TTD: అర్ధ‌ బ్రహ్మోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు.. | ALL SET FOR ONE DAY BRAHMOTSAVAM ON FEBRUARY 16 | Sakshi
Sakshi News home page

TTD: అర్ధ‌ బ్రహ్మోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు..  

Published Wed, Feb 14 2024 8:46 AM | Last Updated on Wed, Feb 14 2024 8:46 AM

ALL SET FOR ONE DAY BRAHMOTSAVAM ON FEBRUARY 16 - Sakshi

తిరుమ‌ల‌: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 16న రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టింది. ఒకేరోజు స్వామివారు ఏడు వాహ‌నాల‌పై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో దీనిని అర్ధ బ్ర‌హ్మోత్స‌వ‌మ‌ని, ఒక‌రోజు బ్ర‌హ్మోత్స‌వమ‌ని కూడా పిలుస్తారు. 
 
మాడ వీధుల్లో ఏర్పాట్లు  
భ‌క్తులు ఎండ‌కు ఇబ్బందులు ప‌డ‌కుండా అఖిలాండం వ‌ద్ద‌, మాడ వీధుల్లో అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు.  మాడ  వీధుల్లో కూల్ పెయింట్ వేశారు. ఆక‌ట్టుకునేలా రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా సాంబార‌న్న‌, పెరుగ‌న్నం, పులిహోర‌, పొంగ‌ళి త‌దిత‌ర అన్నప్రసాదాలు, తాగునీరు, మ‌జ్జిగ‌, టి, కాఫీ, పాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 ప్రత్యేక దర్శనాలు రద్దు 
ఫిబ్ర‌వ‌రి 16న ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది. సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్ర‌వ‌రి 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు తిరుప‌తిలోని కౌంట‌ర్ల‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల జారీ ఉండ‌దు. భ‌క్తులు నేరుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 ద్వారా శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చు. కాగా, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం భ‌క్తులు నిర్దేశించిన టైంస్లాట్ల‌ను పాటించ‌ని ప‌క్షంలో టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి పంపుతారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.
 
ఇత‌ర ఏర్పాట్లు 
ఫిబ్ర‌వ‌రి 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు గ‌దుల‌ కేటాయింపు కోసం సిఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయి. ఈ రోజుల్లో ఎంబిసి, టిబి కౌంటర్ల‌ను మూసివేస్తారు. కౌంట‌ర్ల‌లో 4 లక్షలతో పాటు అద‌నంగా మ‌రో 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
వాహ‌న‌సేవ‌లు
 శ్రీ మలయప్పస్వామివారు ఉద‌యం 5.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు సూర్యప్రభ, ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు చిన్నశేష, ఉద‌యం 11 నుండి 12 గంట‌ల వ‌ర‌కు గరుడ వాహ‌నంపై, మ‌ధ్యాహ్నం 1 నుండి 2 గంట‌ల వ‌ర‌కు హనుమంత వాహ‌నాల‌పై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3 గంట‌ల వ‌ర‌కు పుష్క‌రిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.  అనంత‌రం సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు క‌ల్పవృక్ష, సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహనాలపై భ‌క్తుల‌ను క‌టాక్షిస్తారు. వాహ‌న‌సేవ‌ల‌ను ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు.
 
ఆర్జిత‌సేవ‌లు ర‌ద్దు
ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శ్రీ‌వారి ఆల‌యంలో క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.
 
భ‌ద్ర‌తా ఏర్పాట్ల ప‌రిశీల‌న  
ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినానికి విశేషంగా విచ్చేసే భ‌క్తుల కోసం చేప‌డుతున్న భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను మంగ‌ళ‌వారం సాయంత్రం టీటీడీ సీవీఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, తిరుప‌తి జిల్లా ఎస్పీ శ్రీ‌మ‌తి మ‌లికా గార్గ్ క‌లిసి ప‌రిశీలించారు. భ‌క్తులు గ్యాల‌రీల్లోకి వెళ్లేందుకు, తిరిగి వెలుప‌లికి వ‌చ్చేందుకు ఏర్పాటు చేసిన మార్గాల‌ను త‌నిఖీ చేశారు. మాడ వీధుల‌తోపాటు భ‌క్తుల ర‌ద్దీ ఉన్న ప్రాంతాల్లో చేప‌ట్టాల్సిన భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌పై విజిలెన్స్‌, పోలీసు అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. తిరుమ‌ల‌లో ట్రాఫిక్ ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, పార్కింగ్ ప్ర‌దేశాల‌కు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల‌ని తెలియ‌జేశారు. వీరి వెంట టీటీడీ నిఘా, భ‌ద్ర‌తా అధికారులు, తిరుమ‌ల పోలీసు అధికారులు ఉన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తులతో 3 కంపార్టుమెంట్లు   నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 68,363 మంది భక్తులు దర్శించుకోగా 19,609 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.55 కోట్లు వచ్చిందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement