environmental
-
స్వచ్ఛ కుంభమేళా
(మహా కుంభమేళా ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి) సాధారణ రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమం ప్రాంతాన్ని రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది పర్యాటకులు మాత్రమే సందర్శిస్తారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న మహా కుంభమేళాకు రోజూ కోటి, రెండు కోట్ల మంది పర్యాటకులు వచ్చి వెళుతున్నా ఆ పరిసరాలు వీలైనంత మేర పరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ఈ నెల 13న మొదలై 45 రోజులు నిరంతరం కొనసాగే.. భూమిపై జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా గుర్తింపు పొందిన మహా కుంభమేళా కార్యక్రమాన్ని పూర్తి పరిశుభ్రత, పర్యావరణ జాగ్రత్తలతో నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం ముందస్తుగా అనేక చర్యలు చేపట్టినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.సాధారణంగా ఎక్కడైనా ఒక లక్ష మంది ప్రజలతో ఒక సభ జరిగితే అది ముగిసిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే, ఇప్పటికే ఎనిమిది రోజులపాటు రోజూ సరాసరి కోటి మందికి పైగా యాత్రికులు మహా కుంభమేళా త్రివేణి సంగమం ప్రాంతాన్ని సందర్శిస్తున్నా.. అక్కడ పరిసరాలు పరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల పూర్తి నియంత్రణకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. పరిశుభ్రత కోసం 20,000 మంది సఫాయి సిబ్బంది ఆ ప్రాంతంలో షిఫ్టుల వారీగా నిరంతరం పనిచేస్తున్నారు. 10 వేల ఎకరాల విస్తీర్ణంలో లక్షన్నర మరుగుదొడ్లు..ప్రయాగరాజ్ త్రివేణి సంగమం పరిసర ప్రాంతం చుట్టుపక్కల మొత్తం పది వేల ఎకరాల విస్తీర్ణంలో మహా కుంభమేళా ఉత్సవాలు కొనసాగుతుండగా, యూపీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో లక్షన్నర మరుగుదొడ్లు, 5,000 యూరినల్స్ కేంద్రాలు, 350 కమ్యూనిటీ టాయిలెట్లు, 10 టాయిలెట్ కాంపె్లక్స్లు ఏర్పాటుచేసింది. మరుగుదొడ్ల శుభ్రతను పర్యవేక్షించడానికి 2,500 మంది సిబ్బందితో పాటు 12 కిలోమీటర్ల పొడవున్న 44 పుష్కర ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు మరో 5,000 మంది పనిచేస్తున్నారు. త్రివేణి సంగమం నదీ గర్భంలో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధిచేసేందుకు 40 కాంపాక్టరు మోటార్లు వినియోగిస్తుండగా, ఆ ప్రాంతంలో పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు అక్కడ నుంచి తరలించేందుకు 120 టిప్పర్లను వినియోగిస్తున్నారు.పారిశుధ్య కార్మికులకు బీమాఇక మహాకుంభమేళా పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్న కార్మికులతో పాటు బోట్మెన్లకు స్వచ్ఛ కుంభ్ ఫండ్ నిధుల ద్వారా రూ.2 లక్షల జీవిత బీమా పాలసీలు అందజేశారు. అలాగే, ప్లాస్టిక్ వస్తువు వినియోగంపై ముందే శిక్షణ పొందిన దాదాపు 1,500 మంది సిబ్బంది కుంభమేళాకు వచ్చే పర్యాటకులతో ఆ ప్రాంతంలో చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటున్న యజమానులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ, వారిలో అవగాహన కలిగిస్తున్నారు. మహా కుంభమేళా ప్రారంభానికి నెలల ముందే ప్రయాగరాజ్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే 400 పాఠశాలల్లో ఉపాధ్యాయులు, 4 లక్షల మంది విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కలిగించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్వచ్ఛమైన తాగునీటి కోసం 1,249 కి.మీ. పైపులైన్లు.. ఇక మహా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్రస్నానాలు చేసేందుకు రోజూ భారీగా తరలివచ్చే భక్తుల తాగునీటి అవసరాల కోసం ఆ పదివేల ఎకరాల విస్తీర్ణ ప్రాంతంలోనే 1,249 కిలోమీటర్ల పొడవునా మంచినీటి పైపులైన్లును ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. శుద్ధిచేసిన తాగునీటిని ఆ పైపులైన్ ద్వారా యాత్రికులు వినియోగించుకునేలా 56,000 చోట్ల కుళాయిలు ఏర్పాటుచేశారు. 85 గొట్టపు బావులు, 30 జనరేటర్లతో నడిచే పంపింగ్ స్టేషన్‌తో కుంభమేళా ప్రాంతమంతా నిరంతరం నీటి సరఫరా కొనసాగిస్తున్నారు. ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు సెక్టార్ల వారీగా ఇంజనీర్లు, సిబ్బందిని నియమించారు. ఆకుపచ్చ మహాకుంభ్.. మహా కుంభమేళాలో భాగస్వాములయ్యేందుకు జాతీయ, అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కోట్లాది మంది భక్తులకు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభు త్వం రెండేళ్లుగా భారీస్థాయిలో మొక్కల పెంపకం చేపట్టింది. పది ప్రాంతాల్లో చిన్నచిన్న వనాలను రూపొందించింది. మహా కుంభమేళా ప్రారంభానికి ఏడాది ముందు నుంచే ప్రయాగరాజ్ అంతటా సుమారు మూడు లక్షల మొక్కలను పెంచడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మేళా ముగిసిన తర్వాత కూడా వాటి సంరక్షణ, నిర్వహణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. నగరానికి దారితీసే 18 ప్రధాన రహదారుల వెంట ఈ మొక్కల పెంపకం డ్రైవ్‌లు కొనసాగాయి. కదంబ, వేప, అమల్టాస్ వంటి స్థానిక జాతులకు చెందిన 50,000 మొక్కలు రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకంగా నాటారు. -
సిలికా.. దున్నేద్దామిక!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ప్రకృతి సంపద కొల్లగొట్టడమే లక్ష్యంగా కూటమి నేతలు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఇసుక, మైకా క్వార్ట్జ్ ఖనిజాలను కొల్లగొడుతున్న అధికార పార్టీ నేతలు.. తాజాగా సిలికా శాండ్ కోసం రంగంలోకి దిగారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లోని సిలికాను తవ్వి, విక్రయించేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఎటువంటి పర్యావరణ అనుమతులు తీసుకోకుండా, సిలికా కోసమే అని అనుమానం రాకుండా.. జాతీయ, రాష్ట్ర ప్రాజెక్టుల కోసం మైనర్ మినరల్స్‌ను లీజు ప్రాతిపదికన తవ్వుకోవచ్చని డిసెంబర్ 24న ఒక జీవో జారీ చేయించారు. ఈ జీవో ఆధారంగా ఒక ముఖ్య నేత ఆదేశాలతో తవ్వకాలు జరిపేందుకు కృష్ణపట్నం పోర్టు సిబ్బంది, స్థానికంగా ఉన్న కూటమి శ్రేణులు సిలికా ఉన్న భూముల ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు, కోట మండలాల పరిధిలో సుమారు 28 వేల ఎకరాల్లో విస్తారంగా సిలికా శాండ్ ఉంది. ఇందులో వివిధ పరిశ్రమలకు కేటాయించిన భూములు, సిలికా లీజు దారులకు చెందిన భూములు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చిల్లకూరు, కోట పరిధిలోని సుమారు 87 మంది లీజు దారులను సిలికా మైన్‌లోకి వెళ్లకుండా అడ్డుకుంది. కూటమి నేతలు యజమానులను భయపెట్టి, కొన్ని మైన్లను బలవంతంగా లాక్కున్నారు. మరి కొందరు కూటమి నేతల ఆగడాలకు భయపడి వారు చెప్పినట్లు చేస్తున్నారు. బీడు భూములపై కన్ను చిల్లకూరు, కోట మండలాల పరిధిలో వివిధ పరిశ్రమల కోసం ఏపీఐఐసీ కేటాయించిన వేలాది ఎకరాల భూములు ఏళ్ల తరబడి బీడుగా దర్శనమిస్తున్నాయి. ఇందులో కృష్ణపట్నం పోర్టు, నవయుగకు కేటాయించిన భూమలున్నాయి. చిల్లకూరు మండలం చిలతవరం సెజ్ కోసం 550.48 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో మాస్ అపెరల్ పార్కు పరిశ్రమను 2011లో 15 ఎకరాల్లో శ్రీలంకకు చెందిన యాజమాన్యం ప్రారంభించింది. మూడేళ్ల పాటు నిరాటంకంగా కొనసాగిన పరిశ్రమను అప్పట్లో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అనుచరులు చేసిన గొడవ వల్ల మూసి వేసారు. దీంతో కోట, చిల్లకూరు, గూడూరు మండలాలకు చెందిన సుమారు 700 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉపాధి పోయింది. ప్రస్తుతం ఆ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో 3,931.86 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయించారు. ఇందులో సుమారు 800 ఎకరాల్లో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. అందులో జిందాల్ సింహపురి పవర్ ప్రాజెక్టు, వేదాంత, మీనాక్షి పవర్ ప్రాజెక్టులు పని చేస్తున్నాయి. మోమిడి రెవెన్యూ పరిధిలోని మన్నేగుంట ప్రాంతంలో కెనేటా పవర్ ప్రాజెక్టు పేరుతో 200 ఎకరాలు కేటాయించినప్పటికి, ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు. మిగిలిన భూమి కృష్ణపట్నం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఖాళీగా ఉంది. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు, తమ్మినపట్నం, కోట మండలంలోని కొత్తపట్నం, సిద్దవరం రెవెన్యూ పరిధిలో క్రిస్ సిటీ ఏర్పాటు కోసం ఏపీఐసీసీ.. పట్టా, ప్రభుత్వ భూములు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. అంకులపాటూరు రెవెన్యూలో 151 ఎకరాలు, ఉడతావారిపాళెం, కలవకొండ రెవెన్యూ పరిధిలో 122.280 ఎకరాల్లో ఎస్బీ క్యూ స్టీల్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమ నష్టాల బాట పట్టడంతో మూత పడింది. భూములు బీడుగా ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల్లోని పేద రైతులు ఎకరం, రెండెకరాల చొప్పున చదునుచేసి వేరుశనగ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలా ఖాళీకా ఉన్న భూములన్నింటిపై కూటమి నేతలు కన్ను వేశారు. 30 గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు ⇒ సిలికా శాండ్ తవ్వకాలతో 30 గ్రామాలకు ప్రమాదం తప్పదని తెలిసినా, ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వకాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను అడ్డు పెట్టుకుని, పరిశ్రమల ప్రతినిధులను ముందు పెట్టి.. కూటమి నేతలు తెర వెనుక నుంచి దందాకు తెర లేపారు. ⇒ బీడు భూముల్లో కనీసం రెండు మీటర్ల మేర సిలికాను తవ్వుకుంటే వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టవచ్చని ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ తవ్వకాలు సాగించాలనే విషయమై పరిశీలనకు వచ్చిన బృందాలను పలు చోట్ల రైతులు అడ్డుకున్నారు. వెనక్కు వెళ్లిపోవాలని ఆదేశించారు. భూముల్లో సిలికా తవ్వకాలు జరిపితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ⇒ పరిశ్రమల కోసం కేటాయించి ఉంటే.. ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. సముద్ర మట్టానికి 30 మీటర్ల ఎత్తులో ఉండే భూములు.. ప్రస్తుతం తొమ్మిది మీటర్లకు చేరాయని, మరో రెండు మీటర్లు తవ్వితే తుపాను ధాటికి గ్రామాలు కొట్టుకుపోయి జల సమాధి కావాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చట్టాల కోరలు తీశారు
న్యూఢిల్లీ: దేశంలో పర్యావరణ చట్టాల్లో సవరణలు చేసి, చివరకు వాటిని కోరల్లేనివిగా మార్చేశారని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనాన్ని నియంత్రించడానికి తీసుకొచి్చన ‘దేశ రాజధాని, పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) చట్టం–2021’ను ఎందుకు కఠినంగా అమలు చేయడం లేదని ప్రశ్నించింది. సీఏక్యూఎం చట్టం విషయంలో కేంద్రం తీరును న్యాయస్థానం తప్పుపట్టింది. చట్టం అమలుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండానే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆక్షేపించింది. ఢిల్లీలో కాలుష్యం తీవ్రత, పంట వ్యర్థాల దహనం సమస్యపై జస్టిస్ అభయ్ ఎస్.ఓకా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపించారు. సీఏక్యూఎం చట్టంలోని సెక్షన్ 15కు సంబంధించి మరికొన్ని నియంత్రణలను మరో 10 రోజుల్లో జారీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ చట్టాన్ని ప్రభావవంతంగా అమలు చేయడానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడంతోపాటు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వివరించారు. పంజాబ్, హరియాణా అధికారులకు, కాలుష్య నియంత్రణ మండళ్లకు సీఏక్యూఎం ఇప్పటికే లేఖలు రాసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పంట వ్యర్థాలను దహనం చేస్తూ కాలుష్యానికి కారణమవుతునవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఆదేశించిందని అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తమకు తెలుసని పేర్కొంది. కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమవుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. చటాన్ని ఉల్లంఘించే వారిపై పర్యావరణ పరిహార పన్నును మరింత పెంచేలా చట్టంలో సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంజాబ్, హరియాణా ప్రభుత్వాల తీరుపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాల దహనాన్ని ఎందుకు అరికట్టడం లేదని నిలదీసింది. సీఏక్యూఎం ఆదేశాలను ఆయా ప్రభుత్వాలు అమలు చేయడం లేదని మండిపడింది. కాలుష్య నియంత్రణ విషయంలో పంజాబ్, హరియాణా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు కేవలం కంటితుడుపు తప్ప అందులో కార్యశీలత లేదని ఆక్షేపించింది. పంట వ్యర్థాలను దహనం చేసేవారికి కేవలం రూ.2,500 చొప్పున జరిమానా విధించడం ఏమిటని ప్రశ్నించింది. కేవలం నామమాత్రంగా జరిమానా విధించి, కాలుష్యానికి లైసెన్స్ ఇస్తున్నారా అని న్యాయస్థానం మండిపడింది. -
వచ్చే నెలలో ట్రిపుల్ఆర్ టెండర్!
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగురోడ్డు) నిర్మాణానికి కేంద్రం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి వీలుగా ఎన్హెచ్ఐఏ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం టెండర్ డాక్యుమెంటేషన్‌పై దృష్టి సారించింది. వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు పిలిచే అవకాశాలున్నాయి. పర్యావరణ అనుమతులు రాకుండానే.. ట్రిపుల్ఆర్ విషయంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. దీంతో భవిష్యత్‌లో మరింత ఆలస్యం జరగకుండా చూడాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. పర్యావరణ అనుమతులు రాకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయటానికి వీలులేదు. కానీ, టెండర్లు పిలిచేందుకు అది అడ్డంకి కాదు. దీంతో పర్యావరణ అనుమతులు వచ్చేలోగా టెండర్లు పిలిచి, పర్యావరణ అనుమతులు వచి్చన తర్వాత టెండర్లు ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. టెండర్లు తెరిచే నాటికి అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌వేగా కొత్త నంబర్ జాతీయ రహదారి హోదాలో కేంద్రం ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు చేపడుతోంది. ఉత్తర భాగం విషయంలో ఆ స్పష్టత ఉంది. దక్షిణభాగాన్ని కేంద్రం కాకుండా సొంతంగానే చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర భాగాన్ని సొంత నిధులతో కేంద్రమే నిర్మిస్తోంది. గతంలో కేవలం జాతీయ రహదారిగా మాత్రమే దాన్ని పరిగణించింది. కానీ, ఇటీవల దాన్ని ఎక్స్‌ప్రెస్‌వే జాబితాలో చేర్చింది. అప్పటి వరకు తాత్కాలికంగా దానికి 161ఏ నంబర్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పుడు అది కాకుండా ఎక్స్‌ప్రెస్‌వేగా కొత్త నంబర్ కేటాయించనున్నారు. ఈ నంబర్ అలాట్ అయిన తర్వాతే ఫారెస్టు క్లియరెన్సు వస్తుంది. ఇప్పటికే ఈ రోడ్డుకు సంబంధించి పబ్లిక్ హియరింగ్స్ ప్రక్రియ పూర్తి చేశారు. పర్యావరణ అనుమతులకు అది కీలకం.రోడ్డు నంబర్ అలాట్ అయిన తర్వాతనే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. త్వరలో ఆ రోడ్డు నంబర్ కేటాయించే అవకాశముంది. పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే టెండర్లు తెరవాల్సి ఉంటుంది. ఈ తతంగం పూర్తయ్యే వరకు టెండర్ల కోసం ఎదురు చూడకుండా, ముందు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు భూపరిహారం పంపిణీకి వీలుగా గ్రామాల వారీ అవార్డులు పాస్ చేసే ప్రక్రియ కూడా నిర్వహించాల్సి ఉంది.ఇది జరగాలంటే పరిహారం నిధులు ఎన్హెచ్ఏఐకి కేటాయించాలి. ఉత్తర భాగం భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం మొత్తాన్ని భరించాల్సి ఉన్నందున, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయాలి. ఈ ప్రక్రియ కూడా వేగంగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. సమాంతరంగా ఈ ఏర్పాట్లు చేస్తూనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. వచ్చేనెల మొదటి వారంలో టెండర్లు పిలిచి నిర్ధారిత గడువులోపు నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత వీలైనంత తొందరలో పనులు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. -
Live Stock Expo : పశు సంపద రంగానికి తగినంత గుర్తింపు రావాలి
ఎల్డిఎఫ్ ఇండియా, పశువులు, పాడి పరిశ్రమ మరియు మత్స్య పర్యావరణ వ్యవస్థలన్నింటిని ఒకే పైకప్పు కిందకు తీసుకువచ్చే భారతదేశపు మొట్టమొదటి ఎక్స్పో గురువారం హైటెక్స్‌లో ప్రారంభమైంది. ఆదివారం వరకు మూడురోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో సుమారు 80 స్టాల్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైటెక్స్, ఆక్వా ఫార్మింగ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ (AFTS) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డాక్టర్ తరుణ్ శ్రీధర్, మాజీ యూనియన్ సెక్రటరీలతో పాటు పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ వేడుకలో పాల్గిన్నారు. ఈ సందర్భంగా డా. తరుణ్ శ్రీధర్ మాట్లాడుతూ.. పశుసంపద సరైన గుర్తింపుకు నోచుకోలేదని, భారత్‌లో ఇప్పటికే చాలామంది గ్రామాల్లోనే నివసిస్తున్నారని తెలిపారు. అసలు పశువులతో సంబంధం లేకుండా ఏ రైతును చూడలేరన్నారు. భారతదేశం గణనీయమైన పశువుల జనాభాను కలిగి ఉందని, ప్రపంచ చేపల ఉత్పత్తి సహా పాల ఉత్పత్తి వినియోగంలో భారత్ ముందుందని పేర్కొన్నారు. ఎల్‌డిఎఫ్‌పై అంకితమైన ఎక్స్పో చాలా అవసరం. ఇది త్వరలో ప్రపంచ స్థాయిలో బోస్టన్ సీఫుడ్స్‌తో సమానంగా ఎదుగుతుందనన్నారు.ఇలాంటి ఎక్స్‌పోలు మన బలాన్ని ప్రదర్శించడమే కాకుండా విధి విధానాలను నిర్మించే ప్రభుత్వ అధికారులను మేల్కొల్పుతాయని అన్నారు డాక్టర్ తరుణ్ శ్రీధర్. 2022-23లో రికార్డు స్థాయిలో 174 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించింది. ఇది రూ.63,960 కోట్ల సీఫుడ్ ఎగుమతులను సాధించిందని, ఇంకా, భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు అని భారతదేశంలోని చేపలలో 68% ఆక్వాకల్చర్ రంగం నుండి వస్తుందని తెలిపారు. పశువులు శక్తి. పశువులు ఎల్లప్పుడూ వ్యవసాయంలో అంతర్భాగంగా ఉంటాయి. కానీ ఇది చాలా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, యువతకు ఆకర్షణీయంగా కనిపించదు. అయితే ప్రపంచం మొత్తం సహజ, సేంద్రియ, పున రుత్పత్తి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నందున మంచి రోజులు వచ్చాయి. పశుసంవర్ధక రంగం ఇప్పుడు ఆహార భద్రత నే కాక, పోషకాహార భద్రతగానూ గొప్ప సంభావ్యత కలిగిన చాలా పెద్ద రంగంగా పరిగణించబడుతుంది. ప్రపంచ ఆకలి సూచీలో 121 స్థానాల్లో భారతదేశం 107 స్థానాల్లో ఉన్న నేపథ్యంలో పశు సంపదకు సంబంధించిన ఉత్పత్తులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మాంసం తినే జనాభాలో 70% కంటే ఎక్కువ భారతదేశం. 2050లో 18.1 MT తలసరి మాంసం వినియోగం 13.8 కిలోల అంచనాగా ఉందని NABARD చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల అన్నారు. గోదావరి కట్స్‌లో 25 కిలోల ఎల్లోఫిన్ ట్యూనా అనే అరుదైన చేపలను ప్రదర్శించారు. ఎల్లోఫిన్ ఆరు లేదా ఏడు సంవత్సరాల వరకు జీవించగలదు. ఇవి అధిక వలసలు, పసిఫిక్, అట్లాంటిక్ -హిందూ మహాసముద్రాల అంతటా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జీవరాశి అయిన ఎల్లో ఫిష్ ట్యూనా అంతరించిపోతోంది. భారత ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు డెవలప్మెంట్ కమీషనర్ డి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. ''భారతదేశంలో 46 (23 మంది స్థానిక, 23 మంది స్థానికేతర) సూక్ష్మ, చిన్న వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు మంత్రిత్వ శాఖ వీలు కల్పించింది. రిటైర్డ్ బ్యూరోక్రాట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన డబ్ల్యువిఆర్ రెడ్డి మాట్లాడుతూ మనమందరం చిన్నతనం నుండే పశువులతో ముడిపడి ఉన్నాం. కానీ మన యువత ఇప్పుడు దానిపై ఆసక్తి చూపడం లేదు. యువతను ఆకర్షించేందుకు వీలుగా ఈ రంగాన్ని బ్లూ కాలర్ లాంటి రంగంగా మార్చాలి. మీరు సాంకేతికతపరమైన ఆవిష్కరణలను తీసుకురావాలని ఆయన పిలుపునిచారు.దళిత బంధు లబ్ధిదారులు కూడా అవకాశాలను అన్వేషించడానికి ఎక్స్పోను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎక్స్‌పోలో కంట్రీ చికెన్ వంటి అనేక స్టాల్స్ ఉన్నాయి. దీనిని ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు సాయికేష్ గౌండ్, మొహమ్మద్ సమీ ఉద్దీన్ స్థాపించారు. ఆధునిక,పరిశుభ్రమైన మాంసం దుకాణాలు అవసరమని చాలా మంది తెలియచేశారు. కూరగాయలకు మంచి, పరిశుభ్రమైన దుకాణాలు ఉన్నప్పటికీ, పరిశుభ్రమైన మాంసం దుకాణాలు ఎక్కువగా కనిపించవు. గడ్డకట్టిన చేపలను కొనడానికి ప్రజలు నిరాకరిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అన్నీ క్రమంగా మారుతూ వస్తున్నాయి. అందరూ తమ వ్యాపారాలకి ప్రజలను ఆకర్షించే కొత్త దారులను వెతుకుతున్నారు. -
World Photography Day: వారియర్ కెమెరా: కర్తవ్యాన్ని గుర్తు చేసే కెమెరా కన్ను
ఆరతి కెమెరాతో మాట్లాడి చూడండి... చేపల సవ్వడి లేని నదుల దీనత్వాన్ని గురించి చెబుతుంది. చేవ లేని జీవజాలాన్ని గురించి చెబుతుంది. పచ్చదనాన్ని కోల్పోయి నేలకూలనున్న నిర్జీవ వృక్షాల మృత్యుఘోష చెబుతుంది. నదుల నీటిలోని విషాన్ని గురించి వివరంగా చెబుతుంది. స్థూలంగా చెప్పాలంటే...కనిపించే అందాల వెనుక కనిపించిన నిశ్శబ్ద విధ్వంసాన్ని గురించి కళ్లకు కడుతూ చెబుతుంది. బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్ ఆరతి కుమార్ రావు తన కెమెరాతో పర్యావరణ సంరక్షణం గురించి క్షణం క్షణం గుర్తు చేస్తోంది... ప్రతి కెమెరాకు ఒక దృష్టి ఉంటుంది. మరి ఆరతి కెమెరా చూసేది ఏమిటి? అట్టడుగున పడి కన్పించని కథలు, నిజజీవిత కథలు, పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నా ఎవరూ పట్టించుకోని కథలు, సంప్రదాయ జీవనశైలులు, వాటిలో వస్తున్న అనూహ్య మార్పులు, పదాలకు దొరకని దృశ్యాలు...ఇలా ఎన్నో ఎన్నెన్నో. చిన్నప్పటి నుంచి ‘నేషనల్ జియోగ్రఫి’ పత్రికలను చూస్తూ పెరిగింది ఆరతి. ఆ ఎల్లో బార్డర్ విండోస్ నుంచి విశాలమైన ప్రపంచాన్ని చూసింది. ఆ పత్రికలోని ఫొటోగ్రాఫ్స్ తనపై ఎంతో ప్రభావం చూపాయి. పదాలతోనే కాదు చిత్రాలతో కూడా గొప్ప సత్యాలు చెప్పవచ్చుననే విషయం అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ అంటే ఇష్టం ఉన్న ఆరతి బయోఫిజిక్స్లో మాస్టర్స్ చేసింది. ఆ తరువాత ‘లైఫ్‌టైమ్ టు–డూ’ రూపంలో భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంది. దానిలో నదులతో పరిచయం ఒకటి. నదులను, వాటి చుట్టూ ఉండే జీవితాన్ని ఫొటోల రూపంలో డాక్యుమెంట్ చేయాలనుకుంది. కాళ్లకు బలపాలు, కళ్లకు కెమెరాలు కట్టుకొని ఊరూరు తిరిగినా తల్లిదండ్రులు ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వివిధ ప్రాంతాలలో తన ఫొటోగ్రఫీకి సంబంధించిన విషయాలను కుటుంబసభ్యులతో పంచుకునేది ఆరతి. ఫొటోల ద్వారా ఎన్విరాన్మెంటల్ స్టోరీ టెల్లింగ్‌లో నేర్పు సంపాదించిన ఆరతి తన ప్రయాణంలో ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. పర్యావరణం గురించి మాట్లాడే వారిని అభివృద్ధి వ్యతిరేకులుగా భావించే వారిని కూడా చూసింది. ‘రివర్ డైరీస్’ అనేది ఆమె ప్రస్థానంలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌గా పేరు తెచ్చుకుంది. నదుల అందాలతో పాటు వాటికి ఎదురవుతున్న ఆపదలకు ‘రివర్ డైరీస్’ అద్దం పడతాయి. ‘హింస, వివాదాలు మాత్రమే హెడ్‌లైన్‌గా కనిపిస్తాయి. అయితే పర్యావరణ విధ్వంసం అనే భయానకమైన కనిపించని హింస చాపకింద నీరులా కొనసాగుతుంది’ అంటుంది ఆరతి. ఆ కనిపించని హింసమూలాలను నలుగురికి తెలియజేసేలా చేయడంలో తన కెమెరాను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది. ఆరతి ఫొటోగ్రాఫర్ మాత్రమే కాదు రచయిత్రి కూడా. ఆమె పుస్తకాలలో ‘మార్జిన్‌ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్‌స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ ఒకటి. ఇందులో లడఖ్ నుంచి సుందరబన్ వరకు ప్రకృతికి సంబంధించిన ఎన్నో సుందరచిత్రాలను కళ్లకు కడుతుంది. గంగ– బ్రహ్మపుత్ర–మేఘన పరీవాహక ప్రాంతాలకు తీసుకువెళుతుంది. భౌగోళిక అందాలతో పాటు ఎదురవుతున్న ప్రమాదాలను, అక్కడి ప్రజలు మాట్లాడుకునే పదాలను పరిచయం చేస్తుంది. ‘నిర్మాణాలు, ఇతరత్రా విధ్వంసక కార్యకలాపాల వల్ల ప్రమాదం అంచున ఉన్న ప్రకృతిని కాపాడు కోవడం అనేది మన చేతిలోనే ఉంది’ అని ఈ పుస్తకం ద్వారా చెబుతుంది ఆరతి. ‘పర్యావరణంలో వచ్చే మార్పులు, అవి మన జీవితాల్లో తెచ్చే మార్పులను నా కెమెరా ద్వారా ఇక ముందు కూడా కథలుగా చెప్పాలనుకుంటున్నాను’ అంటోంది ఆరతి. ఒకానొక సందర్భంలో తన నిరసన గళాన్ని ఇలా వినిపించింది ఆరతి,,,, ‘కరువుకాటకాలు, వరదలలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రమే పర్యావరణ విధ్వంసం, పరిరక్షణ గురించి మాట్లాడుకుంటారు. ఆ తరువాత ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు’ అయితే ఆరతిలాంటి ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్లు తమ చిత్రాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మన కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు. -
ఖర్చు తగ్గించుకోకుంటే ఎలా? నేటినుంచి మనమంతా భూమికి అప్పే!
ప్రపంచ దేశాల పర్యావరణ బడ్జెట్ బుధవారంతో పూర్తిగా ఖర్చయిపోయింది. గురువారం నుంచి భూమి అప్పుగా సమకూర్చేదే. కాస్త వింతగా అన్పించినా ఇది వాస్తవం. ఆర్థిక వనరులకు సంబంధించి వార్షిక బడ్జెట్లు, లోటు బడ్జెట్లు, అప్పులు ఉన్నట్టే పర్యావరణ వనరులకు కూడా బడ్జెట్ ఉంది. గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ తాజా అంచనా ప్రకారం.. ఆ బడ్జెట్ ఆగస్టు 2తో అయిపోయింది. అంటే.. భూగోళానికున్న పర్యావరణ వనరుల సామర్థ్యం (బయో కెపాసిటీ) అంతవరకేనన్నమాట. దీన్నే ‘వరల్డ్ ఎర్త్ ఆఫ్ షూట్ డే’అని పిలుస్తున్నారు. ఇక ఆగస్టు 3 నుంచి మనం వాడేదంతా భూమితన మూలుగను కరిగించుకుంటూ కనాకష్టంగాసమకూర్చే అప్పు (అదనపు వనరులు) మాత్రమే. 1.75 భూగోళాలు కావాలి గత ఏడాది ఈ పర్యావరణ బడ్జెట్ ఆగస్టు 1తోనే అంటే ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే ఒకరోజు ముందే అయిపోయింది. ఈ ఏడాదిలో కొద్దోగొప్పో పర్యావరణ స్పృహ పెరగడంతో ఒక రోజు అదనంగా సమకూరిందన్నమాట. పర్యావరణ బడ్జెట్ 1971 వరకు భూగోళం ఇవ్వగలిగే పరిమితులకు లోబడే ఉండేదట. అంటే 365 రోజులూ లోటు లేకుండా ఉండేదని గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ అంచనా వేసింది. ఆ తర్వాత నుంచి క్రమంగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెర గడంతో పాటు వినియోగంలో విపరీత పోకడల వల్ల భూగోళంపై ఒత్తిడి పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కలిసి 175% మేరకు ప్రకృతి వనరులు వాడేస్తున్నాయి. అంటే.. మనకు అవసరమైన వనరులు సునాయాసంగా సమకూర్చాలంటే 1.75 భూగోళాలు కావాలన్నమాట. ఎక్కువ వ్యయం చేస్తున్న సంపన్న దేశాలు ప్రకృతి వనరుల వినియోగం అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు. సంపన్న దేశాలు ఎక్కువ వనరులను ఖర్చు చేస్తున్నాయి. ఉదాహరణకు.. అమెరికా వాసుల మాదిరిగా ప్రకృతి వనరులను వాడితే 5.1 భూగోళాల పర్యావరణ సేవలు మనకు అవసరమవుతాయి. చైనీయుల్లా జీవిస్తే 2.4 భూగోళాలు కావాలి. ఇక ప్రపంచ పౌరులందరూ భారతీయుల్లా జీవిస్తే 0.8 భూగోళం చాలు. అంటే.. పర్యావరణ బడ్జెట్ 20% మిగులులోనే ఉంటుందన్న మాట. ఖతార్ బడ్జెట్ ఫిబ్రవరి 10నే ఖతం! ప్రపంచవ్యాప్తంగా తలసరి వార్షిక పర్యావరణ వనరుల సామర్ధ్యం (బయో కెపాసిటీ) 1.6 గ్లోబల్ హెక్టార్లు (బయో కెపాసిటీని, ఫుట్‌ప్రింట్ (ఖర్చు)ని ‘గ్లోబల్ హెక్టార్ల’లో కొలుస్తారు). దీనికన్నా ఖర్చు (ఫుట్‌ప్రింట్) ఎక్కువగా ఉంటే పర్యావరణ బడ్జెట్ అంత తక్కువ రోజుల్లోనే అయిపోతుంది. తక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ రోజులు కొనసాగుతుంది. భారత్‌లో తలసరి వార్షిక పర్యావరణ బడ్జెట్ 1.04 గ్లోబల్ హెక్టార్లు. అంటే లభ్యత కన్నా ఖర్చు తక్కువగా (20% మిగులు బడ్జెట్) ఉందన్న మాట. ఇక అత్యంత సంపన్న ఎడారి దేశం ఖతార్ పర్యావరణ బడ్జెట్ ఫిబ్రవరి 10నే అయిపోవడం గమనార్హం. కెనడా, యూఏఈ, అమెరికాల బడ్జెట్ మార్చి 13తో, చైనా బడ్జెట్ మే 1తో అయిపోగా, ఆగస్టు 12న బ్రెజిల్, డిసెంబర్ 20న జమైకా బడ్జెట్లు అయిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలన్నీ ఇందుకే.. వనరులు సమకూర్చే శక్తి భూగోళానికి లేకపోయినా మనం వాడుకుంటూనే ఉన్నాం కాబట్టే భూగోళం అతలాకుతలమైపోతోంది. ఎన్నడూ ఎరుగనంత ఉష్ణోగ్రతలు, కుండపోత వర్షాలు, కరువు కాటకాలు.. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ మనం పర్యావరణ వనరులు అతిగా కొల్లగొడు తున్న దాని ఫలితమే. పర్యావరణ లోటు బడ్జెట్‌తో అల్లాడుతున్న భూగోళాన్ని స్థిమితపరిచి మన భవిష్యత్తును బాగు చేసుకోవాలంటే.. పర్యావరణ వార్షిక బడ్జెట్ 365 రోజులకు సరిపోవాలంటే.. మానవాళి మూకుమ్మడిగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. వనరులను పొదుపుగా వాడాలి. ముఖ్యంగా ఐదు పనులు చేయాలి. పర్యావరణ హితమైన ఇంధనాలు వాడాలి. ఆహారోత్పత్తి పద్ధతులను పర్యావరణ హితంగా మార్చుకోవాలి. నగరాల నిర్వహణలో ఉద్గారాలు, కాలుష్యం తగ్గించుకోవాలి. భూగోళంపై ప్రకృతి వనరులకు హాని కలిగించని రీతిలో పారిశ్రామిక కార్యక్రమాలు చేపట్టాలి. అన్నిటికీ మించి వనరుల తక్కువ వినియోగానికి వీలుగా జనాభా పెరుగుదలను అదుపులో ఉంచుకోవాలి. – సాక్షి సాగుబడి డెస్క్ -
హైదరాబాద్‌ను టాప్–25లో ఒకటిగా చేస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ప్రపంచంలోనే టాప్–25 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇతర ప్రాంతాల మాదిరిగానే తెలంగాణలోనూ నగరీకరణ పెరుగుతోందని, రాష్ట్రం మొత్తం విస్తీర్ణం 1.12 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటే.. రెండు వేల చదరపు కిలోమీటర్ల మేర నగరాలున్నాయన్నారు. ఈ చిన్న భౌగోళిక ప్రాంతంలోనే 46.8 శాతం జనాభా కేంద్రీకృతమై ఉండటం వల్ల తగిన మౌలిక వసతులు కల్పించడం సవాలుగా మారిందని తెలిపారు. మంగళవారం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ దినపత్రిక నిర్వహించిన ‘రీప్లానెట్ ఇనీషియేటివ్’ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పర్యావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవడం ఎలా? అన్న అంశంపై ఏర్పాటైన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత పచ్చదనం కలిగిన నగరంగా ఇప్పటికే గుర్తింపు పొందిందన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అంతటితో సంతృప్తి పడరాదని, టాప్–25 నగరాల్లో ఒకటిగా ఎదిగేందుకు కృషి చేయాలని సూచించినట్లు చెప్పారు. ఇందుకు తగ్గట్టుగా తాము పలు చర్యలు చేపట్టామన్నారు. శుద్ధి చేసిన నీరు భవన నిర్మాణాలకు... హైదరాబాద్‌ను మరింత పర్యావరణ అనుకూలంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. వచ్చే మార్చి, ఏప్రిల్‌కల్లా నగరంలో రోజూ ఉత్పత్తయ్యే 1,259 ఎంఎల్డీ మురుగునీటిని శుద్ధి చేస్తామని కేటీఆర్ చెప్పారు. ఇందుకు తగ్గట్టుగా రెండవ దశ శుద్ధీకరణ కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. శుద్ధి చేసిన నీటిని భవన నిర్మాణాల్లో, ల్యాండ్‌స్కేపింగ్, హార్టికల్చర్ రంగాల్లో ఉపయోగిస్తామన్నారు. థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో కొలుములను చల్లబరిచేందుకూ వాడుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 68 కేంద్రాలు పూర్తికాగా మిగిలినవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. పొడి చెత్తతో విద్యుదుత్పత్తికి మరో రెండు కేంద్రాలు నగరాల్లో వరదనీటిని వృథా పోనివ్వకుండా ఉండేందుకు పుణే కేంద్రంగా పనిచేస్తున్న షా కన్సల్టెంట్స్తో హైదరాబాద్ నగరాన్ని సర్వే చేయించామని, వరదనీటి ప్రవాహం తీరుతెన్నులు, నీటి నిల్వకు అవకాశమున్న ప్రాంతాలన్నింటినీ మ్యాప్ చేశామని కేటీఆర్ తెలిపారు. అలాగే నగరంలో రోజూ వెలువడుతున్న సుమారు 6,000 టన్నుల చెత్తలో పొడి చెత్త ద్వారా విద్యుదుత్పత్తికి 20 మెగావాట్ల కేంద్రం ఒకటి ఇప్పటికే ఉండగా.. మరో 28 మెగావాట్ల కేంద్రం తయారవుతోందని, ఇంకో 20 మెగావాట్ల కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. నగరంలో దాదాపు 218 వారసత్వ కట్టడాలు ఉన్నాయని వీటన్నింటికీ పూర్వవైభవం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బన్సీలాల్‌పేట మెట్ల బావి పునరుద్ధరణ మచ్చుకు ఒకటి మాత్రమేనని చెప్పారు. కార్యక్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ రాబిన్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలు తోడేస్తున్న నిర్లక్ష్యం
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో మంగళవారం పైలెట్‌తో సహా ఏడుగురి మరణానికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదం ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ను దించాల్సిన ప్రాంతంలో దట్టమైన మంచు అలుముకుని ఉన్నదని పైలెట్ గ్రహించి, వెనక్కి మళ్లించేందుకు ప్రయత్నించినప్పుడు దాని వెనుక భాగం నేలను తాకడంతో ప్రమాదం జరిగిందంటున్నారు. కేదార్నాథ్ గగనంలో హెలికాప్టర్ల సందడి మొదలై పదిహేనేళ్లు దాటుతోంది. ఏటా మే నెల మధ్యనుంచి అక్టోబర్ నెలాఖరు వరకూ సాగే చార్ధామ్ యాత్ర సీజన్లో హెలికాప్టర్లు ముమ్మరంగా తిరుగుతాయి. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలలోని క్షేత్రాలను భక్తులు సందర్శిస్తారు. ఇతర ప్రయాణ సాధనాల విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. హెలికాప్టర్ల వినియోగమే వద్దని ఆదినుంచీ పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రశాంతతకు మారుపేరైన హిమవన్నగాలతో నిండిన సున్నితమైన పర్యావరణ ప్రాంతం కేదార్నాథ్. ఇక్కడ హెలికాప్టర్ల రొద వన్య ప్రాణులకు ముప్పు కలిగిస్తుందనీ, వాతావరణంలో కాలుష్యం పెరుగుతుందనీ పర్యావరణవేత్తల అభియోగం. తక్కువ ఎత్తులో ఎగురుతూ చెవులు చిల్లులుపడేలా రొద చేస్తూ పోయే హెలికాప్టర్ల తీరుపై స్థానికులు సైతం తరచు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వాటి చప్పుడు తీవ్ర భయాందోళనలు కలిగిస్తోందనీ, పిల్లల చదువులకు కూడా వాటి రాకపోకలు ఆటంకంగా మారాయనీ చెబుతున్నారు. అయినా వినే దిక్కూ మొక్కూ లేదు. హెలికాప్టర్లు నడిపే సంస్థలకు లాభార్జనే తప్ప మరేమీ పట్టదు. అందుకే లెక్కకుమించిన సర్వీసులతో హడావిడి పెరిగింది. పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని అధికారులు కనీసం హెలికాప్టర్ల భద్రతనైనా సక్రమంగా పర్యవేక్షిస్తున్న దాఖలాలు లేవు. తాజా దుర్ఘటనలో మరణించిన పైలెట్ అనిల్ సింగ్‌కు ఆర్మీలో 15 ఏళ్ల అనుభవం ఉంది. అయితే మొదట్లో హెలికాప్టర్లు నడిపినా మిగిలిన సర్వీసంతా విమానాలకు సంబంధించిందే. అలాంటివారు కొండకోనల్లో హెలికాప్టర్లు నడపాలంటే అందుకు మళ్లీ ప్రత్యేక శిక్షణ పొందటం తప్పనిసరి. పైగా వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకునే కేదార్నాథ్ వంటిచోట్ల సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లు నడపాలంటే ఎంతో చాకచక్యత, ఏకాగ్రత అవసరమవుతాయి. ఆ ప్రాంతంలో అంతా బాగుందనుకునేలోగానే హఠాత్తుగా మంచుతెర కమ్ముకుంటుంది. హెలికాప్టర్ నడిపేవారికి ఏమీ కనబడదు. అదృష్టాన్ని నమ్ముకుని, దైవంపై భారం వేసి ముందుకు కదిలినా, వెనక్కిరావడానికి ప్రయత్నించినా ముప్పు పొంచివుంటుంది. ఆ ప్రాంతం గురించి, అక్కడ హెలికాప్టర్ నడిపేటపుడు ప్రత్యేకించి పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి క్షుణ్ణంగా తెలిసినవారైతేనే ఈ అవరోధాలను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా 600 మీటర్ల (దాదాపు 2,000 అడుగులు) కన్నా తక్కువ ఎత్తులో హెలికాప్టర్లు నడపరాదన్న నిబంధన ఉంది. కానీ చాలా హెలికాప్టర్లు 250 మీటర్ల (820 అడుగులు)లోపు ఎత్తులోనే దూసుకుపోతున్నాయని స్థానికులు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన హెలికాప్టర్ సైతం తక్కువ ఎత్తులో ఎగురుతున్నందునే వెనక్కు మళ్లుతున్న క్రమంలో దాని వెనుక భాగం అక్కడున్న ఎత్తయిన ప్రదేశాన్ని తాకి మంటల్లో చిక్కుకుంది. ఈ సీజన్లో ఇంతవరకూ 14 లక్షలమందికిపైగా యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించగా అందులో దాదాపు లక్షన్నరమంది తమ ప్రయాణానికి హెలికాప్టర్లను ఎంచుకున్నారు. ఈ ప్రాంతంలో హెలికాప్టర్ల వినియోగాన్ని నిషేధించాలని కొందరు పర్యావరణవేత్తలు అయిదేళ్ల క్రితం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినప్పుడు దాన్ని తోసిపుచ్చిన ట్రిబ్యునల్... వాటి నియంత్ర ణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అవి నిర్దేశిత ఎత్తులో ఎగిరేలా చూడాలనీ, సర్వీసుల సంఖ్యపై కూడా పరిమితులు విధించాలనీ ఆదేశించింది. కానీ ఎవరికి పట్టింది? మన దేశంలో పారిశ్రామిక ప్రాంతాల్లో, వాణిజ్య ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం ఏయే స్థాయిల్లో ఉండాలో నిర్దేశించారు. ఈ శబ్దకాలుష్యానికి సంబంధించిన నిబంధనల్లో పగలు, రాత్రి వ్యత్యాసాలున్నాయి. కానీ విషాదమేమంటే దేశానికే ప్రాణప్రదమైన హిమశిఖర ప్రాంతాల్లో శబ్దకాలుష్యం పరిమితులు ఏమేరకుండాలో నిబంధనలు లేవు. అక్కడ తిరిగే హెలికాప్టర్ల వల్ల ధ్వని కాలుష్యం సగటున 70 డెసిబుల్స్ స్థాయిలో, గరిష్ఠంగా 120 డెసిబుల్స్ స్థాయిలో ఉంటున్నదని పర్యావరణవేత్తల ఆరోపణ. దీనిపై నిర్దిష్టమైన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం లేదా? పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవాలనుకునేవారినీ, ఆ ప్రాంత ప్రకృతిని కళ్లారా చూడాలని తహతహలాడే పర్యాటకులనూ ప్రోత్సహించాల్సిందే. ఇందువల్ల ప్రభుత్వ ఆదాయం పెరగటంతోపాటు స్థానికులకు ఆర్థికంగా ఆసరా లభిస్తుంది. అయితే అంతమాత్రంచేత పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ధోరణి మంచిది కాదు. పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్లు నడపటంలో అనుభవజ్ఞులైనవారిని మాత్రమే పైలెట్లుగా అనుమతించటం, తగిన ఎత్తులో హెలి కాప్టర్లు రాకపోకలు సాగించేలా చూడటం, అపరిమిత శబ్దకాలుష్యానికి కారణమయ్యే హెలికాప్టర్ల వినియోగాన్ని అడ్డుకోవటం తక్షణావసరం. ఈ విషయంలో సమగ్రమైన నిబంధనలు రూపొందిం చటం, అవి సక్రమంగా అమలయ్యేలా చూడటం ఉత్తరాఖండ్ ప్రభుత్వ బాధ్యత. -
ద.మ.రైల్వేలో మియావాకి ప్లాంటేషన్
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణలో దక్షిణ మధ్య రైల్వే అగ్రగామిగా నిలిచింది. జోన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పెద్దఎత్తున మొక్కల పెంపకం చేపట్టింది. సికింద్రాబాద్ నార్త్ లాలాగూడలోని శాంతినగర్ రైల్వేకాలనీలో 4,300 చదరపు మీటర్ల పరిధిలో మియావాకి ప్లాంటేషన్ పూర్తిచేశారు. త్వరలో మరో 1,100 చదరపు మీటర్ల పరిధిలో మియావాకి మొక్కలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో శాంతినగర్ కాలనీలో 20 వేల మొక్కలతో 5,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మియావాకీ ప్లాంటేషన్ అందుబాటులోకి రానుంది. ‘సే ట్రీస్ ఎన్విరాన్మెంటల్ ట్రస్ట్‘అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో దక్షిణ మధ్యరైల్వేలో అటవీ విస్తరణకు కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. దట్టమైన అడవిలా.. మొక్కల పెంపకంలో మియావాకి ప్లాంటేషన్ విస్తృత ప్రాధాన్యతను సంతరించుకుంది. కొంతకాలంగా వివిధ ప్రభుత్వ విభాగాలు హైదరాబాద్ నగరంలో ఈ మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాయి. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే కూడా మియావాకి పెంపకానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతోపాటు జోన్ పరిధిలోని ఖాళీస్థలాల్లో మియావాకి ప్లాంటేషన్‌ను దశలవారీగా విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. మియావాకి దట్టమైన బహుళజాతుల మొక్కలతో కూడిన పట్టణ అటవీప్రాంతం. పర్యావరణ ఇంజనీరింగ్ విధానంలో ఈ మొక్కలను పెంచడం వల్ల త్వరితగతిన పెరగడమే కాకుండా దట్టంగా పచ్చదనంతో అడవిలాగా కనిపిస్తాయి. విభిన్నజాతుల మొక్కలను నాటడమే ఈ విధానంలోని ప్రత్యేకత. రెండేళ్లలో అవి స్వయం సమృద్ధిని సంతరించుకుంటాయి. రైల్వేస్టేషన్ ప్రాంగణాల్లో... మియావాకి విధానంలో మొక్కలు వందశాతం జీవించే అవకాశాలు ఉంటాయి. మొత్తం 5,055 రకాల స్థానిక పండ్లు, ఔషధ, పూల జాతి మొక్కలు, కలప వంటివి ఎంపిక చేసి పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు గద్వాల, నిజామాబాద్ రైల్వేస్టేషన్ల ప్రాంగణాల్లోనూ మియావాకి ప్లాంటేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. సుమారు 2,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 8,500 మొక్కలను పెంచారు. ఖాళీ స్థలాలను పర్యావరణ పరిరక్షణ కోసం వినియోగించడంపట్ల దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. జోన్ అంతటా పట్టణ అడవుల విస్తరణను ఒక ఉద్యమంలా చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ఎంతో కీలకమన్నారు. పచ్చదనం వల్ల మాత్రమే సురక్షితమైన వాతావరణాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పారు. -
సేవ్ వాటర్
చేతులు కడగడానికి ట్యాప్ తిప్పుతాం. చేతిలో పట్టేటంతటి ధారతో సంతృప్తి చెందం. పూర్తిగా ఓపెన్ చేస్తాం. ఒక్కసారిగా నీరు ధారాపాతంగా వచ్చి దోసిట్లోకి పడిపోవాలన్నంత ఆత్రం. చేతులు కడుక్కోవడం పూర్తయ్యే సరికి కనీసంగా ఇరవై సెకన్ల సేపు ట్యాప్ రన్నింగ్‌లో ఉంటుంది. అంత సమయంలో సింక్‌లోకి జారిపోయే నీరెంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? నాలుగు లీటర్లకు తక్కువ ఉండదు. ఆశ్చర్యంగా ఉన్నా సరే ఇది నిజం. ‘ట్యాప్ పూర్తిగా తిప్పవద్దు. ఎంత కావాలో అంతవరకే ఓపెన్ చేయండి’ అని ఇంట్లో వాళ్లకు చెప్పి చెప్పి విసిగిపోయింది లలితాంబ విశ్వనాథయ్య. అందుకే ఓ చిన్న సాధనంతో నీరు తగినంత మాత్రమే వచ్చేటట్లు ట్యాప్‌కు ఉచ్చు బిగించింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే అవుట్ నివాసి లలితాంబ. నీటివృథాను అరికట్టడానికి ఆమె వాటర్ ఏరియేటర్, వాటర్ రిస్ట్రిక్టర్లకు రూపకల్పన చేసింది. వీటిని అమర్చడం ద్వారా నీటి వాడకం మూడవ వంతుకు తగ్గిపోతుంది. సాధారణంగా ఓ కొత్త ఆవిష్కరణ మనిషి జీవనశైలిని ఆధునీకరించడం కోసమే ఉంటుంది. వాటికి మార్కెట్లో మంచి ఆదరణ కూడా లభిస్తుంది. లలితాంబ రూపొందించిన సాధనాలు సామాజిక ప్రయోజనార్థం పని చేస్తాయి. ప్రకృతి పరిరక్షణ, వనరుల సంరక్షణలో కీలకమైన పాత్ర వహిస్తాయి. వాటర్ బాటిల్ లేదు! ‘నీరు అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్. నదుల సంరక్షణ, పరిశుభ్రతనే ప్రధానంగా చూస్తాం, కానీ పర్యావరణ పరిరక్షణ నుంచి దైనందిన జీవనం వరకు అడుగడుగునా అది కీలకమైన అంశమే’ అంటారు ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి. ‘‘నాకు ఎనభై ఏళ్లు. నా బాల్యంలో స్కూలుకెళ్లేటప్పుడు నీటిసీసా తీసుకెళ్లడం మాకు తెలియదు. దారిలో రోడ్డు పక్కన కనిపించిన నల్లా తిప్పి చేయి పట్టి దాహం తీరే వరకు తాగేవాళ్లం. ఎంతో ఆరోగ్యంగా పెరిగాం. నీటి కాలుష్యం అనే పదమే తెలియదప్పట్లో. మా ఇంట్లో బావి ఉండేది. వర్షాకాలంలో అయితే బకెట్‌కు తాడు కట్టి మూడు– నాలుగు అడుగుల లోతులో ఉన్న నీటిని ముంచుకోవడమే. ఎండాకాలంలో అదే బావిలో నీరు ఇరవై అడుగుల లోతుకి వెళ్లేది. భూగర్భ జలాల కనీస స్థాయులంటే ఇరవై అడుగులే. హైదరాబాద్ చుట్టూ వందల చెరువులు, కుంటలు ఉండేవి. క్రమంగా ఒక్కొక్కటీ మాయమవుతున్నాయి. నీటిచుక్క పాతాళానికి పోయింది. నీటి జాడ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతుకు బోర్లు వేస్తున్నారు. నీటిని అవసరానికి మించి వాడడం అంటే సహజ వనరులను వృథా చేయడమే. ఈ మధ్య ప్రభుత్వం జారీ చేసిన 111 జీవో మీద కూడా మేము అభ్యంతరం తెలియచేశాం. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ మంచి నీటి రిజర్వాయర్లు కూడా ఈ జీవో ఫలితంగా హుస్సేన్‌సాగర్ లాగానే మారిపోతాయని హెచ్చరించాం. భావి తరాలకు అందాల్సిన సహజ వనరులను విచక్షణ రహితంగా వాడేసే హక్కు ఎవరికీ ఉండదు. మనదేశంలో జలకాలుష్యనిరోధానికి ‘వాటర్ యాక్ట్ ఆఫ్ 1974’ అనే చట్టం ఉంది. దానిని అమలు చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఏర్పాటైంది. ఎన్ని చట్టాలున్నా సరే... మన దగ్గర నీటి సంరక్షణ విషయంలో సమన్వయలోపంతోనే పనులు జరుగుతున్నాయి. ఫ్యాషన్ ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మార్కెట్లోకి రాగానే కొనేస్తారు. కాని, ఇలాంటి సమాజహితమైన, పర్యావరణ పరిరక్షణ సహితమైన వాటర్ రిస్ట్రిక్టర్లను వాడమని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తోంది’’ అని ఆవేదనగా అన్నారాయన. ప్రతిజ్ఞ చేద్దాం! నీటి వనరులను పరిరక్షించుకోవడం అనగానే భూగర్భ జలాలు పెరిగి ఎండిపోయిన బావుల్లోకి నీరు చేరడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి పెద్ద విషయాల మీదనే చర్చ జరుగుతుంటుంది. కానీ... ఇంట్లో మనం వాడే ప్రతి నీటి చుక్కనూ గౌరవించుకోవాలి. ‘ఆహారాన్ని వృథా చేయము’ అని ప్రతిన పూనుతున్నాం. అలాగే నీటిని వృథా చేయను అని కూడా ఎవరికి వాళ్లు మనసులోనే ప్రతిజ్ఞ చేసుకోవాలి. అప్పుడు లీకవుతున్న ట్యాప్‌ను చూసినప్పుడు దానిని కట్టేసేవరకు మనసు ఊరుకోదు. ట్యాప్ లీకవుతుంటే ఒక్కో చుక్కే కదా అని తేలిగ్గా తీసుకోవడం జరగదు. గమనించిన తక్షణమే ట్యాప్ మారుస్తాం. ఒక్కో చుక్క నీరు కారుతున్న ట్యాప్ నుంచి ఇరవై నాలుగ్గంటల్లో ఎనభై లీటర్ల నీరు వృథా అవుతుంది తెలుసా! ఇది నిజం... నమ్మండి! వాటర్ రిస్ట్రిక్టర్ ధర వంద రూపాయలకు మించదు. దీని ద్వారా నీటి వృథాను అరికట్టగలుగుతాం. నిమిషానికి నాలుగు లీటర్ల చొప్పున ఆదా చేయగలుగుతాం. కాలేజ్‌లు, కల్యాణమండపాల వంటి చోట నెలకు సరాసరిన పదిహేను వేల లీటర్ల నీరు ఆదా అవుతుంది. – లలితాంబ, వాటర్ రిస్ట్రిక్టర్ రూపకర్త మహిళలే సంరక్షకులు మహిళలు స్వచ్ఛందంగా స్పందిస్తేనే నీటి సమస్య అదుపులో ఉంటుంది. మన కిచెన్‌లో ట్యాప్ తిప్పగానే నీరు ధారగా ప్రవహిస్తోందంటే... దాని వెనుక కనిపించని శ్రమ ఎంతో ఉంటుంది. నదుల జన్మస్థానాలైన కొండల మీద నుంచి మన ఇంటికి వస్తున్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు. కొండ శిఖరం నుంచి మన ఇంటి ట్యాప్‌కు చేరడానికి మధ్య ఎంత మెకానిజం పని చేస్తోందో గమనించాలి. మీ పిల్లల కోసం ఎన్నెన్నో ఆస్తులను కూడబెడుతుంటారు, అంతకంటే విలువైన ఆస్తి నీరు. ఆ నీటిని వృథా చేయకండి. ఎండిన భూమిని కాదు, చల్లని భూమిని భావితరాలకు వారసత్వంగా ఇవ్వండి. – ప్రొ‘‘ కె. పురుషోత్తమ్‌రెడ్డి, పర్యావరణవేత్త – వాకా మంజులారెడ్డి -
పర్యావరణహిత టీటీడీ
సాక్షి, అమరావతి: దేశంలోని పర్యాటక, యాత్రా స్థలాలను పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) సంకల్పించింది. ఇందులో భాగంగా ‘నెట్ జీరో ఎనర్జీ టూరిజం డెస్టినేషన్’ ప్రాజెక్టుకు మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, జమ్మూ కశ్మీర్‌లలోని పర్యాటక ప్రాంతాలతో పాటు ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ను ఎంపిక చేసింది. ఇంధన సామర్థ్యానికి తీసుకోవాల్సిన చర్యలపై నెడ్‌క్యాప్‌తో కలిసి బీఈఈ అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత ఇంధన సామర్థ్యం కలిగిన వాటర్ పంపింగ్ సిస్టమ్, ఫ్యాన్లు, లైట్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను బీఈఈ సౌజన్యంతో ఇంధన పరిరక్షణ మిషన్ ఆధ్వర్యంలో టీటీడీ అధికారులు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ సహకారంతో తిరుమలను కాలుష్య రహితంగా, పర్యావరణ హిత, ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. తిరుపతిలోని కళాశాలలు, పాఠశాలలు, తిరుమలలోని టీటీడీ భవనాల్లో 2.2 మెగావాట్ల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్, పవన విద్యుత్ ప్రాజెక్టులు, బయోగ్యాస్ ప్లాంట్లు, విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి నెడ్ క్యాప్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరింత మెరుగ్గా ముందుకు.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీలో సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈవో జవహర్‌రెడ్డి చెప్పారు. టీటీడీ, ఇంధన శాఖ అధికారులతో వర్చువల్ విధానంలో ఆయన సమీక్ష జరిపారు. ఈ వివరాలను ఏపీ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. టీటీడీ భవనాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక ఇంధన కార్యక్రమల ద్వారా కొంత మేర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడం లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆధునిక, ఇంధన సామర్థ్య, పునరుత్పాదక కార్యక్రమాలు చేపట్టడంలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. 2070 నాటికి కాలుష్య రహిత దేశంగా తీర్చిదిద్దాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ప్రముఖ యాత్రా స్థలాల్లో నెట్ జీరో ఎనర్జీ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే తమకు పంపిన సందేశంలో పేర్కొన్నట్లు నెడ్ క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి వెల్లడించారు. -
మంచి మాట.. రేపటి కోసం...
‘ఆకాశవాణి... ఇప్పుడు మీరు వింటున్నది శుభ్ కల్(రేపటి కోసం)’ అని రేడియో నుంచి ఆమె గొంతు వినిపించినప్పుడు ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది మహిళలు తమ రేడియో దగ్గరికి వడివడిగా వస్తారు. రేడియోసౌండ్ పెంచుతారు. గ్రామీణ మహిళలకు చాలా ఇష్టమైన రేడియో కార్యక్రమం ఇది. ‘శుభ్ కల్’లో సినిమా పాటలు, కథలు, నాటికలు వినిపించవు. పర్యావరణానికి సంబంధించిన మంచి విషయాలు వినిపిస్తాయి. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు వినడానికి ఆసక్తి చూపేవారు తక్కువగా ఉంటారు. ఆసక్తికరంగా చెబితే ఎలాంటి విషయాలనైనా ఆసక్తికరంగా వింటారని నిరూపించింది 27 సంవత్సరాల వర్షా రైక్వార్. మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాకు చెందిన వర్ష ‘బుందెల్‌ఖండ్ 90.4 ఎం.ఎమ్’లో రేడియో జాకీ. వర్ష నాన్న రైతు. ఆయన వరుస కరువులతో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకానొక దశలో ఊరు విడిచి వలస వెళదామని కూడా ఆలోచించాడు. చిన్నప్పుడు తండ్రిని అడిగేది ‘వర్షాలు ఎందుకు రావడం లేదు?’ ‘కరువు ఎందుకు వస్తుంది?’.. ఇలాంటి ప్రశ్నలకు ఆయన చెప్పే జవాబు ఒక్కటే...‘అంతా విధినిర్ణయం తల్లీ. మనమేమీ చేయలేము. మనం మానవమాత్రులం’ అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో...కరువు కాటకాల్లో విధి పాత్ర కంటే మానవతప్పిదాల పాత్రే ఎక్కువ ఉందని గ్రహించింది. తప్పులు మూడు విధాలుగా జరుగుతాయి. తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే తప్పులు, తెలిసీ తెలియక చేసే తప్పులు. ఈ మూడు సమూహాలను దృష్టిలో పెట్టుకొని ‘శుభ్ కల్’ కార్యక్రమానికి డిజైన్ చేసింది వర్ష. గంభీరమైన ఉపన్యాసాలు, అంత తేలిగ్గా అర్థం కాని జటిల సాంకేతిక పదజాలం కాకుండా స్థానిక భాష, యాసలతో నవ్వుతూ, నవ్విస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది వర్ష. కొన్ని స్కిట్స్‌లో రెండు పాత్రలు ఉంటాయి. ఒక పాత్ర పర్యావరణానికి సంబంధించి మంచిపనులు చేస్తుంటుంది. రెండో పాత్ర...ఇదంత వ్యర్థం అనుకుంటుంది. రెండు పాత్రల మధ్య స్థానిక యాసలలో జరిగే సరదా సంభాషణ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటుంది. వాదనలో చివరికి రెండో పాత్ర ఓడిపోతుంది. తన తప్పును తెలుసుకొని ‘ఇలాంటి తప్పు మీరు చేయవద్దు’ అని చెబుతుంది. ఈ కార్యక్రమంతో ప్రభావితం అయిన రాజ్పూర్ గ్రామరైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. ఈ గ్రామాన్ని మిగిలిన గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి. కేవలం రేడియో కార్యక్రమానికే పరిమితం కాకుండా ‘పల్లె పల్లెకు’ అంటూ తన బృందంతో కలిసి పల్లెలకు వెళుతుంటుంది వర్ష. ఆమె వెళ్లే పల్లెలలో వాహనాలు వెళ్లలేనివి మాత్రమే కాదు కాలినడకన వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పల్లెలు ఉన్నాయి. రేడియో జాకీగా మంచి పేరు ఉండడంతో ఏ పల్లెకు వెళ్లినా వర్షను గుర్తుపట్టి ఆదరిస్తారు. ఆ ఆదరణతోనే మహిళలతో సమావేశాలు నిర్వహించి చెట్లు పెంచడం వల్ల ఉపయోగాలు, నీటి సంరక్షణ మార్గాలు, సేంద్రియ వ్యవసాయం...ఇలా ఎన్నో విషయాలను చెబుతుంది. ఆ కార్యక్రమాలు ఎంత మంచి ఫలితం ఇచ్చాయంటే మొక్కలు నాటడాన్ని మహిళలు తప్పనిసరి కార్యక్రమం చేసుకున్నారు. నీటి వృథాను ఆరికట్టే కార్యక్రమాలు చేపడుతున్నారు. కిచెన్ గార్డెన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐక్యరాజ్య సమితి ‘వి చేంజ్ నౌ’ మూమెంట్ యంగ్క్లైమెట్ లీడర్స్‌లో వర్ష ఒకరు. ‘మన భూమిని మనమే రక్షించుకోవాలి’ అంటుంది వర్ష రైక్వార్. అందరూ వినదగిన మాటే కదా! -
సైకిల్‌పై సీఎం సందడి: కొత్త స్కీం
చండీగఢ్: వరల్డ్ కార్ ఫ్రీ డే సందర్భంగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సైకిల్‌పై సందడి చేశారు. కాలుష్య నివారణపై అవగాహన కల్పించేలా తన మంత్రి వర్గ సహచరులు, ఇతర ఎమ్మెల్యేలతో సైకిల్‌యాత్ర చేపట్టారు. తన అధికారిక నివాసం నుండి సెక్రటేరియట్ వరకు సైకిల్‌పై వచ్చి పలువురిని ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ మంత్రి జేపీ దలాల్, రవాణా శాఖ మంత్రి మూల్‌చంద్ శర్మ సైకిల్‌పై పౌర సచివాలయానికి చేరుకోవడం విశేషం. (World Car Free Day: ఎంచక్కా సైకిల్‌పై షికారు చేద్దాం!) ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 75 సంవత్సరాల పైబడిన పాత చెట్ల నిర్వహణ నిమిత్తం, ప్రాణ వాయు దేవత పెన్షన్ యోజన పేరిట ఏడాదికి రూ.2,500 పెన్షన్ అందజేస్తామని చెప్పారు. మొత్తం రాష్ట్రంలో ఇటువంటి చెట్లను గుర్తించి, స్థానిక ప్రజలను ఈ పథకంలో చేర్చడం ద్వారా పరిరక్షణకు చర్యలు చేపడతా మన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఇస్తున్న హరియాణా ప్రభుత్వం త్వరలో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని తీసుకురానుంది. ఈ సందర్భంగా సచివాలయం ఆవరణలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో, ఖట్టర్ చండీగఢ్ నుండి కర్నాల్ వరకు రైలులో ప్రయాణించారు. అలాగే సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకుని అందర్నీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. #WATCH | Haryana Chief Minister Manohar Lal Khattar* rides a bicycle along with his cabinet colleagues and MLAs from his residence to the secretariat in Chandigarh to observe #Worldcarfreeday pic.twitter.com/ME0dt31MJl — ANI (@ANI) September 22, 2021 -
పర్యావరణ హితం మన మెట్రో
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పర్యావరణ పరిరక్షణకు మెట్రో రైళ్లు ఇతోధికంగా సాయపడుతున్నాయని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 6.8 కోట్ల మంది మెట్రో జర్నీ చేశారన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్రో రైళ్లతో నగర పర్యావరణానికి కలిగిన ప్రయోజనాలను ఆయన తెలిపారు. మెట్రోతో పర్యావరణ పరిరక్షణ ఇలా.. ♦ గత రెండేళ్లుగా మెట్రో రైళ్లలో 6.8 కోట్ల మంది ప్రయాణించారు. ♦ మెట్రో కారణంగా 57 కోట్ల కిలోమీటర్ల మేర కార్లు,ద్విచక్రవాహనాలు తిరిగే అవసరం తప్పింది. అంటే అన్ని కిలోమీటర్ల మేర ఆదా జరిగినట్లే. ♦ కార్లు, ద్విచక్రవాహనాల వినియోగం తగ్గడంతో 39000 టన్నుల కార్భన్‌డయాక్సైడ్ ఉద్గారాలను మెట్రో తగ్గించింది. ఆమేరకు ఉద్గారాలు పర్యావరణంలో కలవకుండా నిరోధించినట్లైంది. ♦ 1.7 కోట్ల లీటర్ల ఇంధనాన్ని మెట్రో రైళ్లతో ఆదా జరిగింది. ♦ మెట్రో రైళ్ల గమనంలో వేసే బ్రేకులతో ఉత్పత్తయిన శక్తితో 2.2 కోట్ల కిలోవాట్‌హవర్స్ మేర ఇంధనాన్ని ఉత్పత్తి చేశారు. ♦ మెట్రో మార్గాల్లో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా 2 కోట్ల లీటర్ల వర్షపునీటిని ఒడిసిపట్టారు. ♦ 12 మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ సదుపాయం కల్పించారు. -
పర్యావరణ అనుమతులు లేవా?
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును పర్యావరణ అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారా? అని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పర్యావరణ అనుమతులపై స్పష్టత ఇస్తూ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ 2007లో ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్ దాఖలు చేయగా దానిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపివేత ఉత్తర్వులను పునరుద్ధరించాలంటూ ఒడిశా ప్రభుత్వం మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. అలాగే పర్యావరణ అనుమతులు లేకుండానే పోలవరం నిర్మిస్తున్నారని రేలా స్వచ్ఛంద సంస్థ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. ఈ పిటిషన్లను ఇప్పటి వరకు జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. డిసెంబర్ 30న ఆయన పదవీ విరమణ చేయడంతో గురువారం జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఒడిశా ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణ్యం వాదనలు వినిపించారు. 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు పొందిన ఏపీ ప్రభుత్వం.. ఆ డిజైన్‌ను మార్చి 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ సామర్థ్యానికి అనుగుణంగా ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలిపారు. నిల్వ నీటి (బ్యాక్ వాటర్)తో ఒడిశాకు ముంపు ముప్పు ఎక్కువగా ఉందని విన్నవించారు. ఈ వాదనలతో ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ విభేదించారు. ముంపు ముప్పుపై బచావత్ ట్రిబ్యునల్ విచారించిన మీదటే అవార్డు జారీ చేసిందని నివేదించారు. కాగా పర్యావరణ అనుమతులు తిరిగి పొందాలని చెప్పిన కేంద్ర పర్యావరణ శాఖ పనుల నిలిపివేత ఆదేశాలను పదే పదే నిలిపివేస్తోందని రేలా స్వచ్ఛంద సంస్థ తరపు న్యాయవాది జయంత్ భూషణ్ ధర్మాసనానికి విన్నవించారు. అనుమతులు తిరిగి తీసుకునేంతవరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని కోరారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదంలోకి ప్రైవేటు సంస్థలు రావడం సరికాదంటూ ఏకే గంగూలీతో పాటు కేంద్ర అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలతో ధర్మాసనం విభేదించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎవరైనా వేయొచ్చని స్పష్టం చేస్తూ విచారణను జనవరి 24కు వాయిదా వేసింది. -
‘2 గంటల’ నిబంధనలో మార్పులేదు
న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పండగ రోజుల్లో తెల్లవారుజాము 4 నుంచి 5 వరకు, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో బాణసంచా కాల్చుకోవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. సంప్రదాయానికి తగ్గట్లు సమయాన్ని మార్చుకోవచ్చని, మొత్తంగా 2 గంటలు దాటొద్దంది. 2 గంటల నిబంధన దేశవ్యాప్తంగా వర్తిస్తుందని జస్టిస్ కోర్టు స్పష్టంచేసింది. పర్యావరణహిత బాణసంచా తప్ప ఇతర రకాల బాణసంచా ఢిల్లీలో విక్రయించడానికి వీల్లేదని తేల్చింది. ఈ నిబంధన ఈ దీపావళికే కాకుండా ఇతర పండగలకూ వర్తిస్తుందని చెప్పింది. నిషేధించిన బాణసంచా నిబంధన ఆన్లైన్ విక్రయాలకూ వర్తిస్తుందని, కోర్టు ఆదేశాలను ఇ–కామర్స్ వెబ్సైట్లు పాటించానలని, లేకుంటే చర్యలు తప్పవని పేర్కొంది. స్థానిక పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఈ విషయంలో నిఘా పెట్టాలని 23వ తేదీన వెలువరించిన తీర్పులో వెల్లడించింది. అయితే హానికారక బాణసంచాను పూర్తిగా నిషేధించ లేదని, బహుశా వచ్చే ఏడాదికి ఈ నిబంధన అమల్లోకి రావచ్చని బాణసంచా విక్రయంపై కోర్టును ఆశ్రయించిన ఉత్పత్తిదారులకు తెలిపింది. తాము çతీర్పును తప్పుపట్టలేదని, గత సంవత్సరం బాణసంచాను నిషేధిస్తూ కోర్టు వెలువరించిన తీర్పుపైనే తమ ఆవేదన అని బాణసంచా ఉత్పత్తిదారులు సుప్రీంకు విన్నవించుకున్నారు. -
సుపరిపాలన మన జన్మహక్కు
న్యూఢిల్లీ: స్వపరిపాలన లాగే.. సుపరిపాలన కూడా భారతీయుల జన్మ హక్కు అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ఈ దిశగానే పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. వినియోగంలోలేని పాత చట్టాలను రద్దుచేసి నవభారతం కోసం కొత్త రూపుతో ముందుకెళ్తున్నామని మోదీ వ్యాఖ్యానించారు. మాసాంతపు రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్ ద్వారా ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘బాలాగంగాధర్ తిలక్ ఇచ్చిన స్వరాజ్యం నా జన్మహక్కు అనే పిలుపును గుర్తుచేసుకోవాలి. ఇప్పుడు సుపరిపాలన మన జన్మహక్కు అని కోరే సమయం ఆసన్నమైంది. ప్రతి భారతీయుడు సుపరిపాలన ఫలాలు పొందాలి. సానుకూల అభివృద్ధి ఫలితాల్లో భాగస్వామి కావాలి. నవభారత నిర్మాణం కోసం మేం చేస్తున్న ప్రయత్నాల అంతిమ లక్ష్యం కూడా ఇదే’ అని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బాలాగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్‌ల పోరాటాన్ని మన్‌కీబాత్‌లో మోదీ గుర్తుచేశారు. చెత్త ఏరుకునే కుటుంబం నుంచి వచ్చిన ఆశారామ్ చౌదరీ అనే విద్యార్థి ఎయిమ్స్‌లో వైద్యవిద్యకు సీటును సంపాదించడం దేశానికి గర్వకారణమన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో ‘కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన’ అనే నినాదాన్ని ప్రధాని తరచుగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. పర్యావరణ అనుకూల గణేశ్ ఉత్సవాలు ప్రకృతితో విభేదించే మార్గాలు సరైనవి కావన్న ప్రధాని పర్యావరణ సమతుల్యతను కాపాడటం ద్వారానే మానవ మనుగడను కొనసాగించగలమన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్నిచోట్ల వర్షాల్లేకపోవడమే సమతుల్యత దెబ్బతినడానికి ఉదాహరణలన్నారు. ప్రకృతిని ప్రేమించడం, కాపాడటం, వన సంరక్షణ వీటన్నింటిలో ప్రజల సామూహిక భాగస్వామ్యం అవసరమన్నారు. ఈ ఏడాది వినాయక ఉత్సవాలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఉత్సవాల అలంకరణ సామగ్రి నుంచి నిమజ్జనం వరకు ప్రతి చోటా పర్యావరణ హితాన్ని గుర్తుంచుకోవాలన్నారు. విద్యార్థుల జీవితంలో పుస్తకాలు, చదువులకు ప్రత్యామ్నాయమేదీ లేదని ప్రధాని అన్నారు. ఒత్తిడిని పక్కనపెట్టి ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని ఉన్నత చదువులకోసం కాలేజీల్లో చేరిన విద్యార్థులకు మోదీ సూచించారు. ‘యువత తమ జీవితం కొత్త దశలోకి అడుగుపెట్టే నెల జూలై. విద్యార్థుల దృష్టి ఇంటినుంచి హాస్టళ్ల వైపు మళ్లుతుంది. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. కానీ సరైన మిత్రులను ఎంచుకోవాలి’ అని ఆయన సూచించారు. లక్నోలో భూమిపూజ కార్యక్రమంలో ఇటుకపై సంతకంచేస్తున్న ప్రధాని మోదీ. -
ప్లాస్టిక్ భూతం ఆటకట్టు!
ప్రపంచానికి ఇప్పుడు ప్లాస్టిక్ సవాలుగా మారింది. ఎన్ని దేశాలు, ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ను నిషేధించినా వాటి వాడకం మాత్రం ఆగట్లేదు. దీంతో పర్యావరణానికి ఎంతో ముప్పు వాటిల్లుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చిలీకి చెందిన ఇద్దరు ఇంజనీర్లు కరిగిపోయే క్యారీబ్యాగులను తయారు చేశారు. ఇది ప్లాస్టిక్‌కు చెక్ పెడుతుందని చెబుతున్నారు. క్యారీబ్యాగ్‌లను తయారుచేసే సాల్యుబ్యాగ్ కంపెనీ జనరల్ మేనేజర్ రాబర్టో అస్టెటే, మరో మేనేజర్ క్రిస్టియన్ ఆలివేర్స్ కలసి ఈ బ్యాగు వివరాలు వెల్లడించారు. నీటిలో వేసి కలపగానే ఆ బ్యాగు కరిగిపోతుందట. ఈ బ్యాగు పర్యావరణహితంగా ఉంటుందని, ఎలాంటి హానీ కలిగించదని చెబుతున్నారు. వీటి తయారీ ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంటున్నారు. -
పర్యాహరణం
– ప్రచారానికే పరిమితమైన నివారణ చర్యలు – అభివృద్ధి పథకాల పేరుతో చెట్ల నరికివేత – భయపెడుతున్న బయో కాలుష్యం – మానవుడి మనుగడకు సవాల్ విసురుతున్న వైనం – యేటేటా పెరుగుతూ పోతున్నా ఉష్ణోగ్రతలు – నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఇది కర్నూలులోని డాక్టర్్స కాలనీలో ఉన్న ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇక్కడ రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2 వేల మొక్కలను నాటింది. తర్వాత వాటి పెంపకంపై దృష్టిసారించకపోవడంతో చాలా మొక్కలు చనిపోయాయి. ప్రస్తుతం అక్కడక్కడ కొన్ని మొక్కలు కనిపిస్తున్నాయి. పర్యావరణం కాలుష్యమవుతుండటంతో ఓజోన్ పొర తీవ్రంగా దెబ్బతిని అతినీల లోహిత కిరణాలు నేరుగా మానవుడి శరీరంపై పడి పలు రకాల రోగాల బారిన పడుతున్నాడు. జూన్ 5వ తేదీని ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్ష్యాలు, మార్గదర్శకాలను నిర్ణయించుకోవడం తప్ప వాటితో సాధించిన ఫలితాలు మాత్రం శూన్యం. పట్టణీకీకరణతో ప్రమాదం..... ఒకప్పుడు భారతదేశంలో గ్రామీణ వాతావరణం ఉండేది. క్రమక్రమంగా ప్రజలు బతుకు దెరువు కోసం పట్టణాలకు వలస మొదలు పెట్టారు. నేడు పట్టణాల్లో దాదాపు 40 శాతం మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇది 2050 నాటికి 60 శాతానికి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి పరంగా లభించే ఆహార పదార్థాలు, గాలి, వాన, నీరుకు డిమాండ్ ఏర్పడి కొరత నెలకొనే ప్రమాదం ఉంది. దీంతో ప్రజలు కృత్రిమంగా వాటిని సృష్టించుకోవడానికి పలు రసాయన పదార్థాలు, వాయువులను వినియోగించడంతో వాతావరణం కలుషితమవుతోంది. ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజల ఉపాధికి మార్గాలు చూపితే పట్టణీకీకరణపై మొగ్గుచూపకపోవచ్చు. నిస్తేజమైపోతున్నా నేలలు... ఒకప్పుడు పశువుల పెండను ఎరువుగా వాడేవారు. ప్రస్తుతం పశు సంపద రోజురోజుకు తగ్గిపోతుండడంతో అన్నదాతలు విషపూరిత పెస్టిసైడ్లు, రసాయన మందులను వాడుతున్నారు. దీంతో సహజసిద్ధమైన నేల నిస్సారమై పోతోంది. వాటి ద్వారా పండే పంటలను తిన్న ప్రజలకు రకరకాల వ్యాధులు వస్తున్నాయి. భయపెడుతున్నా ఉష్ణోగ్రతలు... ఆంధ్రప్రదేశ్ భూవిస్తీర్ణాన్ని బట్టి 23 శాతం అడవులు ఉండాలి. అయితే ఈ శాతం రోజురోజుకు తగ్గిపోతోంది. అభివృద్ధి పథకాల పేరుతో ఉన్న అడవులను నరికివేస్తున్నారు. ముఖ్యంగా రహదారులు, పరిశ్రమల కోసం ఎక్కువగా అడవులు నరికివేస్తున్నారు. దీంతో వర్షాలు సక్రమంగా కురవక భూగర్భజలాలు ఎండిపోతున్నాయి. 600–700 అడుగుల లోతులో నీళ్లు కనిపించడంలేదు. దీంతో ఇప్పటికే జిలా్లలోని కుంటలు, బావులు ఎండిపోయాయి. అంతేకాక కాంక్రీటు నిర్మాణాలతో చల్లదనం కరువై ఉషో్ణగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం 47, 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో భూవాతావరణం వెడెక్కి వాతావరణంలోని నైట్రోజన్, కార్బన్ డయాకై్సడ్, క్లోరోఫ్లోరోకార్బన్లు ఓజోన్ను పొరను తీవ్రంగా దెబ్బతిస్తున్నాయి. ఫలితంగా అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమిపై పడటంతో జీవకోటి మనుగడ కష్ట సాధ్యంగా మారింది. ప్రకృతితో ప్రజల మమేకం చేసేందుకు.. పర్యావరణ సమతూల్యత దెబ్బతింటుడంతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని యూనైటేడ్ నేషన్స్ కోరుతోంది. అందులో భాగంగా ఈ యేడాది ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో ప్రజలను మమేకం చేసేందుకు ‘కనెక్టింగ్ పీపుల్ టూ నేచర్, ఐ యామ్ విత్ నేచర్ అనే ఇతివృత్తాని ఎన్నుకున్నారు. ప్రతి ఒక్కరి బాధ్యత – రాజేంద్రారెడ్డి, జోనల్ అధికారి, పీసీబీ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ సమష్టిగా సహజ సిద్ధ సంపదను పరిరక్షించుకోవాలి. లేదంటే మానవుడు కాలుష్య కోరల్లో చిక్కి అంతరించిపోయే ప్రమాదం ఉంది. మొక్కలను విరివిగా పెంచాలి. ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం అయినప్పుడే పర్యావరణ సమతూల్యతను కాపాడవచ్చు. -
కాళేశ్వరానికి పర్యావరణ క్లియరెన్స్!
షరతులతో పర్యావరణ ప్రభావ మదింపు అనుమతులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట కల్పిస్తూ ‘కాళేశ్వరం’ ఎత్తిపోతల పథకం పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ) ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులిచ్చింది. అయితే పూర్తి స్థాయి పర్యావరణ అనుమతుల నాటికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సూత్రప్రాయ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని షరతు పెట్టింది. ఈ మేరకు గత నెల 30, 31వ తేదీల్లో జరిగిన సమావేశపు వివరాలను కేంద్ర పర్యావరణ శాఖ వెబ్సైట్లో పొందు పరిచింది. ఈ శాఖ పరిధిలోని పర్యావరణ సలహా కమిటీ(ఈఏసీ) చేసిన నిర్ణయాన్ని మినిట్స్ రూపంలో వెల్లడించింది. ప్రాజెక్టు పర్యావరణ నివేదిక తయారీకి అనుసరిం చాల్సిన విధి విధానాలను (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్–టీఓఆర్) ఖరారు చేస్తూ పలు సూచనలు చేసింది. షరతులతో అనుమతులు రాష్ట్రంలో సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో రూ.80,499.71 కోట్ల అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. గోదావరి నుంచి 180 టీఎంసీలను మళ్లించేలా 150 టీఎంసీల సామర్థ్యంతో 26 రిజర్వాయర్లను ప్రతిపాదించారు. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 80 వేల ఎకరాల భూసేకరణ, 2,866 హెక్టార్ల (13,706 ఎకరాల) మేర అటవీ భూమి అవసరం ఉంది. పర్యావరణాన్ని ప్రభావితం చేసే ఈ అంశాలకు.. పరిష్కారాలు చూపుతూ ప్రభుత్వం పర్యావరణ ప్రభావ మదింపు, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) చేపట్టాల్సి ఉంది. అయితే కోర్టు కేసులు, ట్రిబ్యునళ్ల తీర్పుల నేపథ్యంలో అప్రమత్తమైన నీటి పారుదల శాఖ ముందుగానే స్పందించి జనవరి 20నే పర్యావరణ మదింపు కోసం ఈఏసీకి వివరణలు ఇచ్చింది. కానీ సీడబ్ల్యూసీ అనుమతులిచ్చే వరకు.. తాము ఓకే చెప్పలేమని అప్పట్లో ఈఏసీ తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేయడంతో మంగళవారం సానుకూల నిర్ణయాన్ని వెల్లడించింది. పర్యావరణ అను మతుల నివేదికలు సమర్పించే సమయంలో సీడబ్ల్యూసీ సూత్రప్రాయ క్లియరెన్స్‌లు సైతం అందించాలని సూచించింది. హైడ్రాలజీ డేటా అధ్యయనాలను ఈఐఏ, ఈఎంపీలతో కలిపి సమర్పించాలని, ఏడాదిలో వరుస పది దినాల్లో 90, 75, 50 శాతం డిపెండబెలిటీ నీటి లెక్కలతో ఈఐఏ తయారు చేయాలని తెలిపింది. నిర్వాసితులకు చట్ట ప్రకారం తగిన పరిహారం చెల్లించాలంది. ప్రాణహిత, తుపాకులగూడెం ప్రాజెక్టులకూ ఓకే ఆదిలాబాద్ జిల్లాలో 80వేల హెక్టార్లకు నీరందించేందుకు రూ.4,204 కోట్లతో చేపట్టిన ‘ప్రాణహిత (తమ్మిడిహెట్టి)’ ప్రాజెక్టు టీఓఆర్‌కు పర్యావరణ సలహా కమిటీ ఓకే చెప్పింది. ప్రాజెక్టుకు ఇప్పటికే ఏదైనా సమాచారం సేకరించి ఉంటే దాన్ని ఏఐఏకి వాడుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే మూడేళ్ల ముందున్న డేటా మాత్రం ఉండరాదని పేర్కొంది. పర్యావ రణ ప్రభావ మదింపులో భాగంగా ప్రజా భిప్రాయ సేకరణ కచ్చితంగా చేయాలని స్పష్టం చేసింది. ఇక వరంగల్ జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో రూ.2,121 కోట్ల తో నిర్మిస్తున్న తుపాకులగూడెం ప్రాజెక్టు టీఓఆర్‌కు కూడా పర్యావరణ సలహా కమిటీ అంగీకారం తెలిపింది. దీనికి సైతం ఈఐఏ, ఈఎంపీ నివేదికలతో సహా సీడబ్ల్యూసీ సూత్రప్రాయ అంగీకార నివేది కను సమర్పించాలని సూచించింది. -
ఈ-చెత్తతో ఆరోగ్యానికి తూట్లు!
కాంపిటీటివ్ గెడైన్స్ జనరల్ సైన్స్ 20వ శతాబ్దంలో మానవుడు సాధించిన అభివృద్ధిలో భాగంగా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఆవిష్కృతమయ్యాయి. తర్వాత కాలంలో ప్రపంచీకరణ ఫలితంగా సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ సాధనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మనిషి జీవితం నుంచి వీటిని విడదీయలేనంతగా కలిసి పోయాయి. ఇదే సమయంలో అపరిమితంగా వాడి పారేస్తున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. అందువల్లే ప్రస్తుతం ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్న అంశాల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) సమస్య ముందు వరుసలో ఉంది. వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వ్యర్థాలు) అంటారు. పాడైన టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్చార్జర్లు, బ్యాటరీలు, మదర్‌బోర్డులు, ఏసీలు, వాషింగ్మెషిన్లు, రిమోట్లు, సీడీలు, హెడ్ఫోన్లు, జిరాక్స్ యంత్రాలు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు (సీపీయూ), ఐపాడ్, ఫ్యాక్స్ యంత్రాలు మొదలైన వాటిని ఈ-వ్యర్థాలుగా పేర్కొంటారు. వీటి విడుదల రోజురోజుకూ అధికమవుతూ..పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. ఈ-వ్యర్థాల నుంచి వెలువడే ప్రమాదకర రసాయనాలు భూమిలోకి చేరి, భూగర్భ జలాలను విషతుల్యం చేస్తూ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు - వ్యాధులు ఈ-వ్యర్థాలకు సంబంధించి మదర్‌బోర్డు, చిప్, సర్క్యూట్లను ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు. వీటి తయారీలో ప్రమాదకరమైన సీసం, ఆర్సినిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్, పాదరసం, నికెల్, జింక్ మొదలైన వాటిని ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి తయారు చేసిన వస్తువులను పారేస్తే వాటి భాగాల్లో ఉండే రసాయనాలు మట్టితో పాటు భూగర్భ జలాలను విషతుల్యం చేస్తాయి. వీటిని తగలబెట్టడం ద్వారా వచ్చే విష వాయువులు వాతావరణానికి హాని కలిగిస్తాయి. సీసాన్ని రీచార్జబుల్ బ్యాటరీలు, ట్రాన్సిస్టర్లు, లిథియం బ్యాటరీల తయారీలో అధికంగా వాడతారు. సీసంతో కలుషితమైన నీటిని తాగితే నాడీ వ్యవస్థతో పాటు మూత్రపిండాలు దెబ్బతింటాయి. పిల్లల్లో బుద్ధిమాంద్యం వస్తుంది. కంప్యూటర్ మానిటర్, సర్క్యూట్ బోర్డులు, కంప్యూటర్ బ్యాటరీ తయారీలో కాడ్మియాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. దీర్ఘకాలం కాడ్మియం ప్రభావానికి గురైతే ఐ్ట్చజీఐ్ట్చజీ అనే వ్యాధి కలుగుతుంది. మూత్రపిండాలు, ఎముకలను బలహీనపరచడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. దీంతోపాటు ఈ వ్యాధి వస్తే వెన్నెముక, కీళ్లలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. పాదరసాన్ని (మెర్క్యూరీ) స్విచ్‌లు, పాకెట్ క్యాలిక్యులేటర్, ఎల్సీడీల తయారీలో వాడతారు. పాదరసం ఆహారపు గొలుసు ద్వారా మనిషిలోకి చేరి మినిమెటా వ్యాధిని కలుగజేస్తుంది. సెమికండక్టర్లు, డయోడ్లు, లెడ్‌ల తయారీలో వాడే ఆర్సినిక్ వల్ల క్యాన్సర్, గుండెజబ్బు కలుగుతాయి. అమెరికా నుంచే అధికంగా.. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సరాసరి 93.5 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం అమెరికా అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను విడుదల చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా చైనా, జపాన్, జర్మనీ దేశాలున్నాయి. భారతదేశం సంవత్సరానికి 18.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వెలువరిస్త్తూ ఐదో స్థానంలో ఉంది. 2020 నాటికి భారత్‌లో 52 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు విడుదలవుతాయని అసోచామ్ అంచనా. పెరుగుతున్న జనాభా, ప్రపంచదేశాలకు భారతదేశం ప్రధాన మార్కెట్‌గా ఉండటంతో ఎలక్ట్రానిక్ సంస్థలు తమ ఉత్పత్తులను ముందుగా ఇక్కడ విడుదల చేస్తున్నాయి. భారత్‌లో యువత ఎక్కువ సంఖ్యలో ఉండటం, వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడం వంటివి కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముంబై నగరం 1,20,000 మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాల ఉత్పత్తితో దేశంలో మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానం (98,000 మెట్రిక్ టన్నులు), బెంగుళూరు మూడో స్థానం, చెన్నై నాలుగో స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్ నగరం ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉంది. దేశంలో విడుదలతున్న ఈ-వ్యర్థాల్లో 70 శాతం కంప్యూటర్ విడిభాగాలు ఉండగా.. 12 శాతం టెలికాం పరికరాలు, 8 శాతం ఎలక్ట్రానిక్ రంగం నుంచి వచ్చిన వ్యర్థాలు ఉన్నట్లు అంచనా. ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునఃశుద్ధి (రీ సైక్లింగ్ ఆఫ్ ఈ-వేస్ట్) భారతదేశంలో విడుదలయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో కేవలం 1.5 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నట్లు అసోచామ్ సర్వే తెలిపింది. రీసైక్లింగ్ ప్రక్రియలో ఈ-వ్యర్థాలను సుత్తెలతో కొట్టి పిండి చేయడం, ముక్కలుగా నరకడం చేస్తారు. ఈ ప్రక్రియలో వాటి నుంచి బయటపడిన రసాయన పదార్థాలు మట్టిలో చేరతాయి. వర్షం వచ్చినప్పుడు అవి నీటిలో కలిసి, భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. కలుషితమైన ఈ నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. బాసెల్ ఒడంబడిక ప్రపంచదేశాల మధ్య హానికర వ్యర్థ పదార్థాల రవాణాను నిషేధిస్తూ బాసెల్ ఒడంబడిక జరిగింది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి హానికర వ్యర్థ పదార్థాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు రవాణా చేయడాన్ని బాసెల్ ఒడంబడిక నిషేధిస్తుంది. అయితే ఈ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు తమ దేశాల్లో విడుదలైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఆఫ్రికాలోని ఘనా, నైజీరియా, ఆసియాలోని భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, చైనా వంటి దేశాలకు తరలిస్తున్నాయి. ఈ విధంగా భారత్‌లోకి ఏడాదికి 50,000 టన్నుల ఈ-వ్యర్థాలు అక్రమ రవాణా జరుగుతున్నట్లు అంచనా. భారతదేశ ఎగుమతి-దిగుమతి చట్టాల ప్రకారం 10 సంవత్సరాలు వాడిన సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లను దిగుమతి చేసుకోవచ్చు. ఈ నిబంధనను అడ్డం పెట్టుకొని ఆయా దేశాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను భారత్‌లో ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు చాలా ప్రమాదకరమైనవి కాబట్టి ధనిక దేశాలు ఈ-వ్యర్థాలను పేద దేశాలకు తరలిస్తున్నాయి. హానికర ఈ-వ్యర్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆఫ్రికా ఖండంలోని 12 దేశాలు కలిసి బమాకో కన్వెన్షన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. ఇది 1999 నుంచి ఆఫ్రికా ఖండంలో అమల్లోకి వచ్చింది. తర్వాత కాలంలో హానికర రసాయన వ్యర్థ పదార్థాల రవాణాను మరింత కఠినతరం చేస్తూ 1998లో 140 దేశాలు రోటర్డ్యామ్ కన్వెన్షన్‌ను ఆమోదించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా 2004, ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. భారతదేశం 2005, మే 24న దీన్ని ఆమోదించింది. హానికర రసాయన వ్యర్థ పదార్థాల వల్ల జరుగుతున్న హానిని గ్రహించిన భారత ప్రభుత్వం ఇటీవల హానికర వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమావళిని (మార్చి, 2016) తీసుకొచ్చింది. మాదిరి ప్రశ్నలు 1. Itai-Itai అనే వ్యాధి దేని ప్రభావం వల్ల కలుగుతుంది? 1) సీసం 2) ఆర్సెనిక్ 3) కాడ్మియం 4) పాదరసం జవాబు: 3 2. ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే దేశం ఏది? 1) అమెరికా 2) చైనా 3) జపాన్ 4) జర్మనీ జవాబు: 1 3. భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే నగరం ఏది? 1) ఢిల్లీ 2) కోల్‌కతా 3) చెన్నై 4) ముంబై జవాబు: 4 - ప్రవీణ్ దత్తు లెక్చరర్ ఇన్ జువాలజీ,ఎల్.హెచ్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం -
పర్యావరణ పరిరక్షణ అవశ్యం
సందర్భం నదులు ఎండిపోవడం, ప్రాజెక్టులు బీటలువారిపోవడం, కనుచూపు మేర తాగునీరు దొరక్క కోట్లమంది అల్లాడిపోవడం, సరుకులు నీళ్లను రైళ్లు సరఫరా చేయడం, వడగాడ్పులకు వేలాదిమంది పిట్టల్లాగా రాలి పోవడం, అవసరం లేనిచోట అతివృష్టి, అవసరమైన చోట అనావృష్టి, గడ్డి గాదం కరువై, పోషణ బరువై, పెంచుకున్న జంతువులను వేలాదిగా కబేళాలకు తోలడం.. ఇదే పర్యావరణ విధ్వంసం అంటే. వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సునామీలు, వరదలు, అతివృష్టి, అనావృష్టి, కరువులు, గతి తప్పిన రుతు పవనాలు, జీవావరణ సమతుల్యతలో లోపం, నీరు, గాలి, భూమి కలుషితం కావడం, ప్రజారోగ్యం ప్రత్య క్షంగా, పరోక్షంగా దెబ్బతినడం ఇవన్నీ మనిషి ఇటీవలి కాలంలోనే చూస్తున్న వైపరీత్యాలు. భూగోళంపై మనిషి సాగించిన, సాగిస్తూ వస్తున్న సకల హింసారూపాలకు ప్రతిఫలం మన కళ్లముందే ఇలా కనిపిస్తోంది. భూమిపై సుమారు 17,70,000 జీవజాతులు మనిషితోపాటుగా జీవిస్తు న్నాయి. కాని నేడు విశ్వరూపం దాల్చిన పర్యావరణ క్షీణతకు కారకుడు మానవుడు మాత్రమే. అనాలోచితంగా, స్వార్థంతో మనిషి గత రెండు మూడు శతాబ్దాల్లో చేస్తూ వస్తున్న చర్యలతోనే పర్యావరణ సమస్యలు ముంచుకొచ్చాయి. ప్రస్తుతం భూగోళానికి వ్యతిరేకంగా సాగుతున్న హింసకు మరోపేరు పర్యావరణ విధ్వంసం. ఇందులో రేపటితరం వనరులను నేటి తరం దోచుకుంటోంది. అడ వులను, రోడ్లకు ఇరువైపులా చెట్లను విపరీతంగా నరికి వేయడం, వాహనాలు, పరిశ్రమల ద్వారా విపరీతమైన కాలుష్యం ఏర్పడటం, ప్లాస్టిక్ వాడకం పెరగటం, వ్యవ సాయంలో మితిమీరిన రసాయనాలు వాడటం, ప్రకృతి, సహజ వనరులను అవసరాలకు మించి వాడటం, ప్రతి పనీ యంత్రంతోనే చేయడంతో జీవన శైలిలో మార్పులు ఇవీ భూమిపై మనిషి హింసకు నిదర్శనాలు. అడుగు పెట్టిన చోటల్లా పర్యావరణ విధ్వంసానికి కారకుడైన మనిషి తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నాడు. పర్యావరణ విధ్వంసంపై ఐక్యరాజ్య సమితి 1972 జూన్ 5న స్టాక్‌హోమ్‌లో ‘మానవుడు - పర్యావరణం’ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆవిర్భావానికి దారి తీసింది. ప్రపంచ స్థాయిలో ఆలోచించు - ప్రాంతీయంగా ఆచరించు అనేది పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు ఇచ్చిన నినాదం. మనం విశ్వమంత విశాలంగా ఆలో చించి సమస్యను అవగాహన చేసుకున్నా, మనం కర్త వ్యాన్ని నిర్వహించాల్సింది మనం ఉన్నచోటే. ఇక్కడే మన చిత్తశుద్ధి బయటపడుతుంది. ఉదాహరణకు మనం బహుమతిగా ఇచ్చే ఒక బొకే విలువ గంట సేపు మాత్రమే కాగా గ్రీటింగ్ కార్డు విలువ కొన్ని రోజుల వరకే ఉంటుంది. స్వీట్ బాక్స్ విలువ కొన్ని గంటలు మాత్రమే. కానీ వాటికన్న తక్కువ ధరతో ఒక మొక్కను బహుమతిగా ఇచ్చి నాటి, స్నేహానికి గుర్తుగా పెంచితే అది 50 ఏళ్ల కాలంలో 15 లక్షల 70 వేల వస్తుసేవలను మనకు ఇస్తుందని ఒక అంచనా. ఇంతకన్నా మానవసేవా, దేశభక్తి వేరే ఏముంటుంది? మనం వ్యక్తులుగానూ, సంస్థాగతంగానూ మన చుట్టూ ఉన్న పరిసరాలను చక్కదిద్దుకోలేకపోతున్నాం కాబట్టే ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో 13 నగరాలు భారతదేశానికి చెందినవే ఉంటున్నాయి. భారత్‌లోని 290 నదుల్లో 66 శాతం నదులు రసాయన కాలుష్యాలతో నిండిపోయాయి. దేశంలో 30 కోట్ల మంది కరువు బారిన పడ్డారు. వర్షపాతం లేమి కంటే ప్రణాళికా లేమి, ముందుచూపు లేకపోవడం, నేరపూరితమైన నిర్లక్ష్యం దీనికి కారణమంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. గత నాలుగు దశాబ్దాలకు పైగా పర్యావరణంపై అంతర్జాతీయంగా అనేక సదస్సులు, నిర్ణయాలు, అవగాహన లు జరుగుతూ ఉన్నాయి. ప్రతిదేశం కర్బన ఉద్గారాలు తగ్గించుకోవాలని 1997లో జపాన్‌లో తీర్మానించిన క్యోటో ప్రొటోకాల్ సంపూర్ణంగా అమలైతే భూతాపం తగ్గుతుంది. అందుకు ప్రతి ఒక్క వ్యక్తీ, దేశం కృషి ఎంతైనా అవసరం. (నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా) వ్యాసకర్త జాతీయ కన్వీనర్ జనవిజ్ఞానవేదిక పర్యావరణ విభాగం మొబైల్: 9959806652 సి. యాగంటేశ్వరప్ప -
మా కన్నీళ్లు తుడిచేదెవరు?
♦ భద్రాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ భూనిర్వాసితుల ని‘వేదన’ ♦ నేడు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంపై కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఈ సభలో టీఎస్ జెన్కో సీఎండీ పాల్గొంటారు. పరిహారం ప్యాకేజి పూర్తిగా ఇవ్వకపోవడం, సేకరించిన భూముల్లో రెండు పంటలు పండేవి లేవంటూ అధికారులు సాగిస్తున్న తప్పుడు వాదన, ఉద్యోగ హామీ పత్రాలు ఇవ్వకపోవడం తదితరాంశాలపై గళమెత్తేందుకు నిర్వాసితులు సిద్ధమవుతున్నారు. ఆందోళన వద్దు.. అందరికీ న్యాయం చేస్తాం భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజె క్టు విషయంలో స్థానిక నిర్వాసితులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ న్యాయం చేస్తాం. ఇంకా 346 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తాం. ఐటీఐ పూర్తిచేసిన వారికి ఎటువంటి పరీక్షలు పెట్టకుండా ఉద్యోగాలు కల్పిస్తాం. - టీఎస్ జె న్కో సీఎండీ ప్రభాకర్‌రావు పచ్చని భూములను ఇస్తే.. పచ్చి దగా చేస్తున్నారు మా భూముల్లో రెండు పంటలు పండేవే లేవంటూ జెన్కో అబద్ధాలాడుతోంది ఉద్యోగ హామీ పత్రాల ఊసే లేదు పరిహారం, ప్యాకేజీలు పూర్తిగా అందలేదు మా బతుకులు ఆగమాగం చేయొద్దు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూనిర్వాసితుల కన్నీటి ని’వేదన’ నేడు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కాలుష్య భూతమట..! ఈ పవర్ ప్లాంట్ పూర్తయిన తరువాత మమ్మల్ని వెంటాడుతుందట..!! మేమిప్పుడు భయంతో వణుకుతున్నాం... రాత్రిళ్లు నిద్రపట్టక చస్తున్నాం. ఈ భయం.. వణుకు.. నిద్రలేమి ఎందుకంటారా..! కనిపించని ఆ భూతాన్ని తలుచుకుని కాదు... ఈ జెన్కో, రెవెన్యూ అధికారుల నయవంచనను చూసి. ఇది, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూనిర్వాసితుల నిత్య వేదన, మూగ రోదన. మణుగూరు, పినపాక: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంపై కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టర్ లోకేష్‌కుమార్ అధ్యక్షతన గురువారం భద్రాద్రి పైలాన్ నిర్మాణ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణకు సర్వం సిద్ధమైంది. ‘‘కాలుష్య ప్రభావంతో జంతుజాలంతోపాటు మా జీవన మనుగడకు ముప్పు ఏర్పడుతుందని మీరు అంటున్నారు. అప్పటిదాకా కాదు.. ఇప్పుడే ఉపద్రవం ముంచుకొచ్చిందని మేమంటున్నాం. మా జీవనాధారమైన పచ్చని భూములను మాయమాటలు చెప్పి లాక్కున్నారు. పరిహారం.. ప్యాకేజీలు పూర్తిగా ఇవ్వలేదు. ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. భూములను కోల్పోయి, పరిహారం అందక, ఊద్యోగాలు లేక.. ఏ ఆధారంతో మేము బతకాలి? మా సమాధులపై పవర్ ప్లాంటుకు పునాదులు వేస్తారా?’’ అని, ముక్కు సూటిగా నిలదీసేందుకు, కడిగేసేందుకు ఇక్కడి భూనిర్వాసితులు సిద్ధమయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణపై ప్రచారం కోసం ప్రభావిత గ్రామాలకు వెళ్లిన అధికారులకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ముందు దగా... వెనుక దగా.. ‘‘జెన్కో, రెవెన్యూ అధికారులు మమ్మల్ని నిలువునా దగా చేశారు. అదిస్తాం.. ఇదిస్తాం అంటూ భూములు ఇచ్చేదాకా మా వెంట పడ్డారు. మాయమాటలతో నమ్మించారు.. ఒప్పించారు. ఇప్పుడేం చేస్తున్నారో చూస్తున్నారు కదా..!’’ అని, భూనిర్వాసితులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవర్ స్టేషన్ కోసం సేకరించిన భూ ముల్లో రెండు పంటలు పండేవి లేనేలేవని ఇక్కడి అధికారులు ఉన్నతాధికారులకు నివేదించడంపై మండిపడుతున్నారు. 853 సర్వే నంబర్లో 600 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. వాటిలో ఒకే పంట పండుతున్నట్టుగా జెన్కో ఉన్నతాధికారులకు ఇక్కడి అధికారులు తప్పుడు నివేదికలు పంపారు. పేరంటాల చెరువు కిందనున్న ఈ భూముల్లో రెండు పంటలు పండే భూములు కూడా ఉన్నాయి. భూనిర్వాసితుల్లో 361మంది ప్యాకేజీకి బదులుగా (తమ కుటుంబాల్లోని యువతకు) ఉద్యోగాలు కావాలని అడిగారు. ఐటీఐ చేస్తేనే ఉద్యోగం ఇస్తామని అధికారులు చెప్పారు. దీంతో, పీజీ, డిగ్రీ, బీఈడీ చేసినవారు కూడా ఐటీఐలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేదు. వారి తీరు మోసపూరితంగా ఉందని భావించిన నిర్వాసిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ‘మేం ఐటీఐ చేస్తాం.. అవకాశమివ్వండి మహాప్రభో’ అంటూ, నాలుగు నెలలపాటు పోరాడిన తరువాతనే అధికారులు సీట్లు కేటాయించారు. ఉద్యోగ హామీ పత్రాలను మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. ‘‘ఐటీఐ సీట్ల కోసం నాలుగు నెలలు పోరాడాం. ఉద్యోగ హామీ పత్రాల కోసం ఇంకెన్నాళ్లు పోరాడాల్సుంటుందో’’ అని, సంబంధిత నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ‘‘పవర్ స్టేషన్ నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. మా భూముల్లో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రంతో రాష్ర్టమంతటా వెలుగులు నిండితే మాకూ సంతోషమే. మేం కోరుతున్నదల్లా ఒక్కటే... వెలుగులు నింపే పేరుతో మా బతుకులను చీకటిమయం చేయొద్దు. మమ్మల్ని సమాధి చేసి.. పవర్ స్టేషన్‌కు పునాదులు వేయొద్దు. ఈ ప్రజాభిప్రాయ వేదిక సాక్షిగానైనా మా కన్నీళ్లు తుడవాలి. మాకు బతుకుపై భరోసా ఇవ్వాలి’’ అని, కన్నీటిపర్యంతమవుతూ చేతులెత్తి వేడుకుంటున్నారు. నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి కాలుష్య ప్రభావాన్ని అడ్డుకోలేని సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకం, నిర్వాసితుల గోడుపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలతో వివిధ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడ్డాయి. ప్రజాభిప్రాయ సేకరణ సభలో ఇవి నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, తమకు (నిర్వాసితులకు) జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని నిర్వాసితులు కోరుతున్నారు. జెన్కో సీఎండీతోపాటు కలెక్టర్ కూడా పాల్గొనే ఈ సభలో.. కాలుష్య ప్రభావిత గ్రామాలను దత్తత తీసుకోవడం, అక్కడ నెలకొల్పే సౌకర్యాలు, పుసరావాసం తదితరాంశాలను లేవనెత్తాలని, సమాధానాలు రాబట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏర్పాట్లు పరిశీలించిన జెన్కో సీఎండీ పినపాక : భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను బుధవారం టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు బుధవారం సందర్శించారు. ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాట్లను పరిశీలించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ వద్ద నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం, విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాద్రి పవర్ ప్లాంట్ ద్వారా తెలంగాణ మొత్తానికి విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. సబ్ క్రిటికల్, సూపర్‌క్రిటికల్ టెక్నాలజీ మధ్య తేడా ఏమీ లేదన్నారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. -
కలిమి మండిస్తున్న కొలిమి
విశ్లేషణ ధనిక దేశాల ప్రజల జీవనశైలిని గురించి పల్లెత్తు మాట అనకూడదు కాబట్టి, మళ్లీ త్యాగాలు చేసే బాధ్యత అభివృద్ధి చెందుతున్న దేశాల భుజస్కంధాల మీదే పడుతోంది. పేద దేశాల భవిష్యత్ చిత్రపటం ఎంత దారుణంగా ఉందో ఆవిష్కరించే అన్ని రకాల వివరాలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి. ఈ అధ్యయనాలను గురించి అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన విద్యావేత్తలు, సంప్రతింపుల నిపుణులు పదేపదే వల్లిస్తున్నారు కూడా. అయితే ధనిక దేశాలను హెచ్చరిస్తూ వచ్చే నివేదికలన్నీ చెవిటివాని ముందు శంఖు ఊదిన రీతిలో ప్రయోజనం లేకుండా మిగిలి పోతున్నాయి. ఫ్రాన్స్‌లో 2003లో కేవలం ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగిన ఫలితంగానే 10,000 మంది రాలిపోయారు. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలే త్యాగాలు చేయాలని చెబుతుంటారు. ధనిక దేశాల వారి జీవన శైలి చెక్కుచెదిరే పరిస్థితులు తలెత్తకూడదు. ధనిక దేశాల ప్రజలు సాగిస్తున్న జీవన విధానమే పర్యావరణంలో ఉత్పాతాలకు కారణమవుతున్నదని ప్రపంచమంతా చూస్తుండగానే మన ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మోదీ సరిగ్గా గురి చూసి కొట్టిన సంగతిని గుర్తించవలసిందే. పాశ్చాత్య దేశాల ప్రజల జీవన విధానం గురించి నోరు విప్పడమే పెద్ద నేరంలా భావిస్తారు. అసలు ఆ అంశాన్ని లేవనెత్తడమే మర్యాదను ఉల్లంఘించడం కింద కూడా ప్రకటిస్తారు. మొత్తంగా ధనిక దేశాలను నిలదీయడమే రాజకీయంగా తప్పన్నట్టు మాట్లాడతారు. 'ఏదిఏమైనా ఎవరో కొద్దిమంది అనుసరించే జీవన విధానం ఇప్పటికీ అభివృద్ధి అనే నిచ్చెన మొదటి మెట్టు దగ్గర ఉండిపోయిన దేశాల అవకాశాలకు అడ్డంకిగా నిలవరాదు' అని కూడా 'ఫైనాన్షియల్ టైమ్స్'వారి అభిప్రాయసేకరణ పుస్తకంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. మోదీ రాసిన ఈ మాటలు అందరికీ వందనీయుడైన పర్యావరణవేత్త స్వర్గీయ అనిల్ అగర్వాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నాకు గుర్తుకు వచ్చేటట్టు చేశాయి. అగర్వాల్ ఒక సందర్భంలో ఇలా రాశారు, 'ఒక సగటు అమెరికా పౌరుడు వినియోగించిన స్థాయిలోనే ఒక మధ్య తరగతి భారతీయుడు కూడా విద్యుత్‌ను వినియోగించినట్టయితే ఈ ప్రపంచం యాభై ఏళ్ల క్రితమే ఉడికిపోయి ఉండేది.'ఆయన సత్యమే చెప్పారు. అయినా మీరు ధనిక దేశాల ప్రజల జీవనశైలిని గురించి ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారి దగ్గర నుంచి మనకు వస్తున్న సమాధానం మండిపాటు మాత్రమే. నేను కూడా కొన్నేళ్ల క్రితం ఇలా ప్రశ్నించే పని చేసినందుకు అలాంటి ఆగ్రహాన్నే చవి చూశాను. ధాన్యం పండించడం కంటే, గొడ్డు మాంసం తినడమే పర్యావరణానికి ఎంతో ప్రమాదకరమని చెబుతూ, ఆ అంశం మీద వెలువడిన పలు అధ్యయనాలను ఒక వ్యాసంలో ఉటంకించాను. దీనితో ఒక పద్ధతి ప్రకారం సోషల్ మీడియా ద్వారా తిట్ల దండకంతో నా మీద దండయాత్ర జరిగింది. మూడు భూగోళాలు ఎలా వస్తాయి? మూడు సంవత్సరాల క్రితమే, అంటే 2012లోనే వరల్డ్‌వైడ్ ఫండ్ (డబ్ల్యు. డబ్ల్యు. ఎఫ్.) 'లివింగ్ ప్లానెట్' (జీవ వైవిధ్యం, పర్యావరణం పద్ధతులు, సహజ వనరులతో కూడిన భూగోళాన్ని ప్రస్తావించడానికి వాడుతున్న పదబంధం) పేరుతో నివేదికను విడుదల చేసింది. నిజానికి ఆ సంస్థ ప్రతి రెండేళ్లకూ ఒకసారి ఇలాంటి ఒక నివేదికను ప్రపంచం ముందు పెడుతూ ఉంటుంది. అయితే 2012 నివేదికలో, 'భూగోళం మనకు అందివ్వగల వనరులకు మించి యాభైశాతం అదనంగా వనరులను వినియోగించు కుంటున్నాం. అంటే మనం ఇవాళ 1 1/2 భూగోళం వంటిదాని మీద నివశిస్తున్నామన్నమాట'అని డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్. పేర్కొన్నది. 'ఇదే పద్ధతిని మనం కొనసాగిస్తే 2050 నాటికి మనకి మూడు భూగోళాలు అవసరమవుతాయి'అని ఆ సంస్థ సంచాలకుడు జిమ్ లీపే చెప్పారు. ఇంతకు మించిన సుస్పష్టమైన, గట్టి హెచ్చరిక మరొకటి ఉండదు. ప్రపంచంలో ఉష్ణోగ్రత రెండు డిగ్రీలకు దాటకుండా చూడడం కోసం ఉద్గారాల ప్రమాణాలను అదుపుచేయాలని ఆకాంక్షించడం ముమ్మాటికీ ఆహ్వానించదగిన వైఖరే. కానీ ఇక్కడే పట్టించుకోని సంగతి, లేదా ఉద్దేశ పూర్వకంగానే జరుగుతున్నదేనని భావించినా భావించవలసిన సంగతి- అది, వినియోగం మీద నిష్కర్షగా కోత విధించుకోకపోవడం. మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ పెరుగుదల నమూనాయే వినియోగాన్ని ప్రోత్సహిం చేదిగా కనిపిస్తూ ఉండడం, దీనితోనే స్థూల దేశీయోత్పత్తిని లెక్క కట్టడం, ఇదంతా ప్రకృతి వనరులను కేవల వినియోగ వస్తువుగా చూసేటట్టు చేయడంతో సంక్షోభానికి తెర లేచింది. ఈ విధమైన వినియోగ ధోరణి ఏ మాత్రం సమర్థనీయం కాదని డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్. నివేదిక తేల్చిచెప్పింది. అయినప్పటికీ ఈనాటికి కూడా ఏ ఒక్కరు వినియోగాన్ని తగ్గించుకోవడం గురించి నోరెత్తి మాట్లాడడం లేదు. ఒక వేళ ఎవరైనా ఆ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి మీద అభివృద్ధి నిరోధకులన్న ముద్ర పడిపోతుంది. మనవారూ దోషులే అవుతారు! ధనికదేశాల ప్రజలు, జాతులు పర్యావరణం మీద చూపుతున్న ప్రభావం, తక్కువ ఆదాయం కలిగిన దేశాల ప్రజల ద్వారా పడే ప్రభావం కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఇందుకు సంబంధించి 'ది గార్డియన్' పత్రిక కూడా ఒక నివేదికను ప్రచురించింది. అమెరికాలో జన్మిస్తున్న ప్రతి శిశువు తన తల్లిదండ్రుల ద్వారా జనించే కర్బన ఉద్గారాలకు మరో 9,441 టన్నుల ఉద్గారాలను జత చేస్తున్నాడని ఆ నివేదికలోనే చదివాను. అదే బంగ్లాదేశ్‌లో అయితే 1,384 టన్నులు, చైనాలో 56 టన్నుల ఉద్గారాలను శిశువులు జత చేస్తున్నారు. కానీ పశ్చిమ దేశాల జీవన విధానం మోజులో పడిన అభివృద్ధి చెందుతున్న దేశాల కూడా జనాభా వినియోగ సంస్కృతిని విశేషంగా పెంచుకుంటున్నది. ఇందులో భారత్ కూడా ఒకటి. పాశ్చాత్య దేశాల ప్రజల జీవన విధానాన్ని అనుసరించబోమని భారత్‌లోని మధ్య తరగతి ప్రజలు ప్రతిన పూనాలి. లేకుంటే వీరు కూడా ధనిక దేశాల ప్రజల వలే పర్యావరణకు జరుగుతున్న హానికి సంబంధించి దోషులుగానే మిగులుతారు. ఉద్గారాల ఉత్పత్తి మీద తలసరి లెక్కలు పరిశీలించకుండా నెపాన్ని ఇతరుల మీదకు తోసివేయడం చాలా సులభం కూడా. ఎంత తేడా? గడచిన బుధవారం బ్రిటిష్ సంస్థ ఆక్స్‌ఫామ్ ‘కర్బనాల అసమతుల్యతలో తీవ్రత’ను వివరిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. ఆయా దేశాలు విడుదల చేస్తున్న కర్బనాలను గురించి ఇందులో లెక్కకట్టడం జరిగింది. జీవనశైలి ద్వారా జరిగే వినియోగం వల్ల విడుదలయ్యే 50 శాతం ఉద్గారాలకు ప్రపంచ ంలో ఉన్న కేవలం 10 శాతం ధనిక దేశాలే కారణమని ఆ నివేదిక వెల్లడించింది. దీనితో పాటు, ఇలాంటి జీవనశైలి వినియోగంతో విడుదలయ్యే మరో 10 శాతం ఉద్గారాలకు కారణం 50 శాతంగా ఉన్న పేదదేశాలని కూడా ఆ నివేదిక తేల్చి చెప్పింది. బలమైన ఆర్థిక వ్యవస్థలుగా అవతరిస్తున్న లేదా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలని పిలిచే దేశాల వల్లనే ఉద్గారాల పట్టిక తారుమారవుతున్నదన్న భ్రమను ఆక్స్‌ఫామ్ నివేదిక పటాపంచలు చేస్తుండగా, నిజమేమిటో మన కళ్ల ముందు నిలిచింది. ధనిక దేశాల జీవనశైలే భూగోళాన్ని ఎక్కువగా నష్టపరుస్తున్నదన్నదే సత్యం. ధనిక దేశాల ప్రజల జీవనశైలిని గురించి పల్లెత్తు మాట అనకూడదు కాబట్టి, మళ్లీ త్యాగాలు చేసే బాధ్యత అభివృద్ధి చెందుతున్న దేశాల భుజస్కంధాల మీదే పడుతోంది. ఈ ధోరణిని మార్చకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు. పైగా ధనిక దేశాలు ఆచరణాత్మకమైన ఒక కార్యక్రమం చేపట్టాలని అనుకోవడం వల్ల, అందుకు ప్రతిఫలంగా వంద బిలియన్ డాలర్ల వాతావరణ రక్షణ నిధి ఆ దేశాల భోజ్యమవుతోంది. పేద దేశాల భవిష్యత్ చిత్రపటం ఎంత దారుణంగా ఉందో ఆవిష్కరించే అన్ని రకాల వివరాలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి. ఈ అధ్యయనాలను గురించి అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన విద్యావేత్తలు, సంప్రతింపుల నిపుణులు పదేపదే వల్లిస్తున్నారు కూడా. అయితే ధనిక దేశాలను హెచ్చరిస్తూ వచ్చే నివేదికలన్నీ చెవిటివాని ముందు శంఖు ఊదిన రీతిలో ప్రయోజనం లేకుండా మిగిలిపోతున్నాయి. ఫ్రాన్స్‌లో 2003లో కేవలం ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగిన ఫలితంగానే 10,000 మంది రాలిపోయారు. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలే త్యాగాలు చేయాలని చెబుతుంటారు. ధనిక దేశాల వారి జీవన శైలి చెక్కుచెదిరే పరిస్థితులు తలెత్తకూడదు. అంటే గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలే గ్రీన్హౌస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి తప్ప, ధనిక దేశాల జీవనశైలి ఏ మార్పూ లేకుండా యథావిధిగానే కొనసాగుతుంది. ఇలాంటి ఆర్థిక వ్యవస్థల నమూనాల సంపూర్ణ మరమ్మత్తుకు సంబంధించిన కనీస ప్రస్తావన కూడా రావడం లేదు. ఆ ఆర్థిక వ్యవస్థలే భూగోళంలో వాతావరణ మార్పులకు దోహదం చేస్తూ, వాతావరణ పరిస్థితులను తల్లకిందులు చేస్తున్నాయి. దానికి కారణాలేమిటో తెలిసిందే. వ్యాసకర్త వ్యవసాయరంగ విశ్లేషకులు: దేవీందర్‌శర్మ hunger55@gmail.com -
మదర్ ఎర్త్
బీటలువారిన భూమి.. ‘మొక్క’వోని సంకల్పంతో ఆ పగుళ్లకు బ్యాండేజీ వేసి, చికిత్స చేస్తే.. పుట్టింది ఓ లత. భూమి నిండా పచ్చదనం అలా తీగలా అల్లుకోవాలని సందేశాన్నిస్తున్న ఈ చిత్రం.. ఇంకా మనం ఈ భూమిపై సృష్టిస్తున్న విధ్వంసాన్ని కళ్లకు కడుతుంది. ధరిత్రి పట్ల మనమెంత బాధ్యతాయుతంగా ఉండాలో చెబుతుంది. నిలువెల్లా గాయాలతో విలయం అంచున ఉన్న భూమిని ఇప్పటికైనా కాపాడుకొని ఆకుపచ్చని వాతావరణాన్ని సృష్టిద్దామంటున్న ఇటువంటి చిత్రాలెన్నో... - కళ ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు.. వనాలు కరుమరుగై ఎటుచూసినా జనాలు, భవనాలు.. విషతుల్యంగా మారిపోతున్న జలాలు.. బీడుపడి గోడు వెళ్లబోసుకుంటున్న నేల.. ఈ పరిస్థితికి కారణం మనిషేనంటున్నాయి ఈ చిత్రాలు. ఎర్త్ డే సందర్భంగా బంజారాహిల్స్‌లోని గోథెజంత్రమ్ ‘పర్‌స్పెక్టివెన్: మదర్ఎర్త్’ పేరుతో వరుసగారెండోసారి ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ఇందులో 45 ఫొటోలను ప్రదర్శనకు ఉంచారు. ఇవన్నీ ధరిత్రి సౌందర్యాన్ని.. ఈ నేలపై మనం సృష్టిస్తున్న విధ్వంసాన్ని తెలియచెప్పేవే. ‘దక్కన్ పీఠభూమి దర్పాన్ని చాటే ‘రాక్స్’.. ఇప్పుడు ఠీవిని కోల్పోతున్నాయి. మనిషి దెబ్బకు ఛిద్రమవుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే దక్కన్ రాతి కొండల్ని ఫొటోల్లో మాత్రమే చూడగలం’ అని చెబుతుంది హైదరాబాదీ ఫొటోగ్రాఫర్ అశోక్ తీసిన చిత్రం. భూమే ఆధారం... మన ఉనికికి భూమే ఆధారం. భూమి మీద ఆధారపడిన అనేకానేక జీవుల్లో మనమూ ఒకరం. కానీ నేల, నీరు, వాతావరణాన్ని మన చేష్టలతో ఎంత పాడుచేస్తున్నామో ఇక్కడ కొలువుదీరిన చిత్రాలు కళ్లకు కడుతున్నాయి. ‘పర్యావరణానికి ఎంత చేటు తెస్తున్నామో నిత్యం చేసే పనుల ద్వారా మనకు తెలుస్తూనే ఉంటుంది. మోడు వారిన చెట్లు.. గుక్కెడు నీరు దొరకని పరిస్థితులు.. నగర జీవనంలో ఈ దృశ్యాలు కనిపించని రోజు ఉండదు. బిజీ లైఫ్‌లో పడి మన పనులు, ఆలోచనల్లో మునిగిపోతాం. ఆ దృష్టిని మార్చుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫొటోలు చెబుతాయి’ అంటారు ఈ ఎగ్జిబిషన్ క్యూరేటర్ ప్రశాంత్ మంచికంటి. తల్లి కంటే మిన్నగా... ‘మన మనుగడకు ఏకైక ఆధారం భూమి. అమ్మ కన్నా మిన్నగా మదర్ ఎర్త్‌ను కాపాడుకోగలిగితే మనకు మంచి భవిష్యత్తు ఇస్తుంది. పచ్చని నేల, స్వచ్ఛమైన నీరు, గాలిని భద్రంగా భావి తరాలకు అందించే బాధ్యత మన మీదే ఉంది’ అని చాటుతున్నాయి ఈ పర్యావరణ ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోలు. ‘మదర్ ఎర్త్: బ్యూటీ, హర్ జాయ్స్, సారోస్ అండ్ పెయిన్.. ఈ మూడు అంశాలను ఈ చిత్రాల ద్వారా చెప్పాలన్నదే మా ప్రయత్నం’ అంటారు ప్రశాంత్ మంచికంటి. ఉప్పొంగే సముద్రం, కొండలు, నదులు ఈ సౌందర్యం మాటునే విధ్వంసమూ చోటుచేసుకుంటోంది. భూమిపై జరుగుతున్న వాతావరణ మార్పులు ఏమిటో ఇవి తెలియ చెబుతాయి. ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది హైదరాబాదీ ఫొటోగ్రాఫర్ సత్యప్రసాద్ తీసిన హియాలయాల చిత్రం. నింగిని తాకే వెండికొండ అందాలు.. ఆ పక్కనే గొడ్డలివేటుకు బలైన మహా వటవృక్షాల తాలూకు మోడులు.. ఈ చిత్రం భూమిపై జరుగుతున్న డిఫారెస్టేషన్కు నిదర్శనం. ఎన్విరాన్మెంటల్ ఏప్రిల్ ఎర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. ‘మనం బతికేందుకు అన్నీ ఇస్తున్న నేల తల్లిని ఎంతగా వేధిస్తున్నామో గ్రహించి, దానిని సరిదిద్దుకోవాలని చెప్పడమే ఈ ప్రదర్శన ఉద్దేశం. ఏటా ఏప్రిల్ మాసాన్ని ఎన్విరాన్మెంటల్ ఏప్రిల్‌గా పరిగణిస్తూ మదర్ ఎర్త్ పేరుతో ఫొటో ప్రదర్శనలు, ఫిల్మ్ స్క్రీనింగ్స్, చర్చలు, వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం’ అని చెప్పారు గోథెజంత్రమ్ డెరైక్టర్ అమితాదేశాయ్. -
సైన్స్ సమాహారం.. మెరుగైన స్కోర్‌కు సోపానం!
సివిల్స్ మెయిన్స్‌లో విజయం సాధించేందుకు కీలమైనవి జనరల్ స్టడీస్ పేపర్లు. జీఎస్ మూడో పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ నష్టం, జీవ వైవిధ్య సంరక్షణ, మేధో సంపత్తి హక్కులు, విపత్తు నిర్వహణ తదితర అంశాలున్నాయి. వీటి నుంచి2013 జీఎస్-3 ప్రశ్నపత్రంలో 25 ప్రశ్నలకు 9 ప్రశ్నలు వచ్చాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ అంశాలపై పట్టు సాధించేందుకు వ్యూహాలు.. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పటికే వివిధ అంశాలకు సంబంధించిన ప్రిపరేషన్‌ను పూర్తిచేసి ఉంటారు. గత మెయిన్స్ జనరల్ స్టడీస్-3 పేపర్లో కొన్ని 200 పదాల సమాధాన ప్రశ్నలు, మరికొన్ని 100 పదాల సమాధాన ప్రశ్నలు వచ్చాయి. ఈసారి కూడా ఇదే విధానంలో ప్రశ్నలు ఉండొచ్చు లేదంటే స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కాబట్టి ఈ కోణంలోనూ ప్రిపరేషన్ తప్పనిసరి. ఏ అంశానికి సంబంధించి అయినా 20, 50, 75, 150, 250 పదాల్లో సమాధానం రాసేలా సన్నద్ధం కావాలి. ఒకే ప్రశ్నలో వివిధ విభాగాలుంటే వాటి సరళిని బట్టి పద పరిమితిని నిర్దేశించుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్, టెక్నాలజీ విభాగంలో ముఖ్యంగా అంతరిక్ష పరిజ్ఞానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ తదితర అంశాలుంటాయి. ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక ప్రయోగాలు నిర్వహించింది. ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్, మంగళ్యాన్ వంటి అద్భుత యాత్రలు చేపట్టింది. వీటిపై ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. వీటికి సంబంధించి నిగూఢంగా ఉన్న అంశాలపైనా ప్రశ్నలు రావొచ్చు. ముఖ్యంగా భారత అంతరిక్ష రంగానికి విశిష్ట సేవలు అందిస్తూ, ఎన్నో విదేశీ ఉపగ్రహాలు, వైవిధ్యభరిత ప్రయోగాలు నిర్వహించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)పై అభ్యర్థులు దృష్టిసారించాలి. భారత అంతరిక్ష కార్యక్రమంలో పీఎస్ఎల్వీ నిర్మాణం వెనుక ఉద్దేశం, అది చేపట్టిన వైవిధ్యభరిత ప్రయోగాలు, విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలు ద్వారా భారత అంతరిక్ష సేవల విస్తరణ, వరుస విజయవంత ప్రయోగాల జైత్రయాత్ర, బలహీనతలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యాంశాలు మంగళ్యాన్ ప్రయోగంలో ప్రత్యేకతలు- భారత్ సాధించిన ప్రగతి. టెర్రా ఫార్మింగ్ అంటే ఏమిటి? అంగారక గ్రహ యాత్రలు భవిష్యత్తులో టెర్రా ఫార్మింగ్‌కు ఎలా ఉపయోగపడతాయి? వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్- సాధించిన ప్రగతి ఏమిటి? ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్), జీఎస్ఎల్వీ- మార్క్ 3, క్రయోజెనిక్ ఇంజిన్ ప్రాధాన్యత, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం, భారత్ డీప్ స్పేస్ నెట్వర్క్, క్యూరియాసిటీ రోవర్, జీఎస్ఎల్వీ బలహీనతలు. టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్, అంతరిక్ష టెక్నాలజీ ద్వారా గ్రామీణాభివృద్ధి తదితర అంశాలు. ఐటీ, కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్ రంగంలో డిజిటల్ ఇండియా, నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టు, మెడికల్ ఇన్ఫర్మేటిక్స్, గ్రామీణాభివృద్ధిలో ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, నెట్ న్యూట్రాలటీ- ప్రయోజనాలు, బిగ్ డేటా, ఓపెన్ గవర్నమెంట్ డేటా తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. నానో టెక్నాలజీ రంగంలో అనేక అనువర్తనాలున్నాయి. వీటిని తెలుసుకోవాలి. గతేడాది నిర్మాణరంగానికి సంబంధించి కాంపొజైట్స్పై ప్రశ్న అడిగారు. పర్యావరణ కాలుష్యం నిర్మూలనలో, వైద్య రంగంలో నానో టెక్నాలజీ ప్రయోజనాలపై దృష్టిసారించాలి. అదే విధంగా నానో టెక్నాలజీ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో అనువర్తనాలపై ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. రోబోటిక్స్ రంగంలో కేవలం రోబోటిక్స్ సూత్రాలు, వాటి రకాలు, ఉపయోగాలు మాత్రమే కాకుండా రోబోటిక్ కాళ్లు, చేతులు తయారీ ప్రక్రియపై అవగాహన పెంపొందించుకోవాలి. రోబోటిక్స్‌ను బయోనిక్స్కు అనుసంధానిస్తూ అధ్యయనం చేయాలి. బయోనిక్స్ అంటే ఏమిటి? దాని అనువర్తనాలు ఎలా ఉంటాయి? వైద్య రంగంలో వాటి ప్రాధాన్యం ఏమిటి? తదితర అంశాలను చదవాలి. బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ రంగం నుంచి ఈసారి ప్రశ్నలు వచ్చేందుకు చాలా అవకాశాలున్నాయి. ముఖ్యంగా జన్యుమార్పిడి పంటల సాగు, క్షేత్ర పరీక్షలపై దేశంలో గందరగోళ పరిస్థితులపై ప్రశ్నలు అడగొచ్చు. జన్యు మార్పిడి పంటల సాగుపై వ్యతిరేకత ఎందుకు? దాని వల్ల లాభాలు, నష్టాలు ఏమిటి? మరీ ముఖ్యంగా బీటీ ట్రాన్స్‌జెనిక్స్‌పై అభ్యంతరాలు ఏమిటి? జీఎం లేబ్లింగ్ అంటే ఏమిటి? అది భారత్‌లో ఎలా అమలవుతోంది? తదితర అంశాలపై అభ్యర్థులు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవడం అవసరం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సుప్రీంకోర్టు టెక్నికల్ ఎక్స్పెర్ట్ కమిటీ బీటీ పంటల క్షేత్ర పరీక్షలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇలాంటి అంశాలపై అభ్యర్థి అభిప్రాయాలను తెలుసుకునేలా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. మూలకణాల చికిత్సను నియంత్రించే ఐసీఎంఆర్-డీబీటీ మార్గదర్శకాలు, రీప్రోగ్రామింగ్, కార్డ్ బ్యాంకింగ్, మూలకణాల అనువర్తనాలను అధ్యయనం చేయాలి. ఆర్ఎన్ఏ, ఇంటర్‌ఫెరాన్స్, జన్యు థెరఫీ, మానవ జీన్ పేటెంటింగ్, జీవ ఎరువులు, జీవ క్రిమిసంహారకాలు, ఆర్గానిక్ వ్యవసాయం, బయోరెమిడియేషన్, ఇతర ఇంధనాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలి. పర్యావరణం మెయిన్స్‌లో మరో ముఖ్యమైన అంశం పర్యావరణ నష్టం. తాజాగా దేశంలో స్వచ్ఛ భారత్‌పై బాగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రశ్న రావొచ్చు. ముఖ్యంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో లోపాలు, మీ సూచనలు? అనే కోణంలో అధ్యయనం చేయాలి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణలో సమస్యలు, లాభాలను తెలుసుకోవాలి. పట్టణీకరణలో ఘన వ్యర్థ నిర్వహణ పాత్రపై అవగాహన పెంపొందించుకోవాలి. బయో మెడికల్ వ్యర్థాలు, రీసైక్లింగ్ పద్ధతులు, భారత్‌లో ఘన వ్యర్థ నిర్వహణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వంటి వాటిని చదవాలి. వాతావరణ మార్పుల ప్రభావం ముఖ్యంగా సముద్ర ఆమ్లీకరణ వల్ల వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థలకు వాటిల్లే నష్టాలను గురించి తెలుసుకోవాలి. శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలను ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధత, వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఏపీసీసీ), అందులో భాగంగా అమలవుతున్న ఎనిమిది జాతీయ మిషన్లు, లక్ష్యాలు, ప్రగతి తదితరాల గురించి తెలుసుకోవాలి. కాంతి కాలుష్యం, భారలోహ కాలుష్యం, గంగానది ప్రక్షాళన, అటవీ నిర్మూలనను అరికట్టడం ద్వారా ఉద్గారాలను తగ్గించే కార్యక్రమం (ఆర్ఈడీడీ)పై అవగాహన పెంపొందించుకోవాలి. జీవ వైవిధ్య పరిరక్షణ అంశంలో జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ముప్పు, సంరక్షణ చర్యలపై దృష్టిసారించాలి. పులి, ఖడ్గమృగం, ఏనుగు, గంగానది డాల్ఫిన్ వంటి వాటి పరిరక్షణ సమస్యల్ని తెలుసుకోవాలి. పశ్చిమ కనుమల పరిరక్షణకు గాడ్గిల్, కస్తూరిరంగన్ కమిటీల సిఫార్సులు, వాటి మధ్య భేదాలను తెలుసుకోవడం మంచిది. భారత్‌లో అభివృద్ధి చర్యల ద్వారా జీవ వైవిధ్యం ఎలా దెబ్బతింటోంది? సుస్థిరాభివృద్ధి విధానాలను ఎలా అమలు చేయాలి? అటవీ హక్కుల అమల్లో సమస్యలపై దృష్టి సారించాలి. అదనంగా నగొయ ప్రొటోకాల్ సమాచారాన్ని తెలుసుకోవాలి. మేధో సంపత్తి మేధో సంపత్తి హక్కుల అంశంలో భారత్, అమెరికాల మధ్య నెలకొన్న వివాదం, యూఎస్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ (యూఎస్టీఆర్) స్పెషల్ 301 కేటగిరీ, భారత్‌లో ఐపీఆర్ విధానం ఎలా ఉండాలి? అమెరికా వంటి దేశాలు భారత మేధోసంపత్తి రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? తదితర అంశాలపై దృష్టిసారించాలి. అమెరికా ఇటీవల భారత్ విషయంలో అమలు చేయాలని నిర్ణయించిన cycle review విధానం గురించి తెలుసుకోవాలి. దీంతోపాటు మేధోసంపత్తి రకాలు, సంబంధిత చట్టాలు, జియోగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ద్వారా ఏ విధంగా సంప్రదాయ ఉత్పత్తులకు సంరక్షణ కల్పించవచ్చు అనే అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. -
మితంగా...పర్యావరణ హితంగా..!
పర్యావరణస్పృహతో ఈసారి మీరు కూడా మీ ఇంటికి పర్యావరణ హిత దీపావళిని ఆహ్వానిం చండి. పండగ సంతోషాన్ని రెట్టింపు చేసుకోండి. మీ ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే, ఆ పెద్దవాళ్ల కంటే పెద్దవాళ్లు ఉంటే... ఒక్కసారి అడిగి చూడండి - ‘‘ఆ రోజుల్లో దీపావళి ఎలా జరిగేది?’’ అని. వాళ్లు కథలు కథలుగా ఆ రోజుల గురించి చెబుతారు. వాటిలో మీకు పొరపాటున కూడా కాలుష్య భూతం కనిపించదు. కాలంతో పాటు దీపావళికి కాల్చే బాణాసంచాలో మార్పు వచ్చింది. ఎంత ఎక్కువగా కాలిస్తే అంత కన్నుల పండగగా జరుపుకున్నట్లు, ఎంత శబ్దం వస్తే అంత గొప్పగా జరుపుకున్నట్లు... అనుకునే రోజులు వచ్చాయి. ఈ ధోరణిలో మార్పు రావాలి. ఆ మార్పు కోసమే కృషి చేస్తూ కాలుష్యరహిత దీపావళిపై స్పృహ కలిగించడానికి హైదరాబాద్ యువతలో కొందరు ‘స్కై లాంతర్స్ ఛాలెంజ్’ పేరుతో వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. రద్దీ ప్రదేశాల్లో అకస్మాత్తుగా, ఆసక్తికరంగా నృత్యాలు చేస్తూ ‘ఫ్లాష్ మాబ్’, ‘స్ట్రీట్ ప్లే’ మొదలైన వాటితో పర్యావరణ హిత దీపావళి గురించి ఆసక్తి కలిగిస్తున్నారు. ఆకాశదీపాల (స్కై లాంతర్లు) ద్వారా దీపావళి అంటే ‘శబ్దం’ కాదని ‘వెలుగు’ అనే సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రతి వ్యక్తీ మరో ముగ్గురిని భాగస్వామ్యం చేసేలా కృషి చేస్తున్నారు. పర్యావరణ హిత దీపావళి గురించి గత నాలుగేళ్ళుగా ప్రచారం చేస్తున్న పర్యావరణ ప్రేమికుడు అరుణ్ కృష్ణమూర్తి ‘‘కాస్త ఆలస్యంగానైనా తగిన ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను’’ అంటున్నారు. ‘‘గతంలో మేము ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్పందన పెద్దగా కనిపించేది కాదు. ఇప్పుడు మాత్రం బాణాసంచా వల్ల తలెత్తే పర్యావరణ సమస్యలు, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. తమ పరిసరాల్లో ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వాల్సిందిగా అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు. ఇదొక మంచి పరిణామం’’ అంటున్నారు అరుణ్. కాగా, పర్యావరణహిత ‘గ్రీన్-దీపావళి’ గురించి ప్రచారానికి సుదీర్ఘమైన ఉపన్యాసాల మీద ఆధారపడకుండా వినోదాన్నే ఆశ్రయి స్తున్నారు. ప్రాచుర్యం పొందిన సినిమా పాటల బాణీలతో భూగర్భ జల కాలుష్యం, శబ్ద కాలుష్యం... మొదలైన సమస్యలపై పాటలు అల్లి ప్రచారం చేస్తున్నారు. అయితే ‘బాణాసంచా కాల్చొద్దు అనడం హిందూ సంస్కృతికి వ్యతిరేక’మంటూ కొందరి నుంచి అభ్యంతరాలు వినవచ్చాయి. దీపావళి అంటే శబ్దాడంబరం కాదని... దీపాల వరుస అని, కాలుష్య కారకమైన బాణాసంచా కాల్చడం అనేది దీపావళి సంప్రదాయంలో ఎప్పుడూ లేదని, గత నాలుగు దశాబ్దాల నుంచే కాలుష్యాన్ని పంచే బాణాసంచా సంప్రదాయం పెరిగిందని... పై అభ్యంతరానికి సమాధానం ఇచ్చారు గ్రీన్-దీపావళి ప్రేమికులు. వీటి కోసమేనా మనం బాణాసంచా కాల్చేది!? శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. భూగర్భ జలాలు కలుషితమవుతాయి వాయు కాలుష్యం పెరుగుతుంది. ముక్కు, గొంతు, కళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి రకరకాల చర్మరోగాలకు కారణం అవుతాయి. -
వెదురే.. అదిరే..
సాక్షి, హైదరాబాద్: శుభ్రం చేయడమెంతో తేలిక. దీర్ఘకాలపు మన్నిక.. ఎలాంటి మరకలైనా తుడవగానే మాయం. నిర్వహణలో కన్పించని సమస్యలు. పైగా ఇంటికే సరికొత్త అందం. ఇలాంటి అనేకానేక ప్రత్యేకతల కారణంగా వెదురు గచ్చు(బ్యాంబూ ఫ్లోరింగ్)కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. భూతాపాన్ని తగ్గించడానికి ప్రపంచం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో.. పర్యావరణ ప్రియుల దృష్టి వెదురు గచ్చు మీద పడింది. ఇతర రకాల కలప కంటే దృఢంగా ఉండటం.. చూట్టానికి చక్కగా కన్పించడం.. తదితర కారణాల వల్ల వెదురు గచ్చుకి గిరాకీ అధికమవుతోంది. రెండు రకాలు.. వెదురు గచ్చులో ఎలిగెంట్, ఎలైట్ అనే రెండు రకాలు లభిస్తాయి. వీటి తయారీ ప్రక్రియల్లో చాలా తేడా ఉంటుంది. కత్తిరించిన చిన్నచిన్న బ్యాంబూని అతికించేది ఎలిగెంట్ అయితే.. దీనికి భిన్నంగా బ్యాంబూ ఫైబర్‌తో చేసేది ఎలైట్ రకం. ఇదెంతో దృఢంగా ఉంటుంది. మొత్తం మూడు వర్ణాల్లో ఈ కలప లభిస్తుంది. ఆరేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండటం కోసం గచ్చుకి ఆరు లేయర్ల పాలియురేథేన్ కోటింగ్ వేస్తారు. ధర ఎంత? ప్రస్తుతం ఈ తరహా కలపను చైనా నుంచి దిగుమతి చేస్తున్నారు. దీనితో ఇంటిని అలంకరించాలంటే... చదరపు అడుగుకి రూ. 200-350 దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఓ వంద చదరపు అడుగుల గదికి సుమారు రూ. 20,000 అవుతుందన్నమాట. మార్కెట్లో లభించే ఇతర కలపతో తయారైన ఫ్లోరింగ్ కోసం చదరపు అడుగుకి రూ. 300 దాకా అవుతుంది. వెదురు కలపను ఇంట్లో వేయడానికి విడిగా చార్జీలుంటాయి. చదరపు అడుగుకి రూ. 15 దాకా తీసుకుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీ ఇంట్లో ప్రస్తుతం ఎలాంటి గచ్చు ఉన్నా.. దానిపై బ్యాంబూ ఫ్లోరింగ్‌ను సులువుగా వేసుకోవచ్చు. పైగా ఒక్కరోజులో పని పూర్తవుతుంది. -
పర్యావరణ పరిరక్షకుడు.. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్
ఆధునిక యుగంలో పర్యావరణం ప్రమాదంలో పడింది. జీవజాలం కనుమరుగవుతోంది. ఫలితంగా విపత్తులు పంజా విసురుతున్నాయి. పర్యావరణా న్ని పరిరక్షించుకోవడంపై ప్రపంచంలో అన్ని దేశాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోంది. కాలుష్య కారక పరిశ్రమల్లో వీరిని తప్పనిసరిగా నియమించాలనే నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విసృ్తతమవుతున్నాయి. కాలుష్యాన్ని తగ్గించాలి పర్యావరణ ఇంజనీరింగ్ కోర్సులు చేసినవారికి ప్రస్తుతం దేశ విదేశాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. కాలుష్యం వెదజల్లే కర్మాగారాల్లో వీరిని నియమించుకుంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలిలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లకు ఉద్యోగాలు దక్కుతున్నాయి. కాలుష్యాన్ని గరిష్టస్థాయికి తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం పర్యావరణ ఇంజనీర్ల ప్రధాన బాధ్యత. ఇటీవలి కాలంలో వేస్ట్ మేనేజ్మెంట్ రంగం అభివృద్ధి చెందుతోంది. ఇందులో పర్యావరణ ఇంజనీర్లకు భారీగా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత పెరుగుతుండడంతో ఈ రంగంలో ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. స్కిల్స్ పెంచుకోవాలి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లకు ప్రకృతిపై మమకారం ఉండాలి. దాన్ని కాపాడుకోవాలనే తపన, వృత్తిపట్ల అంకితభావం తప్పనిసరి. పర్యావరణ చట్టాలు, నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి. పనివేళలతో నిమిత్తం లేకుండా క్షేత్రస్థాయిలో ఎక్కువ సేపు పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అవసరాన్ని బట్టి దూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు సిద్ధంగా ఉండాలి. టైమ్ మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ పెంచుకోవాలి. పర్యావరణ ఇంజనీర్లకు ప్రారంభంలో తక్కువ వేతనాలున్నా.. నైపుణ్యాలను పెంచుకుంటే అధిక వేతనం అందుకోవచ్చు. అర్హతలు: మన దేశంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్‌లో బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి, బీటెక్‌లో చేరొచ్చు. అలాగే ప్రవేశ పరీక్ష లేకుండానే బీఎస్సీలో ప్రవేశం పొందొచ్చు. ఇందులో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తిచేస్తే అధిక అవకాశాలు లభిస్తాయి. వేతనాలు: పర్యావరణ ఇంజనీర్లకు ప్రారంభంలో నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వేతనం అందుతుంది. తర్వాత నైపుణ్యాలు, పనితీరును బట్టి నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వేతనం పొందొచ్చు. ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో ఇంకా అధిక వేతనాలుంటాయి. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఉస్మానియా యూనివర్సిటీ, వెబ్సైట్: www.osmania.ac.in జేఎన్టీయూ-హైదరాబాద్, వెబ్సైట్: www.jntuhceh.ac.in ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్ వెబ్సైట్: www.ismdhanbad.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెబ్సైట్: www.jee.iitd.ac.in నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్: www.neeri.res.in పర్యావరణ కోర్సులతో అవకాశాలు పుష్కలం! ‘‘పారిశ్రామికీకరణ, పట్టణీకరణల కారణంగా అభివృద్ధితోపాటు పర్యావరణ కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతోంది. దీని పరిష్కారానికి పర్యావరణ నిపుణుల అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ కోర్సులు పూర్తి చేసిన వారికి విస్తృత అవకాశాలు అందుబాటులో ఉంటున్నాయి. యునెస్కో, యూఎన్ ఈపీలతోపాటు దేశంలోనూ పలు సంస్థలు పర్యావరణ కోర్సులు చదువుతున్న వారికి ఫెలోషిప్‌లు అందించి ప్రోత్సహిస్తున్నాయి. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతోపాటు అర్బన్ ప్లానింగ్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్సెస్ తదితర ప్రభుత్వ విభాగాల్లోనూ పర్యావరణ నిపుణులకు ఉద్యోగాలు దక్కుతున్నాయి. ప్రైవేటు రంగంలో టెక్స్టైల్ మిల్స్, రిఫైనరీలు, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, వ్యర్థాల నిర్వహణ ప్లాంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ లు, మైనింగ్ కంపెనీలు వీరికి ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. ఈ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేస్తే శాస్త్రవేత్తలుగా, ప్రొఫెసర్లుగా రాణించొచ్చు’’ - డా. టి.విజయలక్ష్మీ అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్, జేఎన్టీయూ-హైదరాబాద్. జనరల్ నాలెడ్జ్: ఆరో పంచవర్ష ప్రణాళిక వృద్ధిరేటు లక్ష్యం? ఆర్థిక ప్రణాళిక: పేదరిక నిర్మూలన, స్వావలంబన సాధన ఐదో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలుగా నిర్దేశించారు. 1978 నుంచి 1983 వరకు జనతా ప్రభుత్వం నిరంతర ప్రణాళికా విధానాన్ని ప్రవేశపెట్టింది. గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చింది. నిరంతర ప్రణాళికా విధానంలో ప్రతి సంవత్సరం తరువాత ప్రణాళికను రాను న్న నాలుగేళ్లను దృష్టిలో ఉంచుకొని సవరిస్తూ ఒక సంవత్సరానికి ప్రణాళిక రూపొందించారు. ఏప్రిల్ 1, 1980 నుంచి మార్చి 31, 1985 వరకు ఆరో పంచవర్ష ప్రణాళిక కాలం. ఆరో పంచవర్ష ప్ర ణాళికలో ఇంధన రంగం అత్యధిక ప్రాధాన్యతను పొందింది. పేదరిక నిర్మూలన న్యాయంతో కూడిన వృద్ధి ఆరో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు. ఆరో పంచవర్ష ప్రణాళిక 5.2 శాతం వృద్ధిరేటును లక్ష్యంగా నిర్దేశించుకొని సాధించింది. మనదేశంలో ప్రముఖ నిర్మాణాలు తెలుసా? నిర్మాణం {పదేశం {పాధాన్యత అజంతా గుహలు ఔరంగాబాద్ కీ.పూ. 1 - క్రీ.శ. 7 శతాబ్దాల మధ్య చిత్రించిన బౌద్ధమత చిత్రాలు, శిల్పకళకు నిలయాలు అక్బర్ సమాధి సికింద్ర ఆగ్రాకు దగ్గర అక్బర్ సమాధి ఉంది అమర్నాథ్ గుహ కాశ్మీర్ హిందువుల పుణ్యక్షేత్రం, ఇక్కడ మంచు శివలింగం ఏర్పడుతుంది అంబర్ భవంతి జైపూర్ రాజపుత్రుల కట్టడం ఆనంద్ భవన్ అలహాబాద్ నెహ్రూ నివాసం బిర్లా ప్లానెటోరియం కోల్‌కతా నక్షత్రశాల బ్లాక్ పగోడ కోణార్క సూర్యదేవాలయం భోదిసత్వ అజంతా గుహలు బౌద్ధమతానికి చెందిన చిత్రకళ బృహదీశ్వర దేవాలయం తంజావూర్ మధ్యయుగంలో నిర్మించిన దేవాలయాల్లో పెద్దది భారత్‌లో ప్రధాన సరస్సులు తెలుసుకోండి సరస్సు రాష్ర్టం పరశురాం కుండ్ అరుణాచల్ ప్రదేశ్ వెంబనాడ్ కేరళ పులికాట్ ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో మొరీరి జమ్మూకాశ్మీర్ లోక్తక్ మణిపూర్ పుష్కర్ రాజస్థాన్ భీమ్టాల్ ఉత్తరాఖండ్ నిక్కి రాజస్థాన్ ఉదయ్‌పూర్ రాజస్థాన్ మోయక్ గోవా కార్ జమ్మూకాశ్మీర్ -
ఇసుక కష్టాలకు చెక్!
మరో నాలుగు రీచ్‌లకు ప్రభుత్వ అనుమతి పెదపులిపాక, రొయ్యూరు, శ్రీకాకుళం, చాగంటిపాడులో నూతన రీచ్‌లు హద్దులు గుర్తించిన అధికారులు పర్యావరణ అనుమతుల కోసం నిరీక్షణ వచ్చే నెలలో వేలం పాట సాక్షి, విజయవాడ : నిర్మాణ రంగానికి శుభవార్త. జిల్లాలో ఇసుక అవసరం బాగా పెరగడంతో మరో నాలుగు రీచ్‌ల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు అధికారులు కార్యాచరణ ప్రణాళికను పూర్తిచేసి పర్యావరణ అనుమతుల కోసం పంపారు. మరో పది రోజుల్లో పర్యావరణ శాఖ నుంచి అనుమతులు లభించే అవకాశం ఉంది. అనంతరం వచ్చే నెలలో వేలం ప్రక్రియ ద్వారా ఇసుక రీచ్‌లను కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నూతన రీచ్‌లు ఇవే.. పెనమలూరు మండలంలోని పెదపులిపాడు, తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు, రొయ్యూరు, ఘంటసాల మండలంలోని శ్రీకాకుళంలో నాలుగు రీచ్‌లు ఉన్నాయి. ఆయా రీచ్‌లలో గతంలో అనధికారికంగా తవ్వకాలు జరిగేవి. విజిలెన్స్, మైనింగ్ శాఖ అధికారులు దాడులుచేసి కేసులు నమోదు చేయడంతో అక్రమ తవ్వకాలకు బ్రేక్ పడింది. నూతనంగా ఈ నాలుగు రీచ్‌లకు అనుమతి లభించింది. పెదపులిపాకలో కరకట్ట వద్ద 50 ఎకరాలు, చాగంటిపాడులో 10 ఎకరాలు, శ్రీకాకుళంలో 20 ఎకరాలు, రొయ్యూరులో 40 ఎకరాల్లో ఇసుక తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించారు. మైనింగ్‌శాఖ అధికారులు గత నెల్లో ఆయా మండలాల అధికారులతో చర్చించి కరకట్ట ప్రాంతాల్లో ఇసుక మేటలను సర్వే చేసి రీచ్‌లుగా గుర్తించారు. ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి లభించింది. పర్యావరణ శాఖ అనుమతి కోసం 15 రోజుల క్రితం నివేదిక పంపారు. పర్యావరణ శాఖ నుంచి అనుమతులు వస్తే వెంటనే జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వేలం ప్రక్రియ నిర్వహిస్తారు. త్వరలోనే నాలుగు రీచ్‌లు ప్రారంభమవుతాయని మైనింగ్ శాఖ విజయవాడ డివిజన్ ఏడీ బి.రామచంద్రరావు ‘సాక్షి’కి తెలిపారు. తద్వారా తమ శాఖకు ఆదాయం కొంత పెరుగుతుందని చెప్పారు. ఇప్పుడు నామమాత్రంగానే సీనరేజీ వస్తోందని పేర్కొన్నారు. ఆ నాలుగు రీచ్‌లలో జోరుగా అక్రమ తవ్వకాలు! ప్రస్తుతం డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, విజయవాడ రూరల్ మండలంలోని సూరాయిపాలెం, విజయవాడ నగరంలోని భవానీపురం పున్నమి ఘాట్ వద్ద ప్రస్తుతం ఇసుక రీచ్‌లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ అవసరాల నిమిత్తం మైనింగ్ శాఖ అధికారులు ఈ నాలుగు ఇసుక రీచ్‌లకు హద్దులు నిర్ణయించి నీటిపారుదల శాఖ అధికారులకు అప్పగించారు. నీటిపారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో ఇసుక తవ్వి విక్రయిస్తున్నారు. వేలం పాట కూడా లేకుండా ఇరిగేషన్ శాఖకు ఇసుక రీచ్‌లు అప్పగించడంతో మైనింగ్ శాఖకు నామమాత్రంగానే సీనరేజ్ లభిస్తోంది. నాలుగు రీచ్‌ల ద్వారా అధికారికంగా నెలకు సగటున రెండు వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే నీటిపారుదల శాఖ అధికారులు వారం రోజులు, నెల కాలపరిమితితో పలువురు కాంట్రాక్టర్లకు ఇసుకను తవ్వుకోవటానికి అనుమతులు ఇస్తుంటారు. దీంతో అనధికారికంగా రెట్టింపు స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాలకు ఎగుమతులు విజయవాడ డివిజన్ నుంచి జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు ఎగుమతులు చేస్తున్నారు. మార్కెట్లో ఇసుక కొతర ఎర్పడినప్పుడు ఇక్కడ లారీ ఇసుక (3.5 క్యూబిక్ మీటర్లు)ను అత్యధికంగా 20 వేలకు విక్రయించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలో జిల్లాలో ఇసుక వినియోగం బాగా పెరిగిందని, గతంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో అవసరం ఉందని అధికారులు నివేదించడంతో మరో నాలుగు రీచ్‌లకు ప్రభుత్వం అనుమతించింది. -
తరుగుతున్న పచ్చ‘ధనం’
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: భూతాపం, వాతావరణంలో హరిత వాయువుల గాఢత రెట్టింపవుతోంది. ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ పట్టణాలు ఉడికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోలేకపోతున్నారు. పచ్చదనం కనుమరుగవడమే వీటన్నింటికీ ప్రధాన కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. పట్టణీకరణ పేరుతో విచక్షణా రహితంగా చెట్లను నరికేస్తుండటంతో చూద్దామన్నా పచ్చదనం కనిపించడం లేదు. మున్సిపల్, కార్పొరేషన్ అధికార యంత్రాంగం మొక్కలు నాటించడంపై కనీస దృష్టి కూడా సారించడం లేదు. సర్వేలో భయానక వాస్తవాలు: వాతావరణ శాఖ, పర్యావరణ, సామాజిక అటవీ శాఖలకు చెందిన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల నగరాలు, పట్టణాల్లో పచ్చదనంపై సర్వే నిర్వహిం చాయి. ఆ సర్వేలో భయానక వాస్తవాలు వెలుగుచూశాయి. దీంతో ఆందోళన చెందిన ఆయా శాఖల ఉన్నతాధికారులు జిల్లాల వారీగా సేకరించిన పచ్చదనం శాతాలను ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు పలు శాఖలకు పంపించారు. దీనిపై తక్షణమే స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా నగరం, పట్టణం భూ విస్తీర్ణంలో 33 శాతం మొక్కలు, చెట్లు, వనాలతో నిండి ఉండాలి. అలాంటిది ఊహకందని రీతిలో పచ్చదనం కనుమరుగవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ఒంగోలు నగరంతోపాటు ఏడు మున్సిపాలిటీలున్నాయి. పచ్చదనం విషయంలో అన్నీ వెనుకబడే ఉన్నాయి. ఒంగోలు నగరం పరిస్థితి అత్యంత దారుణం. ఒంగోలు నగర విస్తీర్ణం 135 చదరపు కిలోమీటర్లు. ఇందులో 33 శాతం విస్తీర్ణంలో మొక్కలు, చెట్లు, పచ్చదనంతో కళకళలాడాల్సి ఉంది. అలాంటిది ఇటీవల లెక్కల ప్రకారం ఒంగోలు నగరంలో కేవలం 3 శాతం మాత్రమే పచ్చదనం ఉన్నట్లు తేలింది. అద్దంకి మున్సిపాలిటీలో ప్రస్తుతం కేవలం 2 శాతం మాత్రమే పచ్చదనం ఉంది. అదేవిధంగా చీమకుర్తిలో 18, చీరాలలో 4, గిద్దలూరులో 20, కందుకూరులో 3, కనిగిరిలో 16, మార్కాపురంలో 2 శాతం మాత్రమే పచ్చదనం ఉన్నట్లు అధికారుల సర్వేల్లో తేటతెల్లమైంది. మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలి ఏ.కోటేశ్వరరావు, వృక్ష శాస్త్ర నిపుణుడు, సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పట్టణాలు, నగరాల్లో మొక్కల పెంపకంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి. పాఠశాల దశ నుంచే విద్యార్థులకు మొక్కల పెంపకంపై ఆసక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఒక చెట్టును కొడితే రెండు చెట్లు పెంచే విధంగా కఠినమైన చర్య లు తీసుకోకపోతే భవి ష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించలేం. శీతోష్ణస్థితిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయంటే మొక్కలను విచక్షణా రహితంగా నరకడమే ప్రధా న కారణం. మన దేశం లో పర్యావరణం, చెట్ల సంరక్షణపై కఠిన చట్టాలున్నప్పటికీ వాటి ఆచరణ లోపం వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతోంది. -
పర్యావరణ ప్రియమిత్రుడు
అతడికి మాయలు, మంత్రాలు తెలీవు. శక్తిమాన్, స్పైడర్మాన్, బ్యాట్మాన్లాగా పోరాడే శక్తిలేదు. కానీ ఈ ప్రపంచాన్ని సమస్యల వలయం నుంచి కొంత వరకూ బయటపడేయగలనని అంటున్నాడు. అతడి ప్రయోగాలను గమనించిన వారు కూడా అతడికి అది సాధ్యమవుతుందని అంటున్నారు. విపరీతమవుతున్న ఇంధన వనరుల వినియోగం, పెరిగిపోతున్న కాలుష్యం, దెబ్బతింటున్న ఓజోన్ పొర, పెరుగుతున్న భూతాపం... ఇవి ప్రపంచానికి ఇప్పుడున్న అతిపెద్ద సమస్యలు. మనిషి మనుగడను దెబ్బతీసే ప్రమాదాలు! వీటి బారి నుంచి మానవాళిని కాపాడాలనే ప్రయత్నంలో ఉన్నాడు పరమ్ జగ్గీ. పర్యావరణ సమస్యల గురించి లోతుగా అధ్యయనం చేసిన ఈ టీనేజర్ వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. పరిసరాలపై ప్రేమ, ఆసక్తి... తన చుట్టూ ఉన్న పరిసరాలు తనలో ఎంతో ఆసక్తిని రేపుతాయని అంటాడు జగ్గీ. నాలుగేళ్ల వయసు నుంచే జగ్గీలో ఈ ఆసక్తి మొదలైంది. తన దగ్గర ఉన్న బ్యాటరీతో నడిచే ఆటబొమ్మను పగలగొట్టి చూడటంతో జగ్గీ పరిశోధనలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అతడి మెదడు ఒక పరిశోధనశాల అయ్యింది. ప్రయోగాలే పాఠాలు అయ్యాయి. ఎనిమిదేళ్ల వయసులో ఇంట్లో పీసీని స్క్రూడ్రైవర్‌తో ఓపెన్ చేయడంతో ఇంట్లో వాళ్లకు జగ్గీ ఆలోచన తీరు ఏమిటో అర్థమైంది. అతడిలోని కుతూహలానికి అనుగుణంగా వారు ప్రోత్సాహం అందించారు. ఇప్పుడు జగ్గీ వయసు 19 యేళ్లు. ఇప్పటికీ అతడి జేబులో నిత్యం ఒక స్క్రూడ్రైవర్ ఉంటుంది. జగ్గీ గదిలోసైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్‌కు సంబంధించి ఎన్నో పరికరాలుంటాయి. మనిషిని ప్రకృతికి నేస్తం చేయాలి... ప్రపంచాన్ని ప్రకృతి నేస్తంగా మార్చడం గురించే జగ్గీ పరిశోధనలన్నీ. కాలుష్యాన్ని నియంత్రించి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను తయారు చేయడమే లక్ష్యంగా జగ్గీ పరిశోధనలు చేస్తున్నాడు. ప్లస్‌టూను పూర్తి చేసుకొన్న ఈ యువకుడు స్కూల్, కాలే జీల్లో కన్నా ప్రయోగశాలల్లోనే ఎక్కువగా గడుపుతుంటాడు. అనేక మంది శాస్త్రవేత్తలను, పరిశోధక సంస్థలను కలిసి తన ఐడియాలజీని వివరించాడు. మానవుడి నిత్యజీవితంలో తలెత్తే ఎనర్జీ, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్‌పై అధ్యయనం చేస్తున్నాడు. వాహనాలను నడిిపించే, విద్యుత్ ఉత్పాదనకు అవకాశం ఇచ్చే జీవఇంధనం(బయో ఫ్యూయెల్)ను తయారు చేయడం కోసం కొన్ని ఫార్ములాలను కూడా రూపొందించాడు జగ్గీ. వీటిని ఒక ప్రసిద్ధ ఇంధన సంస్థ వద్దకు తీసుకెళ్లగా... అక్కడి పరిశీలనల్లో జగ్గీ ఫార్ములా సాధ్యాసాధ్యాల గురించి పరిశీలించారు. ఇది ఫలిస్తుందనే అభిప్రాయానికి వచ్చి 20 వేల డాలర్ల సొమ్మును పెట్టుబడిగా పెట్టింది ఆ సంస్థ. ప్రస్తుతం దీని గురించి జగ్గీ పరిశోధనలు చేస్తున్నాడు. గాలిని కార్బన్ రహితం చేయాలి... ఇంధన ఉద్గారంగా వాతావరణంలోకి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ నుంచి కార్బన్ సంగ్రహించడానికి టెక్నికల్ డివైజ్‌లను తయారు చేయాలనేది జగ్గీ ఆలోచన. ఇది జరిగితే గాలిలోని కార్బన్‌డై ఆక్సైడ్(సీఓ2)లో కార్బన్ ఉద్గారాలు మాయమై కేవలం ఆక్సిజన్ మాత్రమే మిగులుతుంది! ఈ స్థాయి ఆలోచనలతో ముందుకు సాగుతున్నాడు జగ్గీ. మరి ఇదే సాధ్యం అయితే.. జగ్గీ పెద్ద శాస్త్రవేత్త అవుతాడు. అలాగే మానవుడికి ఉపయోగకరంగా ఉంటున్నప్పటికీ ఎక్కువ స్థాయి కాలుష్యానికి కారణమవుతున్న వస్తువులు, వాహనాల స్థానంలో కాలుష్య తీవ్రతను తగ్గించే ఇకో ఫ్రెండ్లీ ఉపకరణాలను తయారు చేయాలని జగ్గీ భావిస్తున్నాడు. ఈ విషయంలో ప్రపంచంలోని ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. తన ఆలోచనలతో అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలను ఆకట్టుకొంటున్నాడు పరమ్ జగ్గీ. ఫోర్బ్స మెచ్చుకుంది! కారు టైల్ పైప్ దగ్గర ఒక పరికరం అమర్చి కార్బన్‌డై ఆక్సైడ్‌ను ఆక్సిజన్ గా మార్చే పరికరాన్ని రూపొందించాడు. ఈ విషయంలో జగ్గీకి మంచి పేరు వచ్చింది. దీనిపై ఫోర్బ్స్ పత్రిక నుంచి మెచ్చుకోలును, అవార్డును పొందాడు జగ్గీ. ఇండో అమెరికన్ అయిన జగ్గీ అనేక అంతర్జాతీయ సైన్స్ఫెయిర్లలో పాల్గొని తన ఆవిష్కరణలతో ప్రశంసలు అందుకొన్నాడు. జగ్గీ థీసిస్‌లను అనేక యూనివర్సిటీ మ్యాగజీన్లు ప్రచురించాయి. వివిధ సంస్థల నుంచి అమేజింగ్ ఇన్వెంటర్, టాప్ హైస్కూల్ ఇన్వెంటర్ వంటి అవార్డులను అందుకొన్నాడు. -
జాగ్రఫీ, పర్యావరణ అంశాల సమన్వయంతో...
కలల కెరీర్ సివిల్ సర్వీసెస్ దిశగా అడుగులు వేస్తూ.. మొదటి దశ ప్రిలిమ్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని అత్యంత కీలకమైన మెయిన్స్ దశకు అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు.. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఓ అభ్యర్థి బుద్ధికుశలతను, సామాజిక, సమకాలీన సమస్యలపై అవగాహనను పరీక్షించాలన్న ఉద్దేశంతో మెయిన్స్‌లో మార్పులు చేశారు. కామన్ పేపర్సతోపాటు ఎస్సే, ఆప్షనల్‌గా జాగ్రఫీని ఎంచుకున్న అభ్యర్థులు ప్రిపరేషన్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి.. ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి, సమాధానాలు రాయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమైన అంశాలు తదితర అంశాలపై సూచనలు.. ఎ.డి.వి. రమణరాజు, సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్. మానవునికి సంబంధించి సామాజిక, ఆర్థిక, రాజకీయ, పరిపాలన, సాంస్కృతిక అంశాలన్నింటినీ ప్రభావితం చేసే విజ్ఞానశాస్త్త్రమే భూగోళశాస్త్రం. సమన్వయంతో: మారిన విధానంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ మెయిన్స పరీక్షల కోసం నిర్దేశించిన సిలబస్ అంశాలను విశ్లేషిస్తే.. జాగ్రఫీ ఆప్షనల్తో పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రయోజనాలు బహుళంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సబ్జెక్టులోని అధిక శాతం అంశాలను పేపర్-1 (ఎస్సే), పేపర్-2 (జనరల్ స్టడీస్-1-Indian Heritage and Culture, History and Geography of the World and Society), పేపర్-4 (జనరల్ స్టడీస్-3-Technology, Economic Development, Bio-diversity, Environment, Security and Disaster Management)లలో భాగంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాగ్రఫీ, పర్యావరణ విభాగాలకు సంబంధించిన అంశాలను సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. జాగ్రఫీకి సంబంధించి ఏ మూల నుంచైనా ప్రశ్నలు రావొచ్చు. జాగ్రఫీ ఆప్షనల్తో పరీక్షకు సిద్ధమవుతున్నవారికి ఈ పేపర్లో మంచి స్కోర్ సాధించడానికి వీలుంది. జాగ్రఫీ ఆప్షనల్ పేపర్-1: ఇందులో భౌతిక, మానవ భూగోళ శాస్త్రాలకు సంబంధించిన భావనలు, సిద్ధాంతాలను పొందుపరిచారు. ఇందులో సెక్షన్-ఎను పరిశీలిస్తే.. భూస్వరూప శాస్త్రానికి సంబంధించి భూ అయస్కాంతత్వం (జియోమాగ్నటిజం) ప్రాథమిక భావనలు, భూ అభినితి (జియోసింక్లైన్), భూ సమస్థితి, డబ్ల్యు.జె. మోర్గాన్ ప్రతిపాదించిన పలకవిరూపక సిద్ధాంతం ఆధారంగా భూకంపాలు, సునామీలు ఏర్పడే విధానం- విశ్లేషణ, మోరిస్, పెంక్లు ప్రతిపాదించిన భూ స్వరూప చక్ర ప్రక్రియలు, వాటి మధ్యగల తేడాలు, పోలికలు, విశ్లేషణ, అనువర్తిత భూ స్వరూప శాస్త్త్రం, వాలుల అభివృద్ధి, విశ్లేషణ, జియోహైడ్రాలజీ మొదలైన అంశాలు కీలకమైనవి. వీటిపై పరిపూర్ణ పట్టు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. శీతోష్ణస్థితి శాస్త్రానికి సంబంధించి క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ దాన్ని ప్రభావితం చేసే అంశాలు, ఊర్ద్వ ఉష్ణోగ్రతా విస్తరణ, ఉష్ణ సమతుల్యం, రుతుపవనాలు, జెట్‌స్ట్రీమ్, వాయురాశులు, వాతాగ్రాలు, సమ శీతోష్ణ మండల, ఉష్ణమండల చక్రవాతాలు, వాటి మధ్యగల తేడాలు, వర్షపాత రకాలు, విస్తరణ, కొప్పెన్, థార్న్ థ్వైట్లు ప్రతిపాదించిన ప్రపంచ శీతోష్ణ స్థితుల వర్గీకరణ, ఆయా వర్గీకరణల మధ్యగల తేడాలు, జల సంబంధిత చక్రం, అనువర్తిత శీతోష్ణస్థితి శాస్త్రం మొదలైన విశ్లేషణాత్మక దృష్టితో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సముద్ర శాస్త్రానికి సంబంధించి అట్లాంటిక్, హిందూ, పసిఫిక్ మహాసముద్రాల భూతల విభజన, సముద్రజల లవణీయత, దాన్ని ప్రభావితం చేసే అంశాలు, సముద్ర నిక్షేపాలు, ప్రవాళ బిత్తికలు, అవి విక్షాళనం చెందడానికి గల కారణాలు, సముద్ర జల కాలుష్యం, దానికి గల కారణాలు తదితరాలపై పూర్తి స్థాయిలో అవగాహన పొందడానికి ప్రయత్నించాలి. జైవిక భూగోళ శాస్త్రానికి సంబంధించి మృత్తిక వర్గీకరణ, విసృ్తతి, మృత్తిక క్రమక్షయం, నిమ్నీకరణకు గల కారణాలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అటవీ నిర్మూలన వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, సామాజిక అడవుల పెంపకం, ఆగ్రో ఫారెస్ట్రీ మొదలైన అంశాలను విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి. ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీకి సంబంధించి ఆవరణశాస్త్ర ప్రాథమిక భావనలు, పర్యావరణంపై మానవ ప్రభావం, ఆవరణ వ్యవస్థల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలు, వాటి సంరక్షణ, జీవ వైవిధ్యత సంరక్షణలో సుస్థిరాభివృద్ధి పాత్ర, నూతన పర్యావరణ విధానం, పర్యావరణ వైపరీత్యాలు, వాటి నివారణ చర్యలు మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. పేపర్-1, సెక్షన్-బి: ఇందులోని కీ లక అంశాలను పరిశీలిస్తే.. మానవీయ భూగోళ శాస్త్త్రంలోని దృక్పథాలకు సంబంధించి పర్యావరణ వాదం, పరిణామాత్మక విప్లవం, ద్వంద్వ భావన, రాడికల్, ప్రవర్తనా వాద దృక్పథాలు, ప్రపంచ సాంస్కృతిక మండలాలు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. ఆర్థిక భూగోళ శాస్త్రానికి సంబంధించి, వనరులు వాటి విస్తరణ, ఇంధన సమస్య, ప్రపంచ వ్యవసాయ మండలాలు - రకాలు, ఆహార భద్రత, దుర్భిక్షం -కారణాలు - ప్రభావాలు - నివారణ చర్యలు మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. జనాభా భూగోళ శాస్త్రానికి సంబంధించి ప్రపంచ జనాభా పెరుగుదల, విస్తరణను ప్రభావితం చేసే అంశాలు, ప్రపంచ జనాభాలో వలసలకు గల కారణాలు, ఉచ్ఛ-నిమ్న-అభిలషణీయ జనాభా భావనలు, జనాభా సిద్ధాంతాలు, ప్రపంచ జనాభా సమస్యలు, విధానాలు, పట్టణ జనాభా క్రమానుగత శ్రేణి, ప్రెమేట్ నగర భావన, రాంక్-సెజ్ నియమం, శాటిలైట్ టౌన్‌స, పట్టణ-గ్రామీణ ఉపాంతపు అంచు, పట్టణీకరణ వల్ల ఎదురయ్యే సమస్యలు, నివారణ చర్యలు మొదలైన అంశాలను విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి. ప్రాంతీయ భూగోళ శాస్త్త్రంలో ప్రాంతీయత భావన, రకాలు, ప్రాంతీయ అసమానతలకు గల కారణాలు, వాటి అభివృద్ధి వ్యూహాలు, ప్రాంతీయ ప్రణాళికలను రూపొందించడంలో పర్యావరణ సంబంధిత అంశాల పాత్ర మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. మానవ భూగోళ శాస్త్త్రంలోని నమూనాలు, సిద్ధాంతాలు, శాసనాలకు సంబంధించి మాల్ధూషియనీ, మార్ష్కియన్, జనాభా పరివర్తన నమూనాలు, క్రిష్టలర్ కేంద్ర స్థాన సిద్ధాంతం, లోస్చే, క్రిష్టలర్ సిద్ధాంతాల మధ్యగల తేడాలు, ఓస్టోవ్‌స నమూనాలోని వృద్ధి దశలు, హృదయభూమి, అంచుల భూమి సిద్ధాంతాలు మొదలైన అంశాలను చదవాల్సి ఉంటుంది. పేపర్-2: ఇందులో భారతదేశ భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ క్రమంలో అధికంగా దృష్టి సారించాల్సినవి: భారతదేశ భూభౌతిక అమరికకు సంబంధించి భారతదేశం - పొరుగు దేశాలతో ఉన్న భూ సరిహద్దు సమస్యలు, వాటి నేపథ్యం, హిమాలయ, ద్వీపకల్ప నదీ వ్యవస్థల మధ్యగల తేడాలు, భారతదేశ నైసర్గిక స్వరూపాలు, వాటి ప్రాముఖ్యత, భారతదేశ శీతోష్ణస్థితిపై రుతుపవనాల పాత్ర, దేశ భూభాగంలో రుతుపవన విస్తరణ విధానం, దాన్ని ప్రభావితం చేసే అంశాలు, భారతదేశంలో వర్షపాత విస్తరణపై ఉష్ణమండల చక్రవాతాలు, పశ్చిమ అలజడుల ప్రభావం, దుర్భిక్షం, వరదలు, భారతదేశంలో ఉద్భిజ సంపద, రకాలు తదితరాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి.. భారతదేశంలో భూగర్భ, ఉపరితల జలవనరుల పరిమాణం విస్తృతి, అవి ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి నిర్వహణ, శక్తి వనరులు, ఖనిజ వనరులు, వాటి సంరక్షణ, ఇంధన సమస్యలు మొదలైన అంశాలను చదవాలి. వ్యవసాయ రంగానికి సంబంధించి భారతదేశంలో వ్యవసాయ మౌలిక వసతులు, సాగునీటి సౌకర్యాలు, విత్తనాలు, ఎరువులు, విద్యుత్తు మొదలైన అంశాలు కీలకమైనవి. వీటిని విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. అదేవిధంగా పంటల విధానం, పంటల సరళి (క్రాప్ కాంబినేషన్), వ్యవసాయ రంగంలో హరిత విప్లవం పాత్ర దానివల్ల ఏర్పడే సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరమైన సమస్యలు, ఆగ్రో-క్లైమాటిక్ ప్రాంతాలు, ఆగ్రో - ఎకలాజికల్ రీజియన్‌స మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి. పరిశ్రమలకు సంబంధించి నూలు వస్త్త్ర పరిశ్రమ, ఇనుము-ఉక్కు, అల్యూమినియం, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ఉనికి, వాటి ఏర్పాటుకు దేశంలోని అనుకూల అంశాలు. పారిశ్రామిక నివాసాలు, పారిశ్రామిక సముదాయాలు, ప్రత్యేక ఆర్థిక మండలాలు (సెజ్‌లు), ఎకోటూరిజం మొదలైన అంశాలను చదవాలి. రవాణా, సమాచార రంగాలకు సంబంధించి జాతీయ రహదారుల అభివృద్ధి కోసం చేపట్టిన ఎన్‌హెచ్‌డీపీ ప్రాజెక్టు అమలు తీరు, బూట్ (ఆైఖీ) (బిల్డ్, ఆపరేట్, ట్రాన్సఫర్) పాత్ర , రోడ్డు రవాణా, రైల్వే రవాణా మధ్యగల పరస్పర పూరకాలు, వ్యతిరేకాలు (కాంప్లిమెంటరీ, కాంట్రడిక్టర్స) దేశ వాణిజ్యంలో ప్రధాన ఓడరేవుల ప్రాముఖ్యత, ఓడరేవుల అభివృద్ధిలో పీ3 (ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్) పాత్ర మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి. సాంస్కృతిక అంశాలకు సంబంధించి భారత సమాజంలో భాషాపరమైన, జాతి పరమైన వైవిధ్యతలు, గిరిజన ప్రాంతాలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలు మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి. జనావాసాలకు సంబంధించి భారతదేశంలో గ్రామీణ జనావాసాల రకాలు, విధానాలు, వాటి భౌతిక స్వరూపాలు, భారతీయ నగరాల భౌతిక స్వరూపాలు, విధుల పరంగా భారతీయ నగరాల వర్గీకరణ, మెట్రోపాలిటన్ ప్రాంతాలు, మురికివాడలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలు, పట్టణీకరణ వల్ల ఏర్పడే సమస్యలు, నివారణ చర్యలను విశ్లేషణాత్మక దృష్టితో చదవాలి. ప్రాంతీయ ప్రణాళికలు, అభివృద్ధికి సంబంధించి దేశంలో ప్రాంతీయ అసమానతలను రూపుమాపడంలో ప్రాంతీయ ప్రణాళికల పాత్ర, పంచాయతీరాజ్, వికేంద్రీకరణ ప్రణాళికలు, వాటర్‌షెడ్ నిర్వహణ, వెనుకబడిన ప్రాంతాలు, ఎడారి, దుర్భిక్ష, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక ప్రణాళికలు మొదలైన అంశాలను స్థూలంగా అధ్యయనం చేయాలి. రాజకీయ పరమైన దృక్పధాలకు సంబంధించి భారత సమాఖ్య విధానానికి సంబంధించిన భౌగోళిక పరమైన ప్రేరకాలు, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రాంతీయ ధోరణులు, అంతర్రాష్ట్ర అంశాలు, భారత అంతర్జాతీయ సరిహద్దుకు సంబంధించిన అంశాలు, దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతాలలో భౌగోళిక రాజకీయాలు, సీమాంతర ఉగ్రవాదం మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి. సమకాలీన అంశాలకు సంబంధించి పర్యావరణ పరమైన విపత్తులకు సంబంధించి భూపాతాలు (ల్యాండ్స్లైడ్స), భూకంపాలు, భారతదేశంలో భూకంపజోన్స, సునామీజోన్స, పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన అంశాలు, పర్యావరణ ప్రభావ నిర్ధారణ (ఇఐఎ), పర్యావరణ నిర్వహణ భావనలు, నదీ అనుసంధానం మొదలైన అంశాలను చదవాలి. పరిధి పెరిగింది గతంతో పోలిస్తే జనరల్ స్టడీస్ పేపర్లో జాగ్రఫీ సబ్జెక్టు పరిధి విస్తృతమైంది. గతేడాది కేవలం ఇండియా జాగ్రఫీని మాత్రమే సిలబస్‌లో పేర్కొంటే ఈసారి వరల్డ్ జాగ్రఫీని అదనంగా చేర్చారు. ఓ విషయం గురించి చదువుతున్నప్పుడు ఆ అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశముందో ఆలోచించి చదవాలి. అప్పుడే ప్రిపరేషన్ సఫలీకృతమవుతుంది. జాగ్రఫీలోని అంశాలకు ఆకాశమే హద్దు. అందువల్ల ప్రిపరేషన్లో భాగంగా తొలుత బేసిక్ విషయాలపై పట్టు సాధించాలి. ఆ తర్వాత ముఖ్యమైన అంశాలను, సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. సమాధానాలు ఇలా అభ్యర్థులు నేరుగా ఎస్సే రాయడానికి ఉపక్రమించడం అభిలషణీయం కాదు. ప్రశ్నను రెండుమూడుసార్లు చదివి, అర్థం చేసుకోవాలి. వాక్యాలు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. కఠిన పదబంధాలు ఉపయోగించకూడదు. అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ సిద్ధం చేసుకున్న స్ట్రక్చర్ల ఆధారంగా ఎస్సే రాయాలి. ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా రాయాలి. అవసరమైన సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఒక పేరాకు తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. గణాంకాలను సాధ్యమైనంతవరకు శాతాల్లో చూపేందుకు యత్నించాలి. వ్యాసంలో అతిముఖ్యమైన సమాచారాన్ని అండర్లైన్ చేయాలి. ఎస్సే రాయడంలో సమతూకం పాటించడం చాలా ప్రధానం. ప్రశ్నలో అడిగిన అంశానికి సంబంధించి వివిధ పార్శ్వాలు ప్రతిబింబించేలా సమాధానం రాయాలి. ఏదో ఒక కోణాన్ని మాత్రమే ప్రస్తావించి వదిలేయకూడదు. వివిధ సమస్యల పరిష్కారానికి అభ్యర్థి సూచనలు నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండాలి.