
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల బీమాను అమలు చేసేందుకు కంపెనీలను ఖరారు చేసినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. పంటల బీమా అమలు, పెండింగ్ క్లెయిమ్స్‌పై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019–20 సంవత్సరానికి ఇఫ్కో టోక్యోకు రెండు క్లస్టర్లు, ఏఐసీకి నాలుగు క్లస్టర్లు అప్పగించామన్నారు. అలాగే పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో టమాటా పంటను చేర్చామన్నారు. 2019– 20 ఏడాదిలో ఖరీఫ్, రబీలకు కలిపి 15 రోజుల్లో నోటిఫికేషన్ ప్రకటిస్తామన్నారు.
ప్రస్తుత రబీకి నమోదు చేసుకున్న రైతుల పంటలు వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్నట్లయితే, విపత్తు సంభవించిన 72 గంటలలో ఇన్సూరెన్స్ కంపెనీలకు తెలియపరచాలన్నారు. 2017–18 ఖరీఫ్, రబీ క్లెయిమ్స్‌ల చెల్లిం పుల నిర్దేశిత గడువు ఈ నెల 20వ తేదీగా నిర్ణయించామన్నా రు. స్థానిక విపత్తుల సమాచారాన్ని నివేదించేందుకు టోల్ ఫ్రీ నంబర్లు ఏఐసీ –18005992594, బజాజ్ అలయెంజ్ –18002095959కు ఫోన్ చేయవచ్చన్నారు.