సాక్షి, తిరుపతి: శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికగా ఈ ఉదయం రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే మంగళవారం వేకువ ఝామున ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో వాయిదా వేశారు శాస్త్రవేత్తలు.
చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ అగ్నిబాణ్ రాకెట్‌ను రూపొందించింది. సొంత ల్యాంచ్‌ప్యాడ్ ఏర్పాటు చేసి సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టాలనుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఎనిమిది గంటల కౌంట్‌డౌన్ అనంతరం ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ఉదయం 5.48 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. ప్రయోగాన్ని సమీక్షించేందుకు ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ సోమవారం సాయంత్రమే షార్‌కు కూడా చేరుకున్నారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో శాస్త్రవేత్తలు ప్రయోగం నిలిపివేశారు.
ఏప్రిల్ 7వ తేదీ నుంచి అగ్నిబాణ్ ప్రయోగం వాయిదా పడడం ఇది నాలుగోసారి. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా అగ్నిబాణ్ రికార్డులకెక్కింది. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment