ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు కూడా అంజలిని గుర్తించాయి. తమ సేవాకార్యక్రమాల ప్రచారం కోసం అంజలి చేత బొమ్మలను గీయించుకొంటున్నాయి.
చెన్నై నుంగమ్‌బాకంలోని పద్మాశేషాద్రి బాలభవన్ సీనియర్ సెకెండరీ స్కూల్‌లో కామర్స్ స్టూడెంట్ అంజలి చంద్రశేఖర్. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌తో తరచూ సమావేశం అవుతూ ఉంటుంది. ఆలోచనలను పంచుకుంటుంది. ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు, అంజలి చెప్పే విషయాలను ఆసక్తితో వింటారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’కు ప్రత్యేక అతిథిగా హాజరవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రతిభావంతులు ఉన్నా... అంజలికే ఈ అవకాశం దక్కిందంటే దానికి కారణం తన ప్రతిభను సేవాదృక్పథం వైపు మళ్లించిన తీరు.
‘ఒక చిత్రం వందల పదాల భావాన్ని వ్యక్తపరుస్తుంది’ అనే మాటే తనకు స్ఫూర్తి అంటుంది అంజలి. తన కుంచెతో వేల భావాలను పలికించడమే కాదు, కోట్లమంది ప్రజల్లో కదలికను తీసుకువస్తోంది. అంజలి వాళ్ల అవ్వ శాంతలక్ష్మి వికలాంగులైన పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాల నడిపేది. అక్కడి నుంచే ఆమెకు సేవాదృక్పథం అలవడింది. తనలోని కళను సేవా ఉద్యమానికి అంకితమిచ్చింది.
మొదట్లో సేవాకార్యక్రమాల కోసం ఫండ్స్‌ను కలెక్ట్ చేసే వారికి మంచి మంచి బొమ్మలను గీసి ఇచ్చేది. అప్పుడే ‘ఆర్ట్ ఈజ్ యాన్ యాక్టివిజమ్’ అని భావించానని అంజలి అంటుంది. అలా మొదలైన అంజలి ప్రస్థానం క్రమంగా విస్తరించింది. ఒక సందర్భంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్లు తమ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి ఐడియాస్ ఇవ్వమని ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రపంచవ్యాప్తంగా అనేకమంది చిత్రాల రూపంలో ఐడియాలను పంపించారు. వాటిలో బెస్ట్ 15లో నిలిచింది అంజలి చంద్రశేఖర్. దాంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో భాగస్వాములు అయిన ప్రముఖులతో అంజలికి పరిచయం ఏర్పడింది. మానవాళి అభివృద్ధి కోసం ఫోరమ్ రూపొందించిన కార్యక్రమాల ప్రచారం కోసం అంజలి చేతే ఆర్టిస్టిక్ వర్క్‌ను చేయించారు. వారితో ఆలోచనలను పంచుకొని ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసింది.
ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు కూడా అంజలిని గుర్తించాయి. తమ సేవాకార్యక్రమాల ప్రచారం కోసం అంజలి చేత బొమ్మలను గీయించుకొంటున్నాయి. ఆర్ట్ ఈజ్ యాన్ యూనివర్సల్ లాంగ్వేజ్ అన్నట్టుగా ప్రస్తుతం అంజలి గీసిన చిత్రాలు 177 దేశాల ప్రజల్లో అవగాహనను నింపుతున్నాయి. కేవలం సేవారూపంలోనే కాకుండా సొంతంగా వ్యాపారవేత్తగా ఎదిగే ప్రయత్నాలు కూడా చేస్తోంది అంజలి. టీషర్ట్స్, మగ్స్, ట్రేస్, వాటర్‌బాటిల్స్, క్యాలెండర్స్, గ్రీటింగ్ కార్డ్స్ పై ఆర్ట్‌లను గీస్తూ ఒక వెంచర్‌ను ప్రారంభించింది.
ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు కూడా అంజలిని గుర్తించాయి
Published Sun, Jan 5 2014 11:43 PM | Last Updated on Thu, May 24 2018 1:33 PM
Advertisement
Advertisement