‘‘శారీరక వైకల్యం మనిషి సామర్థ్యానికి అడ్డు అవుతుందని చాలా మంది చెబుతుంటారు. అయితే మన సామర్థ్యం మీద మనకు నమ్మకం ఉంటే ఏ వైకల్యం, ఎలాంటి పరిస్థితులూ మన విజయానికి అడ్డుకాబోవు...’’ అంటున్నాడు కార్తీక్ స్వహ్నే. ఇది ఎవరిలోనో స్ఫూర్తిని నింపడానికి చెబుతున్న మాట కాదు. ఇంకెవరిలోనో ఉద్వేగాన్ని రగల్చడానికి చెబుతున్న మాట అంతకన్నా కాదు. తాను మనస్ఫూర్తిగా నమ్మి, ఆచరించి విజయం సాధించి చెబుతున్న మాట. పుట్టుకతో చూపులేక పోయినా వైకల్యాన్ని, వైకల్యం వల్ల తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొని సాధించిన విజయం అభినందనీయం.
శారీరక వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం బస్సులో సీట్లు రిజర్వ్ చేసి ఉంటాయి, వారికి సహాయం చేయడానికి చాలామంది ముందుకొస్తారు, కనీసం కొందరైనా వారిమీద జాలి చూపిస్తారు, ప్రభుత్వం కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఇచ్చింది. అయితే కార్తీక్‌కు మాత్రం అవేవీ ఉపయోగపడలేదు! ‘‘నాకు చదివే సామర్థ్యం ఉంది, నేను చదువుకొంటాను... కనీసం పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వండి...’’ అని అభ్యర్థించాడు. కానీ ఈ అంధ విద్యార్థిని పరీక్ష రాయడానికి కూడా అనుమతించలేదు నియమనిబంధనలు. సీబీఎస్‌ఈ సిలబస్‌లో 96 శాతం మార్కులతో ప్లస్‌టూ పూర్తి చేసిన కార్తీక్‌కు ఐఐటీలో ఇంజినీరింగ్ చదవాలనేది కల. అయితే పూర్తిస్థాయి అంధ విద్యార్థులకు ఐఐటీలో ప్రవేశం లేదు అంటున్నాయి నిబంధనలు. వికలాంగ కోటా ఉన్నప్పటికీ వందశాతం అంధుడైన వ్యక్తికి ఐఐటీ చదువులకు అవకాశం లేదని నిబంధనల్లో స్పష్టంగా ఉండడంతో తన పర్సెంటేజీని చూసి, కనీసం ఇదివరకు చదువుకొన్న విధానాన్ని గమనించి అయినా తనకో అవకాశం ఇవ్వాల్సిందిగా కార్తీక్ ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీలకు విజ్ఞాపన లేఖలు రాశాడు. అయితే ఆ విద్యాలయాల నుంచి స్పందన లేదు.
ఎంట్రన్స్‌కే అవకాశం రాలేదు!
ఎంట్రన్స్ రాసి సీటు రాలేదంటే ఏదో విధంగా ఊరట పొందవచ్చు, కానీ ఎంట్రన్స్ రాయడానికే అవకాశం లభించలేదంటే... అది ఎంత బాధో చదువుకొనే వారికి బాగా తెలుస్తుంది. ప్లస్ టూ పూర్తి అయ్యాక.. రెండు సంవత్సరాల పాటు వేచి ఉన్నాడు, ఐఐటీల నుంచి అనుమతి లభిస్తుందేమోనని ఆశించాడు. కానీ నిరాశే మిగిలింది. అయితే ఈ బాధతో కార్తీక్ కృశించి పోలేదు.
స్టాన్‌ఫోర్డ్‌లో సీటొచ్చింది!
కార్తీక్ పరిస్థితి గురించి తెలుసుకొన్న ఒక ఎన్జీవో చేయూతను ఇచ్చింది. ఐఐటీలో అవకాశం లేదని స్పష్టత వచ్చాక అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివించడానికి రంగం సిద్ధం చేశారు. కార్తీక్ ప్రతిభ గురించి యూనివర్సిటీ వారికి వివరించి, అతడికి సైన్స్, కంప్యూటర్స్ మీదున్న పట్టు గురించి ప్రాజెక్ట్ రూపంలో తెలియజెప్పి ఆ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సీట్‌ను కేటాయించాల్సిందిగా కోరారు. కార్తీక్ చదువుకొన్న పరిస్థితుల గురించి తెలుసుకొన్న ఆ అమెరికన్ వర్సిటీ వారు అతడి ప్రాజెక్ట్‌ను పరిశీలించి ఐదేళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్‌ను చదవడానికి అవకాశం ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పూర్తిస్థాయిలో స్కాలర్‌షిప్‌ను మంజూరుచేశారు. ఈ యేడాదే కార్తీక్‌కు స్టాన్‌ఫోర్డ్ లో ప్రవేశం దక్కింది. ఇప్పుడు కార్తీక్ చాలా హ్యాపీగా ఉన్నాడు. తను అనుకొన్న విద్యను అభ్యసిస్తూ స్ఫూర్తిమంతుడిగా మారాడు.
వైకల్యం ఉందని చెప్పి చదువుకోవడానికి అవకాశం లభించని సమయంలో నిస్పృహతో కూరుకుపోక, వెనక్కు తగ్గక తన లక్ష్యం కోసం ప్రయత్నాలు చేసిన కార్తీక్‌కు ఆఖరికి ఉత్తమమైన ఫలితం దక్కింది. అనుకొన్న లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంతటి నిరాశ ఎదురైనా వెనక్కు దక్కక కృషి చేస్తే అంతిమంగా విజయం సొంతం అవుతుందని కార్తీక్ సక్సెస్ స్టోరీని బట్టి అర్థం చేసుకోవచ్చు!
ఐఐటీ వద్దంది... స్టాన్‌ఫోర్డ్ రమ్మంది!
Published Fri, Dec 20 2013 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement