‘అశ్వని’కి ఆధునిక వైద్యపరికరాలు
- రూ.15 లక్షల పరికరాలు వితరణ చేసిన ముస్లిం భక్తుడు
- పరికరాలను ప్రారంభించిన ఈవో గిరిధర్ గోపాల్
తిరుమల : తిరుమలలోని అశ్విని ఆస్పత్రిలో వేగవంతంగా వైద్యపరీక్షలు నిర్వహించేందుకు విరాళంగా వచ్చిన అత్యాధునిక వైద్య పరికరాలు రెండింటిని టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ శుక్రవారం ప్రారంభించారు. రూ.15 లక్షల విలువ కలిగిన ఈ వైద్య పరికరాలను చెన్నైకి చెందిన ముస్లిం భక్తుడు అబ్దుల్‌ఖనీ విరాళంగా అందజేశారు. వీటిని శుక్రవారం ఉదయం ఈవో ఎంజీ.గోపాల్ పలువురు వైద్యాధికారులతో కలిసి ప్రాయింభించారు.
అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ అశ్విని ఆస్పత్రిలో రోగులకు రక్తపరీక్షలు నిర్వహించేందుకు ‘స్విలాబ్ హెమటాలజి ఆటోమేటెడ్ అనలైజర్’, రెస్పాన్స్ 910 బయోకెమిస్ట్రీ పరీక్షల కోసం వినియోగించే ‘బయోకెమెస్ట్రీ ఆటోమేటెడ్ అనలైజర్’ వైద్య పరికరాలు(బ్రీత్ అనలైజర్లు) టీటీడీ కి విరాళంగా అందటం సంతోషకరమన్నారు. సాధారణంగా రక్తపరీక్షలు నిర్వహించాలంటే అరగంట సమయం పడుతుందని, ప్రస్తుతం విరాళంగా వచ్చిన స్విలాబ్ హెమటాలజి ఆటోమేటెడ్ అనలైజర్ పరికరం ద్వారా కేవలం ఒక్క నిమిషంలోనే ఫలితం తెలుసుకోవచ్చన్నారు.
మొత్తం 19 రకాల రక్త సంబంధిత పరీక్షలను ఈ పరికరంతో చేయవచ్చని తెలిపారు. ఇంకా రెస్పాన్స్ 910 బయోకెమిస్ట్రీ ఆటోమేటెడ్ అనలైజర్ పరికరం ద్వారా ఒకేసారి 105 శాంపిళ్లను 30 రకాలుగా 5 నుంచి 15 నిమిషాల వ్యవధిలో పరీక్షించవచ్చనని చెప్పారు. ఈ వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చిన అబ్దుల్‌ఖనీ తిరుమల మొదటి, రెండవ ఘాట్‌రోడ్లపై సిగ్నలింగ్ కోసం సోలార్ పరిజ్ఞానంతో కూడిన నాలుగు వేల స్టెడ్‌లైట్లను కూడా విరాళంగా అందజేసినట్లు చెప్పారు.
అనంతరం దాతను ఈవో శాలువ, శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు. అలాగే త్వరలో అశ్విని ఆస్పత్రిలో మరమ్మతులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఈవో తెలిపారు. అంతకుముందు ఈవో వైద్యులతో కలిసి ఆస్పత్రిలోని పలు గదులు, ల్యాబ్‌లు, బెడ్లు, ఇతర సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ వికాస్, సూపరింటెండెంట్ నర్మద, ఎస్‌ఎంవో నాగేశ్వరరావు, దాతల విభాగం డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, రిసెప్షన్ వోఎస్‌డీ దామోదరం, ఇతర వైద్యలు పాల్గొన్నారు.