అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి వచ్చి, భూలోక వైకుంఠమైన వేంకటాద్రిపై కొలువుదీరాడు. కన్యామాసం (చాంద్రమానం ప్రకారం ఆశ్వీయుజ మాసం) శ్రవణ నక్షత్రం రోజున శ్రీవేంకటేశ్వరస్వామిగా అర్చారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలశాడు. శ్రీవేంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్తజన వల్లభుడు.
కోరినవారి కొంగుబంగారమై కోరికలను ఈడేర్చే శ్రీవేంకటేశ్వరుని వైభోగం న భూతో న భవిష్యతి! వేంకటాచల క్షేత్రం పై వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి, లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి ముగిసేలా తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని ప్రతీతి.
దసరా నవరాత్రులు జరిగే కన్యామాసంలో శ్రీవేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిదిరోజుల ముందు నవరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం.
సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకొకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించటం కూడా ఆనవాయితీగా కొనసాగుతోంది. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం, వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణం, బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు.
నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు (ధ్వజారోహణం, ధ్వజావరోహణం) లేకుండా ఆగమోక్తంగా అలంకార ప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదో రోజున మహారథం (చెక్కరథం) బదులు ఇదివరకు వెండిరథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై స్వామివారి ఊరేగింపు జరుగుతూ వస్తోంది. 2012లో పాత స్వర్ణరథం స్థానంలో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది.
అంకురార్పణతో ఆరంభం
శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు వసంత మండపానికి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత దేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో శాలి, ప్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలను పోసి ఆ మట్టిలో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు.
ధ్వజారోహణం
న భూతో న భవిష్యతి అనేలా అంగరంగ వైభవోపేతంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడు కాబట్టి, ఒక కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజపటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు.
ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కొండమీదే కొలువుదీరి ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
పెద్ద శేషవాహనం
ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయం పరిధిలోని నాలుగు మాడవీథుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేషవస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యమిస్తూ తొలిరోజు ఆ వాహనం మీద ఊరేగుతారు.
చిన్నశేషవాహనం
రెండోరోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. పెద్ద శేషవాహనం ఆదిశేషుడైతే, చిన్నశేషవాహనం వాసుకి.
హంసవాహనం
రెండోరోజు రాత్రి స్వామివారు విద్యాప్రదాయని అయిన శారదామాత రూపంలో హంసవాహనంపై ఊరేగుతారు. పాలు, నీళ్లను వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతంగా శ్రీనివాసుడు హంసవాహనం అధిరోహించి భక్తులకు దర్శనమిస్తాడు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు ఊరేగుతూ దర్శనమివ్వడం భక్తులకు నేత్రపర్వం.
సింహవాహనం
బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం సింహవాహనం అధిరోహించి శ్రీవేంకటనాథుడు భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులలో మృగరాజైన సింహాన్ని తానేనంటూ మనుషులలో జంతు ప్రవృత్తిని నియంత్రించుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారని
ముత్యాలపందిరి వాహనం
మూడో రోజు రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామివారికి జరిగే సుకుమారసేవగా ముత్యాలపందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు.
కల్పవృక్ష వాహనం
కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు శ్రీవేంకటాద్రివాసుడు. కల్పవృక్షం– అన్నవస్త్రాదుల వంటి ఇహలోక సంబంధితమైన కోరికలను మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వత కైవల్యాన్ని ప్రసాదించే కారుణ్యమూర్తి. నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు సర్వాలంకార భూషితుడై ఊరేగుతాడు.
సర్వభూపాల వాహనం
లోకంలోని భూపాలకులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వభూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహన సేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది.
మోహినీ అవతారం
బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదోరోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్త జనావళికి కనువిందు చేస్తారు. అన్ని వాహనసేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం నేరుగా శ్రీవారి ఆలయం లోపలి నుంచే పల్లకిపై ప్రారంభం అవుతుంది. పరమశివుడిని సైతం సమ్మోహన పరచి, క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. మంచి పనులు చేయడం ద్వారా దైవానుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటడానికే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీథుల్లో విహరిస్తారు.
గరుడవాహనం
ఐదోరోజు రాత్రి తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద స్వామివారు ఊరేగుతారు. స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామమాల ధరించి మలయప్పస్వామి భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీవేంకటేశ్వరుడిని తన కీర్తనలతో నానా విధాలుగా కొనియాడిన గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాలను, నూతన ఛత్రాలను గరుడ వాహనంలో అలంకరిస్తారు. ఈ వాహనంలో ఊరేగే స్వామివారి వైభోగాన్ని చూసి తరించడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని కూడా ఈ సేవ చాటి చెబుతుంది.
హనుమంత వాహనం
ఆరోరోజు ఉదయం స్వామివారు హనుమద్వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. త్రేతాయుగంలో తనను సేవించుకున్న భక్త శిఖామణి హనుమంతుడిపై స్వామివారు తిరువీథుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను లోకులకు తెలిసేలా, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు చాటి చెబుతారు.
గజవాహనం
గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి గజవాహనంపై ఊరేగుతారు. గజవాహనంపై ఊరేగుతుండగా స్వామిని దర్శించుకుంటే, పెనుసమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
సూర్యప్రభ వాహనం
బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు ఉదయం సప్తాశ్వాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామివారు సూర్యప్రభ వాహనం మీద ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగులు ప్రసాదించే సూర్య భగవానుడు తన ప్రతిరూపమేనని చాటిచెబుతారు.
చంద్రప్రభ వాహనం
ఏడోరోజు రాత్రి ధవళ వస్త్రాలు, తెల్లని పూలమాలలు ధరించి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని తెలియజేస్తారు. మనఃకారుకుడైన చంద్రుడి లక్షణం తనలోనూ ఉందని, తాను కూడా భక్తుల మనస్సుపై ప్రభావం చూపిస్తానని చాటి చెబుతారు.
రథోత్సవం
గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే కళ్లెంతో అదుపు చేసే విధంగానే, రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్త్వజ్ఞానాన్ని స్వామివారు ఎనిమిదో రోజు ఉదయం తన రథోత్సవం ద్వారా తెలియ జేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.
అశ్వవాహనం
ఎనిమిదోరోజు రాత్రి స్వామివారు అశ్వవాహనారూఢుడై ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం.
చక్రస్నానం
ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రత్తాళ్వారును వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రత్తాళ్వార్ స్నాన మాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తీరుతాయని ప్రతీతి.
ధ్వజావరోహణం
చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్స వాలను ముగిస్తారు.
డాలర్ లేని బ్రహ్మోత్సవం...
ఈ ఏట తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు డాలర్ శేషాద్రి సందడి లేకుండానే జరగనున్నాయి. శ్రీవారి ఆలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న డాలర్ శేషాద్రి ఉరఫ్ పాల శేషాద్రి గత ఏడాది నవంబర్ 29వ తేదీన కన్ను మూయడంతో ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు డాలర్ లేకుండానే జరగనున్నాయి. 1978వ సంవత్సరంలో టీటీడీ లో విధుల్లో చేరిన శేషాద్రి అప్పటినుంచి గత ఏడాది వరకు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ వచ్చారు.
మధ్యలో 2009వ సంవత్సరంలో కోర్టు తీర్పు కారణంగా బ్రహ్మోత్సవాల విధులకు దూరమైన శేషాద్రి అటు తరువాత 2014వ సంవత్సరంలో ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే గుండెపోటుకి గురై కొన్ని వాహనసేవలకు దూరమయ్యారు. ఈ రెండుసార్లు మినహాయిస్తే దాదాపు 44 సంవత్సరాల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఉత్సవాల నిర్వహణలో పాలుపంచుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఉత్సవాల సమయంలో స్వామి వారి ఆలంకరణలను ఏవిధంగా చేయాలన్న దాని పై అర్చకులకు సహకరిస్తూ ఏ సమయంలో ఏ కైంకర్యం నిర్వహించాలో తెలుపుతూ సమయానికి అన్నీ సక్రమంగా జరిగేలా చూసుకునే వారు. ఆలయ మాడవీథుల్లో వాహన ఊరేగింపు జరుగుతున్నంత సేపు కూడా వాహనంతో పాటే ఉంటూ అన్నీ తానై వ్యవహరిస్తూ వాహన సేవ విజయవంతంగా సాగేలా సహకరించి అటు అధికారులతోపాటు ఇటు టీటీడీ పాలకమండలి మన్ననలను పొందేవారు. మరోవైపు ఉత్సవాలలో వాహన ఊరేగింపు ముందు సందడి చేస్తూ భక్తుల్లో భక్తిభావాన్ని నింపేవారు. ఇలా బ్రహ్మోత్సవాలలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే డాలర్ శేషాద్రి లేకుండానే ఈ ఏట శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
26.09.2022 అంకురార్పణ
27.09.2022 ధ్వజారోహణం పెద్ద శేషవాహనం
28.09.2022 చిన్నశేషవాహనం హంసవాహనం
29.09.2022 సింహవాహనం ముత్యపుపందిరి వాహనం
30.09.2022 కల్పవృక్షవాహనం సర్వభూపాల వాహనం
01.10.2022 మోహినీ అవతారం గరుడ వాహనం
02.10.2022 హనుమంతæవాహనం గజవాహనం
03.10.2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
04.10.2022 రథోత్సవం అశ్వ వాహనం
05.10.2022 చక్రస్నానం ధ్వజావరోహణం
Comments
Please login to add a commentAdd a comment