Tirumala: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే... | Tirupati Brahmotsavam 2022: Tirumala Temple Speciality, Pushpa Yagam, Abhishekam Seva | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...

Published Mon, Sep 26 2022 8:31 PM | Last Updated on Mon, Sep 26 2022 8:34 PM

Tirupati Brahmotsavam 2022: Tirumala Temple Speciality, Pushpa Yagam, Abhishekam Seva - Sakshi

ప్రపంచంలోనే  అతి పెద్ద పుణ్యక్షేత్రం తిరుమల. కలియుగ దైవంగా ప్రఖ్యాతిపొందిన శ్రీవేంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల కొండపై అన్ని విశేషాలే, అన్నీ ప్రత్యేకతలే.

శ్రీవారి దర్శనార్థం ఏటా రెండున్నర కోట్ల మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారు. స్వామి వారికి హుండీ  ద్వారా ఏటా లభించే ఆదాయం రూ.800 కోట్లకు పైగానే ఉంటుంది. ఇక శ్రీవారికి ప్రపంచంలో మరే దేవుడికి చేయని విధంగా ప్రతిరోజూ ఏదో ఒక సేవ నిర్వహిస్తుంటారు. అలాగే, ప్రతివారం వారోత్సవాలు, ప్రతిమాసం మాసోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న శ్రీవారికి అలంకరణలోనూ అధిక ప్రాధాన్యం టీటీడీ ఇస్తుంది. శ్రీవారికి ఉన్నన్ని ఆభరణాలు మరే దేవునికీ లేవు. ఆ దేవదేవునికి ప్రతినిత్యం నిర్వహించే అలంకరణకు 1093 రకాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇన్ని ఆభరణాలతో అలంకరణలు చేస్తున్నా, స్వామి వారికి పుష్పాలంకరణ కూడా తక్కువగా ఏమీ ఉండదు. శ్రీవారికి ఉదయం ఓసారి, సాయంత్రం మరోసారి పుష్పాలంకరణ నిర్వహిస్తారు. భక్తుల పాలిట కొంగు బంగారు దేవుడైన శ్రీనివాసునికి ప్రతి ఏటా లక్షన్నర కిలోల పుష్పాలతో అలంకరణ చేస్తారు. 

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడు వెలసిన వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం మరెక్కడా లేదు. శ్రీనివాసునికి సాటిరాగల దైవం ముల్లోకాలలో మరెక్కడా లేడు అని భక్తుల నమ్మకం.

శ్రీవారి దర్శనార్థం ప్రతి రోజూ అరవై వేలు మొదలుకొని లక్ష మంది వరకు భక్తులు తరలివస్తుంటారు. ఇక శ్రీవారికి 1958లో హుండీ ద్వారా లభించే ఆదాయం లక్ష రూపాయల వరకు ఉంటే ఇప్పుడు స్వామివారికి ప్రతి రోజూ లభించే హుండీ ఆదాయం రెండున్నర కోట్ల పైమాటే. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు అలిపిరి నుంచి స్వామి వారిని కొలుచుకుంటూ ఎంతో ప్రయాసతో తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకున్న తరువాత వారి కష్టాలన్నీ ఒక్కసారిగా మరచిపోతారు. స్వర్ణ పుష్పాలంకరణలతో కూడిన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతికి లోనవుతారు.

కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడు ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి అలంకరణ ప్రియుడట, ఎంతటి అలంకరణ ప్రియుడో అంతటి భక్తజనప్రియుడట! శ్రీవారి అలంకరణకు టీటీడీ అధిక ప్రాధ్యానం ఇస్తోంది. స్వామివారికి ఉన్నన్ని ఆభరణాలు మరే దేవుడికీ, మరే ఆలయంలోనూ ఉండవు. శుక్రవారం అభిషేక సేవ అనంతరం స్వామివారికి బంగారు ఆభరణాలను అలంకరిస్తే, తిరిగి గురువారం ఉదయం సడలింపు చేస్తారు– అంటే అలంకరణలను తీసివేస్తారు. మరో వైపు పుష్పాలంకరణ మాత్రం శ్రీనివాసునికి ప్రతిరోజూ రెండుసార్లు నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తోమాలసేవలో స్వామి వారికి మూడువందల కిలోల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేస్తారు. 


శ్రీవారి ఆలయంలో స్వామివారికి అలంకరించే పుష్పాలను పూల అర అనబడే పుష్ప మండపంలో భద్రపరిచేవారు. అటు తరువాత రద్దీ పెరగడంతో ఈ కార్యక్రమాన్ని ఆలయం వెలుపలకు మార్చేశారు. శ్రీవారికి ప్రతినిత్యం సుగంధ పరిమళాలు వెదజల్లే చామంతి, లిల్లీ, మరువం, గన్నేరు, రోజాలు, దవనం, తులసి, తామరలు, కలువలు, మల్లెలు, కనకాంబరాలు వంటి పన్నెండు రకాల పుష్పాలతో రూపొందించిన మాలలను అలంకరిస్తారు. శ్రీవారి ఆలయంతో పాటు ఉపాలయాలైన బేడి ఆంజనేయస్వామి ఆలయం, వరదరాజ స్వామి ఆలయం, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, వరాహస్వామి ఆలయాలకు కలిపి ప్రతిరోజూ 300 కిలోల పుష్పాలు అవసరమవుతాయి. తిరుమల కొండ మీద కేవలం ముప్పయి కిలోల పువ్వులే లభిస్తుంటే, మిగిలిన 270 కిలోల పుష్పాలను భక్తులు అందజేసే విరాళాలతో బయటి నుంచి తెప్పిస్తుంటారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారికి పుష్పాలంకరణలో ముందుగా శిఖామణి అనబడే ఎనిమిది మూరల దండను స్వామివారి కిరీటం నుంచి రెండు భుజాల మీదుగా అలంకరిస్తారు. ఇక సాలగ్రామ మాలలను శ్రీవారి భుజాల నుంచి పాదాల వరకు రెండు వైపులా నాలుగు మూరలు ఉండే మాలలతో అలంకరిస్తారు. తరువాత మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకు అలంకరించే మూడున్నర మూరల పొడవుండే కంఠసరి మాలలను అలంకరిస్తారు. తర్వాత వక్షస్థల లక్ష్మీ మాలలను అలంకరిస్తారు. స్వామివారి వక్షస్థలంలో కొలువుండే శ్రీదేవి భూదేవులకు ఒకటిన్నర మూర ఉండే రెండు దండలను అలంకరిస్తారు. శంఖు చక్రాలకు ఒకొక్క మూర ఉండే రెండు దండలను అలంకరిస్తారు. ఇక స్వామివారి బొడ్డున ఉండే నందక ఖడ్గానికి కఠారి సరం అనే రెండు మూరల మాలను అలంకరిస్తారు. తావళాలు అనే హారాలను రెండు మోచేతుల కింద, నడుము నుంచి మోకాళ్లపైన, మోకాళ్ల నుంచి పాదాల వరకు వేలాడేలా మూడు దండలను అలంకరిస్తారు. వీటిలో ఒకటి మూడు మూరలు, రెండోది మూడున్నర మూరలు, మూడోది నాలుగు మూరలు ఉంటాయి. చివరిగా ఒక్కొక్క మూర ఉండే తిరువడి దండలను శ్రీవారి పాదాల చుట్టూ అలంకరిస్తారు.

ఇవి కాకుండా భోగ శ్రీనివాసమూర్తికి ఒక దండ, కొలువు శ్రీనివాసమూర్తికి ఒక దండ, శ్రీదేవి భూదేవి సహిత మలయప్పస్వామికి మూడు దండలు, శ్రీదేవి భూదేవి సహిత ఉగ్రశ్రీనివాసమూర్తికి మూడు దండలు, సీతారామలక్ష్మణులకు మూడు దండలు, రుక్మిణీ శ్రీకృష్ణులకు రెండు దండలు, చక్రత్తాళ్వారుకు ఒక దండ, అనంత గరుడ విష్వక్సేనులకు మూడు దండలు, సుగ్రీవ అంగద హనుమంతులకు మూడు దండలు, ద్వార పాలకులకు రెండు దండలు, గరుడాళ్వర్, వరదరాజస్వామి, వకుళమాతలకు మూడు దండలు, రామానుజాచార్యులకు రెండు దండలు, యోగనరసింహస్వామి, విష్వక్సేనులతో, పోటు తాయారు, బేడి ఆంజనేయస్వామికి నాలుగు దండలు, వరాహస్వామి ఆలయానికి మూడు దండలతో ప్రతి నిత్యం అలంకరిస్తారు. 

ప్రతి గురువారం శ్రీవారికి కేవలం పుష్పాలతో మాత్రమే అలంకరణ చేస్తారు. పూలంగి సేవగా పేర్కొనే ఈ కార్యక్రమాన్ని శ్రీవారికి ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక శ్రీవారికి ప్రతినెలా నిర్వహించే ఉత్సవాలకు విశేష పుష్పాలంకరణలలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. విశేష పర్వదినాలలో శ్రీవారి ఆలయాన్ని కూడా ప్రత్యేక పుష్పాలతో అలంకరిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి ఆలయాన్ని మూడు నుంచి ఐదు టన్నుల పుష్పాలతో అలంకరిస్తారు. వివిధ పుష్పాలతో ఆలయంలోని ధ్వజస్తంభం నుంచి ఆలయ ప్రాకారం వరకు అలంకరిస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తిథులలో మాత్రమే తెరిచి వుంచే వైకుంఠ ద్వారాన్ని రెండు టన్నుల పుష్పాలతో వైకుంఠాన్ని తలపించేలా చేసే అలంకరణ భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. తెలుగు వారి నూతన సంవత్సరాది రోజు అయిన ఉగాది పర్వదినాన కూడా శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేస్తారు. 

సాధారణ రోజులలో అలంకరణకు ఉపయోగించే చామంతి, తులసి, లిల్లి, మరువం, గన్నేరు, రోజాలు, దవనం, మల్లెలు, కలువలు, తామరలు, కనకాంబరాలు వంటివే కాకుండా కురివేరు, వట్టివేరు, తీగ సెంటు జాజులు, కట్‌ రోజెస్‌ వంటి పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేస్తారు. ఉగాది రోజున ఐదు టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. శ్రీనివాసునికి ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి మాసం ఏదో ఒక సేవ నిర్వహిస్తున్నా ప్రతి ఏటా శ్రావణ మాసం శ్రవణ నక్షత్రానికి పూర్తి అయ్యేలా తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందుకు అనుగుణంగానే పుష్పాలంకరణకు టీటీడీ అధిక ప్రాధాన్యమిస్తుంది. తొమ్మిది రోజులపాటు పద్నాలుగు రకాల వాహనాలపై స్వామివారు మాడ వీథులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చే ఈ ఉత్సవాలకు ముప్పయి టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తారు. బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాటు చేసే ఫల, పుష్ప ప్రదర్శన భక్తులకు కనువిందు చేస్తుంది. వివిధ పుష్పాలతో చేసే దేవతా మూర్తుల ఆకృతులను తిలకించే భక్తులకు తిరుమల క్షేత్రమే ఇలలో వెలసిన వైకుంఠంగా అనిపిస్తుంది. 

బ్రహ్మోత్సవాల తరువాత నిర్వహించే పుష్పయాగం న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంటుంది. పది టన్నుల పద్దెనిమిది రకాల పుష్పాలతో శ్రీవారికి పుష్పాభిషేకం నిర్వహిస్తారు. తరువాత ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించిన పూలపల్లకిలో ఉరేగిస్తారు. మూడు టన్నుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామివారి ఉరేగింపు భక్తులకు కనువిందు చేస్తుంది. ఇన్నిరకాల పూలతో అలంకరిస్తే శ్రీవారికి దిష్టి తగలకుండా ఉంటుందా? దిష్టి తగిలితే తగులుతుందేమో నని, శ్రీవారికి అలా దిష్టి తగలకుండా ఉండటానికి అర్చకులు సన్నని వెంట్రుకలా ఉండే కురువేరు అనే వేరును ఉపయోగిస్తారు. ఈ కురువేర్లు తమిళనాడులోని కుంభకోణం ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయట! (క్లిక్ చేయండి: అప్పట్లో కొండ ఎక్కాలన్నా పన్ను కట్టాల్సిందే!)

స్వామివారి పుష్పాలంకరణల కోసం తమిళనాడులోని చెన్నై, సేలం, శ్రీరంగం, కోయంబత్తూరు, దిండిగల్, కుంభకోణం తదితర ప్రాంతాల నుంచి 60 శాతం పుష్పాలు విరాళాలుగా అందితే, మిగిలిన 40 శాతం పుష్పాలను కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతం నుంచి దాతలు విరాళాలుగా అందిస్తారు. ప్రత్యేక పర్వదినాలలో అలంకరించేందుకు ప్రత్యేక పుష్పాలను కూడా టీటీడీ... బెంగళూరు నుంచే తెప్పిస్తుంది. మన దేశం నుంచే కాకుండా సింగపూర్, మలేషియా, బ్యాంకాక్‌ నుంచి కూడా భక్తులు స్వామి వారికి పుష్పాలను విరాళంగా అందిస్తున్నారు. శ్రీవారికి పుష్పాలు విరాళాలుగా అందించడానికి దాతలు ముందుకు వస్తే టీటీడీ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది. మరోవైపు స్వామివారి పుష్ప కైంకర్యానికి వినియోగించే పుష్పాలను టీటీడీ ద్వారానే పండించేందుకు ఏర్పాట్లును మొదలు పెట్టింది. పలమనేరులో 750 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న గో సంరక్షణశాల ప్రాంతంలో 25 ఏకరాల స్థలాన్ని పూలతోటల కోసం టీటీడీ కేటాయిస్తోంది. (క్లిక్ చేయండి: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవ వైభవం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement