సామాన్య భక్తుల దర్శనానికే ప్రాధాన్యం! | TTD gives priority to visit for Common devotees | Sakshi
Sakshi News home page

సామాన్య భక్తుల దర్శనానికే ప్రాధాన్యం!

Published Sun, Oct 6 2013 2:00 AM | Last Updated on Tue, Aug 28 2018 5:43 PM

సామాన్య భక్తుల దర్శనానికే ప్రాధాన్యం! - Sakshi

సామాన్య భక్తుల దర్శనానికే ప్రాధాన్యం!

‘కౌసల్యా సుప్రజారామ, పూర్వాసంధ్యా ప్రవర్తతే!.. అన్న సుప్రభాత పఠనంతో వేకువజాము 2.30 గంటలకు  స్వామిని మేలుకొలిపి, తిరిగి రాత్రి 12.30 గంటలకు ‘జో అచ్యుతానంద! జోజో ముకుందా!’ అన్ని జోలపాటతో నిద్రపుచ్చుతారు.
 
 ఆగమశాస్త్రానికి లోబడి కైంకర్యాలు సాగితేనే స్వామివారు ప్రసన్నంగా ఉంటారు. భక్తులపై తన దివ్యకాంతులు ప్రసరింపజేస్తారు. అందుకే స్వామి కైంకర్యాల్లో ఏ లోటూ రాకుండా చూడాలి. దానితో పాటు భక్తులకు అవసరమైన  సదుపాయాలనూ కల్పించాలి. ఇవన్నీ పద్ధతిగా జరిపించడం అంత తేలికైన విషయమేమీ కాదు.  అయితే, స్వామివారి అనుగ్రహం ఉంటే అన్నీ వాటంతటవే జరుగుతాయి అంటారు గిరిధర్ గోపాల్.  తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన
 ముక్కామల గిరిధర్ గోపాల్ అనుభవాలు, అభిప్రాయాలివి...
 
 టీటీడీ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టడంపై మీరు ఎలా ఫీలవుతున్నారు?
 రెవెన్యూ ఎండోమెంట్ ముఖ్యకార్యదర్శిగా, ధర్మకర్తల మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా కొంతమేర మాత్రమే సేవ చేయగలిగేవాణ్ని. కానీ ఇప్పుడు పూర్తికాలం భగవంతునికి, భక్తులకు సేవ చేసే అదృష్టం కలిగింది.
 
 దేవస్థానంతో మీ అనుబంధం ఎలాంటిది?
 తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ. పాలనలో పారదర్శకత ఉంది. ఏటా 450కిపైగా ఉత్సవాలు జరుగుతాయిక్కడ. ఇప్పటికే కొన్నింటిలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నాను. శ్రీవేంకటేశ్వరస్వామి వైభవ ప్రాశస్త్యం, ఆ స్వామి లీలలు ప్రత్యక్షంగా అనుభవించాను. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక సంస్థను నడిపించే బాధ్యతను శ్రీవారే నాకు అప్పగించారనిపిస్తోంది. ధర్మకర్తల మండలి, ధార్మిక సంస్థకు వారధిగా ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టానికి లోబడి  టీటీడీ పనిచేస్తోంది. నేనూ అదే చేస్తాను. ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యుల అభిప్రాయాలను స్వీకరిస్తాను.  అవసరమైతే ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా తీసుకుంటాను. మీరు ఎంచుకున్న ప్రాధాన్యతాంశాలేమిటి?
 
 ప్రాధాన్యత అంశాలనడం కంటే  వాటిని బాధ్యతలనడం కరెక్ట్. తిరుమల ఆలయంలోనూ, ఇతర అనుబంధ ఆలయాల్లోనూ వందల సంవత్సరాలుగా కైంకర్యాలన్నీ నిర్దిష్టంగా జరుగుతున్నాయి. అటువంటి పవిత్రమైన పూజా కైంకర్యాల్లో ఏ లోటూ రాకుండా చూస్తా. ఆగమశాస్త్ర నిబంధనలు విధిగా అమలు జరిపిస్తా. భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు, బస సౌకర్యాలు మెరుగు పరిచేందుకు, ప్రతి భక్తుడికీ ఆకలే అర్హతగా శుచికరమైన భోజన సదుపాయాలు కల్పించేందుకు సంయుక్తంగా కృషి చేస్తా. సప్తగిరుల ప్రకృతి సంపదను పరిరక్షించేందుకు సభ్యులందరినీ కలుపుకుని పనిచేస్తా. ప్రతి భక్తుడూ తిరుమలకొండపై కాలుష్య రహిత పదార్థాలు వాడే విధంగా ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపడతా. భక్తుల భద్రతపై కూడా దృష్టి పెడుతున్నాం. అలాగే ధర్మప్రచారం, వేద పరిరక్షణను మరింత ముందుకు తీసుకెళతాం. శ్రీనివాస వైభవాన్ని జన బాహుళ్యంలోకి తీసుకెళ్లి భక్తితత్వాన్ని, ధార్మిక చింతనను విస్తరిస్తూనే శ్రీవేంకటేశ్వరస్వామి వైభవ ప్రాశస్త్యాన్ని నలుదిశలా చాటుతాం.


 సంతృప్తికరమైన దర్శనం కల్పించేందుకు మీ దగ్గర సరికొత్త ప్రణాళికలేమైనా ఉన్నాయా?
 ఉన్న నిబంధనలు సమర్థవంతంగా అమలు పరిస్తే చాలు, కొత్తవి అవసరం లేదు. టీం మేనేజ్‌మెంట్ , టైమ్ మేనేజ్‌మెంట్‌తో మరింత సమర్థవంతంగా దర్శన సౌలభ్యం కలిగించే ప్రయత్నం చేయాలి. ఆధునిక సాంకేతిక ప్రయోగాలకు ఆలయ ఆగమాలు అనుమతించవు. కాబట్టి అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ ఆ పని చేయాలి. ఓవర్ బ్రిడ్జిని కొంచెం విశాలంగా చేస్తున్నాం. క్యూలో ఉండే భక్తులకు ధార్మిక కథాకాలక్షేపాలు,  దైవస్మరణకు అనుకూల వాతావరణం కల్పించటం, పిల్లలకు పాలు అందించడం, అన్న ప్రసాదాలందించటం చేయాలి. అయితే, దర్శన విషయంలో అందే ఫిర్యాదులు భక్తుల నుంచా, దళారుల నుంచా అన్నది కూడా అధ్యయనం చేయాల్సి ఉంది. బస, దర్శనంలో ఇబ్బందుల్ని తగ్గించడానికి రోజులో ఇంతమందినే అనుమతించాలన్న ప్రతిపాదన సంగతేమయ్యింది?
 
 పరిమితులు విధించడం వల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. దైవ దర్శనం కోసం వచ్చే భక్తులను కట్టడి చేయడం సరికాదు. అందుకే ఈ ఆలోచన కార్యరూపం దాల్చడం కష్టం. కాబట్టి శక్తివంచన లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించటమే మా ముఖ్య విధి. భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించి, వారిని ఆయా భాషల్లో ఆత్మీయంగా పలుకరించే ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని ఆలోచన. రాబోయే 20 సంవత్సరాల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసి అందుకు తగ్గ ఆచరణాత్మక ప్రణాళికలను ఇప్పుడే రూపొందించాల్సిన అవసరం  ఉంది. క్రైసిస్ మేనేజ్‌మెంట్ కంటే ఒక ఆచరణాత్మక మేనేజ్‌మెంట్ రూపొందించడం ముఖ్యం!
 నేత్రద్వారాలు (వెండివాకిలికి అటు ఇటుగా ప్రత్యేక ద్వారాలు, సన్నిధిలో  రాములవారి మేడ నుంచి వైకుంఠద్వారం ప్రవేశం వరకు కొత్తద్వారం) తెరవాలని కొందరు, వద్దని మరికొందరు అంటున్నారు...?
 
 ఇది భక్తుల విశ్వాసాలతో ముడిపడిన అంశం. కట్టడాల భద్రత పరిశీలించాలి, పరీక్షించాలి, పరిరక్షించాలి. గతంలో తిరుమల ఆలయ తరహాలో తిరుపతి అలిపిరిలో నిర్మించిన శ్రీవారి నమూనా ఆలయంలోని మూవింగ్ ప్లాట్‌ఫారం ఏర్పాటుకోసం (కదిలే తివాచి) పరిశీలించినా సరైన పరిష్కారం దొరకలేదని గత అనుభవాలు చెబుతున్నాయి. దీనిపై గతంలో ఉన్న నివేదికలు పరిశీలించాలి. ఆలయ అధికారులు, ఆగమ పండితులు, అర్చకులు, ఈ వ్యవస్థపై పట్టున్న రిటైర్డ్ అధికారులను సంప్రదించాల్సిన అవసరం ఉంది.
 
 టీటీడీ కొత్త ఈవోగా పరిపాలనలో సరికొత్త సంస్కరణలేమైనా చేపట్టబోతున్నారా?
 ఎందరో ఐఏఎస్ అధికారులు స్వామి సేవలో, ఆలయ పాలనలో వినూత్న సంస్కరణలు చేశారు. వారందరి కృషి ఫలితంగానే సంస్థ మహోన్నత స్థానంలో ఉంది. ప్రస్తుతమున్న ప్రణాళికలు నిర్వహించడమే పెద్ద పని. కానీ, కార్యాచరణలో ఉన్నచిన్న చిన్న లోపాలు సరిదిద్దుతాం. అధికార వికేంద్రీకరణతో క్షేత్రస్థాయి అధికారులే నిర్ణయాధికారులుగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. వారిలో నిర్వహణా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మార్గదర్శకంగా ఉంటాం.  
 
 పాలకులు మారిన ప్రతిసారీ రక రకాల దర్శనాలు పుట్టుకొస్తున్నాయి. దీనివల్ల నిత్య కైంకర్యాలకు కోతపడుతోందని మఠాధి పతులు, పీఠాధిపతులు, అర్చకులు  ఆవేదన చెందుతున్నారు. దీనికి మరేమంటారు?
 స్వామి కైంకర్యాల విషయంలో ఆగమ సలహా మండలి సూచనల్ని తప్పక అమలు పరుస్తాం. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు కచ్చితమైన సమయాన్నే పాటిస్తున్నాం. స్వామివారి కైంకర్యాలు, ఆరాధనలన్నీ సంప్రదాయ బద్ధంగానే జరుగుతున్నాయనడంలో సందేహం లేదు. పీఠాధిపతులు, మఠాధి పతులు, అర్చకుల సలహాలను వీలైనంత మేర అమలు చేయడానికి కృషి చేస్తున్నాం. సంప్రదాయంగా, ఆగమోక్తంగా జరుగు తున్న నిత్య కైంకర్యాలను కుదించే ప్రయత్నాలు జరగవు. దీనికి కొనసా గింపుగానే రాత్రి వేళల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను గురువారం మినహాయించి మిగిలిన రోజుల్లో రద్దు చేశాం. ఆ సమయాన్ని కూడా సామాన్య భక్తుల దర్శనానికే కేటాయించాం. ప్రస్తుతం అమలవుతున్న దర్శనాలు, క్యూలైన్లపై కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాం.  ఏ చిన్న అవకాశం వచ్చినా సామాన్య భక్తుల దర్శనానికే ప్రాధాన్యత ఇస్తాం.
 
 గో సంరక్షణ అంశంలో టీటీడీ అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని  ఏవిధంగా అమలు చేయబోతున్నారు?
 గో సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. అందుకు అనుగుణంగా జాతీయ స్థాయి సదస్సు తిరుపతిలో నిర్వహించాలని భావిస్తున్నాం. గో సంరక్షణను పురాతన, శాస్త్రీయ పద్ధ్దతిలో జరిపితే కలిగే ఉపయోగాలు, ఆర్థిక వెసులుబాటు ఔత్సాహికులకు తెలియజేసే ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తాం. శ్రీవేంకటేశ్వర డెయిరీలో ఒక ప్రదర్శన శాలను ఏర్పరచి, అందులో భారతీయ సంతతి గోవులను ఉంచి వాటి విశిష్టత, వాటి సంరక్షణ ద్వారా కలిగే  ఆర్థిక ప్రయోజనాలు తెలియజేయబోతున్నాం. ఇందుకోసం రాష్ట్ర దేవాదాయశాఖ సహకారం కూడా తీసుకుంటాం. యువతలో నైతిక ప్రవర్తన, భక్తిభావం, ధార్మిక చింతన పెంపొందేందుకు శుభప్రదం వంటి కార్యక్రమాలను జనంలోకి మరింతగా తీసుకెళ్లే ఆలోచన ఉందా?
 
 సనాతన హైందవ ధర్మాలు పరి రక్షించేందుకు, హిందూ ధర్మంలోని అన్ని జాతులు, వర్గాలను ఒకే తాటిపై తెచ్చి ఆధ్యాత్మిక, ధార్మిక ఘనవారసత్వాన్ని గుర్తు చేసుకునేందుకు కొనసాగింపు చర్యలు చేపడతాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదువేల మంది అధ్యాపకులను హిందూ ధార్మిక పరిచయ కార్యక్రమంలో వినియోగించుకోనున్నాం. విద్యార్థులు, యువతరం కోసం హిందూ ధార్మిక పరిషత్ చేపట్టిన ధార్మిక పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. శుభప్రదం కార్యక్రమాన్ని ఏడాదిలో రెండు పర్యాయాలు నిర్వహిస్తూ మానసిక స్థైర్యం, ధార్మిక చింతన, భక్తి భావాలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తాం. విద్యార్థిదశ నుంచే నైతిక ప్రవర్తన తీసుకొచ్చే కార్యక్రమాలను నిర్వహిస్తాం. రోజురోజుకూ ఆర్థిక సంక్షోభం, ప్రకృతి ప్రకోపాలు, జనోద్యమాలు, అశాంతి పెరిగిపోతున్నాయి. మరి  టీటీడీ ఏం చేయబోతోంది?
 
 ఆలయంలో దైవ సంతర్పణగా చేసే ఉత్సవాలన్నీ లోకకల్యాణానికే కదా! ఇదే సత్సంకల్పంతో నాలుగువందల యాభైకి పైగా ఉత్సవాలు ఆగమ సంప్రదాయంగా తిరుమలలో నిర్వహిస్తున్నారు. ప్రతి దేవాలయాన్నీ సుసంపన్నం చేయాలని ‘మనగుడి’ కార్యక్రమం ద్వారా ఋజువు చేశారు. ఇటువంటి కార్యక్రమాల విషయంలో వెనుకంజ వేసే ప్రశ్నే లేదు. వర్ష యాగాలు, క్రతువులు, హోమాలు, శ్రీవారి కల్యాణాలు నిర్వహించటం సంస్థకు సర్వసాధారణమైన విషయమే. లోకహితం, ప్రకృతి పరిరక్షణ, ఆర్థిక సంక్షోభాల నివారణ, అశాంతి తొలగింపు, భక్తితత్వం వంటి వాటిని పెంపొందించేందుకు ఏదైనా ప్రత్యేక ప్రక్రియ ఉందేమో వేద విశ్వ విద్యాలయం ద్వారా పరిశోధనలు జరిపించాలి. నిజానికి భక్తిభావం పెరిగిననాడు అన్ని రకాల ఉపద్రవాలూ మటుమాయమవుతాయని నా నమ్మకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement