సాక్షి, ఢిల్లీ: ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలైన ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించారు.
1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో పేరు తెచ్చిపెట్టిన యామినీ కృష్ణమూర్తి.. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాటపాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
ఈమె తండి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. తాత ఉర్దూ కవి. వారి కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని.. 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలిచ్చి దేశ, విదేశాల్లో ఖ్యాతి సంపాదించారు. ‘ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్’ పేరుతో పుస్తకం రచించారు. ఢిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ స్థాపించి నృత్యంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment