వాహన సేవల ఊరేగింపు యథాతథం | As the procession of the vehicle services | Sakshi
Sakshi News home page

వాహన సేవల ఊరేగింపు యథాతథం

Published Fri, Sep 12 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM

As the procession of the vehicle services

తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా వాహన సేవల ఊరేగింపులో ఎలాంటి మార్పులు చేయడం లేదని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ వెల్లడించారు. వాహన సేవలకు ముందుగా ప్రత్యేక బ్యాడ్జిలు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఈసారి గతంలో కంటే తక్కువ సంఖ్యలోనే ప్రముఖులకు ప్రోటోకాల్ బ్యాడ్జిలు, పాసులు ఇస్తామన్నారు. స్వామి సన్నిధిలో పూర్తి స్థాయిలో భద్రత ఉందని, ఎలాంటి అభద్రతా భావం, అపోహలు అనవసరమని ఆయన భరోసా ఇచ్చారు.

 గరుడ సేవకు ఐదు లక్షల మంది: జేఈవో

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 30న నిర్వహించనున్న శ్రీవారి గరుడ సేవకు ఐదు లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేసినట్టు జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు.  నాలుగు మాడ వీధుల్లో 2.20 లక్షల మంది భక్తులు హాయిగా కూర్చుని స్వామి వాహన సేవల్ని దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టారు. అలాగే, వెలుపల ఉన్నవారు మొత్తం 10 ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా స్వామి సేవల్ని తిలకించే వీలుంటుంది.

 కొత్తగా బ్యాటరీ వాహనాలు..:

ఆలయం ముందున్న వృద్ధుల క్యూలైనును మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ఆవరణలోకి మార్పు చేశారు. బ్రహ్మోత్సవాల్లోగా ఈ కొత్త క్యూలైను అందుబాటులోకి రానుంది. వృద్ధుల కోసం మ్యూజియం వద్ద 10 సీట్లు, 25 సీట్లు కలిగిన బ్యాటరీ కార్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి అనంతాళ్వారు తోట మీదుగా మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు చేరవేస్తారు.  

 తూర్పు మాడవీధిలోనూ ఇనుప కంచె

భద్రత కోసం మూడేళ్లకు ముందు ప్రారంభించిన ఇనుప కంచెనిర్మాణం(ఇన్నర్ సెక్యూరిటీ కార్డాన్) పనులు తూర్పుమాడ వీధిలోనూ ప్రారంభించారు. ఇవి పూర్తయితే, ఆలయ నాలుగు మాడ వీధులు భద్రతా విభాగం ఆధీనంలోకి వస్తాయి.

22న వేద విశ్వవిద్యాలయం  స్నాతకోత్సవం

తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవం ఈనెల 22న జరగనుంది. గవర్నర్ నరసింహన్ చాన్స్‌లర్ హోదాలో హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లాకు చెందిన వేదపండితుడు మద్దూరి వెంకటేశ్వరయాజులుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఆయన స్నాతకోపన్యాసం చేస్తారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement