మరణమృదంగం
వర్షాభావం కారణంగా పంటలు ఎండిపోవడం, అసలు పంటలు వేసే పరిస్థితే లేకపోవడంతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ ఖరీఫ్‌లో తొలి వర్షాలకు ఎంతో ఆశతో అప్పులు చేసి మరీ చాలా మంది రైతులు పలు పంటలు వేశారు. కానీ ఆ తర్వాత వాన చినుకు కురవక పెట్టుబడి అంతా నష్టపోయారు. ఈ జూన్, జూలై నెలల్లోనే దాదాపు 40 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడగా... ఆగస్టు మొదటి వారంలో పది మంది ఆత్మహత్య చేసుకున్నట్లు రైతు సంఘాలు చెబుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
రుణాలివ్వని బ్యాంకులు..
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు రుణమాఫీ ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి విడతగా గతేడాది రూ.4,230 కోట్లు ఇచ్చారు. ఈ ఏడాది ఇవ్వాల్సిన రెండో విడత రూ.4,086 కోట్లను సగం చొప్పున రెండుసార్లు ఆలస్యంగా విడుదల చేశారు. దీంతో అనేకచోట్ల బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వలేదు. సాధారణంగా ఖరీఫ్‌లో రూ.15 వేల కోట్లకు పైగా పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా... ఇప్పటివరకు రూ.5 వేల కోట్ల వరకే ఇవ్వడం గమనార్హం. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో రైతులు దాదాపు రూ.6వేల కోట్ల మేర ప్రైవేటు అప్పులు చేశారు.