తిరుమల/న్యూఢిల్లీ: శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి విచ్చేస్తోన్న భక్తులకు శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, గదులు తదితర సౌకర్యాలను టీటీడీ చక్కగా కల్పిస్తోందని బ్రిజ్‌లాల్ అధ్యక్షతన ఉన్న భారత హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభినందించింది.
కమిటీ సభ్యులు మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. టీటీడీ ఆవిర్భావం నుంచి చేపడుతోన్న సామాజిక, ధార్మిక, సంక్షేమ కార్యకలాపాలను 40 నిమిషాల ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ద్వారా ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి వివరించారు.
కమిటీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ పద్ధతులు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, విపత్తుల నిర్వహణ ప్రణాళికలను ప్రశంసించారు. కమిటీ సభ్యులు బిప్లవ్ కుమార్ దేవ్, నీరజ్ శేఖర్, దిలీప్ ఘోష్, దులాల్ చంద్ర గోస్వామి, రాజా అమరేశ్వర నాయక్, డాక్టర్ సత్య పాల్ సింగ్, డాక్టర్ నిషికాంత్ దూబే, హోం వ్యవహారాల శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ట్రస్టులకు రూ.43 లక్షల విరాళం
బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు వర్ధమాన్ జైన్ టీటీడీలోని పలు ట్రస్టులకు రూ.43 లక్షలు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళం డీడీలను టీటీడీ ఈవోకు దాత అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.33 లక్షల 33 వేలు, ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షల11 వేలు అందించారు.
తిరుపతి పరిశుభ్రతపై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంస
తిరుపతి నగరం పారిశు«ధ్యంలో మరింత నిబద్ధత పాటిస్తుందని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. తడి–పొడి చెత్త ద్వారా సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్, నిర్వహణ సౌకర్యాల కోసం శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. స్వచ్ఛభారత్ మిషన్, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 11న తిరుపతి నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ అవార్డు అందుకున్న అనంతరం పారిశుద్ధ్యానికి సంబంధించి తిరుపతి నగరం పాటిస్తోన్న నిబద్ధతను కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.
పారిశుధ్య సేవలను మరింతగా విస్తరించేందుకు, సిటీని ది బెస్ట్ క్లీన్‌సిటీగా తీర్చిదిద్దేందుకు 1,000 మంది కార్మికులను నియమించింది. ఇక్కడ ఏర్పా టు చేసిన వికేంద్రీకృత వ్యర్థాల ప్రాసెసింగ్.. కేంద్రీకృత ప్లాంట్లపై భారాన్ని తగ్గిస్తుందని, వాటి పనిభారం, రవాణా ఖర్చులను కూడా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపింది. గణనీయ పరిమాణంలో సేంద్రీయ వ్యర్థాలు ఉత్పన్నమయ్యే మార్కెట్లు, తోటల్లో తడి వ్యర్థాలను ప్రాసెస్ చేయడంపై దృష్టి సారించిందని వెల్లడించింది. 3 ప్రధాన మార్కెట్లు, 3 తోటల వద్ద 6 వికేంద్రీకృత వ్యర్థాల ప్రాసెసింగ్ సౌకర్యాలు ఉన్నట్లు తెలిపింది.
నగరంలో 3 వేర్వేరు ప్రదేశాల్లో 3 బయో చెస్ట్ యంత్రాలను ఏర్పాటు చేసి రోజుకు 100 కిలోలకు పైగా ఉత్పత్తి చేసే 27 బల్క్ వేస్ట్ జనరేటర్లను, రోజుకు 50–100 కిలోలు ఉత్పత్తి చేసే 60 జనరేటర్లను గుర్తించి వర్గీకరించినట్లు పేర్కొంది. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యేకమైన రీతిలో రీసైక్లింగ్ చేయడానికి వాషింగ్ ప్లాంట్, ఆగ్లోమెరేటర్ మిషన్ (ధన మెషినరీ)ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ మిషనరీ వల్ల తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ బృందం ఏడాది కాలంలో 263.29 టన్నుల ప్లాస్టిక్ గ్రాన్యూల్స్‌ను విక్రయించేలా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కృషి చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ కొనియాడింది.
Comments
Please login to add a commentAdd a comment