తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్ : తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ అధికారులు పూర్తి చేశారు. బుధవారం నుంచి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
మంగళవారం సాయంత్రం నిర్వహించే అంకురార్పణతో ఉత్సవాలకు నాంది పలుకనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయం వద్ద గోవిందరాజస్వామి ప్రతిరూపాలతో కూడిన విద్యుత్ కటౌట్లను, చలువ పందిళ్లను, క్యూలను ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో స్వామి నామం వినిపించేలా చర్యలు తీసుకున్నారు. వాహన సేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా రైల్వేస్టేషన్, విష్ణునివాసం, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాల్లో ప్రత్యేకంగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
ఆలయ పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. అలాగే టీటీడీ ప్రచురణల విక్రయశాల, ప్రథమ చికిత్సా కేంద్రం, ఆయుర్వేద వైద్యశిబిరం సైతం ఏర్పాటు చేశారు. కాగా, స్వామి వాహన సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆలయ మాడా వీధుల్లోని రోడ్లపై ఏర్పాటు చేసిన దుకాణాలను టీటీడీ విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో తొలగించే కార్యక్రమాలు చేపట్టారు.
రేపటి నుంచి గోవిందుడి బ్రహ్మోత్సవాలు
Published Tue, Jun 3 2014 1:30 AM | Last Updated on Sat, Aug 25 2018 7:11 PM
Advertisement