‘ఆకాశవాణి... ఇప్పుడు మీరు వింటున్నది శుభ్ కల్(రేపటి కోసం)’ అని రేడియో నుంచి ఆమె గొంతు వినిపించినప్పుడు ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది మహిళలు తమ రేడియో దగ్గరికి వడివడిగా వస్తారు. రేడియోసౌండ్ పెంచుతారు. గ్రామీణ మహిళలకు చాలా ఇష్టమైన రేడియో కార్యక్రమం ఇది.
‘శుభ్ కల్’లో సినిమా పాటలు, కథలు, నాటికలు వినిపించవు. పర్యావరణానికి సంబంధించిన మంచి విషయాలు వినిపిస్తాయి. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు వినడానికి ఆసక్తి చూపేవారు తక్కువగా ఉంటారు. ఆసక్తికరంగా చెబితే ఎలాంటి విషయాలనైనా ఆసక్తికరంగా వింటారని నిరూపించింది 27 సంవత్సరాల వర్షా రైక్వార్.
మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాకు చెందిన వర్ష ‘బుందెల్‌ఖండ్ 90.4 ఎం.ఎమ్’లో రేడియో జాకీ. వర్ష నాన్న రైతు. ఆయన వరుస కరువులతో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకానొక దశలో ఊరు విడిచి వలస వెళదామని కూడా ఆలోచించాడు. చిన్నప్పుడు తండ్రిని అడిగేది ‘వర్షాలు ఎందుకు రావడం లేదు?’ ‘కరువు ఎందుకు వస్తుంది?’.. ఇలాంటి ప్రశ్నలకు ఆయన చెప్పే జవాబు ఒక్కటే...‘అంతా విధినిర్ణయం తల్లీ. మనమేమీ చేయలేము.
మనం మానవమాత్రులం’ అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో...కరువు కాటకాల్లో విధి పాత్ర కంటే మానవతప్పిదాల పాత్రే ఎక్కువ ఉందని గ్రహించింది. తప్పులు మూడు విధాలుగా జరుగుతాయి. తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే తప్పులు, తెలిసీ తెలియక చేసే తప్పులు. ఈ మూడు సమూహాలను దృష్టిలో పెట్టుకొని ‘శుభ్ కల్’ కార్యక్రమానికి డిజైన్ చేసింది వర్ష. గంభీరమైన ఉపన్యాసాలు, అంత తేలిగ్గా అర్థం కాని జటిల సాంకేతిక పదజాలం కాకుండా స్థానిక భాష, యాసలతో నవ్వుతూ, నవ్విస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది వర్ష.
కొన్ని స్కిట్స్‌లో రెండు పాత్రలు ఉంటాయి. ఒక పాత్ర పర్యావరణానికి సంబంధించి మంచిపనులు చేస్తుంటుంది. రెండో పాత్ర...ఇదంత వ్యర్థం అనుకుంటుంది. రెండు పాత్రల మధ్య స్థానిక యాసలలో జరిగే సరదా సంభాషణ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటుంది. వాదనలో చివరికి రెండో పాత్ర ఓడిపోతుంది. తన తప్పును తెలుసుకొని ‘ఇలాంటి తప్పు మీరు చేయవద్దు’ అని చెబుతుంది. ఈ కార్యక్రమంతో ప్రభావితం అయిన రాజ్‌పూర్ గ్రామరైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. ఈ గ్రామాన్ని మిగిలిన గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి.
కేవలం రేడియో కార్యక్రమానికే పరిమితం కాకుండా ‘పల్లె పల్లెకు’ అంటూ తన బృందంతో కలిసి పల్లెలకు వెళుతుంటుంది వర్ష. ఆమె వెళ్లే పల్లెలలో వాహనాలు వెళ్లలేనివి మాత్రమే కాదు కాలినడకన వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పల్లెలు ఉన్నాయి. రేడియో జాకీగా మంచి పేరు ఉండడంతో ఏ పల్లెకు వెళ్లినా వర్షను గుర్తుపట్టి ఆదరిస్తారు. ఆ ఆదరణతోనే మహిళలతో సమావేశాలు నిర్వహించి చెట్లు పెంచడం వల్ల ఉపయోగాలు, నీటి సంరక్షణ మార్గాలు, సేంద్రియ వ్యవసాయం...ఇలా ఎన్నో విషయాలను చెబుతుంది. ఆ కార్యక్రమాలు ఎంత మంచి ఫలితం ఇచ్చాయంటే మొక్కలు నాటడాన్ని మహిళలు తప్పనిసరి కార్యక్రమం చేసుకున్నారు. నీటి వృథాను ఆరికట్టే కార్యక్రమాలు చేపడుతున్నారు. కిచెన్ గార్డెన్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐక్యరాజ్య సమితి ‘వి చేంజ్ నౌ’ మూమెంట్ యంగ్‌క్లైమెట్ లీడర్స్‌లో వర్ష ఒకరు.
‘మన భూమిని మనమే రక్షించుకోవాలి’ అంటుంది వర్ష రైక్వార్. అందరూ వినదగిన మాటే కదా!
Comments
Please login to add a commentAdd a comment