నేటి నుంచి ఆన్‌లైన్‌లో రూ.300 టికెట్లు
ఈనెల 27న శ్రీవారి దర్శనానికి అనుమతి
సాక్షి, తిరుమల: ఆన్‌లైన్‌లో రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విక్రయాన్ని బుధవారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభిస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ ప్రకటించారు. శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో ప్రవేశపెట్టనున్న కొత్త విధానాన్ని మంగళవారం మీడియాకు వెల్లడించారు. వివరాలివీ...ప్రయోగాత్మకంగా తొలివిడత 5 వేల టికెట్లు ఇస్తారు. అందులో 2500 టికెట్లను ఆన్‌లైన్ ఇంటర్నెట్ ద్వారా కేటాయిస్తారు. మిగిలిన వాటిని టీటీడీ ఈ-దర్శన్ కేంద్రాల నుంచి కేటాయిస్తారు. టికెట్లు పొందిన భక్తులను ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలు, 3 గంటల టైం స్లాట్లలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
ఇంటర్నెట్ ద్వారా టికెట్లు పొందే భక్తులు వారి ఫొటో గుర్తింపు కార్డును అప్‌లోడ్ చేసి, పేమెంట్ గేట్ వే ద్వారా క్రెడిట్, లేదా మాస్టర్ వీసా కార్డులద్వారా నగదు చెల్లింపులు చేయాలి. ఈ దర్శన కౌంటర్లలో భక్తులే నేరుగా వెళ్లి నగదు చెల్లించి ఫొటోమెట్రిక్ పద్ధతిలో వేలి ముద్ర, ఫొటో తీసుకుని టికెట్టు పొందవచ్చు. టికెట్లు పొందిన భక్తులు కచ్చితమైన సమయానికి రావాలి. ఫొటో గుర్తింపు కార్డులు కూడా తీసుకురావాలి. వారిని తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ సమీపంలోని 129 టీబీ కౌంటర్ నుంచి అనుమతిస్తారు. టికెట్టు పొందిన భక్తులకు నగదు వాపసు ఇవ్వరు. దర్శనం తేదీ వాయిదా వేయరు. 12 ఏళ్లలోపు చిన్నారులను అనుమతించేందుకు వారి వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి. పురుషులు చొక్కా, పంచె/ పైజామా, కుర్తా, మహిళలు లంగా,ఓణి/చీర/దుపట్టాతో కూడిన చుడీదార్ ధరించి రావాలి.
ఈ-దర్శన్ కౌంటర్లలో కోటా వివరాలివీ...
టీటీడీ ఈ-దర్శన్ టికెట్లను హైదరాబాద్ కౌంటర్‌లో 850, విశాఖపట్నం 675, విజయవాడ 350, కర్నూలు 100, తిరుపతి 200, నెల్లూరు 100, నిజామాబాద్ 75, వరంగల్ 75, అనంతపురం కౌంటర్‌లో 75 కేటాయించారు.
నాలుగు రోజుల్లో 2.94 లక్షల మంది
ఈసారి శ్రావణమాసంలో వరుస సెలవుల కారణంగా సోమవారం వరకు నాలుగురోజుల్లో 2.94 లక్షల మంది శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు.
హథీరాంజీ మఠం స్థలంలో జరగని ‘గోకులాష్టమి’
శ్రీవారి ఆలయం, హథీరాంజీ మఠం మధ్య 180 ఏళ్లుగా ప్రత్యక్షంగా ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని ఓ స్థల వివాదం తెంచేసింది. రథోత్సవం ఊరేగింపుకోసం మఠం స్థలం ఇవ్వాలని టీటీడీ, అంగుళం కూడా ఇవ్వమని మఠం నిర్వాహకులు భీష్మించుకోవడంతో వీరి మధ్య అంతరం పెరిగింది. గోకులాష్టమి మరుసటి రోజున ఆలయం నుంచి ఉత్సవమూర్తులు తన సేవకుడైన ‘హథీరాం’మఠంలో విడిది చేసి ఆస్థాన పూజలందుకునే సంప్రదాయం ఉంది. ఇక్కడ టీటీడీ ఈవోకు, మఠం మహంతుకు ప్రత్యేక మర్యాదలు చేయటం సంప్రదాయం. వివాదం ఫలితంగా మంగళవారం హథీరాంజీ మఠం స్థలంలో నిర్వహించే గోకులాష్టమి ఆస్థాన కార్యక్రమాన్ని మఠం ఆవరణలో కాకుండా తొలగించిన టీటీడీ కొలువు మండపం వద్ద తాత్కాలిక పందిరి వేసి నిర్వహించారు.
వైభవంగా ఉట్లోత్సవం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం ముందు మంగళవారం ఉట్లోత్సవం వైభవంగా జరిగింది. శ్రీకృష్ణజన్మాష్టమి మరుసటి రోజు ఆలయం వద్ద ఉట్లోత్సవాన్ని నిర్వహించటం ఆనవాయితీ. ఇందులో భాగంగా టీటీడీ అధికారులు మంగళవారం ఆలయం ముందు కన్నులపండువగా ఉట్లోత్సవాన్ని నిర్వహిం చారు. ముందుగా మలయప్పస్వామిని, శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులకు పూజలనంతరం ఉత్సవర్లను సహస్రదీపాలంకరణ మండపం వద్ద ఏర్పాటుచేసిన వేదికపై వేంచేపు చేశారు. ఆలయం ముందు నిర్వహించిన ఉట్లోత్సవంలో అధిక సంఖ్యలో యువకులు గ్రూపులుగా విడిపోయి 25 అడుగుల పొడవాటి కొయ్యకు పైభాగంలో ఏర్పాటు చేసిన ఉట్టికోసం పోటీపడ్డారు.