అతడికి మాయలు, మంత్రాలు తెలీవు. శక్తిమాన్, స్పైడర్‌మాన్, బ్యాట్‌మాన్‌లాగా పోరాడే శక్తిలేదు. కానీ ఈ ప్రపంచాన్ని సమస్యల వలయం నుంచి కొంత వరకూ బయటపడేయగలనని అంటున్నాడు. అతడి ప్రయోగాలను గమనించిన వారు కూడా అతడికి అది సాధ్యమవుతుందని అంటున్నారు.
విపరీతమవుతున్న ఇంధన వనరుల వినియోగం, పెరిగిపోతున్న కాలుష్యం, దెబ్బతింటున్న ఓజోన్ పొర, పెరుగుతున్న భూతాపం... ఇవి ప్రపంచానికి ఇప్పుడున్న అతిపెద్ద సమస్యలు. మనిషి మనుగడను దెబ్బతీసే ప్రమాదాలు! వీటి బారి నుంచి మానవాళిని కాపాడాలనే ప్రయత్నంలో ఉన్నాడు పరమ్ జగ్గీ. పర్యావరణ సమస్యల గురించి లోతుగా అధ్యయనం చేసిన ఈ టీనేజర్ వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు.
పరిసరాలపై ప్రేమ, ఆసక్తి...
తన చుట్టూ ఉన్న పరిసరాలు తనలో ఎంతో ఆసక్తిని రేపుతాయని అంటాడు జగ్గీ. నాలుగేళ్ల వయసు నుంచే జగ్గీలో ఈ ఆసక్తి మొదలైంది. తన దగ్గర ఉన్న బ్యాటరీతో నడిచే ఆటబొమ్మను పగలగొట్టి చూడటంతో జగ్గీ పరిశోధనలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అతడి మెదడు ఒక పరిశోధనశాల అయ్యింది. ప్రయోగాలే పాఠాలు అయ్యాయి. ఎనిమిదేళ్ల వయసులో ఇంట్లో పీసీని స్క్రూడ్రైవర్‌తో ఓపెన్ చేయడంతో ఇంట్లో వాళ్లకు జగ్గీ ఆలోచన తీరు ఏమిటో అర్థమైంది. అతడిలోని కుతూహలానికి అనుగుణంగా వారు ప్రోత్సాహం అందించారు. ఇప్పుడు జగ్గీ వయసు 19 యేళ్లు. ఇప్పటికీ అతడి జేబులో నిత్యం ఒక స్క్రూడ్రైవర్ ఉంటుంది. జగ్గీ గదిలోసైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్‌కు సంబంధించి ఎన్నో పరికరాలుంటాయి.
మనిషిని ప్రకృతికి నేస్తం చేయాలి...
ప్రపంచాన్ని ప్రకృతి నేస్తంగా మార్చడం గురించే జగ్గీ పరిశోధనలన్నీ. కాలుష్యాన్ని నియంత్రించి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను తయారు చేయడమే లక్ష్యంగా జగ్గీ పరిశోధనలు చేస్తున్నాడు. ప్లస్‌టూను పూర్తి చేసుకొన్న ఈ యువకుడు స్కూల్, కాలే జీల్లో కన్నా ప్రయోగశాలల్లోనే ఎక్కువగా గడుపుతుంటాడు. అనేక మంది శాస్త్రవేత్తలను, పరిశోధక సంస్థలను కలిసి తన ఐడియాలజీని వివరించాడు. మానవుడి నిత్యజీవితంలో తలెత్తే ఎనర్జీ, ఎన్విరాన్‌మెంటల్ ప్రాబ్లమ్స్‌పై అధ్యయనం చేస్తున్నాడు. వాహనాలను నడిిపించే, విద్యుత్ ఉత్పాదనకు అవకాశం ఇచ్చే జీవఇంధనం(బయో ఫ్యూయెల్)ను తయారు చేయడం కోసం కొన్ని ఫార్ములాలను కూడా రూపొందించాడు జగ్గీ. వీటిని ఒక ప్రసిద్ధ ఇంధన సంస్థ వద్దకు తీసుకెళ్లగా... అక్కడి పరిశీలనల్లో జగ్గీ ఫార్ములా సాధ్యాసాధ్యాల గురించి పరిశీలించారు. ఇది ఫలిస్తుందనే అభిప్రాయానికి వచ్చి 20 వేల డాలర్ల సొమ్మును పెట్టుబడిగా పెట్టింది ఆ సంస్థ. ప్రస్తుతం దీని గురించి జగ్గీ పరిశోధనలు చేస్తున్నాడు.
గాలిని కార్బన్ రహితం చేయాలి...
ఇంధన ఉద్గారంగా వాతావరణంలోకి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ నుంచి కార్బన్ సంగ్రహించడానికి టెక్నికల్ డివైజ్‌లను తయారు చేయాలనేది జగ్గీ ఆలోచన. ఇది జరిగితే గాలిలోని కార్బన్‌డై ఆక్సైడ్(సీఓ2)లో కార్బన్ ఉద్గారాలు మాయమై కేవలం ఆక్సిజన్ మాత్రమే మిగులుతుంది! ఈ స్థాయి ఆలోచనలతో ముందుకు సాగుతున్నాడు జగ్గీ. మరి ఇదే సాధ్యం అయితే.. జగ్గీ పెద్ద శాస్త్రవేత్త అవుతాడు. అలాగే మానవుడికి ఉపయోగకరంగా ఉంటున్నప్పటికీ ఎక్కువ స్థాయి కాలుష్యానికి కారణమవుతున్న వస్తువులు, వాహనాల స్థానంలో కాలుష్య తీవ్రతను తగ్గించే ఇకో ఫ్రెండ్లీ ఉపకరణాలను తయారు చేయాలని జగ్గీ భావిస్తున్నాడు. ఈ విషయంలో ప్రపంచంలోని ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. తన ఆలోచనలతో అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలను ఆకట్టుకొంటున్నాడు పరమ్ జగ్గీ.
ఫోర్‌బ్స మెచ్చుకుంది!
కారు టైల్ పైప్ దగ్గర ఒక పరికరం అమర్చి కార్బన్‌డై ఆక్సైడ్‌ను ఆక్సిజన్ గా మార్చే పరికరాన్ని రూపొందించాడు. ఈ విషయంలో జగ్గీకి మంచి పేరు వచ్చింది. దీనిపై ఫోర్బ్స్ పత్రిక నుంచి మెచ్చుకోలును, అవార్డును పొందాడు జగ్గీ. ఇండో అమెరికన్ అయిన జగ్గీ అనేక అంతర్జాతీయ సైన్స్‌ఫెయిర్‌లలో పాల్గొని తన ఆవిష్కరణలతో ప్రశంసలు అందుకొన్నాడు. జగ్గీ థీసిస్‌లను అనేక యూనివర్సిటీ మ్యాగజీన్‌లు ప్రచురించాయి. వివిధ సంస్థల నుంచి అమేజింగ్ ఇన్వెంటర్, టాప్ హైస్కూల్ ఇన్వెంటర్ వంటి అవార్డులను అందుకొన్నాడు.
పర్యావరణ ప్రియమిత్రుడు
Published Sun, Dec 1 2013 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM
Advertisement
Advertisement