తిరుమల కొండ నిండింది
శ్రీవారి దర్శనానికి 30గంటలు
3కిలోమీటర్ల భక్తుల క్యూ
విపరీత రద్దీ దృష్ట్యా కాలిబాట భక్తులను క్యూల్లోకి అనుమతించని టీటీడీ వర్గాలు
ఆళ్వార్‌చెరువు వద్ద బైఠాయించిన భక్తులు
తిరుమల: తిరుమల భక్తజన సంద్రమైంది. వేసవి, వారాంతపు సెలవులు కావడంతో భక్తులు పోటెత్తారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వచ్చిన కాలి బాట భక్తులను క్యూల్లోకి అనుమతించలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు. టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆళ్వారు చెరువు వద్ద బైఠాయిం చారు. వేకువజాము 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 41780 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్‌మెంట్లలో వేచిఉండడంతోపాటు వెలుపల మూడు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ కట్టారు. వీరికి 30 గంటల తర్వాత దర్శనం లభించనున్నట్లు టీటీడీ ప్రకటిం చింది. ఇప్పటికే క్యూల్లో వేచిఉన్న భక్తులకు 16గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది.
రద్దీ పెరగడంతో రూ.300టికెట్ల దర్శనం మధ్యాహ్నం 12గంటలకు నిలిపి వేశారు. గదుల కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. పద్మావతి, ఎంబీసీ 34, సీఆర్‌వో కేంద్రీయ విచారణా కార్యాలయాల్లో క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కల్యాణకట్టల వద్ద తలనీలాలు సమర్పించుకునేందుకు నాలుగు గంటలకుపైగా క్యూలైన్లలో వేచిఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైను త్వరగా కదిలేలా చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల అధికారులను ఈవో గిరిధర్ గోపాల్ ఆదేశించారు.