ఆమె దాండియాకి ఇండియా నర్తిస్తుంది | Sakshi Special Story About Queen of Dandiya Falguni Pathak | Sakshi
Sakshi News home page

ఆమె దాండియాకి ఇండియా నర్తిస్తుంది

Sep 25 2025 12:26 AM | Updated on Sep 25 2025 12:26 AM

Sakshi Special Story About Queen of Dandiya Falguni Pathak

నవరాత్రి

దసరా నవరాత్రులు వస్తే దేశం తలిచే పేరు ఫాల్గుణి  పాఠక్‌. ‘దాండియా క్వీన్  ఆఫ్‌ ఇండియా’గా పేరు గడించిన ఈ 56 సంవత్సరాల గాయని తన  పాటలతో, నృత్యాలతో పండగ శోభను తీసుకువస్తుంది. 25 రూ పాయల  పారితోషికంతో జీవితాన్ని ప్రారంభించి నేడు  కోట్ల రూ పాయలను డిమాండ్‌ చేయగల స్థితికి చేరిన ఫాల్గుణి స్ఫూర్తి పై పండుగ కథనం.

దేశంలో దసరా నవరాత్రులు జరుపుకుంటారు. కాని అమెరికాలో, దుబాయ్‌లో, గుజరాతీలు ఉండే అనేక దేశాల్లో వీలును బట్టి ప్రీ దసరా,  పోస్ట్‌ దసరా వేడుకలు కూడా జరుపుకుంటారు. ఫాల్గుణి  పాఠక్‌ వీలును బట్టి ఇవి ప్లాన్‌ అవుతాయి. ఆమె దసరా నవరాత్రుల్లో ఇండియాలో ఉంటే దసరా అయ్యాక కొన్ని దేశాల్లో దాండియా డాన్స్‌షోలు నిర్వహిస్తారు. లేదా దసరాకు ముందే కొన్ని దేశాల్లో డాన్స్‌ షోలు నిర్వహిస్తారు. ఆమె దసరాకు ముందు వచ్చినా, తర్వాత వచ్చినా కూడా ప్రేక్షకులకు ఇష్టమే. ఆమె  పాటకు  పాదం కలపడం కోసం అలా లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి డిమాంట్‌ ఉన్న గాయని ఫాల్గుణి  పాఠక్‌ మాత్రమే.

తండ్రిని ఎదిరించి...
ఫాల్గుణి  పాఠక్‌ది తన రెక్కలు తాను సాచగల ధైర్యం. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ కూతురుగా ముంబైలోని ఒక గుజరాతి కుటుంబంలో జన్మించింది ఫాల్గుణి. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ సంతానమైనా అబ్బాయి పుడతాడని భావిస్తే ఫాల్గుణి పుట్టింది. అందుకే తల్లి, నలుగురు అక్కలు ఆమెకు ΄్యాంటు, షర్టు తొడిగి అబ్బాయిలా భావించి ముచ్చటపడేవారు. రాను రాను ఆ బట్టలే ఆమెకు కంఫర్ట్‌గా మారాయి. వయసు వచ్చే సమయంలో తల్లి హితవు చెప్పి, అమ్మాయిలా ఉండమని చెప్పినా ఫాల్గుణి మారలేదు. ఆ ఆహార్యం ఒక తిరుగుబాటైతే  పాట కోసం తండ్రిని ఎదిరించడం మరో తిరుగుబాటు.

 తల్లి దగ్గరా, రేడియో వింటూ  పాట నేర్చుకున్న ఫాల్గుణి  పాఠక్‌ స్కూల్లో  పాడుతూ ఎనిమిదో తరగతిలో ఉండగా మ్యూజిక్‌ టీచర్‌తో కలిసి ముంబైలోని వాయుసేన వేడుకలో  పాడింది. ఆమె  పాడిన  పాట ‘ఖుర్బానీ’ సినిమాలోని ‘లైలా ఓ లైలా’. అది అందరినీ అలరించిందిగానీ ఇంటికి వచ్చాక తండ్రి చావబాదాడు..  పాటలేంటి అని. కాని అప్పటికే  పాటలో ఉండే మజా ఆమె తలకు ఎక్కింది. ఆ తర్వాత తరచూ ప్రదర్శనలు ఇవ్వడం ఇంటికి వచ్చి తండ్రి చేత దెబ్బలు తినడం... చివరకు విసిగి తండ్రి వదిలేశాడుగాని ఫాల్గుణి మాత్రం  పాట మానలేదు.

త–థయ్యా బ్యాండ్‌
తన ప్రదర్శనలతో  పాపులర్‌ అయ్యాక సొంత బ్యాండ్‌ స్థాపించింది ఫాల్గుణి. దాని పేరు ‘త–థయ్యా’. ఆ బ్యాండ్‌తో దేశంలోని అన్నిచోట్లా నవరాత్రి షోస్‌ మొదలెట్టింది. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా, గర్భా డాన్స్‌ చేసే ఆనవాయితీ ఉత్తరాదిలో ఉంది. ఫాల్గుణికి ముందు ప్రదర్శనలిచ్చేవారు కేవలం ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌ను మాత్రమే వినిపిస్తూ డాన్స్‌ చేసేవారు. ఫాల్గుణి తనే దాండియా, గర్భా నృత్యాలకు వీలైన  పాటలు  పాడుతూ ప్రదర్శనకు హుషారు తేసాగింది. దాండియా సమయంలో ఎలాంటి  పాటలు  పాడాలో, జనంలో ఎలా జోష్‌ నింపాలో ఆమెకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే ఆమె షోస్‌ అంటే జనం విరగబడేవారు. 2010లో మొదటిసారి నవరాత్రి సమయాల్లో ఆమె గుజరాత్‌ టూర్‌ చేసినప్పుడు ప్రతిరోజూ 60 వేల మంది గుజరాత్‌ నలుమూలల నుంచి ఆమె షోస్‌కు హాజరయ్యేవారు.

ప్రయివేట్‌ ఆల్బమ్స్‌
స్టేజ్‌ షోలతో  పాపులర్‌ అయిన ఫాల్గుణి తొలిసారి 1998లో తెచ్చి ‘యాద్‌ పియాకీ ఆనె లగీ’... పేరుతో విడుదల చేసిన ప్రయివేట్‌ ఆల్బమ్‌ సంచలనం సృష్టించింది. ఊరు, వాడ ‘యాద్‌ పియాకీ ఆనె లగీ’  పాట మార్మోగి పోయింది. యువతరం హాట్‌ ఫేవరెట్‌గా మారింది. 1999లో విడుదల చేసిన ‘మైనె  పాయల్‌ హై ఛన్‌కాయ్‌’... కూడా పెద్ద హిట్‌. ఈ అల్బమ్స్‌లో  పాటలు కూడా ఆమె తన నవరాత్రుల షోస్‌లో  పాడటం వల్ల ఆమెకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది.

రోజుకు 70 లక్షలు
2013 సమయానికి ఫాల్గుణి  పాఠక్‌ నవరాత్రి డిమాండ్‌ ఎంత పెరిగిందంటే రోజుకు 70 లక్షలు ఆఫర్‌ చేసే వరకూ వెళ్లింది. నవరాత్రుల మొత్తానికి 2కోట్ల ఆఫర్‌ కూడా ఇవ్వసాగారు. ఆశ్చర్యం ఏమిటంటే నవరాత్రుల్లో అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా, గర్భా నృత్యాలు చేస్తారు. కాని ఫాల్గుణి ఆ దుస్తులు ఏవీ ధరించదు. ΄్యాంట్‌ షర్ట్‌ మీదే ప్రదర్శనలు ఇస్తుంది. ‘ఒకసారి ఘాగ్రా చోళీ వేసుకొని షో చేశాను. జనం కింద నుంచి ఇలా వద్దు నీలాగే బాగుంటావు అని కేకలు వేశారు. ఇక మానేశాను’ అంటుందామె.

వెలుగులు చిమ్మాలి
ఫాల్గుణి ప్రదర్శన అంటే స్టేజ్‌ మాత్రమే కాదు గ్రౌండ్‌ అంతా వెలుగులు చిమ్మాలి. గ్రౌండ్‌లోని ఆఖరు వ్యక్తి కూడా వెలుతురులో పరవశించి ఆడాలని భావిస్తుంది ఫాల్గుణి. ప్రతి నవరాత్రి ప్రదర్శన సమయంలో నిష్ఠను  పాటించి  పాడుతుందామె. ‘నేను ఇందుకోసమే పుట్టాను. నాకు ఇది మాత్రమే వచ్చు’ అంటుంది. ఆమెకు విమాన ప్రయాణం అంటే చాలా భయం. ‘విమానం ఎక్కినప్పటి నుంచి హనుమాన్‌ చాలీసా చదువుతూ కూచుంటాను. అస్సలు నిద్ర  పోను’ అంటుందామె. హనుమాన్‌ చాలీసా ఇచ్చే ధైర్యంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఆమె ఎగురుతూ భారతీయ గాన, నృత్యాలకు ప్రచారం కల్పిస్తోంది.
 
తండ్రితోనే
ఏ తండ్రైతే ఆమెను  పాడవద్దన్నాడో ఆ తండ్రికి తనే ఆధారమైంది ఫాల్గుణి. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే తల్లి హార్ట్‌ ఎటాక్‌తో మరణించడంతో కుటుంబ భారం తనే మోసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు తనే చేసింది. తండ్రిని చూసుకుంది. వివాహం చేసుకోవడానికి ఇష్టపడని ఫాల్గుణి ‘నేను నాలాగే హాయిగా ఉన్నాను’ అంటుంది. గత 25 ఏళ్లుగా 30 మంది సభ్యుల బృందం స్థిరంగా ఆమె వెంట ఉంది. ప్రతి ప్రదర్శనలో వీరు ఉంటారు. వీరే నా కుటుంబం అంటుందామె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement