‘స్వర్ణమయం’పై సమగ్ర పరిశీలన: టీటీడీ ఈవో
తిరుమల: శ్రీవారి ఆలయానికి బంగారు తాపడం పనుల(ఆనంద నిలయం అనంత స్వర్ణమయం) పథకంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీలో ఉన్న ఆడిట్ అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయంలో ప్రవేశ పెట్టిన మూడు వరుసల క్యూ విధానంతో భక్తుల మధ్య తోపులాట తగ్గిందన్నారు. కల్యాణ కట్టలో భక్తులకు తలనీలాలు తీసే సమయం తగ్గించేందుకు శాశ్వత ఉద్యోగులు, పీస్‌రేట్ కార్మికుల నియామకం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం 11 వేల వరకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు ఇస్తున్నామని, మరో 7 వేల టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో కేటాయించిన తర్వాతే తిరుమల లో కరెంటు బుకింగ్ రద్దు చేస్తామని ఈవో చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో పేరుకుపోయిన నోట్లను ప్రత్యేకంగా లెక్కించేందుకు శుక్రవారం నుంచి అదనపు పరకామణి ప్రారంభించారు. కాగా, శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
కోనేటి రాయుడికి కోటి విలువైన బంగారు హారం: చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలో కొలువైన కల్యాణ వేంకటేశ్వర స్వామికి చెన్నైకి చెందిన అజ్ఞాత భక్తుడు కోటి రూపాయల విలువ చేసే మూడు కిలోల బంగారు హారాన్ని కానుకగా అందించారు. 3 కిలోల బంగారంతో శ్రీదేవి, భూదేవి ప్రతిమలు ఉండేలా అందంగా చేయించిన హారాన్ని శుక్రవారం ఆలయ అధికారులకు అందజేశారు. గతంలో తాను మొక్కుకున్న మేరకు ఈ హారాన్ని కానుకగా ఇచ్చినట్లు ఆయన చెప్పారు.