శ్రీవారి సేవ పూర్వజన్మ సుకృతం
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఈవో గిరిధర్ గోపాల్ తెలిపారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించి పది నెలలు పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. శ్రీవారి వద్దకు వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. దేవుడి వద్దకు వచ్చే ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని, ఆధునిక పరిజ్ఞానాన్ని ఉయోగించడం ద్వారా మెరుగైన దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..
- సాక్షి ప్రతినిధి, తిరుపతి
మాలో ఎవరు చేసుకున్న పుణ్యమో
నా అదృష్టమో, నా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టమోగాని నాకు ఇక్కడ పోస్టింగ్ వచ్చింది. మొదట ఇక్కడికి రాగానే అన్నదాన సత్రంలో భోజనం నాణ్యతపై దృష్టిపెట్టాను. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గుర్తించి వారి చేత పని చేయించాలని నిర్ణయించాను. బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజు ఎండోమెంట్ ల్యాండ్ ఇష్యూ వచ్చింది. ఇది ఉద్యోగులకు సంబంధించింది కావడంతో ఎంతవరకైనా చేయాలని అనుకున్నా. మార్కెట్ వాల్యూ ప్రకారం బ్రాహ్మణపట్టు వద్ద కొందరికి, ఇంకోచోట మరికొందరికి మొత్తం 400 మందికి ఇవ్వనున్నాం.
స్వామి వారికి కైంకర్యాలు బాగా జరగాలి
స్వామి వారికి నిత్య కైంకర్యాలు శాస్త్రం ప్రకారం జరగాలి. డ్రస్‌కోడ్ ఉండాలి. అర్చకులను బాగా చూసుకోకుంటే దేశానికి అరిష్టం వస్తుందని జనం నమ్ముతున్నారు. స్వీపర్‌కు రూ.తొమ్మిది వేలు జీతం ఉంటే అర్చకుడికి నాలుగు వేలు ఇస్తున్నారు. ఇందులో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ జరగాలి. దేవస్థానం నుంచి వచ్చే వేస్ట్‌ను వేరుగా డంప్ చేస్తున్నాం. దీన్ని ఎరువుగా తయారు చేసి విక్రయించే దిశగా చర్యలు తీసుకుంటాం.
భక్తులు ఇష్టపడి రావాలి..
తిరుమలకు భక్తులు భయపడుతూ కాకుండా ఇష్టపడి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. క్యూలో అప్పుడప్పుడూ కొంతమేర తోపులాటలు జరుగుతున్న మాట వాస్తవమే. వెంటనే పరిస్థితిని మెరుగుపరుస్తున్నాం. పొట్టి, పొడుగు ఇలా ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకునేలా మూడులైన్లు తయారు చేస్తున్నాం. శ్రీవారి సేవకులు భక్తులను నెట్టే అవకాశం లేకుండా చేస్తున్నాం.
కంపార్ట్‌మెంట్లలో కష్టాలు ఉండకూడదు..
కంపార్ట్‌మెంట్‌లోనూ భక్తులకు ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగులు దగ్గరుండి భక్తులను క్రమబద్ధీకరించడం లేదు. వరుస క్రమంలో కాకుండా భక్తులు ఎలాపడితే అలా కూర్చుం టున్నారు. వారికి దర్శనం ఎప్పుడు అవుతుందో తెలియక ఆందోళన పడాల్సిన పరిస్థితి ఉంటోంది. ఇందులో మార్పు తీసుకురావాల్సి ఉంది. కంపార్ట్‌మెంట్‌లో ఉన్న వారికి కాఫీలు, టీలు, టిఫిన్‌లు ఏది అడిగినా అందజేసేలా చర్యలు తీసుకుంటాం. ఏ కంపార్ట్‌మెంట్‌లో ఏమి జరుగుతుందో తెలుసుకునేలా కెమెరాలు పెట్టాలి. ఇందుకోసం అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడుకోనున్నాం.
కంపార్ట్‌మెంట్లలో ఉద్యోగుల సంఖ్య పెంచుతాం..
కంపార్ట్‌మెంట్లలో ఒక ఏఈవో, ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. అందుకే అక్కడ భక్తులను క్రమబద్ధీకరించడం కుదరడం లేదు. ఈ పరిస్థితి మెరుగునకు అదనపు సిబ్బంది అవసరం. జేఈవో శ్రీనివాసరాజు దీనిపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి వ్యక్తీ రెండు సెకన్ల పాటు స్వామివారిని చూసి వెళుతున్నారు. తద్వారా భక్తులు ఎంతో సంతృప్తి చెందుతున్నారు.
భయం లేదా భక్తి ఉండాలి..
విధి నిర్వహణ విషయంలో సిబ్బందికి భయం లేదా భక్తి ఉండాలి. ఉద్యోగ సంఘాలు అండగా ఉండాయి.. అవి చూసుకుంటాయనే ధీమాలో కొందరు ఉద్యోగుల్లో ఉంది. ఈవోగా నేను చేయాల్సింది చేస్తా. ఉద్యోగులతో పనిచేయించడం నా బాధ్యత. ఆ దిశగానే అడుగులు వేస్తాను.
బయోడీజిల్ ప్రాజెక్ట్‌పై కసరత్తు..
ఆర్‌ఎస్‌ఏ (రెయిన్ షాడో ఏరియా డెవలప్‌మెంట్ కార్యక్రమం) పథకం కింద బయోడీజిల్ ద్వారా రైతులు లక్షలు ఆర్జించవచ్చు. బయోడీజిల్ ద్వారా రైతుల ఆత్మహత్యలను నివారించవచ్చని మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి భావించారు. ఆయన సూచన మేరకు ఈ ప్రాజెక్టు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాం. మాజీ మంత్రి రఘువీరారెడ్డితో కలిసి కొన్ని ప్రాంతాల్లో తిరిగి వచ్చాం. అనంతపురం జిల్లాలో ఐదెకరాలకు సరిపోయే నీటితో 25 ఎకరాల్లో బయోడీజిల్ వేయవచ్చనే నిర్ణారణకు వచ్చాం. అది ముందుకు సాగలేదు.
ఏటూరు నాగారంలో పీవోగా..
మొదట అసిస్టెంట్ కలెక్టర్‌గా 1984లో నిజామాబాద్, కొత్తగూడెం సబ్‌కలెక్టర్‌గా, వరంగ ల్ జిల్లా ఏటూరు నాగారంలో ఐటీడీఏ (కోయా) పీవోగా మూడు సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత ఆదిలాబాద్ కలెక్టర్‌గా పనిచేశాను. జనం సమస్యలను దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. ప్రధానంగా ఏటూ రు నాగారంలో గిరిజనుల అభ్యున్నతికి ఎక్కు వ రోజులు పని చేయడం సంతోషాన్ని కలిగిం చింది. సుశీల్‌కుమార్ షిండే గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయన వద్ద పనిచేశాను. తర్వాత ఏపీపీఎస్‌సీ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్నాను. అక్కడి నుంచి వెంకటేశ్వరస్వామి చెంతకు వచ్చాను.
కుటుంబం గురించి..
నాకు ఇద్దరు కుమారులు. ఒకరు లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రెండో కుమారుడు స్పోర్ట్స్ జర్నలిస్టు. ఆరు నెలలు ఉద్యోగం చేసి మానేశాడు. మణిపాల్‌లో ఇంజినీరింగ్ చదివాడు. ద స్పో ర్ట్స్ క్యాంపస్ డాట్‌కామ్‌కు ఆర్టికల్స్ రాస్తుం టాడు. నాకు మూడేళ్ల సర్వీసు ఉంది. దేవుడి సేవలో ఉండడం ఎంతో సంతోషంగా ఉంది.