తిరుమలలోనే నూరుకాళ్ల మంటపం
వేయికాళ్ల మంటపం స్థానంలో పునః నిర్మాణం
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చ
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయం వద్ద 2003లో కూల్చివేసిన వేయికాళ్ల మండపం స్థానంలోనే నూరుకాళ్ల రాతి మంటపం నిర్మించాలని టీటీడీ సీవీఎస్‌వో నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచించింది. రాతి మంటపం తిరుపతిలో నిర్మించాలనే అంశం సమంజసంగా లేదని, పరిమితులకు లోబడే తిరుమల ఆలయం వద్దే పునఃనిర్మించాలని నిపుణులు స్పష్టం చేశారు. దీనిపై లోతుగా అధ్యయనం చేసి మరోసారి నివేదిక సమర్పించాలని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం కోరింది. సోమవారం తిరుమలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో రాతిమంటమం నిర్మాణంపై ఈ మేరకు చర్చ జరిగింది. ై చెర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ నేతృత్వంలో సాగిన ఈ సమావేశానికి సభ్యులు ఎల్‌ఆర్ శివప్రసాద్, రేపాల శ్రీనివాస్, కన్నయ్య, వెంకట్రమణ, ఎక్స్ అఫిషియో సభ్యుడు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి బీ.వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సమావేశంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా కేవలం పరిపాలనా సంబంధిత అంశాలపై మాత్రమే చర్చించి తీర్మానం చేశారు. కోడ్ వల్ల సమావేశంలో తీసుకున్న అన్ని తీర్మానాలను కూడా మీడియాకు చెప్పలేమని చైర్మన్ వెల్లడించారు. టీటీడీ కల్యాణ మంటపాల బుకింగ్ విధానాన్ని జూన్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లోకి మార్పు చేయాలని ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానించింది. ఇప్పటి వరకు మాన్యువల్ పద్ధతిలో మాత్రమే బుకింగ్ చేసుకునే కల్యాణ మంటపాలను ఇకపై ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్ విధానంలో బుక్ చేసుకునేలా సమావేశంలో తీర్మానించినట్టు చెప్పారు. వీటితోపాటు తిరుమల ఆలయ అవసరాల కోసం బియ్యం, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాల వంటి సాధారణ మార్కెట్ కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకున్నారు.
- తిరుమల శ్రీవారి ఆలయంలో ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్న 140 మంది పోటు కార్మికుల కాంట్రాక్టును మరో ఏడాదికి పొడిగించారు. వీరి జీతభత్యాల కింద రూ.3.10 కోట్లు కేటాయించారు.
- కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న 186 మంది ఫారెస్ట్ కార్మికులను మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించారు.
- తిరుమలలోని ఉద్యానవనాల నిర్వహణకు నామినేషన్ పద్ధతిపై రూ.1కోటి 11లక్షలు కేటాయించారు.
అలాగే ఉద్యోగులకు సంబంధించిన పరిపాలన పరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇదిలాఉండగా ఇంతకుముందే అసెంబ్లీ రద్దు కావడంతో ఎమ్మెల్యేల కోటా కింద ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమితులైన రాజిరెడ్డి, పాముల రాజేశ్వరి, కాండ్రుకమల, పదవులకు రాజీనామా చేసిన జీవీ శ్రీనాథరెడ్డి, చిట్టూరు రవీంద్ర సమావేశానికి హాజరు కాలేదు.