Navayuvam
-
ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు కూడా అంజలిని గుర్తించాయి
ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు కూడా అంజలిని గుర్తించాయి. తమ సేవాకార్యక్రమాల ప్రచారం కోసం అంజలి చేత బొమ్మలను గీయించుకొంటున్నాయి. చెన్నై నుంగమ్బాకంలోని పద్మాశేషాద్రి బాలభవన్ సీనియర్ సెకెండరీ స్కూల్లో కామర్స్ స్టూడెంట్ అంజలి చంద్రశేఖర్. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌తో తరచూ సమావేశం అవుతూ ఉంటుంది. ఆలోచనలను పంచుకుంటుంది. ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు, అంజలి చెప్పే విషయాలను ఆసక్తితో వింటారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’కు ప్రత్యేక అతిథిగా హాజరవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రతిభావంతులు ఉన్నా... అంజలికే ఈ అవకాశం దక్కిందంటే దానికి కారణం తన ప్రతిభను సేవాదృక్పథం వైపు మళ్లించిన తీరు. ‘ఒక చిత్రం వందల పదాల భావాన్ని వ్యక్తపరుస్తుంది’ అనే మాటే తనకు స్ఫూర్తి అంటుంది అంజలి. తన కుంచెతో వేల భావాలను పలికించడమే కాదు, కోట్లమంది ప్రజల్లో కదలికను తీసుకువస్తోంది. అంజలి వాళ్ల అవ్వ శాంతలక్ష్మి వికలాంగులైన పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాల నడిపేది. అక్కడి నుంచే ఆమెకు సేవాదృక్పథం అలవడింది. తనలోని కళను సేవా ఉద్యమానికి అంకితమిచ్చింది. మొదట్లో సేవాకార్యక్రమాల కోసం ఫండ్స్‌ను కలెక్ట్ చేసే వారికి మంచి మంచి బొమ్మలను గీసి ఇచ్చేది. అప్పుడే ‘ఆర్ట్ ఈజ్ యాన్ యాక్టివిజమ్’ అని భావించానని అంజలి అంటుంది. అలా మొదలైన అంజలి ప్రస్థానం క్రమంగా విస్తరించింది. ఒక సందర్భంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్లు తమ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి ఐడియాస్ ఇవ్వమని ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది చిత్రాల రూపంలో ఐడియాలను పంపించారు. వాటిలో బెస్ట్ 15లో నిలిచింది అంజలి చంద్రశేఖర్. దాంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో భాగస్వాములు అయిన ప్రముఖులతో అంజలికి పరిచయం ఏర్పడింది. మానవాళి అభివృద్ధి కోసం ఫోరమ్ రూపొందించిన కార్యక్రమాల ప్రచారం కోసం అంజలి చేతే ఆర్టిస్టిక్ వర్క్‌ను చేయించారు. వారితో ఆలోచనలను పంచుకొని ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసింది. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు కూడా అంజలిని గుర్తించాయి. తమ సేవాకార్యక్రమాల ప్రచారం కోసం అంజలి చేత బొమ్మలను గీయించుకొంటున్నాయి. ఆర్ట్ ఈజ్ యాన్ యూనివర్సల్ లాంగ్వేజ్ అన్నట్టుగా ప్రస్తుతం అంజలి గీసిన చిత్రాలు 177 దేశాల ప్రజల్లో అవగాహనను నింపుతున్నాయి. కేవలం సేవారూపంలోనే కాకుండా సొంతంగా వ్యాపారవేత్తగా ఎదిగే ప్రయత్నాలు కూడా చేస్తోంది అంజలి. టీషర్ట్స్, మగ్స్, ట్రేస్, వాటర్‌బాటిల్స్, క్యాలెండర్స్, గ్రీటింగ్ కార్డ్స్ పై ఆర్ట్‌లను గీస్తూ ఒక వెంచర్‌ను ప్రారంభించింది. -
మన దీపిక... యంగెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ అమెరికా
ఒక ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన అమ్మాయి. పుట్టిందీ, పెరిగింది అమెరికాలో. ఒకసారి సెలవుల్లో తొలిసారి భారతదేశానికి వచ్చింది. సహజంగానే ఇక్కడివారి జీవనశైలిని చూసి చాలా ఆశ్చర్య పోయింది. ప్రత్యేకించి భారతీయులు ప్యూరిఫై చేయని నీళ్లను తాగుతున్నారనే విషయం ఆమెలో ఆందోళన రేపింది. ఆ ఆందోళనే ఓ కొత్త ఆవిష్కరణకు దారి తీసింది. అదే ఆమెకు ‘యంగెస్ట్ సైంటిస్ట్’ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆమె పేరు దీపికా కురుప్. అమెరికాలో సెటిలైన మలయాళీ కుటుంబానికి చెందిన దీపిక అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోని పేదలకు ఒక బహుమతిని ఇచ్చింది. అదేంటంటే... సైన్స్‌ను చదువుకొని అర్థం చేసుకోవడ ఒక ఎత్తయితే సమాజాన్ని ఇబ్బంది పెడుతున్న సమస్యల పరిష్కారానికి దాన్ని అన్వయించుకొని కొత్త ఆవిష్కరణలు చేయడం మరో ఎత్తు. శాస్త్రవేత్తల గురించి అందరూ చదువుకొంటారు. కానీ తామే శాస్త్రవేత్తలమవాలన్న తపన కొందరు టీనేజర్లలోనే ఉంటుంది. అలాంటి తపనే తనను నూతనావిష్కరణలు చేసే స్ఫూర్తిని జనింపజేసిందని చెబుతుంది దీపిక. ఎక్కడో అమెరికాలోని హైస్కూల్లో చదువుతూ భారతదేశంలోని సామాజిక పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యాన్ని పెట్టుకొంది ఈ పదహారేళ్ల అమ్మాయి. దీపిక తల్లిదండ్రులది తిరువనంతపురం. వారు చాలా సంవత్సరాల కిందటే అమెరికాకు వెళ్లారు. దీపిక అక్కడే పుట్టి పెరిగింది. అమెరికాలోని లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిపోయిన ఈ అమ్మాయి పన్నెండేళ్ల వయసులో తొలిసారి ఇండియాకు వచ్చింది. ఇక్కడ తన ఈడు పిల్లలంతా కలుషిత నీరు తాగుతుండటాన్ని గమనించింది. పల్లెల్లో చెరువుల నుంచి, బావుల నుంచి తెచ్చుకొన్న నీళ్లను అలాగే సేవిస్తారని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. అది చాలా ప్రమాదకరమని, రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారికి తెలియజెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆ విషయం గురించి అవగాహన ఉన్నా తమకు అంతకు మంచి, మరో ప్రత్యామ్నాయం లేదని స్థానికులు దీపికకు తెలియజెప్పారు. అటువంటి నేపథ్యంలో వారి పరిస్థితిలో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం చేయాలనుకొంది. అయితే ఇక్కడి ప్రజలందరికీ వాటర్ ప్యూరిఫయర్లు కొనివ్వడం తనకు సాధ్యం కాదు, సొంతంగా కొనుక్కోవడానికి వారి శక్తీ చాలదు. మరి చౌకధరలో వాటర్ ప్యూరిఫయర్లు అందుబాటులోకి తీసుకొస్తే... అవి కూడా కరెంట్, గ్యాస్‌ల వంటి ఇంధనాల అవసరం లేకుండా సహజంగానే పనిచేస్తే... అప్పుడు సమస్య చాలా వరకూ పరిష్కృతం అయినట్టేనని దీపిక భావించింది. ఇదే ఐడియాతో ఆమె ‘సోలార్ వాటర్ ప్యూరిఫయర్’ను రూపొందించింది. ప్రయత్నం ప్రశంసలు పొందింది... సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా వాటర్ ప్యూరిఫయర్‌కు రూపకల్పన చేసిన దీపికకు ‘డిస్కవరీ ఎడ్యుకేషన్ త్రీఎమ్ యంగ్‌సైంటిస్ట్’ పోటీలు లాంచింగ్ ప్యాడ్‌గా నిలిచాయి. అనేకమంది యువతీయువకులు తమ సైంటిఫిక్ ఐడియాతో ఆ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు. వారందరి మధ్య దీపిక ఆవిష్కరణ భిన్నమైనదిగా నిలిచింది. ప్రత్యేకించి పేదప్రజలకు ప్యూరిఫైడ్ వాటర్ అందించాలనే ఆలోచనతో దీపిక చేసిన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ తోబాటు ఆమె చేసిన ఆవిష్కరణ కూడా విజయవంతం కావడంతో ‘అమెరికన్ యంగ్ సైంటిస్ట్’ అవార్డు దక్కింది. ప్రైజ్‌మనీనే పెట్టుబడిగా... దీపికకు రెండు రకాలుగా మంచి గుర్తింపు లభించింది. ఒకటి ఆవిష్కరణ ద్వారానైతే, రెండోది గ్రామీణ భారతంలోని నీటి సమస్య గురించి పరిశీలన చేసి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం ద్వారా. ఈ ఆవిష్కరణ విషయంలో ఆమెకు అనేక బహుమతులు వచ్చాయి. వేల డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. ఆ సొమ్మునే సోలార్‌వాటర్ ప్యూరిఫయర్ల రూపకల్పనకు పెట్టుబడిగా చేసుకోవాలని దీపిక భావిస్తోంది. ఈ విషయంలో పరిశ్రమల నుంచి కూడా ఆమెకు సహకారం లభిస్తోంది. దీంతో త్వరలోనే దీపిక రూపొందించిన సోలార్ వాటర్ ప్యూరిఫయర్లు మార్కెట్లో సందడి చేసే అవకాశం ఉంది. దీపికకు రెండు రకాలుగా మంచి గుర్తింపు లభించింది. ఒకటి ఆవిష్కరణ ద్వారానైతే, రెండోది గ్రామీణ భారతంలోని నీటి సమస్య గురించి పరిశీలన చేసి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం ద్వారా. ఈ ఆవిష్కరణ విషయంలో ఆమెకు అనేక బహుమతులు వచ్చాయి. వేల డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. -
ఎథికల్ హ్యాకింగ్
‘‘భవిష్యత్తు అవసరాలను సరైన సమయంలో అంచనా వేయడం వ్యాపారంలో ఒక విజయ రహస్యం. ఇలాంటి నిపుణత చదువులో కూడా ఉంటుంది. కొంచెం ఆలోచించి వ్యవహరిస్తే ఇండస్ట్రీలో మంచి అవకాశాలను సంపాదించిపెట్టే చదువులు చదవొచ్చు, ఇండస్ట్రీకి మన అవసరం ఏర్పడేలా చేసుకోవచ్చు...’’ అంటున్నాడు జార్ఖండ్‌కు చెందిన వినీత్ కుమార్. ఒక విజేత హోదాలో ఈ మాటలు చెప్పాడు. ఇంటర్నెట్ వాడకం ఇప్పుడు విస్తృతం అయ్యింది. ఇదే సమయంలో ఎంతో సౌలభ్యంగా ఉన్న ఈ సేవ వల్ల అనేక ఇబ్బందులు మొదలయ్యాయి. అలాంటి సమస్యల్లో ప్రధానమైనది ‘హ్యాకింగ్’ కంప్యూటర్, ఇంటర్నెట్ టెక్నాలజీల మీద పట్టు సంపాదించి కొంతమంది తమ తెలివితేటలను దుర్వినియోగం చేస్తూ వెబ్ వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మరి దీన్ని ఎదుర్కోవడం పెద్ద పెద్ద సంస్థలకే భారమవుతోంది. ఈ నేపథ్యంలో హ్యాకర్ల ఎత్తులను తిప్పికొట్టడానికి అవి ఎథికల్ హ్యాకర్లను నియమించుకొంటున్నాయి. దీంతో చాలామంది ఇప్పుడు నెట్వర్కింగ్, ఎథికల్ హ్యాకింగ్స్లో ఉద్యోగావకాశాల గురించి స్టడీ చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితిని ఆరేళ్ల కిందటే అంచనా వేసిన వారిలో ఒకడు వినీత్ కుమార్. ఎథికల్ హ్యాకింగ్‌పై పట్టు సంపాదించి ప్రస్తుతం జార్ఖండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్నాడు ఈ ఇరవెరైండేళ్ల యువకుడు. పదహారేళ్ల వయసులో సొంతంగా కంపెనీ! పదహారేళ్ల వయసులోనే ఎథికల్ హ్యాకర్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు వినీత్‌కుమార్. ఇంటర్నెట్ ఇంకా ఇప్పటిలా విస్తృతం కాని సమయంలోనే ‘నేషనల్యాంటీ హ్యాకింగ్ గ్రూప్’ను స్థాపించాడు. హ్యాకింగ్‌ను నిరోధించడానికి ప్రోగ్రామ్స్‌ను డిజైన్ చేశాడు. గత ఐదారేళ్లలో సైబర్ క్రైమ్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో వినీత్‌కు ప్రాధాన్యత పెరిగింది. వినీత్ గురించి తెలుసుకొన్న జార్ఖండ్ పోలీసు శాఖ ‘సైబర్ సెక్యూరిటీస్’కు సహకారం అందించాల్సిందిగా కోరింది. అదే సమయంలో దేశంలో తొలిసారి ఆ రాష్ట్రంలోనే ‘సైబర్ డిఫెన్స్ రీసెర్చ్ సెల్’ ను ఏర్పాటు చేశారు. ఈ విభాగాన్ని ఏర్పరుస్తూనే వినీత్‌కు స్పెషల్ ఆఫీసర్ హోదా ఇచ్చారు. ఏటీఎం క్లోన్స్, ఫేస్బుక్ ప్రొఫైల్ హ్యాకింగ్, వెబ్‌సైట్స్ హ్యాకింగ్, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ను కాపాడటం...మొదలైన కార్యక్రమాల ద్వారా వినీత్ ఇన్వెస్టిగేషన్ కేసుల్లో పోలీసులకు సహాయపడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు! కేవలం దేశంలోనే గాక దేశం ఆవల కూడా వినీత్‌కు మంచి గుర్తింపు వచ్చింది. వరల్డ్స్ యంగెస్ట్ మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్ ఇంజనీర్‌గా అవార్డు తీసుకొన్నాడు. 2008 సంవత్సరంలో యూఎన్ యూత్ అసెంబ్లీ తరపున గోల్డ్‌మెడల్ గెలుచుకొన్నాడు. తండ్రే స్ఫూర్తి... ‘నా విజయాలకు స్ఫూర్తి మా నాన్న. కలలను సాకారం చేసుకోవడానికి ఆయన ఎంతో సహకారం అందించాడు. ఎథికల్ హ్యాకింగ్ నా జీవితాన్ని మార్చేసింది. దీంట్లో ఎన్నో అవకాశాలున్నాయి. యువత దీనిపై దృష్టిసారించవచ్చు...’అంటున్నాడు వినీత్‌కుమార్. వినీత్ గురించి తెలుసుకొన్న జార్ఖండ్ పోలీసు శాఖ ‘సైబర్ సెక్యూరిటీస్’కు సహకారం అందించాల్సిందిగా కోరింది. అదే సమయంలో దేశంలో తొలిసారి ఆ రాష్ట్రంలోనే ‘సైబర్ డిఫెన్స్ రీసెర్చ్ సెల్’ ను ఏర్పాటు చేశారు. ఈ విభాగాన్ని ఏర్పరుస్తూనే వినీత్‌కు స్పెషల్ ఆఫీసర్ హోదా ఇచ్చారు. -
ఐఐటీ వద్దంది... స్టాన్ఫోర్డ్ రమ్మంది!
‘‘శారీరక వైకల్యం మనిషి సామర్థ్యానికి అడ్డు అవుతుందని చాలా మంది చెబుతుంటారు. అయితే మన సామర్థ్యం మీద మనకు నమ్మకం ఉంటే ఏ వైకల్యం, ఎలాంటి పరిస్థితులూ మన విజయానికి అడ్డుకాబోవు...’’ అంటున్నాడు కార్తీక్ స్వహ్నే. ఇది ఎవరిలోనో స్ఫూర్తిని నింపడానికి చెబుతున్న మాట కాదు. ఇంకెవరిలోనో ఉద్వేగాన్ని రగల్చడానికి చెబుతున్న మాట అంతకన్నా కాదు. తాను మనస్ఫూర్తిగా నమ్మి, ఆచరించి విజయం సాధించి చెబుతున్న మాట. పుట్టుకతో చూపులేక పోయినా వైకల్యాన్ని, వైకల్యం వల్ల తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొని సాధించిన విజయం అభినందనీయం. శారీరక వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం బస్సులో సీట్లు రిజర్వ్ చేసి ఉంటాయి, వారికి సహాయం చేయడానికి చాలామంది ముందుకొస్తారు, కనీసం కొందరైనా వారిమీద జాలి చూపిస్తారు, ప్రభుత్వం కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఇచ్చింది. అయితే కార్తీక్‌కు మాత్రం అవేవీ ఉపయోగపడలేదు! ‘‘నాకు చదివే సామర్థ్యం ఉంది, నేను చదువుకొంటాను... కనీసం పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వండి...’’ అని అభ్యర్థించాడు. కానీ ఈ అంధ విద్యార్థిని పరీక్ష రాయడానికి కూడా అనుమతించలేదు నియమనిబంధనలు. సీబీఎస్ఈ సిలబస్‌లో 96 శాతం మార్కులతో ప్లస్‌టూ పూర్తి చేసిన కార్తీక్‌కు ఐఐటీలో ఇంజినీరింగ్ చదవాలనేది కల. అయితే పూర్తిస్థాయి అంధ విద్యార్థులకు ఐఐటీలో ప్రవేశం లేదు అంటున్నాయి నిబంధనలు. వికలాంగ కోటా ఉన్నప్పటికీ వందశాతం అంధుడైన వ్యక్తికి ఐఐటీ చదువులకు అవకాశం లేదని నిబంధనల్లో స్పష్టంగా ఉండడంతో తన పర్సెంటేజీని చూసి, కనీసం ఇదివరకు చదువుకొన్న విధానాన్ని గమనించి అయినా తనకో అవకాశం ఇవ్వాల్సిందిగా కార్తీక్ ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీలకు విజ్ఞాపన లేఖలు రాశాడు. అయితే ఆ విద్యాలయాల నుంచి స్పందన లేదు. ఎంట్రన్స్కే అవకాశం రాలేదు! ఎంట్రన్స్ రాసి సీటు రాలేదంటే ఏదో విధంగా ఊరట పొందవచ్చు, కానీ ఎంట్రన్స్ రాయడానికే అవకాశం లభించలేదంటే... అది ఎంత బాధో చదువుకొనే వారికి బాగా తెలుస్తుంది. ప్లస్ టూ పూర్తి అయ్యాక.. రెండు సంవత్సరాల పాటు వేచి ఉన్నాడు, ఐఐటీల నుంచి అనుమతి లభిస్తుందేమోనని ఆశించాడు. కానీ నిరాశే మిగిలింది. అయితే ఈ బాధతో కార్తీక్ కృశించి పోలేదు. స్టాన్‌ఫోర్డ్‌లో సీటొచ్చింది! కార్తీక్ పరిస్థితి గురించి తెలుసుకొన్న ఒక ఎన్జీవో చేయూతను ఇచ్చింది. ఐఐటీలో అవకాశం లేదని స్పష్టత వచ్చాక అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివించడానికి రంగం సిద్ధం చేశారు. కార్తీక్ ప్రతిభ గురించి యూనివర్సిటీ వారికి వివరించి, అతడికి సైన్స్, కంప్యూటర్స్ మీదున్న పట్టు గురించి ప్రాజెక్ట్ రూపంలో తెలియజెప్పి ఆ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సీట్‌ను కేటాయించాల్సిందిగా కోరారు. కార్తీక్ చదువుకొన్న పరిస్థితుల గురించి తెలుసుకొన్న ఆ అమెరికన్ వర్సిటీ వారు అతడి ప్రాజెక్ట్‌ను పరిశీలించి ఐదేళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్‌ను చదవడానికి అవకాశం ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పూర్తిస్థాయిలో స్కాలర్షిప్ను మంజూరుచేశారు. ఈ యేడాదే కార్తీక్‌కు స్టాన్ఫోర్డ్ లో ప్రవేశం దక్కింది. ఇప్పుడు కార్తీక్ చాలా హ్యాపీగా ఉన్నాడు. తను అనుకొన్న విద్యను అభ్యసిస్తూ స్ఫూర్తిమంతుడిగా మారాడు. వైకల్యం ఉందని చెప్పి చదువుకోవడానికి అవకాశం లభించని సమయంలో నిస్పృహతో కూరుకుపోక, వెనక్కు తగ్గక తన లక్ష్యం కోసం ప్రయత్నాలు చేసిన కార్తీక్‌కు ఆఖరికి ఉత్తమమైన ఫలితం దక్కింది. అనుకొన్న లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంతటి నిరాశ ఎదురైనా వెనక్కు దక్కక కృషి చేస్తే అంతిమంగా విజయం సొంతం అవుతుందని కార్తీక్ సక్సెస్ స్టోరీని బట్టి అర్థం చేసుకోవచ్చు! -
పర్యావరణ ప్రియమిత్రుడు
అతడికి మాయలు, మంత్రాలు తెలీవు. శక్తిమాన్, స్పైడర్మాన్, బ్యాట్మాన్లాగా పోరాడే శక్తిలేదు. కానీ ఈ ప్రపంచాన్ని సమస్యల వలయం నుంచి కొంత వరకూ బయటపడేయగలనని అంటున్నాడు. అతడి ప్రయోగాలను గమనించిన వారు కూడా అతడికి అది సాధ్యమవుతుందని అంటున్నారు. విపరీతమవుతున్న ఇంధన వనరుల వినియోగం, పెరిగిపోతున్న కాలుష్యం, దెబ్బతింటున్న ఓజోన్ పొర, పెరుగుతున్న భూతాపం... ఇవి ప్రపంచానికి ఇప్పుడున్న అతిపెద్ద సమస్యలు. మనిషి మనుగడను దెబ్బతీసే ప్రమాదాలు! వీటి బారి నుంచి మానవాళిని కాపాడాలనే ప్రయత్నంలో ఉన్నాడు పరమ్ జగ్గీ. పర్యావరణ సమస్యల గురించి లోతుగా అధ్యయనం చేసిన ఈ టీనేజర్ వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. పరిసరాలపై ప్రేమ, ఆసక్తి... తన చుట్టూ ఉన్న పరిసరాలు తనలో ఎంతో ఆసక్తిని రేపుతాయని అంటాడు జగ్గీ. నాలుగేళ్ల వయసు నుంచే జగ్గీలో ఈ ఆసక్తి మొదలైంది. తన దగ్గర ఉన్న బ్యాటరీతో నడిచే ఆటబొమ్మను పగలగొట్టి చూడటంతో జగ్గీ పరిశోధనలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అతడి మెదడు ఒక పరిశోధనశాల అయ్యింది. ప్రయోగాలే పాఠాలు అయ్యాయి. ఎనిమిదేళ్ల వయసులో ఇంట్లో పీసీని స్క్రూడ్రైవర్‌తో ఓపెన్ చేయడంతో ఇంట్లో వాళ్లకు జగ్గీ ఆలోచన తీరు ఏమిటో అర్థమైంది. అతడిలోని కుతూహలానికి అనుగుణంగా వారు ప్రోత్సాహం అందించారు. ఇప్పుడు జగ్గీ వయసు 19 యేళ్లు. ఇప్పటికీ అతడి జేబులో నిత్యం ఒక స్క్రూడ్రైవర్ ఉంటుంది. జగ్గీ గదిలోసైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్‌కు సంబంధించి ఎన్నో పరికరాలుంటాయి. మనిషిని ప్రకృతికి నేస్తం చేయాలి... ప్రపంచాన్ని ప్రకృతి నేస్తంగా మార్చడం గురించే జగ్గీ పరిశోధనలన్నీ. కాలుష్యాన్ని నియంత్రించి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను తయారు చేయడమే లక్ష్యంగా జగ్గీ పరిశోధనలు చేస్తున్నాడు. ప్లస్‌టూను పూర్తి చేసుకొన్న ఈ యువకుడు స్కూల్, కాలే జీల్లో కన్నా ప్రయోగశాలల్లోనే ఎక్కువగా గడుపుతుంటాడు. అనేక మంది శాస్త్రవేత్తలను, పరిశోధక సంస్థలను కలిసి తన ఐడియాలజీని వివరించాడు. మానవుడి నిత్యజీవితంలో తలెత్తే ఎనర్జీ, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్‌పై అధ్యయనం చేస్తున్నాడు. వాహనాలను నడిిపించే, విద్యుత్ ఉత్పాదనకు అవకాశం ఇచ్చే జీవఇంధనం(బయో ఫ్యూయెల్)ను తయారు చేయడం కోసం కొన్ని ఫార్ములాలను కూడా రూపొందించాడు జగ్గీ. వీటిని ఒక ప్రసిద్ధ ఇంధన సంస్థ వద్దకు తీసుకెళ్లగా... అక్కడి పరిశీలనల్లో జగ్గీ ఫార్ములా సాధ్యాసాధ్యాల గురించి పరిశీలించారు. ఇది ఫలిస్తుందనే అభిప్రాయానికి వచ్చి 20 వేల డాలర్ల సొమ్మును పెట్టుబడిగా పెట్టింది ఆ సంస్థ. ప్రస్తుతం దీని గురించి జగ్గీ పరిశోధనలు చేస్తున్నాడు. గాలిని కార్బన్ రహితం చేయాలి... ఇంధన ఉద్గారంగా వాతావరణంలోకి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ నుంచి కార్బన్ సంగ్రహించడానికి టెక్నికల్ డివైజ్‌లను తయారు చేయాలనేది జగ్గీ ఆలోచన. ఇది జరిగితే గాలిలోని కార్బన్‌డై ఆక్సైడ్(సీఓ2)లో కార్బన్ ఉద్గారాలు మాయమై కేవలం ఆక్సిజన్ మాత్రమే మిగులుతుంది! ఈ స్థాయి ఆలోచనలతో ముందుకు సాగుతున్నాడు జగ్గీ. మరి ఇదే సాధ్యం అయితే.. జగ్గీ పెద్ద శాస్త్రవేత్త అవుతాడు. అలాగే మానవుడికి ఉపయోగకరంగా ఉంటున్నప్పటికీ ఎక్కువ స్థాయి కాలుష్యానికి కారణమవుతున్న వస్తువులు, వాహనాల స్థానంలో కాలుష్య తీవ్రతను తగ్గించే ఇకో ఫ్రెండ్లీ ఉపకరణాలను తయారు చేయాలని జగ్గీ భావిస్తున్నాడు. ఈ విషయంలో ప్రపంచంలోని ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. తన ఆలోచనలతో అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలను ఆకట్టుకొంటున్నాడు పరమ్ జగ్గీ. ఫోర్బ్స మెచ్చుకుంది! కారు టైల్ పైప్ దగ్గర ఒక పరికరం అమర్చి కార్బన్‌డై ఆక్సైడ్‌ను ఆక్సిజన్ గా మార్చే పరికరాన్ని రూపొందించాడు. ఈ విషయంలో జగ్గీకి మంచి పేరు వచ్చింది. దీనిపై ఫోర్బ్స్ పత్రిక నుంచి మెచ్చుకోలును, అవార్డును పొందాడు జగ్గీ. ఇండో అమెరికన్ అయిన జగ్గీ అనేక అంతర్జాతీయ సైన్స్ఫెయిర్లలో పాల్గొని తన ఆవిష్కరణలతో ప్రశంసలు అందుకొన్నాడు. జగ్గీ థీసిస్‌లను అనేక యూనివర్సిటీ మ్యాగజీన్లు ప్రచురించాయి. వివిధ సంస్థల నుంచి అమేజింగ్ ఇన్వెంటర్, టాప్ హైస్కూల్ ఇన్వెంటర్ వంటి అవార్డులను అందుకొన్నాడు. -
గతమంతా శాస్త్రీయతే!
ద్వారకానగరాన్ని, శల్యుడికి, కృష్ణుడికి మధ్య జరిగిన యుద్ధాన్ని... మహాభారతం అభివర్ణిస్తుంది. అంతేకాదు, ఆకాశంలో ఎగిరే యంత్రాల నుంచి ఆయుధాలు, క్షిపణుల ప్రయోగం గురించి కూడా ప్రస్తావిస్తుంది. వాటివర్ణన అణ్వాయుధాలను, ఎగిరే పళ్లాలను పోలి ఉంటుంది. ఇటీవలి కాలం వరకు ఆధునిక చరిత్రకారులు ద్వారకను పుక్కిటి పురాణంగా కొట్టిపారేశారు. రామసేతు, మహాభారతం, సరస్వతీ నది... వంటి వాటిని కూడా పుక్కిటి పురాణాలుగా ముద్రవేశారు. గుజరాత్లో ద్వారకానగరం, పెద్దకోటలు, భారీ పునాదులు తవ్వకాలలో బయటపడ్డాయి. ‘వీటిని మానవమాత్రులు నిర్మించలేరు’ అంటూ అధికారులు పేర్కొనడాన్ని బట్టి ఆ నగరాన్ని... దేవతలలో ఒకరైన విశ్వకర్మ నిర్మించాడన్న వాదన నిజమేనని సూచిస్తోంది. అలాగే అవాస్తవికమైనదిగా భావించిన సరస్వతీ నది ఉనికి నిజమేనంటూ ‘నాసా’ ధృవీకరించడం... మన పురాణాలలో వర్ణించినట్టుగానే అనేకానేక ప్రదేశాల ఉనికి నిజమేనని రుజువయింది. ఈ ఆవిష్కరణలలో పాశ్చాత్య మేధావులైన శాస్త్రవేత్తలు, చరిత్రకారులు పాలు పంచుకుంటున్నారు. దేవుళ్లు, గంధర్వులు, యక్ష రాక్షసులు తదితరులంతా వివిధ డైమన్షన్స్ నుంచి వచ్చినవారేనని వైదికగ్రంథాలు పేర్కొంటున్నాయి. మానవజాతి మరొక డైమన్షన్ నుంచి వచ్చిందని, దేవుళ్లు దానిని పర్యవేక్షించారని ఆధునిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. అయితే ఈ వాస్తవాన్ని మెజారిటీ ప్రజల మనస్సుల నుంచి తుడిచివేయడం ఆసక్తికరమైన విషయం. ఆధునిక మానవుడు దేవుడే లేడని విశ్వసిస్తున్నాడు. తాను జీవించవలసిన పర్యావరణాన్ని, ప్రకృతిని స్వార్థం కోసం విధ్వంసం చేస్తూ ఈ భూమిపైన ఉన్న వనరులను దోచుకుంటున్నాడు. ఈ యుగంలో మానవుడు స్వార్థం, నిరీశ్వర వాదంతో తనతో సహా అన్నింటినీ విధ్వంసం చేస్తాడని పెద్దలు ఏనాడో స్పష్టంగా హెచ్చరించారు. ఈ వాస్తవాన్ని చూడగలిగినవారు, మానవ జాతిని కాపాడగలిగినవారు కొందరే వున్నారు. మహాభారతంలోని వనపర్వంలో మార్కండేయ మహర్షి కలియుగంలో జరగబోయే ఘట్టాలను స్పష్టంగా అభివర్ణించారు. వేదాలు మానవులకు ప్రవర్తనా నియమావళినే కాదు, దేవుళ్లతో సంభాషించేందుకు మార్గాలను (హవనాలు, మంత్రాలు) సూచించాయి. మనం ఈ డైమన్షన్‌లో పరిపూర్ణంగా జీవించామని భావించినప్పుడు తిరిగి మన ఇంటికి మనం వెళ్లేందుకు మార్గాన్ని కూడా వేదాలు సూచించాయి. వైదిక గురువుల మాటలలోని ప్రామాణికతను, విశ్వసనీయతను ఆధునిక శాస్త్రం నెమ్మదిగా ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో, వేల ఏళ్ల కిందటే గ్రంథస్థం చేసిన శాస్త్రీయ వాస్తవాలను కనుగొని, వేదాలు చెప్పింది వాస్తవమే తప్ప పుక్కిటిపురాణం కాదనే అభిప్రాయానికి వస్తున్నారు. ఏది ఏమైనా... మహాప్రళయానికి కారణ భూతమైన విషయం మాత్రం, ఆధునిక మానవుడికి శాశ్వతంగా అంతుచిక్కని ప్రశ్నగానే మిగులుతుంది.