'శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి' కి స్వయాన తోబుట్టువు.. ఎవరంటే? | 'Tataya Gunta Gangamma Temple' Has A Thousand Years Of History | Sakshi
Sakshi News home page

'శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి' కి స్వయాన తోబుట్టువు.. ఎవరంటే?

Published Sun, Oct 15 2023 1:11 PM | Last Updated on Mon, Oct 16 2023 10:12 AM

'Tataya Gunta Gangamma Temple' Has A Thousand Years Of History - Sakshi

శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి

దేశంలోనే అత్యంత  ప్రాచీనమైన గ్రామదేవత తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి శ్రీవారికి స్వయానా చెల్లెలు. తిరుపతి ప్రజలను పరిరక్షించే గ్రామదేవతగా భక్తులచే పూజలందుకుంటోంది. శ్రీవేంకటేశ్వరస్వామికి స్వయాన తోబుట్టువు కావడంతో తిరుపతి గంగమ్మ జాతర సమయంలో శ్రీవారు సారె పంపేవారు. ఈ సంప్రదాయం సుమారు నాలుగు శతాబ్దాల నాటిది. విష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరస్వామి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు.

కాటమరాజుల కథల ప్రకారం గంగమ్మ శ్రీకృష్ణునికి చెల్లెలు. అందుకే శ్రీవారి ఆలయం నుంచి ప్రతి ఏటా ఆమెకు పుట్టింటి సారె పంపే సంప్రదాయం కొనసాగుతోంది. శ్రీవారి తోబుట్టువుగా భారతీయ సనాతన సంప్రదాయం ప్రకారం శ్రీతాతయ్యగుంట గంగమ్మకు ప్రతి ఏటా  జాతర నెలలో శ్రీవారి ఆలయం నుంచి  గంగమ్మ ఆలయానికి గంప, చేట, పట్టుశేషవస్త్రాలు, పసుపు, కుంకుమలను టీటీడీ వారు అందజేస్తున్నారు.

తిరుచానూరులో చక్రతీర్థం రోజున తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీపద్మావతి అమ్మవారికి ఏనుగుపై పసుపు ముద్దను పంçపుతారు. శ్రీవారు శ్రీపద్మావతి అమ్మవారికి పంపే పసుపు ముద్ద తిరుమల నుంచి తిరుచానూరు చేరుకున్నాకే అమ్మవారి చక్రస్నానం జరిగే ఆచారం ఉంది. ఈ పసుపు ముద్దను తిరుచానూరుకు తీసుకెళ్లే మార్గమధ్యలో ఉన్న తాతయ్య గుంట గంగమ్మ గుడి ముందు ఆపి పూజారులు, అధికారులు అమ్మవారికి కొబ్బరి కాయ సమర్పించి హారతి ఇస్తారు. ఆ తరువాతే తిరుచానూరుకు ఊరేగింపుగా తీసుకెళ్తారు.

ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర!
తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో బయటపడ్డ పురాతన కట్టడాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు చెబుతున్నారు. గర్భాలయ నిర్మాణంలో భాగంగా 12 అడుగుల లోతులో బయటపడిన అపురూపమైన శిల్పాలతో బయటపడ్డ రాతి కట్టడాలు పల్లవుల ఆఖరి కాలం నాటివని పురావస్తుశాఖ అధికారులు అంచనా వేశారు.

ఈ ఆలయాన్ని శ్రీవారి భక్తాగ్రేసరుడు అనంతాచార్యులు స్వయంగా ప్రతిష్ఠించారు. అప్పటి కుగ్రామమైన తిరుపతి ప్రజలను పరిరక్షించే ఆ గ్రామదేవతకు భక్తులు పూజలందిస్తూ.. ఏడు రోజుల పాటు జానపద వేషధారణలతో ప్రతిష్ఠాత్మకంగా జాతర సంబరాలను కొనసాగిస్తారు. దేశంలోనే ప్రథమ గ్రామదేవత ఉత్సవాన్ని జరుపుకున్న ఆలయం కూడా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి. సమ్మక్క–సారక్క జాతర చరిత్ర 200 ఏళ్లు అయితే, పైడితల్లి అమ్మవారి జాతరకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుపతి గంగమ్మ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉండటం విశేషం.

తాతయ్య గుంట ఎందుకొచ్చిందంటే?
వైష్ణవ భక్తుడైన తాతాచార్యులకు  కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్యగుంట అని పేరు ఉండేది. ఇదే చెరువు గట్టు మీద వెలసినందున అమ్మవారిని తిరుపతి గంగమ్మ అని పిలిచేవారు. కాలక్రమేణ  శ్రీతాతయ్యగుంట గంగమ్మ అని ప్రశస్తి పొందింది. నాటి నుంచే అశేష భక్తకోటి పూజలందుకుంటూ గంగమ్మ భక్తుల కొంగుబంగారంగా ఆలరారుతోంది.

ఈ ఆలయం తరువాతే  దేశంలోని గ్రామాల్లో గంగమ్మ ఆలయాలు వెలసి భక్తజనుల పూజలు అందుకోవడం ఆరంభమయ్యాయి. తాళ్లపాక అన్నమయ్య తిరుపతి గంగమ్మను దర్శించి మొక్కులు చెల్లించడంతో తాళ్లపాక గంగమ్మ అని కూడా పిలుస్తున్నారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 18వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి తరిగొండ వెంగమాంబ ‘జలక్రీడావిలాసం’ యక్షగానంలో తాతయ్యగుంట గంగమ్మను ప్రస్తావించింది.

నాటి నుంచే టీటీడీ పర్యవేక్షణలో గంగమ్మ ఆలయం
గంగమ్మ ఆలయాన్ని ఎప్పటి నుంచో తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షిస్తోంది. బ్రిటిష్‌ వారు 1843 సంవత్సరంలో టీటీడీ ఆలయ పర్యవేక్షణను హథీరామ్‌జీ బాబాకు అప్పగించారు. అప్పటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, కపిలతీర్థం ఆలయం ఇలా 26 ఆలయాల పర్యవేక్షణను హాథీరామ్‌జీ బాబా చూసేవారు.

హాథీరామ్‌జీ బాబా పర్యవేక్షణలోనే శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయం కూడా ఉండేది. 1933లో టీటీడీ పాలక మండలి ఏర్పాటవటంతో బ్రిటిష్‌ వారు తిరుమల శ్రీవారి ఆలయ పర్యవేక్షణను పాలకమండలికి అప్పగించారు. అప్పట్లో శ్రీతాతయ్యగుంట గంగమ్మ రికార్డులు మాయమయ్యాయి. అంటే తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయం టీటీడీ ఉప ఆలయమే అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

గంగమ్మ దర్శనం తర్వాత శ్రీవారి దర్శనం..
తిరుమల స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా శ్రీవారి చెల్లెలైన గంగమ్మను దర్శించుకునే వారు. ఆ తరువాతే తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. శతాబ్దాల పూర్వం నుంచే ఈ ఆచారం ఉండేది. నాటి రాజులందరూ అదే సంప్రదాయాన్ని పాటించారు. అయితే కాలక్రమేణా తిరుమలకు వెళ్లే దారులు పెరగటంతో ఈ సంప్రదాయం కనుమరుగైంది. నాటి సంప్రదాయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేత పునఃప్రారంభించారు.

75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ గంగమ్మవారిని దర్శించుకున్న దాఖలాలు లేవు. ఓ ఆధ్యాత్మిక ప్రాచీన సంప్రదాయాన్ని కొనసాగించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఈ సంప్రదాయం గురించి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించటంతో గత ఏడాది, ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు విచ్చేసిన సీఎం ముందుగా తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. గంగమ్మ దర్శనం తర్వాతే శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించి స్వామివారి దర్శనం చేసుకోవటం ద్వారా సరికొత్త చరిత్రకు తెరతీశారు.

ప్రతిష్ఠాత్మకంగా అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం
తాతయ్యగుంట గంగమ్మ ఆలయ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చొరవతో రూ.16 కోట్లలో దేవదాయశాఖ, టీటీడీ నిధులతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయం మొత్తాన్ని కేవలం రాతితోనే నిర్మిస్తున్నారు. తాతయ్య గుంట గంగమ్మ జాతర విషయాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మే నెలలో గంగమ్మ జాతరను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించటం గమనార్హం. - తిరుమల రవిరెడ్డి, సాక్షి–తిరుపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement