
తమపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. వ్యక్తిగత ఆరోపణలు చేసే ముందు వివరణ తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు.
సాక్షి, న్యూఢిల్లీ: తమపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. వ్యక్తిగత ఆరోపణలు చేసే ముందు వివరణ తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మదనపల్లి ఆర్‌డీవో ఆఫీసు ఫైళ్ల దహనంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారు.. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
మా వ్యక్తిగత ఇమేజ్ దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తున్నారు. మా ఆస్తుల వివరాలన్నీ ఎలక్షన్ అఫిడవిట్లలోనే ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి నిజానిజాలు ప్రభుత్వం బయటపెట్టాలి. ఈ ఘటనకు సంబంధించి అరెస్టయిన అనురాగ్ టీడీపీకి చెందిన వ్యక్తే.. మాపై పత్రికలు కథనాలు ప్రచురించే ముందు మా వివరణ తీసుకోవాలి. ఏకపక్షంగా కథనాలు వేయవద్దు. ఇదిలాగే కొనసాగితే పరువు నష్టం దావా వేస్తాం’’ అని మిథున్‌రెడ్డి హెచ్చరించారు.
‘‘మా ఆస్తుల వివరాలు అఫిడవిట్లలో ఉన్నాయి. చట్టబద్ధంగా ఆదాయ పన్ను కడుతూ వ్యాపారం చేస్తున్నాం. ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఎలక్షన్ ఫండ్ తీసుకోలేదు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు నేను సిద్ధం. రికార్డులు తారుమారు చేశారని ఆరోపణలు చేస్తున్నారు. మా ఇమేజ్ దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తున్నారు. సాక్ష్యాధారాలు చూపమంటే తోక ముడిచారు. ఆరోపణలు నిరూపించకుంటే క్షమాపణ చెప్పాలి.. లేదంటే, పరువు నష్టం దావా వేస్తా’’ అని మిథున్‌రెడ్డి మండిపడ్డారు.