climate changes
-
Nature Geoscience: అంటార్కిటికాలో ‘కరిగిన నీటి’ ముప్పు
లండన్: వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలతో సముద్రాలు వేడెక్కుతున్నాయి. మంచు కరిగిపోతోంది. సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే మరికొన్ని దశాబ్దాల్లో సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాలు జల సమాధి కావడం తథ్యమన్న హెచ్చరికలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. అతిపెద్ద మంచు కొండలకు నిలయమైన అంటార్కిటికా సముద్రంలో వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంటార్కిటికా మంచు కొండలపైనా, అంతర్భాగంలో కరిగిన నీరు, మంచు మిశ్రమం(స్లష్) గతంలో అంచనా వేసిన దానికంటే అధికంగా ఉన్నట్లు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం పూర్తి వివరాలను నేచర్ జియోసైన్స్ పత్రికలో ప్రచురించారు. కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతతో స్లష్ పరిమాణాన్ని తేల్చారు. అంటార్కిటికాలో వేసవి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో కరిగిన నీరు 57 శాతం స్లష్ రూపంలో, మిగతా 43 శాతం చెరువులు, కుంటల పైభాగంలో ఉన్నట్లు గుర్తించారు. మంచు కొండలపై ఉన్న నీరంతా సముద్రంలోకి చేరితే అంటార్కిటికా నీటి మట్టం మరింత పెరుగుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన స్కాట్ పోలార్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి డాక్టర్ రెబెక్కా డెల్ వివరించారు. ఇప్పుటిదాకా ఉన్న అంచనాల కంటే 2.8 రెట్లు అధికంగా స్లష్ ఉన్నట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే మంచు కొండలపై కరిగిన నీటి పరిమాణం వేగంగా పెరుగుతుంది. దాంతో బరువు పెరిగి మంచు కొండలు కూలిపోవడం, ముక్కలు కావడం మొదలవుతుంది. నీరంతా సముద్రంలోకి చేరుతుంది. -
అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ !
మనకు ఆరు ఋతువులు వసంత ( spring ), గ్రీష్మ ( summer ), వర్ష ( monsoon ), శరద్ ( autumn ), హేమంత ( winter ), శిశిరాలు. ప్రకృతిపరంగా వచ్చే కాలాలు మూడు ఎండ, వాన, చలి. అమెరికా వాతావరణంలో మాత్రం కొంత తేడా ఉంటుంది. స్ప్రింగ్ సీజన్ - ( మార్చ్ నుంచి మే వరకు) సమ్మర్ సీజన్ - ( జూన్ నుంచి ఆగష్టు వరకు) ఆటమ్/ ఫాల్ సీజన్ - ( సెప్టెంబర్ - నవంబర్ వరకు) వింటర్ సీజన్ - ( డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య) నేను ఆగష్టులో అమెరికా వెళ్ళినప్పుడు, లాస్ ఎంజీల్స్ కొంతకాలం ఉన్నాను. సరదాగా క్రిస్మస్ సెలవులు పిల్లలతో గడుపుదామని మా అమ్మాయి ఉంటోన్న డల్లాస్‌కు వెళ్లాం. అందులోనూ తెలుగువాళ్ళు ఎక్కువగా ఉండే ఒక కమ్యూనిటీ రిచ్ వుడ్ కు వెళ్ళాం. టెక్సాస్ రాష్ట్రంలో నున్న పెద్ద నగరాల్లో డల్లాస్ ఒకటి. గతంలో స్పెయిన్, ఫ్రెంచ్, మెక్సికో పాలన చూసిన ఈ నగరం 1845 లో మాత్రమే అమెరికాలో భాగమైంది. దీని జనాభా సుమారు 12 నుంచి 13 లక్షల్లో ఉంటుంది. దాదాపు 10 శాతం జనాభా భారత ఉపఖండం నుండి వచ్చినవారే కావడం విశేషం. తీవ్రమైన ఎండలు, భరించరాని చలి, ఉరుములతో కూడిన వర్షాలు , టోర్నడో సుడిగాలులు డల్లాస్‌లో మామూలేనంటారు. అక్కడ డిసెంబర్ రెండో వారంలో వచ్చిన మంచు తుఫాను ( Ice storm )తో జనజీవనం పూర్తిగా స్థంభించి పోయింది. డల్లాస్ ఫోర్ట్ వద్ద ఎయిర్‌పోర్టుకు వచ్చిపోయే విమానాలు చాలా వరకు రద్దయ్యాయి. నిత్యావసర, అత్యవసరాల వాహనాలే బయట రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడింది. మనదేశం హిమాలయాలకు సమీప రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లోనే ఇలాంటి వాటి గురించి వింటుంటాం. ఇంట్లో ఎంత సేపుంటాం? బయటకు వెళ్లలేని పరిస్థితి. డల్లాస్‌లో ఏక ధాటిగా కురుస్తున్న మంచుతో.. రోడ్లు ,ఇండ్ల కప్పులు నిండిపోయాయి. ఆకాశం నుంచి మేఘాలు నేలవాలినట్లు అనిపించింది. బయట అడుగు పెడితే జారిపడతామన్నట్లు ఉంది. కాస్త పెద్ద టైర్లున్న వాహనం అయితే గాని ఆ మంచు పలకల మీద స్లిప్ కాకుండా ఉండలేదు. ఏ పనికోసమైనా.. సాయం లేకుండా వెళ్లే అవకాశం లేకపోవడం ఇబ్బందికర పరిస్థితి. ఇంటి పైకప్పు ,కిటికీ చూరుల నుంచి కిందికి జారుతున్న మంచు కాస్తా.. మనం పండగలకు కట్టుకున్న తోరణాల్లా, ప్రకృతి గీసిన మోడరన్ ఆర్ట్ లా అనిపించాయి. ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్లకు ఇదంతా కొత్త. మరి అక్కడే ఉండే వారికి దాంట్లో కూడా వినోదం వెతుక్కుంటారు. అంతటి చలిలో కూడా పిల్లలు ఇండ్ల ముందు ఐస్‌తో ఆడుకోవడం, పెద్దలు వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం చూస్తుంటే.. ఎక్కడి వారికి అక్కడ హాయిగానే ఉంటుందనిపించింది. వాతావరణాన్ని బట్టి అలవాట్లు మారతాయన్నది నాకు ఇక్కడ తెలిసిన మరో విషయం. అమెరికాలో ఎక్కడికెళ్లినా.. టాయిలెట్లలో పేపర్లే వాడతారు. మన దగ్గర అందరూ టాయిలెట్‌కు వెళ్లినప్పుడు చక్కగా నీళ్లతో శుభ్రం చేసుకుంటారు. కానీ అమెరికాలో పేపర్ ఎందుకని మొదట్లో అర్థం కాలేదు. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కానీ.. చలికాలంలో అక్కడ నల్లా పైపుల్లో నీరు గడ్డ కట్టుకుపోవడం సాధారణం. అందుకే అంతా టాయిలెట్ పేపర్లు అలవాటు చేసుకున్నారు. ఇక తాగేనీళ్ల కోసం ఎప్పటికప్పుడు వేడి చేసుకుంటే గానీ గొంతు తడుపుకోలేరు. అన్ని ఇళ్లు సెంట్రలైజ్డ్ ఏసి ఉంటాయి. చలికాలం వచ్చిందంటే రూం హీటర్ల వేడిలో గడిపేస్తారు. అలాగే ఎండాకాలంలో భరించలేనంత వేడి, ఉక్కపోత ఉంటుంది. ఓ రకంగా అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి. ఇక్కడ ఒక్కరోజు కరెంటు పోయినా.. పరిస్థితులు తారుమారే. ఏం చేస్తారో.. ఎలా చేస్తారో తెలియదు గానీ.. నేనున్నన్నీ రోజుల్లో ఒక్కసారి కూడా ఒక్క క్షణం కూడా కరెంటు పోలేదు. ఎంత పెద్ద ఐస్ స్టార్మ్ వచ్చిన పరిస్థితుల్లో కూడా నిరంతర విద్యుత్ సరఫరా ఉండడం గొప్ప విషయం. విమానాల రాకపోకలు మెరుగు అయ్యాయని తెలిసాక ముల్లె మూటా సర్దుకొని లాస్‌ఏంజీల్స్ బాట పట్టాం. పెనం మీది నుంచి పోయిలో పడ్డట్టు మంచు కురవకున్నా అప్పుడు లాస్ ఏంజీల్స్లో కూడా తీవ్రమైన చలి ఉంది. అందుకే అమెరికా ఎంత అభివృద్ధి చెందినా.. మేరా భారత్ మహాన్ అనుకున్నా మనసులోనే ! వేముల ప్రభాకర్ (చదవండి: ఔరా నయాగారా.. చూడరా లిబర్టీ స్టాచ్యూ.!) -
ముంపు అంచున అగ్రరాజ్యం
భూతాపోన్నతి, కాలుష్యం, కార్చిచ్చులు అన్నీ కలిసి ధ్రువపు మంచును వేగంగా కరిగించేస్తున్నాయి. కొత్తగా వచి్చచేరిన నీటితో సముద్ర మట్టాలు అమాంతం పెరిగి తీరప్రాంతాలను తమలో కలిపేసుకోనున్నాయి. ఇలా సముద్రమట్టాల పెరుగుదలతో ముంపు ముప్పును అమెరికాలోని 24 తీరప్రాంత నగరాలు ఎదుర్కోనున్నాయని తాజా అధ్యయనం ఒకటి ప్రమాదఘంటికలు మోగించింది. ఇప్పటికైనా తేరుకోకపోతే అనూహ్యంగా పెరిగే సముద్రమట్టాలను ఆపడం ఎవరితరమూ కాదు. అమెరికాలోని ప్రభావిత 32 తీరనగరాలకుగాను 24 నగరాల వెంట సముద్రమట్టం ప్రతిసంవత్సరం 2 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది. వీటిలోని 12 నగరాల్లో అయితే అంతర్జాతీయ సముద్రమట్టాల సగటు పెరుగుదల రేటును దాటి మరీ జలాలు పైపైకి వస్తున్నాయి. వీటికితోడు ఈ నగరాల్లోని ప్రతి 50 మంది జనాభాలో ఒకరు దారుణమైన వరదలను చవిచూడక తప్పదని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ పరిశోధన తాలూకు సమగ్ర వివరాలు జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకి వాతావరణంలో అనూహ్య ప్రతికూల మార్పులు సంభవిస్తున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా తరచూ హీట్‌వేవ్‌లు, కరువులు సంభవించి, కార్చిచ్చులు చెలరేగి సగటు ఉష్ణోగ్రతలను అంతకంతకూ పెచ్చరిల్లుతున్నాయి. దీంతో ధృవాల వద్ద హిమానీనదాలు గతంలో కంటే వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో అమెరికా, భారత్‌సహా పలు ప్రపంచదేశాల తీరప్రాంతాలకు ముంపు ప్రమాదం హెచి్చందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేశారు. మరిన్ని వరదలు 2050 సంవత్సరంకల్లా అమెరికా తీరప్రాంతాల వెంట సముద్రం దాదాపు 0.30 మీటర్లమేర పైకి ఎగిసే ప్రమాదముంది. దీంతో జనావాసాలను సముద్రపు నీరు ముంచెత్తి జనజీవనం అస్తవ్యస్తంకానుంది. సముద్రపు నీటితో కుంగిన నేలలు, రోడ్లు ఇలా ప్రజారవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతిననుంది. కొన్ని ప్రాంతాలు మరింతగా కుంగిపోయే ప్రమాదముందని గణాంకసహితంగా అధ్యయనం పేర్కొంది. వచ్చే 30 సంవత్సరాల్లో ప్రతి 35 ప్రైవేట్ ఆస్తుల్లో ఒకటి వరదల బారిన పడి నాశనమయ్యే అవకాశముంది. గత అంచనాలను మించి విధ్వంసం తప్పదని అధ్యయనం హెచ్చరించింది. మట్టం పెరగడంతో లక్షలాది మంది తీరప్రాంత ప్రజల జీవనం ప్రశ్నార్ధకంగా మారనుంది. అమెరికాలో 109 బిలియన్ డాలర్లమేర ఆస్తినష్టం సంభవించవచ్చని ఓ అంచనా. ఈ అధ్యయనంలో పంజాబ్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ వారి బృందం సైతం పాలుపంచుకుంది. అమెరికా తీరప్రాంతంలో ముంపును ఎదుర్కోనున్న ప్రాంతాల అంచనా గణాంకాలను సిద్దంచేసింది. ‘నక్షత్రాలు నేలరాలితే ఏం చేయగలం?. చిన్నపాటి వర్షం కూడా పడవ వేగంగా మునగడానికి ప్రబల హేతువు కాగలదు. అలాగే తీరాల వెంట మట్టాలు పెరిగితే కలిగే విపత్తులు, విపరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రాబర్ట్ నెకొలస్ ఆందోళన వ్యక్తంచేశారు. ముంపు అవకాశమున్న 32 నగరాలు బోస్టన్, న్యూయార్క్ సిటీ, జెర్సీ సిటీ, అట్లాంటిక్ సిటీ, వర్జీనియా బీచ్, విలి్మంగ్టన్, మేర్టల్ బీచ్, చార్లెస్టన్, సవన్నా, జాక్సన్విల్లే, మయామీ, నేపుల్స్, మొబిల్, బిలోక్సీ, న్యూ ఓర్లీన్స్, స్లైడెల్, లేక్ చార్లెస్, పోర్ట్ ఆర్ధర్, టెక్సాస్ సిటీ, గాల్వెస్టన్, ఫ్రీపోర్ట్, కార్పస్ క్రిస్టీ, రిచ్మండ్, ఓక్లాండ్, శాన్ ప్రాన్సిస్కో, సౌత్ శాన్ ప్రాన్సిస్కో, ఫాస్టర్ సిటీ, శాంటాక్రూజ్, లాంగ్ బీచ్, హటింగ్టన్ బీచ్, న్యూపోర్ట్ బీచ్, శాండియాగో – సాక్షి, నేషనల్ డెస్క్ -
లావొక్కింత మితిమీరె!
ప్రపంచం లావెక్కిపోతోంది. అన్ని దేశాల్లోనూ కలిపి స్థూలకాయుల సంఖ్య ఇప్పటికే అక్షరాలా 100 కోట్లు దాటేసింది! 1990 నుంచే వీరి సంఖ్యలో ఏకంగా నాలుగు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడు దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కని్పంచిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజీ లోపు వయసు వారిలోనూ 16 కోట్ల పై చిలుకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా తదితర దేశాల్లో మూడొంతులకు పైగా జనం ఊబకాయులేనట! 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితరాల ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో పదో స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్టు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50 శాతం తగ్గదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇది ఇంకా ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్‌లోనూ ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్టు వెల్లడించింది. తక్షణం మేల్కొనాలి... ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కన్పించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూలు వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండటం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రయేసస్ అన్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కిచెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలు తదితరాలను జీవన శైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరన్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారి తీస్తోందని అధ్యయనంలో పాలుపంచుకున్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ గుహా ప్రదీప అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, కొవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వివరించారు. ‘‘ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలీచాలని, నాసిరకం ఆహారం అందుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా చేశారు... ► అధ్యయనంలో 1,500 మందికి పైగా రీసెర్చర్లు పాలుపంచుకున్నారు. ► ఎన్సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పని చేశారు. ► ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి ఐదేళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు. ► ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్‌ను ఆధారంగా తీసుకున్నారు. గణాంకాలివీ... ► ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 88 కోట్లు, టీనేజీ, ఆ లోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయులున్నారు. ► వయోజన ఊబకాయుల్లో 50 కోట్లకు పైగా పురుషులు కాగా 38 కోట్ల మంది స్త్రీలు. ► 1990లో వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది. ► వారిలో స్త్రీలు 13 కోట్లు కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులుండేవారు. భారత్‌లోనూ... భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయులు 1990లో కేవలం 1.2 శాతముండగా 2022 నాటికి ఏకంగా 9.8 శాతానికి పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయుల సంఖ్య 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు్కన్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయులేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రైతులకు ఉపగ్రహ ఊతం
ఉత్తర భారతదేశ రైతులు ఒకవైపు దేశ రాజధానిలో కనీస మద్దతు ధరతో పాటు ఇతర హక్కుల సాధన కోసం పోరు కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్ర శాస్త్రవేత్తలు వాతావరణాన్ని మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం వాన రాకడ, పోకడలతోపాటు వాతావరణానికి సంబంధించి మరింత కచ్చితమైన అంచనాలను రూపొందించేందుకు ఉద్దేశించినది. రైతులతోపాటు, మత్స్యకారులకూ ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ రెండు వర్గాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వర్గాలకు సకాలంలో అందే హెచ్చరికలు, దీర్ఘకాలిక అంచనాలు ఎంతో ఉపయోగపడతాయి. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల 2050 నాటికి గోధుమ, వరి దిగుబడుల్లో గణనీయ మైన తగ్గుదల ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఇన్షాట్–3డీఎస్ ప్రయోగం దేశంలోనే అతి పురాతనమైన ఉపగ్రహ ప్రయోగ కార్యక్రమం తాలూకూ పరిణతికి నిదర్శనం. ఇండియన్ నేషనల్ శాటిలైట్ (ఇన్శాట్) కార్యక్రమానికి యాభై ఏళ్ల క్రితమే బీజం పడింది. 1975లో ఇన్శాట్ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలకు అనుమతులు లభించాయి. 1982లో తొలి ఉపగ్రహం (ఇన్శాట్–1ఏ) ప్రయోగం జరిగింది. మొదట్లో ఈ ఉపగ్రహాల్లో అత్యధికం ఫోర్డ్ ఏరోస్పేస్ అండ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసి, ఫ్లారిడా(యూఎస్)లోని కేప్ కానవెరల్ నుంచి ప్రయోగించేవారు. ఇన్శాట్–1 శ్రేణి ఉపగ్రహాల కారణంగా భారతీయ వాతావరణ విభాగం ఉపగ్రహ ఆధారిత వాతావరణ అంచనాల రంగంలోకి అడుగుపెట్టింది. తుపానులు, ఈదురుగాలులతోపాటు అల్పపీడనా లను కూడా ఉపగ్రహాల సాయంతో పరిశీలించడం మొదలైంది. 1992లో ప్రయోగించిన ఇన్శాట్–2 శ్రేణి ఉపగ్రహాలు మునుపటి వాటి కంటే సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించినవి కావడం గమనార్హం. దేశీయంగా తయారు చేసిన చాలా హై రెజొల్యూషన్ రేడియో మీటర్లను ఇందులో ఉపయోగించారు. ఫలితంగా రోజువారీ వాతావరణ అంచనాలు, ముందస్తు అంచనాలు, మేఘాల ఛాయాచిత్రాల సేకరణ సులువు అయ్యింది. సమాచార వినిమయానికి కూడా... ఇన్శాట్–1, ఇన్శాట్– 2 శ్రేణి ఉపగ్రహాలు అటు వాతావరణ అంచనాలతోపాటు ఇటు సమాచార వినిమయం, బ్రాడ్‌కాస్టింగ్ రంగా లకూ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇన్శాట్–2 శ్రేణిలోని కొన్ని ఉప గ్రహాల్లో వాతావరణ సంబంధిత పేలోడ్లు అసలు లేకపోవడం గమ నార్హం. కొన్ని రకాల సమాచారాన్ని సేకరించేందుకు (తుపానుల మధ్య భాగం వంటివి) భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమెరికా రక్షణ శాఖ ఉపగ్రహాలపై ఆధారపడింది. ఈ సమస్యను అధిగ మించే లక్ష్యంతో ఐఎండీ 2002లో మెట్శాట్ను ప్రయోగించింది. తరు వాతి కాలంలో దీని పేరును కల్పన–1గా మార్చారు. కర్నాల్ (హరియాణా)లో పుట్టి, ‘నాసా’ వ్యోమగామిగా ఎదిగి 2002లో స్పేస్‌షటిల్ ప్రమాదంలో మరణించిన కల్పనా చావ్లా స్మరణార్థమన్న మాట! ఈ సమయంలోనే వాతావరణ పరిశోధనలకు ప్రత్యేకంగా ఒక ఉపగ్రహం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఐఎండీ వ్యక్తం చేసింది. ఫలితంగానే 2013లో ఇన్శాట్–3డీ శ్రేణి మూడోతరం వాతా వరణ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. 2016లో ఇదే శ్రేణిలో ఇంకో ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి –17న ప్రయోగించిన ఉపగ్రహం ఇన్శాట్–3డీ శ్రేణిలో తాజాది. కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ఈ ఉపగ్రహానికి నిధులు సమకూర్చింది. ఐఎండీతోపాటు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ (నోయిడా), ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (పూణే) వంటి సంస్థలు ఈ ఉపగ్రహం అందించే సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి. వాతావరణం, సముద్ర సంబంధిత సమగ్ర సమాచారాన్ని ఇన్శాట్–3డీఎస్ ద్వారా అందుకోవచ్చు. దీంట్లోని పరికరాలు ఆరు రకాల పౌనఃపున్యాలలో ఛాయాచిత్రాలు తీయగలవు. నేల నుంచి మొదలుపెట్టి అంతరిక్షం వరకూ వేర్వేరు ప్రాంతాలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు, తేమశాతం వంటి వివరాలూ సేకరించగలవు. సముద్ర, భూ ఉపరితల ఉష్ణోగ్రతలు, మేఘాల లక్షణాలు, పొగమంచు, వాన, మంచు ఆవరించిన ప్రాంతం, పడిన మంచు మందం, కార్చిచ్చులు, వాతావరణంలోని కాలుష్యకారక కణాలు, టోటల్ ఓజోన్ వంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు సేకరించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఈ దశలో ఒక వైపు ఉపగ్రహ నిర్మాణంలో దేశీ టెక్నాలజీల వాడకం పెంచుకుంటూనే ఇంకోవైపున ఉపగ్రహ సమాచారాన్ని అందుకునేందుకు, విశ్లేషించేందుకు అవసరమైన భూతల సామర్థ్యాన్ని కూడా భారత్ పెంచుకుంది. వాతావరణ ఉపగ్రహాల నుంచి సమా చారం అందుకునేందుకు ఐఎండీ కొత్త కొత్త ఎర్త్ స్టేషన్స్ నిర్మాణాన్ని చేపట్టింది. సమాచారాన్ని అప్పటికప్పుడు విశ్లేషించేందుకు కంప్యూ టింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది. వాతావరణ మోడలింగ్ కోసం సూపర్ కంప్యూటర్ను ఇచ్చేందుకు అమెరికా నిరాకరించిన 1980లలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ– డాక్)ను ఏర్పాటు చేసి, దేశీయంగానే హై స్పీడ్ కంప్యూటింగ్ వ్యవస్థ లను అభివృద్ధి చేసే పనిలో పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్ వాతావరణ సంబంధిత సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థల నిర్మా ణంలో అగ్రగామి దేశంగా నిలిచింది. తాజాగా అంటే గత ఏడాది మరింత అత్యాధునిక వాతావరణ పరిశోధనల కోసం కేంద్ర భూపరి శోధన మంత్రిత్వ శాఖ రెండు సూపర్ కంప్యూటర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఫ్రెంచ్ కంపెనీ సాయంతో పది కోట్ల డాలర్ల ఖర్చుతో వీటిని నిర్మించనున్నారు. నోయిడా, పూణెల్లోని కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. టెక్నాలజీతోపాటు మారుతూ... వాతావరణ అంచనాల ఫలితాలను సామాన్యులకు చేర్చేందుకు ఐఎండీ టెక్నాలజీతోపాటుగా మారుతూ వచ్చింది. అడ్వయిజరీస్, ఎర్లీ వార్నింగ్, షార్ట్ – మీడియం రేంజ్ స్థానిక అంచనాల వంటివి అందించే వ్యవస్థలను కూడా కాలక్రమంలో ఏర్పాటు చేసుకుంది. ఒకప్పుడు వాతావరణ సమాచారాన్ని టెక్స్ట్ ఎస్ఎంఎస్ రూపంలో పంపితే, మొబైల్ ఫోన్ల కాలంలో వేర్వేరు భాషల్లో సమాచారాన్ని అందించే వీలేర్పడింది. అయితే వీటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం రైతులకు ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాట్సప్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల వంటి అనేకానేక సమాచార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యమూ ఏర్పడుతోంది. నకిలీ, తప్పుడు వార్తలు విచ్చలవిడిగా ప్రవహిస్తున్న ఈ కాలంలో విశ్వసనీయమైన సమాచారం అందించేందుకు భారత వాతావరణ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న భారత ప్రయత్నాల్లో ఇన్శాట్–3డీఎస్ ఒక కీలకమైన మైలురాయి అని చెప్పాలి. విదేశాల నుంచి ఉపగ్రహాల కొనుగోళ్లు, ప్రయోగాలు నిర్వహించే స్థితి నుంచి మనం సొంతంగా వాతావరణ ఉపగ్రహాల తయారీ, ప్రయోగాలను చేపట్టే స్థితికి చేరాము. అది కూడా భారతీయ రాకెట్ల సాయంతో మనకు కావాల్సిన కక్ష్యలో ప్రవేశ పెట్టగలుగుతున్నాము. సాంకేతిక పరిజ్ఞాన లభ్యతలో ఉన్న అంతరా లను జాగ్రత్తగా గుర్తించడం, విదేశీ టెక్నాలజీలను ఔపోసన పట్టడం, వ్యవస్థలు–ఉప వ్యవస్థల నిర్మాణానికి తగిన కార్యక్రమాలను అమల్లోకి తేవడం, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ , ఐఎండీ, ఇతర శాస్త్రీయ సంస్థలతో సన్నిహితంగా పనిచేయడం వంటి అనేకానేక చర్యల వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఇటీవలి కాలంలో దేశీ టెక్నాలజీ పరిశ్రమల ముఖచిత్రంలో గణనీమైన మార్పులు వస్తున్నాయి. మైక్రో ఉపగ్రహ సమూహాల ప్రయోగంలో ప్రైవేట్ సంస్థలు బిజీగా ఉంటున్నాయి. వేగంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం కూడా సాంకేతిక పరిజ్ఞాన రంగంలో స్వావలంబ నకు, మరీ ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీల విషయంలో మరిన్ని ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
భూగోళం భగ్గుమంటోంది!
మరో శాస్త్రీయ నివేదిక బయటకొచ్చింది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మళ్ళీ గుర్తు చేసింది. గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం 2023 అని తేలిపోయింది. ఆ మధ్య వెలువడ్డ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాత్కాలిక నివేదికతో పాటు తాజాగా మంగళవారం ఐరోపా యూనియన్‌కు చెందిన వాతావరణ పర్యవేక్షక సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్’ (సీసీసీఎస్) సైతం ఆ సంగతి నిర్ధారణ చేసింది. ఒకప్పుడు 2016 ‘భుగభుగల నామ సంవత్సరం’గా రికార్డ్ సృష్టిస్తే, తాపంలో అంతకన్నా గణనీయమైన తేడాతో ఆ అపకీర్తి కిరీటాన్ని ఇప్పుడు 2023 దక్కించుకుంది. భూవిజ్ఞాన సాక్ష్యాధారాలు, ఉపగ్రహ సమాచారాలను క్రోడీకరించి చూస్తే, దాదాపు లక్ష సంవత్సరాల్లో అధిక వేడిమి గల ఏడాది ఇదేనట. ఇది పెనునిద్దుర వదిలించే మాట. యథేచ్ఛగా సాగుతున్న గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల వల్ల భూతాపం ఇంతగా పెరిగిందని శాస్త్రవేత్తలకు తెలుసు. ఈ ధోరణి ఇలాగే కొనసాగనుందా? రానున్న సంవత్సరాల్లో భూగోళం అంతకంతకూ వేడెక్కనుందా? పాత రికార్డ్‌లు తుడిచిపెట్టుకు పోనున్నాయా అన్నది ప్రశ్న. 2024 సైతం అత్యధిక భూతాప వత్సరం కావచ్చన్న అంచనాలు పారా హుషార్ అంటున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటితో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్‌కు మించి ప్రపంచ ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలన్నది లక్ష్యం. ఎనిమిదేళ్ళ క్రితం ప్యారిస్‌లో జరిగిన ‘కాప్–21’లో ఈ మేరకు ప్రపంచ దేశాలు ప్రతిన బూనాయి. వీలుంటే 1.5 డిగ్రీల సెల్సియస్ లోపలే ఉండేలా శ్రమించాలనీ తీర్మానించాయి. ప్యారిస్ ఒప్పందం తర్వాత వరుసగా పెరుగుతున్న వాతావరణ విపరిణామ ఘటనలు ప్రపంచాన్ని అప్రమత్తం చేశాయి. ఫలితంగా పర్యావరణ మార్పుకు సంబంధించి ఈ 1.5 డిగ్రీల సెల్సియస్ అనే హద్దు అలిఖిత శాసనమైంది. అయితే, ఇప్పుడు ఆ హద్దును దాటిపోయే పరిస్థితి వచ్చింది. గడచిన 2023లో భూగోళం భుగభుగలాడింది. ఉష్ణోగ్రతలో పెంపు ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రతి రోజూ 1850 – 1900 మధ్య కాలం కన్నా కనీసం ఒక డిగ్రీ అధిక తాపం ఉంది. గత జూన్‌లో మొదలై డిసెంబర్ దాకా ప్రతి నెలా గరిష్ఠ వేడిమి మాసంగా రికార్డవుతూ వచ్చాయి. ఏడాదిలో సగం రోజులు ఎప్పటికన్నా 1.5 డిగ్రీలు ఎక్కువ వేడి ఉన్నాయి. నవంబర్‌లో రెండు రోజులైతే ఏకంగా 2 డిగ్రీల చెలియలికట్టను దాటేశాయి. భూతాపం లెక్కలు రికార్డ్ చేయడం మొదలుపెట్టాక గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత వేడిమి గల వత్సరంగా 2023 రికార్డుకెక్కింది. గతంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయిన ఏడాది 2016. సగటున 0.17 డిగ్రీల హెచ్చు ఉష్ణో గ్రతతో 2023 ఆ రికార్డును తిరగరాసింది. ఈ సంగతి ఆందోళన కలిగిస్తుంటే, ఇంత కన్నా భయ పెడుతున్న విషయం ఉంది. వచ్చే 12 నెలల్లో భూగోళం 1.5 డిగ్రీల మార్కును సైతం దాటేసే ప్రమాదం ఉందట. సీసీసీఎస్ శాస్త్రవేత్తలే ఆ మాటన్నారు. అంటే ఈ 2024 మరింత వేడిమితో ఉడుకెత్తించనుందన్న మాట. ఒక పక్క రికార్డు స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు, మరోపక్క సహజ వాతావరణ పరిణామమైన ఎల్ నినో... ఈ రెండూ భూగోళంపై ఉష్ణోగ్రతలు ఇంతగా పెరగడానికి ప్రాథమిక కారణమని శాస్త్రవేత్తల మాట. ఈ అధిక ఉష్ణోగ్రతల దెబ్బతో వడగాడ్పులు, వరదలు, కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా ప్రాణికోటి ఆయువు తీస్తున్నాయి. జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. అమెరికా, ఐరోపాలలో ఆ మధ్య చెలరేగిన వేడిగాలుల లాంటి వాతావరణ విపరిణామాలు సైతం మానవ తప్పిదాలతో పెరిగిన భూతాపంతోనే సంభవించాయి. డబ్ల్యూఎంఓ, సీసీసీఎస్‌లే కాదు... వందలాది శాస్త్రీయ అధ్యయనాలూ ప్రమాదాన్ని అద్దంలో చూపుతున్నాయి. జపాన్‌కు చెందిన మరో వాతావరణ సంస్థ విడిగా చేసిన మరో విశ్లేషణ ఫలితాలూ ఇలానే ఉన్నాయి. డిగ్రీలో పదో వంతు మేర భూతాపం పెరిగినా... వడగాడ్పులు, తుపానులు తీవ్ర మవుతాయి. సముద్రమట్టాలు పెరుగుతాయి. హిమానీనదాలు త్వరగా కరిగి నీరవుతాయి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మనం నిరుడు చూసినవే. భూతాపంతో ఇరాన్, చైనా, గ్రీస్, స్పెయిన్, టెక్సాస్, అమెరికా దక్షిణ ప్రాంతాలు ఉడికిపోయాయి. కెనడాలో విధ్వంసకరమైన కార్చిచ్చు చెలరేగింది. సముద్ర ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంత పెరిగి, సముద్ర వడగాడ్పులు వీచాయి. వేసవిలోనూ, శీతకాలంలోనూ అంటార్కిటికా సముద్ర తీరాల వెంట హిమ ఘనీభవనం చాలా తక్కువైంది. రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇవన్నీ ప్రకృతి మోగిస్తున్న ప్రమాద ఘంటికలని గ్రహించాలి. పెరుగుతున్న భూతాపాన్ని నివారించడానికి ఇకనైనా చిత్తశుద్ధితో సంకల్పించాలి. విపరీత ఘట నల్ని నివారించాలంటే, అత్యవసరంగా ఆర్థిక వ్యవస్థను కర్బన రహిత దిశగా నడిపించాలి. పర్యావ రణ సమాచారాన్నీ, జ్ఞానాన్నీ ఆసరాగా చేసుకొని భవిష్యత్తు వైపు అడుగులేయాలి. భూగోళంపై జీవకోటి ప్రాణాధార వ్యవస్థలు అమితంగా దెబ్బతిన్నాయనీ, ఇప్పటికే సురక్షిత వలయం బయట మానవాళి గడుపుతోందనీ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. భూతాపం, వాతావరణ మార్పులు హద్దు మీరితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది 2023 రుచి చూపింది. ఇకనైనా ప్రపంచ దేశాలు తమ నిర్లక్ష్యాన్ని వీడి, వాతావరణ మార్పులపై కార్యాచరణకు దిగాలి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంలో మీనమేషాలు లెక్కించడం మానవాళికి శ్రేయస్కరం కాదు. అగ్ర రాజ్యాలు సహా అన్నీ ఆ పనికి దిగాలి. వీలైనంత త్వరగా నెట్ జీరో స్థాయి చేరి, జీవనయోగ్యమైన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి. మన జీవితంలో రాబోయే వత్సరాలన్నీ ఇంతకింత భూతాపంతో ఉంటాయనే భయాలూ లేకపోలేదు. అదే నిజమై, వాటితో పోలిస్తే గడచిన 2023వ సంవత్సరమే చల్లగా ఉందని భావించాల్సిన పరిస్థితి వస్తే, అది ఘోరం. చేతులారా చేస్తున్న పాపానికి ఫలితం! -
2023 పాఠాలు... 2024 ఆశలు
2023 సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. ఒకపక్క కృత్రిమ మేధ, మరోపక్క రాజకీయ పరివర్తన జోరుగా సాగుతున్న ఈ ఏడాది మనకు మిగిల్చిన జ్ఞాపకాలేమిటి? ప్రపంచం పట్టు తప్పిపోతోందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. జీపీటీ–4 రావడం ఈ ఏడాది అత్యంత కీలకమైన పరిణామం.ఇక నుంచి కృత్రిమ మేధే భౌగోళిక రాజకీయాల్లో ఒక పాత్రధారి కానుంది. ఉక్రెయిన్, గాజా యుద్ధాల నేపథ్యంలో 2024ను ఊహించుకుంటే, ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్న ప్రత్యేక పరిస్థితులు మరిన్ని యుద్ధాలకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. అయితే, వాతావరణ మార్పుల ముప్పును తట్టుకునేందుకు శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లాలని ‘కాప్’ సమావేశాల్లో అంగీకారం కుదరడం శుభపరిణామం. చాలా దేశాల పౌరులు హ్రస్వదృష్టితో కూడిన జాతీయవాదానికీ, తాత్కాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేసే నేతలకూ పగ్గాలు అప్పగించారు. కోవిడ్–19 పరిస్థితులు ప్రచండంగా ఉన్న సమయంలో టీకాల పేరుతో జాతీయ వాదం ప్రబలింది. ఇదెంత సంకుచితమైనదో ఆ తరువాత కానీ అర్థం కాలేదు. ఇది సాటి మానవుడి బాధను కూడా మరచిపోయేలా చేసింది. గాజాపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నా ఎవరికీ పట్టకపోవడం కూడా దీనికి మరో నిదర్శనం. అదుపులేని హింసకు కొత్త, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలూ ఆజ్యం పోస్తున్నాయి. వేగంగా వృద్ధి చెందు తున్న ఈ టెక్నాలజీలు మానవాళి నిశ్చేష్టతకూ దారితీస్తున్నాయనడంలో సందేహం లేదు. కల్పనకూ, వాస్తవానికీ తేడాలు చెరిగి... ఈ ఏడాది మార్చిలో ఓపెన్ ఏఐ జీపీటీ–4ను విడుదల చేసింది. ఇది కాస్తా రక్తమాంసాలతో కూడిన వాస్తవానికీ, కల్పనకూ మధ్య ఉన్న అంతరాన్ని చెరిపివేస్తోంది. ఈ డిజిటల్ వాస్తవాన్ని మన అనలాగ్ బుర్రలు ఎలా అర్థం చేసుకోగలవు? 2023 మొత్తమ్మీద అత్యంత కీలకమైన పరిణామం ఇదే అనడం అతిశయోక్తి కాబోదు. 2024లోనే కాదు... ఆ తరువాతి కాలంలోనూ మన జీవితాలను మార్చేసే పరిణామం. జీపీటీ–4 లాంటివి మన జియోపాలిటిక్స్‌ను కూడా ప్రభావితం చేస్తాయి. ‘‘టెక్నాలజీ అనేది భౌగోళిక రాజకీ యాలపై ప్రభావం చూపడం కొత్త కాకపోయినా, కృత్రిమ మేధ రంగ ప్రవేశంతో పరిస్థితి సమూలంగా మారనుంది. కృత్రిమ మేధే భౌగోళిక రాజకీయాల్లో ఒక పాత్రధారి కానుంది’’ అని ఓ విశ్లేషకుడు ఇటీవలే వ్యాఖ్యానించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లలో ప్రస్తుతం కృత్రిమ మేధే అతిపెద్దది. దీని నియంత్రణ కేవలం కొంతమంది చేతుల్లోనే ఉంది. ఈ టెక్నాలజీ కొన్ని బహుళజాతి కంపెనీల చేతుల్లో అభివృద్ధి చెందింది. ప్రభుత్వాలకు వీటిపై అవగాహన లేదు. నియంత్రించే శక్తీ లేదు. నియంత్రించాలన్నా ప్రభుత్వాలు ఈ కంపెనీలపైనే ఆధార పడాల్సి ఉంటుంది. చైనా లాంటి దేశాలు చాలాకాలంగా సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై గట్టి నియంత్రణ పాటిస్తూ వచ్చిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. బహుశా చైనా ఈ కృత్రిమ మేధను ఇతరుల కంటే మెరుగ్గా నియంత్రించగలదేమో. కానీ అక్కడి ప్రభుత్వం కృత్రిమ మేధను కూడా తమ పార్టీ లక్ష్యాల సాధనకు పావుగా వాడు కున్నా ఆశ్చర్యం లేదు. అలాంటిది ఏదైనా జరిగితే అది ప్రపంచంలో అధికార అసమతౌల్యానికి దారితీయవచ్చు. ద్వైదీ భావ పరాకాష్ఠలో ప్రపంచం... మానవాళి సంక్షేమానికి అడ్డుగా నిలుస్తున్న సవాళ్లు అంతర్జాతీయ స్థాయికి చేరుతున్న తరుణంలో మన ఆలోచనా ధోరణులు మాత్రం అంతకంతకూ కుంచించుకుపోతున్నాయి. దేశాలకు, ప్రాంతాలకు పరి మితమైపోతున్నాయి. ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో బహుముఖీన అంతర్జాతీయ సహకారం, సమష్టి బాధ్యతల పంపిణీతోనే మనం ప్రస్తుత సమస్యలను ఎదుర్కోగలం. సమ న్యాయం పాటించగలం. ప్రస్తుతం ప్రభుత్వాతీత శక్తులన్నింటికీ శక్తి మంతమైన హింసాత్మక ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్దాడి దీనికో తార్కాణం. బలహీనులు, నిర్వా సితులు కూడా బలంగా దెబ్బకొట్టగలరు అనేందుకు ఇజ్రాయెల్‌పై దాడి ఒక రుజువు. ఉగ్రవాదంపై పోరు ఇప్పుడిప్పుడే అంతమయ్యేది కాదని 2023 మరోసారి నిరూపించింది. ఈ పోరు ఏకరీతిన లేదు. పైగా సాంకేతిక పరిజ్ఞానం ప్రభుత్వాలకు మరింత బలం చేకూరుస్తోంది. రాజ్యాంగాలను పక్కనబెట్టిన అన్ని దేశాలూ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే, తిరుగుబాట్లను సమర్థంగా అణచివేసిన సంఘటనలు చరిత్ర మొత్తం వెతికినా కనిపించవూ అని! చిన్న రాపిడి మళ్లీ నిప్పు పుట్టించడం ఖాయం. ఫలితం తీవ్ర నష్టం, హింస. రాజకీయం ద్వారా హింసను చట్టబద్ధం చేయడం ఎంతమాత్రం తగని పని. అమాయ కులు, మహిళలు, పిల్లలను చంపివేయడాన్ని కూడా సమర్థించే లక్ష్యం ఎంతటి ఉదాత్తమైనదైనా సమర్థనీయం కాదన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. హింసను ఆయుధంగా వాడుకోవడం ఎప్పుడూ పులి మీద స్వారీ లాంటిదే. హింస మొదలైతే అది కేవలం తాము ఉద్దేశించిన లక్ష్యాలకే పరిమితమవుతుందని అనుకోలేము. హింస అటు ఆక్రమణదారులనూ, ఇటు బాధితులనూ రాక్షసుల్లా మార్చేస్తుంది. ఈ సత్యాన్ని చాలాకాలం క్రితమే మహాత్మగాంధీ బాగా అర్థం చేసు కున్నారు. ‘అహింస’ భావన ఈ ప్రగాఢమైన అవగాహన నుంచి పుట్టిందే. గాంధీ మాటలను మనం ఎంత విస్మరిస్తామో ప్రపంచంలో అంతేస్థాయిలో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉంది. ఒక్క సానుకూల పవనం... ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో చూసిన ఒక సానుకూల అంశం ఏదైనా ఉందీ అంటే అది దుబాయిలో ఇటీవలే ముగిసిన కాప్ సమావేశాలని చెప్పాలి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునేందుకు మానవాళి జరుపుతున్న కృషిలో భాగంగా జరిగిన ఈ సమావేశాల్లో కొన్ని ఆశాజనకమైన ఒప్పందాలు, నిర్ణయాలు జరిగాయి. వీటిని సక్రమంగా అమలు చేయగలి గితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సామాజిక సుస్థిరత దిశగా మళ్లే అవకాశాలు పెరుగుతాయి. వాతావరణ మార్పుల ముప్పును తట్టుకునేందుకు శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లాలని అందరూ అంగీకరించడం శుభపరిణామం. కృత్రిమ మేధతోపాటు వినూత్నమైన టెక్నా లజీలను అందిపుచ్చుకునేందుకు ఇదో చక్కటి అవకాశం. 2023లో వాతావరణ మార్పుల విషయంలో జరిగిన ఒప్పందాలు, కల్పించిన ఆశ వచ్చే ఏడాదిలో సఫలీకృతమవుతాయని ఆశిద్దాం. దీన్ని పక్కనపెడితే... ప్రపంచం వచ్చే ఏడాది కూడా కొంత అసందిగ్ధ్దతను ఎదుర్కొంటుందనేందుకు కొన్ని నిదర్శనాలు కనిపి స్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగేది 2024లోనే. ప్రస్తుతానికి డోనాల్డ్ ట్రంప్ పోటీ చేసే అవకాశాలు తగ్గాయి. అడ్డంకులు తొలిగి ట్రంప్ పోటీ చేసి గెలిస్తే మాత్రం అగ్రరాజ్యంలో సరికొత్త స్థానిక వాదం తలెత్తే ప్రమాదం ఉంది. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతోపాటు రష్యా ఉక్రెయిన్ జగడమూ వచ్చే ఏడాది మరింత ముదిరే అవకాశాలున్నాయి. ఉక్రెయిన్‌కు మద్దతిచ్చే విషయంలో అమెరికా కొంత అసందిగ్ధతతో వ్యవహరిస్తూండటాన్ని పుతిన్ గుర్తించక మానడు. తన దాడులను ఉధృతం చేయకుండా ఉండడు. అమెరికా ఏకకాలంలో రెండు యుద్ధాలను పర్యవేక్షిస్తూండటం, ఆ దేశంతో మనకున్న సంబంధాలపై కూడా ప్రభావం చూపనుంది. పైగా చైనాతో తనకున్న శత్రుత్వాన్ని కొంత తగ్గిగంచుకునే ప్రయ త్నాలు చేయవచ్చు. ఇప్పటికే దీనికి కొన్ని రుజువులు కనిపిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కారాదని బైడెన్ నిర్ణయించుకోవడం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే క్వాడ్ సమావేశాల వాయిదాను కూడా ఈ దృష్టితోనే చూడాల్సి ఉంటుంది. కెనెడా ఉగ్రవాది పన్నూ విషయంలో వచ్చిన అభిప్రాయబేధాలూ ఈ ధోరణికి కారణం కావచ్చు. సెప్టెంబరులో విజయవంతంగా నిర్వహించిన జీ20 సమావేశాల ప్రాభవం కాస్తా ఈ పరిణామాలతో తగ్గి పోయింది. మరోవైపు దేశంలోనూ సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. నరేంద్ర మోదీకి మరోసారి ప్రధాని పదవి దక్కే అవకాశం ఉంది. ఈ రాజకీయ సుస్థిరత 2024లో అంతర్జాతీయ స్థాయిలో మనకు మేలు చేస్తుందని ఆశిద్దాం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి (‘ద బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో) -
COP28: మానవాళి స్వార్థంతో ప్రపంచానికి పెను చీకట్లే
దుబాయ్: గత శతాబ్ద కాలంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ప్రపంచానికి ఎక్కువ సమయం లేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేవలం మన ప్రయోజనాలు మాత్రమే కాపాడుకోవాలన్న మానవాళి వైఖరి అంతిమంగా భూగోళాన్ని చీకట్లోకి నెట్టేస్తుందని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు, తద్వారా ప్రకృతి విపత్తులతో భూగోళానికి పెనుముప్పు పొంచి ఉందని, వాటి దుష్ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రపంచానికి సవాలు విసురుతున్న కర్బన ఉద్గారాలను ప్రజల భాగస్వామ్యం ద్వారా తగ్గించుకోవడానికి ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి వాతవరణ సదస్సు ‘కాప్–33’ని 2028లో భారత్‌లో నిర్వహిస్తామని ప్రతిపాదించారు. శుక్రవారం యూఏఈలోని దుబాయ్‌లో జరిగిన కాప్–28లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాలుష్యం, విపత్తుల నుంచి భూగోళాన్ని కాపాడుకొనే చర్యలను వెంటనే ప్రారంభించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ను ప్రస్తావించారు. వ్యాపారాత్మక ధోరణికి భిన్నంగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సాగే ఇందులో పాలుపంచుకోవాలని కోరారు. మూల్యం చెల్లిస్తున్న మానవాళి అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకాన్ని భారత్ చక్కగా పాటిస్తోందని, ఈ విషయంలో ప్రపంచానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భూగోళ ఉపరితల ఉష్ణోగ్రత(గ్లోబల్ వార్మింగ్) పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరమితం చేయాలన్న లక్ష్య సాధనకు నిబద్ధతతో కృషి చేస్తున్న అతికొన్ని దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. గత శతాబ్ద కాలంలో మానవళిలో ఒక చిన్న సమూహం ప్రకృతికి ఎనలేని నష్టం కలిగించిందని మోదీ ఆక్షేపించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయండి వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలకు నరేంద్ర మోదీ సూచించారు.అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్లోబల్ కార్బన్ బడ్జెట్లో తగిన వాటా ఇవ్వాలన్నారు. ‘కాప్–33’ని 2028లో భారత్‌లో నిర్వహించడానికి ప్రపంచ దేశాలు అంగీకరిస్తే తమ దేశంలో ఇటీవల జరిగిన జీ20 సదస్సు తర్వాత ఇదే అతిపెద్ద సదస్సు అవుతుందని పేర్కొన్నారు. ఏమిటీ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్? భారత ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్‌లో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ కూడా దాదాపు ఇలాంటిదే. ఇదొక వినూత్నమైన మార్కెట్ ఆధారిత కార్యక్రమం. వేర్వేరు రంగాల్లో పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛందంగా కృషి చేసిన వ్యక్తులకు, వ్యవస్థలకు, కమ్యూనిటీలకు, ప్రైవేట్ రంగానికి ప్రత్యేక గుర్తింపునిస్తారు. ప్రోత్సాహకాలు అందజేస్తారు. అమెరికా, చైనా అధినేతల గైర్హాజరు దుబాయ్‌లో జరుగుతున్న కాప్–28కు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ మాత్రం హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ప్రతిఏటా కర్బన ఉద్గారాల్లో ఏకంగా 44 శాతం వాటా అమెరికా, చైనాలదే కావడం గమనార్హం. ఈ రెండు బడా దేశాల నిర్లక్ష్యం వల్ల ఇతర దేశాలకు నష్టపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, చైనా మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
కాప్ దిశ ఎటువైపు..?
ఏటా తప్పనిసరి లాంఛనంగా జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)–28 సదస్సు శుక్రవారం మొదలైంది. ఈనెల 12 వరకూ జరగబోయే ఈ సదస్సుకు 130 మంది దేశాధినేతలు, దాదాపు 80,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. అలా చూస్తే ఈ సదస్సు గత సమావేశాలతో పోలిస్తే విస్తృతమైనదే. కానీ చివరాఖరికి ఇది ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోగలదా లేక గత సదస్సుల మాదిరే ఉస్సూరనిపిస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న. లక్ష సంవత్సరాల వ్యవధిలో జరగాల్సిన వాతావరణ మార్పులు కేవలం గత వందేళ్లలో సంభవించాయన్న చేదు వాస్తవాన్ని గుర్తించి చిత్తశుద్ధితో కాలుష్య నివారణ చర్యలకు ఉపక్రమించాల్సిన సంపన్న దేశాలు మాటలతో కాలక్షేపం చేసి లక్ష్యానికి తిలోదకాలిస్తున్నాయి. భూమాత తన భవిష్యత్తును పరిరక్షించమంటూ మనవైపు చూస్తున్నదని, ఈ విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించి విజయం సాధించటం మనందరి కర్తవ్యమని సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు అర్థవంతమైనది. 2030 కల్లా కర్బన ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించటంతో పాటు హరిత ఇంధనాల వాడకం వాటాను 50 శాతానికి పెంచాలని భారత్ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పటం కూడా మెచ్చదగ్గదే. అయితే ప్రధాన కాలుష్య కారక దేశాలైన చైనా, అమెరికా, ఇతర సంపన్న దేశాలూ ఏం చేయ బోతున్నాయన్నదే ప్రధానం. శిలాజ ఇంధనాల అవసరం లేని భవిష్యత్తును నిర్మించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ దేశాధినేతలకు విన్నవించారు గానీ వినేదెవరు? వాతావరణ మార్పులు ఎలా వున్నాయో వివిధ నివేదికలు చెబుతున్నాయి. గత ఏడెనిమిది దశాబ్దాలుగా కనీవినీ ఎరుగని ఉష్ణోగ్రతలను ఈ ఏడాది చవిచూశామని వాతావరణ పరిశోధకులు అంటున్నారు. ఇది ఏ స్థాయిలో వున్నదంటే పనామాలో కరువుకాటకాలు విస్తరిల్లి పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను అనుసంధానించే 80 కిలోమీటర్ల పనామా కాలువకు నీటి పరిమాణం గణనీయంగా తగ్గింది. దాంతో ఆ కాల్వమీదుగా వెళ్లే నౌకల సంఖ్య 40 నుంచి 32కు తగ్గింది. అంతేకాదు... నౌకలు మోసు కెళ్లే సరుకుల బరువుపై కూడా పరిమితులు విధించారు. పర్యవసానంగా సరుకు రవాణా బాగా దెబ్బ తింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదంతా చవిచూసిన కార్చిచ్చులు, వరదలు అన్నీ ఇన్నీ కావు. ఈసారి భారీవర్షాలతో మన దేశం 1,500 కోట్ల డాలర్ల మేర ఆస్తి నష్టాన్ని చవిచూసింది. లిబియానూ, మెక్సికోనూ కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. ఇలాంటి పరిణామాలు ఆర్థిక వ్యవస్థలను తలకిందులు చేస్తాయి. నిజానికి ఈ పరిస్థితులను సమీక్షించి, సరైన నిర్ణయాలు తీసుకో వటానికి కాప్ వంటి వేదికలు తోడ్పడాలి. ఆచరణలో అది సాధ్యం కావటం లేదు. ఉష్ణోగ్రతల పెరు గుదలను పారిశ్రామికీకరణకు ముందునాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ మేరకు పరిమితం చేయాలంటే అన్ని రకాల శిలాజ ఇంధనాల వాడకాన్నీ నిలిపేయటం తప్ప తగ్గించటంవల్ల ఒరిగేదేమీ లేదన్నది పర్యావరణవేత్తల మాట. కానీ సంపన్న దేశాలు నిలకడగా ఒక మాట మీద ఉండటం, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చటం ఇంతవరకూ లేనేలేదు. ఉదాహరణకు శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చేస్తున్న హెచ్చరికలు చేదు వాస్తవమని పర్యావరణపరంగా జరుగుతున్న పెను మార్పులు రుజువు చేస్తున్నాయని, తక్షణం కర్బన ఉద్గారాలను ఆపటంలో విఫలమైతే మహా విపత్తు తప్పదని ఇదే సదస్సులో మాట్లాడిన బ్రిటన్ రాజు చార్లెస్–3 చెప్పారు. కానీ విషాదమేమంటే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గత ప్రభుత్వాల వాగ్దానాలను బుట్టదాఖలు చేస్తూ పెట్రోల్, డీజిల్ కార్ల విక్ర యాలకున్న గడువును 2030 నుంచి 2035కు పొడిగించారు. 2035 నాటికి కొత్త గ్యాస్ బాయిలర్ల ఏర్పాటును ఆపేస్తామన్న వాగ్దానాన్ని కూడా పక్కనబెట్టారు. ఒకే దేశం భిన్న వైఖరులను ప్రదర్శించటం పర్యావరణ పరిరక్షణకు ఏమేరకు దోహదపడుతుందో చార్లెస్–3, సునాక్‌లు ఆలోచించాలి. అసలు శిలాజ ఇంధనాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో వున్న దేశాల్లో ఒకటైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో కాప్ సదస్సు నిర్వహించటం, సదస్సు అధ్యక్ష స్థానంలో వుండటం ఒక విచిత్రం. నిరుడు ఈజిప్టులో కాప్ సదస్సు జరిగింది. అప్పటినుంచీ శిలాజ ఇంధనాలైన బొగ్గు, చమురు, సహజవాయు ఉత్పత్తులు రికార్డు స్థాయికి చేరాయని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం ఉత్పత్తుల్లో చమురు వాటా 40 శాతం కాగా, బొగ్గు ఉత్పత్తి వాటా 31 శాతం. మిగిలిన 29 శాతం సహజవాయు ఉత్పత్తులది. వీటిని ఒకేసారి పూర్తిగా తగ్గించుకోవటం సాధ్యపడదు గానీ, ఒక క్రమ పద్ధతిలో హరిత ఇంధనాల వైపు మొగ్గటం ప్రారంభిస్తే లక్ష్యసాధన సులభం అవుతుంది. కానీ ఆ దిశగా ఏ దేశమూ చర్యలు తీసుకోవటం లేదు. నిరుడు ప్రపంచదేశాలు శిలాజ ఇంధనాల సబ్సిడీ కోసం ఏడు లక్షల కోట్ల డాలర్ల సొమ్మును వినియోగించాయని ఒక అంచనా. పునరుత్పాదక ఇంధన వనరులను పెంచటం విషయంలో ఈసారైనా కాప్ దృష్టి సారించాలి. లేనట్టయితే పర్యావరణ విధ్వంసం మరింత పెరగటం ఖాయం. ఇందుకు అవసరమైన సాంకేతికతలను వెనకబడిన దేశాలకు చవగ్గా అందించటంలో సంపన్న దేశాలు విఫలమవుతున్నాయి. ఇది సరికాదు. నిపుణుల మాట వినటం, పారిస్ ఒడంబడిక అమలుకు నిర్దిష్ట కార్యాచరణ రూపొందించి చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయటం తక్షణావసరం. ఒడంబడిక లక్ష్యాలను విస్మరించిన దేశాలపై ఎలాంటి చర్యలుండాలో నిర్ణ యించాలి. ప్రపంచంలో ఏమూల పర్యావరణానికి విఘాతం కలిగినా అది అన్ని దేశాలకూ ముప్పు కలిగిస్తుందని అందరూ గుర్తించాలి. కాప్ సదస్సు ఈ స్పృహను కలిగించగలిగితే దాని లక్ష్యం ఏదోమేరకు నెరవేరినట్టే. -
దుబాయ్ పర్యటనలో మోదీ.. ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(COP28) పేరుతో ఐక్యరాజ్యసమితి చేపట్టిన ప్రపంచ వాతావరణ మార్పు సదస్సులో పాల్గొననున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షతన దుబాయ్‌లో జరగుతున్న ఈ సమావేశంలో దాదాపు 200 దేశాలు హాజరుకానున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో పోరాడుతున్న దేశాలకు సాయం చేసేందుకు ఓ నిధిని ఏర్పాటు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. ఈ మేరకు గురువారం రాత్రి దుబాయ్‌కు మోదీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు యూఏఈ మంత్రి, ఉప ప్రధాని షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. అదే విధంగా ఎయిర్‌పోర్టులో ప్రధానికి ప్రవాస భారతీయుల నుంచి సాదర స్వాగతం లభించింది. ప్రధాని హోటల్‌కు చేరుకోగానే ‘మోదీ, మోదీ’, ‘అబ్కీ బార్ మోదీ సర్కార్’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ ఎన్నారైలు నినాదాలు చేయగా.. వారికి మోదీ అభివాదం చేశారు. Deeply moved by the warm welcome from the Indian community in Dubai. Their support and enthusiasm is a testament to our vibrant culture and strong bonds. pic.twitter.com/xQC64gcvDJ — Narendra Modi (@narendramodi) November 30, 2023 ప్రధాని తన ట్విటర్లో ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(COP28) సమ్మిట్‌లో పాల్గొనేందుకు దుబాయ్‌లో అడుగుపెట్టాను. మెరుగైన ప్రపంచాన్ని సృష్టించే లక్ష్యంతో కూడిన సదస్సు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నాను. అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్లైమేట్ ఫైనాన్సింగ్, టెక్నాలజీ బదిలీ చేయాలని, వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వారికి శక్తినివ్వాలి. ప్రవాస భారతీయుల నుంచి గొప్ప స్వాగతం లభించింది. ఇది వారి మద్దతు, ఉత్సాహం తమ శక్తివంతమైన సంస్కృతి, బలమైన బంధాలకు నిదర్శం’ అని పేర్కొన్నారు. చదవండి: ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఏమన్నారు? وصلت إلى دبي للمشاركة في قمة كوب-٢٨ (COP-28). ونتطلع إلى وقائع القمة التي تهدف إلى خلق كوكب أفضل. pic.twitter.com/WSBo6yZ1ji — Narendra Modi (@narendramodi) November 30, 2023 COP28లో వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ అనేది ఉన్నత-స్థాయి విభాగం. గ్రీన్హౌస్, ఉద్గారాలను తగ్గించడానికి, వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మార్గాలను చర్చించడానికి ప్రపంచ నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దీనితో పాటు ప్రధాని మోదీ మరో మూడు అత్యున్నత స్థాయి కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. కాగా COP28 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు యూఏఈ అధ్యక్షతన జరుగుతోంది. -
కాప్–28లో భారత్ భూమిక కీలకం!
వాతావరణ మార్పులపై మనిషి పోరుకు వేదికగా నిలిచిన కాప్ సమావేశాలు నవంబర్ 30న ప్రారంభం కానున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల 28వ సదస్సు మానవాళి భవిష్యత్తును నిర్దేశించవచ్చు. అంతర్జాతీయ వాతావరణ మార్పుల చర్చల్లో సమూలమైన మార్పు తీసుకు రావాలని భారత్ కాంక్షిస్తోంది. ఆతిథ్య దేశంతో భారత్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా కాప్–28 సమా వేశాలు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు. దీనికి కేంద్రబిందువుగా భారత ప్రభుత్వపు లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (లైఫ్) కార్యక్రమం ఉండాలి. సుస్థిర, అతితక్కువ ఇంధన ఖర్చును పోత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు లైఫ్ దోహదపడుతుంది. గత వారం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షంతో యుఏఈలో జనజీవితం స్తంభించిపోయింది. పాఠశాలలు బంద్ అయ్యాయి. పాఠాలు ఆన్లైన్ మార్గం పట్టాయి. కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పరిమితమయ్యారు. ఒక్కసారిగా ముంచెత్తిన వాన జోరుకు వీధుల్లో కార్లు పడవలయ్యాయి. పౌరుల భద్రతకు అధికార యంత్రాంగం నానా పాట్లూ పడాల్సి వచ్చింది. చిత్రమైన విషయం ఏమిటంటే... యుఏఈ, సౌదీ, బెహ్రాయిన్ వంటి దేశాల ప్రజలు నిన్నమొన్నటివరకూ నింగి నుంచి నేలకు జారే వాన చినుకులు చూసేందుకు రుతుపవవాల సీజన్లో ముంబైకి వచ్చేవారు. కేవలం వాన హోరు, జోరులను ఆస్వాదించేందుకు వీరు నరీమన్ పాయింట్, గేట్ వే ఆఫ్ ఇండియా వంటి ప్రాంతాల్లో సముద్రాభిముఖంగా ఉన్న ఖరీదైన బంగళాలు, హోటళ్లలో దిగేవారు. 1970లలో బయటపడ్డ ముడిచమురు వారి ఈ విలాసానికి సాయపడేది. వాన చినుకులకు వారు ముఖం వాచిపోయి ఉండేవారు. అయితే అది గతం. ఇప్పుడు వారే భారీ వర్షాలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూండటం వైచిత్రి. గాలి మూటలు... నీటి రాతలు... 15 రోజులపాటు కొనసాగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 28వ సమావేశానికీ, వాతావరణ మార్పులపై జరిగే ఇతర సమావేశాలకూ మధ్య స్పష్టమైన తేడా ఇదే కానుంది! ధనిక దేశాలు అనేకం కాప్ సమావేశాల్లో పెద్ద మాటలు మాట్లాడతాయి. అలివికాని హామీలూ గుప్పిస్తాయి. సమావేశాల తరువాత అన్నింటినీ మరచిపోతూంటాయి. ఇప్పుడు ఆ దేశాలూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రత్య క్షంగా చవిచూస్తున్నాయి. అయితే అవి యూఏఈ మాదిరిగా పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటాయన్న గ్యారెంటీ లేదు. మరికొన్ని దేశాలు అసలు సమస్యను కాకుండా, లక్షణాలపై ఎక్కువ దృష్టి పెడతాయి. డోనాల్డ్ ట్రంప్ 2025 జనవరి నాటికి మళ్లీ అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో వాతావరణ మార్పులపై అతడికి నమ్మకం లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాలి. గత పాలకులు సంతకం చేసిన అనేక అంతర్జాతీయ ఒప్పందాల నుంచి అమెరికా తప్పుకొనేలా చేసిన ఘనత ఆయనదే. రెండేళ్ల క్రితం గ్లాస్గోలో జరిగిన కాప్–26 సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ కూడా పెద్ద హామీలిచ్చింది. వాతావరణ మార్పులకు మూల కారణాలను వెతికి సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించింది. ఆ ప్రకటన తరువాత ఏం జరిగిందన్నది వెనుదిరిగి చూసుకుంటే... స్వదేశంలో జరిగిన కాప్–26 సమావేశాలకు వైఫల్యం ముద్ర అంట కూడదనే యూకే అలా ప్రకటించి ఉండవచ్చునన్న అనుమానాలు బల పడుతున్నాయి. యూకేతోపాటు పారిశ్రామిక దిగ్గజ జీ–7 దేశాలన్నీ ఇలాంటి మాటలే మాట్లాడాయి. వాతావరణ మార్పుల సమస్యకు చేసింది మాత్రం సున్నకు సున్న హళ్లికి హళ్లి! కాప్–26లో ఇచ్చిన హామీల అమలును మాత్రమే కాదు... 2015 నాటి కాప్–21 అంటే చారిత్రాత్మక ప్యారిస్ ఒప్పందం విషయంలోనూ యూకే వెనకడుగు వేసింది. వాతావరణ మార్పుల విషయంలో ప్యారిస్ ఒప్పందం మొట్టమొదటి అంతర్జాతీయంగా అమలు చేయదగ్గ చట్టంగా మారడం గమనార్హం. మొత్తం 196 దేశాలు సంతకాలు చేసిన ఈ ఒప్పందం విషయంలో ప్రస్తుత బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్... వాతావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించేందుకయ్యే ఖర్చులతో బ్రిటిష్ ప్రజలపై పడే ఆర్థిక భారం ఆమోదయోగ్యం కాదంటున్నారు. మరోవైపు యూఏఈ ఈ ఖర్చులను భరిస్తానని చెప్పడమే కాదు... సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో పెట్టుబడుల ద్వారా ఇతర దేశాలకూ సాయం చేస్తామని ప్రకటించింది. సమస్యను పరిష్కరించే గాంధేయవాదం 2015 నాటి కాప్ 21 సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన వాతావరణ మార్పుల విషయంలో నిర్ణయాత్మకంగా మారింది. అప్పటివరకూ సమస్యగా భావించినదే పరిష్కారంలో భాగమైపోయింది. వాస్తవానికి భారత్, కాప్–28కు ఆతిథ్యమిస్తున్న యూఏఈ రెండూ వాతావరణ మార్పుల సమస్య పరిష్కారం విష యంలో ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. అందుకే ఈ కాప్– 28 సమావేశాల్లో భారత్ పాత్ర కీలకం కానుంది. ప్రపంచ దేశాలన్నీ సమస్య పరిష్కారానికి ఒక్కమాటపై కదిలేలా చేసేందుకూ భారత్ గట్టి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది జనవరిలో యూఏఈ పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత శాఖ మంత్రి సుల్తాన్ అహ్మద్ అల్ జబేర్‌ను కాప్–28 అధ్యక్ష స్థానం వరించింది. ఆ వెంటనే ఆయన మొదటగా భారత్ పర్యటనకు విచ్చేశారు. దీన్ని భారత్ మరచిపోలేదు. బెంగళూరులో మాట్లాడుతూ కాప్–28పై జబేర్ తన అంచనాలను వివరించారు. దశాబ్ద కాలంగా అల్ జబేర్ తరచూ భారత్‌కు వస్తూన్నారు. భారతీయ నేతలతో ఆయన సంబంధాలు బాగా తెలిసినవే. అల్ జబేర్ మంత్రి మాత్రమే కాకుండా, అబూదబీ నేషనల్ ఆయిల్ కంపెనీ గ్రూపు సీఈవో కూడా. యూఏఈతో సంబంధాలను మెరుగుపరచుకునేందుకు మోదీ ప్రయ త్నిస్తున్న సమయంలో ద్వైపాక్షిక ఇంధన సంబంధాలను మార్చేయ డంలో అల్ జబేర్ కీలకపాత్ర పోషించారు. అబూదబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ద్వారా భారత్ ఇంధన భద్రతకు గట్టి హామీ కూడా ఇచ్చారు. పరస్పర ప్రయోజనకరమైన ఈ అంశం ప్రస్తుత సమావేశాల్లోనూ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాప్–28 అధ్యక్షుడిగా అల్ జబేర్ మద్దతు ఉండటంతో అంత ర్జాతీయ వాతావరణ మార్పుల చర్చ దిశను నిర్ణయాత్మకంగా మార్చా లని భారత్ కూడా ఆశిస్తోంది. ఆయా దేశాలే కేంద్రంగా సాగుతున్న ప్రయత్నాలను సార్వజనీనం చేసేందుకు భారత్ ప్రయత్నించాలి. దీనికి కేంద్రబిందువుగా మోదీ ప్రభుత్వపు లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరా న్మెంట్ (లైఫ్) కార్యక్రమం ఉండాలి. సుస్థిర, అతితక్కువ ఇంధన ఖర్చును పోత్సహించే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రజలు అల వర్చుకునేందుకు లైఫ్ కార్యక్రమం దోహదపడుతుంది. దీనికి ప్రపంచ ఆమోదముద్ర పడితే ప్రస్తుత జీవనశైలి భిన్నంగా మారుతుంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు ఆలోచనలు ఆచరణ రూపం దాలుస్తాయి. ధనిక దేశాల ఖరీదైన జీవనశైలి, వృథా వ్యవహారాలకు చెక్ పడుతుంది. వీటి కారణంగా భూమ్మీద వనరులు కరిగిపోతున్న విషయం తెలిసిందే. అబూదబీ నేషనల్ ఆయిల్ కంపెనీ సీఈవో అయిన అల్ జబేర్ ఆ దేశంలో సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రోత్సాహానికీ కృషి చేస్తున్న విషయం చెప్పుకోవాలి. యూఏఈ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ మస్దార్కు ఆయన తొలి సీఈవోగా, తరువాతి కాలంలో చైర్మన్ గానూ పనిచేశారు. ఈ కంపెనీకి దాదాపు 40 దేశాల్లో ప్రాజెక్టులు ఉన్నాయి. కాప్–28లో పర్యావరణానికి హాని కలిగించని ఇంధనాల వాడకం వైపు ప్రపంచం మళ్లేందుకు అల్ జబేర్ కాలుష్య కారక ముడిచమురు పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. యూఏఈ స్వయంగా చమురు అమ్మకాలు చేస్తున్నప్పటికీ పశ్చి మాసియాలో అణుశక్తి కేంద్రం కలిగిన తొలి దేశం కూడా ఇదే కావడం గమనార్హం. పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చేచ్చేందుకు అవసరమైన ఆర్థిక వనరులు యూఏఈ వద్ద పుష్కలం. ఈ నేపథ్యంలోనే 2015 నాటి ప్యారిస్ సమావేశాల కంటే ఈ సారి జరిగే కాప్ సమావేశాలు మరింత ఫలప్రద మవుతాయని ఆశిద్దాం. - కె.పి. నాయర్ వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Countdown on Health and Climate Change: ఎండ దెబ్బకు ఐదు రెట్ల మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా పెరుగుతున్న ఎండల తీవ్రతతో మానవాళికి పెనుముప్పు పొంచి ఉందని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. భానుడి ప్రతాపం ఇదే మాదిరి పెరుగుతూ ఉంటే వచ్చే 27 ఏళ్లలో అంటే 2050 నాటికి ఎండల తీవ్రతకు మరణించే వారి సంఖ్య ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది. తాజాగా, లాన్సెట్ ‘కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ ఛేంజ్’పై 8వ వార్షిక నివేదిక విడుదల చేసింది. గాలి, నీరు పరివర్తనం వల్ల తలెత్తే ప్రమాదాలపై ప్రధానంగా ఈ నివేదిక దృష్టి సారించింది. ఆయిల్, గ్యాస్ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టవద్దని ప్రభుత్వాలు, కంపెనీలకు సూచించింది. 2022లో దాదాపు 86 రోజుల పాటు తీవ్రమైన వేడిమిని ఎదుర్కోవలసి వచి్చందని పేర్కొంది. ఇందులో 60 శాతానికిపైగా ఘటనలకు మానవ కార్యకలాపాలే బాధ్యత అని తెలిపింది. జీవ ఇంధనాలపై పెట్టుబడులు పెట్టే వివిధ కంపెనీల తీరును కూడా లాన్సెట్ నివేదికలో ఎండగట్టింది. జల, వాయు సంబంధిత దుష్పరిణామాలను నిలువరించేందుకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవని లాన్సెట్ కౌంట్ డౌన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మరీనా రొమానెలో హెచ్చరించారు. ఎండ తీవ్రత వల్ల వ్యవస్థకు కలుతున్న నష్టంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణం దెబ్బతినడం వల్ల నీరు, వ్యవసాయ ఉత్పత్తులపై కూడా ప్రతికూల ప్రభావం పడి, ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపం సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అంచనా వేశారు. కేవలం ఎండ తీవ్రత కారణంగా 2041–60మధ్య కాలంలో 52.49కోట్ల మంది ఆహార భద్రత ముప్పు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. 2050 వరకు ప్రాణాంతక వ్యాధుల సంఖ్య పెరగొచ్చని కూడా లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేశారు. -
వాతావరణ మార్పులు.. ముసురుతున్న వ్యాధులు
సాక్షి, సిటీబ్యూరో: వాతావరణ మార్పులు నగరవాసులను వ్యాధుల బారిన పడేస్తున్నాయి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. నగరంలో ఈ సమస్యల విజృంభణతో కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రికి రోగులు పరుగులు పెడుతున్నారు. కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రికి గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో రోగులు వస్తుండటంతో రోజుకు 2 వేల మార్క్‌ను దాటుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని ఫలితంగా ఆసుపత్రికి వచ్చిన వారిని పరీక్షించడానికి గంటల తరబడి ఆలస్యమవుతోంది. ఇక్కడకు రోగులు గొంతు, చెవి ఇన్ఫెక్షన్ల వంటి సాధారణ సమస్యలతోనే వస్తారు. వచ్చేవారిలో దాదాపు 80– 85 శాతం మందికి మందులతోనే సరిపోతుంది. అయినప్పటికీ గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం రోగులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని ఈఎన్టీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. వాతావరణ మార్పులే కారణం.. శీతాకాలం ప్రారంభమయ్యే సమయంలో ఇలాంటి వ్యా«ధులు ప్రబలడం సహజమేనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోఠి ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శంకర్ భరోసా కల్పిస్తున్నారు. చల్లని పదార్థాలకు దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. అయితే రోజుల తరబడి సమస్య ఇబ్బంది పెడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తమ ఆసుపత్రి కరోనాకి ముందు పెద్ద సంఖ్యలో వచ్చేవారని, అదే విధంగా ఇప్పుడు కూడా రోగుల సంఖ్య పెరిగిందన్నారు. ఇక్కడికి వస్తున్న వారిలో జలుబు, దగ్గు తదితర సమస్యలే ఎక్కువగా ఉన్నాయన్నారు. రోగులను పరీక్షించేందుకు ఆలస్యం అవ్వడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఈహెచ్ఎస్ విధానం కొంత వరకూ కారణమవుతోందన్నారు. ప్రతీ రోగికి ఆధార్ తనిఖీతో పాటు రోగి ఆరోగ్య వివరాలను సమగ్రంగా నమోదు చేస్తుండడంతో స్వల్ప ఇబ్బందులు ఎదురైనా ఈ విధానం రోగులకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉందన్నారు. -
Joyeeta Gupta: డైనమిక్ ప్రొఫెసర్‌కు డచ్ నోబెల్
ఆర్థికశాస్త్రం చదువుకున్నవారి ఆసక్తి గణాంకాలకే పరిమితమని, న్యాయశాస్త్రం చదువుకున్న వారి ఆసక్తి ఆ శాస్త్రానికి సంబంధించిన అంశాలపైనే ఉంటుందనేది ఒక సాధారణ భావన. ‘విభిన్న విద్యానేపథ్యం ఉన్న మేధావి’గా గుర్తింపు పొందిన జ్యోయితా గుప్తా ఆర్థికశాస్త్రం నుంచి న్యాయశాస్త్రం వరకు ఎన్నో శాస్త్రాలు చదివింది. అయితే ఆమె ప్రయాణంలో ఆ శాస్త్రాలేవీ వేటికవే అన్నట్లుగా ఉండిపోలేదు. వాతావరణ మార్పులపై తాను చేసిన శాస్త్రీయ పరిశోధనకు మరింత విస్తృతిని ఇచ్చాయి. నెదర్లాండ్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టార్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా డచ్ రిసెర్చి కౌన్సిల్ నుంచి ‘డచ్ నోబెల్’గా పేరొందిన ప్రతిష్టాత్మకమైన స్పినోజా ప్రైజ్‌ను ది హేగ్‌లో అందుకుంది... దిల్లీలో పుట్టి పెరిగింది జ్యోయితా గుప్తా. లోరెటో కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్, గుజరాత్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం, హార్వర్డ్ లా స్కూల్లో ఇంటర్నేషనల్ లా చదివింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు’ అనే అంశంపై ఆమ్స్టార్ డామ్‌లోని వ్రిజే యూనివర్శిటీలో డాక్టరేట్ చేసింది. 2013లో ఈ యూనివర్శిటీలో ఫ్యాకల్టీగా చేరింది. వాతావరణ మార్పుల వల్ల సమాజంపై కలుగుతున్న ప్రభావం, ఉత్పన్నమవుతున్న సామాజిక అశాంతి... మొదలైన అంశాలపై లోతైన పరిశోధనలు చేసింది. 2016లో ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఔట్లుక్ (జీఈవో)కు కో– చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది. యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా ‘ఆమ్స్టర్డామ్ గ్లోబల్ చేంజ్ ఇన్స్టిట్యూట్’ సభ్యులలో ఒకరు. పరిశోధనలకే పరిమితం కాకుండా పర్యావరణ సంబంధిత అంశాలపై విలువైన పుస్తకాలు రాసింది జ్యోయిత. ‘ది హిస్టరీ ఆఫ్ గ్లోబల్ క్లైమెట్ గవర్నెన్స్’ ‘ది క్లైమెట్ ఛేంజ్ కన్వెన్షన్ అండ్ డెవలపింగ్ కంట్రీస్’ ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హజడస్ వేస్ట్’ ‘అవర్ సిమరింగ్ ప్లానెట్’ ‘ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డెలిగేషన్: ఏ సర్వె్యవల్ గైడ్ ఫర్ డెవలపింగ్ కంట్రీ క్లైమెట్ నెగోషియేటర్స్’ ‘మెయిన్ స్ట్రీమింగ్ క్లైమేట్ చేంజ్ ఇన్ డెవలప్మెంట్ కో ఆపరేషన్’... మొదలైన పుస్తకాలు రాసింది. అమెరికా పరిశ్రమల చెత్త ఏ దేశాలకు చేరుతుంది? ఎంత విషతుల్యం అవుతుందో 1990లోనే ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హాజడస్ వేస్ట్’ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించింది. పాశ్చాత్య దేశాల పరిశ్రమలు ఉత్పత్తి చేసే విషపూరిత వ్యర్థాలు మరోవైపు విదేశీ మారకద్రవ్యం కోసం పరితపిస్తూ పర్యావరణాన్ని పట్టించుకోని దేశాల గురించి లోతైన విశ్లేషణ చేసింది జ్యోయిత. సాధారణంగానైతే పర్యావరణ అంశాలకు సంబంధించిన చర్చ, విశ్లేషణ ఒక పరిధిని దాటి బయటికి రాదు. అయితే జ్యోయిత విశ్లేషణ మాత్రం ఎన్నో కోణాలను ఆవిష్కరించింది. వాతావరణంలోని మార్పులు ప్రభుత్వ పాలనపై చూపే ప్రభావం, ధనిక, పేద సమాజాల మధ్య తలెత్తే వైరుధ్యాల గురించి చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ. ‘ప్రపంచవ్యాప్తంగా తగినన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి. అందరి జీవితాలను బాగు చేయడానికి ఆ వనరులను ఎలా ఉపయోగించాలనేదే సమస్య. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు, నిరుపేదల మధ్య అసమానతలు ఉన్నాయి. భారత్‌లాంటి దేశాల్లో కూడా ఇదొక పెద్ద సవాలు’ అంటుంది జ్యోయిత. ఆమె విశ్లేషణలో విమర్శ మాత్రమే కనిపించదు. సందర్భాన్ని బట్టి పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. ‘విస్తృతమైన, విలువైన పరిశోధన’ అంటూ స్పినోజా ప్రైజ్ జ్యూరీ గుప్తాను కొనియాడింది. కొత్త తరం పరిశోధకులకు ఆమె మార్గదర్శకత్వం విలువైనదిగా ప్రశంసించింది. తనకు లభించిన బహుమతి మొత్తాన్ని (1.5 మిలియన్ యూరోలు) శాస్త్రపరిశోధన కార్యక్రమాలపై ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది జ్యోయితా గుప్తా. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు చట్టాలతో కూడిన ప్రపంచ రాజ్యాంగం కోసం జ్యోయితా గుప్తా గట్టి కృషి చేస్తోంది. -
వాతావరణ మార్పులతో కోట్ల డాలర్ల నష్టం
న్యూఢిల్లీ: వాతావరణంలో వస్తున్న భారీ మార్పులు ప్రపంచ దేశాలను ఆర్థికంగా దెబ్బ తీస్తున్నాయి. ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచంలోని మౌలిక సదుపాయాల రంగంలో ఏడాదికి సగటున 30,000వేల కోట్ల డాలర్ల నుంచి 33 వేల కోట్ల డాలర్ల వరకు నష్టం వస్తోందని కొయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ) నివేదిక వెల్లడించింది. ఆరోగ్యం, విద్యా రంగానికి సంబంధించిన భవంతులు ఇతర సదుపాయాలకు జరిగిన నష్టాన్ని కూడా చేరిస్తే 73,200 కోట్ల డాలర్ల నుంచి 84 వేల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా. 2021–22లో ప్రపంచ స్థూల ఆదాయం పెరుగుదలలో ఈ నష్టం ఏడో వంతు వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. -
9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి మాయమైందట!
దాదాపు 9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి ఉన్నపళాన తుడిచిపెట్టుకుపోయిందట. చివరి మంచు యుగం తుదినాళ్లలో చోటు చేసుకున్న విపరీతమైన వాతావరణ మార్పులే ఇందుకు కారణంగా నిలిచాయని అంతర్జాతీయ అధ్యయనం ఒకటే తాజాగా తేలి్చంది. అయితే నేటి ఆధునిక మానవుని పూరీ్వకులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి కూడా ఈ మహా ఉత్పాతం పరోక్షంగా కారణమైందని చెబుతోంది. చాన్నాళ్ల క్రితం. అంటే దాదాపు 9.3 లక్షల నుంచి 8.13 లక్షల ఏళ్ల క్రితం. పర్యావరణ పరంగా భూమ్మీద కనీ వినీ ఎరుగని ఉత్పాతం సంభవించింది. ఈ మహోత్పాతం వల్ల అప్పటి జనాభాలో ఏకంగా 98.9 శాతం తుడిచిపెట్టుకుపోయిందట. దాని బారినుంచి కేవలం 1,300 మంది మాత్రమే బతికి బట్టకట్టారట. మన పూరీ్వకులైన హోమోసెపియన్లు వీరినుంచే పుట్టుకొచ్చారట. చివరి మంచు యుగపు తుది నాళ్లలో ఈ పెను ఉత్పాతం జరిగింది. అధ్యయనం ఇలా... ► రోమ్‌లోని సపియెంజా వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లారెన్స్ నిపుణులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ► ఆ యుగంలో జరిగిన తీవ్ర వాతావరణ మార్పులు మానవ జాతి వినాశనానికి కారణంగా మారినట్టు వారు తేల్చారు. ► అధ్యయనం కోసం 50కు పైగా విభిన్న దేశాలకు చెందిన 3,154 మంది సంపూర్ణ జన్యుక్రమాలను లోతుగా విశ్లేíÙంచారు. ► ఇందుకోసం ఫిట్ కోల్ అనే సరికొత్త బయో ఇన్ఫర్మాటిక్స్ పద్ధతిని అనుసరించారు. ► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు. ► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంత ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. ► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు. ► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. ► జెనెటిక్ బాటిల్ నెక్‌గా పిలుస్తున్న ఈ మహోత్పాతానికి నాటి మంచు యుగ సంధి సందర్భంగా చోటు చేసుకున్న తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమని తేలింది. ► ఆ దెబ్బకు నేటి ఆఫ్రికా ఖండమంతా ఎండిపోయి మరు భూమిగా మారిందట. ► మానవులతో పాటు ఏనుగుల వంటి భారీ క్షీరదాలన్నీ దాదాపుగా అంతరించాయట. ► ఆ దెబ్బకు దాదాపు 3 లక్షల ఏళ్ల పాటు మానవ ఉనికి ఉందా లేదా అన్నంత తక్కువ స్థాయికి పడిపోయిందట. ► ఆ సమయం నాటి శిలాజాల్లో మానవ అవశేషాలు అసలే దొరక్కపోవడం కూడా దీన్ని ధ్రువీకరిస్తోంది. ► ఈ అధ్యయన వివరాలు జర్నల్ సైన్స్‌లో పబ్లిష్ అయ్యాయి. ‘నాటి మంచు యుగపు మహోత్పాతం మానవ వికాసంలో ఒక రకంగా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. తదనంతరం పుట్టుకొచ్చిన ఆదిమ మానవ సంతతే ఆఫ్రికా నుంచి యురేషియాకేసి విస్తరించింది. ఈ విస్తరణ ఆఫ్రికాలో హోమోసెపియన్లు, యూరప్‌లో నియాండర్తల్, ఆసియాలో దేనిసోవన్ల ఆవిర్భావానికి కారణమైంది‘ – ఫాబియో డీ విన్సెంజో – నేషనల్ డెస్క్, సాక్షి -
కార్చిచ్చు కనిపించని ఉచ్చు..!
కార్చిచ్చులు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఏడాదికేడాది కార్చిచ్చులు పెరిగిపోతున్నాయి. అడవుల్లో మంటలు చెలరేగిన క్షణాల్లోనే సమీపంలో నగరాలకు విస్తరించి దగ్ధం చేస్తున్నాయి. అమెరికాలోని హవాయి దీవుల్లో రేగిన కార్చిచ్చుతో లహైనా రిసార్ట్ నగరం ఒక బూడిద కుప్పగా మిగిలింది. అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తుల్లో ఒకటిగా మిగిలిపోయిన ఈ కార్చిచ్చు బీభత్సంలో 80 మందికి పైగా మరణించారు. మౌయి దీవిలో లహైనా పట్టణంలో మంగళవారం రాత్రి మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది. వాతావరణం పొడిగా ఉండడంతో పాటు హరికేన్ ఏర్పడడంతో ద్వీపంలో బలమైన గాలులు వీచాయి. దీంతో శరవేగంతో మంటలు వ్యాపించి అందాల నగరాన్ని దగ్ధం చేశాయి. మొదలైతే.. అంతే ► పశ్చిమ అమెరికా, దక్షిణ ఆ్రస్టేలియాలో తరచూ కార్చిచ్చులు సంభవిస్తూ ఉంటాయి. చరిత్రలో అతి పెద్ద కార్చిచ్చులన్నీ అక్కడే వ్యాపించాయి. గత కొన్నేళ్లుగా బ్రిటన్ అత్యధికంగా కార్చిచ్చుల బారినపడుతోంది. 2019లో బ్రిటన్‌లో 135 కార్చిచ్చులు వ్యాపించి 113 చదరపు మైళ్ల అడవిని దగ్ధం చేశాయి. రష్యా, కెనడా, బ్రెజిల్ దేశాలకు కూడా కార్చిచ్చు ముప్పు అధికంగా ఉంది. ► బ్రిటన్‌లో మాంచెస్టర్‌లో 2019లో సంభవించిన కార్చిచ్చు ఏకంగా మూడు వారాల పాటు కొనసాగింది. 50 లక్షల మంది వాయు కాలు ష్యంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో వ్యాపించిన కార్చిచ్చు వేలాది ఇళ్లను దగ్ధం చేసింది. 300 కోట్ల జంతువులు మరణించడమో లేదంటే పారిపోవడం జరిగింది. ► అమెరికాలో కాలిఫోరి్నయాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపిస్తూ ఉంటాయి. 2020లో కార్చిచ్చు 4 లక్షల హెక్టార్ల అడవుల్ని మింగేసింది. 1200 భవనాలు దగ్ధమయ్యాయి. ► 2021లో ప్రపంచ దేశాల్లో కార్చిచ్చుల వల్ల 176 వందల కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాల్లో కలిసింది కార్చిచ్చులతో ఏర్పడిన కాలుష్యానికి ప్రపంచంలో ఏడాదికి దాదాపుగా 34 వేల మందికి ఆయుష్షు తగ్గి ముందుగానే మరణిస్తున్నారు. ► 1918లో అమెరికాలో మిన్నెసోటాలో ఏర్పడిన కార్చిచ్చు చరిత్రలో అతి పెద్దది. ఈ కార్చిచ్చు వెయ్యి మంది ప్రాణాలను బలి తీసుకుంది. ► యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంచనాల ప్రకారం ప్రపంచంలో ఏడాదికి 40 లక్షల చదరపు కిలోమీటర్ల అడవుల్ని కోల్పోతున్నాం. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2030 నాటికి పెరిగిపోనున్న కార్చిచ్చులు 14% 2050 నాటికి30%, ఈ శతాబ్దం అంతానికి 50%కార్చిచ్చులు పెరుగుతాయని యూఎన్ హెచ్చరించింది. ఎందుకీ మంటలు ? ► కార్చిచ్చులు ప్రకృతి విపత్తే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కార్చిచ్చుల్లో 10 నుంచి 15% మాత్రమే సహజంగా ఏర్పడుతున్నాయి. వాతావరణం పొడిగా ఉండి, కరువు పరిస్థితులు ఏర్పడి, చెట్లు ఎక్కువగా ఎండిపోయి ఉన్నప్పుడు మండే ఎండలతో పాటు ఒక మెరుపు మెరిసినా కార్చిచ్చులు ఏర్పడతాయి. బలమైన గాలులు వీస్తే అవి మరింత విస్తరిస్తాయి. ► మానవ తప్పిదాల కారణంగా 85 నుంచి 90% కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. అడవుల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్లి క్యాంప్‌ఫైర్ వేసుకొని దానిని ఆర్పేయకుండా వదిలేయడం, సిగరెట్లు పారేయడం, విద్యుత్ స్తంభాలు వంటివి కూడా కార్చిచ్చుకి కారణమవుతున్నాయి. ► ఇందనం లేదంటే మరే మండే గుణం ఉన్న పదార్థాలు చెట్లు, పొదలు, గడ్డి దుబ్బులు ఉన్న అటవీ ప్రాంత సమీపాల్లో ఉంటే కార్చిచ్చులు ఏర్పడతాయి. 2021లో కాలిఫోరి్నయాలో చమురు కారణంగా 7,396 కార్చిచ్చులు ఏర్పడి 26 లక్షల ఎకరాల అటవీ భూమి దగ్ధమైంది. ► ప్రస్తుతం అమెరికా హవాయి ద్వీపంలో కార్చిచ్చు మెరుపు వేగంతో వ్యాపించడానికి డొరైన్ టోర్నడో వల్ల ఏర్పడిన బలమైన గాలులే కారణం. కాలిఫోర్నియాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపించడానికి గాలులే ప్రధా న పాత్ర పోషించాయి. అగ్గి మరింత రాజేస్తున్న వాతావరణ మార్పులు సహజసిద్ధంగా ఏర్పడే కార్చిచ్చుల వల్ల అడవుల్లో ఎండిపోయిన వృక్ష సంపద దగ్ధమై భూమి తిరిగి పోషకాలతో నిండుతుంది. మానవ నిర్లక్ష్యంతో ఏర్పడే కార్చిచ్చులు ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇవాళ రేపు వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కార్చిచ్చులు ఎక్కువైపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులతో వాతావరణం పొడిగా ఉండడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, కర్బన ఉద్గారాల విడుదల ఎక్కువైపోవడం వంటి వాటితో దావానలాలు పెరిగిపోతున్నాయి. 1760లో పారిశ్రామిక విప్లవం వచి్చన తర్వాత భూ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగిపోయాయి. దీని ప్రభావం ప్రకృతిపై తీవ్రంగా పడింది. అటవీ ప్రాంతాల్లో తేమ తగ్గిపోవడం వల్ల కార్చిచ్చులు మరింత ఎక్కువ కాలం పాటు సంభవిస్తున్నాయి. జనాభా పెరిగిపోవడం వల్ల అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివాసం ఏర్పరచుకోవడంతో కార్చిచ్చులు జనావాసాలకు పాకి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా అమెరికాలోని కాలిఫోరి్నయాలో అత్యధికంగా కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. భవిష్యత్‌లో వీటి తీవ్రత మరింత పెరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికి ఏ సమస్య అయినా భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా గ్లోబల్ వారి్మంగ్ దగ్గరకే వచ్చి ఆగుతోంది. భూతాపాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో పని చేస్తే కార్చిచ్చులతో పాటు ఇతర సమస్యల్ని కూడా అధిగమించవచ్చు. చరిత్రలో భారీ కార్చిచ్చులు దేశం ఏడాది దగ్ధమైన అటవీ రష్యా 2003 2.2 కోట్ల హెక్టార్లు ఆ్రస్టేలియా 2020 1.7 కోట్ల హెక్టార్లు కెనడా 2014 45 లక్షల హెక్టార్లు అమెరికా 2004 26 లక్షల హెక్టార్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
National Snow and Ice Data Center: అంటార్కిటికాలో కరిగిపోతున్న మంచు
వాషింగ్టన్: ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో వడగాలులు వీచాయి. ఫలితంగా అంటార్కిటికా ఖండంలో పెద్ద ఎత్తున మంచు కరిగిపోయింది. ఈసారి అక్కడ రికార్డు స్థాయిలో మంచు ఫలకలు కరిగినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. వాస్తవానికి అంటార్కికాలో వేసవి కాలంలో మంచు కరిగి, శీతాకాలంలో మళ్లీ భారీ మంచు ఫలకలు ఏర్పడుతుంటాయి. కానీ, ఈసారి అలా జరగలేదు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో హిమం ఉంది. నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ (ఎన్ఎస్ఐడీసీ) గణాంకాల ప్రకారం.. అంటార్కిటికాలో 2022 శీతాకాలంతో పోలిస్తే ఇప్పుడు 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగిపోయింది. అలాగే 1981–2010 మధ్య సగటు విస్తీర్ణం కంటే ఈ ఏడాది జూలై మధ్యలో 26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర మంచు తక్కువగా ఉంది. ఇది అర్జెంటీనా దేశ విస్తీర్ణంతో సమానం. అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూమెక్సికో, అరిజోనా, నెవడా, ఉతాహ్, కొలరాడో రాష్ట్రాల ఉమ్మడి విస్తీర్ణంతో సమానం. అంటార్కిటికాలో సముద్రపు మంచు కొన్ని దశాబ్దాలుగా రికార్డు స్థాయి నుంచి కనిష్టానికి పడిపోతోంది. ఇది చాలా అసా«ధారణ పరిణామమని, 10 లక్షల ఏళ్లకోసారి ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం, వాతావరణ మార్పులు అంటార్కిటికాను మరింతగా ప్రభావితం చేస్తాయని అంటున్నారు. -
వాతావరణ మార్పులతో... అల్లకల్లోలం
వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. అయితే ఠారెత్తించే ఎండలు లేదంటే కుండపోత వర్షాలతో కేవలం భారత్ మాత్రమే కాకుండా ఇతర ఆసియా దేశాలు సతమతమవుతున్నాయి. 2022 సంవత్సరంలో 81 విపత్తులు ఆసియా దేశాలను వణికించాయి. అందులో అత్యధిక భాగం వరదలు తుపాన్లే ఉన్నాయి. కరువు కాటకాలతో కొన్ని దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోతే మరికొన్ని దేశాలు వరదలతో విలవిలలాడాయి. ఈ పరిస్థితులతో ఆసియాలో ఆహార భద్రత సమస్య తలెత్తుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఒ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సామాజికంగా ఆర్థికంగా ఈ దేశాలు మరింత విచి్ఛన్నమవుతాయని డబ్ల్యూఎంఒ తాజా నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలోనే ఆసియా ఖండం అత్యంత వేగంగా వేడెక్కుతోంది. 1961–1990 మధ్య సగటు వేడి కంటే 1991–2022 మధ్య కాలంలో ఆసియా ఖండంలో వేడిమి రెట్టింపు అయింది. వరదలు, తుపాన్లతో పాటుగా పశి్చమాసియా దేశాలు ఇసుక తుపాన్లతో విలవిలలాడాయి. ‘‘2022లో వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలపై విపరీతమైన ప్రభావం చూపించింది. సాధారణం కంటే అధిక వేడి, పొడి వాతావరణంతో చైనా కరువు పరిస్థితుల్ని ఎదుర్కొంది. దీని వల్ల నీటి లభ్యత తగ్గిపోవడమే కాకుండా విద్యుత్ రంగంపై కూడా ప్రభావం పడింది. కేవలం కరువు కారణంగా చైనాలో ఒక్క ఏడాది 706 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వచ్చింది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్, భారత్‌లు వరదలు, తుపాన్లతో అల్లాడిపోయాయి’’ అని డబ్ల్యూఎంఒ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ పెట్రి టాలస్ వెల్లడించారు. ఈ అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల వ్యవసాయం, ఆహార భద్రతపై అత్యధిక ప్రభావం చూపిస్తుందని, ఆసియా దేశాల్లో ప్రభుత్వాలు ఆహార భద్రత సవాల్‌ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. నివేదిక ఏం చెప్పిందంటే ..! ఆసియా ఖండంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 2022 రెండో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది. 1991–2020 సగటు కంటే ఎక్కువగా 0.72డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ► కరువుతో ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోయాయి. నీటి వనరులు తరిగిపోయాయి. ఒక్క చైనాలో కరువు కారణంగా 706 కోట్ల అమెరికా డాలర్ల నష్టం వచి్చంది ► భారీ వర్షాలు, వరదలు పాకిస్తాన్‌ను అతలాకుతలం చేశాయి. కేవలం మూడు వారాల్లో ఏడాది మొత్తంగా కురవాల్సి వానలో 60% కురిసింది. పాక్ జనాభాలో 14% మందిపై వరదలు ప్రభావం చూపించాయి ► ఆసియాలోని పర్వత ప్రాంతాల్లో హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. గత 40 ఏళ్లలో హిమానీనదాలు పరిమాణం భారీగా తగ్గిపోయింది. గత కొంతకాలంగా మరింత వేగంగా క్షీణిస్తోంది. 2022లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా చాలా హిమానీనదాలు వేగంగా కరిగిపోవడం మొదలైంది. తూర్పు తియెన్ షాన్‌లో ఉరుమ్కీ గ్లేసియర్ ఉపరితలం నుంచి 1.25 మీటర్ల మేర క్షీణించింది. ► ఆసియా ఖండంలో సముద్ర ఉపరితలాలు వేడెక్కిపోతున్నాయి. 1982 నుంచి సముద్రాలు వేడెక్కడం మొదలైంది. వాయవ్య అరేబియన్ సముద్రం, ఫిలిప్పైన్స్ సముద్రం, తూర్పు జపాన్‌లో సముద్రం మొదలైనవి ప్రపంచంలో సముద్రాలు వేడెక్కే సగటు రేటు కంటే మూడు రెట్లు అధికంగా వేడెక్కుతున్నాయి. గత దశాబ్దంలో 0.5డిగ్రీల సెల్సియస్ అత్యధిక వేడిమి నమోదైంది. ఈ ఏడాది ఇంతే ఆసియాలో ఈ ఏడాది కూడా వివిధ దేశాలను విపత్తులు వణికిస్తున్నాయి. ఇండోనేసియా సమత్రాలో కొండచరియలు విరిగిపడి 15 వేల ఇళ్లు ధ్వంసమైతే లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు. చైనాను గత ఏడాది కరువు కాటేస్తే, ఈ ఏడాది వరదలతో అతలాకుతలమవుతోంది. వచ్చే నెలలో మరిన్ని టైఫూన్లు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలు ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హరియాణాలను కూడా వణికించాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలకి 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఇక పాకిస్తాన్‌లోనూ ఈ ఏడాది వరదలకి ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించారు. ఇలా వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలకు సవాల్ విసురుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వేధిస్తున్న విపరిణామాలు
వందేళ్లలో ప్రపంచ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. ఫలితంగా వ్యవసాయోత్పత్తులు దెబ్బతింటున్నాయి. దీనివల్ల ఆహోరోత్పత్తుల ధరలు చుక్కలనంటి, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే, వందేళ్లలో మారిన ప్రకృతి విపరిణామాల గురించి ఆలోచిస్తున్నాం సరే, మరి సమాజంలో ఇంకా మారని దుష్పరిణామాల గురించి ఆలోచిస్తున్నామా? మనుషుల మధ్య ఉన్న పెక్కు సామాజిక అసమానతలు ఇప్పటికీ తొలగిపోవడం లేదు. అంటరానితనమనే రుగ్మత ఇంకా పీడిస్తున్న పెను‘రోగం’గానే ఉంది. ‘ఎల్‌నినో’ వాతావరణాన్ని ప్రభావితం చేస్తే... కుల వ్యవస్థ, మత వ్యవస్థలు సంఘ జీవనాన్ని ఇప్పటికీ కలుషితం చేస్తూనే ఉన్నాయి. ‘‘గత వందేళ్లలోనే ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి. 2100 సంవ త్సరానికల్లా అనూహ్యంగా 4 సెంటిగ్రేడ్ డిగ్రీలు పెరగనున్నాయి. కాగా, ఇంతవరకు ప్రపంచ వాతావరణ రికార్డులో లేని వేడిమి 2022లో నమోదైంది. అంతేగాదు, తరచుగా దక్షిణ ఆసియాలో బిళ్లబీటుగా ఉధృతమవుతున్న వేడిగాలులు రానున్న సంవత్సరాల్లో కూడా కొనసాగ బోతున్నాయి. ఇంతగా వేడి గాలులు భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రా లలోనే గాక, దక్షిణాది రాష్ట్రాలను కూడా అమితంగా పీడిస్తున్నాయి. ఢిల్లీని 72 ఏళ్ల చరిత్రలో ఎరగని ఉష్ణోగ్రతలు ఈ ఏడాది కుదిపేశాయి. ప్రపంచ వాతావరణంలో అనూ హ్యమైన స్థాయిలో (40 డిగ్రీల సెంటి గ్రేడ్‌కు మించి) వేడిగాలులు వీచే ఈ పరిస్థితుల్లో, భారత్, చైనా, పాకిస్తాన్, ఇండోనేసియా లాంటి దేశాల్లో బయటి పనిచేసుకుని బత కాల్సిన దినసరి కార్మికులు యమ యాతనలకు గురికావల్సి వస్తుంది. 1971–2019 సంవత్సరాల మధ్య ఇండియాను చుట్టబెట్టిన అసాధా రణ వేడిగాలుల ఫలితంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.’’ – ప్రొఫెసర్స్ వినోద్ థామస్, మెహతాబ్ అహ్మద్ జాగిల్,నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఈ ‘మిడిమేల’మంతా భారతదేశాన్ని ఎలా చుట్టబెడుతోంది? మరో వైపు, గత ఏడేళ్లుగా పసిఫిక్ మహాసముద్రం నుంచి ఏనాడూ ఎరుగ నంతటి వేడి గాలులకు నిలయమైన ‘ఎల్‌నినో’ వాతావరణ దృశ్యం భారత దేశాన్ని ‘కుమ్మేస్తూ’ ముంచుకొస్తోంది. ఫలితంగా వ్యవసాయో త్పత్తులు దెబ్బతింటున్నాయి. దీనివల్ల తీవ్రమైన సామాజిక పరిస్థి తులు తలెత్తి, ఆహోరోత్పత్తుల ధరలు చుక్కలనంటి, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని సిడ్నీ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్రాచార్యులు డేవిడ్ యుబిలావా హెచ్చరిస్తున్నారు. ‘ఎల్‌నినో’ ప్రభావం అన్ని చోట్లా ఒకే తీరుగా ఉండదు. కాకపోతే, పెక్కు దేశాలకు వర్తక వ్యాపారాల సంబంధ బాంధవ్యాలున్నందువల్ల ఆర్థికపరమైన ఒడిదు డుకులు అనివార్యమవుతాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలతో పాటు, సామాజిక ఒడిదుడుకులు అనివార్యమనీ అంచనా! ఇప్పటికే మనుషుల మధ్య పెక్కు సామాజిక అసమానతలు ఉన్నాయి. అంటరానితనమనే రుగ్మత పెక్కుమందిని ఇంకా పీడిస్తున్న పెను‘రోగం’గానే ఉంది. ‘ఎల్‌నినో’ లాంటి వాతావరణం వల్ల వారి జీవితాలకు మరిన్ని అవాంతరాలు తోడవుతున్నాయి. ఈ జాఢ్యం ఇప్పుడే గాదు, ‘ఏలినాటి శని’గా మనదాకా దాపురించి ఉన్నందుననే – మహాకవి జాషువా ఏనాడో ఇలా చాటాడు: ‘‘అంటరాని తనంబునంటి భారత జాతి భువన సభ్యత గోలుపోయె... నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయు’’ అంతేనా? తాను ‘పుట్టరాని చోట పుట్టినందుకు’ అసమానతా భారతంలో ఎన్ని అగచాట్లకు గురయ్యాడో వెలిబుచ్చిన గుండె బాధను అర్థం చేసుకోగల మనస్సు కావాలని ఇలా కోరుకున్నాడు: ‘‘ఎంత కోయిల పాట వృథయయ్యెనొ కదా చిక్కు చీకటి వన సీమలందు ఎన్ని వెన్నెల వాగు లింకి పోయెనొ కదా కటికి కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింక లీడేరెనొ కదా మురికి తిన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనొ కదా పండిన వెదురు జొంపములలోన ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను యెంత రత్నకాంతి యెంత శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనొ పుట్టరాని చోట బుట్టుకతన...’’ ‘ఎల్‌నినో’ వాతావరణాన్ని ప్రభావితం చేస్తే... కుల వ్యవస్థ, మత వ్యవస్థలు సంఘ జీవనాన్ని ఇప్పటికీ ఎలా కలుషితం చేస్తున్నాయో ‘గబ్బిలం’ దీనావస్థ ద్వారా జాషువా వ్యక్తం చేశారు. ‘పూజారి’ లేని సమయం చూసి నీ బాధను శివుడి చెవిలో విన్నవించుకోమంటాడు. అప్పటికీ ఇప్పటికీ – పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రంగా వ్యవస్థ అవస్థ పడుతూనే ఉంది. కనుకనే జాషువా ‘ముప్పయి మూడు కోట్ల దేవతలు ఎగబడ్డ దేశంలో భాగ్యవిహీనుల కడుపులు చల్లారుతాయా’ అని ప్రశ్నించాడు! అలాగే అనేక ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవుల్ని క్షేమంగా గట్టెక్కించే ఔషధాలు, వాటి విలువల్ని తొలిసారిగా ప్రపంచానికి వెల్లడించిన 18వ శతాబ్ది కవి చెళ్లపిళ్ల నరస కవి. ఒక్క ‘కరణి’ అన్న పదంతోనే (ఒక రీతి, ఒక పద్ధతి) ధరణిని శ్వాసించి, శాసించిన కవి! ఆయన గ్రంథం ‘యామినీ పూర్ణతిలకా విలాసం’ ఎన్ని రకాల ఔషధాలనో వెల్లడించింది: చనిపోయిన వారిని బతికించే ఔషధి – ‘సంజీవకరణి’, విరిగిపోయిన ఎముకల్ని అతికించేది– ‘సంధాన కరణి’, తేజస్సును కోల్పోయిన మనిషికి తేజస్సు ప్రసాదించే ఔషధం– ‘సౌవర్ణకరణి’, మనిషి శరీరంలో విరిగి పోయిన ఎముక ముక్కల్ని తొలగించేసేది – ‘విశల్యకరణి’. ఇవన్నీ నరస కవి చూపిన ప్రకృతి లోని పలు రకాల ఔషధాలు! కళల్ని మెచ్చుకుని వాటికి కాంతులు తొడిగే శిల్పుల్ని నిరసించడం తగదు గదా! ఎందుకని? ‘వానతో వచ్చే వడగండ్లు’ నిలుస్తాయా?! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
భూగోళంపై అత్యంత వేడి దినం.. జూలై 4
వాషింగ్టన్: గత 1,25,000 సంవత్సరాల్లో ఈ ఏడాది జూలై 4వ తేదీ భూగోళంపై అత్యంత వేడి దినంగా రికార్డుకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దినంగా ఈ నెల 3వ తేదీ రికార్డు సృష్టించింది. ఆ రికార్డు ఒక్కరోజులోనే బద్దలు కావడం విశేషం. 3న ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 17.01 డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మెయిన్‌కి చెందిన క్లైమేట్ చేంజ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. 4వ తేదీన ఇది 17.18 డిగ్రీల సెల్సియస్(62.92 డిగ్రీల ఫారన్‌హీట్)కు ఎగబాకినట్లు తెలియజేసింది. ఈ ఉష్ణోగ్రతను గణించడానికి మోడలింగ్ సిస్టమ్‌ను 1979 నుంచి ఉపయోగిస్తున్నారు. దీని ప్రకారం లక్షల సంవత్సరాల క్రితం నాటి ఉష్ణోగ్రతను సైతం అంచనా వేయొచ్చు. -
మేఘాలను మరింత మందంగా మార్చేస్తే.. సూర్యకాంతిని అడ్డుకుంటే
వాషింగ్టన్: ఆధునిక యుగంలో మానవాళిని బెంబేలెత్తిస్తున్న అతిపెద్ద సమస్య వాతావరణ మార్పులు. వేడెక్కుతున్న భూగోళం, ఒకవైపు ముంచెత్తుతున్న వరదలు, మరోవైపు తీవ్రమైన కరువులు, పడిపోతున్న పంటల దిగుబడి.. ఇవన్నీ వాతావరణ మార్పుల సంభవిస్తున్న ప్రతికూల ప్రభావాలే. కాలుష్యానికి తోడు నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొర క్షీణిస్తుండడంతో ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. సూర్యుడి నుంచి వెలువడుతున్న తీవ్రమైన వేడికి భూమి అగ్నిగుండంగా మారిపోతోంది. అలాంటప్పుడు ఈ సమస్య పరిష్కారానికి సూర్యకాంతి భూమిపై పడకుండా అడ్డుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన అమెరికా ప్రభుత్వానికి వచ్చింది. దీనిపై పరిశోధనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ’ ఓ నివేదిక విడుదల చేసింది. వాతావరణ మార్పుల నుంచి భూమిని కాపాడుకోవాలన్నదే ఈ పరిశోధన ఉద్దేశం. జియో ఇంజనీరింగ్ విధానంతో సూర్యకాంతి భూమిపై పడకుండా అడ్డుకోవడం ఎలా అన్నదానిపై పరిశోధన చేస్తున్నట్లు తెలియజేసింది. సూర్యుడి నుంచి వెలువడే తీవ్రమైన ఉష్ణోగ్రతలను ఆకాశంలోని మేఘాలను మరింత మందంగా మార్చడం ద్వారా అడ్డుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పద్ధతిని సిరస్ క్లౌడ్ థిన్నింగ్ అంటారు. జియో ఇంజనీరింగ్ అమలు చేయడం సులభమేనని వారి వాదన. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు అధికం. ఆ సమయంలో క్లౌడ్ థిన్నింగ్ చేయాలన్న యోచనలో ఉన్నారు. -
డేంజర్లో ఉన్నామా?.. సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్..
లండన్: శిలాజ ఇంధనాల వాడకం, కాలుష్యం, వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల, ప్రకృతి విపత్తులు.. వీటి గురించి తరచుగా వింటూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రపంచ దేశాలు నష్టనివారణ చర్యలు చేపట్టిన దాఖలాలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ప్రమాదకరమైన గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం గరిష్ట స్థాయికి చేరినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా వెలువడుతున్న గ్రీన్‌హౌజ్ వాయువులు 54 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్తో సమానమని తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా 50 మంది అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు భూ ఉష్ణోగ్రతలపై విస్తృత అధ్యయనం నిర్వహించి, ఉమ్మడిగా నివేదిక విడుదల చేశారు. మానవ చర్యలు, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారం భూతాపం, వాతావరణ మార్పులకు కారణమవుతున్నట్టు పేర్కొన్నారు. జీవజాలానికి ఇన్నాళ్లూ ఆవాసయోగ్యంగా ఉంటూ వస్తున్న భూగోళం క్రమంగా అగ్నిగుండంగా మారిపోతోందని హెచ్చరించారు. సైంటిస్టులు తమ నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే.. ► 1800వ సంవత్సరంతో పోలిస్తే భూఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పుడు 1.14 డిగ్రీలు పెరిగాయి. ► ఉష్ణోగ్రత ప్రతి పదేళ్లకు రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూతాపం మానవాళిని కబళించడం ఖాయం. ► గతంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని యథాతథంగా కొనసాగిస్తే భూ ఉపరితల ఉష్ణోగ్రత సమీప భవిష్యత్తులోనే 2 డిగ్రీలు పెరిగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ► పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలకు మించి పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని సాధించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలి. మునుపెన్నడూ లేనిస్థాయిలో తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ► భూతాపం ముప్పు నుంచి మానవళి బయటపడాలంటే 2035 నాటికి ప్రపంచదేశాలు తమ గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను 60 శాతానికి తగ్గించుకోవాలని సైంటిస్టు పియర్స్ ఫాస్టర్ చెప్పారు. -
అన్నీ అనర్థాలే.. 3.4 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం!
భూగోళం మండిపోతోంది.. ఎండ ప్రచండంగా మారుతోంది.. వాతావరణంలో మార్పులతో రుతువులు గతి తప్పుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఇతర శిలాజ ఇంధనాల మితిమీరిపోయిన వాడకంతో కర్బన ఉద్గారాలు అడ్డూఅదుçపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలతో భూతాపం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే ఉంటే ముందు ముందు మరిన్ని అనర్థాలు ఎదుర్కోబోతున్నాం. 2030కి భారత్ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుందని ఆర్బీఐ నివేదిక హెచ్చరిస్తోంది. మండే ఎండలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. శ్రామిక శక్తి నిర్వీర్యమైపోతోంది. సూర్యుడు నిప్పులు కురిపిస్తూ ఉంటే శ్రామికులు సత్తువ కోల్పోతున్నారు. పని గంటలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా వాతావరణ మార్పులతో మన దేశం ఆర్థికంగా కుదేలయ్యే దుస్థితి రాబోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదిక హెచ్చరించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతే అందులో దాదాపుగా సగం 3.4 కోట్లు భారత్‌లోనేనని ఆర్బీఐ నివేదిక అంచనా వేసింది. ఇక స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 4.5 శాతం వరకు కోల్పోయే ముప్పు ఉందని హెచ్చరించింది....! వచ్చే ఐదేళ్లలో భగభగలే..! వచ్చే అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతల్లో భారీగా పెరిగిపోనున్నాయి. గ్రీన్హౌస్ గ్యాస్‌లు, çపసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ప్రభావంతో ఎండ ప్రచండంగా మారుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. 2023–2027 మధ్యలో సగటు ఉష్ణోగతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా. వచ్చే అయిదేళ్లలో ఏదో ఒక ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడానికి 98% అవకాశం ఉంది. 2015 నుంచి ఉష్ణోగ్రతల్లో సగటు పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటూ వస్తోంది. ఆర్కిటిక్ కరిగి మంచు కరిగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. వందేళ్లలో ఒక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. వ్యవసాయం: భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. అత్యధికులు ఇప్పటికీ వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ సీజన్లే మారిపోతాయి. దీని వల్ల పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఫలితంగా గ్రామీణ ఆర్థిక రంగం కుదేలైపోతుంది. దాని ప్రభావంతో పట్టణాల్లో ధరాభారం పెరిగిపోతుంది. పరిశ్రమలు: పారిశ్రామిక రంగంలో నిర్వహణ వ్యయాలు తడిసిమోపెడయిపోతాయి. లాభా లు తగ్గుతాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త నియంత్రణలు పాటించాల్సి రావడంతో పెట్టుబడులు పెరుగుతాయి. సేవలు : ఆర్థిక సేవలపై ఒత్తిడి పెరిగిపోతుంది. అనారోగ్యాల బారిన పడేవారి సంఖ్య పెరిగి బీమా క్లెయిమ్‌లు పెరుగుతాయి. ప్రయాణాలు తగ్గి ఆతిథ్య రంగం కుదేలవుతుంది. శ్రామిక మార్కెట్: పర్యావరణ మార్పులతో ఉత్పాదకత తగ్గి వలసలు పెరుగుతాయి. ఎండలకు శ్రామికుల పని గంటలు తగ్గుతాయి. రుణాలు, మార్కెట్, లిక్విడిటీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలపైనా ప్రభావం పడనుంది. -
చీతాలు.. చింతలు.. కాపాడుకోవడం ఎలా? మూడు నెలల్లో మూడు..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లోనే అంతరించిపోయిన జాబితాలో చేరిపోయిన చీతాల సంతతిని తిరిగి భారత్‌లో పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చీతాల ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మొత్తం 20 చీతాలను తీసుకువచ్చాము. గత మూడు నెలల్లోనే మూడు చీతాలు మరణించడంపై జంతు ప్రేమికుల్లో ఆందోళన నెలకొంది. మూడు చీతాలను మనం కోల్పోయినప్పటికీ మార్చి నెలలో సియాయా అనే చీతా నాలుగు పిల్లలకి జన్మనివ్వడం వల్ల ఈ ప్రాజెక్టు ముందుకెళుతుందన్న ఆశలు ఇంకా అందరిలోనూ ఉన్నాయి. చీతాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందనే చర్చ మొదలైంది. చీతాలను కాపాడుకోవడం ఎలా? ఆఫ్రికా నుంచి తెచ్చిన చీతాల సంతతి పెరగడానికి చాలా ఏళ్లు ఎదురు చూడక తప్పని పరిస్థితులు ఉన్నాయి. చీతాలకు రేడియో కాలర్ ఏర్పాటు చేసి శాటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ ప్రతీ క్షణం వాటి భద్రతని పర్యవేక్షించడం సంక్లిష్టంగా మారింది. అందుకే వాటిని ఎన్క్లోజర్లకే పరిమితం చేయడంపై వన్యప్రాణుల నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిమితమైన స్థలంలో వాటిని బంధించి ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని వరల్డ్‌లైఫ్ బయోలజిస్ట్ రవి చెల్లం అభిప్రాయపడ్డారు. మగ, ఆడ చీతాలను ఎన్క్లోజర్ల నుంచి బయటకి తరచూ వదులుతూ ఉండాలని అప్పుడే వాటి సంతతి అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇక వాతావరణపరమైన అడ్డంకుల్ని అధిగమించాలంటే మరిన్ని ఏళ్లు గడవడం తప్ప మరో మార్గం లేదన్నది వన్యప్రాణ నిపుణుల అభిప్రాయంగా ఉంది. రుతుపవనాల సీజన్ ముగిసిన తర్వాత చీతాలను వేరే అడవులకి కూడా తరలించే ఆలోచనలో కేంద్రం ఉంది. ఎదురవుతున్న సవాళ్లు ► చీతాల మనుగడుకు ఎదురవుతున్న అతి పెద్ద సవాల్ వాతావరణం. మధ్యప్రదేశ్‌లో కునో జాతీయ ఉద్యానవనంలో వాతావరణం ఆఫ్రికా వాతావరణం కంటే చాలా విభిన్నమైనది. కునోలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకు రాల్చే అడవులుంటాయి. ఆఫ్రికాలో గడ్డి మైదానాలు, దట్టమైన వృక్షాలు ఎక్కువ. ఇన్నాళ్లూ అక్కడ వాతావరణానికి అలవాటు పడిన చీతాలకు ఒకేసారి మార్పు రావడం తట్టుకోలేకుండా ఉన్నాయి. మన దేశంలో ఉద్యానవనాలు చీతాలకు నివాసయోగ్యాలుగా మారగలవో లేదోనన్న సందేహాలు కూడా నిపుణుల్లో ఉన్నాయి. ప్రభుత్వం చీతాల ప్రాజెక్టు ప్రారంభించడానికే ముందే జంతు పరిరక్షణ నిపుణులు భారత పర్యావరణ వ్యవస్థకి చీతాలు అలవాటు పడడానికి చాలా ఏళ్లు పడుతుందని హెచ్చరించారు. ► ఇక రెండో పెద్ద సవాల్ స్థలం. కునో జాతీయ పార్క్‌లో చీతాలు ఉంచిన వాటికి ఎన్‌క్లోజర్ సరిపోదు. అవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత దట్టమైన అటవీ ప్రాంతం అవసరముంది. వచ్చే అయిదేళ్లలో మరో 30 చీతాలను తెచ్చే ప్రణాళికలు ఉండడంతో వాటిని ఎక్కడ ఉంచుతారో కూడా ముందుగానే చూడాల్సిన అవసరం ఉంది. ► కునోలో జంతువుల మధ్య ఘర్షణ జరుగుతూ ఉండడం అధికమే. చీతా కంటే దూకుడుగా వ్యవహరించే పులులు, చిరుతుపులులు పోటాపోటీగా కొట్టుకుంటాయి. ఒక్కోసారి చీతాలను ఉద్యానవనం గేటు వరకు తీసుకొస్తూ ఉంటాయి. అక్కడ మనుషులే వాటికి శత్రువులుగా మారుతుంటారు. ఇక మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణలతో ఎంతో విలువైన జంతు సంపదని కోల్పోతున్నాం. దీంతో జీవవైవిధ్యానికి ముప్పు కలుగుతోంది. ► చీతాల సంరక్షణకి నియమించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికాకి పంపించి శిక్షణ ఇచ్చింది. కానీ ఆ శిక్షణ సరిపోలేదు. రెండు చీతాలు అనారోగ్య కారణాలతో మరణించాయంటేనే సంరక్షకులకు వాటిపై పూర్తి స్థాయి అవగాహన లేదన్న విషయం తెలుస్తోంది. ► భారత్‌లో చీతాలు ప్రధానంగా కృష్ణజింకలు, చింకారాలను వేటాడి తింటాయి. ప్రస్తుతం కునో జాతీయ ఉద్యానవనంలో ఈ జంతువులు అంతగా లేవు. దీంతో చీతాల కడుపు నిండడం కూడా సమస్యగానే మారింది. మార్చి 27: నమీబియా నుంచి తీసుకువచ్చిన శష అనే చీతా కిడ్నీపరమైన వ్యాధితో మరణించింది. ఏప్రిల్ 13: దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన ఉదయ్ అనే చీతా అనారోగ్య కారణాలతో మృతి చెందింది మే 9: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన చీతాల్లో దక్ష అనే ఆడ చీతాను మేటింగ్ సమయంలో మగ చీతాలు క్రూరంగా వ్యవహరించి మీద పడి చంపేశాయి. -
హరిత ఉద్యోగాల కల్పనకు ఏబీఎఫ్ఆర్ఎల్, 1ఎం1బీ జట్టు
ముంబై: వాతావరణ మార్పులపై పోరుపై యువతలో అవగాహన కల్పించడంతో పాటు హరిత ఉద్యోగాల కల్పన దిశగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్), 1ఎం1బీ జట్టు కట్టాయి. గ్రీన్ జాబ్స్ అండ్ సస్టెయినబిలిటీ యాక్సిలరేటర్ ప్రోగ్రాంను ఆవిష్కరించాయి. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు పాటించతగిన విధానాలతో 1ఎం1బీ ప్రత్యేక పాఠ్యాంశాలతో ఈ .. ఏడు రోజుల ప్రోగ్రాం రూపొందింది. ఇందులో ఎంపికయ్యే టాప్ 20 మంది విద్యార్థులకు ఏబీఎఫ్ఆర్ఎల్ ఇంటర్న్‌షిప్‌లు అందిస్తుంది. అలాగే అత్యుత్తమ స్టూడెంట్ల బృందానికి ఈ ఏడాది న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యాక్టివేట్ ఇంపాక్ట్ యూత్ సదస్సులో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుందని ఏబీఎఫ్ఆర్ఎల్, 1ఎం1బీ తెలిపాయి. 2023 జనవరిలో పైలట్ ప్రాతిపదికన నిర్వహించిన ప్రోగ్రాంలో 545 సీబీఎస్ఈ పాఠశాలలు ఇందులో పాల్గొన్నాయని, ఏప్రిల్ 20 నుంచి దీన్ని 25,000 పైచిలుకు పాఠశాలలు, కాలేజీలకు విస్తరించనున్నామని వివరించాయి. -
తెలంగాణపై మళ్లీ ఫ్లూ పంజా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణపై మళ్లీ ఫ్లూ పంజా విసురుతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, కళ్లమంటలు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఈ సీజనల్ జ్వరాల బారినపడినట్లు సమాచారం. బాధితుల్లో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారే ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నమోదవుతున్న జ్వరాల్లో సాధారణ లక్షణాలకు భిన్నంగా ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణం మారడంతో.. ప్రస్తుతం శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమైంది. చలిగాలులు తగ్గి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వైరస్ కారకాలు మార్పు చెందుతున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న జ్వరాలను ఐసీఎంఆర్ ఇటీవల విశ్లేషించగా విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. ఐసీఎంఆర్ చేసిన సీరో సర్వేలో 92 శాతం మందికి తీవ్రమైన జ్వరంతోపాటు దగ్గు, కళ్ల మంటలు, నిమోనియా (హెచ్3ఎన్2 వైరస్) లక్షణాలున్నట్లు గుర్తించింది. సాధారణ స్వైన్‌ఫ్లూ కంటే ఈ వైరస్ తీవ్రత కొంత ఎక్కువున్నట్లు పేర్కొంది. పదేళ్ల క్రితం తగ్గినట్లే తగ్గి.. 2009లో హైదరాబాద్‌లో తొలిసారిగా స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. 2012 వరకు హెచ్1ఎన్1 ఇన్ఫ్లుయెంజా వైరస్ కేసుల తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఆపై కేసుల సంఖ్య క్రమంగా తగ్గి సాధారణ ప్లూ జాబితాలో చేరింది. అడపాదడపా కేసులు నమోదవుతున్నప్పటికీ రోగనిరోధకశక్తి పెరగడం, చికిత్స సులభతరం కావడంతో ఆ తర్వాత పెద్దగా ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం ఈ వైరస్ హెచ్3ఎన్2గా రూపాంతరం చెంది మరింత బలపడింది. సాధారణంగా చలి ప్రదేశంలో ఈ వైరస్ విస్తరిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా వేసవిలోనూ విజృంభిస్తోంది. జనసమూహాలతో వ్యాపిస్తూ.. ప్రస్తుతం శుభకార్యాల సీజన్ కావడంతో ప్రజలు భారీగా ఒకచోట చేరుతున్నారు. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలకు సైతం వెళ్తున్నారు. ఈ సమయంలో వైరస్ సోకిన వ్యక్తి తుమ్మడం, దగ్గడం వల్ల ఆ వైరస్ గాలిలోకి ప్రవేశించి ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తోంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాలు ప్రస్తుతం ఫ్లూ బాధితులతో రద్దీగా మారుతున్నాయి. బాధితుల్లో జ్వరం 3–5 రోజులపాటు ఉంటుండగా దగ్గు 10–15 రోజులపాటు వేధిస్తోంది. సకాలంలో వైరస్‌ను గుర్తించకపోవడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన నిమోనియాకు కారణమవుతోంది. ఆందోళన అక్కర్లేదు వైరస్లు ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుంటాయి. హెచ్3ఎన్2 వైరస్ కారకాలపై ఆందోళన అవసరం లేదు. ఇది కూడా ఓ సాధారణ ఫ్లూనే. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. జన సమూహంలోకి వెళ్లకపోవడం, విధిగా మాస్క్‌లు ధరించడం, రోగనిరోధకశక్తిని పెంచుకోవడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారినపడకుండా కాపాడుకోవచ్చు. చికిత్సల్లో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడొద్దని ఐసీఎంఆర్ ఇప్పటికే సూచించింది. ఇది సాధారణ మందులతోనే నయమవుతుంది. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి -
సవాలుకు సిద్ధమవుదాం!
గ్రీష్మ ఋతువు ఇంకా మొదలుకానే లేదు. కానీ శిశిరంలోనే, ఇంకా చెప్పాలంటే ఫిబ్రవరిలోనే గ్రీష్మ తాపం మొదలైపోయింది. 1901 నుంచి గత 122 ఏళ్ళలో ఎన్నడూ లేనంతటి సగటు పగటి ఉష్ణో గ్రత (29.54 డిగ్రీలు) ఫిబ్రవరిలో నమోదైంది. నిరుడు మార్చి కూడా ఇలాగే భారత ఉపఖండమంతటా చండ్రనిప్పులు చెరిగింది. దీన్ని బట్టి ఇక ఈ వేసవి ఎలా ఉండనుందో ఇప్పటికే అర్థమైపోయింది. దేశంలో ఇటు వేసవిలో, అటు శీతకాలంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో వాతావరణంపై అధ్యయనం చేసే ‘సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ’ (సీస్టెప్) ఈ సంగతి వెల్లడించింది. ఒక్కమాటలో వాతావరణ సంక్షోభం ఇక ఎప్పుడో నిజమయ్యే జోస్యం కానే కాదు. ఇప్పటికే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వర్షాలతో తరచూ సంభవిస్తున్న సంఘటన. ఈ వేసవిలో భానుప్రతాపం తీవ్రంగా ఉండనుందన్న హెచ్చరికలతో, స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి, ఈ సోమవారం నిపుణులతో సమావేశం జరపడం గమనార్హం. గత రెండు దశాబ్దాల (2000 – 2019) డేటా చూస్తే, కనివిని ఎరుగని ఉష్ణోగ్రతలతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా సగటున 50 లక్షల మంది మరణిస్తున్నారు. ఇది 2021 జూలైలో ప్రచురితమైన ‘ది లాన్సెట్’ అధ్యయనం తేల్చిన మాట. మన దేశంలోనే 7.4 లక్షల మంది చనిపోతున్నారు. దేశంలో వాతావరణ మార్పులతో దుర్మరణాలు 55 శాతం పెరిగాయి. ఇక, కేవలం 30 ఏళ్ళలో (1990 – 2019) వేసవిలో మన కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల నుంచి 0.9 డిగ్రీల మేర పెరిగాయి. దేశంలో నూటికి 54 జిల్లాల్లో చలికాలంలోనూ ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. చర్మాన్ని చీల్చే ఎండతో వ్యవసాయం సహా వాతావరణ ఆధారిత రంగాలు ప్రభావితమై, జీవనోపాధి దెబ్బ తింటోంది. దాదాపు 167.2 బిలియన్ పని గంటలు నష్టం. తక్కువ వర్షపాతం, ఎక్కువ ఉష్ణోగ్రతలతో గోదుమల దిగుబడి 2020–21తో పోలిస్తే 2021–22లో దాదాపు 30 లక్షల టన్నులు పడిపోయింది. రానురానూ భూతాపోన్నతితో పాటు వడగాడ్పులు, పర్యవసానాలూ పెరుగుతాయని వాతావ రణ మార్పులపై అంతర్ ప్రభుత్వ సంఘం ఆరో అంచనా నివేదిక సారాంశం. ఈ నేపథ్యంలోనే ప్రకృతి వైపరీత్యాల ముప్పు తగ్గింపు జాతీయ వేదిక (ఎన్పీడీఆర్ఆర్) సైతం ఈసారి ‘మారుతున్న వాతావరణానికి తగ్గట్టు స్థానిక సంసిద్ధత’ అనే అంశాన్ని చేపట్టింది. రేపు శుక్రవారం జరిగే ఈ 3వ సదస్సును ప్రధానే ప్రారంభిస్తుండడం విశేషం. జోషీమఠ్ లో భూపాతాలు సహా పలు అంశాలపై చర్యల్ని ఇందులో చర్చించనున్నారు. ముంచుకొస్తున్న మార్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం స్వాగత నీయం. వాతావరణ సవాలుపై చర్యలకు ప్రభుత్వనిధుల కేటాయింపు తగ్గిందన్న వార్తలే విషాదం. పసిఫిక్ మహాసముద్రంలో పవనాల సహజ మార్పు వల్ల ఈ ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగి, వాతావరణ ధోరణుల్లో సంక్షోభం తప్పకపోవచ్చని శాస్త్రవేత్తల హెచ్చరిక. ఈ 2023లో ఉష్ణవాతావరణ ధోరణి అయిన ఎల్ నినో మళ్ళీ విరుచుకుపడే ప్రమాదం నూటికి తొంభై పాళ్ళుందట. అదే జరిగితే, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల మేర పెరుగుతాయి. అంటే, ఈ శతాబ్దం చివరికి భూతాపోన్నతిని ఏ స్థాయికి నియంత్రించాలని ప్రపంచ నేతలు అంగీకరించారో ఆ చెలియలికట్టను ఇప్పుడే చేరుకుంటాం. దీనివల్ల 70 – 90 శాతం మేర పగడపు దిబ్బలు కనుమరుగై పోతాయట. ఇవన్నీ యావత్ ప్రపంచానికి, వ్యవసాయ ఆధారిత భారత్‌కు ప్రమాద ఘంటికలు. ఈ అత్యవసర పరిస్థితిని తట్టుకోవాలంటే 2030 కల్లా వర్ధమాన దేశాలు ఏటా 30 వేల కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని ఐరాస అంచనా. ప్రపంచ జనాభాలో 12 శాతమే ఉన్నా, గ్రీన్ హౌస్ వాయువుల్లో 50 శాతానికి బాధ్యులైన ధనిక దేశాలు వర్ధమాన దేశాలకు అండగా నిలవాలి. మన వద్ద మార్చి, మే మధ్య ఉష్ణపవనాలకు తోడు మరో సమస్య రానుంది. వినియోగం బాగా పెరిగే వేసవిలో విద్యుత్ కొరత సహజం. గత అయిదేళ్ళలో దేశంలో సౌర విద్యుదుత్పత్తి 4 రెట్లు పెరిగింది గనక నడిచిపోయింది. అది పగటివేళ వరకు ఓకే. కొత్తగా థర్మల్, హైడ్రోపవర్ సామర్థ్యా లను పెంచుకోనందు వల్ల రాత్రి వేళల్లో కష్టం కానుంది. ఈ వేసవి రాత్రుళ్ళలో గిరాకీ, సరఫరాల మధ్య 1.7 శాతం లోటు రానుంది. ఒక్కమాటలో, ఈ వేసవిలో రాత్రిపూట దేశంలో కరెంట్ కష్టాలు తీవ్రం కానున్నాయి. ఆందోళన పడాల్సింది లేదని ప్రభుత్వాధికారులు పైకి అంటున్నా, త్వరితగతిన థర్మల్, హైడ్రో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోకుంటే ఈ వేసవిలో ప్రజలకు కష్టాలు తప్పవు. ముఖ్యంగా రాత్రింబవళ్ళు నడిచే ఆటో, ఉక్కు, ఎరువుల తయారీ పరిశ్రమలు చిక్కుల్లో పడతాయి. ముందే ఒక అంచనా రావడంతో నగర వ్యూహకర్తల మొదలు గ్రామీణ రైతుల దాకా అందరూ ఇప్పుడిక నష్టనివారణ చర్యలకు దిగాలి. భూ, జల నిర్వహణల్లో తగు మార్పులు చేసుకోవాలి. త్వరిత దిగుబడినిచ్చే కొత్త పంట రకాలపై రైతులకు మార్గదర్శనం చేయాలి. స్థానిక పాలనాయంత్రాంగాలు ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు చేయాలి. నీడనిచ్చే ఉద్యానాలు, నీటి వసతి లాంటి పరిష్కార మార్గాలు చూపాలి. అహ్మదాబాద్‌లో 2010లో గాడ్పులకు 1300కు పైగా మరణించాక, సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళిక ఏటా 1200 మరణాల్ని నివారిస్తున్నట్టు అంచనా. అలాంటివి అంతటా అమలు చేయాలి. ఉష్ణతాపంతో తలెత్తే ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొనేలా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను సమాయత్తం చేయాలి. వాతావరణ సంక్షోభాలు ఇక నిత్యకృత్యం కానున్నందున వీటి దుష్ప్రభావాన్ని దీటుగా ఎదుర్కొనేలా పటిష్ఠమైన విధాన రూపకల్పనే పాలకుల తక్షణ కర్తవ్యం. -
ప్రపంచానికి ఇదొక శుభవార్త.. ఓజోన్ పొర స్వయం చికిత్స
వాషింగ్టన్: వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, తద్వారా ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతున్న ప్రపంచానికి ఇదొక శుభవార్త. భూగోళంపై ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో అత్యంత కీలకమైన ఓజోన్ పొర స్వయం చికిత్స చేసుకుంటోంది. ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం క్రమంగా పూడుకుపోతోంది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడమే ఇందుకు కారణం. ఐక్యరాజ్యసమితికి చెందిన సైంటిఫిక్ అసెస్మెంట్ ప్యానెల్ ఈ విషయాన్ని ఒక నివేదికలో వెల్లడించింది. ప్రతి నాలుగేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తారు. ఓజోన్ పొర పూడుకుపోవడం 2022లో మొదలైందని నివేదికలో తెలిపింది. ఓజోన్ రంధ్రం 2022 సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 13 మధ్య సగటున 23.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి కుంచించుకుపోయింది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు ఇదే క్రమంలో తగ్గిపోతే 2066 నాటికి పూర్తిగా పూడుకుంటుందని పేర్కొన్నారు. మాంట్రియల్ ప్రోటోకాల్ సత్ఫలితాలు ఇస్తున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడినట్లు తొలిసారిగా 1980లో గుర్తించారు. మరో నాలుగు దశాబ్దాల్లో 1980 నాటి స్థాయికి ఓజోన్ పొర చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు నిపుణులు స్పష్టం చేశారు. ఉష్ణోగ్రత 2100 నాటికి 0.3 నుంచి 0.5 డిగ్రీల సెల్సియస్ తగ్గేలా హైడ్రో ఫ్లోరో కార్బన్ల ఉత్పత్తి, వినియోగాన్ని తగ్గించుకోవాలని మాంట్రికల్ ప్రోటోకాల్ నిర్ధేశిస్తోంది. -
80 శాతం గ్లేసియర్లు... 80 ఏళ్లలో మాయం!
వాషింగ్టన్: భూ గోళానికి పెను ముప్పు అనుకున్న దానికంటే ముందుగానే ముంచుకొస్తుందా? హిమానీ నదాలపై తాజా అధ్యయనం ఫలితాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈ శతాబ్దాంతానికి భూమిపై ఉన్న ప్రతి ఐదు హిమానీ నదాల్లో నాలుగు, అంటే ఏకంగా 80 శాతం నామరూపాల్లేకుండా పోతాయని సదరు అధ్యయనం తేల్చింది! గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు బాగా ఫలించినా 2100 కల్లా కనీసం 25 నుంచి 41 శాతం హిమానీ సంపద హరించుకుపోతుందని అంచనా వేసింది. ‘‘సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగే పక్షంలో మధ్య యూరప్, పశ్చిమ కెనడా, అమెరికాల్లోని చిన్నపాటి హిమానీ నదాలు తీవ్ర ప్రభావానికి లోనవుతాయి. 3 డిగ్రీలు పెరిగితే మొత్తానికే మటుమాయమవుతాయి’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన అమెరికాలోని కార్నెగీ మెలన్ వర్సిటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రౌన్స్ చెప్పారు. ‘‘కర్బన ఉద్గారాలకు ఇప్పటికిప్పుడు పూర్తిగా అడ్డుకట్ట వేయగలిగినా పెద్దగా లాభముండదు. ఇప్పటిదాకా వెలువడ్డ ఉద్గారాలు తదితరాలు హిమానీ నదాలపై చూపే దుష్ప్రభావాన్ని అడ్డుకోలేం. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం’’ అన్నారు. -
ప్రమాదకరంగా పైపైకి.. శరవేగంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు
వాతావరణ మార్పులు, తద్వారా నానాటికీ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రపంచాన్ని నానాటికీ ప్రమాదపుటంచులకు నెడుతున్నాయి. వీటి దుష్పరిణామాలను 2022 పొడవునా ప్రపంచమంతా చవిచూసింది. ఆస్ట్రేలియా మొదలుకుని అమెరికా దాకా పలు దేశాల్లో ఒకవైపు కార్చిచ్చులు, మరోవైపు కనీవినీ ఎరగని వరదలు, ఇంకోవైపు తీవ్ర కరువు పరిస్థితులు, భరించలేని వేడి గాలుల వంటివి జనానికి చుక్కలు చూపాయి. ఆర్కిటిక్ బ్లాస్ట్ దెబ్బకు ఇంగ్లండ్‌తో పాటు పలు యూరప్ దేశాలు గత 40 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగనంతటి చలి, మంచు వణికించాయి. ఆ వెంటనే అమెరికాపై విరుచుకుపడ్డ బాంబ్ సైక్లోన్ ‘శతాబ్ది మంచు తుపాను’గా మారి దేశమంతటినీ అతలాకుతలం చేసి వదిలింది. 2023లో కూడా ఇలాంటి కల్లోలాలు, ఉత్పాతాలు తప్పవని పర్యావరణ నిపుణులు ఇప్పటినుంచే హెచ్చరిస్తుండటం మరింత కలవరపెడుతోంది. వీటికి తోడు మరో పెను సమస్య చడీచప్పుడూ లేకుండా ప్రపంచంపైకి వచ్చిపడుతోంది. అదే... సముద్ర మట్టాల్లో అనూహ్య పెరుగుదల! ప్రపంచవ్యాప్తంగా అన్ని తీర ప్రాంతాల్లోనూ ఈ ప్రమాదకర పరిణామం చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్యదరా ప్రాంతంలో సముద్ర మట్టాలు మరీ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న వైనాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచ్చింది. ఇదిప్పుడు పర్యావరణవేత్తలందరినీ కలవరపెడుతోంది! 20 ఏళ్లలో 8 సెంటీమీటర్లు! సముద్ర మట్టాల్లో పెరుగుదల తాలూకు దుష్పరిణామాలు మధ్యదరా తీర ప్రాంతాల్లో కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో ఇటలీలోని అమ్లాఫీ తీరం వద్ద సముద్ర మట్టం స్పెయిన్‌లోని కోస్టా డెల్‌సోల్‌తో పోలిస్తే రెండింతలు పెరిగినట్టు పరిశోధకులు తేల్చారు. ‘‘మధ్యదరా పరిధిలో కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే అడ్రియాటిక్, ఎజియన్, లెవంటైన్ సముద్రాల తీర ప్రాంతాల్లో నీటి మట్టం 20 ఏళ్లలో ఏకంగా 8 సెంటీమీటర్లకు పైగా పెరిగింది. పైగా ఈ పెరుగుదల రేటు ఇటీవలి కాలంలో బాగా వేగం పుంజుకుంటుండటం మరింత ప్రమాదకర పరిణామం’’ అని వారు వెల్లడించారు! తమ అధ్యయనంలో భాగంగా అలలు, ఆటుపోట్ల గణాంకాలతో పాటు మంచు కరిగే రేటుకు సంబంధించి ఉపగ్రహ ఛాయాచిత్రాలు తదితరాలను లోతుగా విశ్లేషించారు. 1989 తర్వాత నుంచీ మధ్యదరా సముద్ర మట్టం శరవేగంగా పెరుగుతోందని తేల్చారు. పరిశోధన ఫలితాలు అడ్వాన్సింగ్ అర్త్ స్పేస్ సైన్సెస్ జర్నల్ తాజాగా ప్రచురితమయ్యాయి. అతి సున్నిత ప్రాంతం నిజానికి మధ్యదరా ప్రాంతం వాతావరణ మార్పులపరంగా ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి. వరదలు, క్రమక్షయం వంటివాటి దెబ్బకు ఇప్పటికే ఈ ప్రాంతంలోని ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఏకంగా 86 శాతం దాకా లుప్తమయ్యే ముప్పును ఎదుర్కొంటున్నాయి. 2022 మొదట్లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలాంటి ప్రమాదకరణ పరిణామాలనే కళ్లకు కట్టింది. మధ్యదరాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా సముద్రమట్టాలు గతంలో భావించిన దానికంటే చాలా వేగంగా పెరుగుతున్నాయన్న చేదు వాస్తవాన్ని వెల్లడించింది. గ్రీన్లాండ్ బేసిన్లో పరుచుకున్న అపారమైన మంచు నిల్వలు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఊహాతీత వేగంతో కరిగిపోతుండటం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. దానివల్ల అపారమైన పరిమాణంలో నీరు సముద్రాల్లోకి వచ్చి చేరుతోందని వివరించింది. అంతేకాదు, గ్రీన్లాండ్ మంచు ఇదే వేగంతో కరగడం కొనసాగితే 2100 కల్లా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ప్రస్తుతం ఊహిస్తున్న దానికంటే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువగా పెరిగిపోతాయని కూడా హెచ్చరించింది. పెను ప్రమాదమే...! సముద్ర మట్టాలు పెరిగితే సంభవించే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు... ► తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి ► చిన్న చిన్న ద్వీప దేశాలు ఆనవాళ్లు కూడా మిగలకుండా సముద్రంలో కలిసిపోతాయి ► షికాగో మొదలుకుని ముంబై దాకా ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో అలరారుతున్న అతి పెద్ద నగరాలు నీట మునుగుతాయి ► వందలాది కోట్ల మంది నిర్వాసితులవుతారు. ► ఇది ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఆర్థిక, సామాజిక సమస్యగా పరిణమిస్తుంది ► సముద్రపు తాకిడి నుంచి ప్రధాన భూభాగాలకు రక్షణ కవచంగా ఉండే చిత్తడి నేలలతో కూడిన మడ అడవులు అంతరిస్తాయి ► వాటిలో నివసించే పలు జీవ జాతులు అంతరించిపోయే ప్రమాదముంది ► నేల క్రమక్షయానికి లోనవుతుంది. సాగు భూమి పరిమాణమూ తగ్గుతుంది ► భారీ వర్షాలు, అతి భారీ తుఫాన్ల వంటివి పరిపాటిగా మారతాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
Roundup 2022: ఒక యుద్ధం.. ఒక హిజాబ్.. ఒక రాణి
ఒక యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని సృష్టిస్తే, ఒక వైరస్ ప్రపంచదేశాల వెన్నులో ఇంకా వణుకు పుట్టిస్తూనే ఉంది. ఒక అమాయకురాలి మరణంతో ఈ హిజాబ్ మాకొద్దు అంటూ ఇరాన్ నవతరం నినదిస్తే, ఒక రాణి మహాభినిష్క్రమణంతో ఇంగ్లండ్‌లో ఒక శకం ముగిసిపోయింది. ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన బ్రిటన్ పాలనా పగ్గాలను ఇప్పుడు భారతీయ మూలాలున్న వ్యక్తి తీసుకోవడం చూస్తే భూమి గుండ్రంగానే ఉంటుందన్న మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోవడం ఒక మైలురాయి అయితే, వాతావరణ మార్పులతో అగ్రరాజ్యాలు కూడా గడ్డ కట్టుకుపోవడం మన కళ్ల ముందే కనిపిస్తున్న కఠిన సత్యం. మొత్తంగా చూస్తే 2022 ప్రపంచదేశాలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను, కొన్ని తీపి గురుతుల్ని మిగిల్చి వెళ్లిపోతోంది. ఒక్కసారి 2022లోకి తొంగిచూస్తే... వార్తల్లో వ్యక్తులు జెలెన్స్కీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ రష్యా దండయాత్రను సమర్థంగా ఎదుర్కొని ఈ ఏడాది హీరోగా మారారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ యుద్ధానికి దిగితే ధైర్య సాహసాలతో ఎదుర్కొన్నారు. వారంలో ముగిసిపోతుందనుకున్న పుతిన్ అంచనాలను పటాపంచలు చేస్తూ ఇంకా కదనరంగంలో పోరాడుతున్నారు. జెలెన్‌స్క్‌లో ఈ పోరాట స్ఫూర్తిని గుర్తించిన టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా కవర్ పేజీ ప్రచురించింది. రిషి సునాక్: ఒకప్పుడు భారత దేశాన్ని దాస్యం శృంఖలాల్లో బంధించి ఏళ్ల తరబడి పరిపాలించిన బ్రిటన్‌కు భారతీయ మూలాలున్న రిషి సునాక్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 42 ఏళ్ల వయసుకే ప్రధాని పీఠమెక్కి బ్రిటన్ చరిత్రలో పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ను గట్టెక్కించడంలో లిజ్ ట్రస్ విఫలం కావడంతో టోరీ ఎంపీల మద్దతుతో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి అల్లుడైన రిషి బ్రిటన్ ప్రధానిగా అక్టోబర్ 25న పదవీ ప్రమాణం చేశారు. ఎలాన్ మస్క్: నిత్యం సమస్యలతో చెలగాటమాడడాన్ని అమితంగా ఇష్టపడే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ ఏడాది వార్తల్లో నిలిచారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ని అక్టోబర్ 27న కొనుగోలు చేశారు. ఆ తర్వాత సంస్థలో ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్క్ వంటి వివాదాలకు తెరలేపారు. చివరికి తాను ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న పోల్ నిర్వహిస్తే 57.5% మంది ఆయన పదవికి రాజీనామా చేయాలని తీర్పునివ్వడం విశేషం. విషాదాలు ► బ్రిటన్ రాణి ఎలిజబెత్ (96) సంపూర్ణ జీవితాన్ని గడిపి అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్ 8న కన్నుమూశారు. 70 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా బ్రిటన్ సింహాసనాన్ని ఏలిన ఆమె మరణంతో బ్రిటన్‌లో ఒక శకం ముగిసిపోయింది. దేశానికి మహరాణి అయినప్పటికీ ఆ అధికారం ఎప్పుడూ ప్రదర్శించకపోవడంతో ఆమె అందరి మన్ననలు పొందారు. ► సోవియెట్ యూనియన్ చిట్టచివరి అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ 91 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఆగస్టు 31న కన్నుమూశారు. సోనియెట్ యూనియన్‌లో ఆర్థిక సంస్కరణలకు తెరతీసి ప్రపంచ గతినే మార్చిన గొప్ప దార్శనికుడు. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నానికి సారథ్యం వహించి ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికారు. అందుకే నోబెల్ శాంతి బహుమానం ఆయనను వరించింది. ► జపాన్ మాజీ ప్రధాని షింజో అబె నరా నగరంలో జూలై 8న డెమొక్రాటిక్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా దారుణ హత్యకు గురయ్యారు. ఒక దుండగుడు అత్యంత సమీపం నుంచి కాల్పలు జరపడంతో తూటాలు నేరుగా ఆయన ఛాతీలోకి వెళ్లడంతో తుది శ్వాస విడిచారు. ఎన్నికలు ► చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ అక్టోబర్ 23న వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్‌లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. చైనాలో ఈ పదవికి ఎన్నికైన వారే అధ్యక్ష పగ్గాలు చేపడతారు. ► బ్రెజిల్లో జరిగిన ఎన్నికల్లో రైట్ వింగ్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరాను ఓడించిన వామపక్ష వాది లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా అక్టోబర్ 30న నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ► ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా జార్జియా మెలోని ఎన్నికయ్యారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత మెలోని అక్టోబర్ 25న దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇటలీలో అతివాద ప్రభుత్వం ఏర్పాటుకావడం విశేషం. ► ఇజ్రాయెల్‌లో మూడేళ్ల రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతూ మరోసారి బెంజిమన్ నెతన్యాహూ ప్రధాని పదవి అందుకున్నారు. సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన రికార్డు నెతన్యాహూపై ఉంది. నవంబర్ 15న ఆయన మళ్లీ ప్రధాని పగ్గాలు చేపట్టారు. ► నేపాల్‌లో అయిదు పార్టీల సంకీర్ణ కూటమి కుప్పకూలిపోవడంతో మాజీ ప్రధాని, సీసీఎస్–మావోయిస్ట్ సెంటర్ పార్టీ చైర్మన్ ప్రచండ ప్రధాని పగ్గాలు చేపట్టారు. సహచర కమ్యూనిస్టు నేత కేపీ శర్మ ఓలి మద్దతుతో డిసెంబర్ 26న ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం కరోనా ప్రభావంతో ఆర్థికంగా దివాలా తీసిన దేశాల్లో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది. 2.2 కోట్ల జనాభా ఉండే దేశంలో ధరాభారాన్ని ప్రజలు మోయలేని స్థితికి వచ్చేశారు. ఆహార పదార్థాలు కూడా అందరికీ సరిపడా పంపిణీ చేయడంలో విఫలం కావడంతో జూలైలో ప్రజలు భారీగా నిరసనలు చేపట్టారు. జులై 9న ఆందోళనకారులు గొటబయ రాజపక్స అధికారిక నివాసాన్ని ముట్టడించడంతో ఆయన దేశం విడిచివెళ్లిపోయే దుస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రణిల్ విక్రమ్‌సింఘె అధ్యక్ష పదవి చేపట్టినప్పటికీ శ్రీలంక ఇంకా అప్పులకుప్పగానే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు ► అఫ్గానిస్తాన్‌లో జూన్ 21నసంభవించిన భారీ భూకంపంలో వెయ్యి మందికిపైగా మరణించారు. ► జూన్‌లో పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తాయి. కొద్ది నెలల పాటు జనం నానా అవస్తలు పడ్డారు. అక్టోబర్ నాటికి పాకిస్తాన్లో వరద నష్టం 14.9 బిలియన్ డాలర్లుగా వరల్డ్ బ్యాంకు అంచనా వేసింది. ► ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు ఈజిప్టులో షర్మ్ఎల్–షేక్‌లో నవంబర్ 6 నుంచి 18 వరకు జరిగింది. పర్యావరణ విపత్తులతో నష్టపోయే పేద, వర్ధమాన దేశాలను ఆదుకోవడానికి పరిహార నిధిని ఏర్పాటు చేయడానికి సంపన్న దేశాలు అంగీకరించాయి. ► వాతావరణ మార్పులు ఈ ఏడాది అన్ని దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వేసవికాలంలో వడగాడ్పులతో పశ్చిమాది దేశాలు అల్లాడిపోతే ఇప్పుడు ఆర్కిటిక్ బ్లాస్ట్‌తో అమెరికా గడ్డకట్టుకుపోతోంది. మంచు తుపానుకు లక్షలాది మంది అంధకారంలో మగ్గిపోతూ ఇబ్బందులు పడుతున్నారు. అవీ ఇవీ ► అమెరికాలో మారిలాండ్లో బాల్టిమోర్‌లో వైద్యులు ఈ ఏడాది జనవరి 12న పంది గుండెని మనిషికి అమర్చే శస్త్రచికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే రెండు నెలలు తిరక్కుండానే మార్చి 9న ఆ వ్యక్తి మరణించడం విషాదం ► గర్భవిచ్ఛిత్తిపై అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అబార్షన్‌ను నిషేధం విధిస్తూ 1973లో రియో వెర్సస్ వేడ్ తీర్పుని జూన్ 24న తోసిపుచ్చింది. దీంతో అమెరికాలో మహిళలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ► బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణంతో ఆమె పెద్ద కుమారుడు చార్లెస్–3 రాజ సింహాసనాన్ని అధిష్టించారు. సెప్టెంబర్ 17న ఆయన గద్దెనెక్కి తల్లి అంతిమ సంస్కారం సహా అన్నీ దగ్గరుండి నిర్వహించారు. ► ప్రపంచ జనాభా మరో మైలు రాయి చేరుకుంది. మొత్తం జనాభా 800 కోట్లను దాటేసింది. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో నవంబర్ 15న జన్మించిన చిన్నారితో ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కు దాటినట్టుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది . ► కోవిడ్–19 ఈ ఏడాదితో ముగిసిపోతుందని అందరూ భావించినప్పటికీ చివరికొచ్చేసరికి చైనాలో తీవ్ర రూపం దాల్చింది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఎఫ్7తో రోజుకి 10 లక్షలకుపైగా కేసుల నమోదవుతున్నాయని, రోజుకి అయిదు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నట్టుగా ఒక అంచనా. పుతిన్ యుద్ధోన్మాదం ఉరుములేని పిడుగులా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న యుద్ధాన్ని ప్రకటించడంతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. నాటో కూటమిలో చేరడానికి ఉక్రెయిన్ చేస్తున్న సన్నాహాలను తీవ్రంగా వ్యతిరేకించిన పుతిన్ రాత్రికి రాత్రికి బాంబు దాడులు చేశారు. పశ్చిమ దేశాల అండతో ఉక్రెయిన్ రష్యా సేనల్ని సమర్థంగా ఎదుర్కొంటూ ఉండడంతో పది నెలలు గడుస్తున్నా ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఆర్థికంగా విచ్ఛిన్నం చేస్తే, పులి మీద పుట్రలా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని సృష్టించింది. ఈ యుద్ధంలో సాధారణ పౌరులే 10 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారని అంచనాలున్నాయి. ఉక్రెయిన్ నుంచి ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని ఏకంగా 78 లక్షల మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలతో చమురుకు కొరత ఏర్పడి ఎన్నో దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ధరల పెరుగుదల, ఆహారం కొరత , సరఫరాలో అడ్డంకులు వంటివాటితో ప్రపంచమే స్తంభించిపోయినట్టయింది. రష్యా వైఖరిని నిరసిస్తూ ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ మానవ హక్కుల మండలి నుంచి రష్యాని సస్పెండ్ చేసింది. ఇరాన్లో మహిళల విజయగీతిక హిజాబ్ సరిగా ధరించని నేరానికి మహసా అమిన్ అనే 22 ఏళ్ల యువతిని నైతిక పోలీసులు సెప్టెంబర్ 13న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు సెప్టెంబర్ 16న లాకప్‌లో ఆమె మరణించడంతో ఇరాన్లో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. 1979లో మత ఛాందసవాడులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి సవాళ్లు ప్రభుత్వం ఎదుర్కోలేదు. దేశవ్యాప్తంగా యువతీ యువకులు ఏకమై రోడ్లపై హిజాబ్‌లను తగులబెట్టిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికలో నిలిచాయి. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 18 వేల మందిని అరెస్ట్ చేశారు. అయినా నిరసనలు ఆగకపోవడంతో ప్రభుత్వం దిగి వచ్చి మోరల్ పోలీసు వ్యవస్థని రద్దు చేయడం ఆ దేశ ప్రజలు సాధించిన అతి పెద్ద విజయం. అయితే హిజాబ్‌ను రద్దు చేయాలంటూ 100 రోజులైనా ఇంకా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
G20 Summit: నిర్ణయాత్మకంగా జీ20 ఎజెండా
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచంలో శక్తివంతమైన జీ–20(గ్రూప్–20) అధ్యక్ష బాధ్యతలను భారత్ గురువారం లాంఛనంగా చేపట్టింది. ఏడాది పాటు ఈ బాధ్యతలను నిర్వర్తించనుంది. జీ–20 అధినేతగా భారతదేశ లక్ష్యాలను వివరిస్తూ ప్రధాని మోదీ తాజాగా పత్రికలు, వెబ్సైట్లో ఒక ఆర్టికల్(వ్యాసం) విడుదల చేశారు. పలు ట్వీట్లు చేశారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ స్ఫూర్తితో ప్రపంచదేశాలను ఏకం చేసేందుకు కృషి చేస్తామని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి వంటివి నేడు మానవళికి అతిపెద్ద సవాళ్లుగా మారాయని, అందరం కలిసికట్టుగా వాటిని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ప్రపంచంలో కొన్ని దేశాల కంఠశోషను ఎవరూ వినిపించుకోవడం లేదని ఆక్షేపించారు. జీ–20 దేశాలతోపాటు.. నిర్లక్ష్యానికి గురైన దేశాలను కూడా కలుపుకొని ముందుకెళ్తామని, అందరితో చర్చించి, తమ జీ–20 ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటామని వివరించారు. పాత ఆలోచనా ధోరణికి స్వస్తి ‘మానవ కేంద్రీకృత ప్రపంచీకరణ’కు సంబంధించిన ఒక కొత్త నమూనా కోసం ప్రపంచ దేశాల ప్రజలంతా చేతులు కలిపి, ఉమ్మడిగా కృషి చేయాలని సూచించారు. ప్రపంచ దేశాల నడుమ ఆహారం, ఎరువులు, ఔషధ ఉత్పత్తుల సరఫరాను రాజకీయ కోణంలో చూడొద్దని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో మొత్తం మానవళికి మేలు కలిగేలా మన ఆలోచనా విధానం(మైండ్‌సైట్) మార్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కొరతకు, సంఘర్షణలకు కారణమయ్యే పాత ఆలోచనా ధోరణికి స్వస్తి పలకాలని చెప్పారు. కలిసికట్టుగా ఉంటూ, సవాళ్లను ఎదిరించడానికి గాను మన ఆధ్యాత్మిక సంప్రదాయాల నుంచి స్ఫూర్తిని పొందడానికి ఇదే సరైన సమయమని వివరించారు. మనకు యుద్ధం అక్కర్లేదు మొత్తం మానవ జాతికి కనీస అవసరాలను తీర్చగలిగే ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురాగల మార్గాలు ప్రపంచంలో ఉన్నాయని, మనుగడ కోసం ఒకరిపై ఒకరు పోరాటం చేయాల్సిన అవసరం లేదని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రస్తుతం మనకు యుద్ధం ఎంతమాత్రం అవసరం లేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాల భద్రమైన జీవితాల కోసం సామూహిక జనన హనన ఆయుధాల నిర్మూలన దిశగా శక్తివంతమైన దేశాల నడుమ చర్చలకు చొరవ చూపుతామని వెల్లడించారు. ప్రపంచ శాంతి, రక్షణ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు. భారత్‌తో కలిసి నడుస్తాం: అమెరికా జీ–20 కూటమి అధ్యక్ష హోదాలో ఉన్న భారత్‌కు మద్దతు ఇవ్వడానికి, కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. ఆహారం, ఇంధన భద్రత వంటి పెనుసవాళ్లను పరిష్కరించే విషయంలో భారత్‌తో కలిసి నడవాలని అమెరికా నిర్ణయించకున్నట్లు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కెరైన్ జీన్–పియర్రీ చెప్పారు. జీ–20 దేశాల అధినేత శిఖరాగ్ర సదస్సు 2023 సెప్టెంబర్ 9, 10న ఇండియా రాజధాని ఢిల్లీలో జరుగనుంది. -
‘ప్రపంచ దేశాలన్నీ సహకరించుకోకపోతే వినాశనమే’
షెర్మ్–ఎల్–షేక్: ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోకపోతే వినాశనం తప్పదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ హెచ్చరించారు. నరక కూపం దిశగా ప్రపంచ పయనం సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులను నియంత్రించకపోతే ఊహించని ఉత్పాతాలు తప్పవని పేర్కొన్నారు. కాలుష్య ఉద్గారాల విషయంలో అతిపెద్ద దేశాలైన చైనా, అమెరికా ఇకనైనా కళ్లు తెరవాలని, రాబోయే దుష్పరిణామాలను నివారించడానికి కలిసికట్టుగా పనిచేయాలని హితవు పలికారు. ఈజిప్ట్‌లోని షెర్మ్–ఎల్–షేక్‌లో సోమవారం కాప్–27 సదస్సులో వివిధ దేశాల నేతలు, ప్రతినిధులను ఉద్దేశించి గుటేరస్ ప్రసంగించారు. భూతాపం ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయని, కరువులు, వరదలు మానవాళికి పెనుసవాళ్లు విసురుతున్నాయని గుర్తుచేశారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకొనేలా ధనిక, పేద దేశాలు ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పారు. ధనిక దేశాలు 2030 నాటికి, ఇతర దేశాలకు 2040 నాటికి బొగ్గు వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని గుటేరస్ కోరారు. మనకున్న సమయం పరిమితం వాతావరణ మార్పులకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్–సిసీ ఉద్ఘాటించారు. మనం జోక్యం చేసుకోకపోతే వాతావరణ మార్పులు ఎప్పటికీ ఆగవని అన్నారు. సమయం పరిమితంగానే ఉందని, ప్రతి సెకెన్ కాలాన్ని వాడుకోవాలని సూచించారు. యుద్ధాన్ని ఆపాలని రష్యా, ఉక్రెయిన్‌కు విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పుల వల్ల నష్టపోతున్న పేద దేశాలకు ధనిక దేశాలకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని నైజీరియా పర్యావరణశాఖ మంత్రి మొహమ్మద్ అబ్దుల్లాహీ కోరారు. ఇందుకోసం క్లైమేట్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. -
COP27: భూమాత రక్షణకు భుజం కలిపి...
షెర్మ్–ఎల్–షేక్(ఈజిప్ట్): ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న వాతావరణ మార్పులు, ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, ఆహారం, ఇంధన కొరత వంటి ప్రతికూల పరిణామాల నడుమ భాగస్వామ్యపక్షాల సదస్సు (కాప్–27) ఆదివారం ప్రారంభమయ్యింది. ఈజిప్ట్‌లోని ఎర్ర సముద్ర తీరప్రాంత నగరం షెర్మ్–ఎల్–షేక్ ఇందుకు వేదికగా మారింది. ప్రపంచదేశాల నుంచి వందలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు. వాతావరణ మార్పులు, దుష్పరిణామాలు, నియంత్రణ చర్యలు, గత ఒప్పందాల అమలు తీరుపై రెండు రోజులపాటు విస్తృతంగా చర్చించనున్నారు. కాప్–27లో భాగంగా ఈ నెల 7, 8న జరిగే సమావేశాలకు పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. వాతావరణ మార్పుల నియంత్రణే లక్ష్యంగా గతంలో కాప్ సదస్సులు జరిగాయి. అయితే, ఆశించిన లక్ష్యాలేవీ నెరవేరలేదు. అగ్రదేశాల సహాయ నిరాకరణే ఇందుకు కారణం. తాజా సదస్సులో ఏం తేలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. తరానికి ఒకసారి వచ్చే అవకాశం వాతావరణ మార్పులు భూగోళంపై సమస్త జీవజాలానికి విసురుతున్న పెను సవాళ్లపై ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’ చైర్మన్ హోయిసంగ్ లీ ఆందోళన వ్యక్తం చేశారు. కాప్–27లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. భూతాపాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు సన్నద్ధం కావాలని, హరితగృహ(గ్రీన్ హౌజ్) వాయువుల ఉద్గారాన్ని తక్షణమే తగ్గించుకోవాలని పిలునిచ్చారు. మన జీవితాలను, మన భూగ్రహాన్ని కాపాడుకొనేందుకు తరానికి ఒకసారి వచ్చే అవకాశం ఇదేనని చెప్పారు. ఇంకెన్ని హెచ్చరికలు కావాలి? గత ఏడాది గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో ప్రపంచదేశాలు చెప్పుకోదగ్గ పురోగతి సాధించాయని కాప్–26 అధ్యక్షుడు, బ్రిటిష్ రాజకీయవేత్త అలోక్ శర్మ తెలిపారు. కర్బన ఉద్గారాల నియంత్రణపై మరిన్ని లక్ష్యాలను ఏర్పర్చుకోవడం, 2015 పారిస్ ఒప్పందంలోని నిబంధనలను ఖరారు చేయడం, బొగ్గు వినియోగాన్ని దశలవారీగా తగ్గించుకోవడం వంటివి ఈ లక్ష్యాల్లో ఉన్నాయని తెలిపారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు (2.7 ఫారన్‌హీట్) పరిమితం చేయాలన్న ఆశయాన్ని కొనసాగించాలని కోరారు. పారిస్ ఒప్పందంలో ఇదే అత్యంత కీలక లక్ష్యమని గుర్తుచేశారు. ఉష్ణోగ్రత పెరుగుదలను కచ్చితంగా నియంత్రించాలని, దీన్ని పారిశ్రామిక విప్లపం నాటికంటే ముందున్న ఉష్ణోగ్రతకు తీసుకురావాలన్నారు. అయితే, ఈ దిశగా సాగుతున్న ప్రయత్నాలకు కొన్ని బడా దేశాలు తూట్లు పొడుస్తున్నాయని అలోక్ శర్మ తీవ్రంగా ఆక్షేపించారు. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ దండయాత్ర వల్ల అంతర్జాతీయంగా సంక్షోభాలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు. పలు దేశాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని వాపోయారు. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ అంశాలపై దృష్టి పెట్టేలా సామర్థ్యం పెంచుకోవాలన్నారు. మాటలు కట్టిబెట్టి కార్యాచరణలోకి దిగాలన్నారు. ప్రపంచ దేశాల అధినేతలకు ప్రపంచ నుంచి ఇంకా ఎన్ని మేల్కొల్పులు, హెచ్చరికలు అవసరం? అని అలోక్ శర్మ ప్రశ్నించారు. సదస్సులో యూఎన్ క్లైమేట్ చీఫ్ సైమన్ స్టియిల్ మాట్లాడారు. పారిస్ ఒప్పందంలోని లక్ష్యాలను సాధించడానికి అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నామని ఆతిథ్య దేశమైన ఈజిప్ట్ విదేశాంగ మంత్రి సమేహ్ షౌక్రీ చెప్పారు. కాప్–27 అధ్యక్షుడిగా షౌక్రీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ప్రతిజ్ఞల దశ నుంచి క్షేత్రస్థాయిలో కార్యాచరణ దిశగా ముందుకెళ్లాలని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిస్సీ పిలుపునిచ్చారు. జిన్‌పింగ్, నరేంద్ర మోదీ లేకుండానా? కాప్–27 సదస్సులో 120కి పైగా దేశాల నేతలు, ప్రతినిధులు పాల్గొంటారని ఈజిప్ట్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరు కానున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కర్బన ఉద్గారాల విషయంలో పెద్ద దేశాలైన చైనా, భారత్ అధినేతలు లేకుండా కాప్–27 సదస్సులో కుదిరే ఒప్పందాలపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కాప్ సదస్సు వేదిక వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన మానవ హక్కుల సంస్థల ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలకు దిగిన వారిని అరెస్టు చేశారని న్యూయార్క్‌కు చెందిన ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ ఆరోపించింది. నిరసనకారులపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరింది. -
Egypt COP27: పర్యావరణ ప్రతినలు... లక్ష్యానికి ఆమడ దూరం
భూమి నానాటికీ వేడుక్కుతోంది. ఒకవైపు తీవ్ర కరువు. మరోవైపు పలు దేశాల్లో కనీవినీ ఎరగని వరదలు సృష్టిస్తున్న పెను బీభత్సం. ఇలాంటి ఉత్పతాలన్నింటికీ కారణం పర్యావరణ మార్పులు. ఇది రానురానూ తీవ్ర రూపు దాలుస్తూ మానవాళిని వణికిస్తోంది. ఎవరేం చెప్పినా, దేశాలు ఎన్ని చేసినా సమస్య నానాటికీ ముదురుతోందే తప్ప పరిస్థితిలో మెరుగుదల మాత్రం కన్పించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం నానాటికీ విషతుల్యంగా మారుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ పర్యావరణానికి ముప్పు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై సదస్సు (కాప్–27) ఆదివారం ఈజిప్టులో మొదలవుతోంది. 12 రోజుల పాటు జరిగే ఈ సదస్సులోనైనా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశగా గట్టి ముందడుగు పడుతుందేమో చూడాలి... కాగితాల్లోనే ఒప్పందాలు గతేడాది స్కాట్లండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కాప్–26లో దేశాలన్నీ మేధోమథనం చేసి గట్టి తీర్మానాలతో పర్యావరణ ఒప్పందమైతే ఆమోదించాయి. దీన్నో పెద్ద సానుకూల చర్యగా ప్రపంచమంతా కొనియాడింది. ఎందుకంటే శిలాజ ఇంధనాల వల్ల పర్యావరణానికి కలుగుతున్న తీవ్ర హానిని అంతర్జాతీయంగా తొలిసారిగా అధికారికంగా గుర్తించింది గ్లాస్గో సదస్సులోనే. వాటి వాడకాన్ని వీలైనంతగా తగ్గిస్తూ క్రమంగా పూర్తిగా నిలిపేయాలని దేశాలన్నింటికీ సదస్సు పిలుపునిచ్చింది. కానీ ఏడాది గడిచినా ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకం నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గకపోవడం శోచనీయం. పులిమీద పుట్రలా యుద్ధం... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు పరిస్థితి మరింతగా దిగజారింది. రష్యా నుంచి సహజవాయు సరఫరాలు భారీగా తగ్గిపోవడంతో యూరప్ సహా పలు దేశాలు మరో దారి లేక శిలాజ ఇంధనాల వాడకాన్ని పెంచేశాయి. అందులోనూ అత్యంత కాలుష్యకారకమైన బొగ్గు వాడకం విపరీతంగా పెరిగిపోతున్న వైనం కలవరపెడుతోంది. 2022లో బొగ్గు వాడకం 2013లో నమోదైన ఆల్‌టైం రికార్డును చేరడం ఖాయమని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) జోస్యం చెబుతోంది. ఒక్క యూరోపియన్ యూనియన్లోనే బొగ్గు డిమాండ్ కనీసం 6.5 శాతం పెరుగుతుందని అంచనా. మొత్తమ్మీద 2030 కల్లా అంతర్జాతీయ బొగ్గు వినియోగం 2021తోపోలిస్తే 8.7 శాతానికి మించి తగ్గకపోవచ్చంటున్నారు. ఈ లెక్కన 2050 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలన్న లక్ష్యం చేరడం అసాధ్యమే. అది జరగాలంటే 2030 నాటికి బొగ్గు వాడకం ఏకంగా 35 శాతం తగ్గాల్సి ఉంటుంది! గతేడాది సదస్సులో వర్ధమాన దేశాలన్నింటినీ బొగ్గు తదితర శిలాజ ఇంధనాలకు గుడ్‌బై చెప్పాలని కోరిన సంపన్న దేశాలే ఇప్పుడు ఆ దేశాలను మించి వాటిని వాడుతుండటం విషాదం. ఈ ధోరణికి వెంటనే అడ్డుకట్ట పడకుంటే 2100 నాటికి భూగోళం ఏకంగా మరో 2.6 డిగ్రీల మేరకు వేడెక్కుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపోన్నతిని 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న గ్లాస్గో ఒప్పందం అమలుకు సదస్సు ఏ చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరం. భద్రతా వలయంలో రిసార్టు పర్యావరణ కార్యకర్తల నిరసనల భయాల నడుమ సీఓపీ27కు వేదిక కానున్న సినాయ్ ద్వీపకల్పంలోని షర్మెల్ షేక్‌లోని రిసార్టు వద్ద ఈజిప్టు ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. కోరల్ రీఫ్‌లు, అత్యంత అందమైన సముద్ర తీరాలకు ఈ రిసార్టు నిలయం. స్థానికంగా టూరిజంలో పనిచేసే వాళ్లలో చాలామందిని తాత్కాలికంగా ఇళ్లకు పంపారు. మిగతా వారికి ప్రత్యేకమైన గుర్తింపు కార్డులిచ్చారు. సెలవులు గడిపేందుకు వస్తున్న టూరిస్టులను కూడా అడ్డుకుంటున్నారు. గతేడాది గ్లాస్గోలో సదస్సు జరిగిన వీధిలోకి ఏకంగా లక్షలమంది దూసుకొచ్చి నిరసనలకు దిగారు. కాప్ సదస్సు 1995 నుంచి ఏటా జరుగుతోంది. ఆర్థిక, సాంకేతిక సాయాలకు పట్టుబట్టనున్న భారత్ వాతావరణ మార్పులు, తద్వారా వస్తున్న విపత్తులను అరికట్టేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సాయాన్ని సంపన్న దేశాలు భారీగా పెంచాలని సదస్సులో భారత్ డిమాండ్ చేసే అవకాశం కన్పిస్తోంది. మన ప్రతినిధి బృందానికి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వం వహిస్తారు. మొత్తం 198 దేశాలు సదస్సులో పాల్గొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు 100 మందికి పైగా దేశాధినేతలు హాజరవనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడంపై స్పష్టత లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Virus spillover: తర్వాతి వైరస్ మహమ్మారి రాక...హిమానీ నదాల నుంచే!
లండన్: వాతావరణ మార్పులు ప్రపంచమంతటా కనీవినీ ఎరగని ఉత్పాతాలకు దారి తీస్తున్న వైనం కళ్లముందే కన్పిస్తోంది. కొన్ని దేశాల్లో కరువు, మరికొన్ని దేశాల్లో ఎన్నడూ చూడనంతటి వరద విల యం సృష్టిస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు, వాతావరణ మార్పుల దుష్ప్రభావం మరో తీవ్ర ప్రమాదానికి కూడా దారితీసే ఆస్కారం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి సగటు ఉష్ణోగ్రత స్థాయి శరవేగంగా పెరుగుతుండటంతో హిమాలయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీ నదాలన్నీ అంతే వేగంగా కరిగిపోతుండటం తెలిసిందే. ‘‘ఈ హిమానీ నదాల గర్భంలో బహుశా మనకిప్పటివరకూ తెలియని వైరస్‌లెన్నో దాగున్నాయి. హిమానీ నదాల కరుగుదల వేగం ఇలాగే కొనసాగితే భూమిపై విరుచుకుపడబోయే తర్వాతి వైరస్ మహమ్మారి వచ్చేది గబ్బిలాల నుంచో, పక్షుల నుంచో కాక.. నదాల గర్భం నుంచే అది పుట్టుకురావచ్చు’’ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలా వచ్చే వైరస్లు వన్యప్రాణులకు, అక్కణ్నుంచి మనుషుల్లో ప్రబలుతాయని అంచనా వేస్తున్నారు. దీన్ని వైరస్ స్పిలోవర్గా పిలుస్తున్నారు. ఇందుకోసం ఆర్కిటిక్‌లోని మంచినీటి సరస్సు లేక్ హాజెన్ తాలూకు మన్ను, మడ్డి తదితరాలను శాస్త్రవేత్తల బృందం విశ్లేషించింది. అవశేషాల తాలూకు ఆర్ఎన్ఏ, డీఎన్ఏ నమూనాలను వైరస్‌లతో జతపరిచి చూశారు. హిమానీ నదీ గర్భాలు బయటికి తేలే పక్షంలో, అక్కడి కళేబరాల నుంచి తెలియని తరహా వైరస్లు వచ్చి పడే ప్రమాదముందని తేల్చారు. అధ్యయన ఫలితాలను రాయల్ సొసైటీ జర్నల్‌లో ప్రచురించారు. -
పర్యావరణానికి ‘లైఫ్’
కెవాడియా: వాతావరణ మార్పుల కారణంగా విధ్వంసకరమైన పరిణామాల నుంచి మన భూమండలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా భారత్ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ కార్యాచరణ రూపు దిద్దుకుంది. ప్రధాని మోదీ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ సంయుక్తంగా మిషన్ లైఫ్(లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్)ను ప్రారంభించారు. ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, దీనిని ప్రపంచ దేశాల ప్రజల్లోకి ఒక ఉద్యమంలా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర గురువారం లైఫ్ మిషన్‌ను ప్రారంభించారు. ప్రజలు లైఫ్ స్టైల్లో మార్చుకోవాల్సిన జాబితాతో పాటు లైఫ్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ మిషన్ పీ3 మోడల్ అని ప్రో ప్లేనెట్, పీపుల్‌గా వ్యాఖ్యానించారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్’ విధానాన్ని అందరూ అనుసరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రజలు చేయాల్సిందిదే..! ప్రతీ రోజూ ఒక వ్యక్తి జిమ్‌కి వెళ్లడానికి పెట్రోల్‌తో నడిచే బైక్, కారు వంటి వాహనాన్ని వాడే బదులుగా సైకిల్‌పై వెళ్లడం మంచిదన్నారు. ఎల్ఈడీ బల్బులు వాడితే విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రధాని హితవు పలికారు. ఇలాంటివన్నీ ప్రజలందరూ మూకుమ్మడిగా పాటిస్తే ప్రపంచ దేశ ప్రజలందరి మధ్య ఐక్యత పెరుగుతుందని మోదీ చెప్పారు. ప్రకృతి వనరుల్ని అతిగా వాడొద్దు : గుటెరస్ ప్రకృతి వనరుల్ని అతిగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. జీ–20 దేశాలు 80 శాతం గ్రీన్ హౌస్ వాయువుల్ని విడుదల చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని గుటెరస్ గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రతీ ఒక్కరి అవసరాలు తీర్చే వనరులు ఈ భూమిపై ఉన్నాయి. కానీ అందరి అత్యాశలను నెరవేర్చే శక్తి భూమికి లేదు. దురదృష్టవశాత్తూ ఇవాళ రేపు ప్రతీ ఒక్కరూ అత్యాశకి పోతున్నారు. దానిని మనం మార్చాలి’’ అని కొన్ని దశాబ్దాల కిందటే గాంధీజీ చెప్పారని ఇప్పటికీ అది అనుసరణీయమని వ్యాఖ్యానించారు. భారత్ తీసుకువచ్చిన ఈ కార్యాచరణని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. -
Climate Transparency Report 2022: భారత్‌ను దెబ్బతీసిన వాతావరణ మార్పులు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులు మన దేశాన్ని ఆర్థికంగా కూడా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. 2021లో వడగాడ్పులకి భారత్‌కి 15,900 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని క్లైమేట్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్–2022 వెల్లడించింది. పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న కొన్ని అంతర్జాతీయ సంస్థలు కలసికట్టుగా ఈ నివేదిక రూపొందించాయి. వ్యవసాయం, నిర్మాణం, తయారీ, సేవా రంగాల్లో ఈ నష్టం వాటిల్లింది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 5.4% నష్టం జరిగినట్టు ఆ నివేదిక వివరించింది. ఆ నివేదికలో ఏముందంటే..! ► మండే ఎండలతో గత ఏడాది దేశంలో 16,700 పని గంటలు వృథా అయ్యాయి. 1990–1999తో పోల్చి చూస్తే 39% పెరిగింది. ► 2016–2021 మధ్య కాలంలో తుపానులు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 3.6 కోట్ల హెక్టార్లలో పంటలకి నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు 375 కోట్ల డాలర్లు నష్టపోయారు. ► దేశంలో 30 ఏళ్లలో వర్షాలు పడే తీరులో ఎన్నో మార్పులు వచ్చాయి. వ్యవసాయం, అటవీ, మత్స్య ఆర్థిక ప్రభావాన్ని కనబరిచింది. ► 1850–1900 మధ్య కాలంతో పోల్చి చూస్తే భూ ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి ► వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలతో పాటు భారత్‌పై రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిలువ నీడ లేని వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ► వాతావరణ మార్పులతో జరుగుతున్న నష్టాన్ని అరికట్టాలంటే ప్రపంచ దేశాలు భూ ఉష్ణోగ్రతల్ని 2 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గించడానికి కృషి చేయాలి. 2015 పారిస్ ఒప్పందాన్ని అన్ని దేశాలు వినియోగించడమే దీనికి మార్గం. ► పర్యావరణ మార్పుల్ని కట్టడి చేయాలంటే మనం వాడుతున్న ఇంధనాలను మార్చేసి, పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్‌లో ఎర్త్ సైన్సెస్, క్లైమేట్ చేంజ్ డైరెక్టర్ సురుచి భద్వాల్ పేర్కొన్నారు. -
సముద్రాల గుండె చప్పుడు విందాం!
వాషింగ్టన్: వాతావరణ మార్పులు.. భూగోళంపై మానవళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించాయి. ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లోని మంచు వేగంగా కరిగిపోతోంది. ఫలితంగా సముద్రాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. తీర ప్రాంతాల్లో ముంపు భయం వెంటాడుతోంది. వీటన్నింటికి మానవుల అత్యాశే కారణమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సముద్రాల గుండె ఘోష వినేందుకు ఐర్లాండ్‌కు చెందిన కళాకారిణి సియోభాన్ మెక్‌డొనాల్డ్ నడుం బిగించారు. సముద్రాల అడుగు భాగంలో సంభవించే భూకంపాలు, విరిగిపడే కొండ చరియలు, జీవజాలం మనుగడ, కాలుష్యం, కరిగిపోతున్న మంచు గురించి సమగ్రంగా తెలుసుకొనేందుకు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సముద్రం వివిధ ప్రాంతాల్లో మైక్రోఫోన్లు(హైడ్రోఫోన్స్) జార విడుస్తున్నారు. ఇందుకోసం గ్రీన్‌ల్యాండ్, కెనడా మధ్య ఉన్న డెవిస్ అఖాతాన్ని ఎంచుకున్నారు. ఇప్పటిదాకా 12 మైక్రోఫోన్లను జారవిడిచారు. ఈ ప్రయోగానికి అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది. ఈ ప్రయోగం ఒక టైమ్ క్యాప్సూల్ మైక్రోఫోన్లు రెండేళ్లపాటు సముద్రంలోనే ఉంటాయి. 2024లో బయటకు తీస్తారు. ఇవి ప్రతి గంటకోసారి సముద్ర అడుగు భాగంలోని శబ్దాలను స్పష్టంగా రికార్డు చేస్తాయి. ఈ శబ్దాలన్నింటిని కలిపి ఒక ఆడియోను రూపొందిస్తారు. ఇది ‘సముద్ర జ్ఞాపకం’గా మెక్‌డొనాల్డ్ అభివర్ణించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ విపత్తుల విషయంలో ఇదే మొట్టమొదటి సైన్స్, ఆర్ట్స్ ఉమ్మడి ప్రయోగమని చెబుతున్నారు. సముద్రాల గుండె చప్పుడు వినడం ద్వారా భూమిపై సమీప భవష్యత్తులో సంభవించే విపరిణామాలను ముందే అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రయోగం ఒక టైమ్ క్యాప్సూల్ లాంటిదేనని మెక్‌డొనాల్డ్ అన్నారు. పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ తనను ఈ ప్రయత్నానికి పురికొల్పిందని చెప్పారు. గ్రీన్‌ల్యాండ్‌లో పెద్ద ఎత్తున మంచు పేరుకొని ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు శిలాజ ఇంధనాల వాడకం ఆపేసినా సరే గ్రీన్‌ల్యాండ్‌లో 110 క్వాడ్రిలియన్ టన్నుల మంచు కరిగిపోయి సముద్ర మట్టం 27 సెంటీమీటర్లు(10.6 అంగుళాలు) పెరుగుతుందని అంచనా. -
IPCC: వాతావరణ మార్పులతో దేశాలన్నీ అతలాకుతలం
వాతావరణ మార్పులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. దీని ప్రభావంతో వచ్చిపడుతున్న అకాల వరదలు, కరువులతో దేశాలకు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అపార ఆస్తి, ప్రాణ నష్టాలతో అల్లాడుతున్నాయి.æ అతి తీవ్ర వాతావరణ పరిస్థితులు తరచూ తలెత్తుతాయని, వాటి తీవ్రత కూడా గతం కంటే అత్యంత ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ మార్పుల ప్యానల్ (ఐపీసీసీ) వేసిన అంచనాలు నూటికి నూరు శాతం నిజమవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ► వారాంతపు వరదలతో ఆస్ట్రేలియా అల్లాడింది. దేశంలో చాలాచోట్ల ఇంకా కుండపోత కొనసాగుతూనే ఉంది. మరికొన్ని రోజుల పాటు అతి తీవ్ర వర్షాలు తప్పవంటూ వాతావరణ విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ► మధ్య ఆఫ్రికా దేశమైన చాద్ రిపబ్లిక్‌ది విచిత్ర పరిస్థితి. నిన్నామొన్నటిదాకా దుర్భరమైన కరువుతో దేశమంతా అల్లాడిపోయింది. ఇప్పుడేమో గత 30 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ► థాయ్‌లాండ్‌ను కూడా నెల రోజులుగా భారీ వరదలు ఊపిరి సలపనివ్వడం లేదు. 77 రాష్ట్రాలకు గాను ఏకంగా 59 రాష్ట్రాలు వరద బారిన పడ్డాయి. 4.5 లక్షల ఇళ్లు దెబ్బ తినడమో కూలిపోవడమో జరిగింది. 40 శాతం ప్రాంతాలు ఇంకా మునకలోనే ఉన్నాయి. తాజాగా సోమవారం 8 దక్షిణాది రాష్ట్రాలకు భారీ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి! ► ఫిలిప్పీన్స్దీ ఇదే పరిస్థితి. తుఫాను కారణంగా వర్షాలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి. ► భారీ వరదలతో మెక్సికో తీరం అల్లాడుతోంది. ► భారత్‌లోనూ తుఫాన్ల దెబ్బకు ఢిల్లీ, బెంగళూరు అల్లాడిపోయాయి. హైదరాబాద్‌నైతే కొన్ని వారాలుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కారణాలెన్నో...! గ్లోబల్ వార్మింగ్ మొదలుకుని మితిమీరిపోయిన శిలాజ ఇంధన వాడకం దాకా తాజా వాతావరణ మార్పులకు కారణాలెన్నో! ప్రధాన కాలుష్య కారణమైన కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలకు 90 శాతం దాకా శిలాజ ఇంధనమే కారణమవుతోంది. అడవుల విచ్చలవిడి నరికివేత, అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న పెట్రో ఉత్పత్తుల వెలికితీత వంటివి కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు మరో పదేళ్లలో భూమి సగటు ఉష్ణోగ్రత ఏకంగా 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగితే ఆశ్చర్యం లేదని ఐపీసీసీ సర్వే హెచ్చరించింది! ‘‘ఇప్పటికైతే వాతావరణ మార్పులు అకాల వర్షాలకు, భారీ వరదలకు కారణంగా మారుతున్నాయి. వర్షపాతపు తీరుతెన్నులను కూడా అవి చాలావరకు మార్చేస్తున్నాయి’’ అని వివరించింది. నైజీరియాలో వరదలు.. 600కు చేరిన మరణాలు అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో ఈ సీజన్లో ఆగస్ట్ నుంచి సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా 603 మంది మృతి చెందారు. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలకు గాను 33 రాష్ట్రాల్లో వరదలతో అతలాకుతలమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ESG: పెట్టుబడి.. పదికాలాలు పచ్చగా!
అసలు పెట్టుబడి ఉద్దేశం రాబడే కదా..? ఈ రాబడి కాంక్షే ఇన్వెస్టర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తుంటుంది. కానీ, నేడు భూ మండలం వాతావరణ మార్పులు అనే పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వనరుల వినియోగం గరిష్ట స్థాయికి చేరి, కాలుష్యం అసాధారణ స్థాయికి చేరిపోయిన తరుణంలో.. పర్యావరణంపై మమకారంతో పుట్టుకొచ్చిందే ఈఎస్జీ (ఎన్విరాన్మెంట్, సోషల్, గవర్నెన్స్) విధానం. తాము పెట్టుబడి కోసం ఎంపిక చేసుకుంటున్న కంపెనీ.. పర్యావరణాన్ని ఏ రకంగా చూస్తోందన్నది ఇన్వెస్టర్‌కు కీలకం అవుతుంది. అంటే పర్యావరణానికి తన ఉత్పత్తులు, తయారీ, సేవల ద్వారా హాని కలిగించకూడదు. తన ఉద్యోగులు, భాగస్వాములతో ఎలా వ్యవహరిస్తుందన్నది ‘సోషల్’. ఇక కంపెనీ నిర్వహణ తీరుకు అద్దం పట్టేదే గవర్నెన్స్. ఈ మూడింటిలో పాస్ మార్కులు పొందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే ఈఎస్జీ ఇన్వెస్టింగ్. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో పాపులర్ అవుతున్న ఈ విధానం పట్ల రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఆకర్షితులవుతున్నారు. అయితే, ఇందులో కొన్ని పరిమితులు ఉన్నాయి. దేశీయంగా ఇంకా పూర్తి స్థాయిలో పరిణతి చెందలేదు. కనుక ఈఎస్జీ థీమ్ పట్ల ఆసక్తితో ఉన్న ఇన్వెస్టర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో సమగ్రంగా వివరించే కథనమిది... ప్రపంచవ్యాప్తంగా ఈఎస్జీ పెట్టుబడులు 2020 నాటికే 35 ట్రిలియన్ డాలర్లు (రూ. 2800 లక్షల కోట్లు) దాటాయంటే దీని ప్రాధాన్యం ఏ మేరకో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ తరహా పర్యావరణ అనుకూల పెట్టుబడి విధానం కొత్తదేమీ కాదు. కాకపోతే దీని రూపం మారింది. గ్రీన్ ఇన్వెస్టింగ్, సామాజిక బాధ్యతా పెట్టుబడి విధానం, సుస్థిర పెట్టుబడి అన్నవి ఈఎస్జీని పోలినవే. ఈ తరహా పెట్టుబడులన్నింటినీ ఏకం చేసింది ఈఎస్జీ. ఇప్పుడు ఈఎస్జీ అనుకూలం. ఈఎస్జీ వ్యతిరేకం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కంపెనీలను చూస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ప్రత్యేకంగా ఈఎస్జీ ఫండ్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. పెట్టుబడులు భిన్నం.. కంపెనీలు ఏ స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయనే దానికంటే.. ఏ విధంగా లాభాలను పొందుతున్నాయన్నది ఈఎస్జీ విధానంలో కీలకం. పర్యావరణానికి హాని తలపెట్టకుండా, వీలైతే మేలు చేస్తూ, చక్కని లాభాలను పోగేస్తున్న కంపెనీలకు ఈ విధానంలో మంచి డిమాండ్ ఉంటుంది. కేవలం గత రెండు సంవత్సరాల్లోనే సుమారు 32 బిలియన్ డాలర్లు (రూ.2.56 లక్షల కోట్లు) ఈఎస్జీ ఆధారిత యూఎస్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులుగా వెళ్లాయి. ముందే చెప్పుకున్నట్టు ఈ పెట్టుబడికి సామాజిక స్పృహ ఎక్కువ. కనుక రాబడుల విషయంలో కొంత రాజీ పడక తప్పదు. ఎంఎస్సీఐ వరల్డ్ ఈఎస్జీ ఇండెక్స్ రాబడులను పరిశీలిస్తే.. గత 10 ఏళ్లలో రెట్టింపైంది. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన సార్వత్రిక నిబంధనలు, ప్రమాణాలు ఈఎస్‌జీకి లేవు. అలాగే ఏకీకృత నిర్వచనం, విధానం కూడా లేవు. అసలు ఈఎస్జీ పేరుతో మూలసూత్రాలకు విరుద్ధంగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని ఈఎస్జీ ఈక్విటీ ఫండ్స్.. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తర్వాత చమురు ధరల పెరుగుదలతో షెల్, రెప్సోల్ కంపెనీల్లో పెట్టుబడులు పెంచుకున్నాయి. కాగా, పెట్టుబడులపై భవిష్యత్తులో మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫండ్స్ మేనేజర్ల పెట్టుబడుల విధానాలకు, ఈఎస్జీ సూత్రాలు ఏ విధంగా సరిపోలుతున్నాయో వెల్లడించేలా త్వరలో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ మార్గదర్శకాలను అమల్లోకి తీసుకురానుంది. అలాగే, సెబీ సైతం ఫండ్స్ ఈఎస్జీ పథకాలకు సంబంధించి వెల్లడించాల్సిన సమాచారం విషయమై విస్తృతమైన సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేయడం గమనించదగిన అంశం. కొంచెం జాగ్రత్త అవసరం.. ఈఎస్జీ స్టాక్స్‌కు మార్కెట్ కొంచెం ప్రీమియం వ్యాల్యూషన్ ఇస్తుంటుంది. దీంతో కొన్ని కంపెనీలు ఈఎస్జీ థీమ్‌ను దుర్వినియోగం చేస్తున్నాయి. తమ ఉత్పత్తులు పర్యావరణం అనుకూలమని తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తరహా ధోరణలను అరికట్టేందుకు నూతన పర్యావరణ నిబంధనలను కేంద్రం అమల్లోకి తీసుకురానుంది. దీని కింద కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కాలుష్య విడుదలకు సంబంధించి మరింత సమాచారం, వివరాలను వెల్లడించాలి. ఈఎస్జీ రేటింగ్ కోసం థర్డ్ పార్టీ సంస్థలపైనే కంపెనీలు ఆధారపడాల్సి వస్తోంది. సార్వత్రిక బెంచ్ మార్క్ లేదా పద్ధతి అనేది ఈఎస్జీ రేటింగ్‌లకు అమల్లో లేదు. కేంద్ర నూతన నిబంధనలు, సెబీ సంప్రదింపుల పత్రం తర్వాత విడు దల చేసే మార్గదర్శకాలతో ఈఎస్జీ థీమ్ మరింత పటిష్టం కానుంది. పెట్టుబడులకు ముందు ఆయా అంశాలపై అవగాహన అవసరం. ఈఎస్జీ స్కోర్ ఎలా? ఎన్విరాన్మెంట్ కంపెనీ కార్యకలాపాలు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలు? గతంలో ఇలాంటి లక్ష్యాలను ఏ మేరకు సాధించింది? ఏ మేరకు ఇంధనాన్ని వినియోగిస్తోంది? పునరుత్పాదక ఇంధన వనరులను ఏర్పాటు చేసుకుందా? నీటి వినియోగం, కాలుష్యం విడుదల, వ్యర్థాల నిర్వహణ ఇలాంటి అంశాలన్నీ ఈఎస్జీ స్కోర్‌కు ముందు థర్డ్ పార్టీ సంస్థలు చూస్తాయి. సోషల్ ఉద్యోగులతో కంపెనీకి ఉన్న అనుబంధం, వారి భద్రతకు, ఆరోగ్యానికి తీసుకున్న చర్యలు, సమాజంతో ఉన్న సంబంధాలు, భాగస్వాములతో సంబంధాలను అధ్యయనం చేస్తారు. భాగస్వాములు, ఉద్యోగులు అందరినీ ఏకరీతిన చూసేందుకు వీలుగా కంపెనీలు అమలు చేస్తున్న విధానాలు, పద్ధతులను పరిశీలించడం జరుగుతుంది. నాణ్యత, సైబర్ సెక్యూరిటీ, డేటా భద్రత చర్యలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. గవర్నెన్స్ కంపెనీ బోర్డు నిర్మాణం ఎలా ఉంది? నిపుణులు, మహిళలకు చోటు కల్పించారా? బోర్డు కమిటీల ఏర్పాటు, బోర్డు పనితీరు, అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలు, స్టాట్యుటరీ ఆడిటర్లు, ఆడిట్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్‌ను కూడా పరిశీలిస్తారు. దేశీయంగా... ఇంకా ఆరంభ దశలోనే దేశీయంగా ఈఎస్జీ థీమ్ ఇంకా ఆరంభ దశలోనే ఉందని చెప్పుకోవచ్చు. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా ఈఎస్జీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం రిస్క్‌తో కూడుకున్నదే. ఎందుకంటే ఇది లోతైన అంశం. విస్తృత సమాచారాన్ని అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఎస్ఈఎస్ (స్టేక్ హోల్డర్స్ ఎంపవర్మెంట్ సర్వీసెస్) తదితర కొన్ని ఉచిత వేదికలు ఈఎస్జీ కంపెనీలకు సంబంధించి ర్యాంకులను ప్రకటిస్తున్నాయి. ఇతర సంస్థల నుంచి ఈఎస్జీ కంపెనీల వివరాలు పొందాలంటే కొంత చెల్లించుకోవాల్సి వస్తుంది. నేరుగా కంటే మ్యూచువల్ ఫండ్స్ రూట్ నయం. ప్రస్తుతం 10 వరకు ఈఎస్జీ ఆధారిత థీమాటిక్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎనిమిది పథకాలు గత రెండేళ్లలో ప్రారంభమైనవే ఉన్నాయి. రెండు పథకాలు ప్యాసివ్‌గా (ఇండెక్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసేవి) పనిచేస్తున్నాయి. ఒక పథకం దీర్ఘకాలం నుంచి ఉన్నా కానీ, ఆరంభంలో ఈఎస్జీ పథకంగా లేదు. దీర్ఘకాలంలో వ్యాపార పరంగా నిలదొక్కుకోగలవా? ఈఎస్‌జీలో ఏ అంశాల పరంగా కంపెనీ మెరుగ్గా ఉంది? వాటిని ఇక ముందూ కొనసాగించగలదా? భవిష్యత్తు వృద్ధి అవకాశాలు ఇలాంటి అంశాలను సాధారణ ఇన్వెస్టర్ కంటే మ్యూచువల్ ఫండ్స్ పరిశోధన బృందాలు మెరుగ్గా అంచనా వేయగలవు. ఇక ఈఎస్‌జీలో రెండు అంశాల్లో టిక్ మార్క్‌లు పడినా ఆయా కంపెనీలను సైతం ఫండ్స్ ఎంపిక చేసుకుంటున్నాయి. ఎందుకంటే పర్యావరణం, సోషల్, గవర్నెన్స్ మూడింటిలోనూ సరితూగే కంపెనీలు కొన్నే ఉంటున్నాయి. అలాంటప్పుడు అదనపు పెట్టుబడుల సర్దుబాటుకు వీలుగా రెండు అంశాల్లో మెరుగైన పనితీరు చూపిస్తున్న వాటిని కూడా ఫండ్స్ ఎంపిక చేసుకుంటున్నాయి. 2022 అక్టోబర్ 1 నుంచి బిజినెస్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ సస్టెయిన్‌బిలిటీ రిపోర్ట్ (బీఆర్ఎస్ఆర్)ను విడుదల చేసే కంపెనీల్లోనే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే నిర్వహిస్తున్న పెట్టుబడులకు 2023 సెప్టెంబర్ 30 వరకు సెబీ వెసులుబాటు కల్పించింది. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్‌లో (పీఎంఎస్) ఎస్బీఐ ఈఎస్జీ పోర్ట్‌ఫోలియో, అవెండస్ ఈఎస్జీ ఫండ్స్ పీఎంఎస్, వైట్ ఓక్ ఇండియా పయనీర్స్ ఈక్విటీ ఈఎస్జీ తదితర సంస్థల సేవలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలంలోనే రాబడులు..? ఈఎస్జీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల కంటే నిఫ్టీ 100 ఈఎస్జీ ఇండెక్స్ పనితీరే కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. గత పదేళ్ల కాలంలో వార్షికంగా 15.25 శాతం కాంపౌండెడ్ రాబడిని ఈ సూచీ ఇచ్చింది. నిఫ్టీ 100 రాబడి కంటే ఇది ఒక శాతం ఎక్కువ. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ రాబడులు మిశ్రమంగా ఉన్నాయి. ఏడాది కాలంలో రాబడులు మైనస్ 9 శాతం నుంచి ప్లస్ 27 శాతం మధ్య ఉన్నాయి. కానీ, మూడేళ్ల కాలంలో మాత్రం సానుకూల పనితీరు చూపించాయి. ఏడు పథకాలు ఏడాది కాలంలో నష్టాలను ఇవ్వడం గమనించాలి. సెక్టోరల్ ఫండ్స్.. ఫార్మా (12 శాతం డౌన్), ఐటీ (15 శాతం డౌన్) కంటే ఈఎస్జీ ఫండ్స్ కాస్త నయమనే చెప్పుకోవాలి. మార్కెట్లో ఒక్కో సైకిల్లో కొన్ని రంగాల షేర్లు ర్యాలీ చేయడం, కొన్ని ప్రతికూల రాబడులను ఇవ్వడం సాధారణంగా ఉండే పరిణామమే. ఈఎస్జీ పథకాలు రాబడులను ఇవ్వాలంటే పెట్టుబడులకు తగినంత వ్యవధి ఇవ్వాలన్నది మర్చిపోవద్దు. పోర్ట్‌ఫోలియో భిన్నమేమీ కాదు.. ఈఎస్జీ థీమ్ పట్ల ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లు ముందుగా ఈఎస్జీ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోను పరిశీలించడం, అధ్యయనం చేయడం ద్వారా కొన్ని అంశాలను అయినా తెలుసుకునే వీలుంటుంది. ఈఎస్జీ ప్యారామీటర్లకు తూగే దేశీ స్టాక్స్ 200 వరకు, ఇంటర్నేషనల్ స్టాక్స్ 40 వరకు ఉంటాయి. ఇవన్నీ థీమ్యాటిక్ ఫండ్స్ కిందకు వస్తాయి. కనుక మొత్తం పెట్టుబడుల్లో 80 శాతాన్ని ఈఎస్జీ కంపెనీల్లోనే అవి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతం కూడా ఈఎస్జీ థీమ్‌కు పూర్తి వ్యతిరేకంగా ఉండకూడదని సెబీ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పోర్ట్‌ఫోలియోల్లో కనిపించే స్టాక్సే ఈఎస్జీ పథకాల్లోనూ కనిపించడం ఆశ్చర్యమేమీ కాదు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ), ఐటీ రంగ కంపెనీలు ఎక్కువ శాతం ఈఎస్జీ పథకాల్లో ప్రముఖంగా ఉన్నాయి. ఇవి పర్యావరణానికి హాని చేయకపోవడం, ప్రజల జీవనాన్ని సౌకర్యవంతం, మెరుగు చేయడం కోసం పనిచేస్తుంటాయి. కనుక వీటికి ఎక్కువ పథకాలు ఓటేస్తున్నాయి. 80 శాతం ఈఎస్జీ పథకాల్లో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ ప్రముఖ స్టాక్స్‌గా ఉన్నాయి. దాదాపు అన్ని ఈఎస్జీ పథకాల్లోనూ టాప్–10 హోల్డింగ్స్‌లో 4 నుంచి 9 వరకు అవే కంపెనీలు దర్శనమిస్తాయి. పీఎంఎస్, ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో సాధారణంగా కనిపించే ఇతర స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌యూఎల్ ఉన్నాయి. -
Human Development Index: మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి
ఐక్యరాజ్యసమితి: కరోనా మహమ్మారి విసిరిన పంజాతో విలవిలలాడిన ప్రపంచ దేశాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కుదేలైపోయాయి. రెండేళ్ల పాటు విజృంభించిన ఈ వైరస్‌తో మానవాభివృద్ధి అయిదేళ్లు వెనక్కి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. ప్రజల సగటు ఆయుర్దాయం, విద్యా స్థాయి, జీవన ప్రమాణాల ఆధారంగా తయారు చేసే మానవాభివృద్ధి సూచిలో ప్రపంచదేశాలు వరసగా రెండేళ్లు 2020, 2021లో వెనక్కి పయనిస్తున్నట్టుగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) వెల్లడించింది. ‘‘అనిశ్చిత సమయాలు, అస్థిరమైన జీవితాలు’’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం ‘‘ప్రజలు ఆయుష్షు తగ్గిపోతుంది, ఉన్నత స్థాయి విద్యలు అభ్యసించలేరు, ఆదాయాలు పడిపోతాయి. గతంలో ఎన్నో సంక్షోభాలు చూసి ఇప్పుడున్న పరిస్థితులు గట్టి ఎదురుదెబ్బ’’ అని యూఎన్డీపీ చీఫ్ అచిమ్ స్టెనియర్ తెలిపారు. 32 ఏళ్లలో ప్రపంచ దేశాల్లో మానవాభివృద్ధి క్షీణించడం ఇదే మొదటిసారి. కోవిడ్–19తో మొదలైన మానవాభివృద్ధి తిరోగమనం, వివిధ దేశాల్లో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో పాటు వాతావరణ మార్పులు కూడా ప్రపంచ దేశాలను కోలుకోనివ్వకుండా చేశాయని ఆ నివేదిక వెల్లడించింది. కరోనాతో పాటు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రభావంతో చాలా దేశాలు కోలుకోవడం లేదని ఆ నివేదిక వివరించింది. తక్కువ కార్బన్ వినియోగం, అసమానతల కట్టడి , సుస్థిరత సాధించడం ద్వారా ప్రపంచ దేశాలు తిరిగి మానవాభివృద్ధిలో ముందుకు వెళ్లవచ్చునని నివేదిక రచయిత పెడ్రో కాన్సీకావో అభిప్రాయపడ్డారు. పునరుత్పాదక ఇంధనం, భవిష్యత్‌లో వచ్చే వ్యాధుల్ని ఎదుర్కొనే సన్నద్ధత, భవిష్యత్ సంక్షోభాల నుంచి బయటపడే సామర్థ్యం పెంపు వంటివి చేస్తే మానవాభివృద్ధి సూచి మెరుగుపడుతుందని తెలిపారు. 132వ స్థానంలో భారత్ 2021 సంవత్సరానికి గాను మానవాభివృద్ధి సూచిలో మొత్తం 191 దేశాలకు గాను భారత్ 132వ స్థానంలో నిలిచింది. భారత మానవాభివృద్ధి విలువ 0.633గా నిలిచింది. అంటే మన దేశంలో మానవాభివృద్ధి మధ్యస్తంగా ఉందని చెప్పొచ్చు. 2020 సంవత్సరంలో 0.645గా ఉన్న విలువ ఏడాదిలో కాస్త తగ్గింది. అదే ఏడాది 189 దేశాలకు గాను ఇండియా ర్యాంక్ 131 ఉండేది. ఇక భారత్‌లో సగటు ఆయుర్దాయం 69.7 ఏళ్ల నుంచి 67.2 ఏళ్లకి తగ్గింది. 2019తో పోల్చి చూస్తే మన దేశ మానవాభివృద్ధిలో అసమానలు తగ్గుముఖం పట్టాయని అదొక శుభపరిణామమని భారత్‌లో యూఎన్డీపీ ప్రతినిధి షోకో నోడా చెప్పారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తే పురుషుల, మహిళల అభివృద్ధిలో ఉన్న తేడా చాలా వేగంగా తొలగిపోతోందని తెలిపారు. -
మహా విపత్తుకు ముందస్తు సూచికే.. అడ్డుకోకపోతే వినాశనమే!
వాతావరణ మార్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. హిమాలయాల్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. పాకిస్తాన్లో వరద బీభత్సం, చైనాలో కరువు కాటకాలు, భారత్‌లో కనీవినీ ఎరుగని వాతావరణ మార్పులు... వీటన్నింటికీ అదే కారణమని భారతీయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చోటా షిగ్రి హిమానీ నదాన్ని వారు కొన్నేళ్లుగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఈ ఏడాది రికార్డు స్థాయిలో మంచు కరిగిపోయినట్టు వెల్లడైంది. గత జూన్‌లో ఏర్పాటు చేసిన డిశ్చార్జ్ మెజరింగ్ వ్యవస్థ ఆగస్టుకల్లా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఇండోర్ ఐఐటీ గ్లేసియాలజిస్ట్ మహమ్మద్ ఫరూక్ ఆజం చెప్పారు. ‘‘గత మార్చి, ఏప్రిల్‌లో మన దేశంలో ఉష్ణోగ్రతలు 100 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టాయి. హిమానీ నదాలు కరిగిపోవడమే అందుకు కారణం. గత వారం మా బృందమంతా షిగ్రి దగ్గరే ఉండి పరీక్షించాం. మంచు భారీగా కరిగిపోతోంది’’ అంటూ ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘అరేబియా సముద్రంలో అత్యధిక వేడిమి కారణంగా నీరంతా ఆవిరి మేఘాలుగా మారి ఎడతెరిపి లేకుండా వానలు కురిసి లానినో ప్రభావం ఏర్పడింది. దాంతో వాతావరణమే విపత్తుగా మారి పాక్‌ను అతలాకుతలం చేస్తోంది’’ అన్నది శాస్త్రవేత్తల వివరణ. హిమాలయాలు కరిగిపోతే...? గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు హిమాలయాల్లో మంచు గత నాలుగు దశాబ్దాల్లో కరిగిన దాని కంటే 2000–2016 మధ్య ఏకంగా 10 రెట్లు ఎక్కువగా కరిగిపోయింది! దక్షిణాసియా దేశాలకు ఇది పెను ప్రమాద హెచ్చరికేనంటున్నారు. కారకోరం, హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 55 వేల హిమానీ నదాలున్నాయి. హిమాలయ నదులైన గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర 8 దేశాల్లో 130 కోట్ల మంది మంచినీటి అవసరాలు తీరుస్తున్నాయి. 5,77,000 చదరపు కిలోమీటర్లలో వ్యవసాయ భూములకు నీరందిస్తున్నాయి. 26,432 మెగావాట్ల సామర్థ్యం ఉన్న హైడ్రోపవర్ స్టేషన్లున్నాయి. హిమాలయాల్లో మంచు కరిగిపోతే వీటన్నింటిపైనా ప్రభావం పడటమే గాక 2050 నాటికి దక్షిణాసియా దేశాల్లో 170 కోట్ల మందికి నీటికి కటకట తప్పదని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. దేశాల మధ్య నీటి కోసం యుద్ధాలూ జరగవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో పాకిస్తాన్ వాటా కేవలం 1 శాతమే. కానీ వాతావరణ మార్పులు ఇప్పుడు ఆ దేశాన్ని బలి తీసుకుంటున్నాయి. చైనాలో కరువు సంక్షోభం ► 17 ప్రావిన్స్‌లలో వరసగా 70 రోజుల పాటు ఎండలు దంచిగొట్టాయి. వడగాడ్పులకి 90 కోట్ల మంది అవస్థలు పడ్డారు ► చైనాలో ఏకంగా సగ భాగంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి ► చైనాలో అతి పెద్ద నది యాంగ్జె ఎండిపోయిన పరిస్థితి వచ్చింది. 1865 తర్వాత ఈ నది నీటిమట్టం బాగా తగ్గిపోవడం మళ్లీ ఇప్పుడే. ► చైనాలోని దక్షిణ ప్రావిన్స్‌లైన హుబై, జియాంగ్జీ, అన్‌హుయాయ్, సిచుయాన్‌లలో నీళ్లు లేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడుతున్నాయి ► చైనాలో జల విద్యుత్‌లో 30శాతం సిచుయాన్ ప్రావిన్స్ నుంచే వస్తుంది. ఈ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి సగానికి సగం తగ్గిపోయింది ► చైనాలో కరువు పరిస్థితులు 25 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపిస్తే, 22 లక్షలకు పైగా హెక్టార్లలో వ్యవసాయ భూమి ఎండిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తోన్న వాతావరణ మార్పులు
-
ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?
సముద్ర గర్భంలో ఓ అతి పెద్ద అగ్నిపర్వతం బద్దలైతే? అది పెను వాతావరణ మార్పులకు దారి తీస్తే? ఫలితంగా మానవాళి చాలావరకు తుడిచిపెట్టుకుపోతే? ఏదో హాలీవుడ్ సినిమా సన్నివేశంలా అన్పిస్తోందా? కానీ ఇలాంటి ప్రమాదమొకటి కచ్చితంగా పొంచి ఉందట. అదీ ఈ శతాబ్దాంతంలోపు! ఇలాంటి ఉత్పాతాల వల్లే గతంలో మహా మహా నాగరికతలే తుడిచిపెట్టుకుపోయాయట. ఇప్పుడు అలాంటి ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ జరగడం లేదంటూ వోల్కెనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శతాబ్దాంతం లోపు సముద్ర గర్భంలో కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో అగ్నిపర్వత పేలుడు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ జనాభాలో సగానికి పైగా నశించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత జనవరి 14న దక్షిణ పసిఫిక్ మహాసముద్ర అంతర్భాగంలో హంగా టోంగా హంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జపాన్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలను భారీ సునామీ ముంచెత్తింది. ఇది ఆయా ప్రాంతాల్లో అపార ఆర్థిక నష్టం కలిగించింది. అంతకు 10 నుంచి ఏకంగా 100 రెట్ల తీవ్రతతో అలాంటి ప్రమాదమే మరికొన్నేళ్లలోనే మనపైకి విరుచుకుపడవచ్చని డెన్మార్క్‌లోని కోపెన్హెగన్లో ఉన్న నీల్స్ బోర్ ఇన్స్టిట్యూట్ బృందం హెచ్చరిస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లోని మంచు నిల్వలపై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. ‘మాగ్నిట్యూడ్ 7’ తీవ్రతతో విరుచుకుపడే ఆ ఉత్పాతాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదని బర్మింగ్హం యూనివర్సిటీలో వోల్కెనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జిస్టు మైకేల్ కసిడీ అంటుండటం ఆందోళన కలిగించే విషయం. హంగా టోంగా హంగా అగ్నిపర్వత పేలుడును పలు అంతరిక్ష ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రించాయి. ‘‘దాని తాలూకు బూడిద వాతావరణంలో వేలాది అడుగుల ఎత్తుకు ఎగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి కూడా ఇది స్పష్టంగా కన్పించింది’’ అని నాసా పేర్కొంది. ‘‘ఆస్టిరాయిడ్లు ఢీకొనడం వంటి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని తప్పించే కార్యక్రమాలపై నాసా వంటి అంతరిక్ష సంస్థలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. కానీ తోకచుక్కలు, ఆస్టిరాయిడ్లు ఢీకొనే ముప్పుతో పోలిస్తే భారీ అగ్నిపర్వత పేలుడు ప్రమాదానికే వందలాది రెట్లు ఎక్కువగా ఆస్కారముందన్నది చేదు నిజం. అయినా ఇలాంటి వినాశనం తాలూకు ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమమూ లేకపోవడం విచారకరం’’ అంటూ కసిడీ వాపోయారు. అప్పట్లో అపార నష్టం ‘7 మాగ్నిట్యూడ్’తో చివరిసారిగా 1815లో ఇండొనేసియాలోని తంబోరాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. పేలుడు ఫలితంగా అప్పట్లో వాతావరణంలోకి ఎగసిన బూడిద పరిమాణం ఎంత భారీగా ఉందంటే 1815ను ఇప్పటికీ వేసవి లేని ఏడాదిగా చెప్పుకుంటారు. దాని దెబ్బకు భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గింది. ఆ ఫలితంగా సంభవించిన వాతావరణ మార్పుల దెబ్బకు ఆ ఏడాది చైనా, యూరప్, ఉత్తర అమెరికాల్లో ఒకవైపు భారీగా పంట నష్టం జరిగింది. మరోవైపు భారత్, రష్యా తదితర ఆసియా దేశాలను భారీ వరదలు ముంచెత్తాయి. 1815తో పోలిస్తే నేటి ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతోందని గుర్తుంచుకోవాలని కసిడీ అంటున్నారు. ‘‘ఇప్పుడు గనక అలాంటి ఉత్పాతం జరిగితే లెక్కలేనంత మంది చనిపోవడమే గాక అంతర్జాతీయ వర్తక మార్గాలన్నీ చాలాకాలం పాటు మూతబడవచ్చు. దాంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలు, మరికొన్నిచోట్ల వరదల వంటివి తలెత్తుతాయి’’ అని హెచ్చరించారు. ‘‘సముద్ర గర్భంలో ఎన్ని వందలు, వేల అగ్నిపర్వతాలు నిద్రాణంగా ఉన్నదీ మనకు తెలియదు. ధ్రువాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడికి సముద్ర గర్భంలో ఏదో ఓ నిద్రాణ అగ్నిపర్వతం అతి త్వరలో ఒళ్లు విరుచుకోవచ్చు. కనీవినీ ఎరగని రీతిలో బద్దలు కావచ్చు. అది జనవరి 14 నాటి పేలుడును తలదన్నేలా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటినుంచే సన్నద్ధమైతే మంచిదని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వాతావరణ మార్పుల బిల్లుపై బైడెన్ సంతకం
వాషింగ్టన్: వాతావరణ మార్పులు, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో ఇది చట్టరూపం దాల్చినట్లే. కొత్త బిల్లు ప్రకారంఅమెరికాలో వాతావరణ మార్పుల వల్ల తలెత్తే దుష్పరిణామాలను నివారించడానికి వచ్చే పదేళ్లలో 375 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తారు. వాతావరణ మార్పులపై జరుగుతున్న యుద్ధంలో ఇది అతిపెద్ద పెట్టుబడి అని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్య సంరక్షణకు కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించనున్నారు. అర్హులకు రాయితీతో ఆరోగ్య బీమా, ఔషధాలు అందిస్తారు. తాము ఎల్లప్పుడూ అమెరికా ప్రజల వెంటే ఉంటామని, ఇతర ప్రయోజనాలు తమకు ముఖ్యం కాదని ఈ సందర్భంగా బైడెన్ వ్యాఖ్యానించారు. కొత్త బిల్లుకు అమెరికా పార్లమెంట్ గత వారమే ఆమోదం తెలిపింది. -
Europe Drought 2022: జాడలేని వాన చినుకు.. అల్లాడిపోతున్న యూరప్
బ్రిటన్‌లో థేమ్స్ నది ఎండిపోతోంది. ఫ్రాన్స్‌లో ఎండ వేడిమికి కార్చిచ్చులు ఎగసిపడుతున్నాయి. నదుల్లో నీళ్లు లేక చచ్చిపోయిన చేపలు గుట్టలుగుట్టలుగా పడుతున్నాయి. స్పెయిన్‌లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. మొత్తంగా యూరప్‌లో సగభాగాన్ని కరువు కమ్మేస్తోంది. లండన్: వాతావరణంలో మార్పుల ప్రభావం యూరప్‌ను అల్లాడిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ తదితర దేశాల్లో కరువు ముంచుకొస్తోంది. పశ్చిమ, మధ్య, దక్షిణ యూరప్‌లో రెండు నెలలుగా వాన చినుకు జాడ కూడా లేదు! దాంతో యూరప్‌లోని సగం ప్రాంతాల్లో కరువు పడగ విప్పింది. యూరోపియన్ యూనియన్‌లో 46% ప్రాంతాల్లో ప్రమాదకంగా కరువు పరిస్థితులున్నాయి. వాటిలో 11% ప్రాంతాల్లోనైతే అతి తీవ్ర కరువు నెలకొంది! దక్షిణ ఇంగ్లండ్‌లో థేమ్స్ నదిలో ఏకంగా 356 కి.మీ. మేర ఇసుక మేటలు వేసింది. నది జన్మస్థానం వద్ద వానలు కురవకపోవడం, ఎగువ నుంచి నీళ్లు రాకపోవడంతో ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది! ఫ్రాన్స్‌లోని టిల్లె నదిలో సెకనుకు సగటున 2,100 గాలన్లు నీరు ప్రవహించే చోట్ల కూడా ఇప్పుడు చుక్క నీరు కనిపించడం లేదు. దక్షిణ, మధ్య, తూర్పు ఇంగ్లండ్‌లో ఏకంగా 8 ప్రాంతాలను కరువు ప్రభావితమైనవిగా బ్రిటన్ ప్రకటించింది. 1935 తర్వాత ఇలాంటి పరిస్థితులు రావడం ఇదే తొలిసారి! ఇంగ్లండ్‌లో కొద్ది వారాలుగా ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ పైగానమోదవుతున్నాయి. ఈ ఏడాది జూలై అత్యంత పొడి మాసంగా రికార్డులకెక్కింది. ఇవే పరిస్థితులు తూర్పు ఆఫ్రికా, మెక్సికోల్లో కనబడుతున్నాయి. 500 ఏళ్లకోసారి మాత్రమే ఇంతటి కరువు పరిస్థితులను చూస్తామని నిపుణులు చెబుతున్నారు. నదులు ఎండిపోతూ ఉండడంతో జల విద్యుత్కేంద్రాలు మూతపడుతున్నాయి. 2018లో కూడా కరువు పరిస్థితులు వచ్చినా ఇంత టి పరిస్థితులను ఎదుర్కోలేదని అధ్యయనవేత్లలు అంటున్నారు. అక్టోబర్ దాకా ఇవే పరిస్థితులు కొనసాగుతాయన్న అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులు తీవ్రమైతే ఇళ్లల్లో తోటలకు నీళ్లు పెట్టడం, కార్లు శుభ్రం చేయడం, ఇంట్లోని పూల్స్‌లో నీళ్లు నింపడంపై నిషేధం విధిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ప్రమాద ఘంటికలు... ► బ్రిటన్‌లో జూలైలో సగటు వర్షపాతం 35% మాత్రమే నమోదైంది. ► దాంతో ఆవులు తాగే నీళ్లపై కూడా రోజుకు 100 లీటర్లు అంటూ రేషన్ విధిస్తున్నారు. ► మొక్కజొన్న ఉత్పత్తి 30%, పొద్దుతిరుగుడు ఉత్పత్తి 16 లక్షల టన్నులకు తగ్గనుందని అంచనా. ► బంగాళదుంప రైతులంతా నష్టపోయారు. ► జర్మనీలోని రైన్ నదిలో నీటి ప్రవాహం తగ్గిపోతూ వస్తోంది. చాలాచోట్ల 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. ఈ నదిపై రవాణా ఆగిపోతే∙8 వేల కోట్ల డాలర్ల నష్టం సంభవిస్తుంది. ► ఇటలీలో గత 70 ఏళ్లలో చూడనంతటి అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ► ఇటలీలోని అతి పెద్ద నది పో సగం వరకు ఎండిపోయింది. ► ఫ్రాన్స్‌లో 100కు పైగా మున్సిపాల్టీల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిణీ చేస్తున్నారు. ► ఎండ తీవ్రతకు ఫ్రాన్స్‌లో గిర్నోడ్ లో 74 చదరపు కిలోమీటర్ల మేర కార్చిచ్చు వ్యాపించింది. ► స్పెయిన్‌లో ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి. ► హంగరీలో నదులన్నీ బురద గుంతలుగా మారిపోతున్నాయి. -
జ్వరాలొస్తున్నాయ్.. జాగ్రత్త! వైరల్ ఫీవర్, మలేరియా, డెంగీ...
సాక్షి, అమరావతి: వాతావరణంలో మార్పులు, వర్షాలతో రాష్ట్రంలో వైరల్ ఫీవర్; మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 32.98 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా 945 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 531, పార్వతీపురం మన్యంలో 238 కేసులు నమోదు అయ్యాయి. ఐదు జిల్లాల్లో ఓ మోస్తరుగా, 13 జిల్లాల్లో నామమాత్రంగా కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 1,387 డెంగీ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 387 కేసులు ఉన్నాయి. విజయనగరంలో 173, కాకినాడలో 99, అనకాపల్లిలో 82 కేసులు నమోదయ్యాయి. డెంగీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నియంత్రణకు పారిశుధ్య నిర్వహణ, నీళ్లు నిల్వ ఉండకుండా చూడటం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. డెంగీకు సంబంధించి 54 ప్రభుత్వ బోధనాస్పత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రులను సెంటినల్ నిఘా ఆసుపత్రులుగా గుర్తించారు. వ్యాధిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,34,270 టెస్ట్ కిట్లను పంపిణీ చేశారు. విశాఖపట్నంలో వైద్య సిబ్బందికి సెరా నమూనాలపై అవగాహన కల్పించారు. మలేరియా ఎక్కువగా ఉన్న ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు, అనకాపల్లి, ఏలూరు, విశాఖపట్నం జిల్లాల్లో నియంత్రణ చర్యలను వైద్య శాఖ చేపట్టింది. వ్యాధి ఎక్కువగా ఉన్న 4–5 గ్రామాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. దోమల నుంచి రక్షణ కోసం 25.94 లక్షల దోమ తెరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. పరిసరాలను పరిశుభ్రతకు, దోమల నివారణకు చర్యలు చేపడుతోంది. వెక్టార్ కంట్రోల్, ఏఎన్ఎంలు వారి పరిధిలో అపరిశుభ్రంగా, నీరు నిలిచిన ప్రాంతాల ఫోటోలను హైజీన్ యాప్‌లో అప్లోడ్ చేసి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. వెంటనే గ్రామ/వార్డు కార్యదర్శులు అక్కడి సమస్యలను పరిష్కరిస్తున్నారు. అదే విధంగా ఫ్రైడే–డ్రై డే ప్రచార కార్యక్రమం ప్రతి శుక్రవారం అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► ఇంటి ఆవరణ, చుట్టుపక్కల పనికిరాని వస్తువులు, టైర్లు, వాడిన కొబ్బరి చిప్పలు ఉంచరాదు. ► మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ► నీటిని నిల్వ చేసే పాత్రలు శుభ్రపరచి, వాటిపై మూతలు ఉంచాలి ► ఆర్వో నీటిని లేదా కాచి వడగట్టిన నీటిని తాగాలి ► తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ► దోమ తెరలు వినియోగించాలి. గర్భిణిలు, చిన్న పిల్లలకు దోమతెరలు తప్పనిసరి నిర్లక్ష్యం చేయద్దు జ్వరం, దగ్గు, జలుబు, విరేచనాలు, వాంతులు సహా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. సొంత వైద్యం చేసుకోకూడదు. సీజనల్ వ్యాధులపై వైద్య శాఖ అప్రమత్తంగా ఉంది. జ్వర బాధితులకు వైద్య పరీక్షలు చేస్తున్నాం. ఫీవర్ సర్వే కొనసాగిస్తున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, రాష్ట్ర సీజనల్ వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ఏడీ ప్రాథమిక దశలోనే గుర్తించాలి వాతావరణంలో మార్పుల వల్ల వైరల్ ఫీవర్ (విష జ్వరం)లు ఎక్కువగా వస్తాయి. దోమల ద్వారా మలేరియా, డెంగీ, ఇతర వ్యాధులు వస్తాయి. అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం కీలకం. జ్వరం, ఇతర అరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. ఇంట్లో ఇతరులకు దూరంగా ఉండాలి. వర్షంలో తడవకూడదు. మాస్క్ ధరించాలి. మాస్క్ వల్ల కరోనాతోపాటు ఇతర వ్యాధులు, వైరస్లు, భ్యాక్టీరియాల నుంచి రక్షణ లభిస్తుంది. – డాక్టర్ రఘు, గుంటూరు జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్ -
తప్పుల వల్లే తిప్పలు
సాక్షి, అమరావతి: బుధవారం 129.98 టీఎంసీలు.. గురువారం 132.98 టీఎంసీలు.. శుక్రవారం 161.99 టీఎంసీలు.. శనివారం 204.20 టీఎంసీలు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిన గోదావరి జలాలు. జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 800.75 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. దీన్లో ఈ నాలుగు రోజుల్లోనే 629.15 టీఎంసీలు కడలిలో కలిశాయంటే గోదావరి ఏ స్థాయిలో విశ్వరూపం చూపిందో అర్థం చేసుకోవచ్చు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 1862 నుంచి అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. గత 160 ఏళ్లలో జూలైలో అదీ ప్రథమార్థంలో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ స్థాయిలో గోదావరి వరద జలాలు కడలిలో కలిసిన దాఖలాల్లేవు. ఆకస్మిక వరదలతో గోదావరి విశ్వరూపం ప్రదర్శించటానికి వాతావరణ మార్పులు ఎంత కారణమో అడవుల నరికివేత, ఇసుక కోసం నదీ గర్భాన్ని ఎడాపెడా తవ్వేయడం వంటి మానవతప్పిదాలు కూడా అంతే కారణమయ్యాయని వాతావరణ, సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. కర్బన ఉద్గారాల వల్ల కాలుష్యం పెరిగిపోవడంతో వాతావరణంలో భారీమార్పులు జరుగుతున్నాయి. భూమి, సముద్ర ఉష్ణోగ్రతల్లోను అంతేస్థాయిలో మార్పులు వస్తున్నాయి. దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో పెరు దేశం వద్ద పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల ఏర్పడే ఎల్‌నినో (సముద్రం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం), లానినో (సముద్ర ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడం) పరిస్థితుల ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రం, బంగాళఖాతం, హిందూమహాసముద్రం మీదుగా దేశంలోకి వీచే గాలులు రుతుపవనాలను.. ప్రధానంగా నైరుతి రుతుపవనాల క్రమం, లయను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల దేశంలో తక్కువ రోజుల్లోనే అత్యధిక వర్షం కురిసి అతివృష్టికి దారితీస్తే.. లానినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి అనావృష్టికి దారితీస్తోంది. కుంభవృష్టి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్‌కు సమీపంలో త్రయంబకేశ్వర్ వద్ద జన్మించే గోదావరి.. తూర్పు కనుమల మీదుగా 1,465 కిలోమీటర్లు ప్రవహించి అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి పరీవాహక ప్రాంతం 3,12,150 చదరపు కిలోమీటర్లు. దీన్లో మహారాష్ట్రలో 48.5 శాతం, తెలంగాణ, ఏపీల్లో 23.30, ఛత్తీస్‌గఢ్‌లో 12.5, మధ్యప్రదేశ్‌లో 8.6, ఒడిశాలో 5.70, కర్ణాటకలో 1.40 శాతం ఉంది. దేశ విస్తీర్ణంలో ఇది 9.5 శాతంతో సమానం. గోదావరి బేసిన్లో గత 30 ఏళ్ల వర్షపాతం ఆధారంగా.. కనిష్టంగా 877 మిల్లీమీటర్లు, గరిష్టంగా 1,493 మిల్లీమీటర్లు, సగటున 1,117 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని కేంద్ర జలసంఘం అంచనా వేసింది. ఇందులో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల జూన్ 12 నుంచి సెప్టెంబరు 30 వరకు సగటున 824 మి.మీ. వర్షం కురుస్తుందని అంచనా. గోదావరికి ఉన్న తొమ్మిది సబ్ బేసిన్లలో ఎల్లి సబ్ బేసిన్ (జి–2) (మహారాష్ట్ర)లో కనిష్టంగా 758.34.. కుంట సబ్ బేసిన్ (జి–7) (శబరి–ఒడిశా, ఆంధ్రప్రదేశ్)లో గరిష్టంగా 1,503 మి.మీ. వర్షం కురుస్తుంది. జూలై ప్రథమార్థంలో ప్రాణహిత (జి–2 టెక్రా), గోదావరి (జి–4 మంచిర్యాల), ఇంద్రావతి (జి–5 పాతగూడెం), శబరి (జి–7 కొంటా)లలో సగటున 526 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే.. రుతుపవనాల వల్ల కురవాల్సిన వర్షంలో 63.84 శాతం పది రోజుల్లోనే కురిసింది. సుమారు 60 రోజుల్లో కురవాల్సిన వర్షం పది రోజుల్లోనే పడింది. భూమిలోకి ఇంకని నీరు గోదావరి బేసిన్ విస్తరించిన పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో దశాబ్దాలుగా భారీ ఎత్తున అడవులను నరికేస్తున్నారు. ఇటీవల అడవుల నరికివేత మరింత తీవ్రమైంది. దీనివల్ల గరిష్టంగా వర్షం కురిసినప్పుడు.. భూమిపై పడిన వర్షపు నీరు అదే రీతిలో నదిలోకి చేరుతోంది. అడవులు నరికివేయకపోతే వర్షపు నీరు భూమిలోకి పూర్తిగా ఇంకిన తరువాత మిగిలినది వాగులు, వంకల ద్వారా ఉప నదుల్లోకి చేరి తర్వాత గోదావరిలోకి చేరేది. ఇక గోదావరిలో ఎగువన అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా ఇసుకను తవ్వేయడంతో నదీగర్భం గట్టినేలగా మారిపోయింది. దీంతో నదిలోకి వచ్చిన నీరు వచ్చినట్టుగా ప్రవహిస్తోంది. ఇవే ప్రస్తుతం గోదావరి ఆకస్మిక వరదలకు దారితీశాయని యాక్షన్ పెటర్నా ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వై.వి.మల్లారెడ్డి చెప్పారు. -
టమాట కెచప్ ప్రియులకు చేదువార్త!
టమాట కెచప్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తారు. బయట రెస్టారెంట్లలో, హోటళ్లలో ప్రధానమైనది ఈ కెచప్. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చాక అందరూ ఈ టమాట సాస్‌లకు అలవాటు పడిపోయారు. ఐతే ఇక ఆ టమటా కెచప్ తయారు చేయడం కష్టమైపోతుందంటున్నారు వాతావరణ పరిశోధకులు. అందుకు వాతావరణ మార్పులే కారణమంటున్నారు. ఈ అధిక ఉష్టోగ్రతలు కారణంగా టమాట పంట ఉండదేమోనని భయపడుతున్నారు కూడా. ఇటీవల అధిక ఉష్ణోగ్రతలు కారణంగా కూరగాయాల ధరలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అందులోనూ టమాట ధర ఇటీవల కనివినీ ఎరుగని రీతిలో ఆకాశన్నంటింది. ఇందంతా ఒకత్తెయితే ఇక రాను రాను ఈ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే ఇక టమాట ఉత్పత్తి తగిపోతుందని వాతావరణ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ మేరకు డెన్మార్క్‌లోని ఆర్హస్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధకుల బృందం పెరుగుతున్న ఉష్ణోగ్రత టమాటల ఉత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుందో ఒక గణిత నమూనాను రూపొందించింది కూడా. ఇప్పటివరకు ఇటలీ, చైనా మరియు కాలిఫోర్నియా టమాట ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయని పరిశోధకులు బృందం పేర్కొంది. ఇవి ప్రపంచ ఉత్పత్తిలో ఈ దేశాలే అధికంగా సరఫరా చేస్తున్నాయి. ఐతే ఇప్పుడూ ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రమాదంలో ఉన్నాయని అధ్యయనం తెలిపింది. గణిత నమూనా ప్రకారం 2050 నుంచి 2100 మధ్యకాలంలో టమాట పంట సగానికి తగ్గిపోతుందని తెలిపింది. 2050 నాటికి టమాట ఉత్పత్తి ఆరు శాతం క్షీణిస్తుందని పరిశోధన బృందం పేర్కొంది. అంతేకాదు 2040 నుంచి 2069 మధ్య టమాట ఉత్పత్తి ప్రాంతాలలో సుమారు 2.6 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత ఉంటుందని తదుపరి 30 సంవత్సరాలలో 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదల ఉంటుందని వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రత పెరుగుదలను 1980 నుంచి 2009 మధ్య కాలంలో ఉష్ణోగ్రతల పెరుగుదలను బట్టి పరిశోధకులు అంచనావేశారు. పదకొండు అతి పెద్ద సాగు పంటల్లో ఒకటైన ఈ టమాట పంట ప్రస్తుతం 14 మిలియన్ల టన్నుల నుంచి 7 మిలియన్ల టన్నులకు పడిపోతోంది. గతేడాది కూడా మార్చి నుంచి ఏప్రిల్ నెలల్లో పాకిస్తాన్, భారత్ వంటి దేశాల్లో టమాట పంట దారుణంగా పడిపోయింది. ఇలా టమటాల ఉత్పత్తి దారుణంగా పడిపోతే టమాట కెచప్, టమాట పేస్ట్ వంటివి ఇక ఉండవేమో అంటున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: మంటల్లో వేసినా కాలిపోని పుస్తకం...వేలంలో ఎంత పలికిందంటే..?) -
ఆ దేశాలతోనే పర్యావరణానికి ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులకు, భారీగా కర్బన ఉద్గారాల విడుదలకు సంపన్న దేశాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. భూమిపైనున్న సహజ వనరుల్ని విపరీతంగా దోపిడీ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున కర్బన ఉద్గారాలు ఆ దేశాల నుంచే విడుదల అవుతున్నాయన్నారు. వాతావరణ మార్పుల్లో భారత్ ప్రమేయాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ , నమామి గంగ, ఒకే సూర్యుడు–ఒకే ఇంథన వ్యవస్థ వంటి పథకాలతో బహుహుఖంగా పర్యావరణ పరిరక్షణకు భారత్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం సద్గురు జగ్గీ వాసుదేవ్ ఏర్పాటు చేసిన మట్టిని కాపాడుకుందాం ఉద్యమంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. సారవంతమైన మట్టిపై భారత్ రైతుల్లో అవగాహన అంతగా లేదన్న ప్రధాని సాయిల్ హెల్త్ కార్డుల్ని ఇవ్వడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని మోదీ తెలిపారు. ముందుగానే లక్ష్యాలను చేరుకున్నాం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను మనం ముందే సాధించామని ప్రధాని చెప్పారు. పెట్రోల్‌లో 10శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని గడువు కంటే అయిదు నెలల ముందే సాధించినట్టు ప్రకటించారు. శిలాజేతర ఇంధనాల ద్వారా 40 శాతం విద్యుత్ ఉత్పత్తిని డెడ్‌లైన్ కంటే తొమ్మిదేళ్లు ముందే సాధించామని తెలిపారు. ‘సేవ్ సాయిల్ మూవ్మెంట్’ ద్వారా నేలలో సారం క్షీణించడంపై అవగాహన పెంచడానికి, సారాన్ని మెరుగుపరచడానికి ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ప్రపంచ వ్యాప్త ఉద్యమాన్ని ప్రధాని అభినందించారు. మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ: జగ్గీ వాసుదేవ్ మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ సాధ్యమని ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం మట్టిని రక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని చెప్పారు. లైఫ్‌స్టైల్ ఉద్యమం ప్రారంభం పర్యావరణహితంగా మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఉద్దేశించిన లైఫ్‌స్తైల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ (లైఫ్) ఉద్యమాన్ని ప్రధాని ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడడానికి తమ వంతుగా లైఫ్‌స్టైల్ మార్చుకుంటే వారిని ప్రోప్లానెట్ పీపుల్ అని పిలుస్తారని అన్నారు. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ మాట్లాడుతూ.. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భారత్ చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. వాతావరణ మార్పుల నివారణతోపాటు వాతావరణ లక్ష్యాల సాధనలో భారత్ పాత్ర, నాయకత్వం చాలా కీలకమైందని బిల్‌గేట్స్ పేర్కొన్నారు. -
వాతావరణ మార్పులతో నిద్రలేమి
న్యూఢిల్లీ: నిద్రలేమి.. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీనికి ఎన్నో కారణాలుంటాయి. వాతావరణ మార్పులు కూడా మన నిద్రపై ప్రభావం చూపిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. భూగోళం ఇంకా ఇంకా వేడెక్కిపోతూ ఉంటే ఈ శతాబ్దం చివరికి ఒక వ్యక్తి ఏడాది కాలంలో పోయే నిద్రలో 50 నుంచి 58 గంటలు తగ్గిపోతుందని జర్నల్ వన్ ఎర్త్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. అంటే మనం పడుకునే సమయంలో రోజుకి పది నిముషాలు తగ్గిపోతుంది. మనం ఎంత సేపు, ఎంత గాఢంగా నిద్రపోతున్నామో చెప్పే రిస్ట్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్‌ల ద్వారా సేకరించిన గణాంకాలతో ఈ అధ్యయనం రూపొందించారు. మొత్తం 68 దేశాల్లో 47 వేల మంది రాత్రిపూట ఎంతసేపు నిద్రపోయారో రెండేళ్ల పాటు వివరాలు సేకరించారు. ‘‘వాతావరణంలో వస్తున్న మార్పులతో రాత్రిళ్లు వేడిగా మారుతున్నాయి. దీని ప్రభావం వ్యక్తుల నిద్రపై పడుతోంది. వారు నిద్రపోయే సమయం క్రమక్రమంగా తగ్గిపోతోంది.’’ అని ఈ అధ్యయనం సహరచయిత కెల్టన్ మినార్ చెప్పారు. ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయేవారి సంఖ్య 3.5% పెరిగినట్టు ఆ అధ్యయనం వెల్లడించింది. మనుషులు నిద్రపోయే సమయంలో మనుషుల శరీరం వేడిని నిరోధిస్తూ చల్లగా, హాయిగా ఉండేలా చేస్తుంది. బయట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటే అలా వేడిని నియంత్రించడం కష్టంగా మారుతుందని ఆ అధ్యయనం వివరించింది. -
తగ్గేదేలే అంటున్న టమాటా ధరలు
సాక్షి, మదనపల్లె : టమాట క్రయ, విక్రయాలకు దేశంలోనే అతి పెద్దదైన మదనపల్లె టమాట మార్కెట్లో ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వారం రోజులుగా ధరలను గమనిస్తే మే 7న మొదటి రకం టమాట ధరలు కిలో రూ.24–44, 8న రూ.27–50, 9, 10న రూ.30–52, 11, 12న రూ.35–56 మధ్య ధరలు పలికితే 13వ తేదీన రూ.39–60కు చేరుకున్నాయి. శుక్రవారం మదనపల్లె మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు 198 మెట్రిక్ టన్నులు తీసుకువచ్చారు. బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి రూ.50–80 వరకు విక్రయిస్తున్నారు. దీంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నారు. మే నెలలో వివాహాది శుభకార్యాలు అధికంగా ఉండటం.. వాతావరణంలో అనూహ్యంగా చోటుచేసుకుంటున్న మార్పులు, పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మదనపల్లె నుంచి తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒరిస్సా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. బయటి మార్కెట్లలో స్థానికంగా సరుకు రాకపోవడం, డిమాండ్ అధికంగా ఉండటంతో ఇక్కడి వ్యాపారులు అధిక ధరలకు కొనుగోలు చేసి అక్కడికి తరలిస్తున్నారు. మే చివరి వరకు అధిక ధరలే పలుకుతాయని వ్యాపారులు చెపుతున్నారు. మార్కెట్లో టమాటకు లభిస్తున్న ధరలపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (Darbarevu Land: కీలక సమస్యకు ఏపీ కేబినెట్ పరిష్కారం.. రెండు, మూడు రోజుల్లో జీవో) -
మత్స్య జాతులు మాయం!
వాషింగ్టన్: భవిష్యత్‌లో శీతోష్ణస్థితి మార్పుతో సముద్రాలు అనూహ్యంగా వేడెక్కి చేపల జాతులు తగ్గిపోతాయని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. ఈ వివరాలను రాయల్ సొసైటీ బీకి చెందిన జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించారు. ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రెడేటర్– ప్రే సంబంధాలు (ఇతర జీవులను చంపి తినే జీవిని ప్రెడేటర్ అంటారు. ప్రెడేటర్‌కు ఆహారమయ్యేవాటిని ప్రే అంటారు) మార్పు చెందిన పలు జాతులు బతికేందుకు అవసరమైన పరిస్థితులు మారిపోతాయని తెలిపింది. కేవలం పెద్ద జాతుల చేపలే కాకుండా, వాణిజ్యపరమైన చేపల జాతులు కూడా తగ్గిపోతాయని పేర్కొంది. ఉదాహరణకు అట్లాంటిక్‌లో జాలరికి 200 ఫిష్ ఇయర్స్ తర్వాత ప్రస్తుతం దొరికేదాని కన్నా తక్కువగా చేపలు దొరుకుతాయని వివరించిది. చేపలు తగ్గే కొద్దీ వాటి వేట అధికమవుతుందని, దీనివల్ల జీవవైవిధ్యతలో భారీ మార్పులు వస్తాయని పరిశోధనలో పాల్గొన్న మలిన్ పింక్సీ చెప్పారు. కంప్యూటర్ మోడల్స్‌ను ఉపయోగించి ప్రెడేటర్– ప్రే సంబంధాలను విశ్లేషించినట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ లక్షల చేపల జాతులు ధృవప్రాంతాలకు పోతాయని, దీనివల్ల భూమిపై జీవరాసుల బంధాల్లో సైతం గణనీయమార్పులు వస్తాయని చెప్పారు. -
ముప్పు ముంగిట అమెజాన్.. కథ మారకపోతే కష్టాలకు తలుపులు బార్లా తెరిచినట్టే!
ఒకపక్క వాతావరణ మార్పులు, మరోపక్క అడవుల నరికివేతతో ప్రఖ్యాత అమెజాన్ వర్షారణ్యం (రెయిన్ ఫారెస్ట్) ఎండిపోతోంది. మానవ తప్పిదాల కారణంగా అమెజాన్ అడవులు రికవరీ అయ్యే ఛాన్సులు క్షీణిస్తున్నాయని, దీంతో ఇవి క్రమంగా అడవుల స్థాయి నుంచి సవన్నా (గడ్డి మైదానాలు)లుగా మారిపోతాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇదే నిజమైతే కేవలం అమెజాన్ విస్తరించిన ప్రాంతమే కాకుండా ప్రపంచమంతటిపై పెను ప్రభావం పడుతుందని తెలిపింది. అమెజాన్ బేసిన్‌లోని వర్షారణ్యం ప్రపంచ వర్షారణ్యాల్లో సగానికిపైగా ఉంటుంది. ప్రపంచ కార్బన్‌డైఆక్సైడ్ (co2) స్థాయి నియంత్రణలో అమెజాన్ వర్షారణ్యానిది కీలకపాత్ర. అయితే ఈ అడవులు క్షీణించి సవన్నాలుగా మారితే co2 నియంత్రణ బదులు co2 వేగంగా పెరిగేందుకు కారణమవుతాయని పర్యావరణ నిపుణులు వివరించారు. గతంలో ఊహించినదాని కన్నా వేగంగా ఈ అడవులు అంతర్ధానం అంచుకు చేరుతున్నాయన్నారు. 25 సంవత్సరాల శాటిలైట్ డేటాను విశ్లేషించి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ అడవి వేగంగా క్షీణిస్తోందని నేచర్ క్లైమెట్ ఛేంజ్‌లో పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా చెట్ల నరికివేత, కరువు సంభవించిన ప్రాంతాల్లో తిరిగి అడవి కోలుకోవడం దాదాపు సగానికిపైగా తగ్గిందని అధ్యయన సహ రచయత టిమ్ లెంటాన్ చెప్పారు. మానవ తప్పిదాలకు తోడు పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు అమెజాన్ అడవుల రికవరీ సామర్థ్యం పూర్తిగా నశించిపోయేందుకు కారణమవుతున్నాయని వివరించారు. ముఖ్యంగా కార్బన్ కాలుష్యాన్ని తగ్గించకపోతే శతాబ్ది మధ్యకు వచ్చేసరికి ఈ అడవులు పూర్తిగా కనుమరుగవుతాయని అంచనా వేశారు. ప్రపంచానికే డేంజర్ ఇప్పటికే ధ్రువాల వద్ద మంచు కరగడం, వాతావరణంలో co2 స్థాయిలు పెరగడం, దక్షిణాసియాలో అనూహ్య రుతుపవనాలు, క్షీణిస్తున్న కోరల్ రీఫ్ పర్యావరణ వ్యవస్థలు, అట్లాంటిక్ సముద్ర ప్రవాహాల్లో మార్పులతో ప్రపంచమంతా ప్రమాదం అంచుల్లోకి పయనిస్తోంది. వీటికి అమెజాన్ అడవుల క్షీణత తోడైతే కార్చిచ్చుకు వాయువు తోడైనట్లు ప్రమాదకర పర్యావరణ మార్పులు సంభవిస్తాయని నిపుణుల అంచనా. అమెజాన్ అడవులు అధిక శాతం విస్తరించిన బ్రెజిల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడవుల నరికివేత పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఒకప్పుడు co2 సింక్ (కార్బన్ డైఆక్సైడ్‌ను పీల్చుకునే)గా ఉన్న అమెజాన్ ఫారెస్టు ప్రస్తుతం co2 సోర్స్ (ఉత్పత్తి కారకం)గా మారిందని సైంటిస్టులు హెచ్చరించారు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో అమెజాన్ అడవులు వదిలే కార్బన్‌డైఆక్సైడ్ పరిమాణం 20 శాతం మేర పెరిగిందన్నారు. వాతావరణంలో co2 పెరగడం ఉష్ణోగ్రతలు పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ వాయువును పీల్చుకోవడంలో చెట్లు, మృత్తిక కీలక పాత్ర పోషిస్తాయి. ఎప్పుడైతే చెట్ల నరికివేత ఊపందుకొని, మృత్తికలు సారహీనం కావడం జరుగుతుందో co2 నియంత్రణ అదుపుతప్పుతుంది. అమెజాన్ అడవులు దాదాపు 9000 కోట్ల టన్నుల co2ను నియంత్రిస్తుంటాయి. ఈ అడవుల క్షీణతతో ఇంత స్థాయిలో co2 వాతావరణంలోకి విడులయ్యే అవకాశాలు పెరుగుతాయి. అప్పుడు దక్షిణఅమెరికాతో పాటు ప్రపంచమంతా ఫలితం అనుభవించాల్సిఉంటుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఇంకా ఉందని అధ్యయన రచయతలు తెలిపారు. ప్రపంచ ఉష్ణోగ్రతలను నియంత్రించగలిగితే ఆటోమేటిగ్గా అరణ్య రికవరీ సామర్ధ్యం పెరుగుతుందన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గించాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం, చెట్ల నరికివేతను నియంత్రించడం, పంటమార్పిడి ద్వారా మృత్తిక సారహీనం కాకుండా కాపాడడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకతలు.. ► 9 దేశాల్లో దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల పైచిలుకు విస్తీర్ణంలో అమెజాన్ వర్షారణ్యం వ్యాపించి ఉంది. ► అమెజాన్ పరీవాహక ప్రాంతంలో 75 శాతాన్ని ఈ అడవులు ఆక్రమించాయి. ► కలప, బయో ఇంధనం, పోడు వ్యవసాయం కోసం 1970 నుంచి ఈ అరణ్యంలో 20 శాతాన్ని మనిషి కబళించాడు. ► ఈ అడవుల్లో దాదాపు 3,344 ఆదిమ జాతుల ప్రజలు నివాసముంటున్నారు. ► వీటిపై ఆధారపడి సుమారు 3 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. ► ప్రపంచంలోని జీవ ప్రజాతుల్లో పదింట ఒకటి ఈ వర్షారణ్యాల్లో కనిపిస్తుంది. ► ప్రపంచంలోనే అత్యధిక వృక్ష, జీవ ప్రజాతులకు ఈ అడవులు ఆవాసం. ► ఇందులో సుమారు 16 వేల ప్రజాతులకు చెందిన దాదాపు 39,000 కోట్ల చెట్లున్నట్లు అంచనా. ► ఈ అడవుల్లో 25 లక్షల రకాల కీటకాలు, 2, 200 రకాల చేపలు, 1,294 రకాల పక్షులు, 427 రకాల క్షీరదాలు, 378 రకాల సరీసృపాలు నివసిస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి. -
మనమే రాస్తున్న మరణ శాసనం
భవిష్యత్ తరాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత తరాలు ప్రకృతి వనరులను సమర్థంగా వినియోగించుకున్నప్పుడే అది సుస్థిరాభివృద్ధి అవుతుంది. కానీ అలా చేస్తున్నామా? భూతాపోన్నతిని అనుకున్నట్టుగా రెండు డిగ్రీల లోపు నియంత్రించకపోతే, మూడో వంతు జీవరాశి అంతమయ్యే ప్రమాదముంది. ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణ మార్పు’పై ఏర్పరచిన అంతర్ ప్రభుత్వాల బృందం (ఐపీసీసీ) నివేదిక కూడా ఇదే నిజాన్ని మరోమారు నొక్కి చెప్పింది. అయినా మన ప్రభుత్వాలు నిష్క్రియాపరత్వం వీడటం లేదు. ఈ నివేదిక సిఫారసుల్ని పాటించే సంకల్పం తీసుకోవడానికి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కొత్త సమీకృత హరిత అజెండాతో ముందుకు రావాలి. ప్రతి పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇది అజెండా కావాలి. పరిశోధన పత్రాలు పనికిరావు... అధ్యయన నివేదికలు ఆలోచనకు ఆనవు... శాస్త్రవేత్తల హెచ్చరికలు నెత్తికెక్కవు... మరెప్పుడు మేల్కొనేది? ఇంకెప్పుడు ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పు నుంచి మనల్ని మనం కాపాడు కునేది? ఇది ఇప్పుడు భారత పౌరసమాజం ముందున్న కోటి రూకల ప్రశ్న. సరైన సమయంలో తగు రీతిన స్పందించని నిష్క్రియాపర త్వమే సమస్యను మరింత జటిలం చేస్తోందని పలు అధ్యయన నివేది కలు తరచూ చెబుతున్నాయి! అసలు సమస్యకు పెరుగుతున్న భూతా పోన్నతి మూల కారణమైతే, ఎన్నో హెచ్చరికల తర్వాత కూడా కద లని మన ప్రభుత్వాల వైఖరే సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణ మార్పు’పై ఏర్పరచిన అంతర్ ప్రభు త్వాల బృందం (ఐపీసీసీ) నివేదిక కూడా ఇదే నిజాన్ని మరోమారు నొక్కి చెప్పింది. ఐపీసీసీ ఆరో అంచనా నివేదికలో భాగంగా ‘వర్కింగ్ గ్రూప్’ ఇచ్చిన 2022 తాజా (రెండో భాగం) నివేదిక ఎన్నో హెచ్చరికలు చేస్తోంది. గత సంవత్సరం విడుదల చేసిన నివేదిక (తొలి భాగం) లోనే, అంచనాలకు మించిన వేగంతో వాతావరణ సంక్షోభం ముంచుకువస్తోందని హెచ్చరించిన ఈ బృందం, ప్రమాదం మరింత బహుముఖీనంగా ఉందని తాజా నివేదికలో గణాంకాలతో సహా వివరించింది. భూగ్రహం మొత్తానికి సంబంధించిన సమస్యను నివేదికలో పేర్కొన్నా... ఆసియా ఖండానికి సంబంధించి, ముఖ్యంగా భారత్‌కు వర్తించే హెచ్చరికలు ఈ నివేదికలో తీవ్రంగా ఉన్నాయి. అయినా దీనికి సంబంధించిన కీలక చర్చ ఎక్కడా జరగటం లేదు. భారత్‌కే హెచ్చు ప్రమాదం హిమాలయాల దిగువన, మూడు సముద్రాల మధ్యనున్న ద్వీప కల్పమవడంతో వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావం భారత్‌పైన ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమౌతోంది. హెచ్చు తేమ, వేడి వల్ల తలెత్తే దుష్పరిణామాలు (వెట్ బల్బ్ సిండ్రోమ్), నగర, పట్టణ ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటాయని తాజా నివేదిక నిర్దిష్టంగా పేర్కొంది. అహ్మదా బాద్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ హైదరాబాద్‌తో సహా చాలా మెట్రో నగరాలదీ ఇదే దుఃస్థితి! ఫలితంగా వడదెబ్బ మరణాలు మితిమీరతాయి. మిగతా సముద్రాల కన్నా హిందూ మహాసముద్రం వేగంగా వేడెక్కుతోందని ఐపీసీసీ ఆరో నివేదిక తొలిభాగంలోనే పేర్కొన్నారు. దాంతో సముద్ర గాలులు పెరిగి, దక్షిణాసియా దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో తుపాన్లు, వర్షాలు, వరదలు, కరవులు సాధా రణం కన్నా ఎక్కువవుతాయని నివేదించారు. నివేదిక తొలి భాగం ప్రధానంగా ‘వాతావరణ మార్పు’ తాలూకు శాస్త్ర, సాంకేతిక, సామా జికార్థికాంశాలతో ఉంది. రెండో భాగం ముఖ్యంగా ‘వాతావరణ మార్పు ప్రభావాలు, సర్దుబాటు (అడాప్టేషన్), ప్రమాద ఆస్కారం’ కోణంలో విషయాలను నివేదించింది. వచ్చే ఏప్రిల్‌లో రానున్న మూడో భాగం ఏ రకమైన దిద్దుబాటు (మిటిగేషన్) చర్యలు అవసర మౌతాయో స్పష్టం చేస్తుంది. దీంతో, ఐపీసీసీ ఆరో అంచనా నివేదిక పూర్తవుతుంది. భూతాపోన్నతి వల్ల పుడమి ధ్రువాల్లోనే కాకుండా మన హిమాలయాల్లో ఉన్న మంచు అసాధారణంగా కరిగి కింద ఉండే భూభాగాల్లోనూ, నదుల పైనా ఒత్తిడి పెరుగుతుంది. అముదర్య (మధ్యాసియా నది), సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదీ లోయ ప్రాంతాల్లో వరదలు పెరిగి తీవ్ర ప్రతికూల పరిణామాలుంటాయని నివేదిక చెబుతోంది. ‘వెట్ బల్బ్ టెంపరేచర్’ (అంటే, గాలిలో తేమ శాతం అసాధారణంగా పెరిగినపుడు 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా తీవ్రంగా ఉంటుంది; 30–35 డిగ్రీల మధ్య వేడి అత్యంత ప్రమాదకారి) ఇప్పటికే 30 డిగ్రీలను దాటుతున్నట్టు నివేదిక చెబు తోంది. మనది స్థూలంగా వ్యవసాయాధారిత జీవనం, ఆర్థిక వ్యవస్థ అయినందున వాతావరణ ప్రతికూల పరిస్థితులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయనేది నివేదిక సారాంశం. సాధారణ జీవనంతో పాటు వ్యవసాయం, ఆహారోత్పత్తి, పంపిణీ వంటివి తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఐపీసీసీ ఛైర్మన్ హీసంగ్ లీ చెప్పినట్టు ‘నష్ట నివారణ, దిద్దుబాటు, సర్దుబాటు చర్యల తర్వాత కూడా 300 నుంచి 350 కోట్ల మంది విశ్వజనుల జీవితాలపై ప్రతికూల ప్రభావం ఉండేటప్పుడు... స్థానికంగా ఎక్కడికక్కడ ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం చేసే నష్టం మరింత అపారం’ అన్నది కఠోరసత్యం! ‘కోడ్ రెడ్’ కన్నా తీవ్రం విశ్వవ్యాప్తంగా వచ్చే రెండు దశాబ్దాలు తీవ్రమైన వాతావరణ ప్రతికూల పరిస్థితుల్ని జీవరాశి ఎదుర్కోవాల్సి వస్తుందని ఐపీసీసీ నివేదిక చెబుతోంది. ఆరో అంచనా నివేదిక తొలిభాగంలోనే, ఇది మానవాళికి తీవ్రమైన ‘కోడ్ రెడ్’ ప్రమాదమని హెచ్చరించిన అధ్య యన బృందం, పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని తాజా నివేదికలో చెప్పింది. ప్రపంచ స్థాయిలో సత్వర నివారణ, దిద్దుబాటు, సర్దుబాటు చర్యలు చేపట్టకపోతే ‘జీవయోగ్య, నిలకడైన భవితను పరిరక్షించుకునే అవకాశాన్ని మనం చేజేతులా జారవిడుచు కున్న వారమవుతాం’ అని హెచ్చరిస్తోంది. ప్రధానంగా అరడజను అంశాల్లో పరిస్థితులు విషమించే ఆస్కారాన్ని నొక్కి చెప్పింది. 1. మితిమీరిన కర్బన ఉద్గారాల వల్ల భూతాపోన్నతి పెరిగి జీవన పరిస్థితులు సంక్లిష్టమౌతాయి. వెట్ బల్బ్ సిండ్రోమ్‌తో, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలు దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొం టాయి. అసాధారణ సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటాయి. 2. పెరిగే తుపాన్లు, అతి వర్షాలు, వరదలు, కరవులు వంటి అతివృష్టి, అనా వృష్టి పరిణామాల కారణంగా ఆహారోత్పత్తి రమారమి తగ్గిపోతుంది. 2050 నాటికి భారత్‌లో 40 శాతం జనాభా నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. తిండి గింజలు ఖరీదై పెద్ద సంఖ్యలో పేదలు తిండి కోసం అల్లాడుతారు. పిల్లల ఎదుగుదలపై పౌష్టికాహార లోపం ప్రతికూల ప్రభావం చూపుతుంది. 3. భూతాపోన్నతి వల్ల ధ్రువాల మంచు కరిగి, సముద్ర జల మట్టాలు 44–76 సెం.మీ. పెరగటం వల్ల దీవులు, తీర నగరాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. ప్యారిస్‌లో చేసిన ప్రతిజ్ఞలకు ప్రపంచ దేశాలు కట్టుబడ్డా ఈ దుఃస్థితి తప్పదు. ఉద్గారాల్ని ఇంకా వేగంగా నియంత్రించగలిగితే... సముద్ర జల మట్టాల పెరుగుదలను 28–55 సెం.మీ. మేర నిలువరించవచ్చు. తీరనగరాల మునక, నగరాల్లో వరద సంక్షోభం, భూక్షయం, తీరాలు ఉప్పుగా మారి వ్యవసాయ అయోగ్యత వంటి వాటిని కొంతలో కొంత అదుపు చేయొచ్చు, 4. అతి వేడి, వడగాలులు, అసాధారణ వాతా వరణ పరిస్థితుల వల్ల జబ్బులు పెరిగి అనారోగ్యం తాండవిస్తుంది. శ్వాస, రక్తప్రసరణ, చర్మ సంబంధ రోగాలతో పాటు మధుమేహం వంటివి అధికమౌతాయి. 5. సీసీ (క్లైమేట్ ఛేంజ్)తో విద్యుత్తు వంటి ఇంధన వినియోగంలో అసాధారణ మార్పులు వస్తాయి. 6. అటవీ, సముద్ర తదితర అన్ని రకాల జీవావరణాలు (ఎకోసిస్టమ్స్) దెబ్బతిని జీవవైవిధ్యం అంతరిస్తుంది. భూతాపోన్నతిని అనుకున్నట్టు 2 డిగ్రీల కన్నా లోపు నియంత్రించకపోతే, మూడో వంతు జీవరాశి అంత మయ్యే ప్రమాదముంది. సానుకూల మార్పే నిర్ణాయక శక్తి అభివృద్ధి నిర్వచనంతో పాటు సమకాలీన రాజకీయాల దశ, దిశ మారాల్సిన అవసరం ఎంతో ఉంది. ఐరాస నిర్వచించినట్టు సుస్థిరా భివృద్ధి అంటే, ‘భవిష్యత్తరాల ప్రయోజనాల్నీ పరిగణనలోకి తీసు కొని, వాటిని పరిరక్షిస్తూ... ప్రస్తుత తరాలు తమ అవసరాల్ని తీర్చు కునేలా ప్రకృతి వనరుల్ని సమర్థంగా వినియోగించుకోవడం’. ఐపీసీసీ వంటి ముఖ్యనివేదికల సిఫారసుల్ని పాటించే సంకల్పం తీసుకోవ డానికి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కొత్త సమీకృత హరిత అజెండాతో రావాలి. ప్రతి పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇది అజెండా కావాలి. సంబంధిత వర్గాలన్నీ సత్వరం నడుం కడితే తప్ప జీవరాశి మనుగడకు భరోసా లేదు. ఇదే మనందరి తక్షణ కర్తవ్యం. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి సీనియర్ పాత్రికేయులు -
మన పాపం! ప్రకృతి శాపం!!
కొరడాతో కొట్టినట్టు చెబితే కానీ కొన్ని విషయాల తీవ్రత అర్థం కాకపోవచ్చు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై పనిచేస్తున్న ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’ (ఐపీసీసీ) బృందం తాజా నివేదిక సోమవారం వెల్లడించిన అంశాలు పరిస్థితి తీవ్రత తెలిపాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అగత్యాన్ని మరోసారి గుర్తుచేశాయి. ప్రపంచ మానవాళిలో 40 శాతం మంది, అంటే సుమారు 350 కోట్ల మంది డేంజర్ జోన్లో జీవిస్తున్నారనీ, మన పర్యావరణ వ్యవస్థల్లో అనేకం సరిదిద్దడానికి వీలు లేనంతగా ఇప్పటికే పాడయ్యాయనీ ఐపీసీసీ చెప్పినమాట ప్రపంచ దేశాలు కచ్చితంగా కలవరపడాల్సిన విషయం. 67 దేశాలకు చెందిన 270 మంది శాస్త్రవేత్తలు కలసి రూపొందించగా, 195 ప్రభుత్వాలు ఆమోదించిన కీలక నివేదిక ఇది. వాతావరణంలోని మార్పులతో ప్రపంచ వ్యాప్తంగా మొక్కలతో సహా ఈ భూగోళం మీది సమస్త ప్రాణికోటికీ ముప్పు ముంచుకొస్తోందని ఈ నివేదిక సారాంశం. వడగాలులు, కరవులు, వరదల లాంటి పర్యావరణ ప్రమాదాలు మరింత పెరగవచ్చట. ఆఫ్రికా, ఆసియా, మధ్య – దక్షిణ అమెరికా సహా అనేక ప్రాంతాల్లో ఆహారం, నీటికి ఇబ్బందులు తలెత్తవ చ్చట. ఇక, మన దేశంలోనూ మరికొన్నేళ్ళలోనే అనేక ప్రాంతాలు ఎంతటి దుర్భర నివాసాలుగా తయారవుతాయన్నది వింటే నిష్ఠురంగా అనిపించవచ్చు. కానీ, నిజాలు గ్రహించి, నిద్ర నుంచి మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి. అహ్మదాబాద్ ఓ ఉష్ణ ద్వీపమైతే, సముద్ర మట్టం పెరిగి ముంబయ్ వరద బాధిత నగరమవుతుంది. చెన్నై, భువనేశ్వర్, పాట్నా, లక్నో లాంటి నగరాలు ఉక్కపోతకు నిలయాలవుతాయని ఐపీసీసీ పారాహుషార్ చెబుతోంది. మానవాళి అందరికీ ఏకైక నివాసమైన ఈ భూగోళం పట్ల బాధ్యతను అగ్రరాజ్యాలు విస్మరిస్తు న్నాయి. ఆదర్శంగా ముందుండి నడపడం మానేసి, పెద్దయెత్తున కాలుష్యానికి కారణమవుతున్న ప్రపంచ శక్తులన్నీ ఇందులో ‘నేరస్థులే’ అని ఐరాస ప్రధాన కార్యదర్శి కుండబద్దలు కొట్టారు. కటు వుగా తోచినా, అది అక్షరసత్యం. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత మహా అయితే 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ మించకుండా చూడాలనేది ప్యారిస్ వాతావరణ ఒప్పందం పెట్టుకున్న లక్ష్యం. కానీ, అసలంటూ భూతాపంలో పెరుగుదలే సురక్షితం కాదని ఐపీసీసీ నివేదిక హెచ్చరిస్తోంది. లక్ష్యంగా పెట్టుకు న్నట్టు 1.5 డిగ్రీల పెంపునకే కట్టడి చేయగలిగినా సరే, ఈ పుడమి మీది జీవజాతుల్లో దాదాపు 14 శాతం అంతరించిపోయే ప్రమాదం ఉందట. ఒకవేళ అత్యధికంగా 3 డిగ్రీలు పెరిగితే, ఈ భూస్థలి మీది ప్రాణుల్లో దాదాపు మూడోవంతు కథ ముగిసిపోతుందట. ఒక రకంగా ఈ నివేదిక తుది హెచ్చరిక. శాస్త్రవేత్తలు తమ తదుపరి నివేదికను ఈ దశాబ్ది చివరలో వెల్లడిస్తారు. ఇప్పుడు గనక కళ్ళు తెరవకుంటే, అప్పటికి పరిస్థితి చేయి దాటి, చేయడానికి ఏమీ లేకుండా పోతుంది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను గమనిస్తే, గ్రీన్హౌస్ వాయువులు సహా అనేక అంశాల్లో ప్రస్తుతం ప్రపంచ దేశాలు చేసిన వాగ్దానాలు ఇందుకు ఏ మాత్రం సరిపోవు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నా సరే... ఉద్గారాలు దాదాపు 14 శాతం పెరిగి, సంక్షోభం తప్పదని నిపు ణుల హెచ్చరిక. కాబట్టి, ప్రపంచ దేశాలు మరింత ఉన్నత లక్ష్యాలను పెట్టుకోక తప్పదు. ఐరాస లక్షించినట్టుగా వచ్చే 2030 నాటి కల్లా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 45 శాతం మేర తగ్గించాలి. 2050 కల్లా ఉద్గారాలలో ‘నెట్ జీరో’ స్థాయిని సాధించాలి. ఈ ఐరాస లక్ష్యాలకు ఇక నుంచైనా కట్టుబడి ఉండడం ప్రపంచ శ్రేయస్సుకు కీలకం. పరిస్థితి ఇవాళ ఇంత ముంచుకొచ్చిందంటే, దానికి కారణం... మనమే! గతంలోని నిష్క్రియా పరత్వం, ముందుగానే మేల్కొని ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు కృషి చేయడంలో వైఫల్యం – ఇవన్నీ ఇప్పుడు కట్టికుడుపుతున్నాయి. శిలాజ ఇంధనాల నుంచి తక్కువ కర్బన ప్రత్యామ్నాయాలకు క్రమంగా మారాలనే ఆలోచన ఇప్పుడిక చాలేలా లేదు. ఆర్కిటిక్ దగ్గరి శాశ్వత ఘనీభవన మంచు పూర్తిగా కరిగిపోయే ప్రమాదం ఉందనీ, అమెజాన్ వర్షారణ్యం కాస్తా గడ్డిపరకల సవానా భూమిగా మారుతుందనీ ఆందోళన కనిపిస్తోంది. అంటే, ఐపీసీసీ అంచనాల కన్నా ముందే పర్యావరణ ఉత్పాతాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. పర్యావరణాన్ని వేడెక్కించే గ్రీన్హౌస్ వాయువులంటే ఒక్క కార్బన్ డయాక్సైడే కాకపోయినా, దానితో సహా అన్నిటికీ అడ్డుకట్ట వేయాలి. శిలాజ ఇంధనాలను పట్టుకొని వదలని నేరస్థ దేశాలన్నీ సత్వరం తమ పద్ధతులు మార్చుకోవాలి. మన దేశమూ కొన్నేళ్ళుగా వాతావరణ సంక్షోభాన్ని చవిచూస్తోంది. మొత్తం 75 శాతం జిల్లాలు వాతావరణంలో అతి మార్పులకు అడ్డాలయ్యా యని ‘కౌన్సిల్ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్’ చేసిన 2021 నాటి అధ్యయనం. పునరు త్పాదక ఇంధనాల వైపు మనం ఎంత త్వరగా కదిలితే అంత మంచిది. కానీ, కనుచూపు మేరలో అది జరిగేలా కనిపించకపోవడమే దురదృష్టం. తాజా ఉక్రెయిన్ యుద్ధంతో జర్మనీ లాంటివి తాజాగా తమ విదేశాంగ విధానాన్ని మార్చుకొని, 10 వేల కోట్ల యూరో కరెన్సీని సైనిక సంపత్తిపై ఖర్చు పెడుతున్నాయి. అదే దశాబ్దకాలంగా ప్రకృతి యుద్ధం ప్రకటించినా, అండగా నిలిచేందుకు చేతులు రాకపోవడం దురదృష్టం. ఇక, చేతులు కాలక ముందే మనం తప్పులు సరిదిద్దుకోవడం అవసరం. పర్యావరణ అనుకూల విధానాలతో జీవించేమార్గాన్ని అలవరచుకోవడమే ప్రపంచానికి శ్రీరామరక్ష. -
కేవలం మూడున్నర గంటల్లో మట్టి ఇళ్లను నిర్మిస్తున్న ఇటలీ.. కారణం తెలుసా..
మన పూర్వికులు మట్టితో కట్టిన ఇళ్లలో జీవించారు. సైన్స్ అభివృద్ధిచెందని కాలంలో మట్టి ఇళ్లను నిర్మించుకుని నివాసమున్నారు. ఐతే టెక్నాలజీపై ప్రపంచానికే పాఠాలు చెప్పగల ఈ సంపన్న దేశంఎందుకో మట్టితో ఇళ్లను కట్టుతోంది. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.. ఇటలీలోని రావెన్న ప్రాంతంలో కుండ ఆకారంలో బంకమట్టితో ఇళ్లు కడుతున్నారు. అచ్చం.. మన పూర్వికుల ఇళ్లమాదిరి కట్టేస్తున్నారు. వీటిని టెల్కా హౌసులు అని అంటారు. అంతేకాదు 3డీ ప్రింటింగ్ సహాయంతో కేవలం మూడున్నర గంటల్లో వీటిని నిర్మిస్తున్నారు. 645 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ఈ గుండ్రని ఇళ్ల లోపల బెడ్ రూం, బాత్ రూం, లివింగ్ రూములతో సకల సౌకర్యాలతో కూడి ఉన్నాయి. ఈ డోమ్ హౌస్‌ల నిర్మాణాల వెనుక గొప్ప సందేశం కూడా ఉందండోయ్! వీటిని నిర్మించాలనే ఆలోచన సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ మారియో కుసినెల్లా నుండి ఉద్భవించింది. ఇళ్లు లేనివారు వీటిని వాడుకోవచ్చట కూడా. రాబోయో రోజుల్లో ఇంకా తక్కువ సమయంలో కట్టేస్తానంటున్నాడు మారియో. ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణ హిత ఇళ్లివి (ఎకో ఫ్రెండ్లీ హౌస్). ప్రకృతి విపత్తుల్లో ఒక వేళ ఇవి కూలిపోతే 3డి ప్రింటింగ్‌తో తిరిగి నిర్మించుకోవచ్చిన మారియో చెబుతున్నాడు. విపత్తు సంభవించే ప్రాంతాలకు ఇటువంటి ఇళ్లు మంచి ఎంపిక అని మారియో చెప్పారు. జీరో కార్భన్ కన్స్ట్రక్షన్ ఆవిష్కరణ కోసం ఈ ప్రాజెక్ట్ ఎంపిక చేయబడింది. ఈ ప్రాజెక్ట్ క్లైమాట్ ఛేంజ్ సమ్మిట్‌లో కూడా ప్రదర్శించబడింది. చదవండి: కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా? -
ఈ రెండు చిత్రాల్లో మార్పులు కనిపెట్టారా? మళ్లీ ఓ పాలి.. లుక్కెయ్యండి.. సామీ..
పై రెండు ఫొటోల్లో తేడా గమనించారా? ఏం లేదే మామూలుగానే ఉందని అనుకుంటున్నారా? మళ్లీ ఓ పాలి.. ఓ లుక్కెయ్యండి.. అర్థమైందా.. అవును! పై ఫొటోలో దట్టంగా ఉన్న మంచు కాస్తా.. కింది ఫొటోలో అట్టడుగుకు చేరిపోయింది. ఐతే ఏంటట.. అంటారా? దీనికి ఈ భూమిపై తలెత్తనున్న పెను ప్రమాదాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది మరీ! అందుకే ఈ వివరణంతా... ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. 100 సంవత్సరాల తేడాతో వేసవికాలంలో తీసిన ఫొటోలివి. పై ఫొటో దాదాపు 105 సంవత్సరాలనాటిది. కింది ఫొటో తాజాగా తీసింది. కేవలం వందయేళ్ల కాలంలో ఆర్కిటిక్ ప్రాంతంలో మంచంతా ఇలా నీరుగారిపోయింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా నెమ్మదిగా దెబ్బతింటున్న ఆర్కిటిక్కి సంబంధించిన ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యమిది. వాతావరణ మార్పులు తీవ్ర వానలు, వరదల వెనుక దిగ్భ్రాంతికి గురిచేసే వాస్తవం ఇది. చదవండి: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం.. ‘గ్లేసియర్ కంపారిజన్ - స్వాల్బార్డ్’ క్యాప్షన్‌తో క్రిస్టియన్ అస్లాండ్ అనే ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆర్కిటిక్‌లోని వాతావరణ మార్పుల గురించి డాక్యుమెంటరీ తయారు చేశాడు. ఈ స్వీడిష్ ఫోటో జర్నలిస్ట్ 2017లో నేషనల్ జియోగ్రాఫిక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తన అనుభవాలను పంచుకున్నాడు- ‘నేను ఈ ఫొటోను 2003లో తీశాను. వాతావరణ మార్పు పట్ల నా వైఖరి భిన్నంగా ఉంది. చాలా యేళ్ల తర్వాత సరిగ్గా అదే లొకేషన్ నుండి ఫొటో షూట్ చేయడం ఆనందాన్నిచ్చింది. వాతావరణ మార్పు సమస్య గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలనే ఈ ఫొటో షూట్ చేశాన’ని చెప్పుకొచ్చాడు. చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? This is Arctic 105 years apart. Both picture taken in summer. Do you notice anything special. Courtesy Christian Åslund. pic.twitter.com/9AHtLDGKRb — Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 24, 2021 -
మంచి మాట.. రేపటి కోసం...
‘ఆకాశవాణి... ఇప్పుడు మీరు వింటున్నది శుభ్ కల్(రేపటి కోసం)’ అని రేడియో నుంచి ఆమె గొంతు వినిపించినప్పుడు ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది మహిళలు తమ రేడియో దగ్గరికి వడివడిగా వస్తారు. రేడియోసౌండ్ పెంచుతారు. గ్రామీణ మహిళలకు చాలా ఇష్టమైన రేడియో కార్యక్రమం ఇది. ‘శుభ్ కల్’లో సినిమా పాటలు, కథలు, నాటికలు వినిపించవు. పర్యావరణానికి సంబంధించిన మంచి విషయాలు వినిపిస్తాయి. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు వినడానికి ఆసక్తి చూపేవారు తక్కువగా ఉంటారు. ఆసక్తికరంగా చెబితే ఎలాంటి విషయాలనైనా ఆసక్తికరంగా వింటారని నిరూపించింది 27 సంవత్సరాల వర్షా రైక్వార్. మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాకు చెందిన వర్ష ‘బుందెల్‌ఖండ్ 90.4 ఎం.ఎమ్’లో రేడియో జాకీ. వర్ష నాన్న రైతు. ఆయన వరుస కరువులతో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకానొక దశలో ఊరు విడిచి వలస వెళదామని కూడా ఆలోచించాడు. చిన్నప్పుడు తండ్రిని అడిగేది ‘వర్షాలు ఎందుకు రావడం లేదు?’ ‘కరువు ఎందుకు వస్తుంది?’.. ఇలాంటి ప్రశ్నలకు ఆయన చెప్పే జవాబు ఒక్కటే...‘అంతా విధినిర్ణయం తల్లీ. మనమేమీ చేయలేము. మనం మానవమాత్రులం’ అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో...కరువు కాటకాల్లో విధి పాత్ర కంటే మానవతప్పిదాల పాత్రే ఎక్కువ ఉందని గ్రహించింది. తప్పులు మూడు విధాలుగా జరుగుతాయి. తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే తప్పులు, తెలిసీ తెలియక చేసే తప్పులు. ఈ మూడు సమూహాలను దృష్టిలో పెట్టుకొని ‘శుభ్ కల్’ కార్యక్రమానికి డిజైన్ చేసింది వర్ష. గంభీరమైన ఉపన్యాసాలు, అంత తేలిగ్గా అర్థం కాని జటిల సాంకేతిక పదజాలం కాకుండా స్థానిక భాష, యాసలతో నవ్వుతూ, నవ్విస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది వర్ష. కొన్ని స్కిట్స్‌లో రెండు పాత్రలు ఉంటాయి. ఒక పాత్ర పర్యావరణానికి సంబంధించి మంచిపనులు చేస్తుంటుంది. రెండో పాత్ర...ఇదంత వ్యర్థం అనుకుంటుంది. రెండు పాత్రల మధ్య స్థానిక యాసలలో జరిగే సరదా సంభాషణ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటుంది. వాదనలో చివరికి రెండో పాత్ర ఓడిపోతుంది. తన తప్పును తెలుసుకొని ‘ఇలాంటి తప్పు మీరు చేయవద్దు’ అని చెబుతుంది. ఈ కార్యక్రమంతో ప్రభావితం అయిన రాజ్పూర్ గ్రామరైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. ఈ గ్రామాన్ని మిగిలిన గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి. కేవలం రేడియో కార్యక్రమానికే పరిమితం కాకుండా ‘పల్లె పల్లెకు’ అంటూ తన బృందంతో కలిసి పల్లెలకు వెళుతుంటుంది వర్ష. ఆమె వెళ్లే పల్లెలలో వాహనాలు వెళ్లలేనివి మాత్రమే కాదు కాలినడకన వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పల్లెలు ఉన్నాయి. రేడియో జాకీగా మంచి పేరు ఉండడంతో ఏ పల్లెకు వెళ్లినా వర్షను గుర్తుపట్టి ఆదరిస్తారు. ఆ ఆదరణతోనే మహిళలతో సమావేశాలు నిర్వహించి చెట్లు పెంచడం వల్ల ఉపయోగాలు, నీటి సంరక్షణ మార్గాలు, సేంద్రియ వ్యవసాయం...ఇలా ఎన్నో విషయాలను చెబుతుంది. ఆ కార్యక్రమాలు ఎంత మంచి ఫలితం ఇచ్చాయంటే మొక్కలు నాటడాన్ని మహిళలు తప్పనిసరి కార్యక్రమం చేసుకున్నారు. నీటి వృథాను ఆరికట్టే కార్యక్రమాలు చేపడుతున్నారు. కిచెన్ గార్డెన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐక్యరాజ్య సమితి ‘వి చేంజ్ నౌ’ మూమెంట్ యంగ్క్లైమెట్ లీడర్స్‌లో వర్ష ఒకరు. ‘మన భూమిని మనమే రక్షించుకోవాలి’ అంటుంది వర్ష రైక్వార్. అందరూ వినదగిన మాటే కదా! -
హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం..
Biggest holocaust will come in the late century: యుగాంతం గురించి ఇప్పటికే పలుపుకార్లు పలుమార్లు చక్కర్లు కొట్టాయి. అవి కేవలం వదంతులని కొట్టిపారేయలేం కూడా. ఎందుకంటే భూమి అంతరించిపోయేంతగాకాకున్న ఎన్నడూ కనీవినీ ఎరుగని కొత్తకొత్త రోగాలు, వాతావరణ మార్పులు ఇప్పటికీ చవిచూస్తూనే ఉన్నాం. ఐతే తాజాగా ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు మరో సంచలనాత్మక హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ మ్యాగజైన్ ‘నేచర్' నిర్వహించిన సర్వేలో భూమిపై వాతావరణ మార్పులకు సంబంధించి అనేక షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఈ శతాబ్ధి చివరి నాటికి భూమిపై తీవ్ర మార్పులు సంభవిస్తాయని, త్వరలో భూమి నాశనమౌతుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. అంటే 2100 నాటికి భూమిపై భయంకరమైన మార్పులు సంభవించి, ఘోర మారణహోమం జరగబోతుందని ఆ నివేదిక సారాంశం. ప్రపంచ నలుమూలల నుండి 233 మంది ప్రకృతి శాస్త్రవేత్తలు రూపొందించిన ఐపీసీసీ వాతావరణ నివేదికలోఇది. చదవండి: North Korea: ఆ ఫొటోలు తీసినందుకు దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు.. ఈ శాస్త్రవేత్తల్లో కొలంబియాలోని యాంటికోయా విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చర్ పావోలా అరియాస్ కూడా ఉన్నారు. ప్రపంచం తీరు మారుతుందని, వనరులు తీవ్రంగా దోపిడీకి గురవుతున్నాయని, కాలుష్యం, హీట్‌వేవ్ రోజురోజుకీ పెరుగుతున్నాయని అన్నారు. వీటన్నింటి మధ్య బతకడమే కష్టంగా మారుతోంది. వర్షాల గతి మారడం వల్ల తీవ్ర నీటి సమస్య తలెత్తి, మున్ముందు భయంకరమైన గడ్డు పరిస్థితులు తలెత్తుతాయని ఆయన అన్నారు. చదవండి: పాదాలను చూసి ఆ సీక్రెట్స్ కనిపెట్టేయ్యొచ్చట!! ఇక గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రపంచ నాయకులు నత్తనడకన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాగేకొనసాగితే ప్రకృతి వైపరీత్యాలు తలెత్తి పెద్ద సంఖ్యలో ప్రజలు ఏకకాలంలో మృత్యువాత పడే అవకాశం ఉంది. భూమిని రక్షించుకోవడానికి మనకిప్పుడు చాలా తక్కువ సమయం ఉన్నట్లు నివేదిక చూపుతుందని ఆయన అన్నారు. 2100 నాటికి అకాల వర్షాలు, మేఘావృతాలు, సునామీలు, కరువులు, వరదలు వంటి విపత్తులు పెద్ద ఎత్తున ఉత్పన్నమవుతాయి. ఫలితంగా సమస్త మానవజాతి కష్టాలపాలవ్వడం ఖాయమని ఆయన హెచ్చరించారు. చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! -
బొగ్గు వినియోగం వద్దు
గ్లాస్గో/లండన్: శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని యూకేలోని గ్లాస్గోలో జరిగిన భాగస్వామ్య పక్షాల (కాప్–26) శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. వాతావరణ మార్పులు, వాటి దుష్ప్రభావాలు, వాటిని ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన వ్యహాలపై చర్చించేందుకు గత రెండు వారాలుగా కొనసాగిన ఈ సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై ముసాయిదా తుది ప్రకటనను నిర్వాహకులు శుక్రవారం విడుదల చేశారు. దీన్ని ఐక్యరాజ్యసమితి క్లైమేట్ ఛేంజ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పర్యావరణాన్ని, తర్వాత భూగోళాన్ని కాపాడుకోవాలంటే బొగ్గు వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాలని కాప్–26 సూచించింది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంకా బొగ్గును ఉపయోగిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదని వెల్లడించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తుచేసింది. చాలావరకు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కర్బన ఉద్గారాలను నియంత్రించే సాంకేతిక పరిజ్ఞానం లేదని తెలిపింది. శిలాజ ఇంధనాల వాడకాన్ని నిరుత్సాహపర్చాలని ఇందుకోసం, సబ్సిడీల్లో పెద్ద ఎత్తున కోత విధించాలని పేర్కొంది. కాప్–26లో ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల నుంచి ప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 నుంచి 2 డిగ్రీల పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై చర్చించారు. కర్బన ఉద్గారాల తగ్గింపుపై కీలక ఒప్పందం భారత్ సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ), వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్(యూఎన్ఎఫ్సీసీసీ) మధ్య కీలకమైన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. యూకేలోని గ్లాస్గోలో కాప్–26 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా శుక్రవారం ఈ అవగాహనా ఒప్పందంపై ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్, యూఎన్ఎఫ్సీసీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ ఓవైస్ సర్మాద్ సంతకాలు చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి, నేషనల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తామని, తమవంతు సహకారం అందిస్తామని ఐఎస్ఏ హామీ ఇచ్చింది. ఒప్పందంలో భాగంగా.. దీర్ఘకాలంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా వ్యూహాలు రూపొందించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సోలార్, క్లీన్ ఎనర్జీ వినియోగానికి పెద్దపీట వేయడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్నదే లక్ష్యమని అజయ్ మాథుర్ చెప్పారు. నిర్దేశిత గడువు కంటే ముందే ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సౌర కూటమిని 2015 నవంబర్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు. -
‘కాప్’లో లాబీలు – ఆశలపై చన్నీళ్లు!
ప్రతి మనిషిని ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పు ప్రమాద నేప«థ్యంలో... భూతాపోన్నతి కట్టడికి ప్రపంచ దృష్టినాకర్షించిన కాప్–26 సదస్సు, అట్టహాసంగా మొదలై, ఆశించిన ఫలితాలు లేకుండానే ముగిసింది. కర్బన ఉద్గారాల నికర శూన్యస్థితి ఎప్పటికో... కానీ, ప్రతిష్టాత్మక భాగస్వాముల సదస్సు, ఫలితాలు రాబట్టడంలో మాత్రం ‘నికర శూన్యస్థితి’ని సాధించింది. అగ్ర–సంపన్న దేశాలు పెద్ద హామీలు గుప్పించి నిర్దిష్ట కార్యాచరణకు కట్టుబడకుండానే బయటపడ్డాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం ఆశించిన దిశలో ఫలితాలు రాబట్టడంలో కాప్–26 దారుణంగా విఫలమైంది. కర్బన ఉద్గారాల నికర శూన్యస్థితి (నెట్ జీరో) ఎప్పటికో... కానీ, ప్రతిష్టాత్మక భాగ స్వాముల సదస్సు (కాప్–26), ఫలితాలు రాబట్టడంలో మాత్రం ‘నికర శూన్యస్థితి’ని సాధించింది. ప్రపంచ ప్రజల ఆశల్ని నీరుగార్చింది. తెలుగునాట ప్రచారంలో ఉన్న ‘శుష్క ప్రియాలు–శూన్య హస్తాలు’ సామెత అతికినట్టు సరిపోయింది. గ్లాస్గో (స్కాంట్లాండ్)లో పన్నెండు రోజుల చర్చల సరళి, తుది ఫలితమే ఇందుకు నిదర్శనం! ప్రతి మనిషిని ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పు ప్రమాద నేపథ్యంలో... భూతాపోన్నతి కట్టడికి ప్రపంచ దృష్టి నాకర్షించిన కాప్–26 సదస్సు, అట్టహాసంగా మొదలై ఆశించిన ఫలి తాలు లేకుండానే ముగిసింది. ఐక్యరాజ్యసమితి (యూఎన్), అంతర్ ప్రభుత్వాల బృందం (ఐపీసీసీ) తాజా నివేదిక ప్రపంచాన్ని హెచ్చ రిస్తూ చేసిన ‘కోడ్ రెడ్’ ప్రకటనకు సరితూగే చిత్తశుద్ధి సర్వత్రా లోపిం చింది. సదస్సు చివరి రోజైన శుక్రవారం, యునైటెడ్ కింగ్డమ్ నేతృ త్వంలో ‘కీలక నిర్ణయాల’ (కవర్ డెసిషన్స్) పత్రం సిద్ధమౌతున్న సమయంలోనే.... సదస్సు ఏం సాధించిందని సమీక్షించినపుడు నిరాశే కళ్లకు కడుతోంది. ముసాయిదా ప్రతిలోనే ఆశాజనక ప్రతిపాదనలు లేవు. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తీరని అసంతృప్తి మిగి లింది. ఏ కీలక విషయంలోనూ నిర్దిష్ట అంగీకారం, విస్పష్ట నిర్ణయం ఆవిష్కృతం కాలేదు. ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి పుడమి– జీవరాశిని కాపాడే ధీమా కలిగించకుండానే సదస్సు ముగిసింది. పాత విషయాలనే అటిటు తిప్పి... కొత్త మాటలు చేర్చి, వాగ్దానాలు దట్టించి చెప్పడం తప్ప ఆశాజనక స్థితి లేదు. ఇదొక తీవ్ర ఆశాభంగమని విశ్వ వ్యాప్తంగా పర్యావరణ కార్యకర్తలంటున్నారు. అగ్ర–సంపన్న దేశాలు పెద్ద హామీలు గుప్పించి నిర్దిష్ట కార్యాచరణకు కట్టుబడకుండానే బయటపడ్డాయి. ఆయా దేశాలు, వారి గోప్య ఎజెండాలు, వాటికి లోబడ్డ మార్కెట్ శక్తులు, లాబీయిస్టులు సదస్సులో ఆధిపత్యం చెలా యించారు. వారంతా చర్చల గమనాన్నీ, అంశాల ప్రాధాన్యతల్ని, నిర్ణ యాల సరళిని, గమ్యాన్నీ తాము కోరుకున్న దిశలో నడిపారు. ఏర్పాట్ల నుంచి ఎజెండా దాకా, చర్చల్లో భాగస్వామ్యం నుంచి కార్యాచరణ లోపించడంవరకు ఎన్నెన్నో అంశాలు ప్రశ్నార్థకమయ్యాయి. గ్లాస్గోలో, బయట... ఆది నుంచి కడదాకా నిరసన పర్వం సాగింది. బ్రిటన్ లేబర్ పార్టీ నేత జెర్మీ కోబిన్ అన్నట్టు, ఇది వర్గపోరుగా పరిణమిం చింది. వాతావరణ అత్యయికస్థితి కొందరు సృష్టించే వ్యవస్థల వల్ల పుట్టి, అత్యధికుల్ని వేధించే సమస్య అయిందన్న వ్యాఖ్య అక్షర సత్యం! ఇన్నేళ్లూ కర్బన ఉద్గారాలకు కారకులైన సంపన్న దేశాలు, ఇంకా కాలు ష్యాల వెల్లడికే మొగ్గుతున్నాయి. మరోవైపు అభివృద్ధి చెందుతున్న, చెందని పేద దేశాలను మాత్రం, ఉద్గారాల్ని కట్టడి చేయండని ఒత్తిడి తెస్తున్నాయి. హామీ ఇచ్చినట్టు సాంకేతికతను బదలాయించే, ఆర్థిక సహాయం చేసే ‘వాతావరణ ఆర్థిక వనరుల’ (క్లైమెట్ ఫైనాన్స్)పై కొత్తగా దేనికీ కట్టుబడకుండా ఉత్తి మాటలు చెప్పి జారుకున్నారు. కట్టడికి నిబద్ధత ఏది? భూతాపోన్నతిని 1,5 డిగ్రీల సెల్సియస్‌కు మించనీకుండా కట్టడికి ప్రధానంగా బొగ్గు, పెట్రోలియం వంటి శిలాజ ఇంధన వినియోగాన్ని నిలిపివేయాలి. తద్వారా కర్బన ఉద్గారాల్ని ఆపాలి. అప్పుడే భూతా పోన్నతి ఆగేది. ఇది నిర్దిష్ట కాలపరిమితితో వేగంగా జరగాలి. కానీ, సంపన్నదేశాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ముసాయిదా పత్రంలో ఆఖరి క్షణం వరకు ఉంచిన కీలక ప్రతిపాదనల్ని కూడా, ఉద్యమకారులు సందేహించినట్టే... శుక్రవారం రాత్రి (భారత కాల మానం ప్రకారం) పొద్దుపోయాక నిస్సిగ్గుగా తొలగించారు. ఇంధన– వాహన లాబీ బలానికిది నిదర్శనం. పునరుత్పాదక ఇంధనాల వైపు ఎంత వేగంగా, ఏయే కార్యాచరణతో మళ్లేది సంపన్న దేశాలు స్పష్ట పరచలేదు. ఉద్గారాల శూన్య (తటస్థ)స్థితిని ఎప్పటివరకు సాధి స్తాయో గడువు ప్రకటించి, అదే గొప్ప కర్తవ్యంగా చేతులు దులుపు కున్నాయి. అత్యధిక దేశాలు 2050, చైనా 2060, భారత్ 2070 గడువుగా వెల్లడించాయి. నిజానికిది కాప్ సాధించిందేమీ కాదు! భారత్ తప్ప మిగతా దేశాలన్నీ సదస్సుకు ముందే సదరు లక్ష్యాలు చెప్పాయి. పారిస్ (2015)లో ప్రకటించి, ఎవరికి వారు ‘జాతీయంగా కట్టుబడ్డ తమ భాగస్వామ్యా (ఎన్డీసీ)లను’ కొత్త లక్ష్యాలతో కొన్ని దేశాలు సవరించాయి. కానీ, నాటి ప్రకటన–ఆచరణకు మధ్య వ్యత్యా సాల్ని ఎత్తిచూపే ఏ సమీక్షా కాప్ వేదికలో జరుగలేదు. ‘పారిస్ రూల్ బుక్’ను ఎవరూ ముట్టుకోలేదు. కొత్త వాగ్దానాలెలా అమలుపరుస్తారో నిర్దిష్ట సమాచారం లేదు. బొగ్గు వినియోగం తగ్గించాలన్నారే తప్ప కొత్త ప్లాంట్ల ఏర్పాటు, అంతర్జాతీయ పెట్టుబడులు, విదేశీ ఆర్థిక సహా యాలు, దేశీయ సబ్సిడీలు.. వేటిపైనా నియంత్రణ విధించుకోలేదు. ఉత్తి హామీలే! అందుకే, ‘వాగ్దానాలు కాదు, మాకు కార్యాచరణ కావాలి’ అంటూ గ్లాస్గోలో లక్ష మందికి పైగా పర్యావరణ ఆందోళన కారులు పోగై నిరసన తెలిపారు. భారత్‌తో సహా పలు దేశాల ప్రక టనల్లో హామీకి, ఆచరణకు పొంతనే లేదు. పరస్పర విరుద్ధ పరిస్థి తులున్నాయి. మన దేశంలో బొగ్గు వెలికితీత, ఆ రంగంలో పెట్టు బడులు, ప్రయివేటు శక్తులకు గనులు, తవ్వకాలకు అడవుల్ని దారా దత్తం చేస్తున్న తీరు కాప్ వేదిక నుంచి చేసిన ప్రకటనకు పూర్తి భిన్నం. ఉద్గారాలకు విద్యుత్తు తర్వాత కారణమౌతున్నది రవాణా రంగం. వ్యక్తిగత–ప్రజా రవాణా వాహన వినియోగ విషయంలోనూ స్పష్టత లోపించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లే విషయంలో ఏ ఆచరణాత్మక అంగీకారమూ కుదరలేదు. చేసిన అంగీకార పత్రంపై జర్మనీ, జపాన్, దక్షిణకొరియా వంటి ప్రధాన వాహన ఉత్పత్తి దేశాలే సంతకాలు చేయలేదు. ‘పారిస్‌లో మాట్లాడుకున్నట్టు ఏ ఇంధన వనరుల్నీ పక్ష పాత ధోరణితో చూడొద్దం’టూ సాదీఅరేబియా చేసిన వాదన, వారి లాబీతత్వం తెలిపేదే! పలు విషయాల్లో... సదస్సు ప్రారంభపు విధాన వెల్లడికి, కడకు సంతకాలు చేసిన అంగీకార పత్రాలకి పొంతనే లేదు. పేద అభివృద్ధి చెందుతున్న దేశాలకు శాపంగా... ఈ చర్చల సరళి అంతా... దోషులను దొడ్డదారిలో సాగనంపడం, బాధితులకే కొత్త బంధాలు వేయడం అన్న తరహాలో సాగింది. ఇప్పటి వరకు జరిగిన వాతావరణ అనర్థంలో ఏ మాత్రం పాత్ర–ప్రమేయం లేని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తాజా నియంత్రణలు ప్రతి బంధకమవుతున్నాయి. సాధారణ పద్ధతిలో అభివృద్ధి చెందడానికి శిలాజ ఇంధన వినియోగ కట్టడి, కర్బన ఉద్గారాల నియంత్రణ అడ్డంకి. ప్రత్యామ్నాయాల వైపు మళ్లడానికి అవసరమయ్యే సాంకేతి కత బదలాయింపు, ఆర్థిక సహాయానికి మాటిచ్చి, అభివృద్ధి చెందిన దేశాలు ఆచరించటం లేదు. ఈ ‘వాతావరణ ఆర్థిక వనరు’ విష యంలో కాప్–26 ఓ మార్గదర్శి అవుతుందనుకుంటే, పరిస్థితి ఏం మారలేదు. ఏటా పదివేల కోట్ల (వంద బిలియన్) డాలర్ల ఆర్థిక సహాయానికి 2009లో అంగీకరించిన అభివృద్ధి దేశాలు మాట తప్పాయి. కాప్లోనూ, ‘అవును.. నిజమే.. ఇవ్వాలి... ఇదేం పెద్ద విషయం కాదు... కట్టుబడే ఉన్నాం’ వంటి పొడిపొడి మాటలే తప్ప ప్రణాళిక, విడుదల క్రమాన్నీ వెల్లడించలేదు. అమెరికా అ«ధ్యక్షుడు జో బైడెన్ ఇలాగే స్పందించారు. సదరు ఆర్థిక వనరును నిర్వచించడానికి కూడా సంపన్న దేశాలు సిద్ధంగా లేవు. అది గ్రాంటా? ఎయిడా? పెట్టుబడా? రుణమా? ప్రయివేటు కంపెనీల మధ్య మారకమా? ఏ రూపంలో ఇస్తారనీ తెలుపటం లేదు. నిష్కారణంగా ఇప్పటికే నష్టపో యిన–వేగంగా భంగపోతున్న చిన్న, దీవి దేశాలను ఆదుకునే వారే లేరు. వారి ఆర్తి అరణ్య రోదనే! ప్రకృతి నుంచి తీసుకోవడమే తప్ప వెనక్కి ఇచ్చే సంస్కృతి రావటం లేదు. పైగా, ‘ప్రకృతి ఆధారిత పరిష్కారాలం’టూ కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఒకచోట ప్రకృతికి హాని చేసి, ఇంకో చోట ప్రకృతికి దోహదపడుతూ బాకీ తీరుస్తారట! ఇది మరో స్కామ్! చాలా విషయాల్లో స్పష్టత లేకపోగా కొత్త ఎత్తుగడలు, కార్పొరేట్, పరిశ్రమకు చెందిన లాబీలు పనిచేశాయి. ప్రపంచం ఆశించిన దిశలో ఫలితాలు రాబట్టడంలో కాప్–26 దారుణంగా విఫలమైంది. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ :dileepreddy@sakshi.com -
వాతావరణ సమతుల్యతను కాపాడాలి
పీలేరు(చిత్తూరు జిల్లా): ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను కాపాడి, తద్వారా ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి సూచించారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో స్కాట్లాండ్లో శుక్రవారం నిర్వహించిన గ్లాస్గో సదస్సులో మిథున్‌రెడ్డి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కరోనా వ్యాప్తికి ముందు, తరువాత ప్రపంచంలో జరిగిన మార్పులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాలని కోరారు. -
భూగోళానికి పెనుముప్పు
గ్లాస్గో: వాతావరణ మార్పుల కారణంగా భూగోళానికి పెనుముప్పు పొంచి ఉందని, ప్రపంచ దేశాలు తక్షణమే మేలుకొని, దిద్దుబాటు చర్యలు ప్రారంభించకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. స్కాట్లాండ్లో గ్లాస్గో నగరంలోని స్కాటిష్ ఈవెంట్ క్యాంపస్‌లో ఆయన సోమవారం భాగస్వామ్య పక్షాల 26వ శిఖరాగ్ర సదస్సులో (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) భాగంగా రెండు రోజులపాటు జరిగే ప్రపంచ దేశాల అధినేతల సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. బ్రిటన్ ఆతిథ్యం ఇస్తున్న కాప్–26 నవంబర్ 12 దాకా కొనసాగనుంది. సోమవారం భారత ప్రధాని మోదీ సహా దాదాపు 120 దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం ప్రపంచం అంతం కాకుండా పోరాడే జేమ్స్‌బాండ్ ఆగమనం లాంటిదేనని బోరిస్ జాన్సన్ అభివర్ణించారు. అర్ధరాత్రి కావడానికి మరొక్క నిమిషం మాత్రమే ఉందని, మనం ఇప్పుడే ముందడుగు వేయాలని ఉద్బోధించారు. మాట తప్పితే ప్రజలు క్షమించరు 2015లో పారిస్‌లో జరిగిన కాప్ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఏకాభిప్రాయం సాధించడంతోపాటు కర్బన ఉద్గారాలకు కత్తెర వేసే దిశగా కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి గ్లాస్గోలో కాప్–26 నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పుల ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను జాన్సన్ గుర్తుచేశారు. పాలకులు ఇస్తున్న హామీలన్నీ నీటి మూటలవుతున్నాయని థన్‌బర్గ్ ఆరోపించారని అన్నారు. మాట తప్పితే ప్రజలు మనల్ని క్షమించబోరని చెప్పారు. ‘ఇండియా గ్రీన్ గ్యారంటీ’ భారత్‌లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా 750 మిలియన్ పౌండ్లు విడుదల చేయడానికి ప్రపంచ బ్యాంక్‌కు ‘ఇండియా గ్రీన్ గ్యారంటీ’ ఇస్తామని బ్రిటన్ ప్రకటించింది. క్లీన్ ఎనర్జీ, రవాణా, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రీన్ ప్రాజెక్టులకు ప్రైవేట్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ గ్రూప్ నుంచి 210 మిలియన్ పౌండ్ల రుణ సాయం అందిస్తామని యూకే ప్రకటించింది. తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలి: బైడెన్ గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు చేతులు కలపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోవడానికి సమయం లేదని, తక్షణమే కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. ఆయన కాప్–26లో మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న దుష్పరిణామాలను నివారించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో ప్రపంచ దేశాలకు మరింత సాయం చేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. 2050 నాటికి అమెరికాను క్లీన్ ఎనర్జీ దేశంగా మారుస్తామంటూ జో బైడెన్ ప్రభుత్వ యంత్రాంగం తన ప్రణాళికను విడుదల చేసింది. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం పట్ల జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆయన కాప్ సదస్సుకు క్షమాపణ చెప్పారు. -
పారిస్ ఒప్పందానికి.. కట్టుబడి ఉన్నది మేమే
గ్లాస్గో: వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పారిస్ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి భారత్ సంపూర్ణంగా కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఆయన సోమవారం యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో గ్లాస్గో నగరంలో కాప్–26లో భాగంగా నిర్వహించిన ప్రపంచ దేశాల అధినేతల సదస్సులో మాట్లాడారు. మానవళి మనుగడకు ముప్పుగా మారుతున్న వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా తాము అంకితభావంతో కృషి సాగిస్తున్నామని చెప్పారు. ప్రపంచ జనాభాలో 17 శాతం మంది భారత్‌లో నివసిస్తున్నప్పటికీ మొత్తం ప్రపంచ కర్బన ఉద్గారాల్లో తమ దేశ వాటా కేవలం 5 శాతమేనని మోదీ చెప్పారు. ప్రపంచ స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ నాలుగో స్థానంలో ఉందని వివరించారు. మొత్తం ఇంధన వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటాను గత ఏడేళ్లలో 25 శాతం పెంచామని పేర్కొన్నారు. ఇప్పుడు వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 40 శాతానికి చేరుకుందని తెలిపారు. జీవన విధానంలో మార్పులు చేసుకుంటే భూగోళాన్ని కాపాడుకోవడం సులభమేనని అభిప్రాయపడ్డారు. పర్యావరణహిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది గ్లోబల్ మిషన్‌గా మారాలని ఆకాంక్షించారు. క్లైమేట్ ఫైనాన్స్ కింద ట్రిలియన్ డాలర్లు అందజేస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలను కోరారు. సాధ్యమైనంత త్వరగా ఈ నిధులు సమకూర్చాలని విన్నవించారు. హామీలు ఇచ్చి, ఆచరించకుండా వెనుకడుగు వేస్తున్న అభివృద్ధి చెందిన దేశాలపై ఒత్తిడి పెంచుతామని, అప్పుడే న్యాయం జరుగుతుందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో భారత్ సంకల్పాన్ని వివరిస్తూ ప్రధాని మోదీ ఐదు సూత్రాల ప్రణాళికలను ప్రకటించారు. ప్రకృతితో సహ జీవనం వాతావరణ మార్పులపై కేవలం చర్చలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వాటిని ఎదిరించేందుకు అవసరమైన కార్యాచరణకు ఇవ్వడం లేదని మోదీ ఆక్షేపించారు. తద్వారా ఈ మార్పుల వల్ల ప్రభావితమవుతున్న దేశాలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. సంప్రదాయ పద్ధతుల ప్రకారం ప్రకృతితో కలిసి జీవించడాన్ని పాఠశాలల్లో పాఠ్య ప్రణాళికలో(సిలబస్) చేర్చాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇప్పటికీ ఎన్నో సంప్రదాయ తెగలు ప్రకృతితో కలిసి జీవిస్తున్నాయని గుర్తుచేశారు. ఆ పరిజ్ఞానం ఆయా తెగల ప్రజలకు ఉందని అన్నారు. ఇది ముందు తరాలకు సైతం అందాలంటే సిలబస్‌లో చేర్చాలని చెప్పారు. భారత్‌తో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి విసురుతున్న సవాళ్లు తక్కువేమీ కాదని తెలిపారు. ఈ సవాళ్ల కారణంగా పంటల సాగు తీరే మారిపోతోందని అన్నారు. అకాల వర్షాలు, వరదలు, పెనుగాలులు పంటలను దెబ్బతీస్తున్నాయని వివరించారు. ప్రభుత్వాల విధాన నిర్ణయాల్లో వాతావరణ మార్పులపై పోరాటానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ విషయంలో తాము చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు, క్లీన్ ఇండియా మిషన్, వంట గ్యాస్ సరఫరా వంటి చర్యలు చేపట్టామన్నారు. ఇవన్నీ ప్రజల జీవన నాణ్యత పెరిగేందుకు దోహదపడుతున్నాయని వెల్లడించారు. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో మోదీ సోమవారం సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వనరులు, క్లీన్ టెక్నాలజీ, ఆర్థికం, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. జాన్సన్, మోదీ మధ్య జరిగిన తొలి భేటీ ఇదే కావడం విశేషం. ఐదు సూత్రాల అజెండా 1. శిలాజ ఇంధనాల వినియోగానికి క్రమంగా స్వస్తి. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచుతాం. 2. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్ద పీట. 2030 నాటికి దేశ ఇంధన అవసరాల్లో 50 శాతం ఇంధనం పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటాం. 3. ఇప్పటి నుంచి 2030 దాకా ఒక బిలియన్ (100 కోట్ల) టన్నుల మేర కర్బన ఉద్గారాల తగ్గిస్తాం. 4. కర్బన ఉద్గారాల వల్ల ఆర్థిక వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాన్ని 2030 నాటికి 45 శాతం కంటే తక్కువకు పరిమితం చేస్తాం. 5. నెట్ జిరో(శూన్య) కర్బన ఉద్గారాలు అనే లక్ష్యాన్ని 2070 నాటికి భారత్ సాధిస్తుంది. -
కొత్త చట్టం.. ప్రపంచంలోనే తొలి దేశంగా న్యూజిలాండ్
వెల్లింగ్టన్: బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెట్టుబడి సంస్థలు వచ్చే ఏడాది నుండి తమ పోర్ట్‌ఫోలియోల గ్లోబల్ వార్మింగ్ రికార్డు వెల్లడించేలా న్యూజిలాండ్ ఒక చట్టాన్ని ఆమోదించింది. అంతేకాదు ఇది ఆర్థిక రంగంలో పర్యావవరణ రికార్డును మరింత పారదర్శకం చేసే ప్రథమ చర్యగా అభివర్ణించింది.ఫలితంగా ఈ చట్టాన్ని రూపొందించిన తొలి దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. (చదవండి: శత్రు ట్యాంకులను ఎలా నాశనం చేస్తామంటే!) ఈ మేరకు న్యూజిలాండ్ వాతావరణ మార్పుల మంత్రి జేమ్స్ షా మాట్లాడుతూ..."బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెట్టుబడి సంస్థలు వచ్చే ఏడాది నుండి తమ పోర్ట్‌ఫోలియోల గ్లోబల్ వార్మింగ్ రికార్డు గురించి తప్పనిసరిగా వెల్లడిస్తాయి." అని చెప్పారు. ఈ నెలాఖరున ఐక్యరాజ్యసమితి గ్లాస్గోలో నిర్వహించినున్న వాతావరణ సదస్సలో షా పాల్గోననున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఈ విధంగా ప్రకటించటం ఒకరకంగా పెట్టుబడి రంగం వాస్తవ ప్రపంచ పరిణామాలను తెలియజేయ గలవు అనే విషయాన్ని ప్రపంచదేశాలకి నొక్కి చెప్పగలం అన్నారు. అంతేకాదు వాతావరణ మార్పులకు సంబంధించి స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలిక ప్రభావాలను వారి వ్యాపార నిర్ణయాలలోకి చేర్చడం ద్వారా సంస్థలు మరింత స్థిరంగా మారడానికి ఇది ప్రోత్సహకరంగా ఉంటుందన్నారు. ప్రపంచ అగ్రగామి ఉన్న న్యూజిల్యాండ్ ఆర్థిక రంగం కోసం తప్పనిసరిగా వాతావరణ సంబంధిత రిపోర్టింగ్‌ను ప్రవేశపెట్టి ప్రపంచంలోనే తొలి దేశంగా నిలిచిందని చెప్పారు. (చదవండి: మొసలిని తిప్పితిప్పి తుక్కుతుక్కు చేసింది..!) -
తూర్పు కనుమల్లో తగ్గుతున్న అడవులు
సాక్షి, అమరావతి: వాతావరణ సమతుల్యతను కాపాడటం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో తూర్పు కనుమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నైరుతి, ఈశాన్య రుతు పవనాల గమనంలోనూ వీటి పాత్ర ఎంతో కీలకం. మన రాష్ట్రానికి జీవనాడులుగా ఉన్న కృష్ణా, గోదావరి సహా అనేక నదుల్లో నీరు చేరడానికి ఈ పర్వత శ్రేణులు ఎంతగానో దోహడపడుతున్నాయి. ఆ నదులు పుట్టింది పశ్చిమ కనుమల్లో అయినా.. వాటిలో ప్రవహించే నీరు చాలావరకూ తూర్పు కనుమల్లో పుట్టిన ఉప నదుల నుంచే వస్తోంది. మన రాష్ట్రంలో వంశధార, నాగావళి, చంపావతి, గోస్తనీ, శబరి, సీలేరు, తమ్మిలేరు, గుండ్లకమ్మ, స్వర్ణముఖి, కుందు వంటి అనేక ఉప నదులు ఈ కనుమల్లోనే పుట్టి ప్రధాన నదుల్లో కలుస్తున్నాయి. ఆ నదుల్లోని నీటినే మనం తాగడానికి, ఆహార ధాన్యాలు పండించడానికి వినియోగించుకుంటున్నాం. వేగంగా తరిగిపోతున్న అడవులు తూర్పు కనుమల్లోని అడవులు వేగంగా తరిగిపోతున్నట్టు అశోక్ ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకోలజీ అండ్ ఎన్విరాన్మెంట్ (ఏటీఆర్ఈఈ) ఇటీవల జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఏటా సగటున 28 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఇతర అవసరాలకు మళ్లుతున్నట్టు తేలింది. పోడు వ్యవసాయం, వాణిజ్య తోటల పెంపకం, చెట్లను నరకడం, మైనింగ్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పాపికొండలు, నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ వంటి రక్షిత ప్రాంతాలు మంచి అడవులతో వివిధ జంతు జాలాలకు నిలయంగా ఉన్నా పాడేరు, అరకు, అనంతగిరి, లంబసింగి వంటి ప్రాంతాలు ఇప్పటికే అడవులను కోల్పోయినట్టు తేలింది. వీటి స్థానంలో ఎక్కువ భాగం కాఫీ తోటలు వెలిశాయి. తూర్పు కనుమలు దెబ్బతింటే ఆ ప్రభావం ఈ నదులపై పడుతుంది. అప్పుడు ఈ నదుల నీటిపై ఆధారపడిన మనపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాంటి తూర్పు కనుమల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అత్యావశ్యకమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అరుదైన జంతుజాలం.. తూర్పు కనుమలు హిమాలయాల కంటే పురాతన పర్వత శ్రేణులు. ఇవి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటకలోని కొన్ని భాగాలను తాకుతాయి. 40 శాతం భాగం మన రాష్ట్రంలో ఉంటే ఒడిశా, తమిళనాడులో 25 శాతం చొప్పున, కర్ణాటక, తెలంగాణలో 5 శాతం చొప్పున వీటి విస్తీర్ణం ఉంది. మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తరించి ఉన్నాయి. ఈ పర్వతాల మధ్య కృష్ణా, గోదావరి, పెన్నా వంటి నదులు ప్రవహిస్తుండటం వల్ల అవి విడిపోయి ఉంటాయి. మన రాష్ట్రంలో భాగంగా ఉన్న తూర్పు కనుమల్లోని అడవులు ప్రత్యేకమైన జీవ వైవిధ్యానికి నిలయంగా భాసిల్లుతున్నాయి. గోల్డెన్ గెకో (బంగారు బల్లి), జెర్డాన్ కోర్సర్ (కలివి కోడి), జైపూర్ గ్రౌండ్ గెకో (జైపూర్ నేలబల్లి) వంటి అరుదైన జంతుజాలం ఇక్కడ ఉంది. పశ్చిమ కనుమలపై జరిగినన్ని పరిశోధనలు, అధ్యయనాలు తూర్పు కనుమలపై జరగకపోవడం వల్ల వీటి ప్రాముఖ్యత పెద్దగా వెలుగులోకి రాలేదు. గత 20 ఏళ్లుగా సహజ శాస్త్రాలు నిరాదరణకు గురైనట్టు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు కనుమలతోనే మన భవిష్యత్ తూర్పు కనుమల భవిష్యత్తుతోనే మన భవిష్యత్ ముడిపడి ఉంది. రాజీ లేకుండా అడవులను పరిరక్షించాలి. 18 నెలలుగా ఐఐఎస్ఈఆర్ సిటిజెన్ సైన్స్ నిర్వహించిన కార్యక్రమంలో అనేక పక్షులు, సీతాకోక చిలుకలు, ఇతర జంతు జాలాన్ని కొత్తగా రికార్డు చేశాం. పశ్చిమ కనుమలు, హిమాలయాల మాదిరిగానే తూర్పు కనుముల ప్రాంతం జీవ వైవిధ్యానికి హాట్‌స్పాట్‌గా ఉంది. – రాజశేఖర్ బండి, ఐఐఎస్ఈఆర్ సిటిజన్ సైంటిస్ట్ -
అంతరించిపోతున్న జాబితాలోకి మరిన్ని జీవులు
పరి: ప్రపంచపటంపై అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి మరిన్ని జీవులు చేరుతూనే ఉన్నాయి. 2014తో పోలిస్తే షార్క్‌లు, రే చేపల జనాభా మరింతగా కుంచించుకుపోయిందని తాజాగా విడుదలైన రెడ్లిస్టు చెబుతోంది. అంతర్జాతీయంగా ఉనికి ప్రమాదంలో పడిన జీవజాలం వివరాలను ఐయూసీఎన్(ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) నమోదు చేస్తుంటుంది. తాజాగా కొమొడో డ్రాగన్ కూడా అంతరించే ప్రమాదం ఉన్న జీవుల జాబితాలోకి ఎక్కిందని ఐయూసీఎన్ తెలిపింది. పెరుగుతున్న సముద్రమట్టాలు, ఉష్ణోగ్రతలు పలు జీవజాతుల సహజ ఆవాసాలను ధ్వంసం చేస్తున్నాయని వివరించింది. చెట్ల విషయానికి వస్తే ఎబొని, రోజ్‌వుడ్ జాతుల చెట్లు అంతర్ధాన ముప్పును ఎదుర్కొంటున్నాయి. షార్క్, రే చేపల అంతరించే ముప్పు 2014లో 33 శాతం ఉండగా, 2021నాటికి 37 శాతానికి పెరిగిందని తెలిపింది. చేపలవేట, వాతావరణంలో మార్పులు ఇందుకు కారణమని, సముద్రషార్కుల జనాభా 1970తో పోలిస్తే ప్రస్తుతం 71 శాతం తగ్గిపోయిందని తెలిపింది. అయితే దేశాల మధ్య ఒప్పందాల కారణంగా ట్యూనా జాతి చేపల జనాభాలో పెరుగుదల కనిపించిందని ఐయూసీఎన్ డైరెక్టర్ బ్రూనో ఒబెర్లె చెప్పారు. సంస్థ పరిశీలిస్తున్న 1,38,000 జాతుల్లో దాదాపు 38వేల జాతులు అంతర్ధానమయ్యే ప్రమాదంలో ఉన్నాయి. పక్షుల్లో దాదాపు 18 జాతుల ఉనికి అత్యంత ప్రమాదకర అంచుల్లో ఉందని సంస్థ తెలిపింది. కరిగిపోతున్న మంచు తో 2100 నాటికి దాదాపు 98 శాతం ఎంపరర్ పెంగి్వన్లు నశించిపోయే ప్రమాదం ఉందంది. -
కరోనాను మించిన ముప్పు!
ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన వార్త. మరోసారి అందరినీ అప్రమత్తం చేసిన విషయం. మనం చేస్తున్న తప్పులనూ, ఇప్పటికైనా చేయాల్సిన మన కర్తవ్యాన్నీ గుర్తు చేసిన సుదీర్ఘమైన శాస్త్ర నివేదిక. ‘వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతర్ ప్రభుత్వ సభ్యమండలి’ (ఐపీసీసీ) విడుదల చేసిన 6వ అంచనా నివేదిక (ఎఆర్)ను అభివర్ణించాలంటే ఇలాంటి మాటలెన్నో. ‘వాతావరణ మార్పు 2021 – ది ఫిజికల్ సైన్స్ బేసిస్’ పేరిట వచ్చిన ఈ నివేదిక ముందున్నది ముసళ్ళ పండగ అని గుర్తు చేసింది. ఈ నివేదిక వెలువడ్డ సమయం, సందర్భం కీలకం. ఇటీవల గ్రీసులో, క్యాలిఫోర్నియాలో కార్చిచ్చులు చూశాం, జర్మనీలో వరదలతో వేలమంది నిరాశ్రయులై, నీళ్ళు – విద్యుత్ లేని వైనం తెలుసు. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో మండిన ఎండలు, ఆపై కుండపోత వానలు, వరదలు, కొండచరియలు విరిగిపడడాలూ చూశాం. వాతావరణ మార్పులతో మానవాళికి ముంచుకొస్తున్న ముప్పును గుర్తుచేసిన ఈ ఘటనల నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. పారిశ్రామిక విప్లవం మొదలు మానవ కార్యకలాపాల వల్ల పోగుబడ్డ ప్రభావమే వాతావరణంలో శరవేగంగా మార్పు తెస్తోంది. ఉష్ణోగ్రతలో పెరుగుదల, వడగాడ్పులు, అనూహ్య వర్షాలు, కార్చిచ్చులు – ఇలా ఉత్పాతాల దిశగా నడిపిస్తోంది. ఇలాగే సాగితే ఈ 21వ శతాబ్దంలో ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 నుంచి 2 డిగ్రీలు పెరిగి, శాశ్వత పర్యవసానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మానవాళికి ఇది కరోనాను మించిన ముప్పు. ఆ సంగతే స్పష్టం చేస్తూ, ఎక్కడెక్కడ, ఎలాంటి అనూహ్య మార్పులు రానున్నాయో చెబుతున్న ఈ నివేదిక మానవాళికి ఓ ముందస్తు హెచ్చరిక. ఎనిమిదేళ్ళ శ్రమతో, ప్రపంచ శ్రేణి శాస్త్రవేత్తలు 234 మంది రూపొందించగా, 195 జాతీయ ప్రభుత్వాలు ఆమోదించిన నివేదిక ఇది. గతంతో పోలిస్తే, మరింత కచ్చితమైన పద్ధతులతో అధ్యయనం చేసి మరీ, 3 వేల పైచిలుకు పేజీల తొలి విడత నివేదికలో నిర్దిష్టమైన అంచనాలు వేశారు. అందుకే, ఈ శాస్త్రీయ జోస్యాన్ని ఆషామాషీగా తీసుకోలేం. భారతీయ నమూనాలను కూడా భాగం చేసుకొని మరీ ఈ అధ్యయనం సాగించారన్నది గమనార్హం. మన దేశంలోనూ అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటుచేసుకోనున్నాయని ‘రెడ్ కోడ్’ చూపిందీ నివేదిక. సముద్రమట్టాలు పెరిగి, ముంబయ్, చెన్నై, కొచ్చి, విశాఖపట్నం లాంటి 12 తీరప్రాంత పట్నాలకు ముప్పు తప్పదని హెచ్చరించింది.దక్షిణ భారతావనిలో ఊహించని వర్షాలు ముంచేస్తాయంది. అందుకే, మానవాళిగా మనం చేపట్టాల్సిన చర్యలలో ఇప్పటికే కాలాతీతమైంది అంటున్నారు శాస్త్రవేత్తలు. మూడు దశాబ్దాల క్రితం ఐపీసీసీ తొలి నివేదికను వెలువరించింది. ఈ 30 ఏళ్ళలో ఇది కీలకమైన 6వ నివేదిక. కానీ, వాతావరణ మార్పులను అరికట్టేలా మనం తగిన చర్యలు చేపట్టామా అన్నది ప్రశ్నార్థకం. భూతాపాన్ని పెంచే వాయువుల విడుదలను రానున్న పదేళ్ళలో తక్షణమే తగ్గించకపోతే కష్టమే. భూతాపం 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మించి పెరగకుండా జాగ్రత్త పడాలన్నది 2015 నాటి ప్యారిస్ వాతావరణ ఒప్పందం లక్ష్యం. కానీ, కర్బన ఉద్గారాల్ని తగ్గించాలి, అలా తగ్గించే సాంకేతికతను అన్ని దేశాలకూ అందుబాటులోకి తేవడంలో దేశాల మధ్య ఏకాభిప్రాయం, త్రికరణశుద్ధి ప్రయత్నం ఇవాళ్టికీ కానరావడం లేదు. ప్యారిస్ లక్ష్యం విఫలమైతే మళ్ళీ తగ్గించలేని రీతిలో దుష్ప్రభావాలు పడతాయి. తరచూ వరదలు, భరించలేనంత వడగాడ్పులు, విధ్వంసకర దుర్భిక్షాలు తప్పవన్నది శాస్త్రవేత్తల తీవ్ర హెచ్చరిక. ఇప్పటికే అంతరిస్తున్న బ్రిటన్‌లోని పఫిన్ లాంటి చిన్న పక్షుల మొదలు ప్రపంచంలో ఎన్నెన్ని జీవరాశులు అరుదైపోతాయో లెక్కలేదు. ప్రకృతి ఇస్తున్న ఈ సంకేతాలను ప్రపంచ రాజకీయ నేతలు పట్టించుకోకుంటే కష్టం, నష్టం మనకే. పుడమి తల్లి కష్టాల కూడలిలో ఉన్న వేళ బాధ్యత భుజానికి ఎత్తుకోవాల్సింది ఈ తరమే. రానున్న పదేళ్ళ కాలం అందుకు కీలకం. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న పడికట్టు మాటలతో సరిపెట్టకుండా, విధానపరమైన కృతనిశ్చయం చూపాలి. 2060 నాటికి కర్బన ఉద్గారాలే లేకుండా చేస్తానంటూనే, మరోపక్క దేశవిదేశాల్లో బొగ్గుతో నడిచే విద్యుత్కేంద్రాలు చైనా కడుతూనే ఉంది. ‘వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య పక్షాల 26వ సదస్సు’ (సీఓపీ–26) ఈ అక్టోబర్ – నవంబర్‌లో జరగాల్సి ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ గడ్డపై అత్యంత కీలకమైన సమాలోచనగా భావిస్తున్న ఈ సదస్సుకు అక్కడి బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ఏ మేరకు సిద్ధంగా ఉన్నదీ అనుమానమే. మాటకూ, చేతకూ పొంతన లేని అంశాలు ఇలా ఎన్నో! అయితే, అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ చర్యలు అవసరమని కరోనా అనుభవం ప్రపంచానికి రుజువు చేసింది. వాతావరణ మార్పులపై నివేదిక అలాంటి అవసరమే ఉందని మనకు ‘రెడ్ కోడ్’ సాక్షిగా చెబుతోంది. ఆలస్యం చేసినా, వాయిదా వేసినా తిప్పలు తప్పవు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు ముందడుగు వేసి, వర్ధమాన దేశాలకూ సాంకేతిక పరిజ్ఞానంలో చేయందించాలి. భారత్ కూడా భూతాపోన్నతి పెంచే వాయువులనూ, కార్బన్ డయాక్సైడ్ను వాతావరణం నుంచి తగ్గించాలి. ఇది పర్యావరణ శాఖల బరువే కాదు... ప్రజల జీవనశైలి మార్పుల బాధ్యత కూడా! ఎందుకంటే, కళ్ళెదుటి మార్పుల గురించి ఐపీసీసీ నివేదిక మోగించిన ప్రమాద ఘంటికలు... అక్షరాలా శ్రీశ్రీ అన్న ‘యముని మహిషపు లోహఘంటల’ చప్పుడే! ఇది ప్రపంచం పెనునిద్దర వదలాల్సిన శబ్దం. పెడచెవిన పెట్టేసి, మాటలతో పొద్దుబుచ్చితే– ఫలితం అనుభవించేది మనమే! -
ఏపీలో పెట్టుబడులకు బ్రిటన్ ఆసక్తి: సీఐఐ వెల్లడి
సాక్షి, అమరావతి/మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు బ్రిటన్ ప్రకటించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ)తో పాటు ఇతర పారిశ్రామిక ప్రతినిధులు, రాష్ట్ర అధికారులతో ఏపీలో పర్యటిస్తోన్న ఏపీ, తెలంగాణ బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బృందం సోమవారం సమావేశమైంది. ఫార్మా, బయోటెక్, హెల్త్‌కేర్, లాజిస్టిక్ రంగాల్లో పెట్టుబడులపై బ్రిటన్ బృందం ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సీఐఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రా భోజనం అదుర్స్.. విజయవాడకు వచ్చిన ఆండ్రూ ఫ్లెమింగ్‌తో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ పనితీరు, మహిళా సాధికారిత కోసం తీసుకుంటున్న చర్యలను ఫ్లెమింగ్ అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో బ్రిటిష్ కమిషన్ పొలిటికల్ అడ్వైజర్ నళిని రఘురామన్, మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్.సూయిజ్ ఉన్నారు.అలాగే, గుంటూరు జిల్లా కాజ గ్రామం జాతీయ రహదారి పక్కనే ఉన్న మురుగన్ హోటల్‌ను ఆండ్రూ ఫ్లెమింగ్ సందర్శించారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు హోటల్‌కు వచ్చిన ఆయన ఆంధ్ర వంటకాలను ఇష్టంగా తిన్నారు. ఆంధ్ర భోజనం చాలా బాగుందని కితాబిచ్చారు. అనంతరం ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ భవనంలో అధికారులతో సమావేశమయ్యారు. -
ఆషాఢం: కొత్త దంపతులకు దూరం ఎందుకంటే..?
ఆషాఢ మాసం.. ఎంతో విశిష్టం.. ఏకాదశి, గురుపౌర్ణమి, చాతుర్మాస వ్రతాలు.. పూరీలో జగన్నాథుని రథయాత్ర.. ఇలా ఎన్నో పండుగలు.. మరెన్నో ప్రత్యేకతలు దీని సొంతం.. అయితే నవదంపతులకు మాత్రం భారం.. కోటి ఆశలతో ఒక్కటైన జంటకు నెలపాటు ఎడబాటు.. అయితే ‘సెల్’మోహన రంగా అంటూ.. విరహగీతం ఆలపిస్తారు.. వీడియో కాలింగ్‌లో విహరిస్తారు. ప్రణయ మధురిమలు పంచుకుంటారు.. సరాగాల సరిగమలు పెంచుకుంటారు.. శ్రావణం రావాలి అంటూ నిరీక్షిస్తూ ఉంటారు. సాక్షి, కడప : ఈనెల 11వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలైంది. ఈ మాసాన్ని శూన్యమాసమంటారు. వివాహం లాంటి శుభకార్యాలు తలపెట్టరు. ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి వైష్ణవ ఆరాధకులకు ముఖ్యమైనది. దీన్నే తొలి ఏకాదశి అంటారు. అప్పటి నుంచి ప్రతి వారం ఏదో ఒక పండుగ, వ్రతం, పూజ ఉంటాయి. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు. ► ఆషాఢమాసంలో యువతులు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని పెద్దలు పేర్కొంటారు. గోరింటాకుకు మన సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ► ఆషాఢ పౌర్ణమిని మనం వేద వ్యాసుని పేరిట గురుపౌర్ణమిగానిర్వహించుకుంటాం. ► తెలంగాణలో బోనాల పండుగను నిర్వహిస్తారు. వర్షాల కారణంగా కూరగాయలు బాగా పండుతాయి.. శ్రీ దుర్గామాతను శాకంబరిగా అలంకరించి తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహిస్తారు. ► ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర కూడా ఈ మాసంలోనే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వధూవరుల విరహం.. ఆషాఢ మాసంలో అత్తాకోడళ్లు ఒక ఇంటిలో ఉండకూడదంటారు. కొత్తగా పెళ్లయిన దంపతులను దూరంగా ఉంచుతారు. ఇందులో భాగంగా అమ్మాయిని పుట్టింటికి తీసుకు వెళతారు. ఇందులో శాస్త్రీయత ఉందని పెద్దలు పేర్కొంటున్నారు. ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే తొమ్మిది నెలల తర్వాత వేసవి కాలంలో ప్రసవించే అవకాశం ఉందని, అప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి శిశువుకు ఆ వాతావరణం ఇబ్బంది కలిగిస్తుందని.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, తల్లీబిడ్డల ఆరోగ్యానికి కూడా ఈ వాతావరణం మంచిది కాదంటారు. అందుకే ఆ మాసంలో నూతన దంపతులను దూరంగా ఉంచుతారు. కొత్త కోడలు పుట్టింటికి... ఈ మాసంలో తొలకరి మొదలై మంచి వర్షాలు కురుస్తాయి. పొలం పనులు జోరందుకుంటాయి. ఇంటిలో అందరూ వ్యవసాయ పనులపై పొలానికి వెళ్లినపుడు కొత్తగా పెళ్లయిన జంట ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. అందుకే సంప్రదాయం పేరిట కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే. ఎందుకిలా.. ఆషాఢం మొదలయ్యే నాటికి వర్షాలు కురిసి కొత్త నీరు వస్తుంది. మారుతున్న వాతావరణంలో అనుకూల, ప్రతికూల మార్పులను తట్టుకుని నిలవాలన్నదే ఈ మాసం సందేశం. కొత్త జంటలలో అమ్మాయి ఈ మాసంలో అత్తగారింట్లో ఉండకూడదన్న సంప్రదాయం బాగా ప్రచారంలో ఉంది. శారీరకంగా, మానసికంగా అప్పుడప్పుడే భర్తకు దగ్గరవుతున్న వారు ఈ ఎడబాటు ద్వారా కలిగే ప్రేమ వారి భవిష్య జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందంటారు. ఈ మాసం నూతన జంటలను కొన్నాళ్లపాటు విడదీసి విరహంలో ముంచుతుందని మాత్రమే భావించాల్సిన అవసరం లేదు. వారి మధ్య బంధాన్ని మరింతగా బలపరుస్తుందన్న అవగాహన కలిగి ఉండాలి. ఆధునిక టెక్నాలజి కారణంగా సెల్ఫోన్లలో ఎక్కువగా మాట్లాడుకునేందుకు ఇప్పుడు వీలుంది. నెలరోజుల తర్వాత అంటే శ్రావణమాసంలో మెట్టినింటివారు అమ్మాయికి చీర, సారె పెట్టి ఆశీర్వదించి మంగళ ప్రదంగా తమ ఇంటికి తీసుకు వస్తారు. ఇక్కడితో ఆషాడ మాసపు ఎడబాటు ముగుస్తుంది. అయితే ఈ ఆధునిక కాలపు ఉద్యోగం చేసే జంటకు విరహం, బాధ ఉండదు. వివాహమైన నెలరోజులకే ఉద్యోగం చేసే చోట కొత్త కాపురం పెట్టేస్తుండడంతో అత్తాకోడలు ఒకే ఇంటిలో ఉండే నిబంధన వారికి వర్తించదు. చాతుర్మాస దీక్షలు చేపడతారు.. ఆషాఢాన్ని శూన్య మాసంగా భావిస్తారు. శుభ కార్యాలు చేయకూడదని విశ్వసిస్తారు. నిజానికి పెద్ద పండుగల రాకను ఈ మాసం తెలుపుతుంది. వైష్ణవులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. మఠాధిపతులు ఈ మాసంలోనే చాతుర్మాస దీక్ష వహిస్తారు. – విజయ్‌భట్టర్, అర్చక సంఘం నాయకుడు, కడప ఎన్నో ప్రత్యేకతలు.. ఆషాఢ మాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అత్తాకోడళ్లు ఈ మాసంలో ఒకే ఇంటిలో ఉండకూడదని భావిస్తారు. నిజానికి ఈ నమ్మకం వెనుక ప్రకృతి ఆధారిత సంప్రదాయం ఉంది. దాదాపు అన్ని పండుగల వెనుక ప్రకృతి పరమైన లేదా ఆధ్యాతి్మక, పురాణ పరమైన విశ్వాసాలు ఉంటాయి. – హరిభూషణరావు, లైబ్రేరియన్, కడప -
ముంచుకొస్తున్న ముప్పు
పర్యావరణవేత్తల హితవు అరణ్యరోదనమవుతున్నప్పుడు పర్యవసానాలు ప్రమాదకరంగా పరిణ మించక తప్పదు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై పనిచేస్తున్న ఐపీసీసీ బృందం రూపొందించిన ముసాయిదా నివేదిక భూగోళం నానాటికీ ఎలా నాశనమవుతున్నదో కళ్లకు కట్టింది. సకాలంలో మేల్కొనకపోతే అంచనాలకు భిన్నంగా త్వరలోనే తీవ్రమైన ప్రకృతి వైపరీ త్యాలు తప్పవని, తిరిగి కోలుకోలేనంత నష్టం వాటిల్లడం ఖాయమని హెచ్చరించింది. ఇప్పుడు లీకైన నివేదిక అసంపూర్ణమైనదే. వచ్చే నవంబర్‌లో గ్లాస్గోలో సమితి ఆధ్వర్యంలో జరిగే వాతావరణ సదస్సు కాప్ 26 సారథులు ఇంకా పరిశీలించాల్సివుంది గనుక అధికారికంగా నివేదికను విడుదల చేయలేదు. ఒకసారంటూ ఉష్ణోగ్రతలు నిర్దిష్ట స్థాయికి చేరాయంటే ఆ తర్వాత ఊహకందని వరుస పరిణామాలు చోటుచేసుకుంటాయని నివేదిక అంటున్నది. ఆర్కిటిక్‌లో అతిశీతోష్ణస్థితిలో ఉన్న మంచు పెను ఉష్ణోగ్రతలకు కరగడం మొదలైందంటే భారీయెత్తున మీథేన్ వాయువు వెలువడుతుం దని, శక్తివంతమైన ఈ వాయువు మరింత వేడిమికి కారణమవుతుందని నివేదిక అంచనా. పర్యావరణ పెనుమార్పుల తర్వాత జీవావరణ వ్యవస్థలోని ఇతరాలన్నీ దానికి అనుగుణంగా మారొచ్చు గానీ.. మనిషికి మాత్రం అది అసాధ్యమని, అంతరించిపోవటం ఖాయమని హెచ్చరిస్తోంది. నానాటికీ మనిషి దురాశకు అంతూ పొంతూ లేకుండా పోవడంతో ప్రకృతిలోని పంచభూతాలూ కాలుష్యం బారిన పడుతున్నాయి. కనుకనే వైపరీత్యాలు తప్పడం లేదు. త్రికాలాలూ ఉత్పాతాలను చవిచూస్తున్నాయి. అకాల వర్షాలు, వరదలు, వడగాలులు, కరువుకాటకాలు, భూకంపాలు తరచుగా వేధిస్తున్నాయి. ధ్రువప్రాంతాల్లో మంచు పలకలు కరిగి విరుగుతున్నాయి. సముద్రాలు వేడెక్కు తున్నాయి. ఫలితంగా ప్రపంచ దేశాలన్నిటా ప్రతియేటా కోట్లాదిమంది పౌరుల జీవితాలు చిన్నా భిన్నమవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజలను జాగృతం చేయటం సంగతి అటుంచి, ప్రభుత్వాలే అచేతనంగా పడివుంటున్నాయి. తమ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నాయి. పర్యావరణంపై అంతర్జాతీయ సదస్సులు జరిగినప్పుడు ఒకరు ముందుకు లాగితే, మరొకరు వెనక్కి లాగటం... మర్కట తర్కాలకు దిగటం అగ్ర రాజ్యాలకు అలవాటైపోయింది. 1992లో రియోడి జెనైరోలో ప్రపంచ దేశాలన్నీ తొలిసారి సభ చేసుకుని భూగోళాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరంపై అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. అందరం కలిసి పర్యావరణ క్షీణతను సరిదిద్దుకుందామని సంకల్పం చెప్పుకున్నాయి. అందుకొక కార్యాచరణను సైతం రూపొందించుకున్నాయి. ఆ తర్వాత 1997లో క్యోటోలో శిఖరాగ్ర సదస్సు జరిగింది. అక్కడ కూడా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కదులుదామని తీర్మానించాయి. 1990 నాటితో పోలిస్తే 2012కల్లా 5 శాతం ఉద్గారాలను తగ్గించు కోవాలని నిర్ణయించాయి. ఇందుకు అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు అల్ గోర్ సైతం అంగీకరించి సంతకం చేశారు. కానీ ఇదంతా అశాస్త్రీయమని, చాదస్తమని అమెరికన్ కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు అడ్డుకున్నారు. దాంతో ఆ వాగ్దానం కాస్తా అటకెక్కింది. క్యోటో శిఖరాగ్ర సదస్సు తీసుకున్న నిర్ణయా లన్నీ ఆవిధంగా దాదాపు దశాబ్దంపాటు స్తంభించిపోయాయి. అగ్ర దేశమే ఇలా అఘోరిస్తే వేరే దేశాల సంగతి చెప్పనవసరం లేదు. ఇతర సంపన్న దేశాలు సైతం పట్టనట్టు వుండిపోయాయి. 2015నాటి పారిస్ శిఖరాగ్ర సదస్సు ఒడంబడికపై అందరూ ఆశావహ దృక్పథంతో వుంటుండగా, అమెరికాలో ట్రంప్ మహాశయుడు పగ్గాలు చేపట్టి ఆ ఆశలపై చన్నీళ్లు చల్లారు. జో బైడెన్ అధికారం లోకొచ్చాక పారిస్ ఒడంబడికను గుర్తిస్తున్నట్టు అమెరికా తెలియజేసింది. వాస్తవానికి ఆ ఒడంబడిక లక్ష్యాలు కనీసం మూడింతలు మించితే తప్ప ప్రయోజనం శూన్యమని పర్యావరణవేత్తలు పెదవి విరిచారు. విషాదమేమంటే, కనీసం అదైనా సక్రమంగా అమలు కావటం లేదు. ఈసారి ఐపీసీసీ ముసాయిదా నివేదికలో ఉపయోగించిన భాష ఎలాంటివారికైనా దడ పుట్టి స్తుంది. ఆకలి, అనారోగ్యం, కరువు కొన్ని దశాబ్దాల్లోనే కోట్లాదిమందిని చుట్టుముడతాయని ముసా యిదా హెచ్చరించింది. 2050 నాటికి మరో 8 కోట్లమంది ఆకలి బారిన పడతారని, ఆసియా, ఆఫ్రి కాల్లో అదనంగా కోటిమంది పిల్లలు పౌష్టికాహార లోపంతో వ్యాధుల బారిన పడతారని తాజా ముసాయిదా చెబుతున్నది. గత నివేదికలు సైతం జరుగుతున్న పరిణామాలపై, రాగల ప్రమాదా లను ఏకరువు పెట్టిన మాట వాస్తవమే. కానీ ఎలాంటి మార్పుల తర్వాత ఇక వెనక్కి వెళ్లలేని స్థితికి చేరుకుంటామన్న అంశంలో శాస్త్రవేత్తలకు ఇంత స్పష్టత లేదు. అటువంటివాటిని తాజా ముసాయిదా డజనువరకూ గుర్తించింది. 2050 నాటికి భూతాపం పెరుగుదలను పారిశ్రామికీకరణకు ముందున్న ఉష్ణోగ్రతలకంటే 2 డిగ్రీల సెల్సియస్ మించకుండా చూడాలని, అది కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ కైనా పరిమితం కావాలని పారిస్ శిఖరాగ్ర సదస్సు భావించింది. తాజా ముసాయిదా భూగోళం 3 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలను చవిచూడబోతున్నదని జోస్యం చెబుతోంది. 2100లోగా పర్యావ రణం పెను మార్పులు చవిచూసే అవకాశంలేదని గత నమూనాలు సూచించగా, తాజా ముసా యిదా మాత్రం అందుకు భిన్నమైన అంచనాలు చెబుతోంది. కనుక ఈ విశ్వంలో జీవరాశికి చోటి స్తున్న ఒక్కగానొక్క భూగోళాన్నీ రక్షించుకునే నిర్ణయాలు వేగిరం తీసుకోనట్టయితే, ఇది సైతం అంత రించటం ఎంతో దూరంలో లేదని అన్ని దేశాలూ... ప్రత్యేకించి సంపన్న దేశాలూ గ్రహించటం తక్షణావసరం. -
చైనా దూకుడును అడ్డుకుందాం
కార్బిస్‌బే(ఇంగ్లండ్)/బీజింగ్: పేద దేశాలకు 100 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు అందజేయాలని గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) దేశాల అధినేతలు తీర్మానించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత వేగంగా పరుగులు పెట్టడానికి సహకరించాలని నిర్ణయించారు. ప్రపంచ మానవాళి పాలిట పెనుముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పులపై కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించారు. జిన్జియాంగ్ ప్రావిన్స్, హాంకాంగ్‌లో మానవ హక్కులను చైనా నాయకత్వం నిర్దాక్షిణ్యంగా కాలరాస్తోందని మండిపడ్డారు. చైనా దూకుడును కచ్చితంగా అడ్డుకుందామంటూ తీర్మానం చేశారు. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. బాలికల విద్య, భవిష్యత్తులో మహమ్మారుల నివారణ, ‘మళ్లీ మెరుగైన ప్రపంచం నిర్మాణం’లో భాగంగా ఆఫ్రికాలో రైల్వేలు, ఆసియాలో విండ్ ఫామ్స్‌కు సాయం అందించడం, పునరుత్పా దక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం›వంటి వాటిపై తీర్మానాలు చేశారు. 2050 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించుకోవాలని నిర్ణయానికొచ్చారు. -
AP: రానున్న మూడు రోజుల వాతావరణ ఇలా ఉండనుంది
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాడు సౌత్ బంగాళాఖాతం కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులు, మొత్తం దక్షిణ అండమాన్ సముద్రం, ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలలో ప్రవేశించాయి. రానున్న 48 గంటలలో నైరుతి బంగాళాఖాతము మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులు, ఈస్ట్‌సెంట్రల్ కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం దానిని అనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో 3.1కి.మి & 5.8 కి.మిలో మధ్య కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వలన తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో సుమారుగా 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది 24వ తేదీకి బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి సుమారుగా 26వ తేదీ ఉదయాన ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరానికి చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ►ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉండగా, భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది . అలాగే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ►ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు )తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ►ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు )తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ►రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు )తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ►ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు)తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ: ►ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు)తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ►రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు )తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ►ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ వివరాలను భారత వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: INS Rajput: ‘రాజ్‌పుత్’కు వీడ్కోలు -
వాతావరణ మార్పులపై సమగ్ర పోరాటం
న్యూఢిల్లీ/రియాద్: ప్రపంచాన్ని భయపెడుతున్న వాతావరణ మార్పులపై అరకొర పోరాటం సరిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సంపూర్ణ, సమగ్ర పోరాటంతోనే వాతావరణ మార్పులను ఎదిరించవచ్చని స్పష్టం చేశారు. ఆయన ఆదివారం జీ20 సదస్సులో సేఫ్గార్డింగ్ ద ప్లానెట్: ద సర్క్యులర్ కార్బన్ ఎకానమీ అప్రోచ్ అనే అంశంపై మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా చేయూతనివ్వడం ద్వారా ప్రపంచం మరింత వేగంగా ప్రగతి సాధిస్తుందని తెలిపారు. పారిస్ ఒప్పందంలోని లక్ష్యాల కంటే ఎక్కువే భారత్ సాధించిందని పేర్కొన్నారు. పర్యావరణంతో కలిసి జీవించాలన్న భారతీయ సంప్రదాయం స్ఫూర్తితో తక్కువ కార్బన్ ఉద్గారాల, వాతావరణ పరిరక్షణ అభివృద్ధి విధానాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. వ్యక్తి శ్రేయస్సుతోనే మొత్తం మానవాళి శ్రేయస్సు సాధ్యమని వెల్లడించారు. శ్రామికులను కేవలం ఉత్పత్తి సాధనాలుగా మాత్రమే చూడొద్దన్నారు. ప్రతి శ్రామికుడికి తగిన గౌరవం దక్కేలా చూడాలని ఉద్బోధించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మనుషుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. కానీ, అదే సమయంలో వాతావరణ మార్పులను ఎదుర్కోవడంపై సైతం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాల తగ్గింపునకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందంపై భారత్ సంతకం చేసిందన్నారు. ఒప్పందంలోని లక్ష్యాలను భారత్ సాధించిందన్నారు. భారత్‌లో ఎల్ఈడీ లైట్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. దీనివల్ల 38 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామన్నారు. ఉజ్వల పథకం కింద 8 కోట్ల కుటుంబాలకు పొగ రహిత వంటగదులు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ ఎనర్జీ కార్యక్రమమని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ కృషితో భారత్‌లో పులులు, సింహాల జనాభా పెరుగుతోందని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, 2023లో జరగనున్న జీ20 భేటీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. యూపీలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని విద్యాంచల్ ప్రాంతం వనరులున్నప్పటికీ వెనుక బాటుకు గురైందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాల లేమి కారణంగా ఈ ప్రాంతం నుంచి ప్రజలు వలసవెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయ న్నారు. ఆదివారం ఆయన వింధ్యాచల్ ప్రాంతంలోని మిర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. జల్‌జీవన్ మిషన్ కింద చేపట్టే రూ.5,555.38 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుల ద్వారా 2024కల్లా 2,995 గ్రామాల్లోని ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం. -
ఈ బురదలో ‘మురుగూ’ ఉంది!
ఎండలు కాసేదెందుకురా? మబ్బులు పట్టేటందుకురా! మబ్బులు పట్టేదెందుకురా? వానలు కురిసేటందుకురా వానలు కురిసేదెందుకురా? చెరువులు నిండేటందుకురా! చెరువులు నిండేదెందుకురా? పంటలు పండేటందుకురా! పంటలు పండేదెందుకురా? ప్రజలూ బతికేటందుకురా! ప్రజలూ బతికేదెందుకురా? మంచినిపెంచేటందుకురా! ఇది చిన్నతనంలో మనమంతా పాడుకున్న పాట. మంచిని పెంచుతున్నామా? తుంచుతున్నామా? అన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్న. మంచినే పెంచితే... ఇన్ని అనర్థాలు ఎందుకుంటాయి? ఎవరి స్థాయిలో వారు చేయాల్సింది చేయకపోవడం, చేయకూడనిది చేయ డంవల్ల విపరీత పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. ఎండలు వెర్రిగా కాస్తున్నాయి. వానలు అడ్డదిడ్డంగా, అసాధారణంగా కురుస్తున్నాయి. కబ్జాలతో కనుమరుగు కాగా మిగిలిన చెరువులు నిండో, తెగో రాజ ధాని హైదరాబాద్‌లో కాలనీలను ముంచెత్తుతున్నాయి. అక్రమ నిర్మా ణాల వల్ల నదుల్లో, నాలాల్లో, నడివీధుల్లో పరవళ్లు తొక్కిన వరదలు సమస్తాన్నీ ఊడ్చుకుపోతున్నాయి. పల్లానికి పరుగు తీయాల్సిన నీరు కాలనీల్లో నిలిచి, జనావాసాల్లో తిష్టవేస్తోంది. పది రోజులవుతున్నా వేలాది ఇళ్లు, బంగళాలు ఇంకా నీటిలోనో, బురదలోనో ఉన్నాయి. బతుకు ఛిద్రమై జనం అల్లాడుతున్నారు. ఇంటికో కన్నీటి గాథ ఉంది. హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన వాన–వరద బీభత్సమైనా, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పంటల నష్టమైనా.... కేవలం ప్రకృతి వైపరీత్యం అనడానికి లేదు. దానికి తోడైన మానవ తప్పిదం నష్టాన్ని ఎన్నో రెట్లు పెంచింది. మారిన వాతావరణ పరిస్థితుల (క్లైమెట్ చేంజ్) వల్ల తలెత్తే తీవ్ర ఘటనలు సరేసరి! సరైన విధానం, ప్రణాళిక, వ్యూహం లేకపోవ డమే ఓ పెద్ద సమస్య! ముంచుకొచ్చిన సమస్య తీవ్రత గుర్తించి సకా లంలో తగినట్టు స్పందించకపోవడం ఏ విధ్వంసానికి దారితీసిందో ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. మహానగరం, శివారు కాలనీల్లోని వేలాది కుటుంబాలు ఈ రోజు ఎదుర్కొంటున్న దయనీయ స్థితికి గుండె తరుక్కుపోతుంది. ఇల్లు చెరువైన నిర్భాగ్యుడొకరు పదో రోజున కూడా ఒంటి మీద అవే బట్టలు, కంట్లో అదే ఆరని తడి... పలుకరించవచ్చిన వారిని దీనంగా చూస్తుంటే ఎవరికి మాత్రం హృదయం కదలదు? ఇది అనూహ్యంగా వచ్చిన ప్రమాదమేమీ కాదు. ఎన్నో హెచ్చరికలు, ఎన్నెన్నో అధ్యయన నివేదికలు, ఇరుగుపొరుగు రాష్ట్ర రాజధానులు చెన్నై, ముంబాయి, బెంగళూరు వంటి మహానగరాల్లోని మరెన్నో చేదు అనుభవాలు చూసిన తర్వాత కూడా మేల్కొనని మొద్దు నిద్ర ఫలితం! హైదరాబాద్వి బహుముఖ సమస్యలు ఇలాంటి పరిస్థితుల్లో ద్విముఖ వ్యూహం కావాలి. దీర్ఘకాలిక ప్రణాళిక, విపత్తు తలెత్తినపుడు ప్రభావవంతమైన తక్షణ చర్యలు, రెండూ ఉండటం లేదు. ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలే! కంటి తుడుపు పనులే! వర్షతీవ్రత, దాని ముప్పు నుంచి హైదరాబాద్‌ను సురక్షితంగా ఉంచడంలో వరుస ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నూరేళ్ల కింద ఇలాగే వరద ముంచెత్తినపుడు, నిజాం చొరవతో విశ్వే శ్వరయ్య రూపొందించిన మాస్టర్ ప్లాన్ తర్వాత అలాంటి విస్తృత ప్రణాళికేదీ ఇన్నాళ్లు ముందుకు రాలేదు. వచ్చిన అరకొర అమలుకు నోచలేదు. అమలైన వాటికి అతీగతీ లేదు. మహానగర పాలక సంస్థ పరిధి ఇప్పుడు 625 చ.కి.మీ విస్తరించి, వేలాది కాలనీలు వెలసిన తర్వాత కూడా తాగునీరు, వరదనీరు, మురుగునీటి నిర్వహణకు సరైన వ్యవస్థే లేదు. మహానగరంలో 9వేల కిలోమీటర్ల నిడివి రోడ్లకు ఇరువైపుల సరైన వరదనీటి కాల్వలు లేవు. చాలా చోట్ల మురుగునీటి కాల్వలు, వరదనీటి కాల్వలు కలిసిపోతాయి. అందుకే, చిన్న వానొ చ్చినా రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తాయి. ఇవాళ వేలాది ఇళ్లల్లో చేరిన నీరైనా, బురదైనా మురుగుతో కూడుకున్నదే! ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు ఏడు వేల కిలోమీటర్ల నిడివి మురుగునీటి వ్యవస్థ అందుబాటులో ఉంది. అవసరాలు తీర్చే సామర్థ్యం లేని, కాలం చెల్లిన పైపులైన్లు చాలా చోట్ల ఉన్నాయి. పాతబస్తీలో కొన్ని చోట్ల నిజాం కాలం నాటి పైపులే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. ఇక అక్రమ నిర్మాణాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రభుత్వమే మూసీ నదీ గర్భంలో నిర్మాణాలు జరిపిన అతిపెద్ద ఆక్రమణదారు. ప్రయివేటుకు లెక్కే లేదు. నాలాలపైన, చెరువుల్లో, పార్కుల్లో... ఇలా ఎక్కడ పడితే అక్కడ అక్రమ కట్టడాలొస్తున్నాయి. క్రమబద్ధీకరణలు వరమా? శాపమా? భవనాల (బీఆరెస్), లే అవుట్ల (ఎల్లారెస్) క్రమబద్ధీ్దకరణ పథకాలు దీర్ఘకాలంలో ముప్పుగా మారుతున్నాయి. పర్యావరణపరంగా, భద్ర తపరంగా.. ఎలా చూసినా ఆయా నగరాలు, పట్టణాల క్రమాభివృద్ధికి అవే అవరోధమవుతున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో పౌరులకు అదొక వెసలుబాటులా కనిపిస్తున్నా, వాస్తవంలో అవి అలా లేవు. వర్తమాన, భవిష్యత్ ఆక్రమణలు, అక్రమనిర్మాణాలను ప్రోత్సహించేవిగా ఉంటు న్నాయి. పథకం ప్రకటన, తరచూ గడువు పొడిగింపులు ఎలా ఉంటు న్నాయంటే... ప్రకటించాక తొలి ఇటుక కొని అక్రమనిర్మాణం జరిపిన వారికి కూడా వెçసులుబాటు వర్తిస్తోంది. ప్రభుత్వాలు ఆయా పథకా లను ఆదాయవనరుగా చూడటం దారుణం. ఖర్చులకు గడవనంత ఆర్థిక ఇబ్బంది రాగానే క్రమబద్ధీకరణ పథకాలు ప్రకటించి, తరచూ పొడిగించి ఖజానా నింపుకోవడంకన్నా దౌర్భాగ్యమేముంటుందని పర్యావరణ నిపుణులంటున్నారు. సదరు ఉల్లంఘనలను మొదట ఉపేక్షించిన అధికారులు, బాధ్యులపై ఏ చర్యలూ ఉండటం లేదు. వివాదాస్పద భూములు, బఫర్ జోన్లు, చెరువులు–కుంటల శిఖం భూముల్లో, ఎప్టీఎల్ వరకు జరిగే నిర్మాణాలు, వెంచర్ల వెనుక ఉండేది ఎక్కువగా రాజకీయ నాయకులే! వారికదో పెద్ద ఆదాయ వనరు. దీనికి తోడు, ‘ఆపరేషన్ ఆకర్ష్’ వంటి రాజకీయ పథకాల్లో సహకరిం చిన వారికి జాగీర్లలాగా ఆయా ప్రాంతాలనే ఇచ్చేస్తుంటారు. నిబం ధనల్ని ఉల్లంఘించి నిర్మాణాలు జరిపేటప్పుడేమో.. లంచాలు తినే తప్పుడు అధికారులకు, నిర్మాణాలు జరిగిపోయాక.. పథకం ప్రక టించే ప్రభుత్వాలకు ఇదొక మంచి రాబడి మార్గమయింది. అంటే, చట్టోల్లంఘన చేసేవారి తప్పుడు సంపాదనలో అధికారికంగా వాటా దక్కడమే! హైదరాబాద్ శివారుల్లోని 11 మున్సిపాలిటీలు 2007లో కార్పొరేషన్లో విలీనమ య్యాయి. ఈ పరిధి వేలాది కాలనీల్లో లక్షల అక్రమ నిర్మాణాలొ చ్చాయి. సుమారు 185 చెరువులు, 200 పైచిలుకు కుంటల్లోనూ లక్షల అక్రమ నిర్మాణాలున్నాయి. 1500 కి.మీ నిడివి నాలాలపైన 9 వేల అక్రమనిర్మాణాల్ని ఇపుడు తొలగించాల్సి ఉంది. పట్టణాలు, గ్రామాల్లోనూ..... మారిన వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పి దాలు తోడయ్యే దుస్థితి నగారలకే పరిమితం కాలేదు. దురాక్రమ ణలు, అక్రమ నిర్మాణాలు పట్టణాలు, పల్లెలకూ విస్తరించాయి. ముఖ్యంగా భూముల ధరలు ఆకాశాన్నంటాక అన్ని అనర్థాలూ చోటు చేసుకుంటున్నాయి. వాగులు, వంకలు, బంజర్లు, పోరంబోకు భూముల్ని అడ్డంగా ఆక్రమించుకుంటున్నారు. పట్టణాల చుట్టూ పెద్ద గృహనిర్మాణ వెంచర్లు వెలుస్తున్నాయి. చెరువు శిఖాల్లో, ప్రభుత్వ భూముల్లోనూ జరుగుతోంది. వర్షాలు కురిస్తే వరద నీరు వెళ్లే మార్గాలు కుంచించుకుపోతున్నాయి. ఎక్కడికక్కడ కొత్త ఆయకట్టు పెరిగిపోయి వాన రాగానే వరద పంట పొలాలపైకి మళ్లుతోంది. వర్ష–వరద తీవ్రత వల్ల పంటలు నాశనమవుతున్నాయి. గత వారం కురిసిన అసాధారణ వానలకు తెలంగాణలో దాదాపు 14 లక్షల ఎకరాల్లో వరి, పత్తి వంటి పంటలు నాశనమయినట్టు ప్రాథమిక సమాచారం. ఏపీలో కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో వరి, అనంత పురం వంటి రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ, ఇతర పలు జిల్లాల్లో తమలపాకు, అరటి వంటి పంటలకు నష్టం జరిగింది. వాతావరణ మార్పుల వల్ల జూలైలో రావాల్సిన గట్టి వానలు సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో పడుతున్నాయి. ఈ సారి వర్షపాతం బాగుండి ఇప్పటికే అత్యధిక చెరువులు నిండాయి. తెలంగాణలో ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువుల్లో పూడికలు తీసి, అలుగులు, తూముల మరమ్మతులు చేసి సీజన్ నాటికి సంసిద్ధం చేసుండటం వల్ల చెరువులన్నీ నిండు కుండల్లా ఉన్నపుడు తాజా వానలొచ్చాయి. చెరువు కట్టల పరిస్థితి గంభీరంగా ఉందని పౌరసమాజ సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. బలహీనంగా ఉన్నచోట కట్టల్ని పటిష్టపరచుకోవాల్సింది. నగరం, శివారు చెరువుల విషయమై నిర్దిష్టంగా పేర్కొన్నారు. వానలు జోరుగా కురిసిన అక్టోబరు 12, 13, 14 తేదీల్లో కూడా ఈ హెచ్చరిక లున్నాయి. ప్రకృతిని గౌరవిస్తేనే....! వాతావరణ మార్పు ప్రమాద సూచికలను ప్రభుత్వాలు పెద్దగా ఖాతరు చేయడం లేదు. దాన్ని ఎదుర్కొనేందుకు, నష్ట నివారణకు నిర్దిష్ట ప్రణాళిక ఉండాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసల్ని, మహా నగరాల విస్తరణని ప్రభుత్వాలు నిలువరించాలి. సాంకేతికత పెరిగి, ఇంటి నుంచే వృత్తి–ఉద్యోగ బాధ్యతలు నిర్వహించగలిగే పరిస్థితులు ఎక్కువైన నేపథ్యంలో శాటిలైట్ పట్టణాల వృద్ధిని ప్రోత్సహించాలి. ఎక్కటికక్కడ టౌన్ ప్లానింగ్ కఠినంగా అమలుపరచాలి. శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించి, సౌర–పవన వంటి పునర్వినియోగ విద్యుచ్ఛక్తి వాడకం పెంచాలి. వాయు, జల కాలుష్యాల్ని నివారించాలి. వ్యర్థాల తొలగింపు, నిర్వహణ శాస్త్రీయ పద్ధతుల్లో జరగాలి. భవన నిర్మాణ వ్యర్థాల నుంచి అన్నింటిని మూసీలో కుమ్మరించడం కూడా నీటి ప్రవాహాన్ని అడ్డుకొని, నిన్నటి ప్రమాదాన్ని తీవ్రం చేయడం కళ్లారా చూశాం. కేంద్రంలో, రాష్ట్రంలో పకడ్బందీ భూవినియోగ విధానం లేకపోవడం ఓ పెద్ద లోపం. ఇదివరలో భూముల్ని పలు రకా లుగా నిర్వహించేది. ప్రయివేటుతో పాటు ప్రభుత్వ, అటవీ, బంజరు, గైరాన్, పోరంబోకు, మైదాన.... ఇలా వేర్వేరుగా! ఏ భూమైనా మరో వినియోగంలోకి మారేటప్పుడు పద్ధతులు పాటించేది. అవన్నీ ప్రతి బింబిస్తూ ఇప్పుడొక పటిష్ట భూవినియోగ విధానం రూపొందించాలి. వాతావరణంలో కీలకమైన జలవనరులు, అడవులు, కొండలు, గుట్టల్ని పరిరక్షించాలి. ప్రభుత్వ భూముల్లో దురాక్రమణల్ని తొలగిం చాలి. హైదరాబాద్‌తో సహా నగరాలు, పట్టణాల్లో నదులు, నాలాలపై అక్రమ నిర్మాణాల్ని తొలగించి, పూడిక తీసి ప్రక్షాళన చేయాలి. నీటి ప్రవాహాన్ని కాస్త ముందుగానే లెక్కించే సెన్సర్లు ఏర్పరచాలి. విపత్తు నిర్వహణ సంస్థ మరింత క్రియాశీలం కావాలి. ప్రభుత్వాలు ప్రణాళికా బద్ధంగా దీర్ఘకాలిక–తక్షణ చర్యలతో వ్యవహరించకుంటే..... మనం పాటలో చెప్పుకున్న పరిస్థితులు తలకిందులవుతాయి. ఎండలు– మబ్బులకు, మబ్బులు–వానలకు, వానలు–చెరువులకు, చెరువులు– పంటలకు, పంటలు–ప్రజలకు, ప్రజలూ–మంచితనానికి మధ్య సంబంధాలు తీవ్రంగా బెడిసినట్టే! తస్మాత్ జాగ్రత్త!! -దిలీప్ రెడ్డి ఈ-మెయిల్: dileepreddy@sakshi.com -
‘సీతాకోక’ నెలవు.. జీవ వైవిధ్య కొలువు
సాక్షి, అమరావతి: ఒక ప్రాంతంలో జీవ వైవిధ్యం ఎలా ఉందనేది అక్కడున్న సీతాకోకచిలుకల గమనం ప్రతిబింబిస్తుంది. వీటి ఉనికి ఆ ప్రాంతంలోని పర్యావరణ సమతుల్యతను తేటతెల్లం చేస్తుంది. తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల వాటి సంఖ్య అనూహ్యంగా తగ్గిపోతున్న తరుణంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వాటి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంత పరిధిలో జీవ వైవిధ్యం మెరుగ్గా ఉన్నట్టు పర్యావరణ వేత్తలు గుర్తించారు. ఈ అటవీ ప్రాంత పరిధిలోని మూలపాడులో సీతాకోకచిలుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన దేశంలోనూ సర్వే.. విదేశాల్లో మాదిరిగా జీవ వైవిధ్యాన్ని తెలుసుకునేందుకు గత సంవత్సరం నుంచి భారత్‌లోనూ పర్యావరణ వేత్తలు సీతాకోకచిలుకలపై సర్వే ప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకూ బిగ్ బటర్‌ఫ్లై మంత్–2020గా ప్రకటించి సర్వే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కొండపల్లి అటవీ ప్రాంతంలో 15 కి.మీ. పరిధిలో స్థానిక అటవీ శాఖ అధికారుల సహకారంతో నేషనల్ బట్టర్ఫ్లై కన్సర్వేషన్ సొసైటీ సభ్యులు దాసి రాజేష్ వర్మ, బండి రాజశేఖర్ బృందం సర్వే నిర్వహించి 20 రోజుల్లోనే ఆరు రకాల కొత్త జాతులు ఇక్కడ ఉన్నట్టు గుర్తించింది. వీరు మూలపాడు వద్ద కొత్తగా 6 సీతాకోక చిలుక జాతులను కనుగొన్నారు. అవి 1.ట్రై కలర్ పైడ్ ఫ్లాట్, 2.కంప్లీట్ పెయింట్ బ్రష్ స్విఫ్ట్, 3.బాంబూ ట్రీ బ్రౌన్, 4.డింగీ లైన్ బ్లూ, 5.పాయింటెడ్ సిలియేట్ బ్లూ, 6.గోల్డెన్ ఏంజిల్. ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించే చెట్లు, వన్యప్రాణులు ఎక్కువగా ఉండటం వల్లే కొత్త జాతులు ఇక్కడకు వస్తున్నట్టు సర్వే బృందం గుర్తించింది. కొత్తగా కనుగొన్న జాతులతో కలిపి ఈ ప్రాంతంలో ఉన్న సీతాకోకచిలుక జాతుల సంఖ్య 62కి చేరింది. ఈ ప్రాంత గొప్పతనం.. విజయవాడకు సమీపంలో ఇంతటి జీవ వైవిధ్యం ఉన్న అటవీ ప్రాంతం ఉండటం విశేషం. కాలుష్యం, పట్టణీకరణ, వాతావరణ మార్పుల వల్ల ఇక్కడా సీతాకోకచిలుకల సంఖ్య గతం కంటె తగ్గుతున్నా కొత్త కొత్త జాతులు మనుగడ సాగిస్తున్నాయి. ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – దాసి రాజేష్ వర్మ, బట్టర్ఫ్లై కన్సర్వేషన్ సొసైటీ సభ్యుడు మారుతున్న పరిస్థితుల వల్లనే.. ఇంతకుముందు ఈ జాతులు ఇక్కడ కనపడేవి కాదు. మారిన వాతావరణ పరిస్థితులను బట్టి అవి ఈ ప్రాంతానికి వస్తున్నట్టు గుర్తించాం. గత సంవత్సర కాలంగా ఈ ప్రాంతంలో పలు కొత్త జాతులను కనుగొన్నారు. ఇక్కడున్న చెట్లు, వన్యప్రాణుల వైవిధ్యం వల్లే ఇవి ఇక్కడ ఎక్కువగా ఉంటున్నాయి. – బి.లెనిన్ కుమార్, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కొండపల్లి రిజర్వుడ్ ఫారెస్ట్ -
చైనా కంటే ఆ దేశమే సమస్యాత్మకం..
వాషింగ్టన్ : వాతావరణ మార్పులపై పోరాటం, కార్బన్ ఉద్గారాల నియంత్రణలో చైనా కంటే భారత్ అత్యంత సమస్యాత్మకమని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్ధి, న్యూయార్క్ మాజీ మేయర్ మైకేల్ బ్లూమ్‌బర్గ్ అన్నారు. లాస్‌వెగాస్‌లో డెమొక్రటిక్ ప్రెసిడెన్షియల్ తొలి డిబేట్లో పాల్గొన్న బ్లూమ్‌బర్గ్ 2015 ప్యారిస్ వాతావరణ మార్పుల ఒప్పందం నుంచి అమెరికాను దూరం చేయడం ట్రంప్ ప్రభుత్వ తప్పిదమని దుయ్యబట్టారు. ఇక వాతావరణ మార్పుల విషయానికి వస్తే చైనా ఈ విషయంలో కొంత వెనక్కితగ్గినా భారత్ అత్యంత సమస్యాత్మకంగా మారిందని దీనిపై ఏ ఒక్కరూ ఏమీ చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనాలో మీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన క్రమంలో ఆ దేశం ప్రపంచంలోనే అత్యధికంగా కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్న క్రమంలో చైనాను మీరు ఎలా నియంత్రిస్తారని ప్రశ్నించగా చైనాతో మనం యుద్ధానికి వెళ్లమని, వారితో మనం చర్చించి టారిఫ్‌లతో మనం ఎంత ఇబ్బందులు పడుతున్నామో వారిని ఒప్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై చైనా స్పందించని పక్షంలో వారి ప్రజలతో పాటు మన ప్రజలూ ప్రాణాలు కోల్పోతారని, దీనిపై మనమంతా కలిసి పనిచేయాల్సి ఉంటుందని బ్లూమ్‌బర్గ్ చెప్పుకొచ్చారు. వాతావరణ మార్పులపై అమెరికా భిన్నంగా స్పందిస్తోందని తాము బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను మూసివేస్తున్నామని, ఇప్పటికే 304 ప్లాంట్లు మూతపడగా, యూరప్‌లో 80 కాలుష్యకారక ప్లాంట్లు మూతపడ్డాయని చెప్పారు. చదవండి : ఆ బిలియనీర్ బ్లూమ్‌బర్గ్‌ను అమ్మేస్తాడు..