Yamini Krishnamurthy
-
ఆగిన సిరిమువ్వల సవ్వడి..యామినీ కృష్ణమూర్తి శివైక్యం
సాక్షి, న్యూఢిల్లీ/మదనపల్లె/అమరావతి: ప్రముఖ భరతనాట్య, కూచిపూడి, ఒడిస్సీ నృత్య కళాకారిణి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఏడు నెలలుగా బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థి వదేహాన్ని ఢిల్లీ గ్రీన్‌పార్క్‌లోని డి–బ్లాక్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు గ్రీన్‌పార్క్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు. చాలా ఏళ్లుగా ఢిల్లీలోనే ఉంటూ ప్రదర్శనలు ఇస్తున్న కృష్ణమూర్తి ఈ ఏడాది జనవరిలో వయోభార సంబంధిత సమస్యలతో అపోలో ఆస్పత్రిలో చేరారు. అప్పట్నుంచి ఆస్పత్రి ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. 17వ ఏట తొలి ప్రదర్శన యామిని పూర్తిపేరు యామినీ కృష్ణమూర్తి పూర్ణతిలకం. చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబర్ 20న ముంగర కృష్ణమూర్తి, లక్ష్మి దంపతులకు జన్మించారు. తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితులు. నృత్యంపై ఉన్న మమకారంతో మదనపల్లెలోని ఓ డ్యాన్స్ మాస్టర్ వద్ద చిన్న వయసులోనే నాట్యం నేర్చుకొనేందుకు యామిని వెళ్లారు. ఆ తర్వాత కొంతకాలానికి తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడ్డారు.తన తండ్రి ప్రోత్సాహంతో 5వ ఏట చెన్నైలోని రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు. అనంతరం కూచిపూడి, ఒడిస్సీ కూడా అభ్యసించారు. ఎండీ రామనాథన్ వద్ద కర్ణాటక సంగీతం, కల్పక్కం స్వామినాథన్ దగ్గర వీణ నేర్చుకున్నారు. యామిని తన తొలి ప్రదర్శనను తన 17వ ఏట 1957లో చెన్నైలో ఇచ్చారు. ఖండాంతరాలను దాటిన ప్రతిభ యామిని భరతనాట్య ప్రతిభ ఖండాతరాలను దాటింది. 17 ఏళ్ల వయసులో తొలిసారి ఆస్ట్రేలియాలో భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత అమెరికా, యూరొప్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఇండోనేసియా, థాయ్‌ల్యాండ్, సింగపూర్, మయన్మార్ వంటి దేశాల్లో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో మంత్రముగ్ధుల్ని చేశారు. ఢిల్లీలో నృత్య కౌస్తుభ కల్చరల్ సొసైటీ యామినీ స్కూల్ ఆఫ్ డాన్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి యువతకు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ ఇస్తున్నారు. 2014లో మహిళా దినోత్సవం సందర్భంగా శాంభవి స్కూల్ ఆఫ్ డాన్స్ సంస్థ యామినికి నాట్య శాస్త్ర పురస్కారాన్ని అందించింది. ఢిల్లీలోని ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యూజిక్ అండ్ డాన్స్ అనే సంస్థకు డైరెక్టర్‌గా ఆమె కొన్నేళ్లు సేవలందించారు. ‘డకోటా’ ఫ్లైట్‌లో పాకిస్తాన్‌కు.. యామినీ కృష్ణమూర్తి నాట్యం గురించి తెలుసుకున్న పాకిస్తాన్ దేశస్తులు.. అక్కడ ప్రదర్శన నిమిత్తం ఆహ్వానించారు. దీంతో 1970లో ఆమె లాహోర్‌లో ప్రదర్శన ఇచ్చారు. ఆ సమయంలో భారత్ నుంచి ‘డకోటా’ ఫ్లైట్‌లో అతికష్టం మీద పాక్‌కు వెళ్లాల్సి వచ్చి ందని పలు సందర్భాల్లో ఆమె ప్రస్తావించారు. భరతనాట్యం, కూచిపూడి నాట్యప్రదర్శలను చూసిన పాకిస్థానీలు మంత్రముగ్థులై పలుమార్లు ఆమెను ఆహ్వానించడం విశేషం. ప్రముఖ సేవామూర్తి మదర్ థెరెసా చేతుల మీదుగా యామిని జ్ఞాపికను అందుకోవడం విశేషం. వివాహం చేసుకోకుండా.. నాట్య రంగానికే జీవితాన్ని అంకితం చేసిన యామిని వివాహం చేసుకోలేదు. తన నృత్య జీవిత విశేషాలను, నృత్యం నేర్చుకొనే క్రమంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, నేర్పించిన గురువుల వివరాలతో ‘ఎ ప్యాషన్ ఫర్ డ్యాన్స్’ పేరుతో పుస్తకం రచించారు. అనేక అవార్డులు ఆమె సొంతంయామినీ కృష్ణమూర్తి దేశ, విదేశాల్లో కూచిపూడి నృత్యానికి ఎంతో పేరు, ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు. కర్ణాటక సంగీతం నేర్చుకున్న యామిని.. పాటపాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు. భరతనాట్యంలో యామిని ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. టీటీడీ ఆస్థాన నర్తకిగానూ యామిని కొనసాగారు.భాగ్యనగరంతో అనుబంధం సాక్షి, హైదరాబాద్: యామినీ కృష్ణమూర్తికి హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. సౌత్ ఇండియా కల్చరల్ అసోసియేషన్, కళాసాగర్ వంటి సంస్థలు ఏర్పాటు చేసిన అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె దశావతారం, కృష్ణ శబ్దం తదితర ప్రదర్శనలిచ్చి ప్రేక్షక లోకాన్ని మైమరిపించారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఆమె నృత్య ప్రదర్శన హైదరాబాద్ కళాప్రియులకు సుపరిచితం. తెలుగు విశ్వవిద్యాలయం ఆమెను సిద్ధేంద్రయోగి పురస్కారంతో గౌరవించింది. 2012లో హైదరాబాద్ రవీంద్రభారతిలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాల్లో ప్రదర్శనలిచ్చారు. -
యామినీ కృష్ణమూర్తి మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, గుంటూరు: ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో యామినీ కృష్ణమూర్తి తనదైన శైలిలో అద్భుత ప్రతిభను చూపారని పేర్కొన్నారు. ‘‘యామినీ కృష్ణమూర్తి శాస్త్రీయ నృత్యంలోనూ చెరగని ముద్ర వేశారు. ఆమె మరణం శాస్త్రీయ నృత్య రంగంలో తీరని లోటన్నారు. యామినీ కృష్ణమూర్తి తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి’’ అని వైఎస్ జగన్ అన్నారు.I’m deeply saddened to hear of the demise of Yamini Krishnamurthy garu, the celebrated exponent of Kuchipudi and Bharatanatyam. My thoughts and prayers are with her family in these difficult times. pic.twitter.com/iACVLeZrMk— YS Jagan Mohan Reddy (@ysjagan) August 3, 2024గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న యామినీ కృష్ణమూర్తి.. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలైన ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించారు.యామినీని 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో పేరు తెచ్చిపెట్టిన యామినీ కృష్ణమూర్తి.. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాటపాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. -
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
సాక్షి, ఢిల్లీ: ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలైన ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించారు. 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో పేరు తెచ్చిపెట్టిన యామినీ కృష్ణమూర్తి.. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాటపాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.ఈమె తండి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. తాత ఉర్దూ కవి. వారి కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని.. 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలిచ్చి దేశ, విదేశాల్లో ఖ్యాతి సంపాదించారు. ‘ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్’ పేరుతో పుస్తకం రచించారు. ఢిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ స్థాపించి నృత్యంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. -
వెండితెరకు యామిని జీవితం
ప్రముఖ నాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి జీవితం వెండితెరకు రానుంది. ‘దివ్యమణి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘విశ్వనాథ్, డైరెక్టర్ లక్ష్మీ దీపక్, కెమెరామెన్ సత్తిబాబు గార్లవద్ద పని నేర్చుకున్నా. ఫొటోగ్రఫీ, మ్యూజిక్, వీఎఫ్ఎక్స్లపై మంచి పట్టు ఉంది. చాలా యాడ్స్ చేశా. నా తొలి చిత్రం ‘దివ్యమణి’. రెండవ చిత్రంగా పద్మశ్రీ యామిని కృష్ణమూర్తిగారి బయోపిక్ తెరకెక్కించనున్నా. నేటి తరానికి ఆమె ఎంతో స్ఫూర్తి. కూచిపూడి, భరతనాట్యంతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారామె. చిన్న వయసులోనే పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మభూషణ్ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. అలాంటి యామినిగారి జీవిత కథను అందరికీ తెలియజేయాలనే ఆలోచనతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. ఈ బయోపిక్కు యామినిగారే కొరియోగ్రఫీ అందించనుండటం విశేషం. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించనున్నాం. త్వరలోనే ఈ బయోపిక్ పూర్తి వివరాలు తెలియచేస్తా’’ అన్నారు. -
వెండితెరకు యామిని కృష్ణమూర్తి జీవితం
ప్రముఖ యోగా గురువు, మార్షల్ ఆర్టిస్ట్ సురేష్ కమల్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘దివ్య మణి’. వైశాలి, కిమయా కథానాయికలు. మోహ్ మాయా ఎంటర్టైన్మెంట్స్, రెడ్ నోడ్ మీడియా పతాకంపై గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. గిరిధర్ గోపాల్–స్టీవ్ శ్రీధర్ స్వరపరచిన ఈ సినిమా పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. లెజెండరీ డ్యాన్సర్, పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డ్‌ల గ్రహీత డా. యామిని కృష్ణమూర్తి పాటల సీడీలను విడుదల చేసారు. సురేష్ కమల్ మాట్లాడుతూ – ‘‘నటుడిగా ఇది నా తొలి చిత్రం. యోగా నేర్పటం కోసం నేను ప్రపంచమంతా తిరిగినా తెలుగు నేలంటే చాలా ఇష్టం. గిరిధర్ గారు మంచి కథ చెప్పారు. ఈ చిత్రంలో డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేశా. ఈ సినిమా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘మనిషి తనని తాను జాగృతి పరచుకోవటానికి సృజనాత్మకత ఎంతో అవసరం. పాటలు బాగున్నాయంటున్నారు. సినిమా కూడా అందరినీ అలరిస్తుంది. ఈ సినిమా తర్వాత యామిని కృష్ణమూర్తిగారి బయోపిక్ తీస్తాం’’ అన్నారు గిరిధర్ గోపాల్. ఫైట్‌మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటుడు సాయికుమార్, మాటల రచయిత బలభద్రపాత్రుని రమణి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజేష్ కాటా, నేపథ్య సంగీతం: స్టీవ్ శ్రీధర్, సునీల్ కశ్యప్. -
నటరాజ పున్నమి
యామిని యామిని కృష్ణమూర్తి (76) నాట్యకళాకారిణి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో.. నిండు పున్నమినాడు జన్మించిన యామిని తమిళనాడులోని చిదంబరంలో పెరిగారు. అక్కడే నాట్య విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఢిల్లీలోని ‘యామినీ స్కూల్ ఆఫ్ డాన్స్’ నాట్యాచార్యురాలిగా బోధనాంశాలలో నిమగ్నమై వున్నారు. యామిని అసలు పేరు పూర్ణతిలక. నాట్యంలో అనేక అవార్డులు గెలుచుకున్నారు. పద్మవిభూషన్ గ్రహీత కూడా. ఇటీవల ‘నటరాజ డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ’ వారి జీవిత సాఫల్య పురస్కారం అందుకోడానికి విజయవాడ వచ్చిన సందర్భంగా సాక్షి ఫ్యామిలీ.. యామినితో ముచ్చటించింది. ఆ విశేషాలు: యామిని తండ్రి కృష్ణమూర్తి కూతుర్ని కూడా తనలా పండితురాలిని చేయాలనుకున్నారు. అనుకోవడమే కాదు చేశారు. అందుకోసం రెండు ఇళ్లు, కొంత పొలం కూడా అమ్మేశారు. ‘‘మా నాన్నగారికి నన్ను విద్వాంసురాలిని చేయాలని బలమైన కోరిక ఉండేది. నేనా అస్సలు కుదురులేని అమ్మాయిని. ఎప్పుడు చూసినా చెట్లు ఎక్కడం, గోడలు దూకడం... ఒక్క క్షణం కూడా కదలకుండా కూర్చునేదాన్ని కాదు. నాలో నాన్నగారికి ఏమి కనిపించిందో కాని, నా ఏడవ ఏటే భరతనాట్యం నేర్పించడం ప్రారంభించారు. పది సంవత్సరాల వయసు వచ్చేసరికి నాట్యంలో నైపుణ్యం సాధించాను’’ అని తన నాట్య ప్రస్థాన గురించి చెప్పడ మొదలుపెట్టారు యామినీ. తండ్రి ఆమెను మొదట చెన్నైలోని రుక్మిణీ అరండేళ్ కళాక్షేత్రకు తీసుకువెళ్లారు. యామిని నాట్యానికి ముగ్ధులయిన రుక్మిణీ అరండేళ్, ఆమెకు తన దగ్గరే నాట్య శిక్షణ ప్రాంభించారు. పండుగలన్నీ నాట్య వేదిక మీదే! భరతనాట్యం నేర్చుకునే సందర్భంలోనే కూచిపూడి నాట్యం వైపు యామిని మనసు మళ్లింది. ఆ తర్వాత కూచిపూడి వైభవానికి ఆమె పాటుపడ్డారు. అది చాలా చిత్రంగా జరిగింది.తర్వాత ప్రముఖ ఒడిస్సీ ఆచార్యులు కేలూచరణ్ మహాపాత్ర దగ్గర ఆమె ఒడిస్సీ నృత్యం అభ్యసించారు. ‘‘నేను మూడు గంటల పాటు చేసే నా నాట్యప్రదర్శనలో కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ... ఒక్కోటి గంట సేపు ప్రదర్శించేదాన్ని. మరొక విషయం చెప్పాలి. నాకు పండుగలన్నీ నాట్యవేదిక మీదే జరిగేవి. ప్రతి పండుగ సందర్భంలో నిర్వహించే వేడుకలలో నా నాట్యం తప్పనిసరిగా ఉండటమే ఇందుకు కారణం’’ అని చెప్పారు యామిని. ఆలయాలు తొలి నాట్యాలయాలు యామినీ కృష్ణమూర్తి ఇల్లు, చెన్నైలోని చిదంబర నటరాజ దేవాలయానికి చాలా దగ్గర కావడంతో, దేవాలయ కుడ్యాల మీద కొలువుతీరిన శిల్పాల భంగిమలు ఆమె మీద చెరగని ముద్ర వేశాయి. ‘‘రోజూ గుడికి వెళ్లేదాన్ని. ఆ శిల్పాలు చూసి ఇంటికి వచ్చాక, అదే భంగిమలో నిలబడేదాన్ని. నేను నాట్యభంగిమలు, ముద్రలు అందంగా పెట్టడానికి ఇది ఒక కారణం అయి ఉంటుంది’’ అంటూ వివరించారు యామిని. – డా. పురాణపండ వైజయంతి, సాక్షి, విజయవాడ ‘యామిని ఉందా?’ ►ఇందిరాగాంధీకి నేనంటే చాలా ఇష్టం. ఢిల్లీలో ఏ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నా, ఏ పండుగ సంబరాలు ఉన్నా వెంటనే ‘‘యామిని ఉందా’’ అని అడిగేవారు. ∙నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో ‘క్షీరసాగరమథనం’ నృత్యరూపకం ప్రదర్శించడం ఒక మధురానుభూతి. ►కలకత్తా ప్రజలను చూస్తే ‘ఆర్ట్ ఈజ్ ఇన్ దెయిర్ హార్ట్స్’ అనిపిస్తుంది. ►నేను లోన్లీ పర్సన్ కాను, ఎలోన్‌గా ఉంటాను, డిలైటెడ్‌గా ఉన్నాను. ∙విమర్శించాలనుకునేవారు... సూర్యుడు ఉదయం తూర్పున ఉదయిస్తాడు, సాయంత్రానికి పడమట అస్తమిస్తాడు అని – సూర్యుడిని కూడా విమర్శిస్తారు. బందిపోట్ల కోసం నాట్యం! ఒకప్పుడు నాట్యానికి వెళ్లడమంటే దేవాలయానికి వెళ్తున్నట్లు భావించేవారు. ఇప్పుడంతా మారిపోయింది. నేను నాట్యం కోసమే పుట్టాను. నా జీవితాన్ని నాట్యానికే అంకితం చేశాను. వివాహానికి దూరంగా ఉన్నాను. మధ్యప్రదేశ్‌లో బందిపోట్ల దగ్గర సైతం రెండు సార్లు ప్రదర్శన ఇచ్చాను. నాన్నగారు భయపడొద్దని చెప్పారు. వారు నా నాట్యం మెచ్చుకోవడమే కాదు, నన్ను బిజిలీ అన్నారు. నాట్యం నేర్పింది ‘రైతు బిడ్డ’ వేదాంతం రాఘవయ్య గారి ‘రైతు బిడ్డ’ సినిమా చూశాక నాకు నాట్యం నేర్పించాలనే కోరిక కలిగిందట నాన్నగారికి. అప్పటికే వెంపటి పెద సత్యం, చిన సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి వీరంతా సినిమాలకి వెళ్లిపోయారు. వేదాంతం లక్ష్మీనారాయణ గారి దగ్గర నా కూచిపూడి నాట్యం ఆరంభమైంది.