బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం | Priority to Common Devotees in Tirumala Srivari Brahmotsavam: YV Subba Reddy | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం

Published Mon, Sep 26 2022 8:06 PM | Last Updated on Mon, Sep 26 2022 8:06 PM

Priority to Common Devotees in Tirumala Srivari Brahmotsavam: YV Subba Reddy - Sakshi

వైవీ సుబ్బారెడ్డి

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వసన్నద్ధమవుతోంది. తొమ్మిదిరోజుల పాటు పదహారు వాహనాలపై శ్రీవారు తిరువీథుల్లో ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు రానున్న భక్తుల సౌకర్యం కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది. ‘కరోనా’ కారణంగా గత రెండేళ్లలో బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయి. ‘కరోనా’ తొలగడంతో ఈసారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు...

బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వివరిస్తారా..?
సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సెప్టెంబరు 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తాం. సెప్టెంబర్‌ 26న రాత్రి 7–8 గంటల మధ్య అంకురార్పణ జరుగుతుంది.

సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహన సేవ జరుగుతాయి. ధ్వజారోహణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరుగుతాయి. అయితే గరుడ వాహనసేవ మాత్రం రాత్రి 7 నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తాం.

అక్టోబర్‌ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తాం.
తిరుమల ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తాం.


రెండేళ్ల ‘కరోనా’ మహమ్మారి తర్వాత ఈసారి బ్రహ్మోత్సవాలు భక్తుల నడుమ జరుగుతున్నందున అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఇందుకు ఎలాంటి ఏర్పాట్లు  చేస్తున్నారు?

తిరుమలలో రెండేళ్ల తరువాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడవీథుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కరోనా కారణంగా గత రెండేళ్లలో బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా జరిగాయి. దూరప్రాంతాల నుంచి సొంత వాహనాలపై వచ్చే భక్తుల కోసం అలిపిరి వద్ద ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నాం. శ్రీవారి ఆలయంతో పాటు అన్ని ముఖ్యకూడళ్లలోనూ విద్యుద్దీపాలంకరణలను ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు సేవలందించేందుకు మూడున్నర వేల మంది శ్రీవారి సేవకులను ఇప్పటికే ఆహ్వానించాం. ఫొటో ఎగ్జిబిషన్, మీడియా సెంటర్‌ ఏర్పాటు చేస్తాం.

ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ, అదనంగా ఐదువేల మంది పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసుకున్నాం. వైద్యవిభాగం ఆధ్వర్యంలో స్పెషలిస్ట్‌ డాక్టర్లను అందుబాటులో ఉంచుతాం. నిర్దేశిత ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి, అంబులెన్సులను అందుబాటులో ఉంచుతాం. భక్తుల రాకపోకల సౌకర్యం కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా తగినన్ని బస్సులను అందుబాటులో ఉంచుతాం. ప్రధాన కల్యాణకట్టతో పాటు పది మినీ కల్యాణకట్టల్లో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా తలనీలాలు సమర్పించు కునేలా ఏర్పాట్లు చేశాం. టీటీడీలోని 337 మంది రెగ్యులర్‌ క్షురకులు, 852 మంది పీస్‌రేటు క్షురకులు కలిపి మొత్తం 1189 మంది ఉన్నారు. వీరు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని నిర్ణయించాం. భక్తుల రద్దీ దృష్ట్యా బ్రేక్‌ దర్శనాలు, వృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనాలు తదితర ప్రివిలేజ్డ్‌ దర్శనాలను రద్దు చేశాం. ఆర్జిత సేవలు, రూ.300 టికెట్ల దర్శనాలతో పాటు అన్ని ట్రస్టు దాతలకు దర్శన టికెట్లను రద్దు చేశాం. వీఐపీల దర్శన సమయాన్ని కూడా రద్దు చేయడం ద్వారా సాధారణ రోజుల కంటే అధికంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశాం. ఈ నిర్ణయం వల్ల రోజుకు అదనంగా 15 వేల మంది సామాన్యభక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు.

బ్రహ్మోత్సవాలకు విశేషంగా తరలి వచ్చే భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయి?
తిరుమలలో ఉన్న 7 వేల గదుల్లో కొన్ని మరమ్మతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం 25 వేల మందికి సరిపడా వసతి మాత్రమే ఉంది. ఉన్న గదుల్లో 50 శాతం గదులను భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచాం. మిగిలిన 50 శాతం గదులను ఆఫ్‌లైన్‌లో ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన కేటాయిస్తున్నాం. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోని వసతి సముదాయాల్లో గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

భక్తుల అన్న ప్రసాదాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
సాధారణ రోజుల్లో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 వరకు, గరుడసేవ రోజున రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం అందించేలా అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేశాం.

తిరుమలకు వచ్చే భక్తులందరికీ లడ్డూ ప్రసాదం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
బ్రహ్మోత్సవాల్లో లడ్డూ ప్రసాదాలు భక్తులందరికీ అందించేందుకు వీలుగా తొమ్మిది లక్షల లడ్డూలు బఫర్‌ స్టాక్‌ ఉంచేలా ఏర్పాట్లు చేశాం.

ఈసారి గరుడసేవకు గతంలో కంటే అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా. భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
గరుడసేవ రోజున అదనంగా మరిన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నాం. ఘాట్‌ రోడ్లలో ప్రమాదాలు జరగకుండా చూసేందుకు గరుడసేవ నాడు పూర్తిగా, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల–తిరుపతి ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నాం. అక్టోబర్‌ 1న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ట్రస్టుల దాతలకు, కాటేజీ దాతలకు సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 2 వరకు ఆన్‌లైన్‌లోను, ఆఫ్‌లైన్‌లోను గదుల కేటాయింపు ఉండదు. దాతలు ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం.

టీటీడీ చైర్మన్‌గా మీరు రెండోసారి బాధ్యతలు చేపట్టారు. స్వామివారి సేవలో మరోసారి అవకాశం దక్కడంపై ఎలా భావిస్తున్నారు?
శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రథమ సేవకుడిగా సేవచేసే అవకాశం కొందరికి మాత్రమే దక్కుతుంది. ఆ కొందరిలో నేను కూడా ఉండడం స్వామివారు ప్రసాదించిన అదృష్టంగా భావిస్తున్నాను. టీటీడీలో చైర్మన్, బోర్డు సభ్యులే కాదు అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు స్వామివారి అనుగ్రహం లేనిదే పనిచేసే అవకాశం రాదు. ఈ విషయాన్ని మనసా వాచా కర్మణా ప్రగాఢంగా నమ్ముతాను. స్వామివారి అనుగ్రహం వల్లే ముఖ్యమంత్రి  వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నాకు రెండోసారి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా పనిచేసే అవకాశం కల్పించారు. 

భక్తులు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా మాడవీథుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
లక్షలాదిగా తరలివచ్చే భక్తులు మాడవీథుల్లో స్వామివారి వాహనసేవలను చూసి తరించాలనుకుంటారు. ఇందుకు అనుగుణంగా మాడవీథుల్లో ఉండే ప్రతి భక్తుడికీ స్వామివారి వాహనసేవ దర్శనం లభించేలా ప్రణాళిక రూపొందించాం. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అపురూపమైన కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల సమన్వయంతో బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో ఇరవై నాలుగు గంటలూ పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది.

లక్షలాది భక్తులు వచ్చే తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఒక పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించి, పర్యావరణ పరిరక్షణకు చారిత్రక నిర్ణయం తీసుకోవడం దేశంలో తిరుమలలో మాత్రమే జరిగింది. బ్రహ్మోత్సవాలకు దేశంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గుర్తించి తిరుమలకు ప్లాస్టిక్‌ బాటిళ్లు, సంచులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అలిపిరి వద్ద విజిలెన్స్‌ సిబ్బంది ప్లాస్టిక్‌ బాటిళ్లు, సంచులను తిరుమలకు రాకుండా చేసే తనిఖీలకు భక్తులు సహకరించి తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతకు సహకారం అందించాలని కోరుతున్నాను. (క్లిక్ చేయండి: శ్రీనివాసుని ఏ వారం దర్శించుకుంటే ఏ ఫలితం...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement