అదునుదాటితే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుత వాతావరణ, వర్షపాత పరిస్థితులపై హైదరాబాద్‌లో బుధవారం వారు సమావేశమై సమీక్షించారు.
రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన
హైదరాబాద్: అదునుదాటితే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుత వాతావరణ, వర్షపాత పరిస్థితులపై హైదరాబాద్‌లో బుధవారం వారు సమావేశమై సమీక్షించారు. అదును, పదును చూసి సేద్యం చేయాలని, చెల్కనేలల్లో నాలుగైదు ఇంచుల లోతు వరకు తడిస్తేనే విత్తనాలు వేయాలని, మొలకెత్తిన విత్తనం చనిపోతే స్వల్ప వ్యవధి పంటలు వేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో వరి, పత్తిలాంటి పంటలకు బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సలహా ఇచ్చారు. పశుగ్రాసాన్ని భద్రపరుచుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పాటించవలసిన పద్ధతులపై పోస్టర్‌ను ఆవిష్కరించారు. రైతుల అవగాహన కోసం వీటిని గ్రామస్థాయివరకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఐసీఏఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్, ప్రొఫెసర్ స్వామినాథన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.
స్థిరంగా అల్పపీడన ద్రోణి
సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు వర్షాలు లేకపోవడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.