ttd brahmotsavam
-
TTD: అర్ధ బ్రహ్మోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు..
తిరుమల: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఒకేరోజు స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వడంతో దీనిని అర్ధ బ్రహ్మోత్సవమని, ఒకరోజు బ్రహ్మోత్సవమని కూడా పిలుస్తారు. మాడ వీధుల్లో ఏర్పాట్లు భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా అఖిలాండం వద్ద, మాడ వీధుల్లో అవసరమైన ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లో కూల్ పెయింట్ వేశారు. ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా సాంబారన్న, పెరుగన్నం, పులిహోర, పొంగళి తదితర అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, టి, కాఫీ, పాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక దర్శనాలు రద్దు ఫిబ్రవరి 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 15 నుండి 17వ తేదీ వరకు తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్ల జారీ ఉండదు. భక్తులు నేరుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. కాగా, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు నిర్దేశించిన టైంస్లాట్లను పాటించని పక్షంలో టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి పంపుతారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది. ఇతర ఏర్పాట్లు ఫిబ్రవరి 14 నుండి 16వ తేదీ వరకు గదుల కేటాయింపు కోసం సిఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయి. ఈ రోజుల్లో ఎంబిసి, టిబి కౌంటర్లను మూసివేస్తారు. కౌంటర్లలో 4 లక్షలతో పాటు అదనంగా మరో 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనసేవలు శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ, ఉదయం 9 నుండి 10 గంటల వరకు చిన్నశేష, ఉదయం 11 నుండి 12 గంటల వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు హనుమంత వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు కల్పవృక్ష, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వభూపాల, రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై భక్తులను కటాక్షిస్తారు. వాహనసేవలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఆర్జితసేవలు రద్దు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భక్తుల కోసం చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం టీటీడీ సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీమతి మలికా గార్గ్ కలిసి పరిశీలించారు. భక్తులు గ్యాలరీల్లోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు ఏర్పాటు చేసిన మార్గాలను తనిఖీ చేశారు. మాడ వీధులతోపాటు భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై విజిలెన్స్, పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుమలలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, పార్కింగ్ ప్రదేశాలకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. వీరి వెంట టీటీడీ నిఘా, భద్రతా అధికారులు, తిరుమల పోలీసు అధికారులు ఉన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 12 గంటల సమయం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తులతో 3 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 68,363 మంది భక్తులు దర్శించుకోగా 19,609 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.55 కోట్లు వచ్చిందని తెలిపారు. -
తిరుపతి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం! మీకు తెలుసా! \
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వసన్నద్ధమవుతోంది. అక్టోబరు 14 నుంచి 23వ తేదీ వరకు తొమ్మిదిరోజుల పాటు పదహారు వాహనాలపై శ్రీవారు తిరువీథుల్లో ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు రానున్న భక్తుల సౌకర్యం కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది. టీటీడీ చైర్మన్ హోదాలో భూమన కరుణాకర్ రెడ్డికి స్వామివారి సేవచేసే భాగ్యం మరోసారి దక్కింది. గతంలో చైర్మన్‌గా ఉన్న సమయంలో టీటీడీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. చైర్మన్‌గా మరోసారి అవకాశం వచ్చిన వెంటనే తిరిగి నూతన సంస్కరణలతో హిందూ ధర్మ ప్రచారాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు భక్తి మార్గంలో నడిచేందుకు గోవింద కోటిని ప్రారంభించారు. గోవింద కోటి రాసిన ప్రతి ఒక్కరికీ స్వామివారి దర్శనం లభించేలా పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు. సాక్షి: టీటీడీ చైర్మన్‌గా మీకు రెండోసారి శ్రీవారి సేవచేసే అవకాశం లభించింది. గతంలో చైర్మన్‌గా ఉన్నప్పుడు టీటీడీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఇంతటి మహద్భాగ్యాన్ని మీరు ఏమనుకుంటున్నారు? చైర్మన్: శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ఊహించని విధంగా నాకు రెండోసారి టీటీడీ చైర్మన్‌గా పనిచేసే మహద్భాగ్యం దక్కింది. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామివారికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. • 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఒకవైపు సనాతన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూనే, సామాన్య భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అనేక నిర్ణయాలు తీసుకుని అమలుచేశాం. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించాము. • ఎందరో ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారులు, ఉద్యోగుల కృషి, స్వామివారి పట్ల అచంచల భక్తి విశ్వాసాలతో పని చేసినందువల్ల టీటీడీలో మంచి వ్యవస్థ ఏర్పడింది. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళి, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా మా ధర్మకర్తల మండలి, అధికారుల సహకారంతో పనిచేస్తాను. ఈ సందర్భంగా గతంలో నా నేతృత్వంలో చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి తెలియజేయడం సముచితమని భావిస్తున్నాను. దళిత గోవిందం! తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారితో పాటు శ్రీదేవి, భూదేవిని దళితవాడలకు తీసుకుని వెళ్ళి అక్కడే కల్యాణం నిర్వహించి వారికి స్వామివారి ఆశీస్సులు అందజేసే దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎంతోమంది పీఠాధిపతులు, మఠాధిపతులతో పాటు, శ్రీవారి ఆలయ అర్చకులు అంతా దళిత వాడలకు వెళ్ళి కల్యాణం అనంతరం అక్కడే నిద్రించాం. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు స్వామివారినే దళితుల చెంతకు తీసుకుని వెళ్ళాం. దీనికి కొనసాగింపుగా గిరిజన గ్రామాల్లో గిరిజన గోవిందం, మత్స్యకార గ్రామాల్లో మత్స్య గోవిందం కార్యక్రమాలు కూడా నిర్వహించాం. శ్రీనివాస కల్యాణాలు భగవంతున్నే భక్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆశీస్సులు అందించేలా, స్వామివారి కల్యాణాన్ని వారంతా చూసి ఆనందించేలా శ్రీనివాస కల్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించాం. కల్యాణమస్తు! పిల్లల పెళ్లిళ్లకు అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోతున్న పేద, మధ్య తరగతి వర్గాల వారికి చేయూతనివ్వడానికి నిర్వహించిన కార్యక్రమమే కళ్యాణమస్తు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 35 వేలకు పైగా జంటలకు స్వామివారి సమక్షంలో పెళ్లి చేసి ఆయన ఆశీస్సులు అందింపజేశాం. అందరికీ అన్నప్రసాదం 2006కు ముందు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే అన్నదానంలో భోజనం చేసే అవకాశం ఉండేది. మా హయాంలో దర్శనంతో సంబంధం లేకుండా కొండ మీదకు వచ్చిన ప్రతి భక్తునికీ రెండు పూటలా కడుపు నిండా భోజనం చేసే అవకాశం కల్పించాం. నాలుగుమాడ వీథుల్లో పాదరక్షలు నిషేధం.. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడడానికి నాలుగుమాడ వీ«థుల్లో పాదరక్షలతో ప్రవేశాన్ని నిషేధించాం. చంటిబిడ్డ తల్లులకు మహాద్వారం పక్కనుంచి ఆలయ ప్రవేశం చంటిబిడ్డలతో స్వామివారి దర్శనానికి వచ్చే తల్లులు క్యూల్లో చాలా ఇబ్బందిపడే వారు. దీన్ని గమనించి చంటిబిడ్డలతో పాటు తల్లులు మహాద్వారం కుడివైపు నుంచి ప్రత్యేక క్యూ ద్వారా ఆలయంలోకి వెళ్ళేలా నిర్ణయం తీసుకున్నాం. పుష్కరిణి హారతి.. ఎంతో పవిత్రమైన స్వామివారి పుష్కరిణికి ప్రతిరోజూ హారతి ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశాం. పౌర్ణమి గరుడ సేవ.. బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన స్వామివారి గరుడ సేవను భక్తులు చూసి తరించడానికి ప్రతి పౌర్ణమికి నాలుగు మాడ వీథుల్లో స్వామివారి గరుడ సేవ జరిపేలా నిర్ణయం తీసుకున్నాం. ఆర్జిత సేవలో పాల్గొనే వారు పంచె కట్టుకునే నిర్ణయం! స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయబద్ధంగా పంచె కట్టుకుని వచ్చేలా నిర్ణయం అమలు చేశాం. ఇప్పుడు సేవలతో పాటు బ్రేక్ దర్శనంలో కూడా ఈ విధానం అమలవుతోంది. అలాగే స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు తిరునామం ధరించి వెళ్లే ఏర్పాటు చేశాం. మహిళా క్షురకుల నియామకం: కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించే మహిళలకు మహిళలే తలనీలాలు తీసేందుకు మహిళా క్షురకులను నియమించాం. దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికీ ఉచిత లడ్డు సర్వదర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికీ ఉచితంగా ఒక చిన్న లడ్డు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాం. శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి రోజూ సహస్ర దీపాలంకార సేవ ప్రారంభించాం. నడకమార్గంలో దశావతార విగ్రహాలు అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం కల్పించడానికి దశావతార మూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయించాం. హిందువులకే ఉద్యోగాలు! ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీలో హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా నిర్ణయం చేశాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేత చట్టం చేయించి అమలు చేశాం. ఎస్వీబీసీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి కీర్తిని, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ను ఏర్పాటు చేశాం. అలాగే ఎఫ్ఎం రేడియోను కూడా ప్రారంభించాం. వేద విశ్వవిద్యాలయం వేద పరిరక్షణకు టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయించడంలో కీలక పాత్ర పోషించాను. అప్పటి గవర్నర్ శ్రీరామేశ్వర్ ఠాకూర్‌తో అనేకసార్లు చర్చించి అనుమతులు మంజూరు చేయించాను. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిగారి సంపూర్ణ సహకారంతో విశ్వ విద్యాలయం ప్రారంభమైంది. విద్యార్థులకు ఉచిత భోజనం టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతూ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై 32 వేల సంకీర్తనలు రచించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహాన్ని ఆయన జన్మస్థలానికి సమీపంలో ఉన్న రాజంపేటలో ఏర్పాటు చేయించాం. గోమహాసమ్మేళనం! సనాతన హిందూ ధర్మంలో గోమాతకు ఉన్న విశిష్టత ఎంతో గొప్పది. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామివారే గో సంరక్షణకు ముందుకు వచ్చారు. అలాంటి గోవిందుడి ఆశీస్సులతో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున గో మహాసమ్మేళనం నిర్వహించాం. పీఠాధిపతులు, మఠాధిపతులు, గో ప్రేమికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోమాత విశిష్టతను ప్రపంచానికి చాటుతూ గో సంరక్షణ కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం పండిత, పామరుల మన్ననలు పొందింది. ధార్మిక సదస్సు సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు తిరుమల ఆస్థాన మండపంలో పెద్ద ఎత్తున ధార్మిక సదస్సు నిర్వహించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరై అనేక సూచనలు చేయడంతోపాటు ధర్మకర్తల మండలి చేస్తున్న హిందూ ధర్మ ప్రచారం పై ప్రశంసలు కురిపించారు. అమృతోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పెద్ద ఎత్తున అమృతోత్సవాలు నిర్వహించాం. ద్వాదశి శ్రీవైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖంగా నిర్వహించే కైశిక ద్వాదశి ఉత్సవాన్ని ప్రారంభించాం. మాలదాసర్లకు ప్రోత్సాహకాలు గ్రామీణ ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మప్రచారకులుగా పనిచేస్తున్న మాలదాసర్లు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాం. ఎస్సీ, ఎస్టీలకు అర్చక శిక్షణ ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని ఆలయాల్లో అర్చకులుగా పనిచేస్తున్న వారికి అర్చక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. స్థానికాలయాల్లో దిట్టం పెంపు తిరుపతికి బయట ఉన్న టీటీడీ ఆలయాల్లో ప్రసాదాల దిట్టం, తీర్థం పెంచడం జరిగింది. అన్ని ఆలయాల్లోనూ మూలవర్లకు పట్టువస్త్రాలను అలంకరించేలా నిర్ణయం తీసుకున్నాం.. వకుళమాత ఆలయం తిరుపతికి సమీపంలోని పేరూరు బండ మీద శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని గుర్తించి, అది వకుళమాత ఆలయంగా నిర్ధారించాం. అర్చకులకు జీతాలు పెంపు అర్చకులకు జీతాలు పెంచడంతో పాటు వారికి ఉద్యోగ భద్రత కల్పించాం. సాక్షి: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చైర్మన్: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని నిర్ణయించాం. భక్తుల రద్దీ దృష్ట్యా బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఎన్ ఆర్ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనాలు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేశాం. ఆర్జిత సేవలు, రూ.300 టికెట్ల దర్శనాలతో పాటు అన్ని ట్రస్టు దాతలకు దర్శన టికెట్లను రద్దు చేశాం. వీఐపీల దర్శన సమయాన్ని కూడా రద్దు చేయడం ద్వారా సాధారణ రోజుల కంటే అధికంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశాం. ఈ నిర్ణయం వల్ల రోజుకు అదనంగా 15 వేల మంది సామాన్యభక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. సాక్షి: బ్రహ్మోత్సవాలకు విశేషంగా తరలి వచ్చే భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయి? చైర్మన్: తిరుమలలో ఉన్న 7 వేల గదుల్లో కొన్ని మరమ్మతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం 25 వేల మందికి సరిపడా వసతి మాత్రమే ఉంది. ఉన్న గదుల్లో 50 శాతం గదులను భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచాం. మిగిలిన 50 శాతం గదులను ఆఫ్‌లైన్‌లో ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన కేటాయిస్తున్నాం. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోని వసతి సముదాయాల్లో గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సాక్షి: భక్తులు అన్న ప్రసాదాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చైర్మన్: సాధారణ రోజుల్లో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 వరకు, గరుడసేవ రోజున రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం అందించేలా అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేశాం. సాక్షి: తిరుమలకు వచ్చే భక్తులందరికీ లడ్డూ, ప్రసాదం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చైర్మన్: బ్రహ్మోత్సవాల్లో లడ్డూ ప్రసాదాలు భక్తులందరికీ అందించేందుకు వీలుగా తొమ్మిది లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉండేలా ఏర్పాట్లు చేశాం. సాక్షి: ఈసారి గరుడసేవకు గతంలో కంటే అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా. భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? చైర్మన్: అక్టోబర్ 19న గరుడసేవ రోజున అదనంగా మరిన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గరుడ వాహనాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సాక్షి: భక్తులు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా మాడవీథుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చైర్మన్: లక్షలాదిగా వచ్చే భక్తులు మాడవీథుల్లో స్వామివారి వాహనసేవలను చూసి తరించాలనుకుంటారు. ఇందుకు అనుగుణంగా మాడవీథుల్లో ఉండే ప్రతి భక్తుడికీ స్వామివారి వాహనసేవ దర్శనం లభించేలా ప్రణాళిక రూపొందించాం. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అపురూపమైన కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల సమన్వయంతో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో ఇరవై నాలుగు గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. సాక్షి: లక్షలాది భక్తులు వచ్చే తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చైర్మన్: ఒక పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి, పర్యావరణ పరిరక్షణకు చారిత్రక నిర్ణయం తీసుకోవడం దేశంలో తిరుమలలో మాత్రమే జరిగింది. బ్రహ్మోత్సవాలకు దేశంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గుర్తించి తిరుమలకు ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అలిపిరి వద్ద విజిలెన్స్ సిబ్బంది ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులను తిరుమలకు రాకుండా చేసే తనిఖీలకు భక్తులు సహకరించి తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతకు సహకారం అందించాలని కోరుతున్నాం. - లక్ష్మీకాంత్ అలిదేన, సాక్షి, తిరుమల ఇవి చదవండి: 'శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి' కి స్వయాన తోబుట్టువు.. ఎవరంటే? -
తిరుమలలో నేటి నుంచి మూడ్రోజుల పాటు కారీరిష్టి యాగం
తిరుమల : దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ఆగస్టు 22 నుండి 26వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలను నిర్వహించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలని, దేశమంతటా శాంతిని కాంక్షిస్తూ నేటి నుంచి తిరుమలలో కారీరిష్టి, వరుణ, పర్జన్య శాంతి యాగాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే యాగ క్రతువు ఆరు రోజుల పాటు కొనసాగి, 26వ తేదీన తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో జరిగే అవబృదేష్టితో ముగుస్తుంది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనుండగా 32 మంది వేద, శ్రౌత, స్మార్థపండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆగస్టు 26న మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ధర్మగిరిలో మూడ్రోజులు వరుణజపం నిర్వహించనున్నారు అర్చకులు. ఈనెల 26న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేసి 27 నుంచి మూడ్రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆన్లైన్లో టికెట్లు.. ఈ యాగాలు పూర్తయ్యాక వచ్చేనెల తితిదేలో సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వాటిని అనుసరిస్తూ అక్టోబర్ 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక నవంబర్ నెలలో జరగనున్న కార్యక్రమాలకు నేడే ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయనున్నారు. ఉ.10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవా, సహస్ర దీపాలంకరణ టికెట్లు విడుదల చేయనున్నారు. ఇది కూడా చదవండి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం -
తిరుమలలో ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు: ఈవో ధర్మారెడ్డి
సాక్షి, తిరుపతి: అధిక మాసం కారణంగా.. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రం సిద్ధమైంది. సోమవారం అన్నమయ్య భవన్లో అన్నివిభాగాల అధికారులతో ఈవో ధర్మారెడ్డి సోమవారం సమావేశం నిర్వహించి.. బ్రహోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించి.. అనంతరం అధికారిక ప్రకటన చేశారు. సెప్టెంబరు 18 నుండి 26 వరకూ సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15వ తేదీ నుండి 23 వరకు తేదీ వరకూ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉంటాయని వెల్లడించారాయన. ఈ ఏడాదిలో అధిక మాసం కారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రంను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణం కార్యక్రమంను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 22వ తారీఖున గరుడ సేవ, 23వ తేదీన స్వర్ణరథం, 25వ తేదీన రథోత్సవం, 26వ తేదీన చక్రస్నానం, తిరుమలలో వైభవంగా ధ్వజావరోహణం కార్యక్రమంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు మాత్రమే ఉంటుందని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారాయన. ఇక అధిక మాసం కారణంగా ఈ ఏడాది అక్టోబర్ నెలలో 14-18వ తేదీల నడుమ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారాయన. అక్టోబర్ 18వ తారీఖున గరుడవాహన సేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు.. ఈ ఏడాది పెరటాసి మాసంలో రెండు బ్రహ్మోత్సవాలు ఉన్న క్రమంలో భారీ స్ధాయిలో భక్తులు తిరుమల బ్రహ్మోత్సవాలకు విచ్చేసే అవకాశం ఉండొచ్చన్నారాయన. పవిత్ర మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుందన్నారు. అలాగే.. సెప్టెంబర్ 23, 30, అక్టోబర్ 7, 14 తేదీల్లో పురటాసి శనివారాలు జరుగుతాయని, కాబట్టి ఈ రెండు బ్రహ్మోత్సవాలు, పురటాసి శనివారాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. టీడీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు. -
మేల్ చాట్ వస్త్ర సేవ ఎప్పుడు ప్రారంభమైంది?
శ్రీవారి ఆలయంలో స్వామివారికి నిర్వహించే సేవలు అన్నింటిలోనూ విశిష్టమైనది ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవ. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఒక మరపురాని దివ్యానుభూతిని కలిగిస్తుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఆలయంలో స్థలాభావం దృష్ట్యా ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవలో ప్రత్యక్షంగా పాల్గొనే మహద్భాగ్యం 130 నుంచి 140 మంది భక్తులకు మాత్రమే లభిస్తుంది. అభిషేకం జరిగే సమయంలో నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. సాధారణంగా స్వామివారిని పుష్పాలతో, ఆభరణాలతో, పట్టువస్త్రాలతో అలంకరణ చేసిన తర్వాతనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అభిషేక సేవ సమయంలో మాత్రం ఇవేమీ లేకుండా స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది. అది శ్రీవారి భక్తులకు ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పుకోవచ్చు. 1980 కి పూర్వం స్వామి వారికి ఇప్పటిలా ప్రతి శుక్రవారం నూతన మేల్ చాట్ వస్త్రంతో అలంకరణ జరిగేది కాదు. ఏడాదికి నాలుగు సందర్భాలలో మాత్రమే స్వామివారికి నూతన పట్టువస్త్రాలను సమర్పించేవారట. దీనితో ప్రతి శుక్రవారం నూతన పట్టువస్త్రాన్ని స్వామి వారికి సమర్పించాలని అప్పటి ఈవో పీవీఆర్ కే ప్రసాద్ తలచారట. ఇది టీటీడీకి ఆర్థికంగా కాస్త భారమైన అంశం కావడంతో భక్తుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారట. అప్పట్లోనే స్వామివారి అలంకరణకు వినియోగించే వస్త్రం విలువ ఎనిమిదివేల రూపాయలు కావడంతో టీటీడీ నూతనంగా 8 వేల రూపాయలు చెల్లించిన భక్తులు పాల్గొనేందుకు మేల్ చాట్ వస్త్రం టికెట్లను ప్రారంభించింది. మేల్ చాట్ వస్త్రం టికెట్లు కలిగిన భక్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో పాటు అత్యంత సమీపం నుంచి స్వామివారి అభిషేక దర్శనం వీక్షించగలుగుతారు. ఈ సేవను ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరంలో ప్రతి శుక్రవారం ఎవరో ఒక భక్తుడు మాత్రమే ముందుకు వచ్చే సంప్రదాయం ఉండగా అటు తర్వాత క్రమంగా మేల్ చాట్ వస్త్రానికి ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే ఒకదశలో మేల్ చాట్ వస్త్రాన్ని ముందస్తుగా కొన్ని సంవత్సరాల ముందుగానే భక్తులు కొనుగోలు చేసేవారు. ఒకే కుటుంబానికి చెందిన వారే కొన్ని వందల టికెట్లను కొనుగోలు చేయడంతో టీటీడీ పునరాలోచనలో పడింది. దీంతో ఏడాదికి ఒక్కో కుటుంబానికి ఒక టికెట్నే పరిమితం చేస్తూ మిగిలిన టికెట్లను రద్దు చేసి వాటిని లక్కీడిప్ విధానంలో భక్తులకు కేటాయించే విధానాన్ని టీటీడీ 2009 నుంచి ప్రారంభించింది. (క్లిక్ చేయండి: ఆనతినీయరా స్వామీ... నిత్య హారతికి) -
అలనాడు బ్రహ్మోత్సవాలే... కల్యాణోత్సవాలు
శ్రీవారి ఆలయంలో స్వామివారికి నిత్యకల్యాణోత్సవం జరుగుతుంది. కాని ప్రాచీనకాలంలో ఈ నిత్యకల్యాణోత్సవ సంప్రదాయం ఉన్నట్లు కనిపించదు. అప్పట్లో బ్రహ్మోత్సవాలనే స్వామివారి కల్యాణోత్సవాలుగా భావించేవారని తెలుస్తోంది. కాని బ్రహ్మోత్సవాలలో స్వామివారికి, అమ్మవారికి కల్యాణం చేసే ఉత్సవం ఏమీ ఉండదు. శ్రీవారి ఆలయంలో స్వామివారికి వివాహోత్సవాన్ని మొదటిసారి 1546 జూలై 17వ తేదీన తాళ్లపాక పెద తిరుమలాచార్యులు ప్రారంభించినట్లు శాసనంలో కనిపిస్తుంది. ఆనాటి సంప్రదాయంగా ఐదు రోజులు శ్రీవారి వివాహ కార్యక్రమాన్ని దగ్గరుండి ఎంతో ఘనంగా నిర్వహించారు. అనురాధ నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ వరకు ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలను మార్చి, ఏప్రిల్ మాసాలలో నిర్వహించేవారు. ఆ రోజుల్లో 5 రోజుల వివాహంలో జరిగే అన్ని తతంగాలను, లాంఛనాలను ఈ వివాహంలో జరిపించేవారు. స్వామివారికి అభ్యంగనస్నానం, తిరుమంజనం, నూతన వస్త్రధారణ, తిరువీథి ఉత్సవం, నైవేద్యం, స్వామివారిని, దేవేరులను ఉయ్యాలపై ఉంచి చేసే ఉయ్యాలసేవ, పెళ్లికొడుకు పాదాలను క్షీరంతో అభిషేకించడం, ధ్రువనక్షత్ర దర్శనం, చందన వసంతోత్సవం, కల్యాణహోమం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, పూలబంతి ఆట... ఇలా అన్ని వేడుకలను ఐదు రోజులపాటు వివాహోత్సవం కార్యక్రమంలో నిర్వహించేవారు. తాళ్లపాక వారు ఏర్పాటు చేసిన ఈ ఉత్సవంలో తాళ్లపాక వంశీయులు ప్రధానపాత్ర వహించి స్వామివారికి కన్యాదానం చేసే సంప్రదాయం మెదలైంది. అటు తరువాత ఈ కార్యక్రమం నిత్య కల్యాణోత్సవంగా రూపాంతరం చెంది ప్రతినిత్యం నిర్వహిస్తున్నారు. కన్య తరపున తాళ్లపాక వంశీకులే కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకుగానూ అన్నమయ్య వంశీకులకు టీటీడీ ప్రత్యేకంగా సంభావన, ప్రసాదాలు అందిస్తోంది. ఐదు రోజులపాటు వైభవంగా స్వామివారికి నిర్వహించే కల్యాణోత్సవం ఖర్చుల నిమిత్తం తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు కొండవీడు సీమలోని శెందళూరు అనే గ్రామం, మల్లవరం అనే గ్రామాన్ని దేవదాయం చేశాడట. అ సమయంలో మలయప్పస్వామి, దేవేరులకే కాకుండా, ఆలయంలో శ్రీకృష్ణునికి, వరాహస్వామివారికి నైవేద్య సమర్పణ జరిగింది. మనోహరం అనే ప్రసాదం కూడా అప్పుడే స్వామివారికి సమర్పించడం ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా స్వామివారి కల్యాణోత్సవం గురించి లిఖించిన శాసనంలోనే ప్రస్తావించారు. అంతకు పూర్వం ఈ నైవేద్యం గురించి ఎక్కడా ప్రస్తావన లేదట. ఇది ఒక రకమైన బెల్లపు లడ్డు, సున్నుండ లాంటిది. 16వ శతాబ్దం మధ్యభాగంలో మొదలైన ఈ ప్రసాదం 20వ శతాబ్దం మధ్య భాగం వరకు చాలా ప్రాచుర్యంలో వుండేది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే ముఖ్య భక్తులకు దేవస్థానం ఇచ్చే ప్రధాన ప్రసాదంగా పేరు తెచ్చుకుంది. దాని స్థానంలో ఇప్పుడు తిరుపతి లడ్డూగా పేరుగాంచిన శనగపిండి లడ్డూ ప్రాముఖ్యానికి వచ్చింది. రుచిలో... నాణ్యతలో తిరుపతి లడ్డూనే దానికది సాటిగా పేరు తెచ్చుకుంది. (చదవండి: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...) -
Tirumala: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...
ప్రపంచంలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రం తిరుమల. కలియుగ దైవంగా ప్రఖ్యాతిపొందిన శ్రీవేంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల కొండపై అన్ని విశేషాలే, అన్నీ ప్రత్యేకతలే. శ్రీవారి దర్శనార్థం ఏటా రెండున్నర కోట్ల మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారు. స్వామి వారికి హుండీ ద్వారా ఏటా లభించే ఆదాయం రూ.800 కోట్లకు పైగానే ఉంటుంది. ఇక శ్రీవారికి ప్రపంచంలో మరే దేవుడికి చేయని విధంగా ప్రతిరోజూ ఏదో ఒక సేవ నిర్వహిస్తుంటారు. అలాగే, ప్రతివారం వారోత్సవాలు, ప్రతిమాసం మాసోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న శ్రీవారికి అలంకరణలోనూ అధిక ప్రాధాన్యం టీటీడీ ఇస్తుంది. శ్రీవారికి ఉన్నన్ని ఆభరణాలు మరే దేవునికీ లేవు. ఆ దేవదేవునికి ప్రతినిత్యం నిర్వహించే అలంకరణకు 1093 రకాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇన్ని ఆభరణాలతో అలంకరణలు చేస్తున్నా, స్వామి వారికి పుష్పాలంకరణ కూడా తక్కువగా ఏమీ ఉండదు. శ్రీవారికి ఉదయం ఓసారి, సాయంత్రం మరోసారి పుష్పాలంకరణ నిర్వహిస్తారు. భక్తుల పాలిట కొంగు బంగారు దేవుడైన శ్రీనివాసునికి ప్రతి ఏటా లక్షన్నర కిలోల పుష్పాలతో అలంకరణ చేస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడు వెలసిన వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం మరెక్కడా లేదు. శ్రీనివాసునికి సాటిరాగల దైవం ముల్లోకాలలో మరెక్కడా లేడు అని భక్తుల నమ్మకం. శ్రీవారి దర్శనార్థం ప్రతి రోజూ అరవై వేలు మొదలుకొని లక్ష మంది వరకు భక్తులు తరలివస్తుంటారు. ఇక శ్రీవారికి 1958లో హుండీ ద్వారా లభించే ఆదాయం లక్ష రూపాయల వరకు ఉంటే ఇప్పుడు స్వామివారికి ప్రతి రోజూ లభించే హుండీ ఆదాయం రెండున్నర కోట్ల పైమాటే. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు అలిపిరి నుంచి స్వామి వారిని కొలుచుకుంటూ ఎంతో ప్రయాసతో తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకున్న తరువాత వారి కష్టాలన్నీ ఒక్కసారిగా మరచిపోతారు. స్వర్ణ పుష్పాలంకరణలతో కూడిన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతికి లోనవుతారు. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడు ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి అలంకరణ ప్రియుడట, ఎంతటి అలంకరణ ప్రియుడో అంతటి భక్తజనప్రియుడట! శ్రీవారి అలంకరణకు టీటీడీ అధిక ప్రాధ్యానం ఇస్తోంది. స్వామివారికి ఉన్నన్ని ఆభరణాలు మరే దేవుడికీ, మరే ఆలయంలోనూ ఉండవు. శుక్రవారం అభిషేక సేవ అనంతరం స్వామివారికి బంగారు ఆభరణాలను అలంకరిస్తే, తిరిగి గురువారం ఉదయం సడలింపు చేస్తారు– అంటే అలంకరణలను తీసివేస్తారు. మరో వైపు పుష్పాలంకరణ మాత్రం శ్రీనివాసునికి ప్రతిరోజూ రెండుసార్లు నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తోమాలసేవలో స్వామి వారికి మూడువందల కిలోల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేస్తారు. శ్రీవారి ఆలయంలో స్వామివారికి అలంకరించే పుష్పాలను పూల అర అనబడే పుష్ప మండపంలో భద్రపరిచేవారు. అటు తరువాత రద్దీ పెరగడంతో ఈ కార్యక్రమాన్ని ఆలయం వెలుపలకు మార్చేశారు. శ్రీవారికి ప్రతినిత్యం సుగంధ పరిమళాలు వెదజల్లే చామంతి, లిల్లీ, మరువం, గన్నేరు, రోజాలు, దవనం, తులసి, తామరలు, కలువలు, మల్లెలు, కనకాంబరాలు వంటి పన్నెండు రకాల పుష్పాలతో రూపొందించిన మాలలను అలంకరిస్తారు. శ్రీవారి ఆలయంతో పాటు ఉపాలయాలైన బేడి ఆంజనేయస్వామి ఆలయం, వరదరాజ స్వామి ఆలయం, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, వరాహస్వామి ఆలయాలకు కలిపి ప్రతిరోజూ 300 కిలోల పుష్పాలు అవసరమవుతాయి. తిరుమల కొండ మీద కేవలం ముప్పయి కిలోల పువ్వులే లభిస్తుంటే, మిగిలిన 270 కిలోల పుష్పాలను భక్తులు అందజేసే విరాళాలతో బయటి నుంచి తెప్పిస్తుంటారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారికి పుష్పాలంకరణలో ముందుగా శిఖామణి అనబడే ఎనిమిది మూరల దండను స్వామివారి కిరీటం నుంచి రెండు భుజాల మీదుగా అలంకరిస్తారు. ఇక సాలగ్రామ మాలలను శ్రీవారి భుజాల నుంచి పాదాల వరకు రెండు వైపులా నాలుగు మూరలు ఉండే మాలలతో అలంకరిస్తారు. తరువాత మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకు అలంకరించే మూడున్నర మూరల పొడవుండే కంఠసరి మాలలను అలంకరిస్తారు. తర్వాత వక్షస్థల లక్ష్మీ మాలలను అలంకరిస్తారు. స్వామివారి వక్షస్థలంలో కొలువుండే శ్రీదేవి భూదేవులకు ఒకటిన్నర మూర ఉండే రెండు దండలను అలంకరిస్తారు. శంఖు చక్రాలకు ఒకొక్క మూర ఉండే రెండు దండలను అలంకరిస్తారు. ఇక స్వామివారి బొడ్డున ఉండే నందక ఖడ్గానికి కఠారి సరం అనే రెండు మూరల మాలను అలంకరిస్తారు. తావళాలు అనే హారాలను రెండు మోచేతుల కింద, నడుము నుంచి మోకాళ్లపైన, మోకాళ్ల నుంచి పాదాల వరకు వేలాడేలా మూడు దండలను అలంకరిస్తారు. వీటిలో ఒకటి మూడు మూరలు, రెండోది మూడున్నర మూరలు, మూడోది నాలుగు మూరలు ఉంటాయి. చివరిగా ఒక్కొక్క మూర ఉండే తిరువడి దండలను శ్రీవారి పాదాల చుట్టూ అలంకరిస్తారు. ఇవి కాకుండా భోగ శ్రీనివాసమూర్తికి ఒక దండ, కొలువు శ్రీనివాసమూర్తికి ఒక దండ, శ్రీదేవి భూదేవి సహిత మలయప్పస్వామికి మూడు దండలు, శ్రీదేవి భూదేవి సహిత ఉగ్రశ్రీనివాసమూర్తికి మూడు దండలు, సీతారామలక్ష్మణులకు మూడు దండలు, రుక్మిణీ శ్రీకృష్ణులకు రెండు దండలు, చక్రత్తాళ్వారుకు ఒక దండ, అనంత గరుడ విష్వక్సేనులకు మూడు దండలు, సుగ్రీవ అంగద హనుమంతులకు మూడు దండలు, ద్వార పాలకులకు రెండు దండలు, గరుడాళ్వర్, వరదరాజస్వామి, వకుళమాతలకు మూడు దండలు, రామానుజాచార్యులకు రెండు దండలు, యోగనరసింహస్వామి, విష్వక్సేనులతో, పోటు తాయారు, బేడి ఆంజనేయస్వామికి నాలుగు దండలు, వరాహస్వామి ఆలయానికి మూడు దండలతో ప్రతి నిత్యం అలంకరిస్తారు. ప్రతి గురువారం శ్రీవారికి కేవలం పుష్పాలతో మాత్రమే అలంకరణ చేస్తారు. పూలంగి సేవగా పేర్కొనే ఈ కార్యక్రమాన్ని శ్రీవారికి ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక శ్రీవారికి ప్రతినెలా నిర్వహించే ఉత్సవాలకు విశేష పుష్పాలంకరణలలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. విశేష పర్వదినాలలో శ్రీవారి ఆలయాన్ని కూడా ప్రత్యేక పుష్పాలతో అలంకరిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి ఆలయాన్ని మూడు నుంచి ఐదు టన్నుల పుష్పాలతో అలంకరిస్తారు. వివిధ పుష్పాలతో ఆలయంలోని ధ్వజస్తంభం నుంచి ఆలయ ప్రాకారం వరకు అలంకరిస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తిథులలో మాత్రమే తెరిచి వుంచే వైకుంఠ ద్వారాన్ని రెండు టన్నుల పుష్పాలతో వైకుంఠాన్ని తలపించేలా చేసే అలంకరణ భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. తెలుగు వారి నూతన సంవత్సరాది రోజు అయిన ఉగాది పర్వదినాన కూడా శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేస్తారు. సాధారణ రోజులలో అలంకరణకు ఉపయోగించే చామంతి, తులసి, లిల్లి, మరువం, గన్నేరు, రోజాలు, దవనం, మల్లెలు, కలువలు, తామరలు, కనకాంబరాలు వంటివే కాకుండా కురివేరు, వట్టివేరు, తీగ సెంటు జాజులు, కట్ రోజెస్ వంటి పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేస్తారు. ఉగాది రోజున ఐదు టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. శ్రీనివాసునికి ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి మాసం ఏదో ఒక సేవ నిర్వహిస్తున్నా ప్రతి ఏటా శ్రావణ మాసం శ్రవణ నక్షత్రానికి పూర్తి అయ్యేలా తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందుకు అనుగుణంగానే పుష్పాలంకరణకు టీటీడీ అధిక ప్రాధాన్యమిస్తుంది. తొమ్మిది రోజులపాటు పద్నాలుగు రకాల వాహనాలపై స్వామివారు మాడ వీథులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చే ఈ ఉత్సవాలకు ముప్పయి టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తారు. బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాటు చేసే ఫల, పుష్ప ప్రదర్శన భక్తులకు కనువిందు చేస్తుంది. వివిధ పుష్పాలతో చేసే దేవతా మూర్తుల ఆకృతులను తిలకించే భక్తులకు తిరుమల క్షేత్రమే ఇలలో వెలసిన వైకుంఠంగా అనిపిస్తుంది. బ్రహ్మోత్సవాల తరువాత నిర్వహించే పుష్పయాగం న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంటుంది. పది టన్నుల పద్దెనిమిది రకాల పుష్పాలతో శ్రీవారికి పుష్పాభిషేకం నిర్వహిస్తారు. తరువాత ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించిన పూలపల్లకిలో ఉరేగిస్తారు. మూడు టన్నుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామివారి ఉరేగింపు భక్తులకు కనువిందు చేస్తుంది. ఇన్నిరకాల పూలతో అలంకరిస్తే శ్రీవారికి దిష్టి తగలకుండా ఉంటుందా? దిష్టి తగిలితే తగులుతుందేమో నని, శ్రీవారికి అలా దిష్టి తగలకుండా ఉండటానికి అర్చకులు సన్నని వెంట్రుకలా ఉండే కురువేరు అనే వేరును ఉపయోగిస్తారు. ఈ కురువేర్లు తమిళనాడులోని కుంభకోణం ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయట! (క్లిక్ చేయండి: అప్పట్లో కొండ ఎక్కాలన్నా పన్ను కట్టాల్సిందే!) స్వామివారి పుష్పాలంకరణల కోసం తమిళనాడులోని చెన్నై, సేలం, శ్రీరంగం, కోయంబత్తూరు, దిండిగల్, కుంభకోణం తదితర ప్రాంతాల నుంచి 60 శాతం పుష్పాలు విరాళాలుగా అందితే, మిగిలిన 40 శాతం పుష్పాలను కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతం నుంచి దాతలు విరాళాలుగా అందిస్తారు. ప్రత్యేక పర్వదినాలలో అలంకరించేందుకు ప్రత్యేక పుష్పాలను కూడా టీటీడీ... బెంగళూరు నుంచే తెప్పిస్తుంది. మన దేశం నుంచే కాకుండా సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ నుంచి కూడా భక్తులు స్వామి వారికి పుష్పాలను విరాళంగా అందిస్తున్నారు. శ్రీవారికి పుష్పాలు విరాళాలుగా అందించడానికి దాతలు ముందుకు వస్తే టీటీడీ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది. మరోవైపు స్వామివారి పుష్ప కైంకర్యానికి వినియోగించే పుష్పాలను టీటీడీ ద్వారానే పండించేందుకు ఏర్పాట్లును మొదలు పెట్టింది. పలమనేరులో 750 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న గో సంరక్షణశాల ప్రాంతంలో 25 ఏకరాల స్థలాన్ని పూలతోటల కోసం టీటీడీ కేటాయిస్తోంది. (క్లిక్ చేయండి: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవ వైభవం) -
బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వసన్నద్ధమవుతోంది. తొమ్మిదిరోజుల పాటు పదహారు వాహనాలపై శ్రీవారు తిరువీథుల్లో ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు రానున్న భక్తుల సౌకర్యం కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది. ‘కరోనా’ కారణంగా గత రెండేళ్లలో బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయి. ‘కరోనా’ తొలగడంతో ఈసారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు... బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వివరిస్తారా..? సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సెప్టెంబరు 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తాం. సెప్టెంబర్ 26న రాత్రి 7–8 గంటల మధ్య అంకురార్పణ జరుగుతుంది. సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహన సేవ జరుగుతాయి. ధ్వజారోహణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరుగుతాయి. అయితే గరుడ వాహనసేవ మాత్రం రాత్రి 7 నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తాం. అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తాం. తిరుమల ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తాం. రెండేళ్ల ‘కరోనా’ మహమ్మారి తర్వాత ఈసారి బ్రహ్మోత్సవాలు భక్తుల నడుమ జరుగుతున్నందున అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఇందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? తిరుమలలో రెండేళ్ల తరువాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడవీథుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కరోనా కారణంగా గత రెండేళ్లలో బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా జరిగాయి. దూరప్రాంతాల నుంచి సొంత వాహనాలపై వచ్చే భక్తుల కోసం అలిపిరి వద్ద ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. శ్రీవారి ఆలయంతో పాటు అన్ని ముఖ్యకూడళ్లలోనూ విద్యుద్దీపాలంకరణలను ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు సేవలందించేందుకు మూడున్నర వేల మంది శ్రీవారి సేవకులను ఇప్పటికే ఆహ్వానించాం. ఫొటో ఎగ్జిబిషన్, మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ, అదనంగా ఐదువేల మంది పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసుకున్నాం. వైద్యవిభాగం ఆధ్వర్యంలో స్పెషలిస్ట్ డాక్టర్లను అందుబాటులో ఉంచుతాం. నిర్దేశిత ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి, అంబులెన్సులను అందుబాటులో ఉంచుతాం. భక్తుల రాకపోకల సౌకర్యం కోసం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తగినన్ని బస్సులను అందుబాటులో ఉంచుతాం. ప్రధాన కల్యాణకట్టతో పాటు పది మినీ కల్యాణకట్టల్లో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా తలనీలాలు సమర్పించు కునేలా ఏర్పాట్లు చేశాం. టీటీడీలోని 337 మంది రెగ్యులర్ క్షురకులు, 852 మంది పీస్‌రేటు క్షురకులు కలిపి మొత్తం 1189 మంది ఉన్నారు. వీరు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని నిర్ణయించాం. భక్తుల రద్దీ దృష్ట్యా బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనాలు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేశాం. ఆర్జిత సేవలు, రూ.300 టికెట్ల దర్శనాలతో పాటు అన్ని ట్రస్టు దాతలకు దర్శన టికెట్లను రద్దు చేశాం. వీఐపీల దర్శన సమయాన్ని కూడా రద్దు చేయడం ద్వారా సాధారణ రోజుల కంటే అధికంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశాం. ఈ నిర్ణయం వల్ల రోజుకు అదనంగా 15 వేల మంది సామాన్యభక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. బ్రహ్మోత్సవాలకు విశేషంగా తరలి వచ్చే భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయి? తిరుమలలో ఉన్న 7 వేల గదుల్లో కొన్ని మరమ్మతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం 25 వేల మందికి సరిపడా వసతి మాత్రమే ఉంది. ఉన్న గదుల్లో 50 శాతం గదులను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచాం. మిగిలిన 50 శాతం గదులను ఆఫ్‌లైన్‌లో ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన కేటాయిస్తున్నాం. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోని వసతి సముదాయాల్లో గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తుల అన్న ప్రసాదాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సాధారణ రోజుల్లో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 వరకు, గరుడసేవ రోజున రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం అందించేలా అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేశాం. తిరుమలకు వచ్చే భక్తులందరికీ లడ్డూ ప్రసాదం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? బ్రహ్మోత్సవాల్లో లడ్డూ ప్రసాదాలు భక్తులందరికీ అందించేందుకు వీలుగా తొమ్మిది లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచేలా ఏర్పాట్లు చేశాం. ఈసారి గరుడసేవకు గతంలో కంటే అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా. భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? గరుడసేవ రోజున అదనంగా మరిన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నాం. ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరగకుండా చూసేందుకు గరుడసేవ నాడు పూర్తిగా, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నాం. అక్టోబర్ 1న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ట్రస్టుల దాతలకు, కాటేజీ దాతలకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు ఆన్లైన్లోను, ఆఫ్‌లైన్‌లోను గదుల కేటాయింపు ఉండదు. దాతలు ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. టీటీడీ చైర్మన్‌గా మీరు రెండోసారి బాధ్యతలు చేపట్టారు. స్వామివారి సేవలో మరోసారి అవకాశం దక్కడంపై ఎలా భావిస్తున్నారు? శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రథమ సేవకుడిగా సేవచేసే అవకాశం కొందరికి మాత్రమే దక్కుతుంది. ఆ కొందరిలో నేను కూడా ఉండడం స్వామివారు ప్రసాదించిన అదృష్టంగా భావిస్తున్నాను. టీటీడీలో చైర్మన్, బోర్డు సభ్యులే కాదు అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు స్వామివారి అనుగ్రహం లేనిదే పనిచేసే అవకాశం రాదు. ఈ విషయాన్ని మనసా వాచా కర్మణా ప్రగాఢంగా నమ్ముతాను. స్వామివారి అనుగ్రహం వల్లే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి నాకు రెండోసారి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా పనిచేసే అవకాశం కల్పించారు. భక్తులు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా మాడవీథుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? లక్షలాదిగా తరలివచ్చే భక్తులు మాడవీథుల్లో స్వామివారి వాహనసేవలను చూసి తరించాలనుకుంటారు. ఇందుకు అనుగుణంగా మాడవీథుల్లో ఉండే ప్రతి భక్తుడికీ స్వామివారి వాహనసేవ దర్శనం లభించేలా ప్రణాళిక రూపొందించాం. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అపురూపమైన కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల సమన్వయంతో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో ఇరవై నాలుగు గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. లక్షలాది భక్తులు వచ్చే తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒక పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి, పర్యావరణ పరిరక్షణకు చారిత్రక నిర్ణయం తీసుకోవడం దేశంలో తిరుమలలో మాత్రమే జరిగింది. బ్రహ్మోత్సవాలకు దేశంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గుర్తించి తిరుమలకు ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అలిపిరి వద్ద విజిలెన్స్ సిబ్బంది ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులను తిరుమలకు రాకుండా చేసే తనిఖీలకు భక్తులు సహకరించి తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతకు సహకారం అందించాలని కోరుతున్నాను. (క్లిక్ చేయండి: శ్రీనివాసుని ఏ వారం దర్శించుకుంటే ఏ ఫలితం...) -
అప్పట్లో కొండ ఎక్కాలన్నా పన్ను కట్టాల్సిందే!
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు సౌకర్యార్థం టీటీడీ ఎన్నో వసతులు కల్పిస్తోంది. ఉచిత దర్శనం మొదలుకొని ఉచిత అన్నప్రసాదం, ఉచిత రవాణా, ఉచితంగా బస, ఇలా సామాన్య భక్తులకు అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. ఇదివరకు పరిస్థితులు ఇంత సౌకర్యవంతంగా ఉండేవి కాదు. ఒకానొక కాలంలో కొండ ఎక్కాలన్నా పన్ను కట్టాలన్న నిబంధన ఉండేది. ఎవరెవరి హయాంలో శ్రీవారి ఆలయంలో ఎలాంటి నిబంధనలు ఉండేవో, ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకుందాం. 18వ శతాబ్దంలో శ్రీవారి ఆలయం ఆర్కాట్ నవాబులు అధీనంలో ఉండేది. తిరుమల ఆలయం నుంచి నిధులు వసూలు చేసుకోవడానికి ఆర్కాట్ నవాబులు రెంటర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం కింద అందరికంటే ఎక్కువ ఆదాయం ఇచ్చేవారికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించేవారు. అలా ఆలయ నిర్వహణ బాధ్యతలను పొందిన వారినే రెంటర్ అని పిలిచేవారు. రెంటర్‌గా బాధ్యతలు చేపట్టినవారు ఆలయం నుంచి ఎంత ఆదాయమైనా యథేచ్ఛగా సంపాదించు కోవచ్చు, అయితే, నవాబులకు ఏటా నిర్ణీత మొత్తం చెల్లించాల్పిందే! ఈ పద్ధతి వల్ల రెంటర్లు ఆదాయాన్ని పెంచుకోవడానికి అన్ని మార్గాల్లోనూ ప్రయత్నించేవారు. దేశదేశాలకు బైరాగులను పంపి ఆలయం తరఫున నిధులు వసూలు చేసేవారు. ఇతర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చే భక్తుల నుంచి భారీగా పన్నులు వసూలు చేసేవారు. అప్పట్లోనే శ్రీవారి ఆలయ దర్శనం కోసం కాశీ, గయ, కశ్మీర్, ఉజ్జయిని, అయోధ్య, మధురై, రామేశ్వరం, తిరువనంతపురం, మద్రాసు, ఉడిపి, గోకర్ణం, బళ్లారి వంటి దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చేవారు. వారందరికీ రెంటర్ల ‘పన్ను’పోటు తప్పేది కాదు. రెంటర్లు మరిన్ని మార్గాల్లోనూ భక్తుల నుంచి సొమ్ము గుంజేవారు. ఆర్జిత సేవలకు రుసుము పెంచడం, కొండ ఎక్కే ప్రతి భక్తుని నుంచి యాత్రిక పన్ను పేరిట ఐదు కాసులు వసూలు చేయడం, పుష్కరిణిలో స్నానం చేసేవారి నుంచి రుసుము వసూలు చేయడం, కపిల తీర్థంలో పితృకర్మలు, తర్పణాలు నిర్వహించడానికి పురోహితులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడం, తలనీలాలు ఇచ్చే ప్రక్రియనూ కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్వహించడం, ఎక్కువ కానుకలు చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించడం. వర్తన పేరిట స్వామివారి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలు, వాహనాలు, గుర్రాలు వంటి వాటి విలువను నగదు రూపంలో వసూలు చేయడం, నైవేద్యాలు చేయించడానికి ప్రత్యేక రుసుము వసూలు చేయడం, ఆమంత్రణ ఉత్సవాలు, ప్రత్యేక వాహన సేవలకు రుసుము వసూలు చేయడం, నైవేద్యాలను భక్తులకు విక్రయించడం, స్వామివారికి అలంకరించిన వస్త్రాలను విక్రయించడం, ఆలయ ప్రాంగణంలోని దుకాణాలు పెట్టుకునే దుకాణదారుల నుంచి డబ్బు వసూలు చేయడం– ఇలా ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగానూ రెంటర్లు ఆలయ నిర్వహణను సొమ్ము చేసుకునేవారు. తర్వాత ఆలయ ఆజమాయిషీ చేపట్టిన ఈస్టిండియా కంపెనీ, 1820లో ఈ పద్ధతి సబబు కాదంటూ, దీనికి స్వస్తి చెప్పింది. -
తిరుమలకు రంగనాథుడు అలా వచ్చాడు!
1328వ సంవత్సరంలో శ్రీరంగంపై ముస్లింల దండయాత్ర జరిగింది. ఆ సమయంలో శ్రీరంగంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉత్సవమూర్తులను ఉదయమే కావేరి నదికి తీసుకువెళ్ళి నది మధ్యలో తిరుమంజనాది సేవలను భక్తుల సమక్షంలో నిర్వహించేవారు. సాయంత్రం వరకు స్వామి వారికి సేవలు నిర్వహించి అటు తరువాత ఊరేగింపుగా ఆలయానికి చేరుకునేవారు. ఇలా శ్రీరంగనాథుడి ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే మహమ్మద్ బిన్ తుగ్లక్ అశ్విక సేనలు అకస్మాత్తుగా కన్ననూరు వైపు నుంచి కావేరి ఒడ్డుకు చేరుకున్నాయి. దీనితో సైన్యం వీరిదగ్గరకు చేరుకునేలోపు స్వామివారి విగ్రహాలను రక్షించాలని భావించిన భక్తులు బలిష్ఠుడైన లోకాచారి అనే యువకుడి సారథ్యంలో బృందాన్ని ఏర్పాటు చేసి చిన్నపల్లకిలో స్వామివారిని వేంచేపు చేసి రహదారి గుండా పుదుక్కొటై్ట్టకి పంపారు. దారిలో తిరుమలకు వెళ్తే సురక్షితమని భావించి అటు వైపుగా బయలుదేరాలనుకున్నాడు లోకాచారి. అయితే నేరుగా తిరుపతికి వెళ్తే ముస్లింల బారిన పడతామన్న భయంతో తెరుకనంబి, మైసూరు మీదుగా చుట్టూ తిరిగి ముఖ్య రహదారులలో కాకుండా అడ్డదారులలో ప్రయాణం చేస్తూ తిరుపతికి చేరుకున్నాడు. ఆ సమయంలో తిరుపతి సింగమనాయకుడు పాలనలో వుండేది. అలా తిరుమల చేరుకున్న శ్రీరంగనాథుడు శ్రీవారి ఆలయంలో ఆగ్నేయంగా వున్న మండపంలో విడిది చేసి శ్రీవారి అతిథిగా సేవలందుకున్నారు. శ్రీనివాసునికి వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా పూజలు నిర్వహిస్తూ వుంటే శ్రీరంగనాథునికి పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించేవారు. దీనితో శ్రీవైష్ణవులే కాక దక్షిణాది భక్తులందరూ శ్రీనివాసుని శ్రీరంగనాథుని దర్శనానికి పెద్దసంఖ్యలో తిరుమలకు తరలి రావడం మొదలుపెట్టారు. అదేరోజులలో హిందూరాజులు, సామంతులు చేతులు కలిపి మథుర సుల్తానులపై దండెత్తి వారిని ఓడించారు. అదే సమయంలో హరిహర బుక్కరాయల నాయకత్వంలో విజయనగర సామ్రాజ్యానికి పునాదులు మొదలయ్యాయి. 1370 సంవత్సరానికి తిరుమల–తిరుపతి ప్రాంతాలలో విజయనగర సామ్రాజ్యం బలంగా ఏర్పడింది. దక్షిణ దేశమంతా కూడా వీరి పరిపాలనలో సుభిక్షం, సురక్షితమైంది. దీనితో హిందువులలో ధైర్యం, శాంతిభద్రతలపై నమ్మకం ఏర్పడ్డాయి. 1371లో అంటే 43 సంవత్సరాల తరువాత తిరుమల నుంచి శ్రీరంగానికి శ్రీరంగనాథన్ తిరుగు ప్రయాణం వైభవంగా జరిగింది. అంత గొడవల్లో కూడా ముస్లింల విధ్వంసానికి గురికాని దేవాలయం ఏదైనా వుంది అంటే అది తిరుమల ఆలయం మాత్రమే. ముస్లింలు కొండవైపు కూడా రాలేదు. దీనికి కారణం స్వామివారి మహిమే అన్న భావన భక్తులందరిలో కలిగింది. తమిళ ప్రాంతం నుంచి భక్తులు తిరుమలకు రావడం అప్పటి నుంచే మొదలైంది. ఆధ్యాత్మిక భావాలకు తిరుమల ఒక ఆసరాగా నిలిచిపోయింది. -
శ్రీనివాసుని ఏ వారం దర్శించుకుంటే ఏ ఫలితం...
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు భక్తులు. నిత్యం వేలాది భక్తులు శ్రీనివాసుని దర్శనార్థం తిరుమలకు తరలి వస్తుంటారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడిని కళ్లారా దర్శించుకోవాలన్నది భక్తులందరి కోరిక. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు ఏడుకొండలకు చేరుకుంటారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండి, క్షణకాలం మాత్రమే లభించే శ్రీవారి దివ్యమంగళ రూప దర్శనం కోసం తహతహలాడతారు. కేవలం క్షణమైనా సరే, శ్రీవారి దర్శనం దక్కితే చాలు తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు. ఇదివరకు వారాంతంలో తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేది. మంగళ, బుధవారాలలో భక్తుల తాకిడి అతి తక్కువగా ఉండేది. గురువారం నుంచి భక్తుల రద్దీ క్రమంగా పుంజుకుని శుక్ర, శని, ఆదివారాల్లో బాగా పెరిగేది. తిరిగి సోమవారం నుంచి కాస్త తగ్గుముఖం పట్టేది. రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతూ వస్తూండడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు రోజులతో సంబంధం లేకుండా, ప్రతిరోజూ వేలాదిగా తరలి వస్తున్నారు. దీంతో వారాంతం స్థాయిలో కాకున్నా, మిగిలిన రోజుల్లో కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది. శ్రీవారి ఆలయంలోని పరిస్థితుల కారణంగా ఏరోజు దర్శనం చేసుకుంటే, ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయన్న అంశంపై భక్తులు దృష్టి పెట్టకుండా, స్వామివారి దర్శనభాగ్యం దక్కితే చాలన్నట్లుగా ఎప్పుడు కుదిరితే అప్పుడే భక్తులు వస్తున్నారు. అయితే, శ్రీవారిని ఏ రోజు దర్శించుకుంటే, ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం... శ్రీనివాసుడిని ఆదివారం దర్శించుకుంటే రాజానుగ్రహం, ప్రభుత్వాధి నేతల దర్శనం, అధికార కార్యానుకూలత, శత్రునాశనం, నేత్ర, శిరోబాధల నుంచి ఉపశమనం వంటి ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. సోమవారం శ్రీవారిని దర్శించుకుంటే, స్త్రీసంబంధంగా పనుల సానుకూలత, తల్లికి, సోదరీమణులకు శుభం, వారి నుంచి ఆదరణ, భార్యతో అన్యోన్యత కలుగుతాయి. పౌర్ణమినాడు గరుడవాహనంపై శ్రీవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మంగళవారం శ్రీవారిని దర్శించుకుంటే భూమికి సంబంధించిన వ్యవహారాలలో కార్యసిద్ధి, భవన నిర్మాణ పనులకు అవరోధాలు తొలగి, కార్యానుకూలత కలుగుతాయి. బుధవారం దర్శించుకుంటే విద్యాప్రాప్తి, విదేశీయానం, సామాజిక గౌరవం లభిస్తాయి. గురువారం దర్శించుకుంటే ఉత్తమ జ్ఞానలాభం, వాక్శుద్ధి, గురువుల ఆశీస్సులు లభిస్తాయి. శుక్రవారం దర్శించుకుంటే సమస్త భోగభాగ్యాలు, వాహన సౌఖ్యం, ఇష్టకార్యసిద్ధి వంటి ఫలితాలు కలుగుతాయి. ఇక శనివారం శ్రీవారిని దర్శించుకుంటే రుణపీడ, ఈతిబాధలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. -
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవ వైభవం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి వచ్చి, భూలోక వైకుంఠమైన వేంకటాద్రిపై కొలువుదీరాడు. కన్యామాసం (చాంద్రమానం ప్రకారం ఆశ్వీయుజ మాసం) శ్రవణ నక్షత్రం రోజున శ్రీవేంకటేశ్వరస్వామిగా అర్చారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలశాడు. శ్రీవేంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్తజన వల్లభుడు. కోరినవారి కొంగుబంగారమై కోరికలను ఈడేర్చే శ్రీవేంకటేశ్వరుని వైభోగం న భూతో న భవిష్యతి! వేంకటాచల క్షేత్రం పై వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి, లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి ముగిసేలా తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని ప్రతీతి. దసరా నవరాత్రులు జరిగే కన్యామాసంలో శ్రీవేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిదిరోజుల ముందు నవరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం. సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకొకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించటం కూడా ఆనవాయితీగా కొనసాగుతోంది. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం, వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణం, బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు (ధ్వజారోహణం, ధ్వజావరోహణం) లేకుండా ఆగమోక్తంగా అలంకార ప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదో రోజున మహారథం (చెక్కరథం) బదులు ఇదివరకు వెండిరథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై స్వామివారి ఊరేగింపు జరుగుతూ వస్తోంది. 2012లో పాత స్వర్ణరథం స్థానంలో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది. అంకురార్పణతో ఆరంభం శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు వసంత మండపానికి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత దేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో శాలి, ప్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలను పోసి ఆ మట్టిలో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. ధ్వజారోహణం న భూతో న భవిష్యతి అనేలా అంగరంగ వైభవోపేతంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడు కాబట్టి, ఒక కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజపటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కొండమీదే కొలువుదీరి ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పెద్ద శేషవాహనం ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయం పరిధిలోని నాలుగు మాడవీథుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేషవస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యమిస్తూ తొలిరోజు ఆ వాహనం మీద ఊరేగుతారు. చిన్నశేషవాహనం రెండోరోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. పెద్ద శేషవాహనం ఆదిశేషుడైతే, చిన్నశేషవాహనం వాసుకి. హంసవాహనం రెండోరోజు రాత్రి స్వామివారు విద్యాప్రదాయని అయిన శారదామాత రూపంలో హంసవాహనంపై ఊరేగుతారు. పాలు, నీళ్లను వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతంగా శ్రీనివాసుడు హంసవాహనం అధిరోహించి భక్తులకు దర్శనమిస్తాడు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు ఊరేగుతూ దర్శనమివ్వడం భక్తులకు నేత్రపర్వం. సింహవాహనం బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం సింహవాహనం అధిరోహించి శ్రీవేంకటనాథుడు భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులలో మృగరాజైన సింహాన్ని తానేనంటూ మనుషులలో జంతు ప్రవృత్తిని నియంత్రించుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారని ముత్యాలపందిరి వాహనం మూడో రోజు రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామివారికి జరిగే సుకుమారసేవగా ముత్యాలపందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. కల్పవృక్ష వాహనం కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు శ్రీవేంకటాద్రివాసుడు. కల్పవృక్షం– అన్నవస్త్రాదుల వంటి ఇహలోక సంబంధితమైన కోరికలను మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వత కైవల్యాన్ని ప్రసాదించే కారుణ్యమూర్తి. నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు సర్వాలంకార భూషితుడై ఊరేగుతాడు. సర్వభూపాల వాహనం లోకంలోని భూపాలకులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వభూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహన సేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. మోహినీ అవతారం బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదోరోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్త జనావళికి కనువిందు చేస్తారు. అన్ని వాహనసేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం నేరుగా శ్రీవారి ఆలయం లోపలి నుంచే పల్లకిపై ప్రారంభం అవుతుంది. పరమశివుడిని సైతం సమ్మోహన పరచి, క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. మంచి పనులు చేయడం ద్వారా దైవానుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటడానికే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీథుల్లో విహరిస్తారు. గరుడవాహనం ఐదోరోజు రాత్రి తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద స్వామివారు ఊరేగుతారు. స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామమాల ధరించి మలయప్పస్వామి భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీవేంకటేశ్వరుడిని తన కీర్తనలతో నానా విధాలుగా కొనియాడిన గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాలను, నూతన ఛత్రాలను గరుడ వాహనంలో అలంకరిస్తారు. ఈ వాహనంలో ఊరేగే స్వామివారి వైభోగాన్ని చూసి తరించడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని కూడా ఈ సేవ చాటి చెబుతుంది. హనుమంత వాహనం ఆరోరోజు ఉదయం స్వామివారు హనుమద్వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. త్రేతాయుగంలో తనను సేవించుకున్న భక్త శిఖామణి హనుమంతుడిపై స్వామివారు తిరువీథుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను లోకులకు తెలిసేలా, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు చాటి చెబుతారు. గజవాహనం గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి గజవాహనంపై ఊరేగుతారు. గజవాహనంపై ఊరేగుతుండగా స్వామిని దర్శించుకుంటే, పెనుసమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సూర్యప్రభ వాహనం బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు ఉదయం సప్తాశ్వాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామివారు సూర్యప్రభ వాహనం మీద ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగులు ప్రసాదించే సూర్య భగవానుడు తన ప్రతిరూపమేనని చాటిచెబుతారు. చంద్రప్రభ వాహనం ఏడోరోజు రాత్రి ధవళ వస్త్రాలు, తెల్లని పూలమాలలు ధరించి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని తెలియజేస్తారు. మనఃకారుకుడైన చంద్రుడి లక్షణం తనలోనూ ఉందని, తాను కూడా భక్తుల మనస్సుపై ప్రభావం చూపిస్తానని చాటి చెబుతారు. రథోత్సవం గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే కళ్లెంతో అదుపు చేసే విధంగానే, రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్త్వజ్ఞానాన్ని స్వామివారు ఎనిమిదో రోజు ఉదయం తన రథోత్సవం ద్వారా తెలియ జేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అశ్వవాహనం ఎనిమిదోరోజు రాత్రి స్వామివారు అశ్వవాహనారూఢుడై ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. చక్రస్నానం ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రత్తాళ్వారును వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రత్తాళ్వార్ స్నాన మాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తీరుతాయని ప్రతీతి. ధ్వజావరోహణం చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్స వాలను ముగిస్తారు. డాలర్ లేని బ్రహ్మోత్సవం... ఈ ఏట తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు డాలర్ శేషాద్రి సందడి లేకుండానే జరగనున్నాయి. శ్రీవారి ఆలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న డాలర్ శేషాద్రి ఉరఫ్ పాల శేషాద్రి గత ఏడాది నవంబర్ 29వ తేదీన కన్ను మూయడంతో ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు డాలర్ లేకుండానే జరగనున్నాయి. 1978వ సంవత్సరంలో టీటీడీ లో విధుల్లో చేరిన శేషాద్రి అప్పటినుంచి గత ఏడాది వరకు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ వచ్చారు. మధ్యలో 2009వ సంవత్సరంలో కోర్టు తీర్పు కారణంగా బ్రహ్మోత్సవాల విధులకు దూరమైన శేషాద్రి అటు తరువాత 2014వ సంవత్సరంలో ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే గుండెపోటుకి గురై కొన్ని వాహనసేవలకు దూరమయ్యారు. ఈ రెండుసార్లు మినహాయిస్తే దాదాపు 44 సంవత్సరాల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఉత్సవాల నిర్వహణలో పాలుపంచుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉత్సవాల సమయంలో స్వామి వారి ఆలంకరణలను ఏవిధంగా చేయాలన్న దాని పై అర్చకులకు సహకరిస్తూ ఏ సమయంలో ఏ కైంకర్యం నిర్వహించాలో తెలుపుతూ సమయానికి అన్నీ సక్రమంగా జరిగేలా చూసుకునే వారు. ఆలయ మాడవీథుల్లో వాహన ఊరేగింపు జరుగుతున్నంత సేపు కూడా వాహనంతో పాటే ఉంటూ అన్నీ తానై వ్యవహరిస్తూ వాహన సేవ విజయవంతంగా సాగేలా సహకరించి అటు అధికారులతోపాటు ఇటు టీటీడీ పాలకమండలి మన్ననలను పొందేవారు. మరోవైపు ఉత్సవాలలో వాహన ఊరేగింపు ముందు సందడి చేస్తూ భక్తుల్లో భక్తిభావాన్ని నింపేవారు. ఇలా బ్రహ్మోత్సవాలలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే డాలర్ శేషాద్రి లేకుండానే ఈ ఏట శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 26.09.2022 అంకురార్పణ 27.09.2022 ధ్వజారోహణం పెద్ద శేషవాహనం 28.09.2022 చిన్నశేషవాహనం హంసవాహనం 29.09.2022 సింహవాహనం ముత్యపుపందిరి వాహనం 30.09.2022 కల్పవృక్షవాహనం సర్వభూపాల వాహనం 01.10.2022 మోహినీ అవతారం గరుడ వాహనం 02.10.2022 హనుమంతæవాహనం గజవాహనం 03.10.2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం 04.10.2022 రథోత్సవం అశ్వ వాహనం 05.10.2022 చక్రస్నానం ధ్వజావరోహణం -
ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం ఉదయం ఆయన ఢిల్లీ నుంచి నేరుగా తిరుపతికి బయల్దేరారు. శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. రెండు రోజులు పాటు తిరుమలలో పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.00 గంటకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రేణిగుంట నుంచి రోడ్డుమార్గంలో తిరుమల శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5.27 గంటలకు పద్మావతి గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి అన్నమయ్య భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. సాయంత్రం 6.15 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం చేరుకుని అక్కడి నుండి శ్రీవారి ఆలయానికి చేరుకుని ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని రాత్రి 7.40 గంటలకు శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుని రాత్రి బస చేస్తారు. గురువారం ఉదయం 6.15 గంటలకు పద్మావతి అతిధి గృహం నుండి బయలుదేరి.. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు నాద నీరాజనం సుందర కాండ పారాయణ కార్య క్రమంలో పాల్గొంటారు. అలాగే కర్ణాటక రాష్ట్ర ఛారిటీస్ సత్రాలకు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుమల నుండి 9.20 గంటలకు బయలుదేరి 10.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం తిరుగు ప్రయాణం అవుతారు. (త్వరలో జలశక్తి మంత్రి పోలవరం పర్యటన) కాగా సీఎం జగన్ ఇవాళ ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించారు. అనంతరం ఏపీ భవన్లో వైఎస్సార్ సీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. -
కొలువుదీరిన కొత్త పాలకమండలి
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి కొలువుదీరింది. ఆ వెంటనే చైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తొలి సమావేశంలోనే పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయిం చారు. అమరావతిలో టీటీడీ నిధులతో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి గత ప్రభుత్వం అంచనాలకు మించి జరిపిన కేటాయింపులను కుదిం చారు. తిరుమల శాశ్వత తాగునీటి పరిష్కారా నికి బాలాజీ రిజర్వాయర్ పూర్తిచేయాలని నిర్ణ యం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న అనేక అభివృద్ధి పనులు పూర్తిచేసే విషయమై చర్చిం చారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీటీడీ పాలకమండలి సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు ప్రత్యేక ఆహ్వానితులు ఏడుగురు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తొలి పాలకమండలి సమావేశం జరిగింది. ఈనెల 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా తిరుమలలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో అధికారులు, సిబ్బంది బిజీబిజీగా ఉన్నారు. తిరుమల శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం దిశగా.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు, అధికారులు, స్థానికులకు మంచినీటి సమస్య లేకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా బాలాజీ రిజర్వాయర్‌ను పూర్తి చేసి అక్కడి నుంచి మల్లిమడుగు, కళ్యాణి డ్యాం నుంచి నీటిని సరఫరా చేసే విషయమై చర్చిం చారు. ఈ విషయమై గతంలోనే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బాలాజీ రిజర్వాయర్ని పరిశీలించిన విషయం తెలిసిందే. బాలాజీ రిజర్వాయర్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కేటాయింపు వంటి వాటి గురించి సమావేశంలో ప్రస్తావించారు. బాలాజీ రిజర్వాయర్ పూర్తి చేసేందుకు రూ.150 కోట్లు అంచనా వేసినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన అంచనాలను వచ్చే పాలకమండలి సమావేశంలోపు సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి నట్లు తెలిసింది. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడ వారధి నిర్మాణానికి టీటీడీ నిధులు కేటాయించే విషయమై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అవిలాల చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో కాలుష్య రహిత వాహనాల విషయమై చర్చిం చారు. అందులో భాగంగా తిరుమలలో ఎలక్ట్రికల్ కార్లు, బస్సులు నడపాలని నిర్ణయించారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై చర్చించారు. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిం చారు. టీటీడీ నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం చేసిన వెంట నే సమావేశం ఏర్పాటు చేసి, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంపై టీటీడీ అధికారులు, సిబ్బంది, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఈనెల 30 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుమల : ఈ నెల 29న తిరుమల తిరుపతి ఆలయంలో అంకురార్పణ అనంతరం 30వ తేది నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఆక్టోబర్ 8న చక్ర స్నానంతో ముగియనున్నాయి. అలాగే ఈ నెల 24న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవ ప్రారంభం కానుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో తిరుమంజనం నిర్వహించనున్నారు. వాటి పూర్తి వివరాలు 30-09- 2019 పెద్దశేషవాహనం ధ్వజారోహణం(సా..5.23 నుండి 6 గం.ల మధ్య) 01-10-2019 చిన్నశేష వాహనం హంస వాహనం 02-10-2019 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం 03-10-2019 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం 04-10-2019 మోహినీ అవతారం గరుడ వాహనం(రా.7 నుండి 12 వరకు) 05-10-2019 హనుమంత వాహనం స్వర్ణరథం, గజవాహనం (సా.4 నుండి 6 వరకు), . 06-10-2019 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం 07-10-2019 రథోత్సవం (ఉ.7.00 గంటలకు) అశ్వ వాహనం 08-10-2019 చక్రస్నానం ధ్వజావరోహణం. -
రేపటి నుంచి గోవిందుడి బ్రహ్మోత్సవాలు
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్ : తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ అధికారులు పూర్తి చేశారు. బుధవారం నుంచి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మంగళవారం సాయంత్రం నిర్వహించే అంకురార్పణతో ఉత్సవాలకు నాంది పలుకనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయం వద్ద గోవిందరాజస్వామి ప్రతిరూపాలతో కూడిన విద్యుత్ కటౌట్లను, చలువ పందిళ్లను, క్యూలను ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో స్వామి నామం వినిపించేలా చర్యలు తీసుకున్నారు. వాహన సేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా రైల్వేస్టేషన్, విష్ణునివాసం, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాల్లో ప్రత్యేకంగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. అలాగే టీటీడీ ప్రచురణల విక్రయశాల, ప్రథమ చికిత్సా కేంద్రం, ఆయుర్వేద వైద్యశిబిరం సైతం ఏర్పాటు చేశారు. కాగా, స్వామి వాహన సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆలయ మాడా వీధుల్లోని రోడ్లపై ఏర్పాటు చేసిన దుకాణాలను టీటీడీ విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో తొలగించే కార్యక్రమాలు చేపట్టారు.