వడగళ్లతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటాం
నష్టపరిహారం కింద ఎకరాకు రూ.10 వేలు చెల్లిస్తాం
మంత్రి జాపల్లి కృష్ణారావు
ఖలీల్‌వాడి/నిజామాబాద్ /కామారెడ్డి నెట్‌వర్క్: వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా అమలు చేస్తామని, ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురు వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వడగళ్ల వానలతో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటామన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 40 వేల ఎకరాల వరకు నష్టం జరిగిందన్నారు.
అధికారులు సర్వే పూర్తి చేసిన తర్వాత ఎకరానికి రూ.10 వేలు నష్ట పరిహారం అందిస్తామన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్లు ఆధికారంలో ఉన్నా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రుణమాఫీ, మహిళలకు జీరో వడ్డీ, దళితులకు మూడెకరాల పంపిణీ వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్‌ఎస్ సర్కార్ రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు.
వీటికి రూ.60 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు. దీనికోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి మహా అయితే ఒక సీటు రావొచ్చునని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అ«ధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎన్‌డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతులు అధైర్యపడవద్దు : వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూర్, పెద్దవాల్గోట్ గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం లింగుపల్లి, భిక్కనూరు మండలం అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, జంగంపల్లి, బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment