Tirumala: వైభవంగా గరుడోత్సవం | Tirumala Brahmotsavam 2023: Srivari Garuda Seva | Sakshi
Sakshi News home page

తిరుమల బ్రహ్మోత్సవాలు: వైభవంగా శ్రీవారి గరుడ సేవ

Published Fri, Sep 22 2023 7:21 PM | Last Updated on Fri, Sep 22 2023 8:01 PM

Tirumala Brahmotsavam 2023: Srivari Garuda Seva - Sakshi

సాక్షి, తిరుపతి:  తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజు.. శుక్రవారం సాయంత్రం గరుడోత్సవం వైభవంగా మొదలైంది.  గరుడవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. చిరు జల్లులతో వరుణుడు స్వాగతం పలికారు. తిరు వీధులు భక్తులతో నిండిపోయి.. గోవింద నామ స్మరణతో మారుమోగాయి.

వేద పండితుల మంత్రాలు, భక్తుల గోవింద నామాలు , మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, దేవతా మూర్తుల కళా రూపాలతో తుమ్మలగుంట క్షేత్రం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం వైభవోపేతంగా సాగింది. సాయంత్రం 4 గంటల నుంచే చుట్టు ప్రక్కల ప్రాంతాలు, పక్క మండలాల నుంచి భక్తులు తుమ్మలగుంటకు అధికంగా తరలివచ్చారు.  వాహన సేవ ముందు కళాకారుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

నిత్యం మూలమూర్తి అభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీకాసుల హారాలను గరుడసేవలో అలంకరించారు.  ఏడాది మొత్తంలో.. గరుడోత్సవం రోజు మాత్రమే ఆభరణాలు గర్భాలయం నుంచి బయటకు వస్తాయన్నది తెలిసిందే. మరోవైపు గ్యాలరీలలో రెండు లక్షల  భక్తులు చేరినట్లు అంచనా. గరుడవాహన దర్శనం కోసం భక్తులు పోటీ పడ్డారు.  గరుడవాహన దర్శనం కోసం రింగ్ రోడ్డుకు భక్త సంద్రం తరలి వచ్చింది. 

గరుడోత్సవంలో జిల్లా కలెక్టర్
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి గరుడ వాహన సేవలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శించారు. ఇస్కాన్ ప్రతినిధులు ఆలయం వద్దకు చేరుకుని సారె సమర్పించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

శ్రీవారికి సారె సమర్పణ
శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా  గరుడసేవ ప్రారంభానికి ముందు తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీవారికి సారె తెచ్చారు. సుమారు వెయ్యి మంది గ్రామస్తులు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు తీసుకు వచ్చి స్వామి వారికి సమర్పించారు.

ఉదయం మోహినీ అవతారంలో నిత్య కళ్యాణ శోభితుడు
అంతకు ముందు ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు కల్యాణ వెంకటేశ్వర స్వామి మోహినీ అవతారంలో పల్లకీపై  భక్తులకు దర్శనమిచ్చారు.  ఈ వాహనంకు వున్న  ప్రత్యేకత ఏమంటే మోహినీ అవతారం లో వున్న స్వామి భక్తులను ఆకట్టుకునేలా వివిధ రకాల ఆభరణాలు ధరించి.. కుడి చేతిలో చిలుకను పట్టుకుని.. ముందు ఏర్పాటు చేసిన అద్దంలో ముఖాన్ని చూస్తూ వుంటారు. స్వామి వారి పల్లకీ సేవలో భక్తులు తరించి పునీతులయ్యారు. 

బ్రహ్మోత్సవాల్లో రేపు..
కల్యాణ వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 7 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 7 గంటలకు గజవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement