
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరుకు ఖరీఫ్ ముగియనుంది. ఇప్పటికే కోటి ఎకరాలకు పైగా పంటలు సాగయ్యాయి. సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో లక్ష్యానికి మించి వరి నాట్లు పడుతున్నాయి. అయితే బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో సహకరించడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో రైతులకు ప్రైవేటు అప్పులే దిక్కయ్యాయి. ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.25,496 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.11,400 కోట్లే బ్యాంకులు ఇచ్చాయి. అంటే లక్ష్యంలో సగం కూడా విడుదల చేయలేదు. దీనిపై వ్యవసాయశాఖ వర్గాలు బ్యాంకులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు.
బ్యాంకులు మాత్రం ధరణి వెబ్‌సైట్ అందుబాటులోకి రాకపోవడం వల్లే రుణాలు ఇవ్వడంలేదని చెబుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే వ్యవహరిస్తున్నామంటున్నాయి. ప్రభుత్వం పంట రుణాలకు సంబంధించి ఈసారి కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. ఈ ఖరీఫ్ నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకం కుదువబెట్టుకోకుండానే రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధరణి వెబ్‌సైట్‌లో రైతుల సమాచారం సరిచూసుకున్న తర్వాతే పంట రుణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే ఆచరణలో అది సాధ్యంకాలేదు. దీంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ధరణి వెబ్‌సైట్‌కు, రుణాలకు లంకె పెట్టడంపై విమ ర్శలు వస్తున్నా సర్కారు పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment