సాక్షి, తిరుపతి: అధిక మాసం కారణంగా.. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రం సిద్ధమైంది. సోమవారం అన్నమయ్య భవన్‌లో అన్నివిభాగాల అధికారులతో ఈవో ధర్మారెడ్డి సోమవారం సమావేశం నిర్వహించి.. బ్రహోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించి.. అనంతరం అధికారిక ప్రకటన చేశారు. సెప్టెంబరు 18 నుండి 26 వరకూ సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15వ తేదీ నుండి 23 వరకు తేదీ వరకూ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉంటాయని వెల్లడించారాయన.
ఈ ఏడాదిలో అధిక మాసం కారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రంను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణం కార్యక్రమంను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
సెప్టెంబరు 22వ తారీఖున గరుడ సేవ, 23వ తేదీన స్వర్ణరథం, 25వ తేదీన రథోత్సవం, 26వ తేదీన చక్రస్నానం, తిరుమలలో వైభవంగా ధ్వజావరోహణం కార్యక్రమంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు మాత్రమే ఉంటుందని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారాయన.
ఇక అధిక మాసం కారణంగా ఈ ఏడాది అక్టోబర్ నెలలో 14-18వ తేదీల నడుమ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారాయన. అక్టోబర్ 18వ తారీఖున గరుడవాహన సేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు.. ఈ ఏడాది పెరటాసి మాసంలో రెండు బ్రహ్మోత్సవాలు ఉన్న క్రమంలో భారీ స్ధాయిలో భక్తులు తిరుమల బ్రహ్మోత్సవాలకు విచ్చేసే అవకాశం ఉండొచ్చన్నారాయన.
పవిత్ర మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుందన్నారు. అలాగే.. సెప్టెంబర్ 23, 30, అక్టోబర్ 7, 14 తేదీల్లో పురటాసి శనివారాలు జరుగుతాయని, కాబట్టి ఈ రెండు బ్రహ్మోత్సవాలు, పురటాసి శనివారాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. టీడీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment