సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును పర్యావరణ అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారా? అని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పర్యావరణ అనుమతులపై స్పష్టత ఇస్తూ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ 2007లో ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్ దాఖలు చేయగా దానిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపివేత ఉత్తర్వులను పునరుద్ధరించాలంటూ ఒడిశా ప్రభుత్వం మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. అలాగే పర్యావరణ అనుమతులు లేకుండానే పోలవరం నిర్మిస్తున్నారని రేలా స్వచ్ఛంద సంస్థ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. ఈ పిటిషన్లను ఇప్పటి వరకు జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. డిసెంబర్ 30న ఆయన పదవీ విరమణ చేయడంతో గురువారం జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
ఒడిశా ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణ్యం వాదనలు వినిపించారు. 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు పొందిన ఏపీ ప్రభుత్వం.. ఆ డిజైన్‌ను మార్చి 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ సామర్థ్యానికి అనుగుణంగా ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలిపారు. నిల్వ నీటి (బ్యాక్ వాటర్)తో ఒడిశాకు ముంపు ముప్పు ఎక్కువగా ఉందని విన్నవించారు. ఈ వాదనలతో ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ విభేదించారు. ముంపు ముప్పుపై బచావత్ ట్రిబ్యునల్ విచారించిన మీదటే అవార్డు జారీ చేసిందని నివేదించారు. కాగా పర్యావరణ అనుమతులు తిరిగి పొందాలని చెప్పిన కేంద్ర పర్యావరణ శాఖ పనుల నిలిపివేత ఆదేశాలను పదే పదే నిలిపివేస్తోందని రేలా స్వచ్ఛంద సంస్థ తరపు న్యాయవాది జయంత్ భూషణ్ ధర్మాసనానికి విన్నవించారు. అనుమతులు తిరిగి తీసుకునేంతవరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని కోరారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదంలోకి ప్రైవేటు సంస్థలు రావడం సరికాదంటూ ఏకే గంగూలీతో పాటు కేంద్ర అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలతో ధర్మాసనం విభేదించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎవరైనా వేయొచ్చని స్పష్టం చేస్తూ విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.
పర్యావరణ అనుమతులు లేవా?
Published Fri, Jan 4 2019 2:37 AM | Last Updated on Fri, Jul 12 2019 6:06 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment