 2020–21లో 35,875 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి, ఆయిల్‌పామ్, నెల్లూరు జిల్లాలో అరటిపై ఈ దోమ ఎక్కువగా ఆశించినట్టు గుర్తించామన్నారు. ఇది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో తగ్గిపోతున్నప్పటికీ.. తిరిగి సెప్టెంబర్‌లో మొదలై డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా విస్తృత పరిశోధనలు చేయాలని ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌ను ఆదేశించారన్నారు. ఉద్యాన వర్సిటీ అభివృద్ధి చేసిన జీవ నియంత్రణ చర్యల వల్ల 20 శాతానికి మించి నియంత్రించలేకపోతున్నారన్నారు. బయో కంట్రోలింగ్, ఆముదం రాసిన ఎల్లోపాడ్స్ ఎక్కువగా సిఫార్సు చేస్తున్నామని, పురుగుల మందులను అజాడిరక్టిన్‌తో కలిపి వాడొద్దని సూచిస్తున్నారని చెప్పారు. పెద్దఎత్తున బదనికలను సరఫరా చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాన్ని ప్రకటించి ఆర్థిక చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. -
ఆముదం నూనె కలిపిన మట్టితో చీడపీడలకు చెక్
భూమి లోపలి నుంచి తీసి ఎండబెట్టిన 10 కిలోల మెత్తని మట్టి (సబ్ సాయిల్)కి అర లీటరు ఆముదం నూనెను బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని పంట మొక్కల పాదుల్లో లేదా డ్రిప్పర్ల వద్ద పిడికెడు వేసి నీరు అందిస్తే ఆ పంటలకు ఇక చీడపీడల బెడద అసలు ఉండదని రుజువైందని ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట రెడ్డి (సీవీఆర్) తెలిపారు. మొక్క నాటిన/విత్తిన పది రోజులకు మొదటిసారి, అక్కడి నుంచి 15–20 రోజులకు మరోసారి పిడికెడు వేస్తే చాలు. వంగ, టమాటో, బెండ, బీర వంటి పంటలతోపాటు పత్తి, వరి, గోధుమ పంటల్లో సైతం ఈ ప్రయోగం సఫలమైందన్నారు. వంగ వంటి కూరగాయ పంటలకు పురుగు బెడద ఎక్కువ. భూమి లోపలి నుంచి తీసిన మట్టిని ఎండబెట్టి వంగ మొక్కల పాదుల వద్ద వేయడంతోపాటు, ఆ మట్టిని నీటిలో కలిపి 4–5 రోజులకోసారి పిచికారీ చేయటం ద్వారా వంగ పంటలో చీడపీడలు రాకుండా చూసుకోవచ్చని సీవీఆర్ గతంలో చెప్పారు. ఇటీవల లోపలి మట్టికి ఆముదం నూనె కలిపి పాదుల్లో లేదా డ్రిప్లర్ల దగ్గర వేస్తే పచ్చ దోమ, తెల్ల దోమ వంటి రసంపీల్చే పురుగులతోపాటు కాయ తొలిచే పురుగు కూడా ఆయా మొక్కల దరిదాపుల్లోకి రావటం లేదని గుర్తించారు. మొక్కల పెరుగుదల బాగా ఉందని, దిగుబడి కూడా బాగా వచ్చిందని సీవీఆర్ వివరించారు. ఆముదం నూనెను వాడేటప్పుడు ఎమల్సిఫయర్ ద్రావణాన్ని కలపటం పరిపాటి అని అంటూ.. లోపలి మట్టే ఎమల్సిఫయర్‌గా పనిచేస్తోందని.. ఆముదం నూనె వాసనకు చీడపీడలు దరిచేరటం లేదని గుర్తించానని వివరించారు. ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమం వేసిన తర్వాత కుళ్లింపజేసే పశువుల ఎరువు, ఘనజీవామృతం, వర్మీకంపోస్టు వంటి సేంద్రియ ఎరువులను చెట్ల దగ్గర వేయకూడదని రైతులు గమనించాలన్నారు. అలా వేస్తే మట్టిలో కలిపి వేసిన ఆముదం నూనె (చీడపీడలను తరిమేసే) ప్రభావాన్ని కోల్పోతుందన్నారు. అదేవిధంగా, ద్రవ జీవామృతం, గోకృపామృతం, వేస్ట్ డీకంపోజర్)ను ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమంపై పోయటం లేదా డ్రిప్ ద్వారా అందించడం కూడా చేయవద్దని సీవీఆర్ హెచ్చరించారు. అయితే, వీటిని ఆయా పంటలపై పిచికారీ చేసుకోవచ్చని సూచించారు. 10 కేజీల భూమి లోపలి నుంచి తీసిన మెత్తని పొడి మట్టికి పావు లీటరు ఆముదం నూనె, మరో పావు లీటరు వేప/కానుగ నూనెను కలిపి కూడా వేసుకోవచ్చని సీవీఆర్ సూచించారు. ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమం 200 గ్రాములను 20 లీటర్ల నీటిలో కలిపి పంటలపై వారానికోసారి పిచికారీ చేయటం మరీ మంచిదని సీవీఆర్ తెలిపారు. చింతల వెంకట రెడ్డి -
రోగనిరోధక శక్తిని పెంచే వంగడాలు సృష్టించండి
సాక్షి,హైదరాబాద్: రోగనిరోధక శక్తిని పెంపొందించే వంగడాలను అభివృద్ధిచేసి, అలాంటి పంటలను పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాస్త్రవేత్తలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. మన ముందు తరాలు తీసుకున్న పోషకాహారంతో ఎక్కువ సంవత్సరాలు జీవించారని, కానీ ఇప్పటితరంలో చాలామంది మధుమేహం వస్తుందని వరి అన్నంకు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. వరి వంగడాలను శాస్త్రీయంగా పరిశోధించి వాటిలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి అని గవర్నర్ ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో గురువారం ఆమె వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా రాజ్‌భవన్ నుంచి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధిచేసిన తెలంగాణ సోన అనే ప్రత్యేక వెరైటీని ప్రోత్సహించడం ద్వారా యువతను వరి అన్నానికి దగ్గర చేయవచ్చని తద్వారా మన దక్షిణ భారతదేశ సంప్రదాయాన్ని కూడా కాపాడుకోవచ్చని వివరించారు. తాటి చెట్టును పూర్వీకులు ఓ కల్పవక్షంగా భావించారని, ఆ చెట్టు ప్రతి భాగం కూడా ఎన్నోరకాలుగా ఉపయోగపడుతుందని ఇప్పడు ఆ చెట్లను కాపాడుకోవడంతోపాటు వాటిని మరింత విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆ చెట్టు ద్వారా తయారయ్యే నీరా పానీయంలో ఎన్నో పోషకవిలువలు కలిగివుందని, ఈ పానీయాన్ని ఎక్కువ కాలం నిల్వవుంచే విధంగా పరిశోధనలు జరగాలని వివరించారు. తాటిచెట్టు ద్వారా వివిధ ఉత్పత్తులను తయారుచేసే కుటీర పరిశ్రమలు తమిళనాడు, కేరళలో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాయని అలాగే తాటిచెట్టు తమిళనాడు రాష్ట్ర అధికారిక చెట్టు అని తెలిపారు. అనారోగ్యకరమైన కొన్ని వంటనూనెలతోనే అనేక రోగాలు మొదలవుతున్నాయని ఒక వైద్యురాలిగా తన అనుభవంలో గమనించానని, ఇలాంటి సందర్భంలో ఆరోగ్యకరమైన వంటనూనెల ఉత్పత్తిలో విస్తృత పరిశోధనలు జరగాలని సూచించారు. ఆహారపు అలవాట్లలో వస్తున్న విపరీత పోకడల గురించి, సరైన ఆహారపు అలవాట్లపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేయాలని పేర్కొన్నారు. -
ఖరీఫ్‌కు ఐదు కొత్త వరి వంగడాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో సాగు చేసేందుకు ఐదు కొత్త వరి వంగడాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. రాష్ట్ర పరిశోధనా కేంద్రాల నుంచి ఇటీవల కాలంలో 13 రకాల కొత్త వంగడాలను విడుదల చేసినప్పటికీ.. రాష్ట్రంలో సాగు చేసేందుకు ఆరు రకాలు మాత్రమే పనికొస్తాయని అంచనా వేసినట్టు విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఏఎస్ రావు ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో పనికొచ్చేవి ఐదు ► రాష్ట్ర పరిధిలో పండించేందుకు ఐదు వరి వంగడాలతోపాటు ఒకటి జొన్న వంగడం. ► వరికి సంబంధించిన ఐదు రకాల్లో ఎంటీయూ–1224 (మార్టేరు సాంబ), ఎంటీయూ–1262 (మార్టేరు మసూరి), ఎంటీయూ–1210 (సుజాత), బీపీటీ–2595 (తేజ), ఎన్‌ఎల్‌ఆర్–3354 (నెల్లూరు ధాన్యరాశి) ఉన్నాయి. ► జొన్నకు సంబంధించి వీఆర్–988 (సువర్ణ ముఖి) కొత్త వంగడం విడుదలైంది. ► దేశ పరిధిలో విడుదల చేసిన వాటిలో వరికి సంబంధించి ఎంటీయూ–1223 (వర్ష), ఎంటీయూ–1239 (శ్రావణి).. గోగు పంటకు సంబంధించి ఏఎంయూ–8, ఏఎంయూ–9 (ఆదిత్య), జొన్నకు సంబంధించి వీఆర్–929 (వేగవతి), సజ్జకు సంబంధించి ఏబీవీ–04, పత్తికి సంబంధించి ఎల్‌డీహెచ్‌పీ ఉన్నాయి. ► ఈ ఖరీఫ్‌లో కృష్ణా జోన్‌లోని రైతులు ఎంటీయూ–1061 (ఇంద్ర), బీపీటీ–5204, 2270 (భావపురి సన్నాలు), ఎంటీయూ–1075 రకాలను ఎంపిక చేసుకోవచ్చు. కొత్తగా విడుదలైన ఎంటీయూ–1224 ఎంటీయూ–1262 కూడా సాగు చేసుకోవచ్చు. ► గోదావరి జోన్‌లోని రైతులు స్వర్ణ, ఇంద్ర, ఎంటీయూ–1064, పీఎల్ఏ–1100, కొత్తగా విడుదలైన ఎంటీయూ–1262, 1224 రకాలను కూడా సాగు చేసుకోవచ్చు. ► ఉత్తర కోస్తా రైతులు స్వర్ణ, శ్రీకాకుళం సన్నాలు, బీపీటీ–5204, ఎంటీయూ–1075, శ్రీధృతితో పాటు కొత్తగా విడుదలైన ఎంటీయూ–1224, ఎంటీయూ–1210 రకాలను ఎంపిక చేసుకోవచ్చు. ► దక్షిణ మండలంలో (సౌత్ జోన్) ఎన్‌ఎల్‌ఆర్–3354, 33892తో పాటు కొత్తదైన ఎన్‌ఎల్‌ఆర్–4001, ఎంటీయూ–1224 అనువైనవి. ► తక్కువ వర్షపాత ప్రాంతాల్లో బీపీటీ–5204, ఎన్‌డీఎల్‌ఆర్–7, 8తో పాటు కొత్తవైన ఎంటీయూ–1224, బీపీటీ–2782 రకాలను సాగు చేసుకోవచ్చు. ► గిరిజన మండలాలలో స్వల్పకాలిక రకాలైన ఎంటీయూ–1153, 1156 అనువైనవి. ► ముంపు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పీఎల్ఏ–1100, ఎంటీయూ–1064 (అమర), ఎంటీయూ–1140 (భీమ) అనువైనవిగా సిఫార్సు చేశారు. చౌడు ప్రాంతాల్లో ఎంటీయూ–061తో పాటు కొత్తగా విడుదలైన ఎంసీఎం–100 వేసుకోవచ్చు. ► నాణ్యమైన విత్తనం కోసం ప్రభుత్వ లేదా ప్రభుత్వ అధీకృత సంస్థలను సంప్రదించడం మంచిది. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా నాణ్యమైన విత్తనాన్ని అందిస్తున్నది. ► స్వయంగా రైతులు తయారు చేసుకున్న విత్తనాలను కూడా వాడుకోవచ్చు. ► విత్తనం సంచి లేబుల్ మీద కనీసం 80 శాతం మొలక శాతం వుందో లేదో చూసుకోవాలి. -
నల్ల ధాన్యం సాగు సక్సెస్
సాక్షి, అమరావతి బ్యూరో: బాపట్ల వ్యవసాయ పరిశోధన కేంద్రం బీపీటీ 2841 రకం బ్లాక్ రైస్ వరి వంగడాన్ని ఆవిష్కరించింది. ఖరీఫ్ సీజన్లో ప్రయోగాత్మకంగా దీన్ని బాపట్ల పట్టణానికి చెందిన రైతు లేళ్ల వెంకటప్పయ్య సేంద్రియ పద్ధతిలో సాగు చేశారు. 2 కిలోల విత్తనాన్ని 20 సెంట్ల మాగాణిలో సాగు చేయగా 7 బస్తాల దిగుబడి వచ్చింది. దీని ధర 75 కిలోల బస్తా రూ.7,500కు పైగా ఉండటం గమనార్హం. ఇప్పటివరకూ బాపట్లలో 8 రకాల నాణ్యమైన వరి వంగడాలు రూపొందించగా... బీపీటీ 5204 (సాంబ మసూరి), బీపీటీ 2270 (భావపురి సన్నాలు) దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. బీపీటీ 5204 రకం దేశంలో సాగయ్యే విస్తీర్ణంలో 25 శాతం సాగు చేయడం గమనార్హం. తాజాగా బాపట్ల కీర్తి కిరీటంలో సరికొత్త వంగడం బ్లాక్‌రైస్ బీపీటీ 2841 చేరనుంది. క్వాలిటీ రైస్ కింద అభివృద్ధి చేస్తున్నాం... బీపీటీ 2841 బ్లాక్ రైస్‌ను రూపొందించి ఈ ఏడాది ప్రయోగాత్మకంగా రైతులతో సాగు చేయించాం. తెగుళ్లను తట్టుకొని మంచి దిగుబడి వచ్చింది. మూడేళ్లు ప్రయోగాలు చేసి, ఫలితాలు చూసిన తరువాతే అధికారికంగా విడుదల చేస్తాం. దీన్ని వినియోగించటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మార్కెట్లో గిరాకీ ఉంది. అమెజాన్‌లో కిలో బియ్యం రూ. 375కి అమ్ముతున్నారు. ఈ కొత్త వంగడం బాపట్ల సిగలో తలమానికం కానుంది. – టీవీ రామారావు, ప్రధాన శాస్త్రవేత్త, బాపట్ల మంచి దిగుబడి వచ్చింది బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం వారు ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు ఇచ్చారు. 2 కిలోల విత్తనాన్ని 20 సెంట్లలో సాగు చేశాను. 7 బస్తాల దిగుబడి వచ్చింది. మార్కెట్లో బ్లాక్ రైస్‌కు డిమాండ్ ఉండటంతో మంచి ఆదాయం వస్తుంది. – లేళ్ల వెంకటప్పయ్య, రైతు, బాపట్ల ఖర్చు తక్కువ–ఆదాయం ఎక్కువ బ్లాక్ రైస్‌ను 20 సెంట్లలో సాగు చేసేందుకు ఖర్చు తక్కువే అయిందని రైతు లేళ్ల వెంకటప్పయ్య చెబుతున్నారు. ఒక బండి ఎరువు రూ.1,200, నాలుగు సార్లు దుక్కుల కోసం రూ.500, వరి నాట్లు వేసేందుకు ఇద్దరు కూలీలకు రూ.600, కోత కోసేందుకు ఇద్దరు కూలీలకు రూ.600, పంట నూర్పిడి చేసేందుకు రూ.1,000 మొత్తం రూ.3,900 మాత్రమే ఖర్చు అయినట్లు తెలిపారు. 20 సెంట్లలో సుమారు 7 బస్తాల దిగుబడి వచ్చిందని దీని ప్రకారం ఎకరానికి 35 బస్తాలకు పైగా దిగుబడి వచ్చినట్లని వివరించారు.75 కిలోల ధాన్యం ధర రూ.7,500 పలుకుతోందని చెప్పారు. ఈ లెక్కన 20 సెంట్ల సాగుతో రూ.49,000 వస్తుందని, ఖర్చులు పోను రూ.45,100 ఆదాయం వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. పంట కేవలం 125 రోజుల్లో వచ్చిందని, ఎలాంటి రసాయన ఎరువులు ఉపయోగించలేదని, బ్యాక్టీరియా, మెడ తెగులు, పాముపొడ రాకుండా వేప చమురు, పుల్ల మజ్జిగను వినియోగించినట్లు ఆయన వివరించారు. బ్లాక్ రైస్ ప్రత్యేకతలు ఈ వంగడం దోమ, అగ్గి తెగులును తట్టుకుంటుంది. భారీ వర్షాలను తట్టుకుంటుంది. పంట నేలవాలదు. దీనిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వలన, వాడిన వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
అన్నదమ్ముల అపూర్వ సేద్యం
ఆరిమిల్లి కృష్ణ, బాపిరాజు సోదరులు 135 ఎకరాల సొంత భూమిలో ఉమ్మడి వ్యవసాయం చేస్తున్న పెద్దరైతులు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కోల్‌మాన్‌పేట వారి స్వగ్రామం. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 1960లో వీరి తండ్రి వలస వచ్చి కోల్మాన్పేటలో స్థిరనివాసం ఏర్పరచుకొని పాడి పశువుల పోషణతోపాటు పంటలు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కృష్ణ బీటెక్ చదువుకున్నప్పటికీ తండ్రి చూపిన బాటలో వ్యవసాయాన్నే వృత్తిగా ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు, ఎన్నో ఏళ్లుగా చేస్తున్న రసాయనిక వ్యవసాయం అనేక విధాలుగా ఎలా నష్టదాయకమో గ్రహించి కుటుంబంలో అందర్నీ ఒప్పించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడం విశేషం. 40 దేశవాళీ ఆవులను పోషిస్తూ.. వాటి పేడ, మూత్రంతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకొని భూములను సజీవవంతంగా మార్చుకుంటూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్నారు. రసాయనిక వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల ఖర్చులు పెరిగిపోయి క్రమంగా నికరాదాయం తగ్గిపోతూ వస్తున్న తరుణంలో 2012 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరంలో కృష్ణ పాల్గొన్నారు. రసాయనిక వ్యవసాయంతో ప్రజారోగ్యానికి, భూమికి, పర్యావరణానికి, ఆరోగ్యానికి జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకున్న కృష్ణ.. పాలేకర్ చెప్పిన విధంగా 2012 ఖరీఫ్ పంట కాలం నుంచే ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఏకంగా 90 ఎకరాల్లో వరి సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చేశారు. అయితే, కొత్త కావడం, సందేహాలను నివృత్తి చేసే వారు అందుబాటులో లేకపోవడంతో వరి ధాన్యం దిగుబడి తొలి ఏడాది ఎకరానికి 18 బస్తాలకు పడిపోయింది. మొదటి ఏడాది రూ. లక్షల ఆదాయం తగ్గిపోయింది. అయినా, మొక్కవోని దీక్షతో ప్రకృతి వ్యవసాయంలో మెలకువలను నేర్చుకుంటూ వ్యవసాయాన్ని కొనసాగించారు. అంతేకాదు, అప్పటివరకు నిర్వహిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుకాణం(ఏటా రూ. 30 లక్షలకు పైగా టర్నోవర్) కూడా అదే సంవత్సరం మూసివేసి మరీ ప్రకృతి వ్యవసాయానికి కట్టుబడిన ప్రకృతి వ్యవసాయ కుటుంబం వారిది. దిగుబడి 18 నుంచి 52 బస్తాల వరకు.. ప్రకృతి వ్యవసాయంలో పట్టు సాధిస్తున్న కొద్దీ ఏటేటా దిగుబడులు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం తమ ప్రాంతంలో రసాయనిక వ్యవసాయదారుల కన్నా ఎక్కువగానే ప్రకృతి వ్యవసాయంలో తాము వరి ధాన్యం దిగుబడి తీయగలుగుతున్నామని గర్వంగా చెప్పుకునే స్థితికి కృష్ణ ఎదిగారు. మొదటి ఏడాదే 90 ఎకరాల్లో వరిసాగును ప్రకృతి వ్యవసాయంలో చేపట్టినప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల ఎకరానికి 18 బస్తాల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఎకరానికి 35 నుంచి 40 బస్తాల (బస్తా 72 కిలోలు) దిగుబడి సాధిస్తున్నారు. రెండేళ్ల క్రితం చీడపీడల బెడద ఎక్కువగా ఉండటంతో రసాయనిక వ్యవసాయం చేసిన రైతులకు ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయినా తమ పొలంలో చీడపీడలూ లేవు, దిగుబడీ తగ్గలేదని కృష్ణ తెలిపారు. రెండు ఎకరాల్లో ప్రయోగాత్మకంగా పచ్చి పేడ స్లర్రీని బకెట్లతో పొలంలో కూలీలతో తరచూ పోయిస్తూ వచ్చానని, దిగుబడి ఎకరానికి 52 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని కృష్ణ తెలిపారు. అయితే, పేడ స్లర్రీని బక్కెట్లతో పోయించడం శ్రమతోటి, ఖర్చుతోటి కూడిన పని కాబట్టి కొనసాగించడం లేదన్నారు. పత్తిలో అంతర పంటగా తెల్ల జొన్న కృష్ణ సోదరులకు 12 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈ ఏడాది 56 ఎకరాల్లో వరి (బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, ఎన్‌డిఎల్‌ఆర్–7 రకాలు) సాగు చేశారు. ఆర్ఎన్ఆర్ ఎకరానికి 38 బస్తాల దిగుబడి వచ్చింది. ఆముదం 20 ఎకరాల్లో, 4 ఎకరాల్లో కంది సాగు చేస్తున్నారు. 14 ఎకరాల్లో అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, వరిగలు సాగు చేశారు. 6 ఎకరాల్లో బీటీ పత్తి వేసి, జొన్నను అంతరపంటగా సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి 6 క్వింటాళ్ల పత్తి తీశారు. మరో 6 క్వింటాళ్లు రావచ్చు. పత్తి సాళ్ల మధ్య 48 అంగుళాల దూరం పెట్టారు. పత్తి సాళ్ల మధ్య రెండు వరుసలుగా తెల్ల జొన్నను విత్తారు. ఎకరానికి పది క్వింటాళ్ల జొన్న దిగుబడి వస్తుందని కృష్ణ ఆశిస్తున్నారు. షాంపూ, వేప చెక్క+గోమూత్ర కషాయం సోప్ షాంపూ, వేప చెక్క+గోమూత్రంతో చేసిన కషాయం పిచికారీ చేశాక కత్తెర పురుగు ఉధృతి రసాయనిక వ్యవసాయ పొలాల్లో కన్నా తమ పొలంలో తక్కువగా ఉందని కృష్ణ తెలిపారు. సోప్ షాంపూని రెండు సార్లు పిచికారీ చేశారు. వేపచక్క 3 కిలోలు, 12 లీటర్ల గోమూత్రం కలిపి 3 పొంగులు పొంగిస్తే 8–9 లీటర్ల కషాయం వస్తుంది. కాచిన తెల్లారి 20 లీటర్ల పంపునకు ఒక లీటరు కషాయాన్ని, 1 లీటరు గోమూత్రం, 18 లీటర్ల నీటిని కలిపి పత్తిపై పిచికారీ చేస్తున్నారు. ఈ రబీలో మినుము, పెసర, గోధుమను సాగు చేయనున్నామన్నారు. మిర్చిలో అంతరపంటలుగా జొన్న, సజ్జ గత ఏడాది ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన ఎల్‌సిఎ 625 నాటు రకం మిర్చి (వరుసల మధ్య 36 అంగుళాలు, మొక్కల మధ్య 1.5 అంగుళాల దూరం)లో జొన్న, సజ్జ (3–4 మిరప మొక్కలకు ఒక జొన్న, సజ్జ మొక్కలు నాటారు) అంతర పంటలుగా వేసి మిర్చిలో 12 క్వింటాళ్ల దిగుబడులు సాధించానని కృష్ణ తెలిపారు. జొన్న, సజ్జ అంతరపంటగా వేయడం వల్ల ఫిబ్రవరి తర్వాత ఎండ తీవ్రత నుంచి మిర్చి పంటకు నీడ దొరకడంతో ఒక కాపు ఎక్కువగా వచ్చిందన్నారు. ఈ రకం మిరప విత్తనాన్ని తిరిగి వాడుకోవచ్చని, అయితే వేరే పొలంలో పండిన లేదా లాం ఫాం నుంచి విత్తనాలు తెచ్చి వేసుకుంటే మంచిదన్నారు. వేప చెక్క+గోమూత్ర కషాయాన్ని అమావాస్యకు ముందు ఒకసారి, తర్వాత మరోసారి ఈ కషాయాన్ని పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధించామని కృష్ణ తెలిపారు. ప్రదర్శనా క్షేత్రం.. శిక్షణా కేంద్రం.. కృష్ణ, బాపిరాజు సోదరులు మక్కువతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ వరి, పత్తి, మిర్చి నుంచి చిరుధాన్యాలు, మామిడి తోటల వరకు బహుళ పంటలు సాగు చేస్తూ భళా అనిపించుకుంటుండటంతో వారి వ్యవసాయ క్షేత్రం వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంత రైతులకు సైతం ప్రదర్శన క్షేత్రంగా, రైతు శిక్షణా కేంద్రంగా రూపుదాల్చింది. సీజన్లో కనీసం రెండు సార్లు రైతులకు శిక్షణ ఇస్తున్నామని, నిరంతరం రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్‌కు వస్తూ వుంటారని కృష్ణ గర్వంగా చెప్పారు. గ్రామంలో పెద్ద రైతు రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయం చేపట్టి, మిగతా రైతులకు తోడ్పాటునందిస్తూ ఉంటే ఆ గ్రామంలో చిన్న రైతులు అనుసరించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోల్మాన్పేటలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికి 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ బాట పట్టారని కృష్ణ తెలిపారు. తాము జీవామృతం, ఘనజీవామృతం, తదితర కషాయాలను రైతులకు నామమాత్రపు ధరలకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటుతో గ్రామంలో మిగతా రైతులను కూడా ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాని కృష్ణ ఆనందంగా చెప్పారు. స్ఫూర్తిదాయకమైన కృషి చేస్తున్న కృష్ణ సోదరులకు ‘సాగుబడి’ జేజేలు! – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్) వెయ్యి లీటర్ల బ్యారెల్స్‌లో జీవామృతం సరఫరా అలవాటైపోయిన రసాయనిక వ్యవసాయం వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతుల్లో వారి ఆర్థిక స్తోమతను బట్టి ఎవరి బాధలు వాళ్లకుంటాయి. చిన్న రైతులకు ఉండే సమస్యలు ఒక రకమైతే, పెద్ద రైతులకు ఉండే సమస్యలు ఇంకో రకం. పాలేకర్ శిక్షణా తరగతుల్లో 200 లీటర్ల నీటిలో ఆవు పేడ, మూత్రం, బెల్లం, పప్పుల పిండి కలిపి ఎకరానికి సరిపడా జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చెబుతుంటారు. అయితే, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలినాళ్లలో ఈ సూచనలను కృష్ణ అలాగే పాటించారు. పొలం విస్తీర్ణం ఎక్కువ కావడంతో కొద్ది పరిమాణాల్లో చిన్న డ్రమ్ముల్లో చేసిన జీవామృతం సరిపోక పంట అనుకున్నంత దిగుబడినివ్వలేదు. దీంతో, ఇలా కాదని తమ పెద్ద వ్యవసాయ క్షేత్రానికి అనుగుణంగా జీవామృతం తయారీ పద్ధతిని కృష్ణ నేర్పుగా మార్చుకున్నారు. వెయ్యి లీటర్ల ఫైబర్ బ్యారెల్స్ తెప్పించి వాటిలో జీవామృతం తయారు చేసి భూములకు అందించడం ప్రారంభించిన తర్వాత సమస్య తీరింది. పంటల దిగుబడీ పెరిగింది. జీవామృతంతో కూడిన వెయ్యిలీటర్ల బ్యారెల్స్ మూడింటిని ఒక ట్రాలీలో తరలించి ఒక విడతకు 10–15 ఎకరాలకు అందిస్తుండడంతో ఇప్పుడు పుష్కలంగా జీవామృతం పంటలకు అందుతోంది. దీంతోపాటు పల్వరైజింగ్ మిషన్‌ను తెచ్చిన తర్వాత.. 135 ఎకరాలకు సరిపడా వివిధ రకాల కషాయాల తయారీ ప్రక్రియ కూడా సులభంగా మారిందని కృష్ణ సంతృప్తిగా చెప్పారు. ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం. గతంలో రసాయన ఎరువులతో వ్యవసాయం చేసి నష్టాలను మూట కట్టుకున్నాను. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 2012 నుంచి తమ్ముడు బాపిరాజుతో కలసి 135 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనేక మంది రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. మా గ్రామంలో దాదాపు 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 40 దేశవాళీ ఆవులను పోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం వల్ల నాణ్యమైన ఆహారాన్ని పండిస్తున్నాం. భూమి ఆరోగ్యం అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని ప్రోత్సహిస్తుండటం శుభపరిణామం. మా ఊళ్లో రైతులందరినీ ప్రకృతి వ్యవసాయదారులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నాను. – ఆరిమిల్లి కృష్ణ (95533 42667), బీటెక్, ప్రకృతి వ్యవసాయదారుడు, కోల్‌మాన్‌పేట, కొసిగి మం, కర్నూలు జిల్లా జీవామృతాన్ని పొలానికి తరలించడానికి వాడుతున్న భారీ ట్యాంకులు -
జొన్న విత్తు.. రికార్డు సొత్తు
సాక్షి, హైదరాబాద్: ఇక్రిశాట్ సహకారంతో అభివృద్ధి చేసిన జొన్నపంట దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించింది. పాడి రైతులకు చౌకగా పశుగ్రాసం అందించేందుకు నమూనా వంగడంగా జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం దీన్ని గుర్తించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్), ఉత్తరాఖండ్‌లోని జీబీ పంత్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్తరకం జన్యు వంగడాన్ని అభివృద్ధి చేశారు. ఇక్రిశాట్ వంగడం ఐసీఎస్ఏ 467, పంత్ చారి–6 రకాల వంగడాలు రెండింటినీ కలిపి సీఎస్హెచ్ 24 ఎంఎఫ్ పేరుతో దీన్ని అభివృద్ధి చేశారు. జొన్న చొప్పను పలుమార్లు కత్తిరించి వాడుకునే అవకాశముండటం దీని ప్రత్యేకత. అతితక్కువ నీటితోనే ఎక్కువ గ్రాసాన్ని ఇవ్వగలదు. వేసవిలో నీటి ఎద్దడి ఉన్నప్పుడు కూడా పశువులకు తగినంత పచ్చి ఆహారాన్ని అందించవచ్చని దీన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త డాక్టర్ అశోక్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే దీనిని దేశవ్యాప్తంగా పలువురు రైతులు విజయవంతంగా వాడుతున్నారని చెప్పారు. ఈ పంట కేవలం పశుగ్రాసం కోసం మాత్రమే వాడతారని, జొన్న గింజలు రాకమునుపే కత్తిరించేస్తారని ఆయన స్పష్టం చేశారు. జొన్న పంటపై చేపట్టిన జాతీయ కార్యక్రమంలో దీనికి ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది. కొత్త హైబ్రిడ్ జొన్న వంగడాలు తయారు చేయాలంటే.. సీఎస్హెచ్–24ఎంఎఫ్‌ను నమూనాగా ఎంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్దేశించారు. దీనికి ఉన్న డిమాండ్ ఎంత అంటే.. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఏటా 10 నుంచి 12 కొత్త కంపెనీలకు గ్రాసం విత్తనాల సాగుకు లైసెన్స్ ఇచ్చేంత! పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారత్‌ను పశుగ్రాసం కొరత చాలా తీవ్రంగా వేధిస్తోంది. ఓ అంచనా ప్రకారం దేశంలో ఏటా దాదాపు 132.57 కోట్ల టన్నుల పశుగ్రాసం (పచ్చి, ఎండు) అవసరముండగా.. 35 శాతం తక్కువగా కేవలం 97.87 కోట్ల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. తాజా వంగడంతో పశుగ్రాసం కొరత తీరనుంది. -
అన్నదాతా తొందరొద్దు...
కాళోజీసెంటర్: రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దు.. సమయమేమి మించిపోలేదు.. వర్షాలు పడ్డాకనే వేయడం మంచిదని జేడీఏ ఉషాదయాళ్ రైతులకు సూచించారు. ఖరీఫ్ సీజన్ విత్తనాలు, ఎరువుల విషయమై రైతుల్లో అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఆయా సందేహాలను నివృత్తి చేయడానికి సాక్షి నడుం బిగించింది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు వ్యవసాయ శాఖ జేడీఏ ఉషాదయాళ్‌తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగింది. జిల్లాలో సాగులో ఎదురవుతున్న సీజన్‌కు సంబంధించిన అంశాలు, సబ్సిడీ విత్తనాలు, రైతు బంధు, పీఎం కిసాన్ డబ్బులు, రైతు బీమా తదితర సమస్యల గురించి ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 26 మంది రైతులు ఫోన్ చేశారు. రైతులు అడిగిన సందేహాలను జేడీఏ ఉషాదయాళ్ నివృత్తి చేశారు. వారికి దశల వారీగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. మీకు గతంలో డబ్బులు వస్తే మాత్రం మీకు ఖాతాలో పడుతాయి. ఆందోళన చెందాల్సిన పనిలేదు. దశల వారీగా పడుతున్నాయి. కొత్త పట్టా పాస్‌బుక్‌లు ఉన్నవారు మాత్రం సంబంధిత మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి బ్యాంకు అకౌంట్ నంబర్ ఇవ్వండి. ప్రధానంగా రైతులు ఫసల్ బీమా చేయాలి. బీమా చేసిన రైతులకు నష్టం జరగకుండా బీమా డబ్బులు వస్తాయి. ప్రశ్న : పంటల బీమా ఇన్సూరెన్స్ రాలేదు. మా దగ్గర బాండ్ లేదు ఏమిచేయాలి..?– బత్తుల రాజు, గీసుకొండ మండలం, కొనాయమాకుల జేడీఏ: పంటల బీమా ఇన్సూరెన్స్ గనుక మీరు చేస్తే ఎల్ఐసీ వాళ్ల దగ్గర బాండ్ ఉంటుంది. దానికి సంబంధించి సమాచారం కొరకు మీ మండల వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే ఐడి నంబర్ చెబుతారు. నంబర్ ఆధారంగా ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు. ప్రశ్న : పీఎం కిసాన్ డబ్బులు రాలేదు..?– సదయ్య, కొత్తగూడ, సంగెం. జేడీఏ: పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉండడం వల్ల రాలేదు. ఇప్పడు కోడ్ అయిపోయింది. వస్తాయి. ప్రశ్న : పత్తి గింజలు ఇప్పుడు పెట్టొచ్చా ..?– సంజీవ, గొర్రెకుంట, గీసుకొండ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాస్ : పత్తి గింజలు ఇప్పుడే వేయొద్దు్ద. 60.70 మిల్లీమీటర్ల వర్షం పడితేగాని వేయాలి. అంతవరకు వేయకూడదు. జూన్ 20 నుంచి 25 వరకు అవకాశం ఉంది. సహజంగా రోహిణీ కార్తెలో విత్తనాలు వేస్తారు. కాని వర్షాలు పడలేదు కాబట్టి వేయకూడదు. ప్రశ్న : విత్తన తయారీకి ఏ రకమైన విత్తనాలు వాడితే మంచిది..?– బాబురావు, పరకాల వ్యవసాయ శాస్త్రవేత్త : విత్తనం తయారు చేయడానికి గ్రేడింగ్ విత్తనాలనే వాడాలి. వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని శాస్త్రవేత్త డాక్టర్ జగన్మోహన్ గారిని సంప్రదించాలి (సెల్ నెంబర్ 998962533)వారి పర్యవేక్షణలో విత్తనాల ఉత్పత్తి తయారు చేస్తారు. సొంతంగా తయారు చేయడం మంచిది కాదు. ప్రశ్న : సబ్సిడీ విత్తనాలు గ్రామస్థాయిలో పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయాలి. ఎరువుల దుకాణాలో తనిఖీలు చేయాలి కదా మేడం..?– శ్రీనివాస్, ఎల్గూర్‌రంగంపేట, సంగెం జేడీఏ: నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు ఎవరైనా అమ్మినట్లు తెలిస్తే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మండల కేంద్రంలో సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. గ్రామస్థాయిలో ఆలోచిస్తాం. ప్రశ్న : పసుపు విత్తనం ఏ విధంగా పెట్టాలి..? – రవీందర్, కొండాయి, నల్లబెల్లి ఉద్యానశాఖ జేడీఏ శ్రీనివాస్‌రావు : వర్షాలు పెద్దవి పడాలి.. దుక్కి చదును చేసుకొని సిద్ధంగా ఉంచుకొని పెద్ద వర్షం పడ్డాక బోదెలు తయారు చేసి విత్తాలి. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే మంచి లాభం ఉంటుంది. -
పాలేకర్ ప్రకృతి సేద్యంపై అధ్యయన కమిటీ
సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ (ఎస్.పి.ఎన్.ఎఫ్.) పద్ధతి(దీన్ని మొదట్లో ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే వారు) ని అనుసరించడం వల్ల ఒనగూడుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సవాళ్లపై సమగ్ర అధ్యయనానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. గత కొన్ని సంవత్సరాల నుంచి పాలేకర్ నేర్పిన పద్ధతిలో అనేక రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. 12 మంది వ్యవసాయ నిపుణులతో కూడిన జాతీయ స్థాయి కమిటీని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్.) అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డా. ఎస్. భాస్కర్ ఇటీవల నియమించారు. 12 మంది వ్యవసాయ నిపుణులతో కూడిన ఈ కమిటీకి ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. వి. ప్రవీణ్‌రావు సారధ్యంవహిస్తారు. ఈ ఉన్నత స్థాయి జాతీయ కమిటీలో ఐ.సి.ఎ.ఆర్. డీడీజీ డా. ఎస్. భాస్కర్‌తోపాటు మోదీపురంలోని భారతీయ వ్యవసాయ వ్యవస్థల పరిశోధనా సంస్థ సంచాలకులు డా. ఎ. ఎస్. పన్వర్, జాతీయ సేంద్రియ వ్యవసాయ పరిశోధనా స్థానం సిక్కిం సంయుక్త సంచాలకులు డా. ఆర్. కె. అవస్థె, కోయంబత్తూర్‌లోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సుస్థిర సేంద్రియ వ్యవసాయ విభాగం అధిపతి ప్రొ. ఇ. సోమసుందరం, ఉదయ్‌పూర్‌లోని ఎం.పి.ఎ.ఎ.టి. సేంద్రియ పరిశోధనా కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ డా. ఎస్.కె. శర్మ, పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లుధియానా సేంద్రియ వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ డా. సి.ఎస్. యూలఖ్, అపెడా (ఘజియాబాద్) మాజీ సంచాలకుడు డా. ఎ. కె. యాదవ్, కేంద్ర వ్యవసాయ– సహకార– రైతుల సంక్షేమ శాఖ సంయుక్త కారదర్శి, నీతి ఆయోగ్ వ్యవసాయ సలహాదారు సభ్యులుగా ఉంటారు. భారతీయ సాగు వ్యవస్థల పరిశోధనా సంస్థ (మోదిపురం) ముఖ్య శాస్త్రవేత్త డా. ఎన్. రవిశంకర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఇదీ కమిటీ అధ్యయన పరిధి.. 1 ఎస్.పి.ఎన్.ఎఫ్. (ఇంతకుముందు జడ్.బి.ఎన్.ఎఫ్. అనేవారు)పై వివిధ రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో, భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ అనుబంధ సంస్థల్లో, సేంద్రియ వ్యవసాయంపై అఖిలభారత నెట్వర్క్ ప్రోగ్రాంలో భాగంగా నిర్వహించిన పరిశోధనా ఫలితాలను ఈ కమిటీ సమీక్షిస్తుంది. ఎస్.పి.ఎన్.ఎఫ్.పై భవిష్యత్తులో నిర్వహించే పరిశోధన వ్యూహాలలో చేర్చదగిన అంశాలపై సిఫారసులు చేస్తుంది. 2 సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ (ఎస్.పి.ఎన్.ఎఫ్.) సాగు పద్ధతి బలాలు, బలహీనతలపై కమిటీ అధ్యయనం చేస్తుంది. వ్యవసాయ పరిశోధనా క్షేత్రాలు, రైతుల వ్యవసాయ క్షేత్రాలలో ఫలితాలను అంచనా వేసేటప్పుడు అనుసరించాల్సిన పద్ధతులను సూచిస్తుంది. 3 ఎస్.పి.ఎన్.ఎఫ్.ను దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తిలోకి తెస్తే భారత దేశంలో భూమి ఆరోగ్యం, ఉత్పాదకత, ఆహార ఉత్పత్తి, జీవనభృతులు, వ్యవసాయ రంగ సుస్థిరత తదితర అంశాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నదీ నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుంది. 4 శాస్త్రీయ సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో ఎస్.పి.ఎన్.ఎఫ్. పద్ధతులను సమ్మిళితం చేయడానికి కమిటీ తగిన సూచనలు చేస్తుంది. ఈ కమిటీకి కాలపరిమితి లేదు. -
నలుగురి కుటుంబానికి 49 మీటర్ల పెరటి తోట!
జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్) హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఉంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్తలు, అధికారులు, స్టార్టప్స్ ఏర్పాటు చేసుకునే యువతీ యువకులు.. ‘మేనేజ్’లో వివిధ అంశాలపై ఏటా వందలాది మంది శిక్షణ పొందుతూ ఉంటారు. వీరికి సేంద్రియ ఇంటిపంటలపై అవగాహన కలిగించేందుకు.. జెండర్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో సేంద్రియ ఇంటిపంటలపై ‘మేనేజ్’ ఆవరణలో నమూనా ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేశారు. 2016 డిసెంబర్ నుంచి మోడల్ వెజిటబుల్ గార్డెన్, మోడల్ బాల్కనీ గార్డెన్‌ను పెంచుతున్నారు. అర్బన్ అగ్రికల్చర్ విభాగంలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యాననిపుణురాలు నాగరాణి ఈ నమూనా ప్రదర్శనా క్షేత్రాలను పర్యవేక్షిస్తున్నారు. నలుగురి కుటుంబానికి (7 మీటర్ల పొడవు“7 మీటర్ల వెడల్పు) 49 చదరపు మీటర్ల పెరట్లో ఏడాది పొడవునా కుటుంబానికి సరిపోయే అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చని తమ అధ్యయనంలో నిర్థారణ అయ్యిందని నాగరాణి ‘సాక్షి’కి తెలిపారు. ఈ 49 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రణాళికాబద్ధంగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటే.. రోజుకు 250 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు కూరగాయల దిగుబడి వస్తుందన్నారు. టమాటా, వంగ, మిరప, కాప్సికం, ఎర్రముల్లంగి, బీట్రూట్, బీన్స్, బెండ, మునగ, నేతిబీర, కాకర, క్యాబేజి తదితర 20 రకాల కూరగాయలు, 7 రకాల ఆకుకూరలతోపాటు అరటి చెట్లు వేర్వేరు మడుల్లో సాగు చేస్తున్నారు. ప్రతి మడి 2 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. టమాటా వంటి ఎక్కువగా వాడే కూరగాయ మొక్కలు ఎక్కువ లైన్లలో నాటుతామని నాగరాణి వివరించారు. దశల వారీగా విత్తుకోవాలి.. ఇనుప మెష్‌తో కంచె వేసిన ఈ పెరటి తోట పెంచుతున్న భూమి అంతగా సారం లేని గ్రావెల్ మాదిరి భూమి కావడంతో ప్రారంభంలో 2 ట్రక్కుల ఎర్రమట్టి తోలించి, మాగిన పశువుల ఎరువు కలిపి మడులు చేశారు. ఏడాది పొడవునా నిరంతరం కూరగాయలు అందుబాటులో ఉండాలంటే దశలవారీగా పంటలు విత్తుకోవడం లేదా మొక్కలు నాటడం చేయాలని ఆమె అన్నారు. టమాటా, మిర్చి, వంగ వంటి కూరగాయ పంటలు విత్తిన 50–60 రోజుల్లో పూత, కాపు ప్రారంభమవుతుంది. 3–4 నెలలు దిగుబడి వస్తుంది. ప్రస్తుత పంట నెలన్నరలో కాపు అయిపోతుందనగా.. మరో దఫా నారు పోసుకోవాలి లేదా విత్తుకోవాలి. 25 రోజుల నారును తీసి వరుసల్లో నాటుకోవాలి. ప్రతి మడిలోనూ పంట మార్పిడి పాటించాలి. వేసిన పంటే మళ్లీ వేయకూడదు. పంట మార్చిన ప్రతి సారీ వర్మీకంపోస్టు , పశువుల ఎరువు కలగలిపిన మిశ్రమం కొంత వేస్తూ ఉంటే పంటలకు పోషకాల లోపం రాదు. పంటకు ప్రతి పది రోజులకోసారి సేంద్రియ ఎరువులు కొంచెం వేస్తే మంచి దిగుబడులు వస్తాయని నాగరాణి అంటారు. 15 రోజులకోసారి జీవామృతం.. వర్మీవాష్.. జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి 1:10 నిష్పత్తిలో నీటిలో కలిపి పొదుల్లో పోస్తామని నాగరాణి తెలిపారు. అదేవిధంగా ప్రతి 15 రోజులకోసారి జీవామృతం లేదా వర్మీ వాష్ అదొకసారి ఇదొకసారి పిచికారీ చేస్తున్నారు. రసం పీల్చే పురుగులను అరికట్టడానికి పసుపు, నీలం రంగు జిగురు అట్టలు రెండిటిని పెరటి తోటలో పెట్టుకోవాలి. లింగాకర్షక బుట్టలను ఏర్పాటుచేసుకుంటే కూరగాయ పంటలను ఆశించే లద్దె పురుగును అరికట్టవచ్చు. వేసవిలో కన్నా వర్షాకాలంలో పురుగు ఉధృతి ఎక్కువ, వేసవిలో తక్కువగా ఉంటుందని నాగరాణి తెలిపారు. చీడపీడల నియంత్రణకు అవసరాన్ని బట్టి నాణ్యమైన వేప నూనె లీటరుకు 5–7 ఎం.ఎల్. కలిపి పిచికారీ చేస్తారు. పురుగు మరీ ఉధృతంగా ఉంటే అగ్ని అస్త్రం ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి 200 ఎం.ఎల్. చొప్పున కలిపి పిచికారీ చేస్తామన్నారు. మోడల్ బాల్కనీ గార్డెన్ 6 మీటర్లు “ 4 మీటర్ల విస్తీర్ణంలో మోడల్ బాల్కనీ గార్డెన్‌ను కూడా నాగరాణి నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ కుండీలు, గ్రోబాగ్స్, వర్టికల్ టవర్లలో కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు. 20% కొబ్బరిపొట్టు + 40% ఎర్రమట్టి + 20% మాగిన పశువుల ఎరువు కలిపి తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని వాడుతున్నట్లు నాగరాణి వివరించారు. మేకల ఎరువుకు వేడి లక్షణం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో మొక్కలకు వేయకూడదు. చలికాలంలో మాత్రమే మేకల ఎరువు వాడాలి. పశువుల ఎరువు ఎప్పుడైనా వాడొచ్చు. 8 అంగుళాల ఎత్తుండే పాలీ బ్యాగ్ ఆకుకూరల సాగుకు సరిపోతుంది. కూరగాయ మొక్కలకు 18 అంగుళాల ఎత్తు, 12 అంగుళాల వ్యాసార్థం కలిగిన పాలీ బ్యాగ్ వాడితేనే ఎక్కువ కాలం కాపు వస్తుంది. 30% షేడ్‌నెట్ హౌస్‌లో కూరగాయల ఉత్పాదకత ఆరుబయట కన్నా ఎక్కువగా వస్తుందని నాగరాణి తెలిపారు. అడుగున్నర ఎత్తు, అడుగు వ్యాసార్థం ఉన్న గ్రోబాగ్‌లో టమాటా మొక్కలు నాటి షేడ్‌నెట్ హౌస్‌లో ఉంచితే వారానికి 500–750 గ్రాముల టమాటాల దిగుబడి, 3 నెలల పాటు వస్తుందన్నారు. సాధారణ ఆకుకూరల్లో కన్నా మైక్రోగ్రీన్స్‌లో 40% అధికంగా పోషకాలు లభిస్తాయని నాగరాణి (97030 83512) అంటున్నారు. 49 చ.మీ.ల నమూనా పెరటి తోట షేడ్‌నెట్ హౌస్‌లో టమాటో మొక్కలు -
అప్పుల సాగు..రైతుబంధుతో కాస్త బాగు
సాక్షి, హైదరాబాద్: అప్పులు అధికంగా తీసుకునే రైతుల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రమే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని నాబార్డు స్పష్టం చేసింది. తెలంగాణలో 79.5 శాతం రైతు కుటుంబాలు అప్పులు చేస్తున్నాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2015 జూలై ఒకటో తేదీ నుంచి 2016 జూన్ 30 వరకు జాతీయ గ్రామీణ ఆర్థిక సర్వే (ఆలిండియా రూరల్ ఫైనాన్సియల్ ఇంక్లూజన్) పేరిట నాబార్డు సర్వే నిర్వహించింది. వ్యవసాయ, వ్యవసాయేతర కుటుంబ ఆదాయాలు, వ్యవసాయ రంగంలో రైతులు అవలంబిస్తున్న విధానాలపై సర్వే చేసింది. 29 రాష్ట్రాలలోని 245 జిల్లాల్లో 2,016 గ్రామాల్లో 40,327 కుటుంబాలను సర్వే చేసింది. మన రాష్ట్రంలో ఉమ్మడి ఆరు జిల్లాల్లోని 48 గ్రామాల్లో 958 కుటుంబాలను సర్వే చేసింది. వాటి వివరాలను తాజాగా బయటపెట్టింది. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిందని, రైతుబంధుతో గ్రామాల్లో ప్రైవేటు అప్పులు తగ్గాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఎకరాకు రూ.4 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో సాగు, విత్తన ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తగ్గిందంటున్నారు. కూలీ ద్వారానే అధిక ఆదాయం దేశవ్యాప్తంగా వ్యవసాయ కుటుంబాలు సాగు ద్వారాకంటే కూలీ పనులకు వెళ్లి అధికంగా ఆదాయాన్ని పొందుతు న్నారు. ఉదాహ రణకు వ్యవసాయ కుటుంబంలో సాగు ద్వారా నెలకు రూ. 3,140 ఆదాయం వస్తే, వేతన కూలీకి పొలం పనుల ద్వారా రూ.3,025, ఉపాధి కూలీ ద్వారా రూ.1,444 వస్తోంది. అంటే మొత్తం రూ.4,469గా ఉంది. అలాగే చాలామంది వ్యవ సాయ కుటుం బాలకు వ్యవసాయ యంత్రాలు అందుబాటులో లేవు. కేవలం 5% మంది రైతులు మాత్రమే దేశవ్యాప్తంగా ట్రాక్టర్లు కలిగి ఉన్నారు. ఇందులో పంజాబ్‌లో అధికంగా 31%, గుజ రాత్లో 14%, మధ్యప్రదేశ్‌లో 13% ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక పవర్ టిల్లర్స్ 1.8%, స్ప్రింక్లర్లు 0.8%, సూక్ష్మసేద్యం 1.6%, హార్వెస్టర్లు 0.2% ఉన్నట్లు సర్వే నివేదిక స్పష్టం చేసింది. ఇక మన రాష్ట్రంలో 2017 నుంచి రాష్ట్ర ప్రభు త్వం పెద్దఎత్తున సబ్సిడీ ట్రాక్టర్లను పంపిణీ చేసిందని, దీంతో ఇప్పుడు ట్రాక్టర్లు కలిగిఉన్న వారి శాతం పెరి గిందని ఒక వ్యవసాయాధికారి వ్యాఖ్యా నించారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులకు వినియోగిస్తున్న యంత్రాలలో పవర్ టిల్లర్స్ (చిన్న సాగు యంత్రాలు)7 శాతం ఉన్నట్లు నాబార్డు సర్వే వెల్లడించింది. చదువుకోని వ్యవసాయ కుటుంబాలు 32 శాతం.. సర్వే ప్రకారం వ్యవసాయ కుటుంబాల్లో అసలు చదువుకోని (నిర క్షరాస్యులు) వారి శాతం దేశవ్యాప్తంగా 32.2% ఉంది. అలాగే కాస్తో కూస్తో చదవగలిగిన ప్పటికీ సాధారణ విద్య కూడా అభ్యసించని వారు 8% ఉన్నారు. వ్యవసాయేతర కుటుంబాల్లో సాధారణ విద్య అభ్యసించని వారు 7%గా ఉన్నారు. సగటున వ్యవసాయ కుటుంబాల్లో నెలవారీ ఆదాయం రూ.8,931గా ఉంది. అలాగే రాష్ట్రంలో నెలవారీ ఆదాయం రూ.7,811గా ఉంటే ఖర్చు రూ.6,813గా ఉంది. మిగులుతోంది కేవలం రూ.998 మాత్రమే కావడం గమనార్హం. పాడిపశువుల పోషణే ఆర్థిక భరోసా.. పాడి పశు పోషణ ద్వారానే రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని నాబార్డు సర్వే స్పష్టం చేసింది. కరువుకాటకాలు వచ్చినప్పుడు, విపత్తులు సంభవించినపుడు పశుసంపదనే కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పశుసంపద కలిగిన దేశాల్లో మన దేశమే మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో వ్యవసాయ కుటుంబాలు 50.7 శాతం పాడి పశువుల పోషణ చేస్తుండగా, దుక్కిటెద్దులు కలిగి ఉన్నవారు 10.8 శాతంగా ఉంది. కోళ్లు వంటివి 5 శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. వ్యవసాయేతర కుటుంబాల్లో కేవలం 5.7 శాతం మంది మాత్రమే పాడి పోషణ కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు లేని వారికి, చిన్న, మధ్య తరహా, మహిళా రైతులకు కూడా పాడి ద్వారా ఉపాధి కలుగుతోంది. దీని ప్రకారం వ్యవసాయానికి అనుబంధంగా పాడి పోషణ ఉంటే నష్టాలు వచ్చినపుడు రైతులు నిలదొక్కుకోవచ్చునని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో పాడి రైతులకు ప్రభుత్వం బర్రెలు లేదా ఆవులు ఇవ్వడం వల్ల ఎంతోకొంత వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఏర్పడ్డాయని అధికారులు పేర్కొంటున్నారు. -
‘ప్రాణాంతక మందుల’ పై ఉదాసీనత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతుల ప్రాణాలను హరిస్తున్న 18 రకాల క్రిమిసంహారక మందులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెల్సిందే. అయితే అందులో గతేడాది మధ్య భారత్‌లో పదుల సంఖ్యలో పత్తి రైతులను బలితీసుకున్న మోనోక్రోటోపాస్, మాంకోజెబ్ క్రిమి సంహారక మందులు లేకపోవడం ఆశ్చర్యకరం. దోమల సంహారానికి మున్సిపల్ సిబ్బంది, తెగుళ్ల నివారణకు రైతులు కొట్టే డీడీటీని కూడా నిషేధించక పోవడం గమనార్హం. మానవులు, జంతువుల ప్రాణాలకు హానికరమైన ఈ మూడు మందులను కూడా నిషేధించాలని వ్యవసాయ శాస్త్రవేత్త అనుపమ వర్మ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మొత్తం 18 క్రిమిసంహారక మందుల్లో 11 మందుల రిజిస్ట్రేషన్, ఉత్పత్తి, అమ్మకం, దిగుమతి, ఉపయోగాన్ని తక్షణమే నిషేధించగా, ఆరు క్రిమిసంహారక మందులను 2020, డిసెంబర్ నాటికి విడతల వారిగా నిషేధించాలని నిర్ణయించింది. హెర్బిసైడ్ ట్రిఫులారిన్ను కూడా కేంద్రం తక్షణమే నిషేధించినప్పటికీ ఒక్క గోధుమ పంటకు మాత్రం అనుమతించాలని నిర్ణయించింది. వాస్తవానికి దీన్ని కూడా సంపూర్ణంగా నిషేధించాలని వర్మ కమిటీ సిఫార్సు చేసింది. వాస్తవానికి ఈ క్రిమిసంహారక మందులను కేంద్రం ఎప్పుడో నిషేధించి ఉండాల్సిందీ, తాత్సారం చేస్తూ వచ్చింది. దేశంలో రైతులు ప్రాణాంతకమైన క్రిమిసంహారక మందులను ఉపయోగిస్తున్నారంటూ సామాజిక కార్యకర్తలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రాణాంతకమైన 66 మందుల ప్రభావాన్ని సమీక్షించి తగిన సిఫార్సులను చేయాల్సిందిగా కోరుతూ 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం వర్మ కమిటీని నియమించింది. ఆ కమిటీ 66 మందుల్లో 19 మందులను సంపూర్ణంగా నిషేధించాలని సిఫార్సు చేస్తూ 2015, డిసెంబర్ నెలలోనే నివేదికను మోదీ ప్రభుత్వానికి అందజేసింది. దాదాపు 20 నెలల అనంతరం ఆగస్టు 8వ తేదీన చర్యలు తీసుకుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో నిషేధించిన క్రిమిసంహారక మందుల్లో 104 మందులను మన దేశంలో వాడుతున్నారని ఆరోగ్య కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వాటిల్లో 66 రకాల మందులను మాత్రమే వర్మ కమిటీ సమీక్షించిందని వారు చెప్పారు. అలాగే ప్రపంచంలో పలు దేశాలు నిషేధించిన ‘గ్లైఫోసేట్’ను వర్మ కమిటీ సమీక్షించినా దాన్ని నిషేధించాల్సిందిగా ఎలాంటి సిఫార్సు చేశారు. ప్రాణాంతక మందులను నిషేధించే అధికారం ఒక్క కేంద్రానికి మాత్రమే ఉంది. రాష్ట్రానికి వాటిపై 90 రోజులపాటు తాత్కాలికంగా నిషేధం విధించే అధికారం మాత్రం ఉంది. కాకపోతే వాటి ఉత్పత్తి యూనిట్లకు లైసెన్స్‌లు నిరాకరించే అధికారం ఉంది. -
ఏటా 7.5 లక్షల రైతులు సాగుకు దూరం
సంక్షోభం దిశగా వ్యవసాయం వ్యవసాయరంగ సదస్సులో శాస్త్రవేత్తల హెచ్చరిక ఇదే పరిస్థితి కొనసాగితే వందేళ్ల తర్వాత అన్నదాతలు మిగలరు 8వ జాతీయ విస్తరణ విద్యా సదస్సు–2017 ప్రారంభం సాక్షి, హైదరాబాద్: దేశంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి నెల కొందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చ రించారు. దేశంలో సగటున రైతు నెలవారీ ఆదాయం రూ.201 మాత్రమేనని... వ్యవసాయ రంగంలో మార్పుల కారణంగా దేశవ్యాప్తంగా ఏటా 7.5 లక్షల మంది రైతులు ఆ రంగాన్ని వీడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘న్యూట్రిషియన్ సెన్సిటివ్ అగ్రికల్చర్–చేంజింగ్ రోల్ ఆఫ్ ఎక్స్టెన్షన్’అనే అంశంపై 8వ జాతీయ విస్తరణ విద్యా సదస్సు–2017 శనివారం హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్) ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నరేంద్ర సింగ్ రాథోడ్ సదస్సును ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పలు వ్యవసాయ యూని వర్సిటీలకు చెందిన 500 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొ న్నారు. సదస్సు ప్రారంభం సందర్భం గా ఇటీవల పద్మశ్రీ అవార్డులు పొందిన చింత కింది మల్లేశం, దరిపెల్లి రామయ్యలను నార్మ్ తరపున ఘనంగా సన్మానించారు. అన్నదాత ఆదాయం అత్తెసరే... నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చి ప్రకారం దేశంలో సగటున ఒక రైతు నెలకు రూ. 4,623 సంపాదిస్తుండగా... దానిలో రూ. 4,422 పెట్టుబడి ఖర్చు పోను రైతుకు నెల ఆదాయం రూ. 201 మాత్రమే నని రాథోడ్ వివరించారు. ప్రభుత్వంలో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగి సగటున నెలకు రూ. 18 వేల చొప్పున... రోజుకు రూ. 600 సంపాదిస్తుంటే... రైతు ఆదా యం నెలకు రూ. 201 ఉండటం బాధాకర మన్నారు. అడ్డగోలుగా వాడుతున్న రసా యన ఎరువులు, పురుగుమందులు సైతం రైతు పెట్టుబడిని పెంచుతున్నాయన్నారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన 1,300 మంది వ్యవసాయ విస్తరణాధికారుల సేవలను విని యోగించుకోవాల్సి ఉందని ప్రొఫెసర్ జయ శంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రా ల్లో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం చాలా తక్కువగా ఉండటంతో రైతులకు పెట్టుబడి తగ్గి అధిక లాభాలు వస్తున్నాయని ఇంపాల్ సీఏయూ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ ప్రేమ్జిత్సింగ్ తెలిపారు. సదస్సులో ఐకార్–నార్మ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.కల్పనాశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఇలాగైతే వందేళ్ల తర్వాత రైతులు మిగలరు.. సదస్సులో డాక్టర్ నరేంద్రసింగ్ రాథోడ్ మాట్లాడుతూ దేశంలో 13.87 కోట్ల మంది రైతులుండగా వారిలో నిత్యం 2,058 మంది వ్యవసాయాన్ని వీడుతున్నారని ఒక సర్వేలో వెల్లడైందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వందేళ్లలో దేశంలో రైతులు మిగలరన్నారు. దేశంలో భవిష్యత్తు ఆహార అవసరాలకు తగ్గ ట్లుగా పోషక విలువలుగల ఆహార ఉత్పత్తి సాధించాలంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు, విస్తరణాధికారులు సమన్వయంతో పనిచే యాలని సూచించారు. 2025కి దేశ జనాభా 150 కోట్లకు చేరుతుందన్న అంచనాలున్నా యని, ఆహార అవసరాలు తీర్చేందుకు 350 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు అవస రముందని రాథోడ్ తెలిపారు. 2014–15లో దేశవ్యాప్తంగా 263 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగితే... 2015–16లో 253 మిలియన్ టన్నులకు పడిపోయిందని అన్నారు. -
రైతు సేవలో నిమగ్నం కావాలి
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి విజయ్‌కుమార్ గుంటూరు వెస్ట్ : వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను విస్తృతపరిచి రైతుల సేవలో మరింతగా నిమగ్నం కావాలని వ్యవసాయ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి, విశ్వవిద్యాలయ ఉపకులపతి టి.విజయ్‌కుమార్ కోరారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరుకు తరలివచ్చిన తర్వాత ప్రథమంగా దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో(లాం) సోమవారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి విజయ్‌కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే పెద్దదిగా విభజన జరిగిన తర్వాత కూడా తన ఉనికిని చాటుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో 27 మంది నాన్‌టీచింగ్ ఉద్యోగస్తులకు మెరిటోరియస్ అవార్డులను ప్రకటించారు. ఇందులో గుంటూరు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయ సిబ్బంది, లాం ఫాం ఉద్యోగులు ఏడుగురికి నగదు బహుమతి, సర్టిఫికెట్లను అందజేశారు. వారిలో ఎ.వెంకటేశ్వరరావు (సూపరింటెండెంట్), ఎస్.జనార్ధన్‌రావు (సూపరింటెండెంట్), జి.వెంకటరావు (సీనియర్ అసిస్టెంట్), ఆర్.పిచ్చయ్య (ఫొటోగ్రాఫర్), ఎన్.విజయకుమారి (క్లర్క్ కం టైపిస్టు), గంజి బాబు (ఆఫీస్ అసిస్టెంట్), కె.సూరిబాబు (ఎలక్రీ్టషియన్) ఉన్నారు. వర్సిటీ పాలకమండలి సభ్యులు మేకా లక్ష్మీనారాయణ, రిజిస్ట్రార్ డాక్టర్ టీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మరక్షణలో అన్నదాత
వర్షాభావంతో ఆందోళన ఆవిరవుతున్న తొలకరి ఆశలు వరినారు,చెరకు తోటలకు చీడపీడలు కాపాడుకోవాలంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు అనకాపల్లి: వర్షాల దోబూచులాటతో జిల్లా రైతులు మళ్లీ ఆత్మరక్షణలో పడ్డారు. మూడేళ్లుగా కలిసిరాని వరితో కుదేలైన అన్నదాతను ఈ ఏడాది వరుణుడు ఏమేరకు ఆదుకుంటాడన్నది అనుమానమే. జూన్‌లో మురిపించిన వరుణుడు జూలైలో ముఖం చాటేశాడు. క్రమంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. పెరిగిన ఉష్ణోగ్రతలు ముఖ్యంగా వరినారుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరినారుకు ఇనుపదాతు లోపం,తాటాకు తెగులు, చెరకుకు పిండినల్లి, పసువు నల్లి వంటి చీడపీడలు ఆశిస్తున్నాయి. వర్షాలు పుంజుకుంటేనే పంటలసాగు మెరుగవుతుంది. తొలకరి ముందుగానే పలకరించింది. జూన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయింది. అనుకూల పరిణామాలతో అన్నదాతలు ఆనందపడ్డారు. ఏరువాక చేపట్టి విత్తనాల కోసం వెంపర్లాడారు. ముఖ్యంగా ఆర్జేఎల్తో పాటు ఇంద్ర రకాలను అధికంగా సమకూర్చుకున్నారు. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యారు. జిల్లాలో ఖరీఫ్ వరి సాధారణ విస్తీర్ణం 92,885హెక్టార్లు. ఇందులో 41,274 హెక్టార్లలో పంటలు వేశారు. మైదానంలో నార్లు పోస్తుండగా..ఏజెన్సీలో రైతులు అప్పుడే వరినాట్లు చేపడుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో పంటలు తడారుతున్నాయి. కొన్ని చోట్ల వరినారు మొలకలు రావడం లేదు. మరికొన్ని చోట్ల పెరిగిన నారు ఎండిపోయే స్థితికి చేరింది. మూడేళ్లుగా వరి కలిసిరాకపోవడంతో ముందస్తుగా కురిసిన వర్షాలకు మురిసిపోయిన రైతుల ఆశలు ఇలా ఎన్నాళ్లో నిలవలేదు. రుతుపవనాలు బలహీనంగా ఉండడం, అల్పపీడనాలు ఏర్పడకపోవడం, క్యుములో నింబస్ మేఘాలు ఏర్పాటు తగ్గడం తదితర కారణాల వల్ల మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అల్పపీడనద్రోణి, ఆవర్తనాల వల్ల కొన్ని చోట్ల వర్షాలు అప్పడప్పుడూ పడుతున్నాయి. ఆదరాబాదరాగా వరినారు పోసిన రైతులు దానిని బతికించుకోడానికి ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15 వరకు అవకాశం... వరినారును రైతులు కాపాడుకోవాలని, విత్తన కొరత ఉన్నందున అవకాశమున్నంత మేరకు తడులు పెట్టుకొని జాగ్రత్త పడాలని డాక్టర్ మోసా సూచిస్తున్నారు. రానున్న రెండు వారాల్లోను ఇదే తరహా పరిస్థితులుండి నారు ఎండిపోతే రెండోసారిపోసుకోవాలి తప్ప ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి లేదని విశ్లేషిస్తున్నారు. ఆగస్టు 15 వరకు వేచి చూసి అప్పుడున్న పరిస్థితుల మేరకు నేరుగా విత్తే పద్ధతి లేదా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారించాలంటున్నారు. ఇందుకు వ్యవసాయశాఖ ప్రణాళికను రూపొందించి రైతులందరిని అప్రమత్తం చేస్తుందని తెలిపారు. అప్పటివరకు వేచి చూసే ధోరణి అవలంభించి నారును కాపాడుకోవడం ద్వారా విత్తన కొరత లేకుండా చూసుకోవాలని శాస్త్రవేత్త మోసా తెలిపారు. వరినారును కాపాడుకోవాలి... జూలై రెండో వారంలో ఉన్నందు న వరి నాట్లకు అదను దాటిపోలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో వరినారును కాపాడుకోవడానికి అవకాశమున్న చర్యలు చేపట్టాలి. ఉష్ణోగ్రతలు పెరిగినందున వరినారుకు ఇనుపుదాతు లోపం, తాటాకు తెగులు సోకే అవకాశముంది. ఇందుకుగాను తగిన చర్యలు తీసుకోవాలి. - డాక్టర్ మోసా, సమన్వయకర్త, ఏరువాక కేంద్రం -
ఏమిటీ ‘పరికరం’!
వ్యవసాయ పొలంలోంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు తాండూరు: తాండూరు పట్టణంలోని మల్రెడ్డిపల్లి కాలనీలో హనుమాన్ ఫంక్షన్ హాలు వెనుక నున్న ఓ రైతు పొలంలో ఆదివారం ఎలక్ట్రానిక్ పరికరం కనిపించింది. పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం పొలంలో ఎలక్ట్రానిక్ పరికరం కనిపించడంతో స్థానికులు గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పరికరానికి కెమెరా ఉన్నట్లు గుర్తించారు. కాగా ఈ పరికరాన్ని రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీయడానికి ఉపయోగిస్తారని పోలీసులు తెలిపారు. పరికరంలోని బ్యాటరీలో చార్జింగ్ అయిపోవడంతో పడిపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ నమోదు వివరాలు తెలుసుకునేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రయోగించి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరం విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని పోలీసులు తెలిపారు. -
పప్పు పంటలను ఇలా కాపాడుకోండి
పాడి-పంట: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ఇప్పటికే పెసర, మినుము విత్తనాలు వేసుకున్నారు. అయితే ఈ పైర్లను ఆశించి నష్టపరుస్తున్న చీడపీడల నివారణపై వారు పెద్దగా దృష్టి సారించడం లేదు. ఫలితంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పెసలు, మినుములకు మంచి ధర లభిస్తోంది. కాబట్టి రైతులు ఆయా పంటల్లో చీడపీడల నివారణపై తగిన శ్రద్ధ కనబరిస్తే నాణ్యమైన దిగుబడులు, మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెసర, మినుము పైర్లలో పురుగులు, తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలు... ఇవి రసాన్ని పీలుస్తాయి పెసర, మినుము పైర్లలో రసం పీల్చే తెల్లదోమ, తామర పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తెల్లదోమలు ఆకుల నుంచి రసాన్ని పీల్చడంతో పాటు పల్లాకు (ఎల్లో మొజాయిక్) తెగులును వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ పిల్ల పురుగులు ముందుగా కొద్దిసేపు ఆకులపై తిరుగుతాయి. ఆ తర్వాత ఒకే కణానికి అతుక్కుపోయి రసాన్ని పీలుస్తూ పెరుగుతుంటాయి. తెల్లదోమ నివారణకు విత్తనాలు వేసిన 15-20 రోజుల మధ్య లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున వేపనూనె కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ పురుగుల తాకిడి ఎక్కువగా ఉన్నట్లయితే లీటరు నీటికి 1.5 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల మెటాసిస్టాక్స్ లేదా 0.2 గ్రాముల అసిటామిప్రిడ్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగులు పైరు తొలి దశలోనూ, పూత దశలోనూ పంటను నష్టపరుస్తాయి. పిల్ల, పెద్ద పురుగులు ఆకులు, మొగ్గలను గీకి రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగులు మొక్కల లేత భాగాలను ఆశ్రయించి పెరగడం వల్ల ఆకులు పెళుసుగా మారతాయి. మొక్క గిడసబారుతుంది. పురుగు ఆశించిన మొగ్గలు, పూలు కాయలుగా మారవు. ఈ పురుగులు ఆకుముడత తెగులును వ్యాపింపజేస్తాయి. తామర పురుగుల కారణంగా పైరుకు 10-20% మేర నష్టం జరుగుతుంది. వీటి నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము ఎసిఫేట్ లేదా ఒక మిల్లీలీటరు ఫిప్రోనిల్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పూత దశ నుంచి ఆశిస్తుంది మరుకా మచ్చల పురుగును పూత, గూడ, బూ జు పురుగు అని కూడా అంటారు. ఇది పూత దశలో పూలను గూడుగా చేసుకొని, లోపలి పదార్థాన్ని తినేస్తుంది. కాయలు తయారయ్యేటప్పుడు వాటిని దగ్గరికి చేర్చి, గూడు కట్టి, లోపల గింజలను తింటుంది. ఈ పురుగుల నివారణకు సకాలంలో చర్యలు చేపట్టకపోతే దిగుబడులు 80% వరకూ తగ్గే ప్రమాదం ఉంది. లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా ఒక గ్రాము థయోడికార్బ్/ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా వీటిని నివారించవచ్చు. పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే 10 లీటర్ల నీటికి 4 మిల్లీలీటర్ల స్పైనోశాడ్ లేదా 1.5 మిల్లీలీటర్ల ప్లూబెండియమైడ్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఆకులు జల్లెడలా మారతాయి పొగాకు లద్దె పురుగులు తొలి దశలో ఆకుల్లోని పత్రహరితాన్ని గోకి తింటాయి. దీనివల్ల ఆకులు తెల్లగా, జల్లెడ మాదిరిగా మారతాయి. పెద్ద పురుగులు ఆకులు, పూత, పిందె, కాయలను తినేస్తాయి. ఇవి పగటి వేళ భూమిలో దాగి ఉంటూ రాత్రి సమయంలో పైరుపై దాడి చేస్తుంటాయి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా ఒక గ్రాము ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పెద్ద పురుగుల నివారణకు మొక్కల మొదళ్ల వద్ద సాయంకాలం వేళ విషపు ఎరలు వేయాలి. విషపు ఎరల తయారీ కోసం 500 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్/క్లోరిపైరిఫాస్+5 కిలోల తౌడు+అర కిలో బెల్లాన్ని తగినంత నీటిలో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేయాలి. అపార నష్టం కలిగిస్తుంది తెల్లదోమ ద్వారా వ్యాపించే పల్లాకు తెగులు పెసర, మినుము పైర్లకు అపార నష్టం కలిగిస్తుంది. తెగులు సోకిన లేత ఆకుల మీద ముందుగా పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. అవి క్రమేపీ పెద్దవై, ఆకులు పూర్తిగా పసుపు రంగుకు మారతాయి. పిందెలు, కాయ లు కూడా పసుపు రంగుకు మారి వంకర్లు తిరుగుతాయి. కాయల్లో విత్తనాలు ఏర్పడవు. పైరు తొలి దశలో ఉన్నప్పుడు తెగులు సోకితే మొక్క లు గిడసబారి ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు ముందుగా తెగులు సోకిన మొక్కలను పీకి దూరంగా పారేయాలి. పసుపు రంగు రేకు/అట్టకు ఆముదం/గ్రీజు పూసి పైరు మీద ఒక అడుగు ఎత్తులో ఏర్పాటు చేయాలి. పసుపు రంగుకు ఆకర్షితమయ్యే తెగులు కారక తెల్లదోమలు రేకు/అట్టకు అతుక్కొని చనిపోతాయి. ఇవి కూడా... సెర్కోస్పొరా ఆకుమచ్చ తెగులు సోకితే ఆకులపై ముందుగా గోధుమ రంగులో చిన్న చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత అవి పెద్దవవుతాయి. ఆకులు ఎండి రాలిపోతాయి. కాయల్లో గింజలు సరిగా ఏర్పడవు. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము కార్బండజిమ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పంటకాలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఆకుముడత తెగులు సోకుతుంది. ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి వాటి నివారణకు మందులు పిచికారీ చేయాలి. -
చినుకు కురిసింది.. నేల మురిసింది
జిల్లాలో విస్తారంగా వర్షాలు పాలమూరు: వరుణుడు కరుణించాడు. జిల్లాలో విస్తారంగా వాన కురిపించి.. నేలను మురిపించాడు. రైతన్నల్లో ఆనందం నింపేందుకు మొలకలకు ప్రాణం పోశాడు. ఆల స్యమైనా మంచి అదునులో వర్షం కురియడంతో సోయా, పత్తి రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బుధవారం సాయంత్రం గురువారం ఉదయం వరకు జిల్లాలోని పలు మండలాల్లో విస్తారంగా వర్షం కురిసింది. దీంతో జిల్లావ్యాప్తంగా 14.5 మి.మీ వర్షపాతం నమోదైంది. భూత్పూర్ మండలంలో 108 మి.మీ వర్షపాతంతో అత్యధికంగా నమోదుకాగా.. ఆ తర్వాతి స్థానంలో మహబూబ్‌నగర్‌లో 80.0 మి.మీతో వర్షం కురిసింది. కల్వకుర్తి 52.8 మి.మీ, తిమ్మాజీపేట 51.0 మి.మీ, వంగూరు 50.0 మి.మీ, హన్వాడ 44.4 మి.మీ, అడ్డాకుల 44.0 మి.మీ, ఆమనగల్లులో 42.0 మి.మీ, మిడ్జిల్ 42.0 మి.మీ, ఖిల్లా ఘనపూర్ 34.6 మి.మీ, నర్వ 30.0 మి.మీ వర్షం పడింది. మరో 15 మండలాల్లో చినుకుపడలేదు. మిగిలిన మండలాల్లో 30 మి.మీ లోపు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ పంటలకు అనుకూలమైన ఈ సమయంలో వర్షం రైతులకు మేలు చేస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పత్తి, మొక్కజొన్న పంటలు ప్రస్తుతం మొలకదశలో ఉన్నాయి. జూన్ నెల చివరి వరకు వర్షంలేదు. దాంతో అప్పటికే పత్తి విత్తుకున్న రైతులు ఇతర పంటల వైపు మొగ్గుచూపారు. తాజాగా నమోదైన వర్షపాతం పంటలకు లాభదాయకమని చెబుతున్నారు. -
అదునుదాటితే.. ప్రత్యామ్నాయ పంటలే..
రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన హైదరాబాద్: అదునుదాటితే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుత వాతావరణ, వర్షపాత పరిస్థితులపై హైదరాబాద్‌లో బుధవారం వారు సమావేశమై సమీక్షించారు. అదును, పదును చూసి సేద్యం చేయాలని, చెల్కనేలల్లో నాలుగైదు ఇంచుల లోతు వరకు తడిస్తేనే విత్తనాలు వేయాలని, మొలకెత్తిన విత్తనం చనిపోతే స్వల్ప వ్యవధి పంటలు వేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో వరి, పత్తిలాంటి పంటలకు బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సలహా ఇచ్చారు. పశుగ్రాసాన్ని భద్రపరుచుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పాటించవలసిన పద్ధతులపై పోస్టర్‌ను ఆవిష్కరించారు. రైతుల అవగాహన కోసం వీటిని గ్రామస్థాయివరకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఐసీఏఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్, ప్రొఫెసర్ స్వామినాథన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. స్థిరంగా అల్పపీడన ద్రోణి సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు వర్షాలు లేకపోవడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. -
మతిమాలిన మద్దతు
గిట్టుబాటు కాని వరిసాగు ప్రభుత్వ మద్దతు ధర కంటితుడుపే జిల్లా రైతులకు రూ.74 కోట్ల నష్టం ప్రభుత్వాల పోకడలు రైతుల ఉసురు పోసు కుంటున్నాయి. మతిమాలిన మద్దతు ధర నిర్ణయం సాగుకు రైతును దూరం చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కాడిమేడి వదిలేస్తున్న వైనం దీనికి అద్దం పడుతోంది. సాగు ఖర్చులు ఊహించనం తగా పెరిగి పెట్టుబడికి, ఆదాయానికి పొంతనలేని పరిస్థితుల్లో సేద్యమంటేనే జూదమన్న భావన రైతుల్లో బలపడుతోంది. ఇటీవల కేంద్రం క్వింటాలుకు రూ.50 పెంపు కంటితుడుపు చర్యేనని అంటున్నారు. విశాఖ రూరల్: ఖర్చు బారెడు ఆదాయం మూరెడుగా ఉంది వరి రైతుల పరిస్థితి. సాగు ఖర్చులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. వరిసాగు చేస్తే లాభాల మాట అటుంచి చేతులు కాల్చుకోవలసిన దుస్థితి ఎదురవుతోంది. ఎకరం భూమిలో వరిసాగు చేస్తే నికరంగా రైతుకు నష్టం రూ.2,860లు. ఇది ఏ రైతు చెప్పిన లెక్కకాదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నదే. అన్నదాత ఏనాడూ శ్రమకు వెనుదీయడు. వృత్తిని ప్రేమిస్తాడు. ఒకసారికాకపోతే మరోసారైనా ప్రతిఫలం లభించకపోదన్న నమ్మకంతో స్వేదం చిందిస్తాడు. అదే అతడ్ని సాగువైపు నడిపిస్తోంది. జిల్లాలో 1996-97లో 3.02 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. పంట కలిసిరాకపోవడంతో ఇప్పుడు 2.62 లక్షల ఎకరాలకు పడిపోయింది. వ్యవసాయశాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఎకరా వరి సాగుకు రూ.28,460లు ఖర్చవుతోంది. ఆదాయం రూ.25,600 లభిస్తోంది. నికరంగా ఎకరాకు రూ.2,860లు నష్టం వస్తోంది. అంటే ఈ లెక్కన జిల్లా రైతులు 2.62 లక్షల ఎకరాల్లో వరిసాగుతో నష్టపోతున్నది సుమారు రూ.74 కోట్లు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వరి మద్దతు ధరను ప్రకటించింది. ఏ గ్రేడుకు రూ.1345లు నుంచి రూ.1400లు, సాధారణ రకాలకు రూ.1310లు నుంచి రూ.1360లుగా పెంచారు. ఇది అన్నదాతకు ఏమూలకూ సరిపోదు. ఐదేళ్లలో ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. రూ198లకు లభించిన 50 కిలోల యూరియా ప్రస్తుతం రూ360లకు విక్రయిస్తున్నారు. డీఏపీ రూ.580 నుంచి రూ.1260కి చేరగా మ్యురేట్ఆఫ్ పొటాష్(ఎంవోపీ) రూ.440 నుంచి ఏకంగా రూ.830లకు పైగా ధర పలుకుతోంది. అన్ని ప్రాంతాల్లో కూలీల కొరత ఏర్పడింది. వ్యవసాయ కూలీల ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోయాయి. సీజన్ బట్టి మహిళకు రోజు కూలి రూ.200లు పురుషులకు రూ.300 వరకు ఉంటోంది. ఇలా ఎకరాకు వివిధ రూపాల్లో సుమారు రూ.30 వేలు వెచ్చించాల్సి వస్తోంది. విత్తనాలు సైతం అనుకున్న రకాలు లభించడం లేదు. ఉదాహరణకు సోనామసూరి రకం సాగుకు జిల్లా రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇవి తిండిగింజలుగా బాగుండడమే కారణం. వ్యవసాయశాఖ మాత్రం ఎంటీయూ-1001, స్వర్ణ రకాలను సరఫరా చేస్తోంది. దీంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు కావాల్సిన రకాలను రైతులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. -
ఆరోగ్యవంతమైన నారు కోసం...
పాడి-పంట: అమలాపురం (తూర్పు గోదావరి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్నారు. మరికొన్ని చోట్ల అందుకు సమాయత్తమవుతున్నారు. విత్తు కొద్దీ పంట అన్నట్లు విత్తనం నాణ్యంగా ఉంటేనే పంట బాగా పండుతుంది. మంచి దిగుబడులు అందిస్తుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సూచించిన మేలైన, తమ ప్రాంతానికి అనువైన వంగడాలను సాగు చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతమైన నారు పొందాలంటే చేపట్టాల్సిన చర్యలపై తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఏడీఏ ఎం.ఎస్.సి.భాస్కరరావు అందిస్తున్న సూచనలు... విత్తన మోతాదు-శుద్ధి ఎకరం విస్తీర్ణంలో నాట్లు వేయడానికి 25 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. సెంటుకు ఐదు కిలోల చొప్పున ఐదు సెంట్ల నారుమడిలో విత్తనాలు చల్లుకోవాలి. వర్షాధార పంటగా వరి వేసే వారు గొర్రుతో విత్తడానికి 30-36 కిలోల విత్తనాలు వినియోగించాలి. వరిలో విత్తనశుద్ధి తప్పనిసరి. దీనివల్ల విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను నివారించవచ్చు. పొడి విత్తనశుద్ధి చేసే వారు కిలో విత్తనాలకు మూడు గ్రాముల చొప్పున కార్బండజిమ్ పట్టించి, రెండు రోజుల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. తడి విత్తనశుద్ధి కోసం లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి, ఆ ద్రావణంలో కిలో విత్తనాల్ని 24 గంటలు నానబెట్టి, ఆ తర్వాత 24-36 గంటల పాటు మండె కట్టాలి. మొలకెత్తిన విత్తనాల్ని నారుమడిలో చల్లుకోవాలి. నారుమడి తయారీ ఇలా... దృఢమైన, ఆరోగ్యవంతమైన నారును పొందాలంటే విత్తనాలు చల్లడానికి ముందు నారుమడిని మూడుసార్లు బాగా దున్ని కలుపు మొక్కల్ని ఏరేయాలి. ఆ తర్వాత గొర్రుతో చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి, నీటిని బయటికి పంపడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాలు చల్లే ముందు ఒకసారి, చల్లిన 12-16 రోజులకు మరోసారి ప్రతి ఐదు సెంట్ల నారుమడిలో కిలో చొప్పున నత్రజనిని అందించే ఎరువు వేయాలి. నారు పీకడానికి ముందు నత్రజని ఎరువు వేయకూడదు. చివరి దమ్ములో భాస్వ రం, పొటాష్లను అందించే ఎరువుల్ని కిలో చొప్పున వేయాలి. సెంటు నారుమడిలో ఐదు కిలోల విత్తనాలు మాత్రమే చల్లాలి. విత్తన మోతాదు ఎక్కువైతే నారు బలహీనంగా పెరుగుతుంది. తక్కువైతే పీకే సమయంలో నారు మొ క్కలు తేలికగా రావు. వేర్లు తెగిపోతాయి. నాటిన తర్వాత మూన తిరగడం ఆలస్యమవుతుంది. నీరు ఎలా అందించాలి? నారుమడిలో సెంటీమీటరు లోతున నీరు ఉంచి, సాయంకాలం వేళ విత్తనాలు చల్లుకోవాలి. మరుసటి రోజు ఉదయం నీటిని తీసేయాలి. నారు ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకూ ఆరుతడులు ఇచ్చి, ఆ తర్వాత పలచగా నీరు పెట్టాలి. నారుమడిలో తగినంత నీరు లేకపోతే భూమిలో సన్నని పగుళ్లు ఏర్పడతాయి. మొక్కల వేర్లు భూమి లోపలికి పోయి, పీకేటప్పుడు తెగిపోతాయి. దీనివల్ల ప్రధాన పొలంలో నాటేందుకు నారు సరిపోకపోవచ్చు. కలుపు నివారణ ఎలా? నారుమడిలో కలుపు నివారణ కోసం విత్తనాలు చల్లిన మూడు రోజులకు లీటరు నీటికి ఐదు మిల్లీలీటర్ల బ్యూటాక్లోర్ లేదా సోఫిట్ (ప్రెటిలాక్లోర్, సేఫ్‌నర్ కలిసిన మందు) చొప్పున కలిపి పిచికారీ చేయాలి. వరి నారుమడుల్లో ప్రధానంగా వచ్చే కలుపు ఊద. ఈ కలుపు మొక్కలు, వరి మొక్కలు తొలి దశలో ఒకే విధంగా ఉంటా యి. వీటిని గుర్తించి తొలగించడం చాలా కష్టం. విత్తనాలు చల్లిన 15 రోజులప్పుడు ఊద నిర్మూలనకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున సైహలోఫాప్ బ్యూటైల్ 10% కలిపి పిచికారీ చేసుకోవాలి. నారుమడిలో ఊద, వెడల్పాటి ఆకుల కలుపు మొక్కలు సమానంగా ఉన్నట్లయితే విత్తనాలు చల్లిన 15 రోజులకు 10 లీటర్ల నీటికి 4 మిల్లీలీటర్ల చొప్పున బిస్ పైరిబాక్ సోడియం 10% కలిపి పిచికారీ చేయాలి. చీడపీడల నివారణ కోసం... నారుమడిలో చీడపీడల నివారణ కోసం... విత్తనాలు చల్లిన 10 రోజులకు ఐదు సెంట్ల నారుమడిలో 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు వేసుకోవాలి. లేకుంటే లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ చొప్పున కలిపి విత్తనాలు చల్లిన 10 రోజులకు ఒకసారి, 17 రోజులకు మరోసారి పిచికారీ చేయాలి. లేకుంటే నారు పీకడానికి వారం రోజుల ముందు కార్బోఫ్యూరాన్ గుళికల్ని పైన సూచించిన మోతాదులో వేయాలి. ఆ సమయంలో నారుమడిలో నీరు తక్కువగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోండి నారు పీకేటప్పుడు వేర్లు ఎక్కువగా తెగిపోకుండా చూసుకోవాలి. ఇందుకోసం నారుమడికి ముందుగా నీరు పెట్టి, నేలను బురద పదును మీద ఉంచాలి. పీకిన నారు మొక్కలు వడలకుండా ఉండాలంటే వాటిని నీటిలో ఉంచాలి. నారు లేతాకుపచ్చ రంగులో ఉన్నట్లయితే నాటిన తర్వాత మొక్కలు త్వరగా కోలుకొని పిలకలు తొడుగుతాయి. ముదురాకుపచ్చగా ఉంటే మొక్కలు ఎండిపోయి త్వరగా మూన తిరగవు. నారుమడిలో జింక్ లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. ఈ పంటలు వేసుకోండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులు ప్రస్తుతం టమాటా, వంగ, మిరప నారుమడులు పోసుకోవాలి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో బెండ, చిక్కుడు, తీగజాతి కూరగాయ పంటల విత్తనాలు వేసుకోవాలని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు సూచిస్తున్నారు. -
మళ్లీ వర్రీ
=పొంచి ఉన్న ‘హెలెన్’ గండం =వరి రైతు గుండెల్లో గుబులు =ఏజెన్సీలో కోత దశలో పంట =మైదానంలో పొట్ట, వెన్ను స్థితి =వర్షం, గాలులు తీవ్రమైతే నష్టమే వరిరైతు గుండెల్లో గుబులు రేగుతోంది. మూడువారాల క్రితం ముంచేసిన భారీ వర్షాల చేదు అనుభవాలను మరచిపోకముందే మరో విపత్తు ముంచుకొచ్చింది. బుధవారం ఉదయం నుంచి అంతటా మబ్బువాతావరణం నెలకొంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గాలులు, వర్షాలు తీవ్రమైతే ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటను కోల్పోవలసిందేనని వాపోతున్నారు. హెలెన్ తుపాను ప్రభావం గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తా మండలిపై కూడా ఉంటుందని వాతావరణ శాఖ సూచించడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. అనకాపల్లి/నర్సీపట్నం, న్యూస్‌లైన్ : రైతులకు మళ్లీ కషమొచ్చింది. మూడువారాల క్రితం ముంచేసిన భారీ వర్షాల చేదు అనుభవాలను మరచిపోకముందే మరో విపత్తు ముంచుకొచ్చింది. జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతాయని వ్యవసాయశాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వర్షాల తీవ్రత మేరకు నష్టం ఉంటుందని అంటున్నారు. ఇదే జరిగితే కోత దశలో ఉన్న వరిపై ఆశలు వదులుకోవాల్సిందే. ఖరీఫ్ ప్రారంభంలో ఏజెన్సీలో పరిస్థితులు అనుకూలించాయి. మైదానం కన్నా మన్యంలో వర్షాలు బాగా పడ్డాయి. దీంతో అక్కడి రైతులు సుమారు 20వేల హెక్టార్లలో వరిని ముందుగా సాగు చేశారు. ప్రస్తుతం ఈ పంట కోత దశకు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో కోతలు ప్రారంభించారు. కోసిన వరిపనలు ఇప్పటికీ పొలాల్లోనే ఉన్నాయి. ఇలాంటప్పుడు వర్షాలు కురిస్తే చేతికందనున్న పంటంతా నీట మునిగి నాశనమవుతుంది. మైదానంలో అయితే వరి పొట్టదశనుదాటి కంకుల దశకు చేరుకుంది. దీనిపై కూడా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. స్వర్ణ, 1001, 1010 రకాలు వర్షం ఏమాత్రం ఎక్కువయినా పూర్తిగా నేలకొరిగిపోతాయి. తేలికపాటి రకాలయిన ఆర్జేఎల్, సాంభమసూరి, సోనా మసూరిలకు చిన్న గాలి వీచినా అధికశాతం నష్టముంటుంది. ఇప్పటికే గత నెలాఖరులో అల్పపీడనం కారణంగా సుమారుగా 25వేల హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వాయుగుండం జిల్లాపై విరుచుకుపడితే పరిస్థితి మరింత ప్రతికూలంగా మారే ప్రమాదముందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు చెరకు, పత్తితో పాటు కూరగాయల పంటలన్నీ దాదాపుగా పక్వానికి వచ్చి ఉన్నాయి. ఈదురు గాలులకు చెరకు పంట నేలకొరిగిపోయే ప్రమాదముంది. పంటభూముల్లో నీరు నిల్వ ఉంటే రసనాణ్యత తగ్గిపోతుంది. వర్షాల తీవ్రత మేరకు నష్టం వర్షాలకు తోడు గాలులు వీస్తే పంటలు ఒరిగిపోయే ప్రమాదముంది. ఏజెన్సీలో 50 శాతం కోతలు పూర్తయ్యాయి. కోసిన వరి పనలను రోడ్డుపై వేసుకుంటే మంచిది. ఒక వేళ తడిస్తే ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పాడేరు, చింతపల్లి పరిధిలో వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజ్మాకు తీవ్ర నష్టం వాటిల్లింది. వలిసెలు పూత దశలోఉన్నందున దీనిపై కూడా వర్షాల ప్రభావం మెండుగా ఉంటుంది. చెరకుపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. -సీవీ రామారావు, వ్యవసాయశాస్త్రవేత్త -
ముంచెత్తిన ముసురు
జిల్లా అంతటా వాన =అత్యధికంగా వర్ధన్నపేటలో 6 సెం.మీ. =పంటలకు మళ్లీ నష్టం =నల్లబడుతున్న పత్తి =నేలవాలిన వరి వరంగల్, న్యూస్‌లైన్ : అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో రెండు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు సగటున 11.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. మొత్తం 46 మండలాల్లో వర్షం కురువగా... వర్ధన్నపేటలో అత్యధికంగా 6 సెంటీ మీటర్లు కురిసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న ముసురుతో రహదారులు జలమయమయ్యాయి. నర్సంపేట, ములుగు, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, డోర్నకల్, ఏటూర్‌నాగారం ఏజెన్సీలో వర్షం పడింది. ఏజెన్సీతో పాటు నర్సంపేట, ములుగు, పరకాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో 33 కేవీ లైన్లు బ్రేక్‌డౌన్ అయ్యాయి. దీంతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో ముందస్తుగానే సరఫరాను నిలిపేశారు. లూజ్‌లైన్ల కారణంగా వర్షంతో ఇబ్బం దులు ఏర్పడుతాయని సరఫరా కట్ చేశారు. మంగపేట, ఏటూర్నగారం, తాడ్వాయి, గణపురం, చెల్పూర్ ప్రాంతాలకు రాత్రి వరకు విద్యుత్ సరఫరా చేశారు. వరంగల్ కార్పొరేషన్లో సాయంత్రం రెండు గంటల పాటు సరఫరాను ఆపేశారు. కార్పొరేషన్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిన్న వడ్డేపల్లి చెరువు, కాశిబుగ్గ, వివేకానంద కాలనీ, శాంతినగర్, పద్మనగర్, ఎంహెచ్ నగర్, సుందరయ్య నగర్, దేశాయిపేట, సమ్మయ్యనగర్, నయీంనగర్, గోపాల్పూర్ ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. పంటలకు ప్రమాదమే.. రెండు రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వానలకు పత్తికి పెను ప్రమాదం వాటిల్లుతోంది. ఇప్పటికే వివిధ తెగుళ్లు పంటలను నాశనం చేస్తుండగా... ఈ వానలతో మరింత పెరిగే ప్రమాదముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడిప్పుడు పత్తి కాయలు పగులుతుండగా... బయటకు వచ్చిన పత్తి మొత్తం నల్లబడుతోంది. కాయలు సైతం నల్లబారుతున్నాయి. రెండు రోజులు పత్తి కాయలు నీటితో నానడంతో మొదటి దిగుబడి గణనీయంగా తగ్గనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక పొట్ట దశలో ఉన్న వరికి కూడా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే వర్షానికి వరి నేలకు వంగుతోంది. దీంతో గొలుసులు కిందకు వేలాడి నీటిలో నానుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరప పంట పూత దశలో, పసుపు దుంప పోసుకునే దశలోఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల పత్తి చేనుల్లో పలు రకాల తెగుళ్లు సోకే అవకాశాలున్నాయని వరంగల్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర డాక్టర్ రావుల ఉమారెడ్డి తెలిపారు. తెగుళ్ల వల్ల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని రైతులు తెగుళ్ల ఉనికిని సకాలంలో గుర్తించాలని ఆయన సూచించారు. మొక్కజొన్న కంకులు కోసిన రైతులు.. అవి ఎండక నష్టపోతున్నారు. వర్షం వల్ల మొక్కజొన్న కంకులు తడిసి మొలకెత్తే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో అధికం అత్యధికంగా వర్దన్నపేటలో 60.6మి.మి. కురిసింది. అదే విధంగా ఆత్మకూర్‌లో 36.2 మి.మి, శాయంపేటలో 32, దేవరుప్పులలో 28.2, గూడూరులో 24.2, నెక్కొండలో 23.2, పాలకుర్తిలో 26.2, జఫర్గడ్లో 14.6, చేర్యాలలో 16.4, నర్మెట్టలో 17.8, బచ్చన్నపేటలో 12.4, ధర్మసాగర్లో 14.4, లింగాలఘన్‌పూర్‌లో10, హసన్‌పర్తిలో14.4, హన్మకొండలో10.2, రాయపర్తిలో 18.2, కొత్తగూడలో 12.8, ఖానాపూర్‌లో 7.2, నర్సంపేట, చెన్నారావుపేటల్లో 11.6, పర్వతగిరిలో 16.4, సంగెంలో 14.2, గీసుగొండలో 15.2, గోవిందరావుపేటలో 11.6, వరంగల్‌లో 8.6మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఖరీఫ్ కరువు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఖరీఫ్ కలిసొచ్చే పరిస్థితులు కానరావడం లేదు. పెట్టుబడులు దక్కుతాయోలేదోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులు కారణంగా జిల్లాలో కరువు చాయలు అలముకున్నాయి. సగానికి పైగా మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతా ల్లో ఇప్పటికీ నాట్లు వేస్తున్నారు. ముదురునారు తో ఆలస్యంగా నాట్లుతో పంటకు తెగుళ్లు ఆశిస్తున్నాయి. దిగుబడులపై దీని ప్రభావం ఉంటుంద ని వ్యవసాయశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. ప్రధానంగా నారు ముదిరిపోవడంతో పంట దిగుబడి సగానికి తగ్గిపోతుందని పేర్కొం టున్నారు. రైతులు ఇక ఖరీఫ్ నాట్లను ఆపేసి వర్షాల స్థితిగతులను బట్టి రబీలో స్వల్పకాలిక వంగడాలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ సీజ న్లో వరి సాధారణ విస్తీర్ణం 92,885 హెక్టార్లు. సుమారు లక్ష హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. రుతుపవనాలు కూడా ముందుగానే ప్రవేశించడంతో ఆశించిన స్థాయిలో వానలు పడతాయని సాగుపనులకు రైతులు సిద్ధమయ్యారు. అయితే ఆశించిన విధంగా వర్షాలు అనుకూలించలేదు. దాదాపుగా 30 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు, పెదబయలు, గూడెంకొత్తవీధి మండలాల్లో మాత్రం అత్యధిక వర్షం కురిసింది. దీంతో మొత్తంగా 56 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడినట్టు వ్యవసాయాధికారులు లెక్కలు తేల్చారు. నివేదికకు సమైక్య సెగ వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో కరవు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆగస్టు 30 వరకు వర్షపాతాన్ని మండలాల వారీగా పరిశీలించి తదనుగుణంగా కరవు అంచనాలను సిద్ధం చేయాల్సి ఉంది. కాని అందుకు ఆస్కారం లేకుండా పోయింది. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రెవెన్యూ సిబ్బంది వరకు అందరూ సమైక్యాంధ్ర సమ్మెలో ఉన్నారు. వాస్తవానికి సోమవారానికే మండలాల వారీగా వర్షపాతం వివరాలను నమోదు చేయాల్సి ఉండగా సిబ్బంది లేకపోవడంతో ఆ వివరాలు ఇప్పటి వరకు రాలేదు. దీంతో కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆ బాధ్యతలను ఆర్డీవోలకు అప్పగించారు. మండలాల వారీగా వర్షపాతం వివరాలను సేకరించి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌కు పంపించాలని ఆదేశించారు. కొన్ని చోట్ల తప్పుడు సమాచారం వచ్చినా సిబ్బంది సమ్మె అనంతరం వాటిని సరిచేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కొన్ని మండలాల్లో వర్షాపాతం నమోదుకు ఆటోమేటిక్ రెయిన్‌ఫాల్ రికార్డింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటి లో నమోదైన వివరాలను సేకరించనున్నారు. ఆర్డీవోల నుంచి వివరాలు వచ్చిన తరువాత కరవుపై ఒక నివేదికను తయారు చేసి కలెక్టర్ ప్రభుత్వానికి పంపించనున్నారు. రబీకి కార్యాచరణ ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసింది. రబీకి కార్యాచరణ సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యాయి. వ్యవసాయాధికారులు సమ్మెలో ఉండటంతో దీనికీ కొంత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంట సాగు లక్ష్యంతో పాటు రైతులకు రుణ లక్ష్యంపైగా కూడా త్వరలో నిర్ణయాలు చేయనున్నారు. రుణ లక్ష్యంపై ఈ నెల తొలివారంలో డీసీసీ సమావేశం నిర్వహించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఇందులో బ్యాంకర్లతో సమావేశమై పంట రుణ లక్ష్యాలను నిర్దేశించనున్నారు. రబీకి సంబంధించి ఇప్పటికే జిల్లాకు అవసరమైన మొత్తంలో ఎరువులను అందుబాటులో ఉంచారు. రబీకి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. -
రికార్డు స్థాయిలో వర్షం
అనకాపల్లి, న్యూస్‌లైన్: ఖరీఫ్‌పై ఆశలు వదులుకున్న రైతులకు ఆగస్టు నెల ఊపిరి పోసింది. 12 రోజుల వ్యవధిలోనే 98.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో రైతుల్లో ఆశలు చిగురించినట్టయింది. మోడుబారుతున్న పంటలకు జడివాన జీవం పోసింది. ఈ నెల 6న 25 మి.మీ వర్షపాతం నమోదు కాగా సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షం ఈ ఏడాదికే రికార్డుగా నమోదయింది. ఏజెన్సీలో ఇప్పటికే భారీ వర్షాలు నమోదయినప్పటికీ మైదాన ప్రాంతంలో బహుశా ఇదే మంచి వర్షం కావచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సుమారు 52.6 మి.మీ.వర్షపాతం నమోదు కావడంతో పంటపొలాల్లోను, సాగునీటి కాలువల్లోను నీరు నిలిచింది. గత వారంరోజులుగా అడపాదడపా వర్షం కురవడంతో కమతాలలో చురుగ్గా కదులుతున్న రైతులకు ఆదివారం నాటి వర్షం రెట్టించిన ఉత్సాహాన్నిచ్చింది. జూలైలో కేవలం 10 రోజులలో మాత్రమే వర్షం కురిసింది. మొత్తం మీద 29.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆగస్టులో ఇప్పటికే రమారమి 100 మి.మీ. వర్షం పడడంతో ఖరీఫ్‌ను ఉత్సాహంగా కొనసాగించడానికి వీలవుతోంది. ఖరీఫ్ విస్తీర్ణం పెరిగేందుకు ఈ వర్షాలు దోహదపడడంతో పాటు పంటలను ఆశించిన పురుగులు కొట్టుకుపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరి రైతులు నారుపెంపకంతో సంబంధం లేకుండా నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేయాలని ఇప్పటికే అటు శాస్త్రవేత్తలు, ఇటు వ్యవసాయాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాధార చెరకుకు కూడా మేలు చేసే స్థాయిలో వర్షం కురిసింది. రానున్న రోజుల్లో వర్ష సూచన ఉందని వాతావరణ విభాగ శాస్త్రవేత్త ఎం.బి.జి.ఎస్. కుమారి ‘న్యూస్‌లైన్’ కు తెలిపారు.