
గిరిధర్ గోపాల్
ప్రముఖ నాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి జీవితం వెండితెరకు రానుంది. ‘దివ్యమణి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘విశ్వనాథ్, డైరెక్టర్ లక్ష్మీ దీపక్, కెమెరామెన్ సత్తిబాబు గార్లవద్ద పని నేర్చుకున్నా. ఫొటోగ్రఫీ, మ్యూజిక్, వీఎఫ్‌ఎక్స్‌లపై మంచి పట్టు ఉంది. చాలా యాడ్స్ చేశా. నా తొలి చిత్రం ‘దివ్యమణి’. రెండవ చిత్రంగా పద్మశ్రీ యామిని కృష్ణమూర్తిగారి బయోపిక్ తెరకెక్కించనున్నా.
నేటి తరానికి ఆమె ఎంతో స్ఫూర్తి. కూచిపూడి, భరతనాట్యంతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారామె. చిన్న వయసులోనే పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మభూషణ్ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. అలాంటి యామినిగారి జీవిత కథను అందరికీ తెలియజేయాలనే ఆలోచనతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. ఈ బయోపిక్‌కు యామినిగారే కొరియోగ్రఫీ అందించనుండటం విశేషం. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించనున్నాం. త్వరలోనే ఈ బయోపిక్ పూర్తి వివరాలు తెలియచేస్తా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment