ఒక ఎన్‌ఆర్‌ఐ కుటుంబానికి చెందిన అమ్మాయి. పుట్టిందీ, పెరిగింది అమెరికాలో. ఒకసారి సెలవుల్లో తొలిసారి భారతదేశానికి వచ్చింది. సహజంగానే ఇక్కడివారి జీవనశైలిని చూసి చాలా ఆశ్చర్య పోయింది. ప్రత్యేకించి భారతీయులు ప్యూరిఫై చేయని నీళ్లను తాగుతున్నారనే విషయం ఆమెలో ఆందోళన రేపింది. ఆ ఆందోళనే ఓ కొత్త ఆవిష్కరణకు దారి తీసింది. అదే ఆమెకు ‘యంగెస్ట్ సైంటిస్ట్’ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆమె పేరు దీపికా కురుప్. అమెరికాలో సెటిలైన మలయాళీ కుటుంబానికి చెందిన దీపిక అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోని పేదలకు ఒక బహుమతిని ఇచ్చింది. అదేంటంటే...
సైన్స్‌ను చదువుకొని అర్థం చేసుకోవడ ఒక ఎత్తయితే సమాజాన్ని ఇబ్బంది పెడుతున్న సమస్యల పరిష్కారానికి దాన్ని అన్వయించుకొని కొత్త ఆవిష్కరణలు చేయడం మరో ఎత్తు. శాస్త్రవేత్తల గురించి అందరూ చదువుకొంటారు. కానీ తామే శాస్త్రవేత్తలమవాలన్న తపన కొందరు టీనేజర్లలోనే ఉంటుంది. అలాంటి తపనే తనను నూతనావిష్కరణలు చేసే స్ఫూర్తిని జనింపజేసిందని చెబుతుంది దీపిక. ఎక్కడో అమెరికాలోని హైస్కూల్‌లో చదువుతూ భారతదేశంలోని సామాజిక పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యాన్ని పెట్టుకొంది ఈ పదహారేళ్ల అమ్మాయి. దీపిక తల్లిదండ్రులది తిరువనంతపురం. వారు చాలా సంవత్సరాల కిందటే అమెరికాకు వెళ్లారు. దీపిక అక్కడే పుట్టి పెరిగింది.
అమెరికాలోని లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిపోయిన ఈ అమ్మాయి పన్నెండేళ్ల వయసులో తొలిసారి ఇండియాకు వచ్చింది. ఇక్కడ తన ఈడు పిల్లలంతా కలుషిత నీరు తాగుతుండటాన్ని గమనించింది. పల్లెల్లో చెరువుల నుంచి, బావుల నుంచి తెచ్చుకొన్న నీళ్లను అలాగే సేవిస్తారని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. అది చాలా ప్రమాదకరమని, రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారికి తెలియజెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆ విషయం గురించి అవగాహన ఉన్నా తమకు అంతకు మంచి, మరో ప్రత్యామ్నాయం లేదని స్థానికులు దీపికకు తెలియజెప్పారు.
అటువంటి నేపథ్యంలో వారి పరిస్థితిలో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం చేయాలనుకొంది. అయితే ఇక్కడి ప్రజలందరికీ వాటర్ ప్యూరిఫయర్‌లు కొనివ్వడం తనకు సాధ్యం కాదు, సొంతంగా కొనుక్కోవడానికి వారి శక్తీ చాలదు. మరి చౌకధరలో వాటర్ ప్యూరిఫయర్‌లు అందుబాటులోకి తీసుకొస్తే... అవి కూడా కరెంట్, గ్యాస్‌ల వంటి ఇంధనాల అవసరం లేకుండా సహజంగానే పనిచేస్తే... అప్పుడు సమస్య చాలా వరకూ పరిష్కృతం అయినట్టేనని దీపిక భావించింది. ఇదే ఐడియాతో ఆమె ‘సోలార్ వాటర్ ప్యూరిఫయర్’ను రూపొందించింది.
ప్రయత్నం ప్రశంసలు పొందింది...
సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా వాటర్ ప్యూరిఫయర్‌కు రూపకల్పన చేసిన దీపికకు ‘డిస్కవరీ ఎడ్యుకేషన్ త్రీఎమ్ యంగ్‌సైంటిస్ట్’ పోటీలు లాంచింగ్ ప్యాడ్‌గా నిలిచాయి. అనేకమంది యువతీయువకులు తమ సైంటిఫిక్ ఐడియాతో ఆ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు. వారందరి మధ్య దీపిక ఆవిష్కరణ భిన్నమైనదిగా నిలిచింది. ప్రత్యేకించి పేదప్రజలకు ప్యూరిఫైడ్ వాటర్ అందించాలనే ఆలోచనతో దీపిక చేసిన సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్ తోబాటు ఆమె చేసిన ఆవిష్కరణ కూడా విజయవంతం కావడంతో ‘అమెరికన్ యంగ్ సైంటిస్ట్’ అవార్డు దక్కింది.
ప్రైజ్‌మనీనే పెట్టుబడిగా...
దీపికకు రెండు రకాలుగా మంచి గుర్తింపు లభించింది. ఒకటి ఆవిష్కరణ ద్వారానైతే, రెండోది గ్రామీణ భారతంలోని నీటి సమస్య గురించి పరిశీలన చేసి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం ద్వారా. ఈ ఆవిష్కరణ విషయంలో ఆమెకు అనేక బహుమతులు వచ్చాయి. వేల డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. ఆ సొమ్మునే సోలార్‌వాటర్ ప్యూరిఫయర్‌ల రూపకల్పనకు పెట్టుబడిగా చేసుకోవాలని దీపిక భావిస్తోంది. ఈ విషయంలో పరిశ్రమల నుంచి కూడా ఆమెకు సహకారం లభిస్తోంది. దీంతో త్వరలోనే దీపిక రూపొందించిన సోలార్ వాటర్ ప్యూరిఫయర్‌లు మార్కెట్‌లో సందడి చేసే అవకాశం ఉంది.
దీపికకు రెండు రకాలుగా మంచి గుర్తింపు లభించింది. ఒకటి ఆవిష్కరణ ద్వారానైతే, రెండోది గ్రామీణ భారతంలోని నీటి సమస్య గురించి పరిశీలన చేసి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం ద్వారా. ఈ ఆవిష్కరణ విషయంలో ఆమెకు అనేక బహుమతులు వచ్చాయి. వేల డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది.
మన దీపిక... యంగెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ అమెరికా
Published Thu, Jan 2 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement
Advertisement