శ్రీనగర్/బంగారుపాళ్యం: జమ్మూకశ్మీర్‌లోని సొపోర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జలూర గుజ్జర్పటి ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని జవాన్లు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పంగల కార్తీక్(32) అనే జవాను బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. వైద్యం కోసం తరలిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారని అధికారులు సోమవారం తెలిపారు.
ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు ముష్కరుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నాయన్నారు. కార్తీక్ వీరమరణంపై శ్రీనగర్ కేంద్రంగా పనిచేసే ఆర్మీ విభాగం చినార్ కార్ప్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన కార్తీక్ యొక్క అత్యున్నత త్యాగానికి చినార్ కార్ప్స్ సెల్యూట్ చేస్తోంది చినార్ వారియర్స్ కార్తీక్ అపారమైన పరాక్రమానికి, త్యాగానికి వందనం చేస్తోంది.
ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతోంది. వారికి సంఘీభావంగా నిలుస్తుంది’అని ‘ఎక్స్’లో తెలిపింది. కాగా, కార్తీక్‌ది ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువరాగిమాను పెంట గ్రామం. వరద మందడి, సెల్వి దంపతుల రెండో కుమారుడైన కార్తీక్ పదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ఈయన చనిపోయిన విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రాత్రికల్లా మృతదేహం గ్రామానికి రావచ్చని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment