Giridhar gopal
-
వెండితెరకు యామిని జీవితం
ప్రముఖ నాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి జీవితం వెండితెరకు రానుంది. ‘దివ్యమణి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘విశ్వనాథ్, డైరెక్టర్ లక్ష్మీ దీపక్, కెమెరామెన్ సత్తిబాబు గార్లవద్ద పని నేర్చుకున్నా. ఫొటోగ్రఫీ, మ్యూజిక్, వీఎఫ్ఎక్స్లపై మంచి పట్టు ఉంది. చాలా యాడ్స్ చేశా. నా తొలి చిత్రం ‘దివ్యమణి’. రెండవ చిత్రంగా పద్మశ్రీ యామిని కృష్ణమూర్తిగారి బయోపిక్ తెరకెక్కించనున్నా. నేటి తరానికి ఆమె ఎంతో స్ఫూర్తి. కూచిపూడి, భరతనాట్యంతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారామె. చిన్న వయసులోనే పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మభూషణ్ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. అలాంటి యామినిగారి జీవిత కథను అందరికీ తెలియజేయాలనే ఆలోచనతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. ఈ బయోపిక్కు యామినిగారే కొరియోగ్రఫీ అందించనుండటం విశేషం. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించనున్నాం. త్వరలోనే ఈ బయోపిక్ పూర్తి వివరాలు తెలియచేస్తా’’ అన్నారు. -
దళారుల కట్టడికే ఆన్లైన్ టికెట్లు
సాక్షి, తిరుమల: ఆన్లైన్లో రూ. 300 టికెట్ల విక్రయాల ద్వారా కల్పించే దర్శనంలో అక్రమాలకు అవకాశం లేకుండా అమలు చేస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ అన్నారు. గురువారం జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణతో కలిసితో కలసి ఆయన రూ.300 ఆన్లైన్ టికెట్ల క్యూను సందర్శించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ రోజుకు 11 వేల టికెట్లు ఇస్తున్నామని, త్వరలోనే ఈ సంఖ్యను 15వేలకు పెంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. దళారులను ఆశ్రయించకుండా ఉండేందుకే ఈ ఆన్లైన్ దర్శనం ప్రవేశ పెట్టామన్నారు. వస్త్రధారణ, టీటీడీ నిబంధనలను టికెట్లపై అన్ని భాషల్లో ముద్రించే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
‘సాక్షి’ బ్రహ్మోత్సవ సంచికపై అభినందనలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కథనాలతో ఆదివారం ‘నమో లక్ష్మీపతే’ శీర్షికన ప్రచురితమైన ‘సాక్షి ఫన్ డే’ సంచికను సింహవాహన సేవలో సంబంధిత తిరుమల అధికారులు ఆవిష్కరించారు. టీటీడీ సాధికారిక మండలి అధ్యక్షుడు జగదీష్‌చంద్ర శర్మ, ఈవో గిరిధర్ గోపాల్, జేఈవోలు కేఎస్ శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, పీఆర్వో టి. రవి, ద్రవిడ వర్సిటీ పూర్వ ఉప కులపతి రవ్వా శ్రీహరిలు ‘ఫన్ డే’ సంచికను ఆవిష్కరించారు. -
వాహన సేవల ఊరేగింపు యథాతథం
తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా వాహన సేవల ఊరేగింపులో ఎలాంటి మార్పులు చేయడం లేదని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ వెల్లడించారు. వాహన సేవలకు ముందుగా ప్రత్యేక బ్యాడ్జిలు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఈసారి గతంలో కంటే తక్కువ సంఖ్యలోనే ప్రముఖులకు ప్రోటోకాల్ బ్యాడ్జిలు, పాసులు ఇస్తామన్నారు. స్వామి సన్నిధిలో పూర్తి స్థాయిలో భద్రత ఉందని, ఎలాంటి అభద్రతా భావం, అపోహలు అనవసరమని ఆయన భరోసా ఇచ్చారు. గరుడ సేవకు ఐదు లక్షల మంది: జేఈవో తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 30న నిర్వహించనున్న శ్రీవారి గరుడ సేవకు ఐదు లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేసినట్టు జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు. నాలుగు మాడ వీధుల్లో 2.20 లక్షల మంది భక్తులు హాయిగా కూర్చుని స్వామి వాహన సేవల్ని దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టారు. అలాగే, వెలుపల ఉన్నవారు మొత్తం 10 ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా స్వామి సేవల్ని తిలకించే వీలుంటుంది. కొత్తగా బ్యాటరీ వాహనాలు..: ఆలయం ముందున్న వృద్ధుల క్యూలైనును మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ఆవరణలోకి మార్పు చేశారు. బ్రహ్మోత్సవాల్లోగా ఈ కొత్త క్యూలైను అందుబాటులోకి రానుంది. వృద్ధుల కోసం మ్యూజియం వద్ద 10 సీట్లు, 25 సీట్లు కలిగిన బ్యాటరీ కార్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి అనంతాళ్వారు తోట మీదుగా మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు చేరవేస్తారు. తూర్పు మాడవీధిలోనూ ఇనుప కంచె భద్రత కోసం మూడేళ్లకు ముందు ప్రారంభించిన ఇనుప కంచెనిర్మాణం(ఇన్నర్ సెక్యూరిటీ కార్డాన్) పనులు తూర్పుమాడ వీధిలోనూ ప్రారంభించారు. ఇవి పూర్తయితే, ఆలయ నాలుగు మాడ వీధులు భద్రతా విభాగం ఆధీనంలోకి వస్తాయి. 22న వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవం ఈనెల 22న జరగనుంది. గవర్నర్ నరసింహన్ చాన్స్‌లర్ హోదాలో హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లాకు చెందిన వేదపండితుడు మద్దూరి వెంకటేశ్వరయాజులుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఆయన స్నాతకోపన్యాసం చేస్తారు. -
‘స్వర్ణమయం’పై సమగ్ర పరిశీలన: టీటీడీ ఈవో
తిరుమల: శ్రీవారి ఆలయానికి బంగారు తాపడం పనుల(ఆనంద నిలయం అనంత స్వర్ణమయం) పథకంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీలో ఉన్న ఆడిట్ అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయంలో ప్రవేశ పెట్టిన మూడు వరుసల క్యూ విధానంతో భక్తుల మధ్య తోపులాట తగ్గిందన్నారు. కల్యాణ కట్టలో భక్తులకు తలనీలాలు తీసే సమయం తగ్గించేందుకు శాశ్వత ఉద్యోగులు, పీస్‌రేట్ కార్మికుల నియామకం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం 11 వేల వరకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు ఇస్తున్నామని, మరో 7 వేల టికెట్లను కూడా ఆన్లైన్లో కేటాయించిన తర్వాతే తిరుమల లో కరెంటు బుకింగ్ రద్దు చేస్తామని ఈవో చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో పేరుకుపోయిన నోట్లను ప్రత్యేకంగా లెక్కించేందుకు శుక్రవారం నుంచి అదనపు పరకామణి ప్రారంభించారు. కాగా, శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. కోనేటి రాయుడికి కోటి విలువైన బంగారు హారం: చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలో కొలువైన కల్యాణ వేంకటేశ్వర స్వామికి చెన్నైకి చెందిన అజ్ఞాత భక్తుడు కోటి రూపాయల విలువ చేసే మూడు కిలోల బంగారు హారాన్ని కానుకగా అందించారు. 3 కిలోల బంగారంతో శ్రీదేవి, భూదేవి ప్రతిమలు ఉండేలా అందంగా చేయించిన హారాన్ని శుక్రవారం ఆలయ అధికారులకు అందజేశారు. గతంలో తాను మొక్కుకున్న మేరకు ఈ హారాన్ని కానుకగా ఇచ్చినట్లు ఆయన చెప్పారు. -
నేటి నుంచి ఆన్లైన్లో రూ.300 టికెట్లు
ఈనెల 27న శ్రీవారి దర్శనానికి అనుమతి సాక్షి, తిరుమల: ఆన్లైన్లో రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విక్రయాన్ని బుధవారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభిస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ ప్రకటించారు. శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో ప్రవేశపెట్టనున్న కొత్త విధానాన్ని మంగళవారం మీడియాకు వెల్లడించారు. వివరాలివీ...ప్రయోగాత్మకంగా తొలివిడత 5 వేల టికెట్లు ఇస్తారు. అందులో 2500 టికెట్లను ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా కేటాయిస్తారు. మిగిలిన వాటిని టీటీడీ ఈ-దర్శన్ కేంద్రాల నుంచి కేటాయిస్తారు. టికెట్లు పొందిన భక్తులను ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలు, 3 గంటల టైం స్లాట్లలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇంటర్నెట్ ద్వారా టికెట్లు పొందే భక్తులు వారి ఫొటో గుర్తింపు కార్డును అప్లోడ్ చేసి, పేమెంట్ గేట్ వే ద్వారా క్రెడిట్, లేదా మాస్టర్ వీసా కార్డులద్వారా నగదు చెల్లింపులు చేయాలి. ఈ దర్శన కౌంటర్లలో భక్తులే నేరుగా వెళ్లి నగదు చెల్లించి ఫొటోమెట్రిక్ పద్ధతిలో వేలి ముద్ర, ఫొటో తీసుకుని టికెట్టు పొందవచ్చు. టికెట్లు పొందిన భక్తులు కచ్చితమైన సమయానికి రావాలి. ఫొటో గుర్తింపు కార్డులు కూడా తీసుకురావాలి. వారిని తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ సమీపంలోని 129 టీబీ కౌంటర్ నుంచి అనుమతిస్తారు. టికెట్టు పొందిన భక్తులకు నగదు వాపసు ఇవ్వరు. దర్శనం తేదీ వాయిదా వేయరు. 12 ఏళ్లలోపు చిన్నారులను అనుమతించేందుకు వారి వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి. పురుషులు చొక్కా, పంచె/ పైజామా, కుర్తా, మహిళలు లంగా,ఓణి/చీర/దుపట్టాతో కూడిన చుడీదార్ ధరించి రావాలి. ఈ-దర్శన్ కౌంటర్లలో కోటా వివరాలివీ... టీటీడీ ఈ-దర్శన్ టికెట్లను హైదరాబాద్ కౌంటర్లో 850, విశాఖపట్నం 675, విజయవాడ 350, కర్నూలు 100, తిరుపతి 200, నెల్లూరు 100, నిజామాబాద్ 75, వరంగల్ 75, అనంతపురం కౌంటర్లో 75 కేటాయించారు. నాలుగు రోజుల్లో 2.94 లక్షల మంది ఈసారి శ్రావణమాసంలో వరుస సెలవుల కారణంగా సోమవారం వరకు నాలుగురోజుల్లో 2.94 లక్షల మంది శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు. హథీరాంజీ మఠం స్థలంలో జరగని ‘గోకులాష్టమి’ శ్రీవారి ఆలయం, హథీరాంజీ మఠం మధ్య 180 ఏళ్లుగా ప్రత్యక్షంగా ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని ఓ స్థల వివాదం తెంచేసింది. రథోత్సవం ఊరేగింపుకోసం మఠం స్థలం ఇవ్వాలని టీటీడీ, అంగుళం కూడా ఇవ్వమని మఠం నిర్వాహకులు భీష్మించుకోవడంతో వీరి మధ్య అంతరం పెరిగింది. గోకులాష్టమి మరుసటి రోజున ఆలయం నుంచి ఉత్సవమూర్తులు తన సేవకుడైన ‘హథీరాం’మఠంలో విడిది చేసి ఆస్థాన పూజలందుకునే సంప్రదాయం ఉంది. ఇక్కడ టీటీడీ ఈవోకు, మఠం మహంతుకు ప్రత్యేక మర్యాదలు చేయటం సంప్రదాయం. వివాదం ఫలితంగా మంగళవారం హథీరాంజీ మఠం స్థలంలో నిర్వహించే గోకులాష్టమి ఆస్థాన కార్యక్రమాన్ని మఠం ఆవరణలో కాకుండా తొలగించిన టీటీడీ కొలువు మండపం వద్ద తాత్కాలిక పందిరి వేసి నిర్వహించారు. వైభవంగా ఉట్లోత్సవం తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం ముందు మంగళవారం ఉట్లోత్సవం వైభవంగా జరిగింది. శ్రీకృష్ణజన్మాష్టమి మరుసటి రోజు ఆలయం వద్ద ఉట్లోత్సవాన్ని నిర్వహించటం ఆనవాయితీ. ఇందులో భాగంగా టీటీడీ అధికారులు మంగళవారం ఆలయం ముందు కన్నులపండువగా ఉట్లోత్సవాన్ని నిర్వహిం చారు. ముందుగా మలయప్పస్వామిని, శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులకు పూజలనంతరం ఉత్సవర్లను సహస్రదీపాలంకరణ మండపం వద్ద ఏర్పాటుచేసిన వేదికపై వేంచేపు చేశారు. ఆలయం ముందు నిర్వహించిన ఉట్లోత్సవంలో అధిక సంఖ్యలో యువకులు గ్రూపులుగా విడిపోయి 25 అడుగుల పొడవాటి కొయ్యకు పైభాగంలో ఏర్పాటు చేసిన ఉట్టికోసం పోటీపడ్డారు. -
‘అశ్వని’కి ఆధునిక వైద్యపరికరాలు
రూ.15 లక్షల పరికరాలు వితరణ చేసిన ముస్లిం భక్తుడు పరికరాలను ప్రారంభించిన ఈవో గిరిధర్ గోపాల్ తిరుమల : తిరుమలలోని అశ్విని ఆస్పత్రిలో వేగవంతంగా వైద్యపరీక్షలు నిర్వహించేందుకు విరాళంగా వచ్చిన అత్యాధునిక వైద్య పరికరాలు రెండింటిని టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ శుక్రవారం ప్రారంభించారు. రూ.15 లక్షల విలువ కలిగిన ఈ వైద్య పరికరాలను చెన్నైకి చెందిన ముస్లిం భక్తుడు అబ్దుల్ఖనీ విరాళంగా అందజేశారు. వీటిని శుక్రవారం ఉదయం ఈవో ఎంజీ.గోపాల్ పలువురు వైద్యాధికారులతో కలిసి ప్రాయింభించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ అశ్విని ఆస్పత్రిలో రోగులకు రక్తపరీక్షలు నిర్వహించేందుకు ‘స్విలాబ్ హెమటాలజి ఆటోమేటెడ్ అనలైజర్’, రెస్పాన్స్ 910 బయోకెమిస్ట్రీ పరీక్షల కోసం వినియోగించే ‘బయోకెమెస్ట్రీ ఆటోమేటెడ్ అనలైజర్’ వైద్య పరికరాలు(బ్రీత్ అనలైజర్లు) టీటీడీ కి విరాళంగా అందటం సంతోషకరమన్నారు. సాధారణంగా రక్తపరీక్షలు నిర్వహించాలంటే అరగంట సమయం పడుతుందని, ప్రస్తుతం విరాళంగా వచ్చిన స్విలాబ్ హెమటాలజి ఆటోమేటెడ్ అనలైజర్ పరికరం ద్వారా కేవలం ఒక్క నిమిషంలోనే ఫలితం తెలుసుకోవచ్చన్నారు. మొత్తం 19 రకాల రక్త సంబంధిత పరీక్షలను ఈ పరికరంతో చేయవచ్చని తెలిపారు. ఇంకా రెస్పాన్స్ 910 బయోకెమిస్ట్రీ ఆటోమేటెడ్ అనలైజర్ పరికరం ద్వారా ఒకేసారి 105 శాంపిళ్లను 30 రకాలుగా 5 నుంచి 15 నిమిషాల వ్యవధిలో పరీక్షించవచ్చనని చెప్పారు. ఈ వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చిన అబ్దుల్ఖనీ తిరుమల మొదటి, రెండవ ఘాట్‌రోడ్లపై సిగ్నలింగ్ కోసం సోలార్ పరిజ్ఞానంతో కూడిన నాలుగు వేల స్టెడ్లైట్లను కూడా విరాళంగా అందజేసినట్లు చెప్పారు. అనంతరం దాతను ఈవో శాలువ, శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు. అలాగే త్వరలో అశ్విని ఆస్పత్రిలో మరమ్మతులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఈవో తెలిపారు. అంతకుముందు ఈవో వైద్యులతో కలిసి ఆస్పత్రిలోని పలు గదులు, ల్యాబ్‌లు, బెడ్లు, ఇతర సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ వికాస్, సూపరింటెండెంట్ నర్మద, ఎస్ఎంవో నాగేశ్వరరావు, దాతల విభాగం డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, రిసెప్షన్ వోఎస్డీ దామోదరం, ఇతర వైద్యలు పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి టైం స్లాట్ యోచన
టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ పోస్టాఫీసుల ద్వారా దర్శన టికెట్ల బుకింగ్ వృద్ధులకు స్వామి కనిపించేలా బైనాక్యులర్ సదుపాయం మూడు క్యూల విధానం వందశాతం సక్సెస్ సాక్షి, తిరుమల : శ్రీవారి భక్తులు తిరుమలలోని క్యూల వద్ద, కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండా తగిన సమయం ప్రకారం వచ్చి స్వామిని దర్శించుకునేలా టైం స్లాట్ విధానం అమలు చేస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ అన్నారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నకు, అనంతరం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తొలుత రూ.300 టికెట్ల దర్శనంలో కొత్త విధానం అమలు చేస్తామని, తర్వాత దశలో కాలినడక, సర్వదర్శనం, ఇతర దర్శనాలకు అమలు చేస్తామని చెప్పారు. టైం స్లాట్ విధానంలో దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, ఇంటర్నెట్, ఆన్లైన్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు బుకింగ్ చేసుకునే విధానంపై యోచన చేస్తున్నామని ఈవో వెల్లడించారు. దేశంలోని పోస్టాఫీసుల సేవలను వినియోగించుకోవడం వల్ల దర్శన టికెట్ల కోసం ప్రత్యేకంగా టీటీడీ ఈ-దర్శన్ కౌంటర్లను నిర్వహించాల్సిన అవసరం ఉండదని ఈవో గుర్తు చేశారు. భక్తులకు సంతృప్తికంగా దర్శనం కల్పించేందుకు ఆలయంలో కొత్తగా అమలు చేస్తున్న మూడు క్యూల విధానం వందశాతం సక్సెస్ అయ్యిందని ఈవో ఆనందం వ్యక్తం చేశారు. ఇక మహాలఘు దర్శనమే : ఈవో స్పష్టీకరణ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో మహాలఘు దర్శనం(70 అడుగుల దూరం నుంచే మూలమూర్తిని దర్శించుకునే అవకాశం) అమలు చేయాల్సి ఉంటుందని ఈవో గిరిధర్ గోపాల్ భక్తులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. గతంలో అప్పటి పరిస్థితులు, రద్దీకి అనుగుణంగా కులశేఖరపడి, లఘుదర్శనం అమలు చేసినా ప్రస్తుతం అది సాధ్యం కాదన్నారు. దగ్గరగా వెళ్లి తోపులాటలో దర్శించుకోవటం కన్నా... కాస్త దూరమైనా ప్రశాంతంగా ఎలాంటి తోపులాటలు లేకుండా కనీసం రెండు సెకన్ల సమయం స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించామని ఈవో గుర్తు చేశారు. ఇక మహాలఘు దర్శనమే అమలు చేస్తామని, ఈ విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవన్నారు. వృద్ధులకు బైనాక్యులర్స్ మహాలఘుదర్శనంలో సుమారు 70 అడుగుల దూరం నుంచే మూలమూర్తిని దర్శించుకోవాల్సి ఉండటంతో వృద్ధులకు బైనాక్యులర్స్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఈవో అన్నారు. దూరం కావడం వల్ల స్వామిని దర్శించుకోలేకపోతున్నామన్న ఓ భక్తుడి విన్నపంతో ఈవో పైవిధంగా బదులిచ్చారు. ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 2 గంటలకు రెండు విడత ల్లో అమలు చేసే వృద్ధుల దర్శనంలో ఒకటి రెండు సెకన్లు ఆలస్యమైనా ఆలయంలో ప్రత్యేకంగా బైనాక్యులర్ అద్దాలు ఇస్తామని చెప్పారు. -
శ్రీవారి దర్శనానికి టైం స్లాట్ యోచన: గిరిధర్ గోపాల్
టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ పోస్టాఫీసుల ద్వారా దర్శన టికెట్ల బుకింగ్ వృద్ధులకు స్వామి కనిపించేలా బైనాక్యులర్ సదుపాయం సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులు తిరుమలలోని క్యూలు, కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండా తగిన సమయం ప్రకారం వచ్చి స్వామిని దర్శించుకునేలా టైం స్లాట్ విధానం అమలు చేస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ అన్నారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు, అనంతరం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తొలుత రూ.300 టికెట్ల దర్శనంలో కొత్త విధానం అమలు చేస్తామని, తర్వాత దశలో కాలినడక, సర్వదర్శనం, ఇతర దర్శనాలకు అమలు చేస్తామని చెప్పారు. టైం స్లాట్ విధానంలో దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, ఇంటర్నెట్, ఆన్లైన్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు బుకింగ్ చేసుకునే విధానంపై యోచన చేస్తున్నామని ఈవో వెల్లడించారు. పోస్టాఫీసుల సేవలను వినియోగించుకుంటే దర్శన టికెట్ల కోసం టీటీడీ ఈ-దర్శన్ కౌంటర్ల అవసరం ఉండదని చెప్పారు. మహాలఘుదర్శనంలో సుమారు 70 అడుగుల దూరం నుంచే మూలమూర్తిని దర్శించుకోవాల్సి ఉండటంతో వృద్ధులకు బైనాక్యులర్స్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని వివరించారు. -
శ్రీవారి సేవ పూర్వజన్మ సుకృతం
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఈవో గిరిధర్ గోపాల్ తెలిపారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించి పది నెలలు పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. శ్రీవారి వద్దకు వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. దేవుడి వద్దకు వచ్చే ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని, ఆధునిక పరిజ్ఞానాన్ని ఉయోగించడం ద్వారా మెరుగైన దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. - సాక్షి ప్రతినిధి, తిరుపతి మాలో ఎవరు చేసుకున్న పుణ్యమో నా అదృష్టమో, నా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టమోగాని నాకు ఇక్కడ పోస్టింగ్ వచ్చింది. మొదట ఇక్కడికి రాగానే అన్నదాన సత్రంలో భోజనం నాణ్యతపై దృష్టిపెట్టాను. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గుర్తించి వారి చేత పని చేయించాలని నిర్ణయించాను. బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజు ఎండోమెంట్ ల్యాండ్ ఇష్యూ వచ్చింది. ఇది ఉద్యోగులకు సంబంధించింది కావడంతో ఎంతవరకైనా చేయాలని అనుకున్నా. మార్కెట్ వాల్యూ ప్రకారం బ్రాహ్మణపట్టు వద్ద కొందరికి, ఇంకోచోట మరికొందరికి మొత్తం 400 మందికి ఇవ్వనున్నాం. స్వామి వారికి కైంకర్యాలు బాగా జరగాలి స్వామి వారికి నిత్య కైంకర్యాలు శాస్త్రం ప్రకారం జరగాలి. డ్రస్కోడ్ ఉండాలి. అర్చకులను బాగా చూసుకోకుంటే దేశానికి అరిష్టం వస్తుందని జనం నమ్ముతున్నారు. స్వీపర్‌కు రూ.తొమ్మిది వేలు జీతం ఉంటే అర్చకుడికి నాలుగు వేలు ఇస్తున్నారు. ఇందులో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ జరగాలి. దేవస్థానం నుంచి వచ్చే వేస్ట్‌ను వేరుగా డంప్ చేస్తున్నాం. దీన్ని ఎరువుగా తయారు చేసి విక్రయించే దిశగా చర్యలు తీసుకుంటాం. భక్తులు ఇష్టపడి రావాలి.. తిరుమలకు భక్తులు భయపడుతూ కాకుండా ఇష్టపడి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. క్యూలో అప్పుడప్పుడూ కొంతమేర తోపులాటలు జరుగుతున్న మాట వాస్తవమే. వెంటనే పరిస్థితిని మెరుగుపరుస్తున్నాం. పొట్టి, పొడుగు ఇలా ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకునేలా మూడులైన్లు తయారు చేస్తున్నాం. శ్రీవారి సేవకులు భక్తులను నెట్టే అవకాశం లేకుండా చేస్తున్నాం. కంపార్ట్మెంట్లలో కష్టాలు ఉండకూడదు.. కంపార్ట్‌మెంట్‌లోనూ భక్తులకు ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగులు దగ్గరుండి భక్తులను క్రమబద్ధీకరించడం లేదు. వరుస క్రమంలో కాకుండా భక్తులు ఎలాపడితే అలా కూర్చుం టున్నారు. వారికి దర్శనం ఎప్పుడు అవుతుందో తెలియక ఆందోళన పడాల్సిన పరిస్థితి ఉంటోంది. ఇందులో మార్పు తీసుకురావాల్సి ఉంది. కంపార్ట్మెంట్లో ఉన్న వారికి కాఫీలు, టీలు, టిఫిన్లు ఏది అడిగినా అందజేసేలా చర్యలు తీసుకుంటాం. ఏ కంపార్ట్మెంట్లో ఏమి జరుగుతుందో తెలుసుకునేలా కెమెరాలు పెట్టాలి. ఇందుకోసం అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడుకోనున్నాం. కంపార్ట్మెంట్లలో ఉద్యోగుల సంఖ్య పెంచుతాం.. కంపార్ట్మెంట్లలో ఒక ఏఈవో, ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. అందుకే అక్కడ భక్తులను క్రమబద్ధీకరించడం కుదరడం లేదు. ఈ పరిస్థితి మెరుగునకు అదనపు సిబ్బంది అవసరం. జేఈవో శ్రీనివాసరాజు దీనిపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి వ్యక్తీ రెండు సెకన్ల పాటు స్వామివారిని చూసి వెళుతున్నారు. తద్వారా భక్తులు ఎంతో సంతృప్తి చెందుతున్నారు. భయం లేదా భక్తి ఉండాలి.. విధి నిర్వహణ విషయంలో సిబ్బందికి భయం లేదా భక్తి ఉండాలి. ఉద్యోగ సంఘాలు అండగా ఉండాయి.. అవి చూసుకుంటాయనే ధీమాలో కొందరు ఉద్యోగుల్లో ఉంది. ఈవోగా నేను చేయాల్సింది చేస్తా. ఉద్యోగులతో పనిచేయించడం నా బాధ్యత. ఆ దిశగానే అడుగులు వేస్తాను. బయోడీజిల్ ప్రాజెక్ట్‌పై కసరత్తు.. ఆర్ఎస్ఏ (రెయిన్ షాడో ఏరియా డెవలప్మెంట్ కార్యక్రమం) పథకం కింద బయోడీజిల్ ద్వారా రైతులు లక్షలు ఆర్జించవచ్చు. బయోడీజిల్ ద్వారా రైతుల ఆత్మహత్యలను నివారించవచ్చని మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి భావించారు. ఆయన సూచన మేరకు ఈ ప్రాజెక్టు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాం. మాజీ మంత్రి రఘువీరారెడ్డితో కలిసి కొన్ని ప్రాంతాల్లో తిరిగి వచ్చాం. అనంతపురం జిల్లాలో ఐదెకరాలకు సరిపోయే నీటితో 25 ఎకరాల్లో బయోడీజిల్ వేయవచ్చనే నిర్ణారణకు వచ్చాం. అది ముందుకు సాగలేదు. ఏటూరు నాగారంలో పీవోగా.. మొదట అసిస్టెంట్ కలెక్టర్‌గా 1984లో నిజామాబాద్, కొత్తగూడెం సబ్‌కలెక్టర్‌గా, వరంగ ల్ జిల్లా ఏటూరు నాగారంలో ఐటీడీఏ (కోయా) పీవోగా మూడు సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత ఆదిలాబాద్ కలెక్టర్‌గా పనిచేశాను. జనం సమస్యలను దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. ప్రధానంగా ఏటూ రు నాగారంలో గిరిజనుల అభ్యున్నతికి ఎక్కు వ రోజులు పని చేయడం సంతోషాన్ని కలిగిం చింది. సుశీల్‌కుమార్ షిండే గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయన వద్ద పనిచేశాను. తర్వాత ఏపీపీఎస్సీ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్నాను. అక్కడి నుంచి వెంకటేశ్వరస్వామి చెంతకు వచ్చాను. కుటుంబం గురించి.. నాకు ఇద్దరు కుమారులు. ఒకరు లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రెండో కుమారుడు స్పోర్ట్స్ జర్నలిస్టు. ఆరు నెలలు ఉద్యోగం చేసి మానేశాడు. మణిపాల్‌లో ఇంజినీరింగ్ చదివాడు. ద స్పో ర్ట్స్ క్యాంపస్ డాట్‌కామ్‌కు ఆర్టికల్స్ రాస్తుం టాడు. నాకు మూడేళ్ల సర్వీసు ఉంది. దేవుడి సేవలో ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. -
తిరుమల కొండ నిండింది
శ్రీవారి దర్శనానికి 30గంటలు 3కిలోమీటర్ల భక్తుల క్యూ విపరీత రద్దీ దృష్ట్యా కాలిబాట భక్తులను క్యూల్లోకి అనుమతించని టీటీడీ వర్గాలు ఆళ్వార్చెరువు వద్ద బైఠాయించిన భక్తులు తిరుమల: తిరుమల భక్తజన సంద్రమైంది. వేసవి, వారాంతపు సెలవులు కావడంతో భక్తులు పోటెత్తారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వచ్చిన కాలి బాట భక్తులను క్యూల్లోకి అనుమతించలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు. టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆళ్వారు చెరువు వద్ద బైఠాయిం చారు. వేకువజాము 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 41780 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్మెంట్లలో వేచిఉండడంతోపాటు వెలుపల మూడు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ కట్టారు. వీరికి 30 గంటల తర్వాత దర్శనం లభించనున్నట్లు టీటీడీ ప్రకటిం చింది. ఇప్పటికే క్యూల్లో వేచిఉన్న భక్తులకు 16గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. రద్దీ పెరగడంతో రూ.300టికెట్ల దర్శనం మధ్యాహ్నం 12గంటలకు నిలిపి వేశారు. గదుల కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. పద్మావతి, ఎంబీసీ 34, సీఆర్వో కేంద్రీయ విచారణా కార్యాలయాల్లో క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కల్యాణకట్టల వద్ద తలనీలాలు సమర్పించుకునేందుకు నాలుగు గంటలకుపైగా క్యూలైన్లలో వేచిఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైను త్వరగా కదిలేలా చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల అధికారులను ఈవో గిరిధర్ గోపాల్ ఆదేశించారు. -
తిరుమలలోనే నూరుకాళ్ల మంటపం
వేయికాళ్ల మంటపం స్థానంలో పునః నిర్మాణం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చ సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయం వద్ద 2003లో కూల్చివేసిన వేయికాళ్ల మండపం స్థానంలోనే నూరుకాళ్ల రాతి మంటపం నిర్మించాలని టీటీడీ సీవీఎస్వో నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచించింది. రాతి మంటపం తిరుపతిలో నిర్మించాలనే అంశం సమంజసంగా లేదని, పరిమితులకు లోబడే తిరుమల ఆలయం వద్దే పునఃనిర్మించాలని నిపుణులు స్పష్టం చేశారు. దీనిపై లోతుగా అధ్యయనం చేసి మరోసారి నివేదిక సమర్పించాలని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం కోరింది. సోమవారం తిరుమలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో రాతిమంటమం నిర్మాణంపై ఈ మేరకు చర్చ జరిగింది. ై చెర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ నేతృత్వంలో సాగిన ఈ సమావేశానికి సభ్యులు ఎల్ఆర్ శివప్రసాద్, రేపాల శ్రీనివాస్, కన్నయ్య, వెంకట్రమణ, ఎక్స్ అఫిషియో సభ్యుడు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి బీ.వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సమావేశంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా కేవలం పరిపాలనా సంబంధిత అంశాలపై మాత్రమే చర్చించి తీర్మానం చేశారు. కోడ్ వల్ల సమావేశంలో తీసుకున్న అన్ని తీర్మానాలను కూడా మీడియాకు చెప్పలేమని చైర్మన్ వెల్లడించారు. టీటీడీ కల్యాణ మంటపాల బుకింగ్ విధానాన్ని జూన్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లోకి మార్పు చేయాలని ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానించింది. ఇప్పటి వరకు మాన్యువల్ పద్ధతిలో మాత్రమే బుకింగ్ చేసుకునే కల్యాణ మంటపాలను ఇకపై ఎక్కడి నుంచైనా ఆన్లైన్ విధానంలో బుక్ చేసుకునేలా సమావేశంలో తీర్మానించినట్టు చెప్పారు. వీటితోపాటు తిరుమల ఆలయ అవసరాల కోసం బియ్యం, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాల వంటి సాధారణ మార్కెట్ కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకున్నారు. - తిరుమల శ్రీవారి ఆలయంలో ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న 140 మంది పోటు కార్మికుల కాంట్రాక్టును మరో ఏడాదికి పొడిగించారు. వీరి జీతభత్యాల కింద రూ.3.10 కోట్లు కేటాయించారు. - కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న 186 మంది ఫారెస్ట్ కార్మికులను మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించారు. - తిరుమలలోని ఉద్యానవనాల నిర్వహణకు నామినేషన్ పద్ధతిపై రూ.1కోటి 11లక్షలు కేటాయించారు. అలాగే ఉద్యోగులకు సంబంధించిన పరిపాలన పరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇదిలాఉండగా ఇంతకుముందే అసెంబ్లీ రద్దు కావడంతో ఎమ్మెల్యేల కోటా కింద ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమితులైన రాజిరెడ్డి, పాముల రాజేశ్వరి, కాండ్రుకమల, పదవులకు రాజీనామా చేసిన జీవీ శ్రీనాథరెడ్డి, చిట్టూరు రవీంద్ర సమావేశానికి హాజరు కాలేదు. -
శ్రీవారి సేవలో చీఫ్ సెక్రటరీ మహంతి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి శనివారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తొలుత వసంత మండపంలో జరిగిన శ్రీవారి వార్షిక వసంతోత్సవంలో సీఎస్ దంపతులు పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత స్వామిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ కూడా ఉన్నారు. రంగనాయక మండపంలో సీఎస్ దంపతులకు జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
చల్లారిన కార్చిచ్చు!
సాక్షి, తిరుమల/హైదరాబాద్: శేషాచల అడవుల్లో మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. ‘ఆపరేషన్ శేషాచలం’ చాలావరకు విజయవంతమైంది. నాలుగు రోజులుగా అడవుల్ని కబళిస్తున్న కార్చిచ్చు గురువారం సాయంత్రానికి ఆరిపోయినట్టు కనిపించింది. వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మూడు హెలికాప్టర్లతో పాటు వివిధ విభాగాలకు చెందిన సుమారు 700 మంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అడవుల్లో చెలరేగిన మంటల్ని అదుపు చేసేందుకు హెలికాప్టర్ల సాయం కావాలని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్.. గవర్నర్ నరసింహన్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ చొరవ తీసుకుని కేంద్రాన్ని సంప్రదించడంతో త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. బుధవారం శేషాచలంలో చేతక్ హెలికాప్టర్ ద్వారా సర్వే చేసిన వాయుసేన సిబ్బంది నీటిని చల్లాల్సిన ప్రాంతాలను గుర్తించారు. రాత్రి 11-30 గంటల సమయంలో అత్యాధునిక సీ-130 ఎయిర్‌క్రాఫ్ట్ రెక్కీ నిర్వహించి మంటలు ఎటు నుంచి ఎటువైపు వ్యాపిస్తున్నాయో మరోసారి పరిశీలించింది. గురువారం మధ్యాహ్నం చేతక్ తో పాటు మరో రెండు హెలికాప్టర్లు మరోసారి శేషాచలంలో పరిస్థితిని అంచనా వేశాయి. అధికారులు ఒక్కో హెలికాప్టర్ కు 3 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న భారీ బకెట్లను ఏర్పాటు చేశారు. అవి తిరుమల ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమారధార ప్రాజెక్టులో నీటిని తోడుకుంటూ అడవిపై వెదజల్లాయి. వివిధ విభాగాల సిబ్బంది నేలపైనుంచి మంటల్ని ఆర్పారు. దీంతో సాయంత్రానికల్లా మంటలు చాలావరకు అదుపులోకి వచ్చాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ: గవర్నర్ నరసింహన్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి బి.సోమశేఖరరెడ్డి తిరుమలలో పరిస్థితిని సమీక్షించారు. టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ స్వయంగా మంటలు ఆర్పే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్ రాంగోపాల్ ఆపరేషన్‌కు నేతృత్వం వహించారు. దావానలం వల్ల 460 హెక్టార్లలో అడవి దగ్ధమైందని ఈవో గిరిధర్ గోపాల్ తెలిపారు. టీటీడీ అడవి చుట్టూ ప్రహరీగోడ, రింగ్‌రోడ్డు: భవిష్యత్‌లో ఇలాంటి అగ్నిప్రమాదాలు తిరుమల సరిహద్దులను తాకకుండా 6,004 ఎకరాల్లో విస్తరించిన టీటీడీ అడవి చుట్టూ ప్రత్యేకంగా రింగ్‌రోడ్డు, ప్రహరీగోడ నిర్మించాలని గురువారం సమావేశమైన టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. -
తిరుమల శేషాచలం దగ్ధం
సుమారు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో బూడిదైన వృక్షాలు సాక్షి, తిరుమల: తిరుమల శేషాచలం అడవిని మంగళవారం అగ్నికీలలు చుట్టుముట్టాయి. తిరుమలకు సమీపప్రాంతంలోని పారువేట మండపం, కాకులకొండ, పాపవినాశనం, మొదటి ఘాట్‌రోడ్డులో సుమారు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలోని దట్టమైన అడవి అగ్నికి ఆహుతైంది. భారీ వృక్షాలు బూడిదయ్యాయి. నాలుగురోజులుగా పారువేట మండపం ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయి. వీటిని టీటీడీ అటవీ అధికారులు ఎప్పటికప్పుడు అదుపు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుమల శేషాచల అడవిలోని పారువేట మండపం ప్రాంతంలో మంటలు తిరిగి పెద్ద ఎత్తున మొదలయ్యాయి. అక్కడినుంచి పక్కనే ఉన్న శ్రీగంధం వనం వరకు మంటలు వ్యాపించాయి. పారువేట మండపం తూర్పుదిశలోని కాకుల కొండ వద్దనున్న టీటీడీ పవన విద్యుత్ ప్లాంటుకు కూడా మంటలు విస్తరించాయి. దీనిని ముందే ఊహించిన టీటీడీ అటవీ విభాగం విద్యుత్ ప్లాంట్ల వద్ద ఫైరింజన్‌ను సిద్ధంగా ఉంచుకుని మంటలు చెలరేగకుండా అడ్డుకున్నారు. అలాగే పారువేట మండపం నుంచి ఉత్తర దిశలోని పాపవినాశనం తీర్థం వరకు, తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలోని 18వ మలుపు నుంచి 4వ మలుపు వరకు మంటలు విస్తరించాయి. ఇదే మార్గంలో వెళ్లే వాహనాలకు మంటలు తాకకుండా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ప్రమాద సమాచారంతో టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాసరావు అధికారులతో కలసి కాకులకొండ వద్ద పవన విద్యుత్‌ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఈవో మాట్లాడుతూ మంగళవారం జరిగిన ప్రమాదం తీవ్రతను నియంత్రించటంలో అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. చిత్తూరు జిల్లాలో విస్తరించిన అడవుల్లో మంగళవారం ఒక్కరోజే 37 ప్రమాదాలు జరిగినట్టు శాటిలైట్ ద్వారా గుర్తించామని టీటీడీ డీఎఫ్‌వో వెంకటస్వామి తెలిపారు. ఈ ఘటనలో సుమారు 500 ఎకరాల్లో అడవి దగ్ధమెందని చెప్పారు. -
నేటి అర్ధరాత్రి నుంచి ‘ఉత్తర’ దర్శనం
వైకుంఠ ఏకాదశికి తిరుమల సిద్ధం అన్ని రకాల ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు సాక్షి,తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లను తిరుపతి తిరుమల దేవస్థానం సిద్ధం చేసింది. సర్వదర్శనం, కాలిబాట భక్తుల దివ్య దర్శనం, వీఐపీ దర్శనం, నిర్దేశిత దర్శన సమయాలు, భక్తులను అనుమతించే వేళలను ప్రకటించింది. అవసరాన్ని బట్టి అరగంట అటుఇటుగా దర్శనానికి అనుమతిస్తామని ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. ఆ వివరాలు.. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ప్రముఖులను వేకువజామున 1.30 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. అందరికీ లఘు దర్శనం మాత్రమే. ఒక్కో వీఐపీ తరఫున ఆరుగురిని మాత్రమే అనుమతిస్తారు. కాలిబాటల్లో వచ్చే భక్తులకు శుక్రవారం మ.2 గంటలకు అలిపిరి మార్గంలోని గాలిగోపురం వద్ద, శ్రీవారి మెట్టు మార్గాల్లో రెండు రోజులకు కలిపి మొత్తం 40 వేల టికెట్లు ఇస్తారు. వీరిని శుక్రవారం అర్ధరాత్రి తర్వాతే క్యూలోకి అనుమతిస్తారు. శనివారం ఉ.7 గంటల తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం భక్తులకు శనివారం ఉ.7 గంటల నుంచి దర్శనం ప్రారంభమవుతుంది. కరెంట్ బుకింగ్‌లో రూ.300 టికెట్ల దర్శనాన్ని రద్దు చేశారు. 12వ తేదీన 5వేల వరకు రూ.300 టికెట్లు కేటాయించనున్నారు. సుదర్శనం, వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనంతోపాటు అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేశారు. తిరుపతిలోని రెండు టీటీడీ వసతి సముదాయాల్లో రెండు పూటలా ఉచిత అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కాలిబాటల్లో నడిచివచ్చే భక్తులకు ఒక్కో ఉచిత లడ్డూ అందజేయనున్నారు. భద్రాద్రిలోనూ సర్వం సిద్ధం భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వైకుంఠ ఏకాదశికి సర్వసిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం తెప్పోత్సవం జరగనుండగా శనివారం తెల్లవారుజామున ఉత్తరద్వార దర్శనం ప్రారంభిస్తారు. -
స్వామిసేవకు అంతా రెడీ
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు బస, దర్శనం ఏర్పాట్లను టీటీడీ సిద్ధం చేసింది. సర్వదర్శనం, కాలిబాట భక్తుల దివ్యదర్శనం, వీఐపీ దర్శనం, నిర్దేశిత దర్శన సమయాలు, భక్తులను అనుమతించే వేళలను టీటీడీ ప్రకటించింది. అవసరాన్ని బట్టి అరగంట అటుఇటుగా దర్శనానికి అనుమతిస్తామని ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. అందరికీ లఘుదర్శనమే.. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మంత్రులు, న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తదితర ప్రముఖులను వేకువజామున 1.30 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. అందరికీ లఘు దర్శనం మాత్రమే. ఎటువంటి హారతి ఇవ్వరు. ఒక్కో వీఐపీ తరఫున ఆరుగురిని మాత్రమే అనుమతి స్తారు. టికెట్టు ధర రూ.1000గా నిర్ణయించారు. ప్రతి భక్తుడికి ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి. సిఫారసులను అనుమతించరు. వ్యక్తిగతంగా వస్తేనే అనుమతిస్తారు. అం దరూ సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. కాలిబాటల్లో నడిచి వచ్చే భక్తులకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు అలిపిరి మార్గంలోని గాలిగోపురం వద్ద, శ్రీవారి మెట్టు మార్గాల్లో రెండు రోజులకు కలిపి మొత్తం 40 వేల టికెట్లు ఇస్తారు. వీరిని శుక్రవారం అర్ధరాత్రి తర్వాతే నారాయణగిరి ఉద్యావనంలో ఏర్పాటు చేసిన క్యూ లోకి అనుమతిస్తారు. శనివారం ఉదయం 7 గంటల తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం భక్తులను శుక్రవారం సా యంత్రం 5 గంటల నుంచి ఎంబీసీ 26 వద్ద గల క్యూలోకి అనుమతిస్తారు. వీరికి శనివారం ఉదయం 7 గంటల నుంచి దర్శనం ప్రారంభమవుతుంది. ఈ క్యూలో 22 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ-దర్శన్‌లో రూ.300 దర్శనం కోసం ఇప్పటికే 5వేలు వరకు టికెట్ల ఇచ్చారు. వీరిని మాత్రమే శుక్రవారం ఉదయం నుం చి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో రూ.300 టికెట్ల దర్శనాన్ని పూర్తిగా రద్దు చేశారు. 12వ తేదీ ద్వాదశి రోజున ఐదువేల వరకు రూ.300 టికెట్లు తిరుమలలో కేటాయించనున్నారు. రూ.50 సుదర్శనం, వృద్ధులు, వికలాం గులు, చంటిబిడ్డల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేశారు. అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేశారు. గదుల కోసం సిఫారసులను స్వీకరించడం లేదు. ప్రముఖులైనా తిరుమలలోని సం బంధిత కార్యాలయాలకు వ్యక్తిగతంగా వస్తేనే కేటాయిస్తున్నారు. వీరి సిఫారసులను స్వీకరించడం లేదు. కేంద్రీయ విచారణా కార్యాలయంలో మాత్రమే సామాన్య భక్తులను గదులు కేటాయించనున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు నుంచి కాలిబాటల్లో నడిచివచ్చే భక్తులకు ఒక్కో ఉచిత లడ్డూ అందజేయనున్నారు. తిరుపతిలోని శ్రీని వాసం, మాధవం టీటీడీ వసతి సముదాయాల్లో రెండు పూటలా భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల్లోపు స్వర్ణ రథోత్సవం, ద్వాదశి రోజు తిరుమల పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి సందర్భంగా తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా చక్రస్నానం నిర్వహించనున్నారు. -
సామాన్య భక్తుల దర్శనానికే ప్రాధాన్యం!
‘కౌసల్యా సుప్రజారామ, పూర్వాసంధ్యా ప్రవర్తతే!.. అన్న సుప్రభాత పఠనంతో వేకువజాము 2.30 గంటలకు స్వామిని మేలుకొలిపి, తిరిగి రాత్రి 12.30 గంటలకు ‘జో అచ్యుతానంద! జోజో ముకుందా!’ అన్ని జోలపాటతో నిద్రపుచ్చుతారు. ఆగమశాస్త్రానికి లోబడి కైంకర్యాలు సాగితేనే స్వామివారు ప్రసన్నంగా ఉంటారు. భక్తులపై తన దివ్యకాంతులు ప్రసరింపజేస్తారు. అందుకే స్వామి కైంకర్యాల్లో ఏ లోటూ రాకుండా చూడాలి. దానితో పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలనూ కల్పించాలి. ఇవన్నీ పద్ధతిగా జరిపించడం అంత తేలికైన విషయమేమీ కాదు. అయితే, స్వామివారి అనుగ్రహం ఉంటే అన్నీ వాటంతటవే జరుగుతాయి అంటారు గిరిధర్ గోపాల్. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ముక్కామల గిరిధర్ గోపాల్ అనుభవాలు, అభిప్రాయాలివి... టీటీడీ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టడంపై మీరు ఎలా ఫీలవుతున్నారు? రెవెన్యూ ఎండోమెంట్ ముఖ్యకార్యదర్శిగా, ధర్మకర్తల మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా కొంతమేర మాత్రమే సేవ చేయగలిగేవాణ్ని. కానీ ఇప్పుడు పూర్తికాలం భగవంతునికి, భక్తులకు సేవ చేసే అదృష్టం కలిగింది. దేవస్థానంతో మీ అనుబంధం ఎలాంటిది? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ. పాలనలో పారదర్శకత ఉంది. ఏటా 450కిపైగా ఉత్సవాలు జరుగుతాయిక్కడ. ఇప్పటికే కొన్నింటిలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నాను. శ్రీవేంకటేశ్వరస్వామి వైభవ ప్రాశస్త్యం, ఆ స్వామి లీలలు ప్రత్యక్షంగా అనుభవించాను. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక సంస్థను నడిపించే బాధ్యతను శ్రీవారే నాకు అప్పగించారనిపిస్తోంది. ధర్మకర్తల మండలి, ధార్మిక సంస్థకు వారధిగా ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టానికి లోబడి టీటీడీ పనిచేస్తోంది. నేనూ అదే చేస్తాను. ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యుల అభిప్రాయాలను స్వీకరిస్తాను. అవసరమైతే ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా తీసుకుంటాను. మీరు ఎంచుకున్న ప్రాధాన్యతాంశాలేమిటి? ప్రాధాన్యత అంశాలనడం కంటే వాటిని బాధ్యతలనడం కరెక్ట్. తిరుమల ఆలయంలోనూ, ఇతర అనుబంధ ఆలయాల్లోనూ వందల సంవత్సరాలుగా కైంకర్యాలన్నీ నిర్దిష్టంగా జరుగుతున్నాయి. అటువంటి పవిత్రమైన పూజా కైంకర్యాల్లో ఏ లోటూ రాకుండా చూస్తా. ఆగమశాస్త్ర నిబంధనలు విధిగా అమలు జరిపిస్తా. భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు, బస సౌకర్యాలు మెరుగు పరిచేందుకు, ప్రతి భక్తుడికీ ఆకలే అర్హతగా శుచికరమైన భోజన సదుపాయాలు కల్పించేందుకు సంయుక్తంగా కృషి చేస్తా. సప్తగిరుల ప్రకృతి సంపదను పరిరక్షించేందుకు సభ్యులందరినీ కలుపుకుని పనిచేస్తా. ప్రతి భక్తుడూ తిరుమలకొండపై కాలుష్య రహిత పదార్థాలు వాడే విధంగా ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపడతా. భక్తుల భద్రతపై కూడా దృష్టి పెడుతున్నాం. అలాగే ధర్మప్రచారం, వేద పరిరక్షణను మరింత ముందుకు తీసుకెళతాం. శ్రీనివాస వైభవాన్ని జన బాహుళ్యంలోకి తీసుకెళ్లి భక్తితత్వాన్ని, ధార్మిక చింతనను విస్తరిస్తూనే శ్రీవేంకటేశ్వరస్వామి వైభవ ప్రాశస్త్యాన్ని నలుదిశలా చాటుతాం. సంతృప్తికరమైన దర్శనం కల్పించేందుకు మీ దగ్గర సరికొత్త ప్రణాళికలేమైనా ఉన్నాయా? ఉన్న నిబంధనలు సమర్థవంతంగా అమలు పరిస్తే చాలు, కొత్తవి అవసరం లేదు. టీం మేనేజ్మెంట్ , టైమ్ మేనేజ్మెంట్తో మరింత సమర్థవంతంగా దర్శన సౌలభ్యం కలిగించే ప్రయత్నం చేయాలి. ఆధునిక సాంకేతిక ప్రయోగాలకు ఆలయ ఆగమాలు అనుమతించవు. కాబట్టి అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ ఆ పని చేయాలి. ఓవర్ బ్రిడ్జిని కొంచెం విశాలంగా చేస్తున్నాం. క్యూలో ఉండే భక్తులకు ధార్మిక కథాకాలక్షేపాలు, దైవస్మరణకు అనుకూల వాతావరణం కల్పించటం, పిల్లలకు పాలు అందించడం, అన్న ప్రసాదాలందించటం చేయాలి. అయితే, దర్శన విషయంలో అందే ఫిర్యాదులు భక్తుల నుంచా, దళారుల నుంచా అన్నది కూడా అధ్యయనం చేయాల్సి ఉంది. బస, దర్శనంలో ఇబ్బందుల్ని తగ్గించడానికి రోజులో ఇంతమందినే అనుమతించాలన్న ప్రతిపాదన సంగతేమయ్యింది? పరిమితులు విధించడం వల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. దైవ దర్శనం కోసం వచ్చే భక్తులను కట్టడి చేయడం సరికాదు. అందుకే ఈ ఆలోచన కార్యరూపం దాల్చడం కష్టం. కాబట్టి శక్తివంచన లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించటమే మా ముఖ్య విధి. భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించి, వారిని ఆయా భాషల్లో ఆత్మీయంగా పలుకరించే ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని ఆలోచన. రాబోయే 20 సంవత్సరాల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసి అందుకు తగ్గ ఆచరణాత్మక ప్రణాళికలను ఇప్పుడే రూపొందించాల్సిన అవసరం ఉంది. క్రైసిస్ మేనేజ్మెంట్ కంటే ఒక ఆచరణాత్మక మేనేజ్మెంట్ రూపొందించడం ముఖ్యం! నేత్రద్వారాలు (వెండివాకిలికి అటు ఇటుగా ప్రత్యేక ద్వారాలు, సన్నిధిలో రాములవారి మేడ నుంచి వైకుంఠద్వారం ప్రవేశం వరకు కొత్తద్వారం) తెరవాలని కొందరు, వద్దని మరికొందరు అంటున్నారు...? ఇది భక్తుల విశ్వాసాలతో ముడిపడిన అంశం. కట్టడాల భద్రత పరిశీలించాలి, పరీక్షించాలి, పరిరక్షించాలి. గతంలో తిరుమల ఆలయ తరహాలో తిరుపతి అలిపిరిలో నిర్మించిన శ్రీవారి నమూనా ఆలయంలోని మూవింగ్ ప్లాట్ఫారం ఏర్పాటుకోసం (కదిలే తివాచి) పరిశీలించినా సరైన పరిష్కారం దొరకలేదని గత అనుభవాలు చెబుతున్నాయి. దీనిపై గతంలో ఉన్న నివేదికలు పరిశీలించాలి. ఆలయ అధికారులు, ఆగమ పండితులు, అర్చకులు, ఈ వ్యవస్థపై పట్టున్న రిటైర్డ్ అధికారులను సంప్రదించాల్సిన అవసరం ఉంది. టీటీడీ కొత్త ఈవోగా పరిపాలనలో సరికొత్త సంస్కరణలేమైనా చేపట్టబోతున్నారా? ఎందరో ఐఏఎస్ అధికారులు స్వామి సేవలో, ఆలయ పాలనలో వినూత్న సంస్కరణలు చేశారు. వారందరి కృషి ఫలితంగానే సంస్థ మహోన్నత స్థానంలో ఉంది. ప్రస్తుతమున్న ప్రణాళికలు నిర్వహించడమే పెద్ద పని. కానీ, కార్యాచరణలో ఉన్నచిన్న చిన్న లోపాలు సరిదిద్దుతాం. అధికార వికేంద్రీకరణతో క్షేత్రస్థాయి అధికారులే నిర్ణయాధికారులుగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. వారిలో నిర్వహణా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మార్గదర్శకంగా ఉంటాం. పాలకులు మారిన ప్రతిసారీ రక రకాల దర్శనాలు పుట్టుకొస్తున్నాయి. దీనివల్ల నిత్య కైంకర్యాలకు కోతపడుతోందని మఠాధి పతులు, పీఠాధిపతులు, అర్చకులు ఆవేదన చెందుతున్నారు. దీనికి మరేమంటారు? స్వామి కైంకర్యాల విషయంలో ఆగమ సలహా మండలి సూచనల్ని తప్పక అమలు పరుస్తాం. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు కచ్చితమైన సమయాన్నే పాటిస్తున్నాం. స్వామివారి కైంకర్యాలు, ఆరాధనలన్నీ సంప్రదాయ బద్ధంగానే జరుగుతున్నాయనడంలో సందేహం లేదు. పీఠాధిపతులు, మఠాధి పతులు, అర్చకుల సలహాలను వీలైనంత మేర అమలు చేయడానికి కృషి చేస్తున్నాం. సంప్రదాయంగా, ఆగమోక్తంగా జరుగు తున్న నిత్య కైంకర్యాలను కుదించే ప్రయత్నాలు జరగవు. దీనికి కొనసా గింపుగానే రాత్రి వేళల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను గురువారం మినహాయించి మిగిలిన రోజుల్లో రద్దు చేశాం. ఆ సమయాన్ని కూడా సామాన్య భక్తుల దర్శనానికే కేటాయించాం. ప్రస్తుతం అమలవుతున్న దర్శనాలు, క్యూలైన్లపై కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాం. ఏ చిన్న అవకాశం వచ్చినా సామాన్య భక్తుల దర్శనానికే ప్రాధాన్యత ఇస్తాం. గో సంరక్షణ అంశంలో టీటీడీ అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని ఏవిధంగా అమలు చేయబోతున్నారు? గో సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. అందుకు అనుగుణంగా జాతీయ స్థాయి సదస్సు తిరుపతిలో నిర్వహించాలని భావిస్తున్నాం. గో సంరక్షణను పురాతన, శాస్త్రీయ పద్ధ్దతిలో జరిపితే కలిగే ఉపయోగాలు, ఆర్థిక వెసులుబాటు ఔత్సాహికులకు తెలియజేసే ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తాం. శ్రీవేంకటేశ్వర డెయిరీలో ఒక ప్రదర్శన శాలను ఏర్పరచి, అందులో భారతీయ సంతతి గోవులను ఉంచి వాటి విశిష్టత, వాటి సంరక్షణ ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాలు తెలియజేయబోతున్నాం. ఇందుకోసం రాష్ట్ర దేవాదాయశాఖ సహకారం కూడా తీసుకుంటాం. యువతలో నైతిక ప్రవర్తన, భక్తిభావం, ధార్మిక చింతన పెంపొందేందుకు శుభప్రదం వంటి కార్యక్రమాలను జనంలోకి మరింతగా తీసుకెళ్లే ఆలోచన ఉందా? సనాతన హైందవ ధర్మాలు పరి రక్షించేందుకు, హిందూ ధర్మంలోని అన్ని జాతులు, వర్గాలను ఒకే తాటిపై తెచ్చి ఆధ్యాత్మిక, ధార్మిక ఘనవారసత్వాన్ని గుర్తు చేసుకునేందుకు కొనసాగింపు చర్యలు చేపడతాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదువేల మంది అధ్యాపకులను హిందూ ధార్మిక పరిచయ కార్యక్రమంలో వినియోగించుకోనున్నాం. విద్యార్థులు, యువతరం కోసం హిందూ ధార్మిక పరిషత్ చేపట్టిన ధార్మిక పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. శుభప్రదం కార్యక్రమాన్ని ఏడాదిలో రెండు పర్యాయాలు నిర్వహిస్తూ మానసిక స్థైర్యం, ధార్మిక చింతన, భక్తి భావాలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తాం. విద్యార్థిదశ నుంచే నైతిక ప్రవర్తన తీసుకొచ్చే కార్యక్రమాలను నిర్వహిస్తాం. రోజురోజుకూ ఆర్థిక సంక్షోభం, ప్రకృతి ప్రకోపాలు, జనోద్యమాలు, అశాంతి పెరిగిపోతున్నాయి. మరి టీటీడీ ఏం చేయబోతోంది? ఆలయంలో దైవ సంతర్పణగా చేసే ఉత్సవాలన్నీ లోకకల్యాణానికే కదా! ఇదే సత్సంకల్పంతో నాలుగువందల యాభైకి పైగా ఉత్సవాలు ఆగమ సంప్రదాయంగా తిరుమలలో నిర్వహిస్తున్నారు. ప్రతి దేవాలయాన్నీ సుసంపన్నం చేయాలని ‘మనగుడి’ కార్యక్రమం ద్వారా ఋజువు చేశారు. ఇటువంటి కార్యక్రమాల విషయంలో వెనుకంజ వేసే ప్రశ్నే లేదు. వర్ష యాగాలు, క్రతువులు, హోమాలు, శ్రీవారి కల్యాణాలు నిర్వహించటం సంస్థకు సర్వసాధారణమైన విషయమే. లోకహితం, ప్రకృతి పరిరక్షణ, ఆర్థిక సంక్షోభాల నివారణ, అశాంతి తొలగింపు, భక్తితత్వం వంటి వాటిని పెంపొందించేందుకు ఏదైనా ప్రత్యేక ప్రక్రియ ఉందేమో వేద విశ్వ విద్యాలయం ద్వారా పరిశోధనలు జరిపించాలి. నిజానికి భక్తిభావం పెరిగిననాడు అన్ని రకాల ఉపద్రవాలూ మటుమాయమవుతాయని నా నమ్మకం.