తిరుపతి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం! మీకు తెలుసా! \ | Sakshi Special Interview On Tirumala Tirupati Devasthanam Brahmotsavam | Sakshi
Sakshi News home page

తిరుపతి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం! మీకు తెలుసా!

Published Sun, Oct 15 2023 2:07 PM | Last Updated on Thu, Oct 19 2023 11:48 AM

Sakshi Special Interview On Tirumala Tirupati Devasthanam Brahmotsavam

- Sakshi

ఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వసన్నద్ధమవుతోంది. అక్టోబరు 14 నుంచి 23వ తేదీ వరకు తొమ్మిదిరోజుల పాటు పదహారు వాహనాలపై శ్రీవారు తిరువీథుల్లో ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు రానున్న భక్తుల సౌకర్యం కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది. టీటీడీ చైర్మన్‌  హోదాలో భూమన కరుణాకర్‌ రెడ్డికి స్వామివారి సేవచేసే భాగ్యం మరోసారి దక్కింది.

గతంలో చైర్మన్‌గా ఉన్న సమయంలో టీటీడీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. చైర్మన్‌గా మరోసారి అవకాశం వచ్చిన వెంటనే తిరిగి నూతన సంస్కరణలతో హిందూ ధర్మ ప్రచారాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు భక్తి మార్గంలో నడిచేందుకు గోవింద కోటిని ప్రారంభించారు. గోవింద కోటి రాసిన ప్రతి ఒక్కరికీ స్వామివారి దర్శనం లభించేలా పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భూమన కరుణాకర్‌ రెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు.

సాక్షి: టీటీడీ చైర్మన్‌గా మీకు రెండోసారి శ్రీవారి సేవచేసే అవకాశం లభించింది. గతంలో చైర్మన్‌గా ఉన్నప్పుడు టీటీడీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఇంతటి మహద్భాగ్యాన్ని మీరు ఏమనుకుంటున్నారు?
చైర్మన్‌:  శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ఊహించని విధంగా నాకు రెండోసారి టీటీడీ చైర్మన్‌గా పనిచేసే మహద్భాగ్యం దక్కింది. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామివారికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌  రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

• 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఒకవైపు సనాతన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూనే, సామాన్య భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అనేక నిర్ణయాలు తీసుకుని అమలుచేశాం. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించాము.
• ఎందరో ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారులు, ఉద్యోగుల కృషి, స్వామివారి పట్ల అచంచల భక్తి విశ్వాసాలతో పని చేసినందువల్ల టీటీడీలో మంచి వ్యవస్థ ఏర్పడింది. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళి, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా మా ధర్మకర్తల మండలి, అధికారుల సహకారంతో పనిచేస్తాను. ఈ సందర్భంగా గతంలో నా నేతృత్వంలో చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి తెలియజేయడం సముచితమని భావిస్తున్నాను.

దళిత గోవిందం!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారితో పాటు శ్రీదేవి, భూదేవిని దళితవాడలకు తీసుకుని వెళ్ళి అక్కడే కల్యాణం నిర్వహించి వారికి స్వామివారి ఆశీస్సులు అందజేసే దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎంతోమంది పీఠాధిపతులు, మఠాధిపతులతో పాటు, శ్రీవారి ఆలయ అర్చకులు అంతా దళిత వాడలకు వెళ్ళి కల్యాణం అనంతరం అక్కడే నిద్రించాం. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు స్వామివారినే దళితుల చెంతకు తీసుకుని వెళ్ళాం. దీనికి కొనసాగింపుగా గిరిజన గ్రామాల్లో గిరిజన గోవిందం, మత్స్యకార గ్రామాల్లో మత్స్య గోవిందం కార్యక్రమాలు కూడా నిర్వహించాం.

శ్రీనివాస కల్యాణాలు
భగవంతున్నే భక్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆశీస్సులు అందించేలా, స్వామివారి కల్యాణాన్ని వారంతా చూసి ఆనందించేలా శ్రీనివాస కల్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించాం.

కల్యాణమస్తు!
పిల్లల పెళ్లిళ్లకు అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోతున్న పేద, మధ్య తరగతి వర్గాల వారికి చేయూతనివ్వడానికి నిర్వహించిన కార్యక్రమమే కళ్యాణమస్తు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 35 వేలకు పైగా జంటలకు స్వామివారి సమక్షంలో పెళ్లి చేసి ఆయన ఆశీస్సులు అందింపజేశాం.

అందరికీ అన్నప్రసాదం
2006కు ముందు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే అన్నదానంలో భోజనం చేసే అవకాశం ఉండేది. మా హయాంలో దర్శనంతో సంబంధం లేకుండా కొండ మీదకు వచ్చిన ప్రతి భక్తునికీ రెండు పూటలా కడుపు నిండా భోజనం చేసే అవకాశం కల్పించాం.

నాలుగుమాడ వీథుల్లో పాదరక్షలు నిషేధం..
తిరుమల ఆలయ పవిత్రతను కాపాడడానికి నాలుగుమాడ వీ«థుల్లో పాదరక్షలతో ప్రవేశాన్ని నిషేధించాం.

చంటిబిడ్డ తల్లులకు మహాద్వారం పక్కనుంచి ఆలయ ప్రవేశం
చంటిబిడ్డలతో స్వామివారి దర్శనానికి వచ్చే తల్లులు క్యూల్లో చాలా ఇబ్బందిపడే వారు. దీన్ని గమనించి చంటిబిడ్డలతో పాటు తల్లులు మహాద్వారం కుడివైపు నుంచి ప్రత్యేక క్యూ ద్వారా ఆలయంలోకి వెళ్ళేలా నిర్ణయం తీసుకున్నాం.

పుష్కరిణి హారతి..
ఎంతో పవిత్రమైన స్వామివారి పుష్కరిణికి ప్రతిరోజూ హారతి ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశాం.

పౌర్ణమి గరుడ సేవ..
బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన స్వామివారి గరుడ సేవను భక్తులు చూసి తరించడానికి ప్రతి పౌర్ణమికి నాలుగు మాడ వీథుల్లో స్వామివారి గరుడ సేవ జరిపేలా నిర్ణయం తీసుకున్నాం.

ఆర్జిత సేవలో పాల్గొనే వారు పంచె కట్టుకునే నిర్ణయం!
స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయబద్ధంగా పంచె కట్టుకుని వచ్చేలా నిర్ణయం అమలు చేశాం. ఇప్పుడు సేవలతో పాటు బ్రేక్‌ దర్శనంలో కూడా ఈ విధానం అమలవుతోంది. అలాగే స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు తిరునామం ధరించి వెళ్లే ఏర్పాటు చేశాం.

మహిళా క్షురకుల నియామకం:
కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించే మహిళలకు మహిళలే తలనీలాలు తీసేందుకు మహిళా క్షురకులను నియమించాం.

దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికీ ఉచిత లడ్డు
సర్వదర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికీ ఉచితంగా ఒక చిన్న లడ్డు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాం.

శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి రోజూ సహస్ర దీపాలంకార సేవ ప్రారంభించాం.

నడకమార్గంలో దశావతార విగ్రహాలు
అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం కల్పించడానికి దశావతార మూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయించాం.

హిందువులకే ఉద్యోగాలు!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీలో హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా నిర్ణయం చేశాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేత చట్టం చేయించి అమలు చేశాం.

ఎస్వీబీసీ
శ్రీ వేంకటేశ్వర స్వామివారి కీర్తిని, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ను ఏర్పాటు చేశాం. అలాగే ఎఫ్‌ఎం రేడియోను కూడా ప్రారంభించాం.

వేద విశ్వవిద్యాలయం
వేద పరిరక్షణకు టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయించడంలో కీలక పాత్ర పోషించాను. అప్పటి గవర్నర్‌ శ్రీరామేశ్వర్‌ ఠాకూర్‌తో అనేకసార్లు చర్చించి అనుమతులు మంజూరు చేయించాను. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారి సంపూర్ణ సహకారంతో విశ్వ విద్యాలయం ప్రారంభమైంది.

విద్యార్థులకు ఉచిత భోజనం
టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతూ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నాం.

108 అడుగుల అన్నమయ్య విగ్రహం
శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై 32 వేల సంకీర్తనలు రచించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహాన్ని ఆయన జన్మస్థలానికి సమీపంలో ఉన్న రాజంపేటలో ఏర్పాటు చేయించాం.

గోమహాసమ్మేళనం!
సనాతన హిందూ ధర్మంలో గోమాతకు ఉన్న విశిష్టత ఎంతో గొప్పది. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామివారే గో సంరక్షణకు ముందుకు వచ్చారు. అలాంటి గోవిందుడి ఆశీస్సులతో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున గో మహాసమ్మేళనం నిర్వహించాం. పీఠాధిపతులు, మఠాధిపతులు, గో ప్రేమికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోమాత విశిష్టతను ప్రపంచానికి చాటుతూ గో సంరక్షణ కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం పండిత, పామరుల మన్ననలు పొందింది.

ధార్మిక సదస్సు
సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు తిరుమల ఆస్థాన మండపంలో పెద్ద ఎత్తున ధార్మిక సదస్సు నిర్వహించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరై అనేక సూచనలు చేయడంతోపాటు ధర్మకర్తల మండలి చేస్తున్న హిందూ ధర్మ ప్రచారం పై ప్రశంసలు కురిపించారు.

అమృతోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానం 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పెద్ద ఎత్తున అమృతోత్సవాలు నిర్వహించాం.

ద్వాదశి
శ్రీవైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖంగా నిర్వహించే కైశిక ద్వాదశి ఉత్సవాన్ని ప్రారంభించాం.

మాలదాసర్లకు ప్రోత్సాహకాలు
గ్రామీణ ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మప్రచారకులుగా పనిచేస్తున్న మాలదాసర్లు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాం.

ఎస్సీ, ఎస్టీలకు అర్చక శిక్షణ
ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని ఆలయాల్లో అర్చకులుగా పనిచేస్తున్న వారికి అర్చక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాం.

స్థానికాలయాల్లో దిట్టం పెంపు
తిరుపతికి బయట ఉన్న టీటీడీ ఆలయాల్లో ప్రసాదాల దిట్టం, తీర్థం పెంచడం జరిగింది. అన్ని ఆలయాల్లోనూ మూలవర్లకు పట్టువస్త్రాలను అలంకరించేలా నిర్ణయం తీసుకున్నాం..

వకుళమాత ఆలయం
తిరుపతికి సమీపంలోని పేరూరు బండ మీద శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని గుర్తించి, అది వకుళమాత ఆలయంగా నిర్ధారించాం.

అర్చకులకు జీతాలు పెంపు
అర్చకులకు జీతాలు పెంచడంతో పాటు వారికి ఉద్యోగ భద్రత కల్పించాం.

సాక్షి: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
చైర్మన్‌: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని నిర్ణయించాం. భక్తుల రద్దీ దృష్ట్యా బ్రేక్‌ దర్శనాలు, వృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఎన్‌ ఆర్‌ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనాలు తదితర ప్రివిలేజ్డ్‌ దర్శనాలను రద్దు చేశాం. ఆర్జిత సేవలు, రూ.300 టికెట్ల దర్శనాలతో పాటు అన్ని ట్రస్టు దాతలకు దర్శన టికెట్లను రద్దు చేశాం. వీఐపీల దర్శన సమయాన్ని కూడా రద్దు చేయడం ద్వారా సాధారణ రోజుల కంటే అధికంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశాం. ఈ నిర్ణయం వల్ల రోజుకు అదనంగా 15 వేల మంది సామాన్యభక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు.

సాక్షి: బ్రహ్మోత్సవాలకు విశేషంగా తరలి వచ్చే భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయి?
చైర్మన్‌: తిరుమలలో ఉన్న 7 వేల గదుల్లో కొన్ని మరమ్మతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం 25 వేల మందికి సరిపడా వసతి మాత్రమే ఉంది. ఉన్న గదుల్లో 50 శాతం గదులను భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచాం. మిగిలిన 50 శాతం గదులను ఆఫ్‌లైన్‌లో ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన కేటాయిస్తున్నాం. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోని వసతి సముదాయాల్లో గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

సాక్షి: భక్తులు అన్న ప్రసాదాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
చైర్మన్‌: సాధారణ రోజుల్లో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 వరకు, గరుడసేవ రోజున రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం అందించేలా అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేశాం.

సాక్షి: తిరుమలకు వచ్చే భక్తులందరికీ లడ్డూ, ప్రసాదం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
చైర్మన్‌: బ్రహ్మోత్సవాల్లో లడ్డూ ప్రసాదాలు భక్తులందరికీ అందించేందుకు వీలుగా తొమ్మిది లక్షల లడ్డూలు బఫర్‌ స్టాక్‌ ఉండేలా ఏర్పాట్లు చేశాం.

సాక్షి: ఈసారి గరుడసేవకు గతంలో కంటే అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా. భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
చైర్మన్‌: అక్టోబర్‌ 19న గరుడసేవ రోజున అదనంగా మరిన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గరుడ వాహనాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

సాక్షి: భక్తులు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా మాడవీథుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
చైర్మన్‌: లక్షలాదిగా వచ్చే భక్తులు మాడవీథుల్లో స్వామివారి వాహనసేవలను చూసి తరించాలనుకుంటారు. ఇందుకు అనుగుణంగా మాడవీథుల్లో ఉండే ప్రతి భక్తుడికీ స్వామివారి వాహనసేవ దర్శనం లభించేలా ప్రణాళిక రూపొందించాం. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అపురూపమైన కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల సమన్వయంతో బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో ఇరవై నాలుగు గంటలూ పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది.

సాక్షి: లక్షలాది భక్తులు వచ్చే తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
చైర్మన్‌: ఒక పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించి, పర్యావరణ పరిరక్షణకు చారిత్రక నిర్ణయం తీసుకోవడం దేశంలో తిరుమలలో మాత్రమే జరిగింది. బ్రహ్మోత్సవాలకు దేశంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గుర్తించి తిరుమలకు ప్లాస్టిక్‌ బాటిళ్లు, సంచులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అలిపిరి వద్ద విజిలెన్స్‌ సిబ్బంది ప్లాస్టిక్‌ బాటిళ్లు, సంచులను తిరుమలకు రాకుండా చేసే తనిఖీలకు భక్తులు సహకరించి తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతకు సహకారం అందించాలని కోరుతున్నాం. - లక్ష్మీకాంత్‌ అలిదేన, సాక్షి, తిరుమల

ఇవి చదవండి: 'శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి' కి స్వయాన తోబుట్టువు.. ఎవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement