సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం కోటి ఎకరాల వరకు ఉండగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో మరో 7 లక్షలకు చేరుకుంటుందని, మొత్తంగా 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నా యి. కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులు అందుబాటులోకి రానుండటంతో సాగు విస్తీర్ణం పెరుగుతుందని లెక్కగడుతున్నాయి. 2019–20 వ్యవసాయ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఆ శాఖ నిమగ్నమైంది. ఆ మేరకు విత్తనాలు, ఎరువులు అందించడంపై పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. ఖరీఫ్‌లో అన్ని రకాల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, గతేడాది 1.03 కోట్ల ఎకరాల్లో సాగయ్యాయి. ఈసారి అదికాస్తా 1.10 కోట్ల ఎకరాలకు చేరుకునే అవకాశముందని చెబుతున్నారు.
పత్తి వైపే రైతుల చూపు
రానున్న ఖరీఫ్‌లో రైతులు మళ్లీ పత్తిసాగు చేసేందుకే మొగ్గుచూపుతారని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. మద్ధతు ధర పెరగడమే కారణంగా అధికారులు పేర్కొంటున్నారు. అలాగే వరి, మొక్కజొన్న పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందంటున్నారు. రైతుబంధుతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని, అలాగే నీటిపారుదల ప్రాజెక్టులతో మరింతగా వరి సాగు పెరుగుతుందనీ అంచనా వేస్తోంది. సోయాబీన్ సాగు ఈసారి తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేగాక రైతుబంధు పథకం వల్ల ఇప్పటివరకు సాగు కాని భూములనూ రైతులు దున్నడం ప్రారంభిస్తారని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌రన్ విజయవంతం కావడంతో ఈ ఖరీఫ్ నుంచే నీళ్లు ఇచ్చేందుకు పనులు వేగవంతం చేసింది. ఈ ఖరీఫ్‌లో 19.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయింపులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment