విపత్తుల్ని తట్టుకునే వినూత్న ఉపాయాలు! | sagubadi: Protecting crops and gardens in a climate emergency | Sakshi
Sakshi News home page

విపత్తుల్ని తట్టుకునే వినూత్న ఉపాయాలు!

Oct 28 2025 1:16 AM | Updated on Oct 28 2025 1:15 AM

sagubadi: Protecting crops and gardens in a climate emergency

వాతావరణ మార్పుల్ని తట్టుకునేలా పంటలు, తోటలకు రక్షణ కల్పించే 2 వినూత్న ఆవిష్కరణలు సిద్ధం 

క్లైమేట్‌ ఎమర్జెన్సీ కాలంలో విశేష పరిశోధనలు చేస్తున్న ఉద్యాన కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

నానో బొగ్గు పొడి, హైడ్రోరిచ్‌ నీటిని ఆవిష్కరించిన డా. జడల శంకరస్వామి

అధిక వేడి, అధిక చలి, నీటి ముంపు వంటి విపత్కర వాతావరణ పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు పంటలు, తోటలు తట్టుకోలేకపోవటం ఆధునిక కాలపు వ్యవసాయ, ఉద్యాన తోటల సాగుకు పెద్ద సవాలుగా నిలిచింది. గడ్డు కాలాన్ని తట్టుకొని నిలబడటమే కాకుండా, మంచి దిగుబడినిచ్చేందుకు తోడ్పడే 2 అద్భుత సాంకేతికతలను శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ నిపుణులు డాక్టర్‌ జడల శంకరస్వామి ఆవిష్కరించారు. అమెరికాలో మొక్కజొన్న సాగులో వీటితో సత్ఫలితాలు సాధించారని, మన దేశంలో తానే మొదటిగా గత మూడేళ్లుగా పరిశోధనలు చేస్తున్నానని ఆయన ‘సాక్షి సాగుబడి’కి వెల్లడించారు. 

వాతావరణ మార్పులు మనం, మన పంటలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ఉద్యాన పంటల సాగులో వాతావరణం కీలకపాత్ర పోషిస్తుంది. వాతావరణ మార్పుల వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఫలితంగా వర్షపాతంలో/ ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, విపరీతమైన వేడి గాలు­లు, పెరుగుతున్న నీటి అవసరాలు సవాళ్లు విసురుతున్నాయి. అధిక వర్షాలు, వరద ముంపు సందర్భాల్లో ఉద్యాన తోటలు, సీజనల్‌ పంటలకు అధిక నష్టం కలిగి, ఉత్పాదక శక్తి తగ్గిపోతోంది. 

ఈ నేపథ్యంలో వాతావరణ విపత్తుల నుంచి పంటలు, తోటలను రక్షించుకోవటానికి ఉపయోగపడే రెండు చక్కని సాంకేతికతలను వనపర్తి జిల్లా మోజర్లలోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ కళాశాలకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.జడల శంకరస్వామి ఆవిష్కరించారు. ప్రయోజనకరమైన పరిశోధనలు చేస్తున్న ఆయన ఆవిష్కరించిన మొదటి సాంకేతికత: ‘మల్టీవాల్‌ కార్బన్‌ నానో ట్యూబ్‌ పౌడర్‌’(నానో బొగ్గుపొడి), రెండోది: ‘హైడ్రోజన్‌ రిచ్‌ వాటర్‌ (హైడ్రో నీరు)’. 

నానో బొగ్గు పొడి, హైడ్రో నీటిని పిచికారీ చేసి పండ్ల తోటలు, కూరగాయ తోటలతోపాటు పత్తి, మిరప, వరి వంటి సీజనల్‌ పంటలను కాపాడుకోవచ్చని డా. శంకరస్వామి వెల్లడించారు. వీటిని వేర్వేరుగా పిచికారీ చేయటం ద్వారా పంటలు, తోటల­ను పర్యావరణ ఒత్తిళ్ల నుంచి సమర్థవంతంగా రక్షించుకోవచ్చని రుజువైందని డా. శంకరస్వామి తెలిపారు. 

పంట, పండ్ల వ్యర్థాలతో నానో బొగ్గు పొడి తయారీ ఇలా..
నానో బొగ్గు పొడి పైకి సాధారణ బొగ్గు పొడిలాగే కనిపిస్తుంది. కానీ, అతిసూక్ష్మ కర్బన గొట్టాలతో కూడిన బొగ్గు పొడి ఇది. పంటల వ్యర్థాలను ఒక ప్రత్యేక యంత్రంలో వేసి ఆక్సిజన్‌ లేని వాతావరణంలో 600 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో మండించి దీన్ని తయారు చేస్తారు. 

రైతుల పొలాల్లో, పట్టణాలు, నగరాల్లో వృథాగా పారేసే పంట, పండ్ల వ్యర్థాలతో నానో బొగ్గు పొడిని తయారు చేసుకోవచ్చు. ఎండిన దానిమ్మ, నారింజ, పుచ్చ, సీతాఫలం, పనస, సొర, గుమ్మడి తదితర పండ్ల తొక్కలు.. మామిడి టెంకలు, చింతగింజలు, పత్తి చెట్ల ప్రధాన కాండాలు (వేర్లతో సహా), అరటి బోదలు, కొబ్బరి బొండాల డొప్పలు, కొబ్బరి చిప్పలతో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒక కిలో చెత్తను యంత్రంలో వేస్తే పావు కిలో బొగ్గు పొడి తయారవుతుంది. 

ఇది మార్కెట్‌లో అందుబాటులో ఉన్నా, ఖరీదెక్కువ. కిలో ధర రూ. 10 వేలు. గ్రాము ధర రూ. వంద వరకు ఉంటుంది.  అయితే, దీని తయారీ యంత్రం ధర కనీసం రూ. 7.5 లక్షలు ఉంటుంది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు దీన్ని తయారు చేసి రైతులకు అందించవచ్చని డా. శంకరస్వామి సూచిస్తున్నారు.  

పత్ర రంధ్రాల్లోంచి చొచ్చుకెళ్తుంది!
నానో బొగ్గు పొడి పైకి సాధారణ బొగ్గు పొడి మాదిరిగానే కనపడుతుంది. అయితే, నీటిలో కలిపి పంటలు, తోటలపై పిచికారీ చేస్తే బాగా పనిచేస్తుంది. ఆకుల్లోని సూక్ష్మ రంధ్రాల ద్వారా చొచ్చుకెళ్లి వాతావరణ ఒత్తిళ్లను తట్టుకునే శక్తినిస్తుంది. విత్తనాలు త్వరగా మొలకెత్తేలా చేస్తుంది. తోటలు/పంటల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. నీరు, ముఖ్యమైన పోషకాలను సమర్ధవంతంగా గ్రహించటంలో తోడ్పడుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంటలు దెబ్బతినకుండా కాపాడుతుంది. 

హైడ్రో నీరు తయారీ ఇలా..
పంటలు, తోటలకు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తినివ్వటంలో హైడ్రోజన్‌ కలిపిన నీరు (హైడ్రోజన్‌ రిచ్‌ వాటర్‌) ఉపయోగపడుతుంది. సాధారణ నీటిలో హైడ్రోజన్‌ వాయువును అదనంగా కలిపితే హైడ్రో నీరు తయారవుతుంది. సాధారణ నీటిలో హెచ్‌2ఓ అణువులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ నీటిలో స్వేచ్ఛగా తిరిగే ‘కరిగిన హైడ్రోజన్‌ అణువులు’ అదనంగా ఉంటాయి. హైడ్రోజన్‌ వాయువును ఎలక్ట్రోలసిస్‌ పరికరం సహాయంతో హైడ్రో నీటిని తయారు చేసుకోవచ్చు. ఈ నీటి సాంద్రతను పార్ట్స్‌ పర్‌ బిలియన్‌ (పీపీబీ) యూనిట్లలో కొలుస్తారు. 1000 పీపీబీ సాంద్రత గల హైడ్రో నీటిని పిచికారీ చేస్తే వాతావరణ ప్రతికూలతలను తట్టుకునే శక్తి వస్తుందని డా. శంకరస్వామి పరిశోధనల్లో తేలింది.  

రోజుకు వేల లీటర్ల హైడ్రో నీటిని ఉత్పత్తి చేసే వాటర్‌ ఎలక్ట్రోలైజర్‌ మిషన్‌ ధర రూ. 10 లక్షల వరకు ఉంటుంది లేదా మిక్సీ మాదిరిగా ఉండే చిన్న మిషన్‌ ధర రూ. 2 వేలు ఉంటుంది. దేన్నయినా వాడొచ్చు. సాధారణ నీటితో నింపిన 2 లీ. గాజు సీసాను ఈ మిషన్‌పై తల్లకిందులుగా పెడితే, 15 నిమిషాల్లో 1000 పీపీబీ హైడ్రో నీరు సిద్ధమవుతుంది. ఈ నీటిని (సాధారణ నీళ్లలో కలపకూడదు) నేరుగా పంటలు, తోటలపై పిచికారీ చెయ్యాలి.   

జీవ ఉత్ప్రేరకం 
హైడ్రో నీరు పిచికారీ వల్ల మొక్కలు/చెట్లలో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు పెరుగుతాయి. అధిక వేడి, చలి, నీటి ముంపు వంటి ఒత్తిళ్లకు గురైనప్పుడు ఏర్పడే ‘రియాక్టివ్‌ ఆక్సిజన్‌ స్పీసీస్‌’ పంటలను బలహీనపరుస్తాయి. వీటిని తటస్థీకరించటంలో హైడ్రోజన్‌ ఒక సెలెక్టివ్‌ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హైడ్రో నీరు జీవ ఉత్ప్రేరకం (బయో స్టిమ్యులెంట్‌) గా పనిచేస్తుంది. జిబ్బరిల్లిక్‌ యాసిడ్‌ వంటి హర్మోన్లను పెంపొందిస్తుంది.

 ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చెట్లు, మొక్కలు చనిపోకుండా కాపాడుతుంది. కిరణజన్య సంయోగ క్రియను మెరుగుపరిచి, జీవక్రియ, శక్తి జీవక్రియ (ఏటీపీ)ల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. పూలు, పండ్లు, కూరగాయలు కోసిన తర్వాత త్వరగా పాడవకుండా నిల్వ సామర్ధ్యాన్ని పెంచుతుంది. అధిక ఉష్ణోగ్రతను, అతి చలిని తట్టుకోవటంతో పాటు వ్యాధి నిరోధకతను పెంపొందించేందుకు కూడా హైడ్రో నీరు ఉపయోగ పడుతుందని డా. శంకరస్వామి చెబుతున్నారు.  

పిచికారీతో 15 రోజులు రక్షణ
వేసవి వడగాడ్పులు, అధిక ఎండ, అతి చలి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో.. అధిక వర్షం కారణంగా ఉరకెత్తకుండా పత్తి, మిర్చి, టమాటా వంటి కూరగాయ పంటలు, పండ్ల తోటలను రక్షించుకోవడానికి నానో బొగ్గు పొడి, హైడ్రో నీటిని వేర్వేరుగా పిచికారీ చేసి కాపాడుకోవచ్చని డా. శంకరస్వామి చెప్పారు. పిచికారీ చేస్తే 15 రోజుల పాటు రక్షణ ఉంటుందన్నారు. అవసరమనుకుంటే మళ్లీ పిచికారీ చేసుకోవాలన్నారు. ఈ రెండింటిని కలిపి చల్లకూడదు. వేర్వేరుగా చల్లాలి. ఇదొకరోజు, అదొకరోజు సాయంత్రం వేళల్లోనే చల్లాలి. 

లీటరు నీటికి 7 గ్రాముల బొగ్గు పొడి 
లీటరు నీటికి 7 గ్రాముల నానో బొగ్గు పొడిని కలిపి సాయంత్రపు వేళలో పిచికారీ చెయ్యాలి. ఆ తెల్లారి సాయంత్రం 1000 పీపీబీ సాంద్రత గల హైడ్రో నీటిని పంటలు/చెట్ల ఆకులన్నీ పూర్తిగా తడిచేలా పిచికారీ చెయ్యాలి. సాధారణ నీటిలో కలపకుండా పంటలు, తోటలపై నేరుగా పిచికారీ చెయ్యాలి. అవసరమైతే 15 రోజుల తర్వాత మళ్లీ చల్లాలి. ముదురు పండ్ల తోటల్లో చెట్టుకు 10 లీటర్ల మోతాదులో ఈ రెండింటిని వేర్వేరుగా, 24 గంటల వ్యవధిలో, పిచికారీ చెయ్యాలి. 

ఎకరం వరికి 4 కిలోల నానో బొగ్గు పొడి
నీరు నిల్వగట్టిన వరి పొలాల్లో, పిచికారీ కాకుండా చేలోని నీటిలో, ఎకరానికి 4 కిలోల చొప్పున నానో బొగ్గు పొడిని నేరుగా కలపాలి. వరి మొక్కల కాండాలు, వేరు వ్యవస్థలకు ఆక్సిజన్‌ పుష్కలంగా అందుతుంది. 24 గంటల పాటు ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మళ్లీ నానో బొగ్గు పొడిని వరి పొలం నీటిలో చల్లాలి. వరి పొలంలో హైడ్రోజన్‌ రిచ్‌ నీరు చల్లనవసరం లేదు. 

నానో బొగ్గు పొడి, హైడ్రో నీరు తయారీపై శిక్షణ ఇస్తాం
వాతావరణ మార్పులు తెచ్చే విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడే విధంగా పంటలు, తోటల సామర్థ్యాన్ని పెంపొందించటానికి నానో బొగ్గు పొడి, హైడ్రో నీరు ఉపయోగపడతాయి. మూడేళ్లుగా నేను ఈ పరిశోధనలు చేస్తూ సత్ఫలితాలు సాధించాను. మన దేశంలో మొట్టమొదట ఉద్యాన కాలేజీలోనే వీటిపై పరిశోధనలు చేపట్టాం. తమిళనాడు కోస్తా ప్రాంతంలో మాత్రమే పండే మధురై మల్లి పంటను వనపర్తి జిల్లా్లలో పండించడానికి నానో బొగ్గు పొడి, హైడ్రో నీరు చాలా బాగా ఉపయోగపడ్డాయి. 

నీటిని నిల్వగట్టి సాగు చేసే వరి పొలాల దగ్గరి నుంచి.. కూరగాయలు, పండ్ల తోటలు, పత్తి, మిర్చి వంటి అన్ని రకాల ఆరుతడి పంటల వరకూ గడ్డుకాలాల్లో కాపాడుకోవటానికి ఇవి నిస్సందేహంగా ఉపయోగపడతాయి. నానో బొగ్గు పొడిని, హైడ్రో నీటిని రైతులు మార్కెట్‌లో కొనాల్సిన అవసరం లేదు. యంత్రాలను సమకూర్చుకొని ఎఫ్‌పీఓలు, సొసైటీలు, రైతు సంఘాలు, మహిళా స్వయం సహాయక బృందాలు వీటిని తయారు చేసి రైతులకు అందించవచ్చు. వీటి తయారీ, వాడే పద్ధతులపై మోజర్ల ఉద్యాన కాలేజీలో 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నాం. 
– డా. జడల శంకరస్వామి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, శ్రీకొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన కళాశాల, మోజర్ల, వనపర్తి జిల్లా
(సాయంత్రం 6–7 గంటల మధ్య రైతులు డా. శంకరస్వామికి 97010 64439 నంబరుకు ఫోన్‌ చేసి తమ సందేహాలు తీర్చుకోవచ్చు)

 – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement