
ఆత్మరక్షణలో అన్నదాత
వర్షాభావంతో ఆందోళన
ఆవిరవుతున్న తొలకరి ఆశలు
వరినారు,చెరకు తోటలకు చీడపీడలు
కాపాడుకోవాలంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు
అనకాపల్లి: వర్షాల దోబూచులాటతో జిల్లా రైతులు మళ్లీ ఆత్మరక్షణలో పడ్డారు. మూడేళ్లుగా కలిసిరాని వరితో కుదేలైన అన్నదాతను ఈ ఏడాది వరుణుడు ఏమేరకు ఆదుకుంటాడన్నది అనుమానమే. జూన్‌లో మురిపించిన వరుణుడు జూలైలో ముఖం చాటేశాడు. క్రమంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. పెరిగిన ఉష్ణోగ్రతలు ముఖ్యంగా వరినారుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరినారుకు ఇనుపదాతు లోపం,తాటాకు తెగులు, చెరకుకు పిండినల్లి, పసువు నల్లి వంటి చీడపీడలు ఆశిస్తున్నాయి. వర్షాలు పుంజుకుంటేనే పంటలసాగు మెరుగవుతుంది. తొలకరి ముందుగానే పలకరించింది. జూన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయింది. అనుకూల పరిణామాలతో అన్నదాతలు ఆనందపడ్డారు. ఏరువాక చేపట్టి విత్తనాల కోసం వెంపర్లాడారు. ముఖ్యంగా ఆర్‌జేఎల్‌తో పాటు ఇంద్ర రకాలను అధికంగా సమకూర్చుకున్నారు. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యారు. జిల్లాలో ఖరీఫ్ వరి సాధారణ విస్తీర్ణం 92,885హెక్టార్లు. ఇందులో 41,274 హెక్టార్లలో పంటలు వేశారు.
మైదానంలో నార్లు పోస్తుండగా..ఏజెన్సీలో రైతులు అప్పుడే వరినాట్లు చేపడుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో పంటలు తడారుతున్నాయి. కొన్ని చోట్ల వరినారు మొలకలు రావడం లేదు. మరికొన్ని చోట్ల పెరిగిన నారు ఎండిపోయే స్థితికి చేరింది. మూడేళ్లుగా వరి కలిసిరాకపోవడంతో ముందస్తుగా కురిసిన వర్షాలకు మురిసిపోయిన రైతుల ఆశలు ఇలా ఎన్నాళ్లో నిలవలేదు. రుతుపవనాలు బలహీనంగా ఉండడం, అల్పపీడనాలు ఏర్పడకపోవడం, క్యుములో నింబస్ మేఘాలు ఏర్పాటు తగ్గడం తదితర కారణాల వల్ల మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అల్పపీడనద్రోణి, ఆవర్తనాల వల్ల కొన్ని చోట్ల వర్షాలు అప్పడప్పుడూ పడుతున్నాయి. ఆదరాబాదరాగా వరినారు పోసిన రైతులు దానిని బతికించుకోడానికి ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఆగస్టు 15 వరకు అవకాశం...
వరినారును రైతులు కాపాడుకోవాలని, విత్తన కొరత ఉన్నందున అవకాశమున్నంత మేరకు తడులు పెట్టుకొని జాగ్రత్త పడాలని డాక్టర్ మోసా సూచిస్తున్నారు. రానున్న రెండు వారాల్లోను ఇదే తరహా పరిస్థితులుండి నారు ఎండిపోతే రెండోసారిపోసుకోవాలి తప్ప ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి లేదని విశ్లేషిస్తున్నారు. ఆగస్టు 15 వరకు వేచి చూసి అప్పుడున్న పరిస్థితుల మేరకు నేరుగా విత్తే పద్ధతి లేదా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారించాలంటున్నారు. ఇందుకు వ్యవసాయశాఖ ప్రణాళికను రూపొందించి రైతులందరిని అప్రమత్తం చేస్తుందని తెలిపారు. అప్పటివరకు వేచి చూసే ధోరణి అవలంభించి నారును కాపాడుకోవడం ద్వారా విత్తన కొరత లేకుండా చూసుకోవాలని శాస్త్రవేత్త మోసా తెలిపారు.
వరినారును కాపాడుకోవాలి...
జూలై రెండో వారంలో ఉన్నందు న వరి నాట్లకు అదను దాటిపోలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో వరినారును కాపాడుకోవడానికి అవకాశమున్న చర్యలు చేపట్టాలి. ఉష్ణోగ్రతలు పెరిగినందున వరినారుకు ఇనుపుదాతు లోపం, తాటాకు తెగులు సోకే అవకాశముంది. ఇందుకుగాను తగిన చర్యలు తీసుకోవాలి.
- డాక్టర్ మోసా,
సమన్వయకర్త, ఏరువాక కేంద్రం